[శ్రీమతి వాణి వేమవరపు రచించిన ‘ఇది ఆ వెన్నెల కాదు’ అనే కథని అందిస్తున్నాము.]
పండువెన్నెల, పట్టపగలయినట్టు భూమంతా వెలుగుపరచుకొనుంది. చంద్రుని చల్లదనంతో ఎంతో హాయి అనిపిస్తోంది ఆ రోజు. నెమ్మదిగా గదిలోని మంచం మీద కూర్చుని పండిన గోరింటాకు చేతిని మురిపంగా చూసుకొని నవ్వుకుంది రమాదేవి. రమాదేవికి ఇప్పుడు 70 సంవత్సరాలు. కొన్ని ఏళ్ల నుండి ఒంటరి జీవనం. అమెరికాలో ఉద్యోగరీత్యా వెళ్లి స్థిరపడిన కొడుకు, కోడలు. మనవడిని తీసుకొని తన కోసం సంవత్సరం క్రితం ఇండియా వచ్చేసారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాలేదని ఆఫీసులో అనుమతి తీసుకొని ఇంటి నుండి ఆఫీస్ పని చేసుకుంటుంది కోడలు వసుధ.
“వసుధా, ఓసారి ఇలా రా అమ్మా” అంటూ కోడల్ని పిలిచింది రమాదేవి. “ఆఁ అత్తయ్య గారు” అంటూ బయటికి పరిగెత్తుకు వచ్చింది వసుధ.
“ఏంటి అత్తయ్య గారు పిలిచారు? ఏమైనా కావాలా, మీకు చెప్పండి? కాసేపట్లో ఆఫీస్ మీటింగ్ ఉంది” అంటూ ఆత్రంగా అడిగింది వసుధ.
“అయినా ఆరోగ్యం బాగాలేక ఉన్నారు కదా అత్తయ్య గారు, హాయిగా టీవీ చూసుకుంటూ ఇంట్లో కూర్చోక ఇలా ఆరుబయటకి వచ్చారు. నేను మీకోసం ఇంట్లో కూర్చుని ఆఫీస్ పనిచేస్తున్నాను” అంది వసుధ. “అలా చల్లదనంలో కూర్చుంటే మీ దగ్గు, జ్వరము తిరగబడుతుంది కదా లోపలికి రాకూడదా అత్తయ్య గారు” అంది వసుధ.
ఈ మాటలేవీ చెవికెక్కించుకోవడం లేదు రమాదేవి. “నీ మీటింగు ఎంతసేపు ఉంటుంది అమ్మాయీ?” అని అడిగింది రమాదేవి. “ఓ గంట అత్తయ్యగారు” అని సమాధానమిచ్చింది వసుధ.
“సరే అయితే నీ మీటింగ్ అయ్యాక అందరము ఈ రోజు రాత్రి ఈ బాల్కనీలోనే కూర్చుని భోంచేద్దాం. ఈ రోజు వెన్నెల ఎంత బాగుందో చూడు” అంటూ, “ఈ లోపల అబ్బాయి కూడా వస్తాడు కదా, నా మనవడికి కూడా ఇక్కడే పెట్టు. వాడికి కూడా సరదాగా ఉంటుంది” అంది రమాదేవి. “అలాగేలెండి అత్తయ్యగారు” అంటూ గబగబా తిరిగి మీటింగ్ మొదలవుతుందని ఇంట్లోకి వెళ్ళింది వసుధ.
పున్నమి అంటే రమాదేవికి చిన్నతనం నుండి చాలా ఇష్టం. పౌర్ణమి అనగానే ఆరుబయట వెన్నెలలో అమ్మచేతి ముద్దలు తింటూ, తమ్ముడితో ఆటలు, అమ్మా, నాన్నలతో కబుర్లు, పాటలు గుర్తుకొచ్చాయి రమాదేవికి. ముందే అమ్మచేతికి గోరింటాకు పెట్టేది. ఎర్రగా పండిన చేతిని చూసి మురిసిపోయేవారు అమ్మానాన్న. ఆడపిల్ల చేయి ఎర్రగా పండిందని నాన్న మా ఇంటి లక్ష్మిదేవి అనుకుంటూ మురుస్తూ డబ్బులు ఇచ్చేవారు. భోజనాలు అయ్యాక అందరూ కూర్చుని ఉండగా అమ్మచక్కటి కీర్తనలు పాడేది. నాన్న కూడా మంచి సినిమా పాటలు పాడేవారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి ఈ పాటలు వినేవారు. రమాదేవి స్నేహితులు కూడా వచ్చి ఉండేవారు. వారందరితో ఆ వెన్నెల వెలుగులో ఆటలు ఎంతో సరదాగా ఉండేది రమాదేవికి. రెండు జడలు వేసుకుని పూలు పెట్టుకొని ఆ రోజు పరికిణి వేసుకొని అటు ఇటు ఆడుతూ పరిగెడుతుంటే మురిసే వాళ్ళు అమ్మానాన్న. తమ్ముడు చిన్నవాడు ఆడుకుంటూ అలానే నిద్రపోయేవాడు అమ్మ ఒడిలో.
నెమ్మదిగా నాన్న దగ్గరికి చేరి స్కూల్ కబుర్లు అవి ఇవి అంటూనాన్నకి చెబుతూ నాన్న చెప్పే కథలు వింటూ నెమ్మదిగా నిద్రలోకి జారుకునేది రమాదేవి.
ప్రతి పున్నమి వెలుగులోనూ ఆ సమయాన్ని ఎంతో ఆనందంగా గడిపేవారు వాళ్లంతా. అలా ఎన్ని పౌర్ణమిలో. కొన్ని రోజులకి రమాదేవికి పెళ్లయింది. కొడుకు పుట్టాడు. అమ్మానాన్న ఉన్నన్ని రోజులు ప్రతి పౌర్ణమికి పుట్టింటికి వెళ్లి తమ్ముడు తను కలిసి పెరటిలో భోజనాలకు అన్ని ఏర్పాట్లు చేసేవారు. అందరూ కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకొని ఆ సమయాన్ని ఆనందంగా గడిపేవారు. ఆ రోజు ఓ పండగలా గడిచిపోయేది వాళ్లకి. కాలక్రమంలో తమ్ముడికి వేరే ఊరి బదిలీ అయింది, వెళ్లిపోయాడు. అక్కడ స్థిరపడిపోయాడు.
రోజువారి దినచర్యలతో సరిపోతుంది రమాదేవికి తన పిల్లవాడు పెద్దవాడు అయ్యాడు. ఓ రోజు కిటికీలోంచి పున్నమి వెలుగు పడుతుండటంతో ఆనందంగా చూసింది. ఆరుబయట కిటికీనుండి దొంతర్లుగా విరబూసిన మల్లెల సువాసన గాలికి గుప్పమంటోంది. చిన్నప్పటి ఆనందపు ఘడియలు గుర్తుకు వచ్చి రమాదేవి వెంటనే పెరట్లోకి వెళ్లి అరిటాకు కోసుకొచ్చి కొడుకుకు, భర్తకు భోజనాలు వడ్డిచ్చింది రమాదేవి. పెరట్లో భోజనాలు చేయడానికి పిలిచింది వారిని. “అమ్మా, నాకు ఆఫీస్ పని ఉంది రూమ్ లోకి కంచం ఇవ్వు” అని కొడుకు, “టీవీలో న్యూస్ వస్తోంది ఆరుబయట తినను” అని భర్త రాకపోయేసరికి కొంచెం బాధనిపించింది రమాదేవికి. తాను పొందిన వెన్నెల ఆనందాన్ని వారికి అందిద్దామన్న ఆసక్తి సన్నగిల్లింది రమాదేవికి.
కొడుకుకు పెళ్లయింది. కోడలు వసుధ కూడా ఉద్యోగస్థురాలే, మంచి పిల్ల. వాళ్లకి ఓ కొడుకు. కానీ సంపాదన పర్వంలో ఎన్నో ఆనందాలని వారు పొందలేకపోతున్నారనిపించింది రమాదేవికి. పొద్దున లేచిన దగ్గరనుండి ఉరుకులు పరుగుల జీవనం. హడావిడిగా తినడం, పిల్లాడిని స్కూల్‌కి పంపడం, వాళ్లు ఆఫీసుకు పరిగెత్తడం. ఈ హడావిడిలో రాత్రి వారికి పండు వెన్నెలను ఆస్వాదించే సమయం ఎక్కడ, అలసట తప్ప అనిపించింది రమాదేవికి. ఈమధ్య ఆరోగ్యం బాగుండటం లేదని చల్లగాలికి ఆరోగ్యం చెడుతోందని ఆరుబయట తనను పడుకొనివ్వటం లేదు కొడుకు, కోడలు. నిండు పున్నమిలో మనవడితో ఆడుకుంటూ కబుర్లు చెబుతూ వాడి మాటలతో సంబరపడదామని, కొడుకు, కోడలితో తీరికగా మాట్లాడుతూ భోజనాలు చేద్దామన్న ఆశ ఎక్కడో నిలిచిపోయింది రమాదేవికి.
ఈ రోజు వెన్నెల విప్పార్చిన పువ్వులా ఉంది. పెరట్లో కూర్చునే అవకాశం లేని అపార్ట్మెంట్ అది చిన్న బాల్కనీలో అయినా, అక్కడ కూర్చుని అందరూ సరదాగా గడపాలి. ఎలాగైనా వారికి ఆ అనుభూతిని ఏర్పరచాలి అనుకుంది రమాదేవి.
అందుకే ఆ రోజు ఇంట్లో వాళ్ళ కోసం బాల్కనీలో ఎదురుచూస్తూ కూర్చుంది. ఆమె కోరిక మేరకు అందరూ వచ్చారు. అందరికీ తన చేతులతో వండినవి వడ్డనలుచేసింది. ఇక కబుర్లు చెబుతూ హాయిగా గడుపుదాం అనే లోపల ఫోన్లో మాట్లాడుతూ భోంచేస్తూ ఒకరు, ఆఫీస్ పని అంటూ లాప్లాప్లో పనిచేస్తూ తింటూ ఒకరు. ఫోన్లో ఏదో ఆట ఆడుకుంటూ అన్నం తింటూ మనవడు. అలా చూస్తూ ఉండిపోయింది రమాదేవి. అందరివీ భోజనాలయ్యాయి. “బామ్మా, ఫోన్లో నీకు ఇష్టమైన పాటలు పెట్టనా?” అని మనవడు అడుగుతున్నాడు. “మీ కోరిక మేరకు అందరము నిండు పున్నమిలో భోంచేసాం కదా సంతోషమేనా?” అని అడుగుతున్న వారి మాటలకు ఆనందంగా ఉన్నట్టు తల ఊపినా, వెన్నెలలో మార్పు ఉండకపోయినా, ‘ఈ వెన్నెల మాత్రం తన (చిన్నప్పటి) వెన్నెలలా లేదు’ అనుకుంది రమాదేవి మనసులో.
‘ప్రస్తుతపు అవసరాల ముందు మునుపటి ఆనందాలు చాలా దూరంగా ఉంటున్నాయి’ అనుకుంది రమాదేవి. ‘ఎంతైనా ఈ వెన్నెల ఆ వెన్నెలలా లేదు’ అని మరోసారి భారంగా నిట్టూర్చింది రమాదేవి.
