Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఇది నా కలం-1 : అరుణ్ కుమార్ ఆలూరి

ఈ శీర్షికలో రచయితలు తమ రచనల వివరాలు, తామెందుకు రచనలు చేస్తున్నారు, తమ లక్ష్యం ఏమిటి వంటి విషయాలను వివరిస్తూ తమని తాము పరిచయం చేసుకుంటారు.

అరుణ్ కుమార్ ఆలూరి

డిప్లొమా చేస్తున్న సమయంలో సినిమాలు బాగా చూసి డైరెక్షన్ చేయాలన్న కల మొదలైంది. అదంత ఈజీ కాదు అని తెలియటం, దాంతో పాటు చదువు, కుటుంబ బాధ్యతలు నెరవేర్చాలి కాబట్టి, దాన్ని లాంగ్ టర్మ్ గోల్ అనుకొని, ఆ లక్ష్యం వైపు అడుగులు వేయటం ఎలా అని ఆలోచించి, సినిమాకు కథే ముఖ్యం అని గుర్తించి, అందుకు రచనలో అనుభవం సంపాదించటం మంచిదనిపించి, రచయితగా ప్రయాణం మొదలుపెట్టాను.

పది నుంచి ఇరవై దాకా కథలు రాసి పత్రికలకు పంపడం తిరిగి రావటం జరిగాక, మొదటి కథ ‘పిల్లి పోయి ఎలుక వచ్చే డాం డాం డాం’ నవ్య వారపత్రికలో 2007 జనవరిలో అచ్చయింది. మొదటి కథ అచ్చులో చూసుకున్నప్పుడు కలిగిన ఆనందం జీవితాంతం మర్చిపోలేను. తర్వాత 2008లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) వారు నిర్వహించిన కథల పోటీలో నా 4వ కథ ‘మేడిపండు’కి ద్వితీయ బహుమతి వరించి 100 డాలర్ల బహుమానం గెలుచుకోవడం వల్ల రచయితగా మంచి గుర్తింపు లభించడంతో పాటు నేను వెళ్తున్న దారి సరైందే అని నమ్మకం కలిగించింది.

2007 నుంచి 2010 వరకు మొత్తం 6 కథలు ప్రచురితం కాగా, కుటుంబ బాధ్యతలతో పాటు, పత్రికల్లో సరైన ప్రోత్సాహం లేదని భావించడం వల్ల 2019 వరకు అంటే దాదాపు దశాబ్ద కాలం కథలకు దూరంగా ఉన్నాను.

మళ్లీ 2019లో ‘మినుకుమనే ఆశలు’ కథ నన్ను వెంటాడి, నాతో రాయించుకుంది. అది తెలుగు వెలుగులో ప్రచురితం కావడం, ఆ కథకి పాఠకుల నుంచి ఊహించని స్పందన ఫోన్లు, మెసేజ్లు, వాట్సప్ ద్వారా రావడంతో మళ్లీ కథల మీద శ్రద్ద పెట్టాను. ఈ క్రమంలో కణిక సాహితీ వేదిక నిర్వహించిన పోటీలో ‘పొదుగు’ కథ ద్వితీయ బహుమతి సొంతం చేసుకోగా, వాసా ఫౌండేషన్ నిర్వహించిన పోటీలో ‘రక్షణ’ కథకి ప్రత్యేక బహుమతి లభించింది. మొత్తంగా ఇప్పటివరకు 10 కథలు ప్రచురితం కాగా, మరో రెండు కథలు ప్రచురణకు ఎంపిక కాబడి ఉన్నాయి. చతుర మాసపత్రికలో కొత్తగాలి శీర్షికన ప్రచురితం అవుతున్న నానీలు నచ్చి, రాసి పంపించగా 2010లో 4 నానీలు అందులో రాగా, ఇప్పటి వరకు మొత్తం 15 నానీలు ప్రచురింపబడ్డాయి.

సాహిత్యానికి దూరంగా ఉన్న కాలంలో సినిమాలపై అవగాహన పెంచుకుంటూ, అందులోని సాధక బాధకాలు ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి నా రచన, దర్శకత్వంలో ‘సూపర్ డూపర్ స్టార్’ అనే లఘు చిత్రాన్ని 2015లో తీశాను. ఆ షార్ట్ ఫిల్మ్ తీసిన అనుభవం తర్వాత నుంచి నేను సినిమా చూసే పద్ధతి పూర్తిగా మారిపోయింది. సినిమాలే కొత్త కొత్త పాఠాలు చెబుతున్నట్టు అనిపించింది. ఈ క్రమంలో సినిమాలు విశ్లేషిస్తూ సమీక్షలు చేయడం వల్ల ఫేస్‌బుక్‌లో యువ రచయితలు, దర్శకులు పరిచయం కావడం, వారి స్క్రిప్టులు రివ్యూ ‌చేస్తూ సూచనలు సలహాలు ఇవ్వటం మొదలైంది.

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న యాంకర్ సుమ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా స్క్రిప్టుకు సమీక్షకుడిగా వ్యవహరించాను. ప్రీ ప్రొడక్షన్‌లో ఉన్న ‘లగ్గం’ మరియు ‘షరతులు వర్తిస్తాయి’ అనే మరో రెండు సినిమాలకి ప్రస్తుతం రచనా సహకారం అందిస్తున్నాను. నా దర్శకత్వంలో ‘వనవాసం’ అనే సినిమా తెరకెక్కించేందుకు స్క్రిప్టు సిద్ధం చేసుకున్నాను. దాన్ని నవలగా మార్చే ప్రయత్నంలో కూడా ఉన్నాను.

నా కథలు చదివిన పాఠకులు, ఒక కథకి మరో కథకి పోలిక, సంబంధం లేకుండా వేటికవే ప్రత్యేకంగా నిలుస్తూ, విభిన్న థీమ్స్ తో రాస్తున్నారు అని అనటం నాకు ఎక్కువగా సంతృప్తిని ఇచ్చిన విషయం.

ఫోన్ నంబర్: 6305816242

arunkumaraloori@gmail.com

Exit mobile version