[శ్రీ కె. కె. రఘునందన గారు రచించిన ‘ఇది ఒక పాఠం..!!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]
“ఈ జంపన్న గాడేడ్రా! ఎక్కడికి పోనాడు? ఆడు సెబితేనే గదా. ఇంతమందిమి ఈ వసనాల కాడికి పరిగెత్తుకునొచ్చినాం..” అన్నాడు విసుగ్గా సోమిదేవయ్య.
“కుడుం ముక్కలాగుండే రామసామికేమైందసలు? ఏనాడూ ముక్కిమూల్గని రామసామి సచ్చిపోనాడని జంపన్న టముకేసుకుని మరీ సెప్పినాడు.. ఊరిపెద్ద కాబట్టి ఇంతమందిమి అతగాడికోసం ఏడుస్తున్నాం.. ఇంతకీ ఈ వార్త సత్తెమేనంటారా?” పక్కనున్న సీతన్నని ప్రశ్నించాడు రాముడు.
“యాత్రలకెల్లాడన్నది నిజం.. అక్కడేమైందో ఏమోగాని సావు కబురు మాత్రం చక్కెర్లు కొట్టింది.. అది కూడా జంపన్న మోసుకొచ్చిందే!” తనకు తెలిసిన సంగతిని చెప్పుకొచ్చాడు సీతన్న.
రామస్వామి ఇటీవల తన కుటుంబంతో తీర్థయాత్రలకు వెళ్లాడన్నది ఊరందరికీ తెలుసు. ఇక తిరిగి వస్తాడని అనుకున్న సమయంలో జంపన్న ఈ చావు కబురు అందరికీ చాటేసాడు. వాలంటీర్ జంపన్నని తెలియని వాళ్లు అరుదు. పైగా రామస్వామి దగ్గర ఎక్కువగా తిరుగాడుతుండేవాడు. అందువల్ల అతగాడు చెప్పిన మాట నమ్మాల్సివచ్చింది.
ఉదయం తెలవారుతుండగానే జంపన్న ఊరి నడిబొడ్డుకొచ్చి రామస్వామి మరణవార్తను ఊదరగొట్టాడు.. అందరూ విభ్రాంతిలో పడ్డారు. “అదిగోనయ్యా! అక్కడనుండి వ్యాన్లో శవం ఇక్కడికి వచ్చేస్తోంది.. రాగానే చితికి సిధ్ధం చేయమన్నారు.” అని అంత కచ్చితంగా చెబుతుంటే ఎవరికీ అనుమానం పిసరంతయినా కలగలేదు.. అయితే కొందరు కుర్రాళ్లకి మాత్రం సందేహమొచ్చి రామస్వామికి ఫోన్ చేస్తే పలకలేదు.. పైగా అతనితో ఉన్న కుటుంబసభ్యులకు చేసినప్పటికీ ఫలితం శూన్యం. ఎవరికీ ఫోన్ అందనప్పుడు మరి జంపన్నకి అంత నిర్ధారితంగా చనిపోయినట్లుగా ఎలా తెలిసిందన్న ప్రశ్న ఎదురైంది అందరికీ..! దానికి పిచ్చివాడిలాగ నవ్వుతూ “స్వామికి ప్రమాదం జరిగిందని, చనిపోయారని ఎవరో తెలియని వ్యక్తి నుండి ఫోనొచ్చింది నాకు.. తర్వాత వాళ్లకి తిరిగి ఫోన్ చేస్తే నాకూ జవాబు లేదు. తర్వాత మరొకరికి చేసాను. వాళ్లు కూడా ప్రమాదం జరిగిందని చనిపోయినట్లుగా చెప్పారు.” చెప్పాడు. వారెవరో ఫోన్ చేసారని చెప్పిన నెంబరు తమకిమ్మన్నారు కొందరు. దానికి జంపన్న ఏదో నెంబరు ఇచ్చాడు కాని మరి పలకలేదు. ఏదైతేనేమి..!!
మొత్తానికి అందరూ గుడ్డిగా నమ్మేసి స్మశానం దగ్గర మొహరించారు.. మద్యాహ్నమైంది.. సాయంత్రమైంది కాని ఎక్కడా రామస్వామి శవం రాలేదు.. “అయ్యా! ఎవరూ వెళ్ళిపోకండయ్యా! మన రామస్వామి శవం ఇక్కడికే వస్తోంది.. ఉండండి..” అని చెబుతున్నా సరే బాగా చీకటి పడిపోయిందని ఎక్కడివాళ్లక్కడ చెదిరిపోయి ఇళ్లకు చేరారు. జంపన్న మాత్రం పిచ్చివాడిలా ఏడుస్తూ అక్కడే ఉండిపోయాడు.
మర్నాడు ఉదయం మరోవార్త వింతయింది ఊరివాళ్లకి.. వాలంటీర్ జంపన్న మందు అలవాటువల్ల ఆరోగ్యం బాగా దెబ్బతినడం వల్ల అతగాడిని ఆసుపత్రిలో చేరిస్తే చికిత్స మధ్యలో అక్కడినుండి పారిపోయి వచ్చేసాడట! అప్పుడే తన నోటికి వచ్చినట్లుగా రామస్వామి మరణవార్తను ఊరందరికీ పుకారు పుట్టించాడు. ఈ సంగతి తెలిసాక ఊళ్ళోవాళ్ళు కొందరు రామస్వామి బంధువులకి ఫోన్ చేస్తే అతనికి ఏమీ కాలేదని ఫోన్ సిగ్నల్ లేక ఇప్పుడు పలకడం లేదని, ఒక రెండురోజుల్లో తిరిగి వస్తున్నారని చెబితే ముక్కున వేలేసుకున్నారు. కొందరు జంపన్నను పట్టుకుని చితక్కొట్టాలన్నంత కోపంతో ఊగిపోయారు.
“అయినా వాడికెంత సాహసం.. బ్రతికి ఉన్న మనిషిని చనిపోయాడని చాటతాడా? రామస్వామిలాటి పెద్దమనిషిని పట్టుకుని ఇలాటి పుకారు పుట్టిస్తాడా? స్వామి వాడి తాట ఒలవడం ఖాయం!” అన్నాడు మునిస్వామి.
“అంతవరకూ మనం గాజులు తొడిగించుకుని కూర్చుంటామా చెప్పండి.. వాడిని వెతికి పట్టుకుని తన్నాలి..” అన్నాడు రత్తయ్య.
అప్పుడే అక్కడికి వచ్చిన కామేశు “జబ్బుతో ఉండి పిచ్చిగా ప్రవర్తించిన వాడిని మనమేం చేయగలం? ఆసుపత్రి వాళ్ళొచ్చి ఈడ్చుకెళ్ళి బెడ్ ఎక్కించాలని చూస్తే మళ్ళీ పరారైనాడట.. ఇక మనమంతా తంతామని తెలిస్తే అసలు ఈ ప్రాంతంవైపుకే రాడు..” అన్నాడు.
“పోనీలెండి రామస్వామి క్షేమంగా వస్తున్నట్లు తెలిసింది అంతే చాలు మనకి.. వచ్చాక ఈ సంగతులన్నీ అతగాడికి తెలిస్తే అతనే చూసుకుంటాడు. తోలు ఒలిచి డోలు కట్టినా ఆశ్చర్యపోనక్కరలేదు. అయినా ఆ వెధవ.. రామస్వామి మీద గురి పెట్టాడేమిటో?” అన్నాడు గురువులు.
“తెలిస్తే ఏమిటయ్యా! ఇప్పటికే అతనికి ఎవరో ఊదేసారుట! జంపన్నపైన అగ్గిలాగ మండిపోతున్నాడట! నిక్షేపంలాగ ఉన్న తనపైన చనిపోయినట్లుగా తప్పుడు ప్రచారం చేయడానికి ఎన్ని గుండెలంటూ వెర్రెత్తిపోతున్నాడని తెలిసింది.. ఇక ఊళ్ళోకి వచ్చాక వాణ్ని ఎంతలా చితక్కొడతాడోనని జంపన్న తల్లి ఒకటే ఏడుస్తోందిట.. వాడు తమకు తెలీకుండా ఊరిపెద్దపైన అలాటి వార్త పుట్టించినందుకు తెగ బాధపడుతున్నారట.. మరి ఈ సంఘటన ఎంతవరకూ తీసుకెళ్తుందోనని జనమంతా ఒకటే గుసగుసలు పోతున్నారట.” అని అక్కడే రచ్చబండ మీద కూర్చుని సిగెరెట్ కాలుస్తున్న అసిరయ్య ఊళ్ళో సంగతులన్నీ పూసగుచ్చినట్లుగా చెప్పుకొచ్చాడు.
జంపన్న పుకారు తరువాత ఏ పరిణామాలు జరుగుతాయోనన్న ఉత్కంఠ ఊళ్ళో అందరిలో నెలకొన్నది. రామస్వామి రాక కోసమే అందరి ఎదురుచూపులు!!.
***
రామస్వామి ఊరు చేరాడనగానే జనమంతా ఒకటే ఇల్లు చుట్టుముట్టారు.. “మీపైన ఇలాగ జరగడం ఈ ఊరందరికీ ఎంతో బాధకి గురిచేసింది.. వెధవ జంపన్నగాడు.. ఇంతమందిని వదిలిపెట్టి కేవలం మీపైన ఇలా పుకారు పుట్టించడం దురదృష్టం.. మరెవరిపైనో అయితే పెద్దగా పట్టించుకునేవాళ్లం కాదు.. ఊరందరికీ తలలో నాలుకలాగ ఉండే తమరి మీద ఇలాటి చెడువార్త వినడం ఎవరికీ నచ్చలేదు. మీరు ఊళ్ళోకి అడుగుపెట్టగానే ఇంతమంది మిమ్మల్ని చూడ్డానికి వచ్చారంటే మీరంటే ఎంత అభిమానమో చూడండి.” అన్నాడు అభిమానం వెళ్ళబోస్తూ గురువులు.
“అవన్నీ తర్వాత మీరు ఊ అనండి వాణ్ణి కట్టి తెచ్చి మీముందు పడేస్తాం.. లేదా చంపమన్నాసరే.. మిమ్మల్ని ఎంతగా అవమానించాడో కదా! ఆరోగ్యం బాగులేకపోతే ఆసుపత్రిలో పడి ఏడవాలి.. అంతేగాని మీలాటివారితోనా ఇలా ఆడుకోడం?”
“ఇంకా చూస్తారేమిటయ్యా! మీరలాగ ఊరుకుంటే రేపు మరొకరిపైన మరో చెత్త వార్త పుట్టిస్తాడు. అలాటివాడిని ఊరికే వదలకూడదు.. మీరొస్తారని తెలిసింది కాబోలు ఆసుపత్రిలో కూడా ఉండకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నాడట.. మీరు ఒక్కమాట చెబితే వాణ్ణి వెతికితెచ్చి మీముందు పడేస్తాం.. అప్పటిగ్గాని మాకు మనశ్శాంతి ఉండదు.” అక్కడున్న కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏవేవో అన్నారు.
అదే సమయంలో ఎవరో జంపన్నని లాక్కొచ్చారు.. బరబర ఈడ్చుకుంటూ రామస్వామి కాళ్ళ దగ్గర పడేసి.. “అయ్యా! ఈడ్ని ఎతికిఎతికి పట్టుకొచ్చినాం.. సుబ్బరంగా ఎముకలు యిరిచేయండయ్యా! లేదా మీరు ఊ అనండి ఈడ్ని ముక్కలుముక్కలు సేసి పడేస్తాం..” అన్నాడు ఊగిపోతూ..
జంపన్న ఒక్కసారిగా అరుస్తూ ఏడుపు మొదలెట్టాడు.. “ఒరే! నీ దొంగ ఏడుపులాపు.. ఈ పెద్దాయన పోయాడని ఊరంతా చాటి ఇప్పుడేమో ఏమీ ఎరగనట్టు పెడబొబ్బలా? సిగ్గులేదూ.. అసలే నీకు ఒంట్లో తెగులు.. పైగా ఇదోటి నెత్తినేసుకున్నావ్? సీ.. ఎదవ నాకొడకా? నీకు పుట్టగతులుండవు..” ఒకాయన కేకలేసాడు.
అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.. రామస్వామిలో స్పందన ఎలా ఉంటుందోనని.. జంపన్న నేలమీద కూర్చుని తల మోకాళ్లలో పెట్టుకుని ఏడుస్తుంటే రామస్వామి చూపులు మాత్రం మామూలుగా నిర్లిప్తంగా ఉండటం జనానికి నివ్వెరపాటును కలిగించాయి.
అందరి మాటలు విన్న తరువాత చివరికి శాంతంగా “మీరంతా నా గురించి ఆవేశకావేషాలకు లోనవద్దు.. వాడి సంగతి నేను చూసుకుంటాను.. మీరంతా వెళ్లండి. నాపైన మీరు చూపిన అభిమానానికి ధన్యవాదాలు..” అని చెప్పాక జనమంతా ఒకరొకరే అక్కడినుండి కదిలారు.
ఆ స్థితిలో జంపన్నని చూసిన రామస్వామి దగ్గరగా వెళ్లాడు. వాడి భుజం పట్టుకుని మీదకి లేపాడు.. ఆయన్ని చూస్తూనే ఒక్కసారిగా బోరుమని విలపించాడు.. “అయ్యా! తమరి మీద అలా సాటడం నా తప్పేనయ్యా! సెమించండయ్యా! మరోసారిలాగ సేయనయ్యా!” బ్రతిమిలాడాడు.
“చేసింది చాలుగాని.. పద.. నీ సంగతి తేలుస్తాను.. అదిగో ఆ ఆటో ఎక్కు..” అని వాడి జబ్బ పట్టుకుని ఆటో దగ్గరకి నడిచాడు రామస్వామి.
“బాబుగారూ! నన్ను పోలీసుల దగ్గరకి తీసుకుపోకండయ్యా! మీకు పున్నెముంటాది.. మరోసారి సెబుతున్నాను.. సెమించండయ్యా!” అని మొరపెట్టుకున్నాడు జంపన్న.
“నిన్నెక్కడికి తీసుకెళ్ళాలో నాకు తెలుసురా! పద ముందు..” అని ఆటోలో తను కూడా ఎక్కాడు రామస్వామి
***
పదిహేను రోజులు తర్వాత ఒక సాయంత్రం జనమందరినీ తన ముంగిటకి పిలిచాడు రామస్వామి. ఒక్కొక్కరే చేరారక్కడికి.. అందరూ హాజరయినాక మొదలెట్టాడు రామస్వామి “నేను చనిపోయినట్లుగా ఒక చెడ్డవార్తను పుట్టించిన జంపన్నను శిక్షించాలని మీరంతా చెప్పాక నేను వాడికి తగిన శాస్తి చేశాను.”
“మంచిపని చేశారయ్యా! అలాటివాడిని ఊరికే వదిలిపెట్టకూడదు. ఎంత శిక్షించినా చాలదు.” అన్నాడు గురువులు.
“బ్రతికి ఉన్న మిమ్మల్ని చనిపోయినట్లు పుట్టిస్తాడా? వాడికి పుట్టగతులుండవు.. ఇలాటి పిచ్చిపని చేసినందుకు వాడి తిక్క కుదర్చాల్సిందే!” అసిరయ్య చెప్పాడు.
ఒకరొకరే జంపన్నపైన ఆగ్రహం వెలిబుచ్చి, రామస్వామి తగిన శాస్తి చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు.
“ఇంతకీ జంపన్నకి మీరు విధించిన శిక్షేమిటయ్యా! పోలీసులచేత ముడుకులు వాచేలాగ లాఠీ దెబ్బలు కొట్టించారా?” అని కామేశు అడగ్గానే రామస్వామి జవాబు కోసం అందరూ ఉత్కంఠగా ఎదురుచూసారు.
వారందరికీ సమాధానం ఇస్తున్నట్లుగా రామస్వామి “జంపన్నా!ఇలా బయటకు రా!” అని పిలవగానే లోపలినుండి వచ్చాడు. అందరిముందు చేతులు కట్టుకుని వినమ్రంగా నిల్చున్నాడు జంపన్న.
“నేను వీడికి చేసిన శాస్తి ఏమిటో తెలుసా? ఒక మంచి ఆసుపత్రికి తీసుకెళ్ళి మళ్ళీ ఆరోగ్యవంతుడిగా చేయడం.”
“అదేంటయ్యా! ఈ పిచ్చివెధవ మీపైన ఇంత చెడ్డగా ప్రవర్తిస్తే మీరు చేసింది ఇదా? మళ్ళీ మరెవరిపైనా ఏదో ఒకటి పుట్టించడని నమ్మకం ఏమిటి?”
“ఇంకా పోలీసులకు అప్పగించి లాఠీదెబ్బల రుచి చూపించారేమోననుకుని మురిసిపోయాం.. వాడిని ఇలా వదిలిపెట్టడమా.. అసలు వాడు ఎంతకు దిగజారి మీమీద ఇలా చేశాడు.. మీరెలాగ క్షమించారసలు? పైగా ఆసుపత్రిలో చేర్చడమా?”
“మీరందరూ ఒక్కక్షణం ఆగితే అందరికీ జవాబిస్తాను..” అనగానే జనం గుసగుసలు, చర్చలు ఆగాయి.
“నిజానికి చెప్పాలంటే జంపన్న నాకు చెప్పలేనంత మేలు చేశాడు. అనారోగ్యంలో పిచ్చిపట్టి చేశాడో ఏమో.. ఏదయితేనేం.. బ్రతికున్న నేను చచ్చిపోయినట్లుగా లోకానికి చాటి మంచి చేశాడు. ఇదేమిటి రామస్వామి వెర్రివాడిలా మాటాడుతున్నాడు అనుకుంటే అది మీ భ్రమ.. ఎప్పుడైతే నేనీ లోకంలో లేను అన్న వార్త విన్న జనంలో కొందరు.. అది మా బంధువులే కావచ్చు, నాకు సన్నిహితులే కావచ్చు.. ఎవరైతేనేంగాని, నా తర్వాత నాకున్న ఆస్తిపాస్తులలో ఎంత తమకి వస్తున్నదీ లెక్కలు కట్టేవారొకరైతే, నేను లోగడ కొందరికి ఇచ్చిన అప్పులను ఎవరిద్వారా వసూలు చేసుకోవాలి? అవి నేను సరిగ్గా రాసి ఉంచానో లేదోనన్న అనుమానంతో వాటిపైన భోగట్టా చేయడానికి సన్నాహాలు, నా పొలానికి ఉన్న హద్దులను చెరిపేసి వాళ్ళ పొలంలో కలిపేసుకోవాలని ఆక్రమణకి సిధ్ధపడ్డ ప్రభృతులు మరికొందరు.. ఇలా ఎన్నో అపశృతులు కొట్టొచ్చినట్లుగా తెలిసివచ్చాయి. అందువలన జంపన్న పుట్టించిన పుకారు కారణంగా ఇవన్నీ బయటకు పొక్కాయి కాబట్టి నాకు మంచి చేసినట్లేనని భావించి, అతనికి నేను వేసిన శిక్ష.. మళ్ళీ ఆరోగ్యవంతుడిగా చేయడం.. మనం బ్రతికి ఉన్నప్పుడు ఆహాఓహో అని మన మొహం ముందు మెచ్చుకోలు మాటలు చెప్పే జనం, మనం ఈ లోకంలో లేనప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ప్రత్యక్షంగా తెలిసేలాగ చేసాడు జంపన్న.. అతనికి నేనెంతో రుణపడి ఉన్నానని భావించి, ఆసుపత్రిలో చేర్చి మామూలు మనిషిని చేశాను.” అని ఆగి అందరివైపు చూశాడు రామస్వామి.
కుతూహలంతో చూసిన జనం మొహాల్లో రామస్వామి మాటలతో కొంత అపరాథభావం తొంగిచూసింది. జంపన్నని తామంతా తప్పు పడితే అతను చేసిందే తనపట్ల మంచిగా మారిందన్న ఆయన మాటల్లో లోకం పోకడ అర్థమైంది.
“ఔనయ్యా!మీ మాటల్లో ఎంతో నిజముంది.. రోజులు మారాయి.. మనం ఉంటే ఒకలాగ, లేకుంటే మరోలాగ ప్రవర్తించే భిన్నమైన మనుషులున్న సమాజం మనది.. మంచి మనసుండబట్టే.. జంపన్నని మా అందరిలా పిచ్చివాడని పక్కకు తోసేయక, మా మాటలను లెక్కలోకి తీసుకుని వాడిని ఏ జైల్లోకో పెట్టించకుండా ఆసుపత్రిలో చేర్చి మామూలు మనిషిని చేశారు.. అందుకే మీరు పుణ్యమూర్తులు మీరు.. జరిగింది పీడకలగా భావించి, మాలో ఎవరిది తప్పయినా అందరి తరపున మీకివే మా క్షమాపణలు.. ఇకపైన కూడా మేమంతా మీ మనుషులమే అన్నట్లుగా భావిస్తే అదే పదివేలు.. జరిగిన సంఘటన మీకే కాదు.. ఈ సంఘటన జీవితంలో అందరికీ ఓ పాఠంలా నిలిచింది.” అని అందరి తరపున ముందుకు వచ్చి రామస్వామి చేతులు పట్టుకుని చెప్పాడు గురువులు.
ఆ దృశ్యం అప్రయత్నంగా అందరి భావోద్వేగానికి, పశ్చాత్తాపానికి దోహదమైంది.
తెలుగులో విస్తృతంగా రచనలు చేస్తూన్నా నాణ్యమైన రచనలు చేసే అతికొద్దిమంది రచయితలలో కేకే రఘునందన అగ్రస్థానంలో వుంటారు. విజయనగరంలోని రచయితలెందరికో ఆయన గురుస్థానంలో వుంటారు. విభిన్నమయిన రచనలు విశిష్టంగా చేస్తూ మూస రచనలజోలికి వెళ్ళని రచయిత రఘునందన
