[మాయా ఏంజిలో రచించిన ‘some kind of love, some say’ అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు ప్రసిద్ధ కవయిత్రి హిమజ గారు. కొన్నిసార్లు మగవారు ప్రేమ చూపిస్తున్నామంటూ హింసించడాన్ని చిత్రించిందీ కవిత!]
~
ఇదో రకం ప్రేమ అని కొందరంటారు
అది నిజమేనని విరిగిన
పక్కటెముకలు చెబుతాయి
ప్రేమికుడి ముష్టిఘాతం
ఓ క్రూరమృగం దాడి చేసినట్టు
గాయాలపాలైన ఎముకలు
నిజాలను బాగానే నమోదు చేస్తాయి
ఎలాంటి హెచ్చరికా లేకుండా
దేహంపై వచ్చిపడే దెబ్బలు
వాటి తీవ్రతలు
ఏడ్చి ఉబ్బిన కనురెప్పలు
వాచిపోయి వాడిన కన్నులు
కరిగిపోయిన ప్రేమానుభూతిని
చెప్పకనే చెబుతాయి
బాధిస్తాయి
ఉద్వేగానికి ఉద్రేకానికి
గురి చేస్తాయి
సహజంగానే కాముకులు
ఈ ప్రేమలను అర్థం చేసుకోలేక
ద్వేషం చూపించడాన్ని
దేహాన్ని బాధించడాన్ని
నొప్పి కలిగించడాన్నే
ప్రేమ అనే చట్రంలో
బిగించి చూపిస్తుంటారు!!
~
మూలం: మాయా ఏంజిలో
అనువాదం: హిమజ
‘Maya Angelou’ అమెరికన్ కవయిత్రి, సామాజిక కార్యకర్త, మానవ హక్కులకై పని చేసారు. ఆనాటి అమెరికన్ సమాజం, ఆఫ్రికన్ అమెరికన్ వేశ్యా వాటికల పట్ల చూపిన వివక్ష, నిరసన, ఏహ్య భావాన్ని నిలదీస్తూ, ధిక్కరిస్తూ, బాధితుల పక్షం వహించి Maya Angelou అనేక కవితలు వెలువరించారు.
ఏప్రిల్ 4, 1928 న Marguerite Annie Johnson గా జన్మించిన ఆమె, తన సోదరుడు ముద్దుగా పిలిచే ‘మాయ’ అనే పేరుకు ‘ఏంజిలో’ ని జత చేసి ‘మాయా ఏంజిలో’గా ప్రపంచ ప్రసిద్ధ రచయిత్రిగా రూపొందారు.
బాల్యంలో తాను అత్యాచారానికి గురైన విషయం, పేదరికం కారణంగా కొంతకాలం సెక్స్ వర్కర్‍గా పని చేసిన విషయం నిస్సంకోచంగా, నిర్భీతిగా తన రచనల ద్వారా తెలిపిన మాయా ఏంజిలో రచనలు – దార్శనిక ఆత్మకథా శైలిలో ప్రత్యేకంగా నిలుస్తాయి. ఈమె కవిత్వం సంభాషణా సరళిలో ఉండటం విశేషం.
రచయిత్రి, కవయిత్రి, నర్తకి, గాయని, ఉద్యమకారిణి, కథకురాలు, దర్శకురాలు ప్రతిభావంతమైన పాత్ర పోషించిన మాయా 2014లో మరణించారు.
సుతిమెత్తగా కవిత్వం రాసే ‘హిమజ’ కవితా సంకలనం ‘ఆకాశమల్లె’కి కవయిత్రి మొదటి పుస్తకానికి ఇచ్చే సుశీలా నారాయణరెడ్డి పురస్కారం (2006), రెండవ పుస్తకం ‘సంచీలో దీపం’కు ‘రొట్టమాకు రేవు’ అవార్డు (2015) వచ్చాయి.
‘మనభూమి’ మాసపత్రికలో స్త్రీలకు సంబంధించిన సమకాలీన అంశాలతో ‘హిమశకలం’ పేరున సంవత్సర కాలం ఒక శీర్షిక నిర్వహించారు.
ప్రపంచ ప్రఖ్యాత ఆఫ్రో అమెరికన్ కవయిత్రి ‘మాయా ఏంజిలో’ కవిత్వాన్ని అనువదించి 50 వారాలు ‘సంచిక’ పాఠకులకు అందించారు.
ఇప్పుడు ‘పొయెట్స్ టుగెదర్’ శీర్షికన భిన్న కవుల విభిన్న కవిత్వపు అనువాదాలు అందిస్తున్నారు.