[సముద్రాల హరికృష్ణ గారు రచించిన ‘ఇడుపు కాయితం!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఇడుపు కాయితం రాసుకున్నట్టు
అల్లంతెత్తు ఆకాశపు కోర్టులో
విడిపోయినై మబ్బూ, మెరుపూ
“ఛీ నల్లమొద్దూ”, ఈసడించింది అగ్గి కన్నె
“ఫో, చంచలాంగీ”, బదు లిసిరింది నీటిబుగ్గ!
ఒక్క మెరుపుతో మిరిమిట్లు కొల్పించింది ఆమె
ఒక్క ఉరుముతో చెవులు మూయించా డతను!
కాస్సేపు నిశ్శబ్దం – ఆకాశంలో, ఆ మనసులలో
ఎప్పటినుంచీ?!, ఇప్పటిదా ఈ స్నేహం?
ఇద్దరూ అనుకున్నారు, ఆలోచించారు
“మనగలమా విడివిడిగా”, ప్రశ్న తలెత్తింది
తికమక పెట్టింది, తిరకాసు అనిపించింది
వెలితి తోచింది, ఊహ విలవిలలాడించింది
ఏ జవాబందక, రెండు మదులూ తల్లడిల్లాయి
అక్కడక్కడే చుట్టి తిరిగాయి, ఎడ మొహాలై!
గంటలు గడుస్తున్నాయి భారభారంగా
కోప ప్పొంగులు ఇక చల్లబడసాగాయి
ఉన్నట్టుండి, దిక్కుతోచక రాయడు గర్జించాడు
నా కోసమే ఆ పిలుపని ఆ రాణి నవ్వింది
ఇంకేముందీ, పాత చెలిమి విరిసి చేమంతైంది
పసిడి కాంతులు నలుదెసల పరచింది
కాస్త కాస్త దగ్గరయ్యారు- మెల్లమెల్లగా,
ఒక్కటయ్యారు మళ్ళీ – తియతియ్యగా!
రెండు విరిసిన హృదయా లాలపించాయి
రస రమ్య భావాల ఆనందగీతాలు
నిండు వర్షం ఆర్భాటపు ధారగ నేల చేరింది
ఇలారమణికి నీటి ముత్యాలను చేరవేసింది!
