ఇక్కడొక ఇటుకల గుడిసె ఉండేది
ఓ గుండె నది ఉండేది
ఎవరైనా చూసారేమో చెబుతారా
అక్కడప్పుడు ఆకుపచ్చ వాసన
స్వచ్ఛంగా స్వేచ్ఛగా వీస్తూ ఉండేది
చెట్టు ఊపిన గాలి ఊరంతా చదివే
తల ఎత్తుకొని తిరిగేది దర్జాగా
ఆ ఊరు తీరు తెన్ను మారింది
పల్లె సొగసే పోయింది
పట్నం రూపురేఖల రెక్కలతో
ఉరుకుల పరుగుల నడకల సాగే
అందాల ఆ వూరే మారింది
ఆత్మగల గుడిసె గుండె మటుమాయం
ఇప్పుడిక
ఆ గుడిసె అనవాలు కోల్పోయిన
శిధిల మ్యూజియం
మరి ఆ గుండె నది చిరునామా లేని
జీర్ణమైన శిలల అలలు
ఎండిపోయిన వూరి చెరువు వోలె
కూలిపోయిన కట్టమీది చెట్టులాగా
చరిత్ర రాసిన నిన్నటి పుస్తకమై
కాలం అంచుల్లో ఒరిగి వొదిగింది
అయినా
ఆ గుడిసె వాకిలి ఒక చైతన్య ప్రేరణ
ఆ గుండె చప్పుడు ఓ భావోద్వేగాల నేస్తం
మానవత్వం రెపరెపలాడే జండాలే
డా.టి.రాధాకృష్ణమాచార్యులు సీనియర్ వైద్యులు, ప్రముఖ కవి,రచయిత, అనువాదకులు, సమీక్షకులు.
5 సంకలనాలు తెలుగు కవిత్వంలో 1999 నుండి కరీంనగర్ నుండి పబ్లిష్ చేశారు. నలిమెల భాస్కర్ ‘సాహితీ సుమాలు’ వివిధ భారతీయ భాషల్లోని సాహితీవేత్తల పరిచయ సంకలనాన్ని “The Speaking Roots” Title తో ఆంగ్లంలోకి అనువాదం చేసినారు.