[శ్రీ మారుతి పౌరోహితం గారి ‘ఇల్లిడిసిన తొమ్మిది కథలు’ అనే కథా సంపుటిని సమీక్షిస్తున్నారు శ్రీ కె. పి. అశోక్ కుమార్.]
చదువుకు దూరం అయిన – దూరం చేయబడుతున్న విద్యార్థుల వేదనలను, ఆకాంక్షలను ఈ కథలు తెలియజేస్తాయి. ఏ ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులు వారిని విద్య నుండి దూరం చేస్తున్నాయో, వివిధ సామాజిక నేపథ్యాల నుండి విశ్లేషించి చర్చించడం ఈ కథల ప్రత్యేకత.
వానలు పడక, ఊర్లో పనులు లేక, కడుపు చేత పట్టుకొని బ్రతకడానికి వలస పోవడం (సుగ్గి) అక్కడివారికి మామూలే. వానలు పడటానికి గ్రామీణులు ఆశ్రయించే నమ్మకాల తంతులను అన్నీ నిర్వహించినా వానల జాడే లేదు. ఈసారి పదవ తరగతిలోకి వచ్చిన తెలివైన విద్యార్థి ఈరేశను తెలుగు సార్ పిలిచి, ఈసారి సుగ్గికి పోకుండా బడికి రమ్మని చెబుతాడు. వ్యవసాయంలో నష్టపోయి అప్పుల పాలైన ఈరేశ నాయన కుటుంబంతో సహా సుగ్గికి పోక తప్పదు. ఈరేశ మనసులోని బాధ తల్లిదండ్రులకు తెలిసినా, వలస పోవాల్సిందే. వచ్చే ఏడాది పరీక్షలు రాద్దువు గాని, అని తల్లి ఓదారుస్తుంది. తన ప్రాణప్రదమైన చదువు దక్కకపోవడంతో కూలిన కలలతో, ఓటమి గాయంతో వాడి గుండె కన్నీరు అవుతుంది. వాడి మూగరోదన బతుకు బండి శబ్దంలో కలిసిపోతుంది. వాడి నీడ కూడా వలస పక్షిలా ఎగురుతుంది అని ‘కన్నీటి మేఘం’లో వివరించిన విధానం మనసును కదిలిస్తుంది. ‘పిల్లోళ్ళు వస్తారు’ కథలో విడిపోయిన భార్య భర్తలు. తల్లి వదిలిపోయిన పిల్లలను 9 సంవత్సరాలు కంటికి రెప్పలా, తల్లి లేని లోటు కనబడకుండా తండ్రి పెంచుతాడు. పిల్లలు తల్లి దగ్గరకు పోయి చదువుకుంటామంటే, ఈ విషయాలన్నీ సార్‌కు తెలుస్తాయి. ఎదిగే ఆడపిల్ల తల్లి నీడను ఉండాల్సిన అవసరాన్ని, పిల్లల కోరికను తెలిపి సార్, తండ్రికి నచ్చజెప్పి పిల్లల్ని తల్లి దగ్గరకు పంపిస్తాడు. అక్కడ వాళ్లకు ఏ మాత్రం నచ్చకపోయినా తిరిగి వస్తామని చెప్పడంతో – తండ్రి వాళ్ళ కోసం ప్రతి క్షణం ఎదురుచూడడం మన మనసును కదిలిస్తుంది.
తాము చదవని మెడిసిన్, ఇంజనీరింగ్ చదువులు తమ పిల్లలు చదువుకొని తమ కలలు నెరవేర్చాలని కోరికతో – చదువుల పేరిట తమ పిల్లల బాల్యాన్ని నాశనం చేసే తల్లిదండ్రులు ఎందరో. పిల్లల అభిరుచులు, వాళ్ళ ఇష్టాఇష్టాలు గమనించకుండా కార్పొరేట్ విద్యాసంస్థలకు పంపి, వాళ్లను ఆత్మహత్యలకు పులిగోల్పేవారు కూడా ఉన్నారు. ఇంట్లో తల్లిదండ్రులు, స్కూల్లో టీచర్లు, ఇష్టం లేని చదువులతో వేధిస్తుంటే పిల్లలు ఏం చేస్తారో ‘విప్రతీసారము’ కథలో చూడవచ్చు. దారిద్ర్యం వల్ల, అజ్ఞానం వల్ల, మూఢ నమ్మకాల వల్ల, మాదిగలు తమ సంతానంలోని ఆడపిల్లల్ని బసివినిలుగా మారుస్తున్నారు. మార్పు కోసం, మంచి జీవితం కోసం చాలామంది బసివినిలు ఈ వృత్తికి దూరం అవుతున్నారు. కొంతమంది తమ పిల్లల్ని బాగా చదివించాలని కోరుకుంటున్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్న మల్లికార్జున, అక్కడ జరిగే అన్యాయాన్ని ప్రశ్నించినందుకు, అక్కడివాళ్లు కత్తి గట్టి మల్లికార్జున బీసీ అని, అతడు తెచ్చిన ఎస్సీ సర్టిఫికెట్ దొంగ సర్టిఫికెట్ అని ఫిర్యాదు చేస్తారు. అది ప్రభుత్వ ఎంక్వైరీకి రాగా ఆర్డీవో ఎదురుగా నడిచిన కేసులో అన్ని విషయాలు బయటపడతాయి. మాదిగ గేరి నుండి బసివినిగా మార్చబడిన మల్లికార్జున తల్లి ఆమె పడిన కష్టాలు – చిత్రహింసలు, పిల్లల చదువుల కోసం ఆమె పడుతున్న తపన అన్నీ తెలుస్తాయి. నీకు న్యాయం చేస్తానని మల్లికార్జునకు ఆర్డిఓ హామీ ఇస్తాడు. ఈ ‘అస్మిత’ కథ చదువుతుంటే సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన వేముల రోహిత్ ఉదంతం జ్ఞాపకం వస్తుంది.
ఆ ఊరి జనాలకు మట్కా జూదం వ్యసనంలా మారిపోతుంది. బడి టీచర్లు, పూజారి, పనిపాటా చేసుకునే కూలి వాళ్లతో సహా పసిపిల్లాడి నుంచి పండు ముసలి వరకు ఆ వ్యసనంలో కూరుకుపోయినవారే. అలాంటి ఊరిలో జూదం రక్తంలో ఉన్న తండ్రి. క్రమశిక్షణే ప్రాణంగా ఉన్న కొడుకు. ఒకే ఇంట్లో రెండు భిన్న ధ్రువాలు. తండ్రి అంకెల్లో అదృష్టాన్ని వెతుక్కుంటే, వాడి కొడుకు పుస్తకాల్లో తన భవిష్యత్తును వెతుక్కున్నాడు. తండ్రిని ఎలాగూ ఉద్ధరించలేం కాబట్టి, అనారోగ్యంతో తల్లిని కోల్పోయిన వాడి కొడుకునైనా బాగు చేద్దామని రచయిత హైదరాబాద్‌కు గ్రూప్స్ కోచింగ్‌కు పంపాడు. అనుకున్నట్లే వాడు డిప్యూటీ తాసిల్దార్ ఉద్యోగం సాధించాడు. అబ్బాయి సాధించిన విజయం ఊరి పిల్లల్లో కొత్త వెలుగు నింపింది. ఇప్పుడు ఆ ఊరి కుర్రాళ్ళు ఓపెన్, క్లోజ్ నంబర్ల కోసం, రోడ్డు పక్కన వేచి చూడటం లేదు. టీచర్ పోస్టుల కోసం, పోలీసు ఉద్యోగాల కోసం కర్నూలు, హైదరాబాద్ కోచింగ్ సెంటర్లలో కుస్తీ పడుతున్నారు. గత ఏడాది ఏకంగా 12 మంది టీచర్ ఉద్యోగాలు సాధించారని, మరో 15 మంది సచివాలయాల్లో కొలువు దీరారని వింటుంటే మనసు గర్వంతో నిండిపోతుంది. మట్కా నంబర్ల మాయాజాలం నుంచి ఆ ఊరు విముక్తమై, విద్యావంతుల నిలయంగా మారుతుండడం ఒక శుభ పరిణామంగా ‘84.. వనవాసం నంబరోడు’ కథ సూచిస్తుంది. రాయలసీమ భౌగోళిక పరిస్థితి చూసి గుండె చెదిరిన తాతారావు మాస్టారు, ఈ ప్రాంతానికి ఏమైనా చేయాలని నిర్ణయించుకుంటాడు. చదువే ఈ నేలను పచ్చగా మార్చగలదు. విద్యే ఈ ప్రాంతపు భవిష్యత్తుకు వానగా మారగలదు. అందుకు పిల్లల్లో చదువుపై ఆశను, ఆసక్తిని రేకెత్తించగలిగారు. తాతారావు సార్ వల్ల ఎందరో విద్యార్థులు ఉన్నత దశకు చేరుకోగలిగారు. వారు తమ సార్‌ను మర్చిపోలేక వెతికి వెతికి, ఎన్నో ఏళ్లకు అతని జాడ కనుక్కొని, వారిని పిలుచుకొని సన్మానం చేసుకొని అప్పటి విద్యార్థులు సంబరపడిపోవడం ‘తాతారావు అలియాస్ రజినీకాంత్’ కథలో చూడవచ్చు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దిన ఇలాంటి ఆదర్శ ఉపాధ్యాయులు కూడా ఉన్నారని ఈ కథల ద్వారా తెలుసుకోవచ్చు.
ఒక స్నేహితుడి ప్రాణం కోసం, సాయి తన ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలేశాడు. సాయి ప్రాణత్యాగం గురించి అందరూ పొగుడుతుంటే ఆ పొగడ్తలు విని గర్వపడాలో, లేక గర్భశోకంతో తల్లడిల్లి పోవాలో ఆ తల్లికి అర్థం కాదు. సాయి ఈ రోజు భౌతికంగా వాళ్ళ కుటుంబంలో లేకపోవచ్చు. కానీ సాయిలోని నిస్వార్ధగుణం, ఆ త్యాగనిరతి అతని అస్తిత్వాన్ని సజీవంగా ఉంచాయి. మరణం కూడా సాయి వ్యక్తిత్వాన్ని మార్చలేక పోయింది. మరణం సాయిని తీసుకెళ్లినా, సాయి స్వభావాన్ని, జ్ఞాపకాలను అతని ప్రత్యేకతలను మిగిల్చి వెళ్ళింది. సాయి జ్ఞాపకాలే ఊపిరిగా జీవిస్తున్న ఆ తల్లి రాసిన ‘అమ్మ పోస్ట్ చేయలేని ఉత్తరం’ సాయిని మరో మారు మన కళ్ళ ముందు ఉంచుతుంది. విద్యార్థి అయిన ప్రాణేశ్ ఆచార్ హృదయంలో ‘టైలర్ శ్యామణ్ణ’కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉండేది. అది సాధారణమైన పరిచయం కాదు. మనసులు కలిసిన అనుబంధం. వారిద్దరి మధ్య అనుబంధం రవీంద్రనాథ్ ఠాగూర్’ కాబూలీ వాలా’ కథలో సర్దార్జీకు, చిన్నపిల్లకున్న అనుబంధం లాంటిది. ప్రాణేశ్పై చదువులకు వెళ్లడం, మారిన కాలం – మారుతున్న అభిరుచులకు అనుగుణంగా మారలేక, టైలర్ శ్యామణ్ణ గిరాకీ లేక తన వృత్తిని మానేస్తాడు. ప్రయోజకుడైన కొడుకు దగ్గర ఉండలేక, ఆ ఊళ్లో మొహం చెల్లక దూరంగా వెళ్ళిపోతాడు. డిప్యూటీ కలెక్టర్ అయిన ప్రాణేశ్ ఒకసారి దారిలో కనిపించిన హోటల్లో టిఫిన్ కోసం ఆగినప్పుడు, అక్కడ సర్వర్‌గా పని చేస్తున్న టైలర్ శ్యామణ్ణను గుర్తించి పలకరిస్తాడు. కానీ అతను పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. టైలర్ శ్యామణ్ణ కొడుకు ఇంటికి పోయి విచారించగా, అందరికీ దూరంగా బతుకుతున్నాడని తెలుసుకుంటాడు. శ్యామణ్ణ కొడుకుతో కలిసి వెతకడానికి వెళితే అప్పటికే చనిపోయి ఉండటం కనిపిస్తుంది. ఆయన బట్టలు కుట్టడం మానేసి ఉండవచ్చు. కాలంతో పాటు మారలేకపోయి ఉండవచ్చు. కానీ ఆయన నిలువెత్తు వ్యక్తిత్వం, ఆత్మాభిమానం మాత్రం ఆ ఊరి జనం గుండెల్లో చెరగని ముద్రలా, పదిలమైన జ్ఞాపకంలా ఉండిపోయింది.
‘సియాల్ కోట టు గడివేముల వయా సౌదీ: ఓ ప్రేమ కథ’ లో భర్త చనిపోయి ఒక కొడుకుతో ఉన్న దౌలత్ బీ కి ఫోన్ ద్వారా పరిచయమైన గుల్జార్, ఆమె మీది ఇష్టంతో పెళ్లి చేసుకోవడానికి దుబాయ్ నుండి హైదరాబాద్ మీదుగా, కర్నూలు నుండి గడివేములకు వస్తాడు. గుల్జార్‌తో అన్యోన్యంగా ఉన్న దౌలత్ బీతో తన స్వస్థలమైన పంజాబ్ పోవడానికి పాస్‌పోర్ట్‌ల కోసం హైదరాబాద్ పోవాలన్నప్పుడు అసలు నిజం తెలుస్తుంది. అందరూ అనుకున్నట్టు అది ఇండియాలోని పంజాబ్ కాదు. పాకిస్తాన్ లోని పంజాబ్. పాకిస్తాన్ అనగానే అందరికీ చెమటలు పడతాయి. పోలీసులు పట్టుకుంటారు. దుబాయ్ నుండి పాకిస్తాన్‌కు పోయిన గుల్జార్, దౌలత్ బీని పెళ్లి చేసుకోవడానికి పాకిస్తాన్ పాస్‌పోర్టును కాల్చివేసి పోయిందని అబద్ధం చెప్పి, ఎమర్జెన్సీ సర్టిఫికెట్తో ఇండియా వచ్చానని గుల్జార్ చెబుతాడు. విదేశీయుల చట్టాన్ని, ఇండియన్ పాస్‌పోర్ట్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు కేసు పెడతారు. ఇద్దరు పిల్లలతో గుల్జార్ కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, న్యాయం కోసం, కోర్టు చుట్టూ దౌలత్ బీ తిరుగుతూనే ఉంటుంది.
ఇందులో చదువుకు దూరమైన బాలుడు ‘కన్నీటి మేఘం’లో కనిపిస్తే, ఇష్టం లేని చదువులతో కుటుంబానికి దూరమైన బాలుడు ‘విప్రతీసారం’లో, జీవితానికే దూరమైన బాలుడు ‘అమ్మ పోస్ట్ చేయలేని ఉత్తరం’ లో కనిపిస్తారు. పిల్లల కోసం తపించిపోయిన తండ్రి ‘పిల్లోళ్ళు వస్తారు’లో కనిపిస్తే, విద్యార్థుల భవిష్యత్తు కోసం తపించిన ఉపాధ్యాయులు ‘తాతారావు అలియాస్ రజినీకాంత్’, ‘84.. వనవాసం నంబరోడు’లో – జీవితం కోసం పోరాడే విద్యార్థి ‘అస్మిత’లో కనిపిస్తే, జీవితాన్ని గెలుచుకున్న వాడు ‘టైలర్ శ్యామణ్ణ’లో కనిపిస్తాడు. పిల్లవాడిని పోగొట్టుకున్న తల్లి వేదన ఒక కథలో కనిపిస్తే, దూరమైన పిల్లల కోసం అల్లాడిపోయే తండ్రి ఇంకో కథలో కనిపిస్తాడు. చదువు చుట్టూ అల్లుకున్న కుటుంబ సంబంధాలు – మానవ సంబంధాలను అత్యంత ఆత్మీయంగా, కరుణ రస పూరితంగా చిత్రించడం ఆకట్టుకుంటుంది.
కథకు అవసరమైన ప్రతి చిన్న విషయాన్ని విపులంగా వివరించడం వల్ల కథా నేపథ్యం ఆసక్తిగా మారడమే కాకుండా, కథను మరింత ఉత్కంఠ భరితంగా పాఠకుడు చదువుకోవడానికి ఆస్కారం ఏర్పడింది. ‘కన్నీటి మేఘం’ కథలో వానలు పడటానికి గ్రామీణులు ఆశ్రయించే నమ్మకాల తంతులను, వారు ఎంత శ్రద్ధగా వాటిని నిర్వహించారో తెలిపిన విధానం బాగుంది. ఒకప్పటి సంస్కృతిలో భాగమైన ఇలాంటి వివరాలు భవిష్యత్తులో తెలియకపోవచ్చు. కానీ వాటిని ఈ కథలో నమోదు చేసిన విధానం బాగుంది. అలాగే దళితుల కుటుంబాలలోంచే ఆడపిల్లలను బసివినీలుగా వదలడం, వారి జీవితాలు ఎలా నలిగిపోతాయో ‘అస్మిత’ కథలో వివరించారు. ‘84.. వనవాసం నంబరోడు’ కథలో, ఊరు మొత్తం మట్కా జూదం వ్యసనంలో ఎలా మునిగిపోయిందో చెబుతారు. అది ఆడేవాళ్ళలో ఉండే నమ్మకాలు, అలవాట్లు ఎంత గమ్మత్తుగా ఉండేవో వివరిస్తారు. నిజానికి ఈ మట్కా వ్యవస్థ ఎలా ఉండేదంటే బీటర్ బతకడానికి, ఏజెంట్ బలిసిపోవడానికి, ఆడేవాడు మాత్రం పూర్తిగా రోడ్డున పడటానికి – ఈ మూడు సూత్రాల మీదనే ఆనాటి మట్కా నాగన్నల సామ్రాజ్యం విరజిల్లేది. గొప్ప అబ్జర్వేషన్ ఇది. ఈ దేశంలో కొత్తగా తాము ఈ దేశం మనుషులేనని నిరూపణ చేసుకోవాలనే చట్టం వల్ల మైనారిటీలను వేధించటానికి మంచి అవకాశం ఏర్పడింది. విదేశీయుల చట్టాన్ని, ఇండియన్ పాస్‌పోర్ట్ చట్టాన్ని గౌరవించకపోతే జైలుకు పోక తప్పదని ‘సియాల్ కోట టు గడివేముల’ కథ హెచ్చరిస్తుంది. తెలిసిన విషయాలని తెలియని కోణంలో కొత్తగా ప్రజెంట్ చేయడంలోనే రచయిత గొప్పదనం దాగి ఉంది. ఈ కథలో మనల్ని వేధిస్తాయి, వెంటాడుతాయి. కొన్ని కథలు కంటతడి పెట్టిస్తాయి కూడా.
***
రచన: మారుతీ పౌరోహితం
ప్రచురణ: ఛాయా పబ్లికేషన్స్, హైదరాబాద్
పేజీలు: 126
వెల: ₹ 160/-
ప్రతులకు:
ఛాయా పబ్లికేషన్స్,
201, భ్రమరి నిలయం,
ప్లాట్ నంబర్: H-117, మధురా నగర్,
హైదరాబాద్, తెలంగాణ – 500038
ఫోన్: 70931 65151
~
ఆన్లైన్లో:
https://www.amazon.in/Illidisina-Tommodi-Kathalu-Maruthi-Powrohitham/dp/9347704385
https://chaayabooks.com/book/illidisina-tommidi-kathalu
~
శ్రీ మారుతి పౌరోహితం గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mr-maruthi-powrohitham/

