[శ్రీమతి గీతాంజలి గారి ‘ఇల్లొక రాజకీయం’ అనే కవితాసంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
ఇల్లు అనగానే ఓ భరోసా, ఓ ఉత్సాహం, ఓ ఆనంద వీచిక కదలాడినట్టే; ఇంటిని తలచుకోగానే అణచివేత, వివక్ష, వేధింపులు స్ఫురిస్తాయి. వ్యక్తి ఎదగడానికి ఎంత స్ఫూర్తినిస్తుందో, అదే రీతిలో వ్యక్తి పతనాన్నీ శాసిస్తుంది ఇల్లు. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, కాదన లేని కఠిన వాస్తవం ఇది! నివురు కమ్మిన నిష్ఠుర నిజాలివి!!
ఇల్లు ఎవరిని ఎలా చూస్తుందనేది జెండర్‌ని బట్టి మారిపోతుంది. మగవారిని ఒకలా, ఆడవారిని ఒకలా చూస్తుంది. తరతరాలుగా ఈ అప్రకటిత నియమం మన పితృస్వామ్య సమాజంలో కొనసాగుతూనే ఉంది.
ఆడపిల్లలకి ఎంతో కొంత స్వేచ్ఛ ఇచ్చిన ఇళ్ళు కూడా ఎన్నో విషయాల్లో ఆంక్షలు విధిస్తాయి. ఆధునికులం అయ్యాం, పురోగాములమయ్యాం అనుకునేవారి ఇళ్ళల్లో సైతం మహిళలు అవ్యక్త వివక్షని ఎదుర్కోవడం కద్దు.
ఇళ్ళల్లో స్త్రీలు/యువతులు/బాలికలపై అణచివేత, ఆంక్షలు ఈనాటివి కాదు, కొన్ని శతాబ్దాలుగా కొనసాగుతున్నవే. ఆర్థిక స్థాయిని బట్టి వివక్ష రూపం మార్చుకుంటుంది, అంతే!
ఈ నేపథ్యంలో ఇళ్ళల్లో జరిగే రాజకీయాలు ఎలా ఉంటాయో, ఎవరు వాటికెలా బలవుతున్నారో, తమ ‘ఇల్లొక రాజకీయం’ కవితాసంపుటి ద్వారా తేటతెల్లం చేశారు కవయిత్రి గీతాంజలి గారు.
ఇల్లు/కుటుంబం అంటే మొత్తం ప్రతికూల భావనలే కాకుండా – ఇల్లంటే ఓ మమత, ఇల్లంటే ఓ బాధ్యత, ఇల్లంటే ఓ ప్రోత్సాహం, ఇల్లంటే ఆప్యాయత, ఇల్లంటే ఓ ఆర్తి లాంటి భావాలున్న కవితలున్నాయి ఈ పుస్తకంలో. తియ్యని జ్ఞాపకాల్ని మిగిల్చిన ఇళ్ళ గురించిన కవితలూ ఉన్నాయి. కాకపోతే, వర్తమాన సమాజంలోని పెడ ధోరణులకు ప్రతిబింబంలా ఈ సంపుటిలో, ఉన్నతమైన ఆశయాలతో నిండిన ఇళ్ళ కన్నా – ఇనుప పాదాల నర్తనని ప్రతిధ్వనించిన ఇళ్ళ గురించిన కవితలే అధికం!
***
‘ఇల్లంటే నిలువెత్తు మనిషి’ అంటారు కవయిత్రి ‘ఇల్లేమనుకుంటుంది చెప్పు’ కవితలో. మరో కవితలో ఇంటిని ఓ స్టోరీటెల్లర్ అంటారు. ఇల్లు ఒక కలం, ఇల్లు ఒక గాయని, ఇల్లు ఒక పుస్తకం, ఇల్లు ఒక కలం, ఇల్లు ఒక రచయిత్రి అంటారు ‘ఇల్లొక స్టోరీటెల్లర్’ కవితలో. వేసవిలో ఇల్లెలా ఉంటుందో ఓ కవితలో చెప్తూ, ఇల్లు నిన్ను కవిని చేస్తుందంటారు.
తలుపుల గురించి చెబుతూ, “మానవ హృదయమంత విశాలమైనవి, కురచయినవి కూడా” అని అంటారు. తలుపులని సున్నితంగా తట్టమంటారు. తలుపులు ఎలాంటివో చెబుతూ, అవెప్పుడూ ఛాయిస్ ఇస్తూనే ఉంటాయని అంటారు.
కిటికీలు మనుషుల దుఃఖానికి సజీవ సాక్ష్యాలని చెబుతూ, కిటికీ ఓ చిత్రకారిణిగా, ఓ కెమెరాగా ఎలా మారుతుందో, మనుషులకి ఏమేం చూపిస్తుందో గొప్పగా చెప్పారు. కిటికీని ఎందుకు మూయకూడదో చెప్తారు. కిటికీ ఒకసారి ఇంటికి కన్ను, ఒకసారి చెవి అంటారు. కిటికీ ముందు వినమ్రంగా నిలబడమంటారు.
పెరడొక రంగస్థలం పేరిట ఉన్న రెండు కవితలు ఎవరికి వారు చదువుకోవాల్సినవే. ఇంటికి పెరడుకి ఉన్న తేడాని వివరిస్తారు ఈ కవితల్లో. వాకిలికి, ఇంటికి ఉన్న బంధాన్ని చెబుతారు. వాకిలిని ఒంటరి చేయద్దని అంటారు. “ఈ వాకిలికెన్ని జ్ఞాపకాలనీ?/ఎంతమందిని రానిచ్చిందో ఎంతమందిని పోనిచ్చిందో/ఎన్ని పాదముద్రలను మోస్తూ/మనుషుల ఆనవాళ్ళు పట్టి హృదయానికి ఆర్తిగా హత్తుకుందో/ఎన్ని పాడెలను సాగనంపుతూ పొగిలి పొగిలి ఏడ్చిందో” అంటూ వాకిలికి మనుషుల కళ కావాలని చెప్తారు.
“పడకగదిలో ఆమె రోజూ కొత్తగా తయారుకాబడుతుంది” అంటారు ‘పడకగది-2’ కవితలో. “అతని జేబులో ఎప్పుడూ కత్తెరలు,/సూదులూ దారాలు ఉంటాయి./”ఏంటవి?” అడుగుతుంది ఆమె!/“నా ఆయుధాలు! మా తాత నించి,/నాన్నకి, నాకు సంక్రమించాయి”/అంటాడతను ముసిముసిగా నవ్వుతూ.” ఈ ఆయుధాలతో, వివాహితలను భర్తలు ఎలా మార్చేస్తారో ఈ కవిత చెబుతుంది. పడకగది శీర్షికతోనే వచ్చిన సీక్వెల్ కవితలు లైంగిక వేధింపులకు, శారీరిక వేధింపులకు, మానసిక వేదనలకు గురయ్యే వివాహితల దుస్థితిని కళ్ళకు కడతాయి.
వివక్ష అనేది ఇళ్ళల్లోకి ఎంతలా చొచ్చుకువచ్చేసిందే చెబుతూ, కంచాలలో ఆడ కంచం, మగ కంచంలోని తేడాలని చెప్తారు. మగ కంచంలో నిండు భోజనం, ఆడ కంచంలో సగం భోజనం. ఇంట్లో అందరూ తిన్నాక, మిగిలిన అడుగుబొడుగు పదార్థాలు తినే అమ్మకి – భోజన హీనత, ప్రేమ హీనత ఉన్నాక, రక్తహీనత రాకుండా ఎలా ఉంటుందని ప్రశ్నిస్తారు. అయితే పురుషులందరినీ ఒకే గాటన కట్టేయలేదు కవయిత్రి. “అమ్మ కంచం నింపే నాన్నలు ఉన్నారు/మనువుని తప్పించుకుని/మనుషులుగా మిగిలిన నాన్నలున్నారు” అంటారు. మరో కవిత, ‘హృదయం ఉన్న నేల-2’ కవితలోనూ అరుదుగా ఉండే మంచి నాన్నలను ప్రస్తావిస్తారు. అందరి అమ్మలకీ అటువంటి నాన్నలు దొరికితే బాగుండని అంటారు.
కొందరు భర్తలు భార్యలతో మాట్లాడరు. బయటంతా అక్కరలేని కబుర్లు చెప్పి, ఇంటికొచ్చి మౌన వ్రతం పట్టే భర్తలను నిలదీస్తుంది ‘మాట్లాడు!’ కవిత.
డాబా పేరిట ఉన్న రెండు కవితలు చదువుతుంటే కళ్ళల్లో చిన్నగా చెమరుస్తాయి. మనుషులు ఎందుకింత క్రూరంగా మారిపోతున్నారనే ఆలోచన వస్తుంది.
‘నువ్వు రిటైర్ అయితే నాకేంటిట చెప్పు??’ అని రెండు కవితలో ఉద్యోగ విరమణ చేసి ఇంట్లో ఉండే భర్తను ప్రశ్నించిన భార్య, – భర్త తనకి ఏం చేయాలో, మరో కవిత ‘నువ్వు రిటైరయ్యాకా ఏం చేయాలంటే’ లో చెప్తుంది. “ఎప్పుడూ నీ డైటేనా../కాస్త ఆమెని కూడా ఏమైనా తింటావా అని అడుగు./ఆమె కంచాన్ని నువ్వు నింపు/ఆమె మంచాన్ని నువ్వు సర్దు!/ఆని హాయిగా నిద్రపోనివ్వు.” అంటారు. “మెల్లిగా ఆమె నుంచి దూరానికి జరిగి చూడు../ఆమె ఓ మహాద్భుతంగా మారకపోతే చూడు!” అంటారు.
“జీవితం మీద అలగకు, పాలిపోకు, వివర్ణమవకు. కాసిని రంగులు అద్దు, మరికాసిన్ని రంగులద్దించుకో” అంటారు కవయిత్రి ‘రంగుల ఇల్లు’ కవితలో. వ్యక్తిత్వ వికాస పాఠాల సారమిదే కదా అనిపిస్తుందీ కవిత చదువుతుంటే.
‘ఇల్లొక పుస్తకం’ పేరిట వ్రాసిన మూడు కవితలలో ఇంటిని పుస్తకంతో పోలుస్తూ, “మనుషులే పుస్తకాలైన ఇల్లు/ఒక లైబ్రరీగా మారిపోతుంది” అంటారు. “నిన్ను కన్న అమ్మానాన్నలు ఎక్కడ అని/ఇల్లంత మూలమూలల్లో వెతుకుతాయి!/నీ ఇల్లాలితో నీ తీరుతెన్నులని ప్రశ్నిస్తాయి” అంటారు. “పుస్తకాలు నిన్ను మానవీకరిస్తాయి” అంటూ, “పుస్తకాలు ఔషధం లాంటివి/నిన్ను మనిషిగా మరణించడాన్ని ఆపుతాయి” అంటారు.
‘అమ్మా.. ఎక్కడివే నీకిన్ని చేతులు’ పేరిట వ్రాసిన మూడు కవితల్లో ఇళ్ళల్లో అమ్మలు చేసే శ్రమని ప్రదర్శిస్తాయి. స్త్రీమూర్తుల పట్ల ఇతర కుటుంబ సభ్యుల నిర్లక్ష్య వైఖరిని ప్రస్తావిస్తాయి. అవి, “ఎన్ని తప్పులను క్షమించిన చేతులో కదా” అంటారు. కాదనలేరు పాఠకులు.
కిటికీల గొప్పదనాన్ని ‘నాలుగు కిటికీలు’ కవిత చెబుతుంది. ఓ కూతురు తండ్రికిచ్చిన గొప్ప నివాళి ‘నాన్నా, నువ్వు లేని ఇల్లు’ కవిత!
ఇల్లంటే ఏమిటో అదే శీర్షికతో ఉన్న కవితలో అద్భుతంగా చెప్పారు గీతాంజలి. మనుషులు వెళ్ళిపోయాకా, ఇల్లెలా అయిపోతుందో చివరి కవితలో చెప్పారు. “మనుషులు వెళ్ళిపోయాక/ఇల్లు ఖాళీ వాసన వేస్తుంది” అంటారు. “మనుషులు వెళ్ళిపోయాక/ఇల్లు దిగులు గుండెతో ముడుచుకుపోయి/తలుపు వేసుకుంటుంది” అంటూ కవితని, పుస్తకాన్ని ముగించారు.
***
వేదనలని, వేధింపులని, వివక్షనీ, ఆపేక్షలనీ, ఆర్ద్రతనీ ప్రదర్శించాయి ఈ కవితలు. కొన్ని కవితలలో ఆవేదన ఆవేశమై కన్నెర్ర జేస్తే, కొన్ని కవితలలో ఆప్యాయత ఆదరంగా పలకరిస్తుంది.
ఈ కవితలు చదివాకా, ఇంట్లోని పెద్దవాళ్ళకో, భార్యకో, భర్తకో, పిల్లలకో, తోబుట్టువులకో – సారీ చెప్పాలని అనిపిస్తే చెప్పేయండి. మాట తూలినందుకో, నిరాదరించినందుకో, పట్టించుకోనందుకో, గాయపరిచినందుకో, మనసుని విరిచేసినందుకో – మనస్ఫూర్తిగా క్షమాపణ అడగండి. హృదయ భారాన్ని దించుకోండి.
ఇంటింటా ఉండదగ్గ పుస్తకం ‘ఇల్లొక రాజకీయం’. చక్కని పుస్తకం అందించిన గీతాంజలి గారికి, ప్రచురణకర్తలకు థాంక్యూ!
(ఇంటాబయటా లైంగిక హింస పైనా, స్త్రీలు ఎదుర్కునే వేధింపులు, వివక్షపైనా, ఇతర మార్జినలైజ్డ్ సెక్షన్స్ వారి సమస్యలపైనా వినిపించే గట్టి స్వరాలలో గీతాంజలి గారొకరు. సందర్భాన్ని బట్టి కవితల్లో ఆగ్రహ ప్రకటనా చేస్తారు, ఆర్ద్రంగానూ చెప్తారు. ఈ కవితాసంపుటిలోని కవితల లోతు గురించి గీతాంజలి గారు సంచికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా తెలియజెప్పారు. కొన్ని కవితల గురించి కవయిత్రి ముఖతా, ఏ ఉద్వేగంతో రాశారో, ఆమె స్వయంగా చెప్తున్నప్పుడు వినడం/చదవడం బాగుంటుందని, కొన్ని కవితలను నేను ప్రత్యేకంగా ఈ సమీక్షలో ప్రస్తావించలేదని పాఠకులు గమనించగలరు.)
***
రచన: గీతాంజలి
ప్రచురణ: మట్టి ముద్రణలు
పేజీలు: 225
వెల: ₹ 200/-
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా,
హైదరాబాద్. ఫోన్: 9000413413
~
పుట్ట పుస్తక శిబిరం
ఆళ్ళగడప, మిర్యాలగుడా 508207
మొబైల్: 98480 15364
~
ఆన్‌లైన్‌లో:
https://www.telugubooks.in/products/illoka-rajakeeyam?
~
శ్రీమతి గీతాంజలి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mrs-geethanjali/
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.
