Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఇల్లు – కుటుంబం

[శ్రీ పారుపల్లి అజయ్ కుమార్ గారు రచించిన ‘ఇల్లు – కుటుంబం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

సాయంత్రం ఆరుగంటలు దాటినా, శ్రీధర్ తన క్యాబిన్‌లో ల్యాప్‌టాప్ స్క్రీన్‌ మీద చూపు నిలిపి కూర్చుని ఉన్నాడు. కొద్దిసేపటి క్రితమే సహోద్యోగులు తమ తమ బ్యాగులు తీసుకుని ఇంటికి వెళ్లిపోయారు. ఆఫీసు ఫ్లోర్ మొత్తం దాదాపు ఖాళీ అయిపోయింది.

బయట ఆకాశం నెమ్మదిగా చీకటి రంగు పులుముకుంటోంది.

బయట కిటికీ అద్దాలపై పడుతున్న మసక సాయంత్రపు వెలుతురు నెమ్మదిగా చీకటిలో కలిసిపోతుండగా, స్క్రీన్‌పై మెరుస్తున్న అక్షరాలు అతని అలసిన కళ్లలో ప్రతిబింబించాయి. పెద్ద గ్లాస్ విండోలో నుండి నగరంలోని స్ట్రీట్ లైట్లు ఒక్కొక్కటిగా వెలగటం కనిపిస్తున్నది.

బయట చీకట్లు కమ్ముకుంటున్నా, అతని కేబిన్‌లో వెలిగే తెల్లని ట్యూబ్‌లైట్ కాంతి ఆ విషయాన్ని అతనికి తెలియనివ్వడం లేదు. టేబుల్‌పై చల్లారిపోయిన కాఫీ కప్పు, పక్కనే చిందరవందరగా పడి ఉన్న ఫైళ్లు, ఒక చిన్న నోట్ బుక్ అస్తవ్యస్తంగా కనిపిస్తున్నాయి..

కేబిన్‌లోని నిశ్శబ్దం పేరుకుపోయింది.

ఆ నిశ్శబ్దంలో ఎయిర్ కండీషనర్ చేస్తున్న శబ్దం లీలగా వినవస్తున్నది.

అతను పని చేస్తున్నది సాధారణ ప్రాజెక్ట్ కాదు. కంపెనీకి చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ అది. డేటా ఫైళ్లు, కోడ్ లైన్లు, గ్రాఫ్స్.. అన్నీ ల్యాప్‌టాప్ స్క్రీన్ మీద వరుసగా కనిపిస్తున్నాయి. ‘ఈ పని పూర్తయ్యే వరకు ఇంటికి వెళ్లకూడదు..’ అని శ్రీధర్ తనలో తానే మెల్లగా అనుకున్నాడు.

అప్పుడే అతని ఫోన్ మెల్లగా వైబ్రేట్ అయింది. శ్రీధర్ ఫోన్ తీసి చూసాడు. శ్రీధర్ కూతురు అన్విత క్లాస్ టీచర్ లైన్‌లో వుంది.

ఫోన్ ఆన్ చేసి “హలో! ఆద్య టీచర్, ఏమిటి విషయం?” అడిగాడు.

“సర్! మీరూ, మీ శ్రీమతి గారు రేపు స్కూల్‌కు వచ్చి నన్ను గానీ, ప్రిన్సిపాల్ మేడమ్‌ను గానీ కలవండి.” అంది ఆద్య ఫోన్ లో.

“ఏమయింది టీచర్? మా అమ్మాయి సరిగా చదవడం లేదా? క్లాసులో ఏమయినా గొడవ జరిగిందా?” కొద్దిగా ఆదుర్దాగా అడిగాడు శ్రీధర్.

“అదేం కాదు సార్. ఫోన్‌లో చెప్పడం కన్నా ఒకసారి వచ్చి కలిస్తే బాగుంటుంది. అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకోవచ్చు.”

“కానీ టీచర్, ప్రాజెక్ట్ వర్క్‌లో నేను బాగా బిజీగా ఉన్నాను. స్కూల్ దాకా వచ్చి కలవడం కుదరదు. ఎలాగు ఫోన్ చేసారుగా. విషయం చెప్పండి.”

“మీరు ఎంత బిజీగా వున్నా, మీ పాప కోసం మీరు ఓ గంట సమయం కేటాయించలేరా? సర్, ప్లీజ్! మీ మేడమ్ గారిని తీసుకుని రేపు స్కూలుకు వచ్చి కలవండి. రాకపోతే భవిష్యత్తులో మీరు బాధపడాల్సి వస్తుంది. ఎందుకు చెపుతున్నానో అర్థం చేసుకోండి.” అని ఫోన్ కట్ చేసింది ఆద్య.

‘అన్విత ఏం చేసి ఉంటుంది?’ అని శ్రీధర్ రెండు క్షణాలు ఆలోచించాడు. తల విదిలించి తిరిగి ల్యాప్‌టాప్ లోకి చూస్తూ తన పనిలో నిమగ్నుడై పోయాడు.

శ్రీధర్ నగరంలోని ఒక పెద్ద ఐటీ కంపెనీలో ఉన్నత స్థాయి ఉద్యోగి. రోజంతా ల్యాప్‌టాప్ ముందు కూర్చొని పని చేసినా ఇంకా చేయవలసిన పని ఉంటూనే ఉంటుంది. అతని భార్య సునీత ఒక బ్యాంక్ ఉద్యోగి. వారికి ఇద్దరు పిల్లలు 12 ఏళ్ల ఆదిత్య, 7 ఏళ్ల చిన్నారి అన్విత.

పెద్ద గేటెడ్ కమ్యూనిటీలోని అధునాతన విల్లాలో శ్రీధర్ నివాసం. భారీ సెక్యూరిటీ గేట్లు, 24 గంటల గార్డులు, సీసీటీవీ కెమెరాలతో అక్కడ భద్రతకు ఏ మాత్రం లోటు లేదు. శ్రీధర్ అధునాతన డూప్లెక్స్ విల్లా ఆ కమ్యూనిటీలోనే అత్యంత ఆకర్షణీయమైన వాటిలో ఒకటి. ఇంటి ముందు పచ్చని లాన్, ఇంటిప్రక్కనే స్విమ్మింగ్ పూల్.. రాత్రి వేళల్లో వెలిగే లైట్లు ఆ ఇంటిని మరింత అందంగా కనిపించేలా చేస్తున్నాయి.

విల్లా లోపలికి అడుగుపెడితే అది సాధారణ ఇల్లు కాదు అనిపిస్తుంది.

స్మార్ట్ హోమ్ సిస్టమ్‌తో నిండిన ఇల్లు అది. బటన్ నొక్కితే లైట్లు వెలుగుతాయి, కర్టెన్లు పక్కకు తొలగుతాయి, ఎయిర్ కండిషనింగ్‌తో సహా అన్నీ ఆటోమేటిక్‌గా ఆన్ అవుతాయి. హాల్ గోడకు ఒక వైపున భారీ స్మార్ట్ టీవీ స్క్రీన్, డిజిటల్ సౌండ్ సిస్టమ్, చుట్టూ మోడ్రన్ సోఫాలు, గోడలపై డిజిటల్ ఆర్ట్ లతో ఇల్లు దేవేంద్ర భవనంలా అనిపిస్తుంది. మంచి జీతం, విలాసవంతమైన ఇల్లు, సౌకర్యాలతో నిండిన జీవితం, అందమైన భార్య, ముద్దులొలికే పిల్లలు..

శ్రీధర్‌కు అన్నీ ఉన్నాయి. కానీ.. కానీ..

***

ఎప్పటిలానే ఆ రోజు కూడా శ్రీధర్ ఇంటికి వచ్చేసరికి రాత్రి పది దాటింది.

“పిల్లలు పడుకున్నారా?” డ్రెస్ చేంజ్ చేసుకుంటూ అడిగాడు భార్యను.

“ఇప్పుడే పడుకున్నారు.” అంది జ్యోతి కిచెన్ లోకి వెళుతూ.

“అన్విత క్లాస్ టీచర్ ఆద్య ఫోన్ చేసింది.”

చపాతీ ముక్కను కూరలో అద్దుకుని తింటూ అన్నాడు శ్రీధర్.

“దేనికి ఫోన్ చేసింది?” శ్రీధర్ ముఖంలోకి చూస్తూ అడిగింది జ్యోతి.

“రేపు మనిద్దరినీ స్కూలుకు వచ్చి కలవమని చెప్పింది. విషయం ఏమిటో చెప్పలేదు. అన్విత నీతో ఏమన్నా చెప్పిందా?”

“అను స్కూలు విషయాలు నాతో ఏం చెప్పలేదు. గత నెల దాని ప్రోగ్రెస్ కార్డు చూసాగా. మార్కులు బాగానే వచ్చాయి. వచ్చేవారం మా బ్యాంకు ఆడిట్ ఇన్స్పెక్షన్ వుంది. బ్యాంకులో చాలా పని వుంది. నేను రాను. నువ్వు వెళ్ళి కలువు.” అంది జ్యోతి.

“నేను మాత్రం తీరిగ్గా ఉన్నానా? ప్రాజెక్ట్ పని ఇంకా ఓ కొలిక్కి రాలేదు. టీచర్ మనల్ని ఖచ్చితంగా రమ్మని చెప్పింది. ఓ గంట వెళ్ళి వచ్చేద్దాం.” శ్రీధర్ అన్నాడు.

జ్యోతి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది.

***

“మీ పిల్లలు స్కూల్ నుండి వచ్చాక సాయంత్రాలు ఎలా గడుపుతున్నారో మీరు ఎప్పుడైనా శ్రద్ధగా గమనించారా?”

టీచర్ ఆద్య అడిగిన ప్రశ్నకు శ్రీధర్, జ్యోతి ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు.

శ్రీధర్ సాధారణంగా సాయంత్రం ఇంట్లో ఉండదు. ఆఫీసులోనే వుంటాడు.

జ్యోతి బ్యాంకు నుండి అలసిపోయి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకుని, మొబైల్‌లో కాసేపు సోషల్ మీడియా చూస్తూ కాలక్షేపం చేస్తుంది. తరువాత డిన్నర్ ప్రిపరేషన్ చేస్తుంది.

ఆదిత్య హోం వర్క్ అయిపోగానే టాబ్ తీసుకుని వీడియో గేమ్స్‌లో మునిగిపోతాడు. అన్విత టాబ్లెట్‌లో కార్టూన్లు చూస్తూ కాలం గడుపుతుంది.

అంతా ఒకే ఇంట్లో ఉన్నా, ప్రతి ఒక్కరూ ఎవరి ప్రపంచంలో వాళ్ళు ఉన్నట్టే ఉంటారు.

“అన్విత బర్త్ డే ఎప్పుడు?” ఎదురుగా కూర్చుని వున్న శ్రీధర్, జ్యోతిలను చూస్తూ అడిగింది ఆద్య.

రెండు వారాల క్రితమే ఆద్య బర్త్ డే ఫంక్షన్ జరిగింది. అదే చెప్పాడు శ్రీధర్.

“ఆ రోజు మీరు ఆ ఫంక్షన్లో పాల్గొన్నారా?” అడిగింది ఆద్య.

జ్యోతికి ఆద్య బర్త్ డే రోజు జరిగింది గుర్తుకు వచ్చింది.

పుట్టినరోజున కుటుంబం మొత్తం ఇంట్లోనే సరదాగా కలిసి గడపాలి అని అన్విత వారం రోజుల ముందే అమ్మా, నాన్నలకు చెప్పింది.

జ్యోతి ఆ రోజు ఇంట్లోనే పార్టీ ఏర్పాటు చేసింది. బెలూన్లు, రంగురంగుల పూలతో ఇల్లంతా శోభాయమానంగా తయారయింది. ఆర్దరిచ్చిన పెద్ద కేకు హాలు మధ్యలో సిద్ధంగా వుంది.

గేటెడ్ కమ్యూనిటీలోని పిల్లలంతా వచ్చారు.

నాన్న ఎప్పుడు వస్తారో అనుకుంటూ అన్విత అటూ ఇటూ తిరుగుతూ వుంది. అప్పుడప్పుడు హాల్లో వున్న గోల్డ్ కలర్ గోడ గడియారం వైపు దృష్టి సారిస్తున్నది.

సాయంత్రం 7 అయ్యింది.. 8 అయ్యింది.. శ్రీధర్ ఇంకా రాలేదు.

జ్యోతి ఫోన్ చేద్దామనుకునే లోపు సెల్ లో రింగ్ టోన్ వినిపించింది. జ్యోతి సెల్ ఆన్ చేసింది.

“ముఖ్యమైన మీటింగ్ ఉంది. ఆలస్యం అవుతుంది.” అని శ్రీధర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేశాడు.

జ్యోతి మాట్లాడేలోపే కాల్ కట్ అయింది. అది విన్న అన్విత ముఖం ఒక్కసారిగా చిన్నబోయింది.

“నాన్న వీడియో కాల్‌లో అయినా కనిపిస్తారా?” అని కేక్ కట్ చేసే సమయానికి అన్విత తల్లితో నెమ్మదిగా అడిగింది.

జ్యోతి ఎన్నిసార్లు ఫోన్ చేసినా శ్రీధర్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు.

పార్టీ జరిగి పిల్లలంతా వెళ్లిపోయాక అన్విత తన గదిలో ఒంటరిగా కూర్చొని ఏడ్చింది.

శ్రీధర్ తల వంచుకుని “ఆ రోజు ఆఫీసులో ముఖ్యమైన మీటింగ్ ఉండి సమయానికి ఇంటికి రాలేక పోయాను.” అన్నాడు ఆద్యతో.

టీచర్ వారి వైపు చూస్తూ నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించింది.

“కుటుంబంతో గడిపిన అందమైన క్షణాలు మన జీవితానికి నిజమైన ఆనందాన్ని, ఆత్మీయతను అందించే అమూల్యమైన జ్ఞాపకాలు. మన అమ్మానాన్నలతో, తోడబుట్టిన వారితో పంచుకునే నవ్వుల్లో ప్రేమ ఉంటుంది..ఆ మాటల్లో అనుబంధం ఉంటుంది..ఆ జ్ఞాపకాల్లో జీవితాంతం నిలిచే మాధుర్యం ఉంటుంది. ఈ నెలలో మీ కుటుంబంతో మీరు సరదాగా గడిపిన అటువంటి అందమైన జ్ఞాపకాల గురించి రాయండి అని క్లాసులో పిల్లలకు రెండు రోజుల క్రితం చెప్పాను. అందరు పిల్లలు ఆనందంతో, ఉత్సాహంగా రాయడం మొదలు పెట్టారు. ఒకరు కుటుంబంతో కలిసి వెళ్లిన పిక్నిక్ గురించి రాశారు. ఇంకొకరు వాళ్ళు చూసిన సినిమా గురించి రాశారు. హోటల్ కు వెళ్ళిన వారు కొందరు, పెళ్లికి, పార్టీలకు వెళ్ళిన వాళ్ళు మరికొందరు ఇలా పిల్లలంతా రకరకాల సంఘటనల గురించి రాశారు.

కానీ అన్విత విచారంగా ముఖం పెట్టుకుని ఖాళీ పేపర్ వైపు చూస్తూ కూర్చుని వుంది. క్లాసులో అడగటం బాగోదు అని నేను తనని ఏం అడగలేదు.

తరువాత పిల్లలు రాసింది చూస్తున్నప్పుడు అన్విత రాసింది కనిపించింది. ఒక వాక్యం మాత్రమే రాసింది. అది చూసి నేను చాలా బాధపడ్డాను.. నా గుండె ఒక్కసారిగా కదిలిపోయింది. కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. తరువాత అన్వితను విడిగా పిలిచి కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాను. మీతో పర్సనల్‌గా మాట్లాడాలని మిమ్మల్ని రమ్మన్నాను.”

“ఏం రాసింది టీచర్?” జ్యోతి ఆదుర్దాగా అడిగింది.

ఆద్య టీచర్ డెస్క్ లో నుండి ఆ పేపర్ తీసి వారికి చూపించింది.

‘దేవుడా! నాకు కూడా నా అమ్మా నాన్నలతో సరదాగా గడిపే అందమైన క్షణాలను కొన్ని అయినా ఇవ్వవా ప్లీజ్?’

అది చూసిన జ్యోతి ఒక్కసారిగా బరస్ట్ అయి ఏడ్చేసింది. శ్రీధర్ కంటిలో నీళ్లు తిరిగాయి.

నాలుగు రోజుల క్రితం జరిగిన సంఘటన అతనికి గుర్తుకొచ్చింది.

ఆ రోజు శ్రీధర్ అనుకోకుండా కొంచెం ముందుగానే ఇంటికి వచ్చాడు.

భార్య ఇచ్చిన కాఫీ తాగి ల్యాప్‌టాప్ ముందు కూర్చున్నాడు.

అప్పటికి పిల్లలు ఇంకా నిద్రపోలేదు.

అన్విత తండ్రి దగ్గరికి వచ్చి “నాన్న.. ఈ ఆదివారం జూ పార్క్‌కి వెళ్దామా?” అని నెమ్మదిగా అడిగింది.

“ఈ వారం చాలా పని ఉంది అమ్మా.. తర్వాత చూద్దాం.” శ్రీధర్ ల్యాప్‌టాప్ నుంచి తల కూడా ఎత్తకుండానే చెప్పాడు.

అన్విత ముఖం ముడుచుకు పోయింది. ఆమె కళ్లలో నిరాశ స్పష్టంగా కనిపించింది.

అదే సమాధానం ఇంతకు ముందు కూడా చాలా సార్లు తండ్రి నుండి విని వుంది. అన్విత కాసేపు అక్కడే నిలబడి మెల్లగా తన గదిలోకి వెళ్లిపోయింది.

“సర్!” ఆద్య పిలుపుతో తలెత్తి చూశాడు శ్రీధర్.

“పిల్లలకు ఖరీదైన వస్తువులు కంటే, తల్లిదండ్రులతో గడిపే సమయం ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. మీ ఇంట్లో వున్న నలుగురూ కలసి ఒకచోట కూర్చుని సంతోషంగా గడిపి ఎన్నాళ్ళయింది? మీ పిల్లలతో ఆడుతూ, పాడుతూ సరదాగా తిరిగి ఎన్ని రోజులు అయింది? చాలా మందికి దొరకని అదృష్టం మీకు దక్కింది. మంచి ఉద్యోగం, లక్షల్లో జీతం, సౌకర్యవంతమైన ఇల్లు, చక్కటి కుటుంబం అన్నీ ఉన్నాయి మీకు. మీ ఇల్లు అంతా అధునాతన స్మార్ట్ పరికరాలతో నిండిపోయి ఉంది. కానీ..మీ ఇంట్లో ఒకే లోటు వుంది. పిల్లలు, మీరు కలసి ఆనందంగా గడిపే సమయం లేకుండా పోయింది. ఫలితంగా ఒకే ఇంట్లో ఉంటూ కూడా మనసులు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పిల్లల మాటలు, నవ్వులు మూగపోతున్నాయి. వారు నిశ్శబ్దంగా ఉండిపోతున్నారు. కాలక్షేపం కోసం సెల్‌లో గేమ్స్ ఆడుతూ దానికి అడిక్ట్ అవుతున్నారు. అధునాతన టెక్నాలజీ మన జీవితాలను సులభతరం చేసింది. కానీ మనసులను దూరం చేస్తున్నది. ఒకే ఇంట్లో ఉన్న నలుగురు ఎవరికి వారు సెల్ లేదా టాబ్ పట్టుకుని ఎవరి ప్రపంచంలో వారు వుంటే ఇక కుటుంబ బంధాలకు అర్థం ఏముంది? ఇలాగే మరికొన్ని రోజులు గడిస్తే అన్విత మనసు ఎలా మారుతుందో చెప్పలేను. మీ మీద కోపం, ద్వేషం పెంచుకోవచ్చు. లేదా తనలో తనే బాధపడి డిప్రెషన్ లోకి వెళ్ళవచ్చు. ఈ పరిస్థితి రాకూడదనే ఇదంతా మీకు చెప్పటానికే మిమ్మల్ని రమ్మని చెప్పాను.

పిల్లలకు కావాల్సింది ఖరీదైన బహుమతులు కాదు.. ‘నాన్నా!’ అని పిలిచినప్పుడు వెంటనే స్పందించే ఆప్యాయత, ‘అమ్మా!’ అని దగ్గరకు వచ్చినప్పుడు ఆలింగనం చేసుకునే ప్రేమ.

మీరు కొనిచ్చే బొమ్మలు కొంతకాలం మాత్రమే వారికి ఆనందాన్ని ఇస్తాయి.

కానీ.. మీరు వారితో కలిసి గడిపిన క్షణాలు మాత్రం వారికి జీవితాంతం మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.

ఇకనైనా మీ పిల్లలకు రోజులో కొద్దిపాటి సమయానైనా కేటాయించండి. రోజులో కొంత సమయమైనా ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, పనులన్నీ పక్కన పెట్టి, కుటుంబంతో కలిసి నవ్వండి.. మాట్లాడండి.. ఆటలాడండి..

ఎందుకంటే పిల్లలకు మీరు ఇచ్చే అత్యంత విలువైన బహుమతి మీ సమయం మాత్రమే. ఇంటికి వెళ్ళాక ఒక్కసారి తీరిగ్గా ఆలోచించుకోండి. ఇంతకన్నా నేను చెప్పాలనుకున్నది ఏమీ లేదు. మీ విలువైన సమయాన్ని వెచ్చించి నా మాటలు విన్నందుకు థాంక్స్.” అంటూ ముగించింది ఆద్య.

***

ఆ రాత్రి ఇంటికి వచ్చాక శ్రీధర్ చాలా సేపు నిశ్శబ్దంగా కూర్చున్నాడు. అతనికి తన చిన్నతనం రోజులు గుర్తుకు వచ్చాయి.

తనకు క్రికెట్ అంటే ఇష్టమని తండ్రి పొద్దున్నే లేచి తనను క్రికెట్ గ్రౌండ్‌కు తీసుకెళ్లేవాడు. సైకిల్ తొక్కడం దగ్గర ఉండి ప్రాక్టీస్ చేయించేవాడు. తాతయ్య చెరువులో ఈత నేర్పించాడు. తాతతో తండ్రితో కలిసి వెన్నెల రాత్రుల్లో ఆడిన ఆటలు ఎన్నో ఉన్నాయి.

శనివారం సాయంత్రాలు తల్లితో కలసి గుళ్ళకు వెళ్ళడం..నానమ్మతో చెప్పించుకున్న కథలు, పల్లెటూర్లో కుటుంబంతో కలిసి ఆరుబయట భోజనాలు చేస్తూ ఆనందంగా గడిపిన రోజులు..ఇంటి బయట వరుసగా మంచాలు వేసుకుని కబుర్లు చెప్పుకుంటూ నిద్రించిన రోజులు.. అన్నీ జ్ఞాపకం వచ్చాయి.

అమ్మా, నాన్నలు తమతో వుంటే పిల్లలను గారాబం చేసి పాడు చేస్తారని తనే వారిని దూరంగా ఉంచాడు. కానీ అది కరెక్ట్ కాదని ఇప్పుడు అర్థమవుతున్నది. తను చేస్తున్న తప్పు తెలిసి వచ్చింది.

‘తాను తన పిల్లలకు ఇవ్వాల్సింది డబ్బు కాదు.. కాసింత ప్రేమ, పిల్లలతో గడిపే కొంత సమయం.’ అని శ్రీధర్ గ్రహించాడు.

ఆ రాత్రి అతను భార్యతో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నాడు.

మరుసటి రోజు రాత్రి 8 గంటలకు శ్రీధర్ భార్యను, పిల్లలిద్దరినీ కూర్చోబెట్టుకుని “మనందరం ఈ రోజు నుండి ప్రతి రోజు ఒక గంట.. నో స్క్రీన్ అవర్ పాటిద్దాం.. ఆ సమయంలో మొబైల్, టీవీ, ల్యాప్‌టాప్ ఏవీ మన చేతుల్లో ఉండకూడదు. అన్నీ బంద్. రాత్రి 8 గంటలనుండి తొమ్మిది వరకు మన కుటుంబ సమయం. కేవలం మనం మాత్రమే కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుందాం. ప్రతి ఆదివారం మన కుటుంబ దినోత్సవంగా జరుపుకుందాం. ఆ రోజు ఎటైనా ఔటింగ్ కు వెళదాం. మరో ముఖ్యమైన విషయం. ఓ వారం రోజుల్లో తాతయ్య, నాయనమ్మ మనింటికి వస్తున్నారు. వారు ఇక ఎప్పటికీ మనతోనే ఉంటారు.”

అన్విత కళ్లల్లో ఒక్కసారిగా వెలుగు కనిపించింది.

“నాన్నా! తాతయ్య, నానమ్మ నిజంగా వస్తున్నారా?” సంతోషంతో అడిగింది.

“అవును. బంగారం!” కూతుర్ని ఒడిలోకి తీసుకుని ముద్దుపెట్టుకుంటూ అన్నాడు శ్రీధర్.

“నేను రోజూ నానమ్మ దగ్గరే పడుకుంటాను. తను ఎన్నో కథలు చెపుతుంది. నేనెంత అల్లరి చేసినా నన్ను ఏమనదు.” అన్విత గారంగా అంది.

“నాన్నా!.. మీరు చిన్నప్పుడు అల్లరి చేసేవారా?” ఆదిత్య అడిగాడు తండ్రిని.

శ్రీధర్ తన చిన్నప్పటి కథలు, స్కూలు విషయాలు, స్కూల్లో పదమూడో ఎక్కం మరచిపోయి టీచర్‌తో తిన్న దెబ్బల గురించి చెప్పాడు.

“నాన్న.. మీరు కూడా స్కూల్‌లో మీ టీచర్‌తో దెబ్బలు తిన్నారా?” అన్విత పకపకా నవ్వుతూ అడిగింది.

చాలా రోజులుగా ఆ ఇంట్లో పేరుకు పోయిన నిశ్శబ్దం నెమ్మదిగా తొలగిపోయింది. ఇళ్లంతా నవ్వులతో నిండిపోయింది.

డబ్బు వుంటే అధునాతన హంగులతో పెద్ద ఇంటిని నిర్మించుకోవచ్చు.

కానీ కుటుంబాన్ని నిర్మించేది మాత్రం ప్రేమ, అనురాగం, ఆప్యాయతలే.

Exit mobile version