[జూన్ 3వ తేదీ ప్రముఖ హిందీ నటుడు శ్రీ రాజ్ కుమార్ వర్ధంతి సందర్భంగా ‘ఇంపాక్ట్ యాక్టర్’ అనే రచనని అందిస్తున్నారు శ్రీ పొన్నాడ సత్యప్రకాశ రావు.]
ఇంపాక్ట్ యాక్టర్ (రియల్ యాటిట్యూడ్ స్టార్)
ఐపీల్ ట్వంటీ ట్వంటీ క్రికెట్ అటలో కొత్తగా ఇంపాక్ట్ ప్లేయర్ అనే పద్ధతిని ప్రవేశపెట్టారు. ఇది అందరికీ తెలిసిందే. మరి హిందీ సినిమాలలో ‘ఇంపాక్ట్ యాక్టర్’ గురించి తెలుసా? అంటే ఆ నటుడుది ప్రధాన పాత్ర కాకపోయినా చిత్రం ముగిసేసరికి అతని గురించే చెప్పుకోవాలి. అతని పర్సనాలిటీ, ప్రభావం.. ఇంపాక్ట్ అలా ఉండాలి. అటువంటి నటుడి గురించి తెలుసా..
***
సినిమాలలో తెలుగైనా హిందీ అయినా 1950 నుంచి 1975 వరకు స్వర్ణయుగం అనే చెప్పాలి. ఆ కాలం హిందీ సినిమాలలో అంటే పాత హిందీ సినిమాలలో హీరోలు అంటే.. అందరికీ ఎక్కువగా దిలీప్ కుమార్, రాజ్ కపూర్, దేవానంద్, ఇంకా షమ్మీ కపూర్, సునీల్ దత్, రాజేంద్ర కుమార్, మనోజ్ కుమార్, ధర్మేంద్ర, రాజేష్ ఖన్నా.. చివరగా అమితాబ్ బచ్చన్ గుర్తొస్తారు. అయితే మనలాగా నటరత్న, నట సామ్రాట్, నట సార్వభౌమ, నటశేఖర, నట భూషణ, రెబల్ స్టార్, మెగాస్టార్ వంటి బిరుదులు వారికి ఉన్నట్లుగా అంతగా మనకు తెలియదు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ‘సూపర్ స్టార్’ అని బిరుదుని తొలుతగా కైవసం చేసుకున్నది రాజేష్ ఖన్నా అని చెప్పాలి. అయితే ఈ నటులందరికి తీసిపోని నటుడు, గట్టిగా మాట్లాడితే అందర్నీ డామినేట్ చేసే నటుడు ఒకడు ఉన్నారు. అయితే ప్రేక్షకులలో పై నటులకు ఉన్నంత ప్రజాదరణ లేదు కానీ హిందీ సినిమాల గురించి నటన గురించి లోతుగా తెలిసిన వాళ్లకు అతడు తెలుసు. అతడు ఎవరంటే..
***
‘మదర్ ఇండియా’ (1957) లో నర్గిస్‌ది ప్రధాన పాత్ర. ఈ నటుడు ఆమెకు భర్తగా నటిస్తాడు. చేతులు కోల్పోయి తన నిస్సహాయత వలన ఆమెకి మరింత భారం కలిగించడం ఇష్టం లేక భార్యాపిల్లల్ని వదిలేసి ఎటో వెళ్లిపోతాడు. ఆ సమయంలో అతను చూపిన మనోవేదన అతడికి మంచి గుర్తింపునిచ్చింది.
‘దిల్ ఆప్నా ఔర్ ప్రీత్ పరాయి’ లో మీనా కుమారిది ప్రధాన పాత్ర. ఆమెను ప్రేమించి విధివశాత్తు వేరొకరిని పెళ్లి చేసుకుని నలిగిపోయిన భర్తగా ఇతడు ఘర్షణని చక్కగా చూపి మెప్పు పొందాడు. ఘరానా (1961), దిల్ ఏక్ మందిర్ (1963), జిందగీ (1964) సినిమాలలో అప్పటికే జూబ్లీ స్టార్‌గా పేరు తెచ్చుకున్న రాజేంద్ర కుమార్‌వే ప్రధాన పాత్రలు. కానీ ఆ చిత్రాలలో సహాయక పాత్రలలో నటించి తనదైన ముద్ర వేసి ‘దిల్ ఏక్ మందిర్’ కి ఉత్తమ సహాయ నటుడుగా ఫిలింపేర్ అవార్డు తీసుకున్నాడు. వక్త్ (1965), హమ్‌రాజ్ (1967) చిత్రాలలో సునీల్ దత్‌వి ప్రధాన పాత్రలు.. కానీ డామినేషన్ ఈ నటుడిదే. అలాగే ‘కాజల్’ (1965) మీనాకుమారి, ధర్మేంద్ర; ‘మేరె హుజూర్’ (1968); మాలా సిన్హా, జితేంద్ర ‘నీల్ కమల్’ (1968); వహీదా రెహమాన్, మనోజ్ కుమార్ ‘పాకీజా’ (1972); మీనా కుమారి, అశోక్ కుమార్ లతో సహాయక పాత్రలే వేసినా ఇతని ప్రభావం మరువ లేనిది.. ఈ విధంగా ఎన్నో సినిమాలలో స్టార్‌డం కలిగిన హీరోల మధ్య నటిస్తూ వారి కన్నా ప్రభావం చూపిన నటనని ప్రదర్శించిన ఈ నటుడు.. ఈ ఇంపాక్ట్ యాక్టర్ రాజ్ కుమార్. అసలు పేరు కుల్‌భూషణ్ పండిట్. 1926 అక్టోబర్ 8 న బెలూచిస్థాన్‍లో జన్మించిన ఓ కాశ్మీరీ పండిట్. హిందీ, ఇంగ్లీష్ మాత్రమే కాదు ఉర్దూ, సంస్కృతం కూడా వచ్చు. 1940 ప్రాంతంలో బొంబాయికి వచ్చేసి సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగంలో చేరాడు.. ఒకసారి 1947-48 కాలంలో ముంబైలో ఒక సినిమా హాల్లో ప్రఖ్యాత దర్శకుడు సోహ్రాబ్ మోడీ పొడవుగా, బలంగా గంభీరమైన స్వరంతో ఉన్న రాజ్ కుమార్‍ని చూసి తన తదుపరి సినిమాలో వేషం ఇవ్వదలిచాడు, కాని రాజ్ కుమార్ తను పోలీసు వృత్తి లోనే కొనసాగుతానని చెప్పి ఆ అవకాశాన్ని నిరాకరించాడు.
కానీ మనసు మార్చుకుని 1952లో ‘రంగీలీ’ సినిమాతో రంగప్రవేశం చేసాడు. అది అపజయం చెందిది. ఆ చిత్రం నుంచి ఒక మూడు నాలుగు సంవత్సరాలు గుర్తింపు లేని పాత్రలు వేసుకుంటూ తిరిగి సోహ్రాబ్ మోడీ వద్దకే చేరి అయన దర్శకత్వంలోని ‘నౌ శర్వాన్-ఈ-ఆదిల్’ (1957) లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు.
అదే సంవత్సరంలో నర్గిస్ ప్రధాన పాత్రగా వచ్చిన ‘మదర్ ఇండియా’లో చిన్న పాత్రలో తన ప్రతిభని చూపి పరిశ్రమలో నిలదొక్కుకోవడం జరిగింది. తరువాత వరుసగా తన కన్నా ముందుగా స్టార్‍డం తెచ్చుకున్న దిలీప్ కుమార్, మీనా కుమారి, రాజేంద్ర కుమార్, సునీల్ దత్ వంటి నటుల చిత్రాలలో సహాయక పాత్రలో నటించి నిలబడటమే కాదు కొందరి దృష్టిలో నటనలో వారి మీద ఆధిపత్యం కూడా చాలా చెలాయించడం జరిగింది. ‘దిల్ ఏక్ మందిర్’ సినిమాలో క్యాన్సర్ పేషెంట్‍గా దాదాపుగా బెడ్ మీద కూర్చునే నటిస్తూ రాజేంద్ర కుమార్, మీనా కుమారి లను మించి నటించి ఉత్తమ సహాయక నటుడుగా ఫిలింఫేర్ అవార్డు తీసుకున్నాడు.
ఏమిటి ఇంపాక్ట్ యాక్టర్ ప్రత్యేకతలు?
1) లోతైన గంభీరమైన స్వరం:
ఆ గొంతు వింటే నటుడు నటన కూడా కనబడిపోతాయి.
2) డైలాగ్ డెలివరీ:
సంభాషణలు పలికే తీరు విభిన్నం. ఇతడి స్వరాన్ని, ఆధిపత్య ధోరణిని దృష్టిలో పెట్టుకొని అతడికి మంచి సంభాషణలు వ్రాసేవారు. అసలు మాములు మాటలకి కూడా కొత్తదనం తెచ్చేలా పలికే తీరుకి గట్టి సంభాషణలు జత పడితే థియేటర్లు మారు మ్రోగిపోయేవి.
- ‘వక్త్’ సినిమాలో తాను దొంగనని అందరికి చెబుతానని బ్లాక్మెయిల్ చెయ్యబోయిన దొంగల బాస్ రెహ్మాన్‌తో “చెనాయ్ సేఠ్.. గాజు ఇళ్లలో నివసించే వాళ్ళు ఇతరుల మీద రాళ్ళు వెయ్యలేరు” అని సమాధానం ఇచ్చి తన మీదకు కత్తి దూసిన మదన్ పూరితో “ఇది పిల్లలు ఆడుకొనే బొమ్మ కాదు చెయ్యి తెగితే రక్తం వస్తుంది.” అని తీసిపారెయ్యడం.
- ‘సౌదాగర్’ సినిమాలో “చంపాల్సి వస్తే నేనే చంపుతాను. కానీ అప్పుడు తుపాకి నాదే అవుతుంది, బులెట్ నాదే అవుతుంది సమయము నాదే.”
- ‘మర్తె దమ్ తక్’ లో “నిన్ను నేనే చంపుతాను. నీ అంతం నా చేతులలోనే. అయితే అప్పటి వరకు బ్రతికుండు.”
ఇలాంటివి ఒక వైపైతే
- ‘హీర్ రాంజా’ సినిమాలో “ఈ భూమికి చావు లేదు, ఆ ఆకాశానికి అంతం లేదు. నేను మరణిస్తాను నువ్వు మరణిస్తావు కానీ మన ప్రేమ మరణించదు.”
- ‘పాకీజా’ సినిమాలో ట్రైన్లో నిద్రపోతున్న మీనాకుమారి పాదాలకేసి చూస్తూ చెప్పిన ‘‘నేను నీ పాదాలను చూసాను. చాల అందంగా వున్నాయి. వీటిని నేల మీద పెట్టకు, మురికి అయిపోతాయి”
వంటి ఈ డైలాగులు హిందీ సినిమాలలో అత్యంత రొమాంటిక్ వాక్యాలుగా నిలిచి పోయాయి.. ఇవన్నీ అతడిని ‘కింగ్ ఆఫ్ డైలాగ్స్’ని చేసాయి.
3) స్క్రీన్ ప్రెజెన్స్:
తెర మీద కనబడితే చాలు, అతడి స్క్రీన్ ప్రెజన్సే అతడి పెర్‌ఫార్మన్స్ అన్నారు. అతడు సీన్‌లో ఉంటేనే చాలు. తన స్టయిల్, నడక, వస్త్రధారణ, చూపులు చాలు. ‘వక్త్’ సినిమా నుంచి అతడికి తెల్లటి బూట్లను వేసుకోవడం అలవాటు. ‘హామ్‌రాజ్’ లో అతడు కనబడేది చాలా తక్కువసేపు. అందులో అతడి బూట్లే నటిస్తాయి. సీన్లోకి ప్రవేశించటం మీద చాలా శ్రద్ధ కనబడుతుంది.. ఉదాహరకి ‘పాకీజా’, ‘వక్త్’ సినిమాలు. ‘వక్త్’ లో “కౌన్ ఆయా” పాటలో తలుపు తీసుకోని ప్రవేశంచటం చూస్తే ఆ పాత్రలోని అతడి లోని ‘డెవిల్ మే కేర్’ ధోరణిని చూపిస్తుంది.
4) అద్భుతమైన భావాల పలికింపు:
మనో వేదన, బాధ, ప్రేమ, అసహనం, అసూయ, త్యాగం వంటి భావాలని అద్భుతంగా పలికిస్తాడు. ముఖ్యంగా తాను ప్రేమించిన వ్యక్తి వేరే వారిని ప్రేమిస్తోందని తెలిసినప్పుడు సందర్భాన్ని బట్టి అసూయని, అసహనాన్ని. నిరాశని, త్యాగాన్ని కూడా చక్కగా చూపించగలడు. ‘హీర్ రాంజా’ లో “ఏ దునియా ఏ మెహఫిల్ మేరె కామ్ కి నహీ” అంటూ సాగే రఫీ పాటలో భగ్న ప్రేమికుడి వేదనని అద్భుతంగా అభినయించాడు.
5) బలమైన వ్యక్తిత్వం:
పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా చేసిన అనుభవం ఆయన వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసాలని రెట్టింపు చేసింది.. గోల్ఫ్ ఆడతాడు. గుర్రపు స్వారీ చేస్తాడు. సెట్ లోపల సెట్ బయట డామినేటింగ్ ధోరణినే ప్రదర్శించటం అతని నైజం. ‘నేను నమ్మినవే చేస్తాను, చేసినవి నమ్ముతాను’; ‘నేను ఒక్కడినే ఉండొచ్చు కానీ ఒంటరి వాడిని కాను’ అని ఇంటర్వ్యూ లలో చెప్పాడు.
సినిమాలు పరాజయం చెందినప్పుడు నటులు పారితోషికం తగ్గించడం లేదా అలాగే ఉంచటం చేస్తారు.. ఈయన తన సినిమాలు ఫెయిల్ అయినా పారితోషికం పెంచేవాడు. అదేమని అడిగితె సినిమా ఫెయిల్ అయింది, దానికి కారణం దర్శకుడు. నేను ఫెయిల్ అవలేదు అని చెప్పేవాడు.
ఒక ఆంగ్ల సినిమా పత్రిక హిందీ సినిమాలలోని స్టార్స్ గురించి చెబుతూ అతడు తోటి నటులపై చూపే అధిపత్యపు ధోరణిని దృష్టిలో పెట్టుకొని అతడిని ‘ఏ స్టార్ విత్ ఏన్ ఎడ్జ్’ గా అభివర్ణించింది.
తన సీన్‌కి వేసిన సెట్ నచ్చకపోతే లేచి వెళ్లిపోయేవాడు. నిర్మాత బ్రతిమాలుకుని మరో రోజు షూటింగ్ పెట్టుకొనేవాడు. అలాంటివి చూసి ఒక పత్రిక ఇతడిని “నిర్మాతల తలనొప్పి, పంపిణీదారుల ఆనందం” అని వర్ణించింది.
లోపాలు:
- మనిషి దేవానంద్ లాగా ధర్మేంద్ర లాగా అందగాడు కాదు. అసలు మామూలుగా హీరోకి వుండే రూపం లేదు.
- నటుడిగా ఎంత పేరు వచ్చిన కధానాయకుడిగా విజయాలు చాల తక్కువ. ఇద్దరు ముగ్గురు నటుల మధ్యన పెడితే వాళ్ళని డామినేట్ చేస్తాడు. కానీ సింగల్ హీరోగా రాణించలేదు.
- రొమాంటిక్ హీరో ఇమేజ్ లేదు. పాటలు యుగళ గీతాలు తక్కువ. ఎక్కువగా సీరియస్ రోల్స్
- అతి ఆత్మవిశ్వాసం. ఇతరుల్ని చులకన చెయ్యడం. కొన్ని నవ్వు పుట్టిస్తాయి. కానీ కొన్నిటి వలన ఆయనే నష్టపోయిన సందర్భాలు వున్నాయి. ఉదాహరణకి:
- ఒకసారి అప్పటికే హీరోయిన్గా వున్న జీనత్ అమన్‌ని చూసి “బాగానే వున్నావు సినిమాలలో ప్రయత్నించు..” అనడం
- రకరకాల ఆభరణాలతో కనిపించే సంగీత దర్శకుడు బప్పి లహరిని చూసి “మంగళ సూత్రం ఒక్కటే తక్కువ..” అనడం
- ‘జంజీర్’ సినిమాలో నటించమని అడగడానికి దర్శకుడు ప్రకాష్ మెహ్రా వెళ్లినప్పుడు ఆ దర్శకుడి మొహం నచ్చలేదని తిరస్కరించడం.. (ఆ సినిమా అమితాబ్ కి వెళ్ళింది).
***
ఇలాంటివి వినబడినా అతడితో బాగా పరిచయం వున్నవాళ్ళు అతడితో మాట్లాడటాన్ని బట్టి – అతడి ధోరణి అలా ఉంటుందని, అతడు బాగా చదువుకొన్నవాడని, మంచివాడని; ఒక్కోసారి కావాలనే ఆలా ప్రవర్తిస్తాడని చెబుతారు.
ఆత్మవిశ్వాసానికి, అహంకారానికి మధ్య చిన్న గీత వుంది. ఆత్మన్యూనతా భావం కలిగిన వాళ్ళకి ఆ గీత కనిపించదు.
అతడి స్వీయ కేంద్రీకృత ధోరణికి ఒక ఉదాహరణ: ఏ గొంతు అయితే అతడిని ‘డైలాగ్ కింగ్’ చేసిందో, అదే గొంతు క్యాన్సర్‌కి గురి అయింది.
అతడిని పరామర్శించడానికి వెళ్లిన వాళ్లతో “రాజ్ కుమార్ పోతే పెద్ద జబ్బుతో పోతాడు కాని జలుబుతో పోడు” అన్నాడట.
అన్నట్లు గానే జులై 3 19996 న అయన గొంతు శాశ్వతంగా మూగబోయింది.
***
కొసమెరుపు
కధలకి కొసమెరుపులుంటాయి. జీవితానికేమిటి అనుకొంటున్నారా. జానీ రాజ్ కుమార్ జీవితానికి కొసమెరుపు లేకపోతే ఎలా?
తాను చనిపోయినప్పుడు చనిపోయిన విషయం సినిమా వాళ్లకు చెప్పొద్దని; ఆ విషయం బయటకు ప్రొక్కి సినిమా వాళ్ళు తమాషా సంతాపాలు మొదలు పెట్టకుండానే కేవలం దగ్గర వాళ్ళ మధ్య అంత్యక్రియలు జరిపించేయమని కుటుంబ సభ్యలను కోరాడట. వాళ్ళు అలాగే చేసారు.
***
తమకి తామే ఏదో స్టార్ అని కీర్తించుకొనే రోజులలో రియల్ యాటిట్యూడ్ స్టార్, ఇంపాక్ట్ యాక్టర్.. రాజ్ కుమార్ మాత్రమే.
(సమాప్తం)
పొన్నాడ సత్య ప్రకాశ రావు కథకులు, కవి. వీరివి ఇప్పటి వరకు 1 నవల, 4 ధారావాహికలు, 78 కథలు, 150 కి పైగా కవితలు, వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురించబడినవి. వీరి నవల ‘ఊరు పొమ్మటోoది’ 2002 సంవత్సరం స్వాతి మాస పత్రిక అనిల్ అవార్డును,. మరి పది కథలు వివిధ పోటీలలో బహుమతులు ను గెలుచుకొన్నవి. వీరి నవలను సాహితీ ప్రచురణల వారు విజయవాడ, కథల సంపుటాన్ని చినుకు ప్రచురణల వారు విడుదల చేసారు .వీరికి విశ్వదాత కల్చరల్ ఫౌండేషన్, ఎలకుర్రు వారు 2023 సంవత్సరానికి ‘విశ్వదాత’ దేశోద్దారక నాగేశ్వర రావు పురస్కారాన్ని అందచేశారు.

