భరతమాతకి భక్తిపూర్వకంగా వందనాలిడుతూ దేశభక్తిగీతాలను ఆలపించారు తెలంగాణ అల్పసంఖ్యాకుల గురుకుల పాఠశాల విద్యార్థినులు. ఆడపిల్లలకు చదువు అనవసరం అని భావించేవారు, సంతకం పెట్టే స్థాయి చదువు ఉంటే చాలు అని నిర్ణయించేవారు ఈ రోజుల్లోనూ ఉండడం బాధాకరం. అలా ఆలోచించే తల్లితండ్రులకు చదువు విలువని గూర్చి వివరిస్తూ ఆడపిల్లలను రెసిడెన్షియల్ హాస్టల్లో చేర్పించేందుకు పెద్దఎత్తున ప్రయత్నిస్తున్నారు పాఠశాల అధ్యాపకులు.
ప్రతీ సంవత్సరం ఆవిధంగా పిల్లలను పాఠశాలలో చేర్చుకుంటూ వారి కుటుంబాలను చైతన్యపరిచే ప్రయత్నం చేస్తున్నారు లక్డీకాపూల్లో టెలిఫోన్ భవన్‌కి ఎదురుగా వున్నపాఠశాల సిబ్బంది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని గణనీయంగా చేసి దేశభక్తి బాల్యంనుండే పెంపొందేలా విశ్వప్రయత్నం చేస్తూ చాలా చక్కటి కార్యక్రమాన్ని చేశారు. ఆడపిల్లలని పాఠశాలలకు పంపి వారిని విద్యావంతులను చెయ్యాలన్న తమ ప్రయత్నం సజావుగా కొనసాగేలా చూడమని ఇలా స్కూల్లో చేర్చిన ఏడాదికే వారి చదువు మాన్పించవద్దని తల్లి తండ్రులకు మరీమరీ చెప్పారు ప్రిన్సిపాల్. పడ్ లిఖ్ కర్ హమ్ బడే మహాన్ పాటని జోరుగా అందుకున్నారు పిల్లలు. పాటలోని పల్లవిలో లాగే వారందరూ చదువుకుని వృద్ధిలోకి రావాలని ఆశిద్దాం.
– సూర్యకిరణ్