[ప్రసిద్ధ హిందీ కవి నీరజ్ గారి గురించి వారి కుమారుడు వ్రాసిన వ్యాసాన్ని అనువదించి అందిస్తున్నారు డా. టి. సి. వసంత.]
జ్ఞాపకాలు గాలి వీస్తున్నట్లు వస్తూనే ఉంటాయి. ఎన్నో ఎన్నెన్నో క్షణాలు – నిమిషాలు కాలం అనే జల్లెడలో జల్లెడ పట్టబడి ఎన్నో ఎన్నెన్నో నిమిషాలు – క్షణాలని లాక్కోంటూ నిరంతరం మా దగ్గరికి వస్తాయి. అసలు వీటికి మొదలు ఉండదు. చివరా ఉండదు.
నది ఒడ్డున తిరుగుతూన్నప్పుడు, ఉదయిస్తున్న సూర్యుడితో పాటు, ఎగురుతున్న గాలిపటాలను చూస్తున్నప్పుడు, పటపటలాడిస్తూ రెక్కల చప్పుడుతో పావురాలు ముంగిట్లో వాలినప్పుడు ఎన్నో ఎన్నెన్నో స్మృతులు సజీవం అయిపోతాయి. నిజానికి ఈ జ్ఞాపకాలు మీ చుట్టూ నిరంతరం తిరుగుతూ ఉన్నప్పుడు మన నిత్య జీవితంతో పాటు అవీ జీవిస్తూనే ఉంటాయి. ఇట్లాగే మా నాన్న నీరజ్ గారు అసలు నన్ను విడిచి పెట్టి ఎప్పుడూ వెళ్ళిపోలేదని నాకు అనిపిస్తుంది. కేవలం వారి శరీర రూపంలో నా దగ్గర లేరు. కానీ వారు ఒక అలవాటుగా నా జీవితంలో ఆనాటి నుండి ఈనాటి వరకు నాతో పాటే ఉన్నారు. ఆయనతో గడిపిన సమయం నన్ను ఎప్పటికీ మేల్కోనేటట్లుగా చేస్తూనే ఉంటుంది. నాకు ప్రేరణ కలిగిస్తూనే ఉంటుంది. ఆ క్షణాలన్నీ నాకు చేతికర్ర లాంటివి. కొన్ని సంవత్సరాల క్రితం మేమ రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక మరచిపోలేని, మరపురాని సంఘటన జరిగింది. జీవితాన్ని అతి దగ్గరిగా చూసే అవకాశం నాకు లభించింది.
దాదాపు 30 సంవత్సరాల క్రితం నాకు, మా నాన్నగారికి జబల్‌పూర్ కవి సమ్మేళనానికి ఆహ్వానాలు అందాయి. రచయిత మధురా జైన్ ఆహ్వానాలను పంపించారు. ఆయనే ఆ కార్యక్రమానికి సెక్రటరీ. మేము ట్రైన్‌లో బయలుదేరుదామనుకుంటున్నాము. ఇంతలో నాన్నగారికి జ్వరం వచ్చింది. ఆయన రాలేను అని అన్నారు. కాని నేనే “మీతో నేనున్నానుగా ఏమీ కాదు, పదండి” అని ధైర్యం చెప్పాను. ఇంట్లో విశ్రాంతి తీసుకున్నారు. కాని సాయంత్రం వరకు జ్వరం తగ్గలేదు. జ్వరం తోటే ఆయన కవితని పఠించారు. నేను కవిసమ్మేళనంలో పాల్గొన్నాను. ట్రైన్‌లో ఆగ్రాకి తిరిగి రావాలి. నాన్నగారు తీవ్రమైన జ్వరం తోటే రైలెక్కారు. ఆయనకు సెకెండ్ ఎ.సి.లో సీటు దొరికింది. నాకు సెంకండ్ క్లాస్‌లో. మేమిద్దరం ఒకే ట్రైన్‌లో ప్రయాణం చేస్తూ వేరు వేరు కంపార్ట్‌మెంట్స్‌లో కూర్చోవాల్సి వచ్చింది.
నాన్నగారి ఆరోగ్యం ఏ మాత్రం బాగోలేదు. రైలు స్టేషన్‌లో ఆగినప్పుడల్లా నేను దిగి నాన్నగారి కంపార్ట్ మెంంట్‌కి వెళ్ళి వారిని చూసి వచ్చేవాడిని. రెండు గంటలయింది. నాలో ఆందోళన ఎక్కువ అయింది. రాత్రి దాదాపు పదిన్నరకి స్టేషన్ రైలు ఆగింది. నేను నాన్నగారిని చూడడానికి వెళ్ళాను.
ఆయన తెల్లటి శాలువ కప్పుకుని ఉన్నారు. నన్ను చూసారు. “ఇక ఇప్పుడు ఏ స్టేషన్‌లో రైలు ఆగినా నన్ను చూడడానికి రాకు. ఎందుకంటే ఎ.సి. కంపార్ట్‌మెంట్ తలుపులు మూసేస్తారు. నిన్ను ఎక్కనివ్వరు. ఒకవేళ వచ్చినా నేను చెప్పేది విను. నా ఆరోగ్యం అస్సలు ఏ మాత్రం బాగోలేదు. శ్యామ్! (ఇంట్లో పిలిచే పేరు) ఒక వేళ నేను కాలం చెందితే నన్ను ముట్టకుని చూడు. కాని ఏ మాత్రం ఏడవవద్దు. ఎందుకంటే నువ్వు ఏడిస్తే యాత్రికులందరికి నేను చచ్చిపోయానని తెలుస్తుంది. కంప్లైయింట్ ఇస్తారు. రైల్లో డెడ్ బాడీ ఉందని వచ్చే స్టేషన్లో దింపేస్తారు. రాత్రవుతుంది. ఇక Post-mortem, Death Certificate, Identification, Police మొదలైన గొడవలు మొదలవుతాయి. నీవు వీటన్నింటిని ఫేస్ చేయాల్సి వస్తుంది. Dead Body ని టాక్సీలో ఆగ్రాకి తీసుకు రావాల్సి వస్తుంది. అందుకని నా శవాన్ని చూసినా ఏడవకుండా మౌనంగా ఉండు. ఆగ్రా స్టేషన్ వచ్చేదాకా ఎదురు చూడు.” అన్నారు.
జీవితంలో ఇవన్నీ అమూల్యమైన క్షణాలు. ఈ క్షణాలు తండ్రి కొడుల మధ్య! స్నేహితుడు స్నేహితుడి మధ్యా! గురుశిష్యుల మధ్య! భగవంతుడు భక్తుడి మధ్యా! ఏమో తెలియని క్షణాలు గడిచి పోయాయి. ఇరవై నాలుగు గంటలూ, అంటే ఎప్పుడూ ఎంతగా మెలుకువగా ఉండేవారో తెలియదు. ఇప్పుడు వారు చెప్పిన మాటలన్నీ నాకు సూక్తులు అయ్యాయి. ఎన్నేన్ని మంచి మాటలో, అవన్నీ చద్దిమూటలు!
