Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఇంకో విద్య తెలిసుండాలి

[బాలబాలికల కోసం ‘ఇంకో విద్య తెలిసుండాలి’ అనే కథ అందిస్తున్నారు కంచనపల్లి వెంకట కృష్ణారావు.]

నేదనూరు పాఠశాలలో ఉపాధ్యాయుడు రంగనాథం గారు పిల్లలకు కేవలం పాఠాలు చెప్పటమే కాకుండా భవిష్యత్తులో జీవితానికి పనికి వచ్చే అనేక విషయాలు, మెళకువులు, కథలు బోధించేవారు.

అందుకే ఆయనంటే పిల్లలకు ఎంతో అభిమానం.

ఆయన ఒకసారి పిల్లలో ఏఏ ప్రత్యేకతలు ఉన్నాయి? వాళ్ళు ఏ కళల్లో రాణించగలరు మొదలైన అంశాలు పరిశీలించి వారిని ఆయా అంశాల్లో బాగా కృషి చేయమని ప్రోత్సహించారు.

ఆ విధంగా తమకు తెలిసిన కళ గానీ ఆసక్తి కలిగిన ఏవిషయం మీద కృషి చేస్తే అవి జీవితంలో ఉపయోగపడటమే కాకుండా, ఉద్యోగాలు సంపాదించుకోవడానికి సంఘంలో మంచి పేరు తెచ్చుకునేందుకు అవకాశం ఉంటుందని చక్కగా వివరించారు.

తరగతిలో ఉన్న వాసు లేచి నిలబడి, “సార్ నాకు ఈతంటే చాలా ఇష్టం సార్ పెద్దయ్యాక ఈతపోటీల్లో పాల్గొంటాను” అని కళ్ళలో కాంతి నింపుకుని చెప్పాడు.

“తప్పకుండా కృషి చేయి ఈత వలన ఆరోగ్యం మానసిక అభివృద్ధి ఉంటాయి” అని ప్రోత్సహించాడు.

వాసు మిత్రుడు తరగతిలో సహపాఠి అయిన రమణ “ఈత ఎందుకురా అదేమైనా ఉద్యోగం సంపాదించి పెడుతుందా, ఏదో సరదాకి నేర్చుకోవాలంతే” అని నిరుత్సాహపరిచాడు.

“ఏమోరా నాకు ఈతంటే ప్రాణం” చెప్పాడు వాసు. అదే పాఠశాలలో రమణ తమ్ముడు శేషు కూడా చదువుతున్నాడు.

అలా రోజులు గడిచి పోతున్నాయి. రంగనాథం సార్ చెప్పినట్టు పిల్లలు చదువే కాక వాళ్ళకు నచ్చిన విషయాల్లో కృషి చేయసాగారు.

వాసు ఈత బాగా నేర్చుకుని రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఈతగాడిగా పోటీలో రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి బహుమతి స్వీకరించాడు.

రమణ కూడా వాసు కృషిని మెచ్చుకున్నాడు.

ఒకరోజు వాసు, రమణ, శేషు చెరువు వద్దకు వెళ్ళారు. అలా అందరూ మాట్లాడుకుంటుండగా రమణ తమ్ముడు శేషు చెరువులోకి దిగాడు. అతనికి ఈత రాదు! అందుకే మునిగిపోసాగాడు! వెంటనే వాసు చెరువులోకి దూకి శేషుని రక్షించాడు. ఈ సంఘటన అక్కడ ఉన్న సి.సి. కెమారాలో నిక్షిప్తమయింది. దానిని పోలీసు వారు రాష్ట్రపతికి పంపారు. రాష్ట్రపతి వాసుకి రిపబ్లిక్ దినోత్సవం రోజున సాహస బాలుర బహుమతి ప్రకటించారు. రమణ వాసూని ఎంతో మెచ్చుకున్నాడు.

***

కొన్ని సంవత్సరాలు గడిచాక వాసూకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం క్రీడల కోటాలో వచ్చింది.

వాసుని చూసి ఎంతోమంది స్ఫూర్తి పొందారు.

ఆ విధంగా వాసు ఈత ప్రతిభ అతను చదివిన పాఠశాలకు, ఊరికి, అతని కుటుంబానికి మంచి పేరు తెచ్చింది.

రంగనాథం సార్‌ని వాసు సన్మానించి శాలువ కప్పి గౌరవించాడు.

Exit mobile version