[సంచిక కోసం కవి, రచయిత, విమర్శకుడు డా. ఏనుగు నరసింహారెడ్డి గారితో సంచిక టీమ్ జరిపిన ఇంటర్వ్యూ ఇది.]
డా. ఏనుగు నరసింహారెడ్డి తెలంగాణకు చెందిన కవి, రచయిత, సాహిత్య విమర్శకుడు, అనువాదకుడు. 2017 నుండి 2020 వరకు తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఉద్యోగం, కవిత్వం తనకు పరస్పర పూరకాలనే డా. ఏనుగు నరసింహారెడ్డి గురించి వారి మాటల్లోనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
~
సంచిక టీమ్: నమస్కారం డా. ఏనుగు నరసింహారెడ్డి గారూ.
డా. ఏనుగు నరసింహా రెడ్డి: నమస్కారం.
~
ప్రశ్న. మీకు సాహిత్య స్పృహ ఏ వయసులో కలిగింది? ఎలా కలిగింది?
జ: ఈ ప్రశ్నకి జవాబు సరిగ్గా చెప్పలేను అని చాలా సందర్భాల్లో ఫీలయ్యాను. ఎందుకంటే నేను మొదట నాలుగో తరగతిలో ఉన్నప్పుడు ఎలా వచ్చాయో తెలియదు, ఒక పాటలాంటి నాలుగు వాక్యాలు
‘చిన్ని చిన్ని నా చిట్యాల
పెద్దపెద్ద నా చిట్యాల
గూడాలతో నిండిన చిట్యాల
గట్టిగ ఉంది భలే పొట్టిగా ఉంది
దీనికి డిమాండ్ ఎక్కువైంది
ముత్యాలమ్మ గూడాన్ని చిట్యాలగా చేసి
ఇందిరా నగర్‌ను అందుకు చేసి
సంజీవ నగర్‌ను అందుకు చేసి
గొప్పగ పోల్చిన చిట్యాలను
చిన్ని చిన్ని నా చిట్యాల
పెద్దపెద్ద నా చిట్యాల’
అని నాలుగవ తరగతి లీజర్ పీరియడ్‍లో ఒక్కొక్కరు ఒక్కో కథ గాని పాట గాని చెప్పాలని ఆనాటి మా పీఈటీ పిచ్చయ్య సార్ అడిగితే ఆయన ముందు చెప్పాను. ఇది గజిబిజిగా అల్లిన నా మొదటి కవిత. దీన్ని విన్న మా పీఈటీ సార్ నన్ను బాగా తిట్టాడు. “ఏం పాట రా అది. చిన్ని చిన్ని నా చిట్యాల అని నువ్వే అంటావ్. పెద్ద పెద్ద నా చిట్యాల అని నువ్వే అంటావు. ఏమైనా బ్రెయిన్ ఉందా?” అన్నాడు. చాలా సిగ్గు పడిపోయి ఇంకా అప్పటినుండి అలాంటి ప్రయత్నం చేయకుండా మానుకున్నాను.
కానీ నేను తొమ్మిదవ తరగతిలో ఉన్నప్పుడు బాలజ్యోతి అనే మాస పత్రికలో నవలల పోటీ ప్రకటన వచ్చినప్పుడు ‘ఊరు మారింది’ అని ఒక పెద్ద నవల రాసి బాలజ్యోతికి పంపాను. ఆ నవలకు ధృవపత్రం లాంటిది పేరెంట్స్ గానీ, స్కూల్ హెడ్మాస్టర్ గానీ ఇవ్వాలని అన్నప్పుడు మా స్కూల్ హెడ్మాస్టర్ దగ్గరికి వెళ్లి ఈ నవలకు ధృవపత్రం ఇవ్వండి అని అడిగాను. దానికి ఆయన ఒకరోజు ఆ నవలలను తన దగ్గర ఉంచుకొని మొత్తం చదివి మరుసటి రోజు వచ్చి నాకు ధృవపత్రం ఇస్తూ నన్ను చాలా మెచ్చుకున్నారు! “చాలా పెద్ద నవల! ఎంత విస్తృతంగా రాసావురా” అని మెచ్చుకొని నాలో కొత్త ఉత్సాహాన్ని రేపాడు. ఆ తర్వాత పదవ తరగతిలో ‘సినీ యాక్టర్‌ని’ అని మరో నవల రాశాను. అయితే ఈ రెండు కూడా పూర్తిగా సినిమాల ప్రభావంతో రాశాను. పదో తరగతిలో ఉన్నప్పుడు చాలా సినిమా పాటలకు పేరడీలు కూడా రాశాను. ‘ఓ హృదయం లేని ప్రియురాలా’ అన్న పాటకు, ‘ఓ ఇంకైపోయిన పెన్నూ అని, ‘ఓ లమ్మి తిక్క రేగిందా? ‘అనే పాటకు’ ఓ పెన్నూ కోపం వచ్చిందా!’ అని చాలా పేరడీలు రాశాను. ఇలా టెన్త్ క్లాస్‍కు లోపల రాసిన రచనలకు వేరే ప్రేరణ ఏదైనా ఉందా అంటే? అది కేవలం మాస పత్రికలు చదవడం వల్ల వచ్చిన ఆలోచన మాత్రమే. స్కూలు లైబ్రరీలో కనిపించే చందమామ, బాలజ్యోతి, బాలమిత్రలు మాత్రమే నన్ను రాయడానికి పురి గొల్పాయి. కొంతలో కొంత మా తెలుగు మాస్టారు దుర్గయ్య సార్ ప్రభావం కూడా ఉందని చెప్పవచ్చు. చంద్రారెడ్డి అనే తెలుగు మాస్టారు కూడా పద్యాల్ని రాసే పద్ధతిని చెప్పినప్పుడు మరుసటి రోజే ఒక పద్యం రాసుకుపోయి చూపించి అందులో ఉన్న తప్పులకు తిట్లు తిన్నాను. ఇవి నా తొలి రాతల ముచ్చట్లు.
ప్రశ్న: ఆరంభంలో సాహిత్య సృజనలో మీకు ప్రేరణ ఎవరు? ఏయే కవులు/రచయితలను మీరు ఆదర్శంగా తీసుకున్నారు?
జ: తొలి రోజుల్లో నేను ఎక్కువగా చదివింది కుప్రీన్, టాల్‍స్టాయ్ లాంటి రష్యన్ రచయితల అనువాదాలు. తెలుగులో శ్రీశ్రీ, దేవరకొండ బాలగంగాధర్ తిలక్ లాంటి కవుల రచనలు నాకు దొరికాయి. వీళ్లు నా మీద కొంత ప్రభావాన్ని చూపించారు. తెన్నేటి హేమలతా దేవి, యండమూరి లాంటి వాళ్ళ నవలలు కూడా చదివాను కానీ అవి పెద్దగా నా మీద ఏ ప్రభావమూ చూపలేదు. మాదిరెడ్డి సులోచన నవలలు మాత్రం నాకు నచ్చాయి. అయితే ఏ ఒక్క రచయిత నా మీద బలమైన ప్రభావాన్ని చూపించినట్లు నేను చెప్పలేను. అలా చెప్పవలసి వస్తే ఇటీవలి కాలంలో చదువుకున్న అనువాద రచనలు మాత్రం నా మీద చాలా ప్రభావం చూపించాయి.
ప్రశ్న: సాహిత్య సృజనలో మీ లక్ష్యం ఏమిటి?
జ: మనుషుల మధ్య అనుబంధాలు మెరుగుపడితే చాలు అనేది తాత్కాలి లక్ష్యం. ఆర్థిక వ్యత్యాసాలు పూర్తిగా సమసిపోయి సమ సమాజం ఏర్పడాలనేది ఒక బలమైన కోరిక.
ప్రశ్న: మీరు కవిత్వం వ్రాస్తున్నారు. దానితో పాటే, కవిత్వ విమర్శ కూడా చేస్తున్నారు. ఇటు సృజన, అటు కాల్పనికేతర రచన. ఈ రెంటి నడుమ సమతౌల్యం ఎలా సాధిస్తున్నారు?
జ: నేను కవిని. వచన కవిని. కానీ సందర్భావసరాలను బట్టి ఛందోబద్ధ పద్యాలు రాసాను. రుబాయిలు కూడా రాసాను. అవసరం డిమాండ్ చేసినప్పుడు విమర్శ కూడా రాశాను. అలానే కొన్ని అనువాదాలు కూడా చేశాను. కొన్ని కవితలను కూడా అనువాదం చేసినప్పటికీ ప్రధానంగా నాన్ ఫిక్షన్ అనువాదమే చాలామందికి రీచ్ అయింది. కాలం డిమాండ్ చేసిన రచనల్ని చేయడం నా బాధ్యతగా భావించాను. ‘తెలంగాణ రుబాయిలు’, ‘హైదరాబాద్ విషాదం’ అలా వచ్చినవే. సమన్వయం చేసుకోవడంలో నాకు పెద్ద సమస్య ఏమీ లేదు.
ప్రశ్న: మీ కవిత్వ పుస్తకాల గురించి చెప్తారా?
జ: నేను 9 కవితా సంపుటాలు ప్రచురించాను. అందులో ఆరు వచన కవితా సంపుటాలు. అవి: సమాంతర స్వప్నం, నేనే, కొత్త పలక, మూలమలుపు, నీడల దృశ్యం, పూలపూల వాన. మట్టి పాట, ఏడుకోలల బాయి పద్యాలు. తెలంగాణ రుబాయిలు, రుబాయిలు.
ప్రశ్న: మీ కాల్పనికేతర రచనల గురించి చెప్పండి.
జ: విమర్శలు – అంతరంగం, సమాహార, ఊహల వేదిక, వ్యక్తావ్యక్తం, తెలుగు హిందీ జాతీయోద్యమ గీతాలు, గుర్రం జాషువా డిలాన్ థామస్ కవిత్వంలో బాల్యం. ఇవి కాక రెండు అనువాదాలు చేశాను. అవి ‘హైదరాబాద్ విషాదం’, ‘అసఫ్జాహీ సంస్థానం విలీన గాథ’. నేను రెవెన్యూ శాఖలో పనిచేస్తూ దాని సంస్కరణల కోసం ‘తెలుగు రాష్ట్రాల రెవెన్యూ వ్యవస్థ నిన్న, నేడు, రేపు’ అని గ్రంథం కూడా రాసాను. ఇవన్నీ కాల్పనికేతర రచనలే.
ప్రశ్న: మీరు అనువాదకులు కూడా. అనువాద పుస్తకాల గురించి, అనువాదంలో మీ అనుభవాల గురించి వివరిస్తారా?
జ: నేను హిందీ నుండి ఇంగ్లీష్ నుండి కొన్ని కవితలను అనువాదం చేసినప్పటికీ అవేవీ పుస్తక రూపం ధరించలేదు. కాబట్టి నేను చేసిన రెండు అనువాద గ్రంథాలు పైన వివరించిన ‘హైదరాబాద్ విషాదం’, ‘అసఫ్జాహీ సంస్థానం విలీన గాథ’ అన్న రెండే చెప్పుకోదగ్గవి. మొదటి పుస్తకం అనువాదం చేసినప్పుడు కొందరు అది అక్కరలేని అనువాదం అన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచినట్లు అనిపించి, దానికి కౌంటర్ పార్ట్ లాగా ఉండే మరొక అనువాదం ‘అసఫ్జాహీ సంస్థానం విలీన గాథ’ను చేశాను. ఈ రెండింటినీ చేస్తూ ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన లోతైన విషయాలను తెలుగువారికి అందుబాటులోకి తెచ్చానన్న సంతృప్తి మాత్రం ఉండేది. మూల విధేయ అనువాదాన్ని చేస్తూనే తెలుగులో ఒరిజినల్ గ్రంథంలాగా తీసుకొచ్చావు అని చాలామంది ప్రశంసించడం నాకు నచ్చింది.
ప్రశ్న: మీరు సాహిత్య రంగంలో చురుకుగా సృజిస్తున్నా ప్రభుత్వంలో ఉన్నతోద్యోగంలో ఉన్నారు. ఉద్యోగ బాధ్యతలకూ, సృజనాత్మక ఆకాంక్షలకూ నడుమ సమతౌల్యం ఎలా సాధిస్తున్నారు?
జ: నాకు ఉద్యోగం తర్వాత వ్యక్తిగతమైన వ్యాపకాలు ఏమీ లేవు. చదవడం రాయడం అనే రెండు కార్యకలాపాలు మాత్రమే ఉంటాయి. దానికి తోడు నా ముందు జరిగే అపసవ్యతలను సహించలేని ఒక ఆవేశపూరితమైన మనస్తత్వం ఉంటుంది. అందువల్ల ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు కలిగే అనుభవాలను కూడా నేను సాహిత్యంలోకి తీసుకురాగలిగాను. సాహిత్యకారులు మాత్రమే రాయలేని గ్రంథాలను కొన్నింటిని నేను రాయగలిగాను అంటే అది ఉద్యోగంలో ఉండే వినూత్నత వల్ల. అందువల్ల ఉద్యోగం నాకు ఏ రకంగా అడ్డంకిగా నేను భావించకూడదు అనుకున్నాను. అలాగే నడిపిస్తున్నాను. ఇంకొక విధంగా సాహిత్యం కూడా నా ఉద్యోగానికి స్పందనతో కూడిన తడిని అందిస్తూ ఉన్నది. ఆ విధంగా చూసినప్పుడు ఉద్యోగాన్ని నేను మరింత మెరుగైన పద్ధతి ద్వారా చేయడానికి కూడా సాహిత్యం నాకు సహకరిస్తున్నట్లే లెక్క. ఇలాంటి ఉద్యోగంలో లేకుంటే రచనల్లో ఇంత కొత్త వస్తువులు వచ్చి ఉండేవి కాదు. ఈ రచనా వ్యాసంగం లేకపోతే ఉద్యోగాన్ని ఇంత హ్యూమన్ టచ్‌తో నేను చేయగలిగే వాడిని కాదు. సాహిత్యం ఉద్యోగం నాకు పరస్పర పూరకాలు.
ప్రశ్న: గతంలో మీరు తెలంగాణా సాహిత్య అకాడెమీకి సెక్రెటరీగా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు డిపార్ట్‌మెంట్ ఆఫ్ కల్చర్‌కు డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ రెండు అత్యంత క్లిష్టమైన, అత్యంత సృజనాత్మకమైన బాధ్యతల నిర్వహణలో తేడాలేమిటి?
జ: సాహిత్య అకాడమీ కార్యదర్శిగా పనిచేయడం కీలకమైందే కానీ క్లిష్టమైనది ఎంత మాత్రం కాదు. ఎందుకంటే కవులు రచయితల లక్ష్యాలు పరిమితమైనవి. దాంట్లో రాజకీయ నాయకుల జోక్యం అసలు ఉండదు. పైగా ఎమర్జెన్సీ అనేది ఉండనే ఉండదు. అందువల్ల అక్కడ చాలా ఆహ్లాదకరంగా పనిచేస్తూ ఉండొచ్చు. కాకపోతే కార్యదర్శిగా ఉండేవారు సాహిత్యకారులు కాకపోతే సాహిత్యకారులకు సాహిత్యానికి చాలా పెద్ద నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ అధికార దర్పాన్ని ఉపయోగిస్తే సీరియస్ కవులు రచయితలు రావడం మానేస్తారు. అందువల్ల అక్కడ కచ్చితంగా ఒక రచయితనే ఉంచడం బాగుంటుంది. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు అనేది పూర్తిగా ఒక అధికారికమైన పోస్టు. ఇందులో విభిన్నమైన రంగాల వ్యక్తులు, కళాకారులు కవులు రచయితలు కూడా ఉంటారు. దీనికి తోడు ఎప్పుడూ ఎమర్జెన్సీ ఈవెంట్స్ ఉంటాయి. మహామహుల బర్త్ డేలు, డెత్ యానివర్సరీలు సడన్‌గా, గవర్నమెంట్ నోటిఫై చేసి ఘనంగా చేయమని చెబుతూ ఉంటుంది. ఆ సందర్భంలో రాత్రికి రాత్రి ఆహ్వాన పత్రాలు ప్రోటోకాల్ ప్రకారము ముద్రించడము, పంచడం, సభను నిర్వహించడం అందరినీ సంతృప్తి పరచడము చిన్న విషయం కాదు. ఇక గోదావరి పుష్కరాల దగ్గర నుండి, బోనాల పండుగ దాకా ఏ ఈవెంట్ లోను భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడిని మీటింగుకు పిలవకుండా ఉండరు. ఆ రకంగా వారంలో కనీసం మూడు, నాలుగు మీటింగులు ఉండి తీరతాయి. అందులో చెప్పిన విషయాలను ఫాలో చేయడం కోసం కూడా చాలా ప్లానింగ్ చేయవలసి ఉంటుంది. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడిగా పని చేయడానికి పెద్దగా విద్య ఉండి తీరాల్సిన అవసరం లేదు. పర్షువేషన్ చేయగలగడం, పైవారిని సంతృప్తి పరచగలగడం కింది వారిని సమన్వయం చేసుకోవడం వచ్చేవారికి ఇది సులభమైన ఉద్యోగం. ముక్కు సూటిగా ఉండే వారికి ఇది చాలా కష్టమైన పని.
ప్రశ్న: ప్రస్తుతం డైరెక్టర్‌గా మీరు చేపడుతున్న కార్యక్రమాలేమిటి?
జ: రొటీన్‌గా చేపట్టే రాష్ట్ర నాయకుల పుట్టిన రోజులు, దివంగత దినోత్సవాలు, బోనాలు, బతుకమ్మ మూడు జెండావందనాలు కాకుండా ఇతర రాష్ట్రాలలో, అడపాదడపా ఇతర దేశాలలో సాంస్కృతిక కార్యకలాపాలను నిర్వహించడం ఈ శాఖకు రొటీన్‌గా ఉండే పని. దీనికి భిన్నంగా ఏప్రిల్ 1, 2026 నుండి జూలై 9 వరకు తెలంగాణ ప్రజాకళ 99 డేస్ నిర్వహించాలని భావించి వివిధ జిల్లాల నుండి భిన్నమైన కళారూపాలను ఆహ్వానించి రవీంద్ర భారతి లోని పాల్కురికి సోమన్న మూలలో నిత్య సాయంకాల పర్వదినాలను నిర్వహించాం. ఎప్పుడూ రవీంద్ర భారతి మెట్లు ఎక్కని సుమారుగా వెయ్యి మంది కళాకారులకు రవీంద్ర భారతిలో ప్రదర్శన ఇవ్వడానికి అవకాశాన్ని కల్పించాం. గుస్సాడీ, కొమ్ముకోయ లాంటి జానపద కళారూపాలనే కాకుండా జడ కొప్పులు, తోలుబొమ్మలాట, చెక్కభజన, మిమిక్రీ, మైమ్ లాంటి అరుదైన కళారూపాలను కూడా ప్రదర్శనకు పెట్టాం. అందువల్ల కళాకారులలో ఒక నూతన ఉత్తేజం బయటికి వచ్చింది.
ప్రశ్న: ఒక సృజనాత్మక కవిగా, ప్రస్తుతం సాహిత్య రంగంలో ద్యోతకమవుతున్న విచ్ఛిన్నకరధోరణులు, సంకుచితత్వాలు, ఆవేశ ప్రకటనలపట్ల మీ స్పందన ఏమిటి? ఎందుకని సమాజానికి దారి చూపవలసిన సాహిత్య ప్రపంచంలో ఇటువంటి ధోరణులు పొడచూపుతున్నాయి?
జ: సాహిత్యంలో ఇప్పుడు బాధ్యత కన్నా ఎక్కువగా కెరీరిజం డెవలప్ అయింది అని నేను అనుకుంటున్నాను. దాన్ని విచ్ఛిన్నకరమైన ధోరణి అనలేను కానీ అభిలాషనీయం కాని ధోరణి. బాధ్యత ఉన్న రచనలు మరింత పురోగామి తత్వంతో ఉండాలి. ఇప్పుడు ప్రపంచంలో ఇతర సాహిత్యాలతో పోల్చితే తెలుగులో రాసి ఉండాల్సిన అంశాలు కొన్ని ఇప్పటికీ రాయలేదు. వాటిని రాయడానికి చాలా అవకాశం ఉంది. దాన్ని ఇప్పటి రచయితలు గుర్తించకుండా వేరే ధోరణిలో వెళ్తున్నారని మాత్రమే చెప్పగలను.
ప్రశ్న: తెలుగులో విమర్శ లేదనే ఒక ఆరోపణ వినిపిస్తున్నది. మీ అభిప్రాయం ఏమిటి?
జ: కొంత మేరకు వాస్తవమే కానీ పూర్తి వాస్తవం కాదు. నిస్పాక్షికత కొరవడింది. దానికి కారణం కేవలం విమర్శకే కట్టుబడిన విమర్శకులు లేకుండా పోవడం. ఒక సందర్భం విమర్శకులను కూడా పుట్టిస్తుంది.
ప్రశ్న: మీరు అందుకున్న అవార్డులు, పొందిన ప్రశంసల గురించి చెప్తారా?
జ: నా ‘ఏడుకోలల బాయి’కి పిఠాపురం వారి బహుమతి రావడం ఒక గొప్ప ఆనందం. ఎందుకంటే ఇక్కడి తెలంగాణ యాసలో రాసిన సీస పద్యాలలో రాజకీయాలను దునమాడిన పద్ధతిని వారు మొదట మెచ్చుకున్న తర్వాతనే మిగిలిన వాళ్ళు దాన్ని శ్రద్ధగా చదివారని అనిపిస్తుంది. పూలపూల వాన అనే కవితా సంపుటికి ఒంగోలు వారి బహుమతి లభించడం కూడా గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఇవి కాకుండా తెలుగు విశ్వవిద్యాలయం నా ‘కొత్త పలక’, ‘తెలంగాణ రుబాయిలకు’ బహుమతి ఇచ్చినప్పుడు, తెలంగాణ సారస్వత పరిషత్తు ‘తెలంగాణ రుబాయిల’కు ఉత్తమ గేయ సంపుటి అవార్డు ఇచ్చినప్పుడు చాలా ఆనందం కలిగిన మాట వాస్తవం. ప్రైవేట్ వ్యక్తులు మనకు పెద్దగా సంబంధం లేని వాళ్ళు మన పుస్తకాలను పట్టించుకొని బహుమతి ఇచ్చినప్పుడు చాలా గొప్ప ఆనందం కలుగుతుంది. అలాంటివి నేను చాలా పొందాను.
ప్రశ్న: మీ దృష్టిలో ఒక ఆదర్శకవికి ఉండాల్సిన లక్షణాలేమిటి?
జ: నిజాయితీతో కూడిన సహజ ప్రవర్తన.
జ: పింగళి లక్ష్మీకాంతం గారి నిర్వచనం నాకు బాగా నచ్చుతుంది. కాకపోతే దాన్ని ముందూ వెనకా చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. వారంటారు ఆనందము ముఖ్యమా ఉపదేశము ముఖ్యమా? అని. ఆనందం ఇవ్వడమనేది కావ్యానికి ఉండే ప్రాథమిక లక్షణం అని చెబుతూ ప్రాథమిక లక్షణం లేకపోతే దాన్ని కావ్యము అనలేము కదా అంటారు. ఆనందాన్ని ఇవ్వడంతో పాటు ఉపదేశం కూడా అందజేస్తే బంగారానికి పరిమళ మబ్బినట్లు ఉంటుంది అని వారు ఇచ్చిన నిర్వచనం. కానీ ప్రయోజనం లక్ష్యంగా రాసి అది ఆనందకరం అయితే మరింత బాగుంటుందని నా విశ్వాసం.
ప్రశ్న: ఒక పాలకుడిగా మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి?
జ: పాలకులు రాజకీయ నాయకులు. మనం అధికారులం మాత్రమే. అధికారులు ఉన్న నిబంధనల చట్రంలో ఏ మేరకు ప్రజలకు మేలు చేయగలుగుతాము అనేది మాత్రమే ఆలోచించవలసి ఉంటుంది. నాలాంటి రచయిత అయిన అధికారి ఈ అధికారం ద్వారా ఏ మేరకు ప్రజలకు మేలు చేయగలుగుతాము అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాము అంతే.
ప్రశ్న: ఒక కవిగా మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి?
జ: క్యాపిటల్ పనిష్మెంట్‌కు వ్యతిరేకంగా ఒక దీర్ఘకావ్యం మొదలుపెట్టి కొన్ని సంవత్సరాలు అయింది. దాన్ని తప్పకుండా ఒకటి రెండు సంవత్సరాలలో పూర్తి చేయాలని అనుకుంటూ ఉన్నాను. కవిత్వంలో ఏ ప్రయోగం ఉపయుక్తంగా ఉంటుంది అని ఎప్పటికీ ఆలోచిస్తూ ఉంటాను గాని ఆ విషయంలో నాకే ఇంకా స్పష్టత రాలేదు.
~
సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు డా. ఏనుగు నరసింహా రెడ్డి గారూ.
డా. ఏనుగు నరసింహా రెడ్డి: ధన్యవాదాలు.
♦

