[సంచిక కోసం రచయిత్రి డా. టి. శ్రీవల్లీరాధిక గారితో సంచిక టీమ్ జరిపిన ఇంటర్వ్యూ ఇది.]
డా. టి. శ్రీవల్లీరాధిక గారు ప్రముఖ తెలుగు రచయిత్రి, అనువాదకురాలు, విమర్శకురాలు. ‘తెలుగు సాహిత్యం – భక్తిరసం’ అనే అంశంపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. పలు కవితలు, కథలు, వ్యాసాలు రచించారు. వారి గురించి, వారి రచనల గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం.
~
జ: సంచిక పత్రిక ప్రారంభించడానికి ముందే కస్తూరి మురళీకృష్ణ గారు కొత్త పత్రిక ప్రారంభించబోతున్నామని చెప్పి, అందుకోసం రచనలు పంపాలని అడగారు. అప్పటినుంచీ సంచికతో పరిచయం ఉంది.
ప్రశ్న 2. మీ బాల్యం, కుటుంబం, విద్యాభ్యాసం, ఉద్యోగం గురించి చెప్పండి.
జ: బాల్యం ఒంగోలులో గడిచిందండీ. ఊహ తెలిసినప్పటి నుంచి పదవ తరగతి పూర్తయ్యేదాకా అక్కడ ఉన్నాను. ఆ తర్వాత హైదరాబాదు వచ్చాను. పాలిటెక్నిక్ చదివి ఉద్యోగంలో ప్రవేశించాను. ఉద్యోగం చేస్తూనే ఇంజినీరింగ్, JNTU నుంచి M.Tech పూర్తి చేశాను. ఆ తర్వాత కొన్నేళ్ళు హైదరాబాదులోను, మరికొన్నేళ్ళు బెంగళూరులోను ఉద్యోగం చేశాను.
తెలుగు సాహిత్యం ఒక పద్ధతిగా చదువుకోవాలన్న కోరికతో పదిహేనేళ్ళ విరామం తర్వాత మరలా తెలుగు యూనివర్శిటీలో విద్యార్థిగా ప్రవేశించి MA పూర్తి చేశాను. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో PhD పూర్తి చేశాను.
ప్రశ్న 3. సాహిత్యం పట్ల అభిరుచి మీకు ఏ వయసులో కలిగింది? పుస్తకాలు చదివేందుకు ప్రేరణ ఎవరు? మీ కుటుంబంలో ఎవరైనా సాహితీవేత్తలు/రచయితలు ఉన్నారా?
జ: ఊహ తెలిసినప్పటి నుంచీ సాహిత్యంపై రుచి ఉన్నట్లు తోస్తోంది. సాహిత్యం పట్ల ఆసక్తితో కాకపోయినా కాలక్షేపం కోసం చదివే అలవాటు ఇంట్లో అమ్మకు, చుట్టుపక్కల ఇళ్ళలోని వారికీ ఉండేది. నాన్నగారు నవలలూ కథలూ చదివేవారు కాదు కానీ, నాకోసం చందమామ, బొమ్మరిల్లు వంటి పుస్తకాలు కొని తెస్తూ ఉండేవారు. ఆ రకంగా పుస్తకాలు చదివే అలవాటు చేసింది మొదట నాన్నగారేనని చెప్పాలి. కుటుంబంలో సాహితీవేత్తలు/రచయితలు ఎవరూ లేరు.
ప్రశ్న 4. పాఠశాల/కళాశాల రోజుల్లో ఎక్కువగా ఏ పుస్తకాలు, ఏ రచయితలని చదివారు?
జ: పాఠశాల రోజుల్లో ఇరుగుపొరుగు ఇళ్ళలో వారందరూ చదువుతూ ఉండే నవలలు, ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ వంటి పత్రికలు చదివేదాన్ని. సులోచనారాణిగారు, రంగనాయకమ్మగారు మొదలయినవారి రచనలు నేను పాఠశాలలో ఉన్నపుడు పత్రికలలో వస్తూ ఉండేవి. అవి చదివేదాన్ని. అపరాధపరిశోధన నవలలూ ఆసక్తిగా చదివేదాన్ని.
స్కూల్లో కవితాపఠనం, వ్యాసరచన వంటి పోటీలలో పాల్గొన్నపుడు బహుమతులుగా భిన్నమైన పుస్తకాలు వచ్చేవి. అపుడు నేను స్కూళ్ళో ఏమి మాట్లాడేదాన్నో, నా అభిరుచిని ఏ రకంగా గుర్తు పట్టారో తెలియదు కానీ మా టీచర్లు పిల్లలందరికీ ఇచ్చినట్లు అట్లాసులు, నిఘంటువులు కాకుండా ‘రాధిక కోసం’ అని ప్రత్యేకంగా పుస్తకాలు వెతికి తెచ్చేవారు. నండూరి పార్థసారథిగారి కార్ఖానాఖ్యానం వంటి పుస్తకాలు నాకోసం ప్రత్యేకంగా తేవడం గుర్తు నాకు.
హైదరాబాద్ వచ్చాక వనస్థలిపురంలో ఒక సర్క్యులేషన్ లైబ్రరీ ఉండేది. ఇంటి దగ్గరే ఉండే ఆ చిన్న షాపులో కాలక్షేపం నవలలతో పాటు ప్రాచీన సాహిత్యానికి చెందిన పుస్తకాలూ, అందరూ పెద్దగా ఆసక్తి చూపని గంభీరమైన పుస్తకాలూ కూడా ఉండేవి. చలం, బీనాదేవి, బాపిరాజు, బుచ్చిబాబు మొదలయిన ప్రసిద్ధ రచయితలు చాలామంది పుస్తకాలు అక్కడే చదివాను. వేయిపడగలు అక్కడే చదివాను. రోజుకి ముప్పై పైసలు అద్దె చొప్పున మొత్తం అయిదురోజులు చదివి రూపాయిన్నర ఇవ్వడం గుర్తు.
ప్రశ్న 5. ఓ పాఠకురాలి నుంచి రచయిత్రిగా మారిన క్రమం గురించి చెప్తారా? మీ తొలి సాహితీ ప్రక్రియ ఏది?
జ: అలా ఒక క్రమం ఏమీ లేదండీ. నిజం చెప్పాలంటే వ్రాయడం మొదలు పెట్టేనాటికి నేను చదివినది చాలా తక్కువ.
పది పన్నెండేళ్ళ వయసు నుండీ వచన కవిత్వం వ్రాస్తూ ఉండేడాన్ని. పాఠశాల పుస్తకాలు తప్ప విడిగా కవిత్వం చదివినది లేదు అప్పటికి. అయినా కవిత్వం ఎందుకు మొదలుపెట్టానో తెలియదు.
ఆ తర్వాత నవలలు ఎక్కువగానే చదివినా, మొదటి కథ వ్రాసేనాటికి కథలు బాగా చదివిన అనుభవమేమీ లేదు. కానీ మొదట వచన కవిత్వమూ, ఆ తర్వాత కథలూ వ్రాశాను.
సాహితీవేత్తలతో పరిచయాలు పెరిగాక, సాహిత్య చర్చలలో పాల్గొన్నపుడు నా అభిప్రాయాలు కొంత భిన్నంగా ఉండడం గమనించి వాటిని స్పష్టంగా వ్యక్తం చేయడం కోసం, చాలా ఆలస్యంగా, అంటే కథలు వ్రాయడం మొదలుపెట్టిన ఇరవై ఏళ్ళ తర్వాత వ్యాసాలు వ్రాయడం మొదలు పెట్టాను.
ప్రశ్న 6. మీరు కవిత్వం, కథలు, నవల, వ్యాసాలు వ్రాసారు, అనువాదాలు చేశారు. వీటిలో ఏ ప్రక్రియపై మక్కువ ఎక్కువ?
జ: నవలలు ఎక్కువ వ్రాయలేదండీ. చిన్నతనంలో ఉత్సాహంతోనూ పత్రిక వాళ్ళు అడగడం వలనా వ్రాసిన ఒకటి రెండు నవలలు తప్ప గట్టిగా సంకల్పించుకుని వ్రాసిన నవలలు లేవు.
అనువాదాలూ అంతే, ఎవరైనా అడిగినపుడు కాదనలేక చేసినవే.
కవిత్వం నా ఇష్టప్రకారం వ్రాసేదే అయినా, ఇరవై ఏళ్ళ క్రితం దానికి ఒక నియమం పెట్టుకున్నాను. “భగవంతుని గూర్చి తప్ప ఇతర విషయాలపై కవిత్వం వ్రాయను” అని. భక్తికవిత్వం చెప్పడంలో నిజానికి నా ప్రమేయమూ ప్రయత్నమూ పెద్దగా ఉండదు. అది నా ఆనందాన్ని అప్రయత్నంగా వ్యక్తం చేసే తీరు కనుక అది ఇష్టాఇష్టాలకు అతీతం. కథలూ వ్యాసాలూ మాత్రం వ్రాయాలనుకునే వ్రాస్తాను. వ్రాసినపుడు ఇష్టంగాను శ్రద్ధగాను వ్రాస్తాను.
ప్రశ్న 7. కథ గానీ, కవిత గానీ, వ్యాసం గానీ రాయాలనుకున్నప్పుడు ఇతివృత్తం ఎలా ఎంచుకుంటారు?
జ: కవిత్వానికి ఒకటే ఇతివృత్తం కనుక దానిని పక్కన పెడితే, కథల విషయంలో కూడా కథ వ్రాద్దాం అనుకుని ఇతివృత్తం ఎంచుకోవడం ఉండదు. ఇతివృత్తం ఉన్నపుడే కథ వ్రాద్దాం అనుకోవడం జరుగుతుంది. వ్యాసమైనా అంతే.
నేను వ్రాసిన కథలలో ఇతివృత్తాలు స్థూలమైన సమస్యల నుంచీ, ఈతిబాధల నుంచీ కాక సూక్ష్మమైన అంశాల నుంచీ ఆలోచనల నుంచీ వస్తాయని చెప్పవచ్చు. సమాజాన్ని కానీ సాహిత్యాన్ని కానీ చూడటంలో నా దృష్టి కొంత భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం ఎక్కువ మంది – నా చుట్టూ ఉన్న మనుషులైనా, నా సహరచయితలైనా – చూస్తున్న చూపు కాదది. అలా నా దృష్టికి కనబడిన అంశాలేమైనా ఉంటే, వాటిని వ్యక్తం చేయవలసిన అవసరమూ ఉందనిపిస్తే అప్పుడు కథ కానీ వ్యాసం కానీ వ్రాస్తూ ఉంటాను.
ప్రశ్న 8. ఒక వస్తువు కవిత అవుతుందా, కథ అవుతుందో ఎలా నిర్ణయించుకుంటారు? ఒక ప్రక్రియ కోసం అనుకున్న ఇతివృత్తంతో మరో ప్రక్రియ చేపట్టిన దృష్టాంతాలు ఏవైనా ఉన్నాయా?
జ: ఈ ప్రశ్నకు జవాబు ఇంతకు ముందు చెప్పిన సమాధానాలలో ఉంది కనుక మరలా ఏమీ చెప్పడం లేదు.
ప్రశ్న 9. కవిత్వానికి లయ/వస్తువు/భావ వ్యక్తీకరణలలో ఏది ముఖ్యం అనుకుంటున్నారు? మీరు దేనికి ప్రాధాన్యతనిస్తారు?
జ: “కవిత బావుంది” అనుకోవాలంటే మూడూ ఉండాలి. “కవిత” అనుకోవాలంటే కనీసం భావవ్యక్తీకరణ బావుండాలి.
నేను వ్రాసిన కవితలు నాకు “బావున్నాయి” అనే అనిపిస్తూంటాయి.
ప్రశ్న 10. కథ వ్రాసేటప్పుడు మీరు వస్తువు/శిల్పం/శైలి – దేనికి ప్రాధాన్యతనిస్తారు?
జ: ఏదో ఒకదానికే ప్రాధాన్యం ఇచ్చి కథ వ్రాసి తీరవలసిన అవసరం ఏముందండీ? కథ అంటూ వ్రాస్తే దానికి సంబంధించిన అన్ని అంశాలకూ ప్రాముఖ్యం ఇచ్చే వ్రాయాలి కదా!
ప్రశ్న 11. మీ కథలు హిందీ, మరాఠీ, ఒరియా, ఇంగ్లీషు, కన్నడ, తమిళం, పంజాబీ, నేపాలీ భాషల లోకి కథలు అనువాదమయ్యాయి. మీరు ఇతర భాషీయుల కథలు ఏవైనా తెలుగులోకి అనువదించారా?
జ: ఒకటి రెండు కథలు స్నేహితుల కోరితే అనువదించాను కానీ అనువాదంలో ఆసక్తీ, ప్రతిభా లేవండీ నాకు.
ప్రశ్న 12. మీ పుస్తకాల శీర్షికలు విభిన్నంగా ఉంటాయి. కొద్దిగా ప్రౌఢత్వం ధ్వనిస్తుంది (మహార్ణవం, రససేవధి, కృష్ణానురక్తి). దీనికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా?
జ: మహార్ణవం, రసశేవధి ఆయా కథాసంపుటాలలో ఉన్న కథల పేర్లు. ఆ కథలకు ఆ పేర్లే సరిపోతాయి కనుక పెట్టాను. పుస్తకానికి ఆ పుస్తకంలో ఉన్న కథల పేర్లలో అవి బావున్నాయనుకుని పెట్టాను. అది సరైన నిర్ణయం కాదని కొందరు స్నేహితులు అన్నారు. నిజమే కావచ్చు.
“శ్రీకృష్ణానురక్తి” కథాసంపుటి కాదు, శ్రీమద్భాగవతంలోని దశమస్కంధసారం. అందులో తొమ్మిది స్త్రీ పాత్రలు కృష్ణునికి తమపై ఉన్న అనురక్తినీ, కృష్ణునిపై తమకు ఉన్న అనురక్తినీ వ్యక్తం చేస్తూ కథను చెప్తాయి. కనుక ఆ పుస్తకానికి ఆ పేరు బాగా సరిపోతుందని అనుకున్నాను.
ప్రశ్న 13. మీ సిద్ధాంత గ్రంథం ‘తెలుగు సాహిత్యం – భక్తిరసం‘ ముద్రణ పూర్తయ్యిందా? ఈ పరిశోధన చేసిన విధానం, సంప్రదించిన గ్రంథాల గురించి చెప్తారా?
జ: పూర్తయిందండీ.
“భక్తి శృంగారాదులలో అంతర్భవించని విభిన్న రసము” అన్నది నా ప్రతిపాదన. పూర్వాలంకారికులు భక్తిని రసంగా అంగీకరించలేదు అనేది అందరూ ఇప్పటివరకూ చెప్పుకుంటున్న మాట. అది ఎంతవరకు సత్యమో తెలుసుకునేందుకు భరతుడి నుంచి మొదలుపెట్టి దండి, భామహుడు వంటి ముప్పై తొమ్మిది మంది ప్రసిద్ధులైన సంస్కృతాలంకారికుల గ్రంథాలు పరిశీలించాను. విన్నకోట పెద్దన, అనంతామాత్యుడు వంటి పదిహేడు మంది తెలుగు ఆలంకారికుల గ్రంథాలు పరిశీలించాను.
ఈ విషయంపై ఆధునిక విమర్శకుల అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం కందుకూరి, గిడుగు మొదలైన వారి నుంచి ఈనాటి విమర్శకుల వరకూ ప్రసిద్ధ తెలుగు విమర్శకుల, ఆచార్యుల గ్రంథాలు పరిశీలించాను. విమర్శకుల గ్రంథాల నుంచే కాక అనేక ఇతర వ్యాస సంకలనాల నుంచి కూడా అభిప్రాయాలు సేకరించాను.
ఆపైన తెలుగు కవులు భక్తికి ఇచ్చిన స్థానాన్నీ, వారు దానిని పోషించిన తీరునీ తెలుసుకోవడం కోసం నన్నయ నుండి కంకంటి పాపరాజు వరకు ప్రాచీన కవుల కావ్యాలు పరిశీలించాను. కృష్ణశాస్త్రి, వేదుల వంటి ఆధునిక కవుల కవిత్వాన్నీ, వాగ్గేయకారుల రచనలనీ కూడా స్థూలంగా పరిశీలించాను.
ఈ పరిశీలనలనన్నిటిని ఆధారం చేసుకుని, రసము, భావము వంటి విషయాలపై ఆలంకారికుల నిర్వచనాలనూ, అభిప్రాయాలనూ, వాటిలోని వైరుధ్యాలనూ తార్కికంగా చర్చించడం ద్వారా, తెలుగు కావ్యాలలో భక్తిరసం పోషింపబడిన తీరుని గమనించడం ద్వారా “భక్తి శృంగారాది రసములలో అంతర్భవించని విభిన్న రసము” అన్న ప్రతిపాదన సరైనదేనని నిర్ధారించుకున్నాను.
ప్రశ్న 14. ఔత్సాహిక రచయిత రచయిత్రులకు కథా కార్యశాల నిర్వహిస్తున్నారు కదా? ఆ కార్యక్రమం గురించి వివరించండి. మీ మార్గదర్శనంలో, వారు – మీరు ఆశించిన విధంగా సాహితీసృజన చేయగల్గుతున్నారా?
జ: కార్యశాలలో కథారచనకు సంబంధించిన దృక్కోణం, శైలి, శిల్పం, పాత్రచిత్రణ వంటి వివిధ విషయాల గురించే కాక, కథను చదవడం గురించి కూడా ఎక్కువగా మాట్లాడుకుంటాం. కాలక్షేపం కోసం కాక ఒక అధ్యయనంగా చదివే పాఠకులు కథను ఎలా చదువుతారన్న విషయాన్ని గురించి మాట్లాడుకుంటాం.
తనకన్నా గొప్ప పాఠకులని సంపాదించుకోవడానికి రచయిత పాటించవల్సిన జాగ్రత్తలనీ, చూపవలసిన శ్రద్ధనీ, చేయవసిన ప్రయత్నాలనీ చర్చించుకుంటాము.
కాబట్టి కార్యశాలలో పాల్గొన్నవారికి ఇతరుల కథలనూ, తాము వ్రాసిన కథలనూ కూడా విమర్శగా చదువుకోవడం తెలుస్తుంది. విమర్శని ఎలా తీసుకోవాలో తెలుస్తుంది. కథపై వారి అంచనా ముందుకన్నా పెరుగుతుంది.
ఆపైన వారు పెరిగిన తమ అంచనాకు తగినట్లుగా వ్రాయాలనుకుంటారా; విరివిగా వ్రాయాలి, పదిమందికీ తెలియాలి వంటి ప్రలోభాలకు అనుగుణంగా వ్రాయాలనుకుంటారా అనేది వారి నిర్ణయం.
నేర్చుకున్న విషయాలను తిరిగి పాటించే వారికి మాత్రమే చెప్పాలని వీలయినంతవరకు ప్రయత్నిస్తాను. కానీ ఒకరిద్దరి విషయంలో అది జరగక పోవచ్చు.
ప్రశ్న 15. అన్ని ప్రక్రియల్లోనూ కలిపి ఇప్పటికి ఎన్ని పుస్తకాలు ప్రచురించారు? కొత్త పుస్తకాలేవైనా సిద్ధమవుతున్నాయా?
జ: పన్నెండు పుస్తకాలు ప్రచురించాను. కొన్ని ఇ-బుక్స్ గా లభ్యమవుతున్నాయి. ఇంకా విమర్శా వ్యాసాలు, పద్యాలు, బాలల కోసం వ్రాసిన కథలు, నవలల వంటివి పుస్తకాలుగా తేవలసి ఉంది.
ప్రశ్న 16. సాహితీపరంగా ఏవైనా గౌరవాలను పొందారా? మీకు లభించిన అవార్డులు, బహుమతుల గురించి చెప్పండి.
జ: డిల్లీలోని కథ సంస్థ; కలకత్తాలోని భారతీయభాషా పరిషద్; హైదరాబాద్ లోని తెలుగు విశ్వవిద్యాలయం, లేఖిని, భారతీభూమిక మొదలయిన సాంస్కృతిక సంస్థలు; మచిలీపట్టణం లోని ఆంధ్ర సారస్వత పరిషత్; ఒంగోలులోని కళామిత్రమిండలి మొదలైన సంస్థలు కథారచనకు పురస్కారాలనిచ్చాయి. అమృతలతగారు ఇచ్చే అపురూప పురస్కారం కూడా కథారచనకు లభించింది.
ప్రశ్న 17. ఓ సాహితీవేత్తగా మీ లక్ష్యం ఏమిటి? ఆ దిశగా మీ భవిష్యత్తు కార్యక్రమాలేమిటి?
జ: సాహిత్యానికి సంబంధించి పెద్ద లక్ష్యాలు, ప్రణాళికలు లేవండీ. జీవితానికి సంబంధించిన అసలు లక్ష్యాలు వేరే ఉన్నాయి. ఇంతకు మునుపు చెప్పినట్లు ఏదైనా ఒక విషయం వ్రాయవలసిన అవసరం కనిపించినపుడు, వ్రాయాలనిపించినపుడు వ్రాస్తూ ఉండడం, అంతే.
కొన్ని కథలు, నవలలు వ్రాయాలన్న ఆలోచన ఉంది. వ్రాస్తే వ్రాస్తానేమో!
~
సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు డా. టి. శ్రీవల్లీరాధిక గారూ.
డా. టి. శ్రీవల్లీరాధిక: ధన్యవాదాలు.
♦

