డా. జి. వి. పూర్ణచంద్ విజయవాడ వాస్తవ్యులు, ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు. 23 ఏప్రిల్ 1957న కృష్ణా జిల్లా కంకిపాడులో సత్యప్రసూన, జి.వి.జి.కె. చంద్రమౌళీశ్వరరావు దంపతులకు జన్మించారు. డా. పూర్ణచంద్ వందకు పైగా రచనలు చేశారు. కృష్ణాజిల్లా రచయితల సంఘానికి ప్రధాన కార్యదర్శి, ప్రపంచ తెలుగు రచయితల మహాసభల ప్రధాన కార్యదర్శి, నేషనల్ మెడికల్ అసోషియేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, తన్నీరు కృష్ణమూర్తి విద్యాధర లయన్స్ ఐ హాస్పిటల్ చైర్మన్. తెలుగు భాషోద్యమ ప్రముఖులు. ఆయుర్వేద పట్టభద్ర వైద్యుల సంక్షేమం కోసం నేషనల్ మెడికల్ అసోసియేషన్ వ్యస్థాపకుల్లో ఒకరు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు (మూడు పర్యాయాలు), ఇంకా పలు జాతీయ సదస్సులకు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. పలు పరిశోధక గ్రంథాలకు సహ సంపాదకత్వం వహించారు. కృష్ణా విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం, అందులో తెలుగు శాఖ ఏర్పాటు కోసం కృషి చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ పరిశోధక పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కారం పొందారు.
ఆయుర్వేద వైద్యంతో ఎందరి ఆరోగ్యాన్నో కాపాడుతూ, తన సాహిత్యంతో సమాజాన్ని ఆరోగ్యవంతం చేసే డా. జి.వి. పూర్ణచంద్‌తో సంచిక జరిపిన ఇంటర్వ్యూ ఇది.
***
నమస్కారమండీ డా. జి.వి. పూర్ణచంద్ గారు.
నమస్కారం.
మనం మీ సాహిత్యం గురించి, మీ సాహిత్య సృజన గురించి, సాహిత్య విమర్శ గురించి, మీరు చేస్తున్న పరిశోధన గురించి మాట్లాడుకునే ముందుగా, మీ కుటుంబం నేపథ్యమూ, మీ బాల్యం గురించి చెబుతారా? మీ బాల్యానుభవాలు, మీరు పెరిగిన వాతావరణం ఏ రకంగా మిమ్మల్ని సాహిత్యంవైపు మళ్ళించాయో చెప్తారా?
మా నాన్నగారు అగ్రికల్చరల్ డిపార్ట్‌మెంటులో పనిచేసేవారు. ఆయన ఎన్.జి.ఓ.ల అసోసియేషన్‌లో ప్రముఖమైన పాత్ర వహించడం మూలాన సంవత్సరానికి ఒక ఊర్లో ఆయన ఉద్యోగం చేశారు. అందువల్ల కృష్ణాజిల్లాలో ఉన్న ఏడెనిమిది.. అవనిగడ్డ, చర్లపల్లి, ఘంటశాల, ఉయ్యూరు మొదలైన ఊర్లలో నా ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. తర్వాత హైస్కూలు చదువు నూజివీడులో సాగింది. తరువాత కుటుంబాన్ని విజయవాడలోనే ఉంచి నాన్నగారే ఇతర ఊర్లకి తిరిగేవారు. ఇంటర్మీడియట్ నుంచి నా చదువంతా విజయవాడలో సాగింది. పదోతరగతి వరకు గ్రామాల్లో చదువుకోవడం వల్ల కృష్ణాజిల్లా లోని గ్రామీణ వాతావరణంతో నాకు పరిచయం కలిగింది. అనుబంధం ఏర్పడింది. గ్రామీణ జీవితం పట్ల ఒక దృక్పథం ఏర్పడింది.
సంవత్సరం సంవత్సరం ఓ ఊరు మారుతుంటే మీకు చదువుకి డిస్ట్రబెన్స్ అనిపించలేదా?
చదువు ఏ సంవత్సరం ఆ సంవత్సరానిదే కాబట్టి, పెద్దగా ఆటంకాలేవీ కలగలేదు. పైగా అనుభవాలు కూడా కొత్తవి వస్తుండడంతో బాగుండేది. ఒక ఊరి నుంచి మరో ఊరు వచ్చినప్పుడు… ఉదాహరణకి ఘంటసాల నుంచి నూజివీడు వచ్చాం, ఘంటసాల జీవితం వేరు, నూజివీడు జీవితం వేరు. ఆ మనుషులు, అక్కడి వాతావరణం, ఆ పరిస్థితులు అన్నీ విభిన్నంగా ఉండేవి. నీరు పుష్కలంగా ఉండే ఘంటసాల నుంచి, ఎంత లోతుకి వెళ్ళినా నీరు తగలని నూజివీడుకి వచ్చినప్పుడు మొదటిసారిగా నీటి కరువుని అనుభవించాం. ఇప్పుడు నూజివీడులో నీరు బాగానే ఉంది, మా చిన్నప్పుడు మాత్రం నీటికి చాలా ఎద్దడిగా ఉండేది. ఒకే జిల్లా అయినప్పటికీ చాలా వ్యత్యాసమూ వైవిధ్యమూ కనిపిస్తాయి. ఇలా ప్రతీ ప్రాంతానికి ఉండే ప్రత్యేక పరిస్థితులను బాల్యం లోనే ఆకళింపు చేసుకునే అవకాశం కలిగింది.
మీ కుటుంబ వాతావరణం ఎలా ఉండేది? మీకు ఎలాగ సాహిత్యం వైపు ఆసక్తి కలిగింది?
మా నాన్నగారి పెదనాన్నగారు భగవద్గీతకు వ్యాఖ్యానం రాశారు. కుటుంబంలో మా తాతగారి వైపు నుంచి ఒక సాహిత్యపరమైన వాతావరణం ఉండేది. మా నాన్నగారు అకస్మాత్తుగా మెహర్‌బాబా వైపు వచ్చారు. వచ్చి, మెహర్ బాబా సాహిత్యంపై ఆయన ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. ‘అవతార్ మెహెర్’ అనే పత్రికకి దాదాపు 40 ఏళ్ళు ఆయన ఎడిటర్‌గా పనిచేశారు. నాన్నగారు మెహర్ బాబా మీద దాదాపుగా 40 పుస్తకాలు రాశారు. ఆయన నలభై పుస్తకాలు రాసే సమయానికి నా పుస్తకాల సంఖ్య ఇరవయ్యో, పాతికో ఉండేవి. అందుకని సాహిత్యం అనేది నాకు కుటుంబ వారసత్వమే అని నేను భావిస్తాను.
కాకపోతే నాన్నగారిది ఆధ్యాత్మిక మార్గం, నేను ఎక్కువగా తెలుగు భాష, సంస్కృతి, చరిత్రవైపు ఎక్కువగా మొగ్గాను. మార్గాలు వేరయినప్పటికీ, సాహిత్యపరమైన వారసత్వం మాత్రం నాకు కుటుంబపరంగా సంక్రమించిందనే చెప్పాలి.
మీకు రచన చేయాలని తొలిసారి ఎప్పుడు ఎలా అనిపించింది?
జై ఆంధ్ర ఉద్యమం జరుగుతున్న రోజులవి. నాన్నగారిది ఎన్.జి.ఓ.అసోసియేషన్‍లో కీలకపాత్ర కావడం వల్ల, వాళ్ళకి నేను పాంఫ్లెట్లు రాసిస్తూ ఉండేవాడిని. రాయడం, అచ్చుకివ్వడం, ప్రూఫులు దిద్దడం; తరువాత వాళ్ళకి కొన్ని జర్నల్స్ చేసిపెట్టడం ఇలాగ… రచనా వ్యాసంగం నాకు అలవడింది. ఆ క్రమంలోనే నాకు సాహిత్యంపై ఆసక్తి కలిగింది. నూజివీడులో ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు మా ఇంటి ముందు మహాకవి దుర్గానంద్ గారుండేవారు. శ్రీశ్రీ అంతటి స్థాయి గల కవిగా ఆయనని అందరూ భావించేవాళ్ళం. నూజివీడులో లెక్చరర్‌గా ఎం.వి.ఎల్ గారుండేవారు. వీరి ప్రభావం కూడా నాపై ఉంది. దుర్గానంద్ గారి అబ్బాయీ, నేను క్లాస్‌మేట్స్ అన్నమాట. మేమంతా కలిసి ‘మేఘమాల’ అనే లిఖిత పత్రిక నడిపాం. నేను దానికి సంపాదకత్వం వహించాను. దుర్గానంద్ గారి అబ్బాయి అంబికానాథ్ సంచారకుడిగా ఉండేవాడు. దాదాపుగా ఐదేళ్ళు నడిపామా పత్రికని.
మీరూ రాసేవారా ఆ పత్రికలో?
అవును. కథలు, వ్యాసాలు రాశాను. కాని మొదట్నించి నాకు చెయ్యి ఎక్కువగా వ్యాసాల మీదకే వెళ్ళింది. నాకు తెలియకుండానే నాకు వ్యాసరచనలో పట్టు దొరికిందనుకుంటాను. 1975లో నా మొదటి రచన ఆంధ్రప్రభలో వచ్చింది. మేం ఒకరినొకరు చూసుకోకపోయినప్పటికీ, విద్వాన్ విశ్వం గారు నన్నెంతో ప్రోత్సహించారు. “ఆత్మలతో మాట్లాడగలమా?” అనే వ్యాసం రాసి ఆంధ్రప్రభకి పంపాను, వాళ్ళు వేశారు. కొన్ని రోజుల తరువాత నాకు పదిహేను రూపాయలు ఎం.ఓ. వచ్చింది, ఫలానా తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైన మీ రచనకు పారితోషికం అంటూ. 1975లో పదిహేను రూపాయలంటే పెద్ద మొత్తమే. అప్పట్నించి నేను చాలా రచనలు ఆంధ్రప్రభకి పంపించాను, వాటన్నింటినీ వారు ప్రచురించారు.
అన్నీ వ్యాసాలేనా?
అవును.
ఏయే అంశాల మీద రాసేవారు? ఏవైనా వ్యాసాల పేర్లు గుర్తున్నాయా?
చాలా అంశాల మీద రాశాను. భీకు చమన్‌లాల్ రాసిన హిందూ అమెరికా అనే పుస్తకం మొత్తం చదివి దాని మీద ‘రఘువంశం అమెరికాను పరిపాలించిందా?’ అని ఒక వ్యాసం రాశాను. ఇంకా ఇలాంటి పరిశోధనాత్మక వ్యాసాలు కొన్ని రాశాను. ‘సింధునాగరికతలో తెలుగు అక్షరాలు‘ అనే వ్యాసం రాశాను. ఇవన్నీ కూడా నేను నా తొలిదశలో రాసినవే.
నాకు తెలుగు భాష, సంస్కృతుల మీద అభిమానం కలగడానికి నా మిత్రులే కారణం. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు పురాణపండ రంగనాథ్, మైత్రేయ గారు, ఎం.ఎస్.ఎం గారు, అజంత గారు… ఇలాంటివాళ్ళతో బాగా పరిచయం ఉండేది. జి.కృష్ణ గారు విజయవాడ సత్యనారాయణపురంలో ఉండేవారు. ఒక పెద్దాయన నన్ను జి.కె.గారికి పరిచయం చేశారు – ఈ కుర్రాడు మంచి టాలెంట్ ఉన్నవాడు అంటూ నా గురించి నాలుగు మంచి ముక్కలు చెప్పారు. రోజూ సాయంత్రం కాలేజీ అయిపోయాక జికె గారింటికి వెళ్ళేవాడిని. ఆయనది ఎత్తు అరుగు వరండా. అక్కడ నా బోటి వాళ్ళు చాలామంది చేరేవాళ్ళు. జికె గారు అనర్గళంగా ఎన్నో విషయాలు చెబుతూండేవారు. అవన్నీ వింటూ ఉండేవాడిని. ఆయన నన్ను బాగా అభిమానించేవారు. నేను కూడా ప్రశ్నలు వేసి కొంత సమాచారం రాబడుతుండేవాడిని. ఇట్లా నాకు సాహిత్యం పట్ల, పరిశోధన పట్ల ఆయన చెప్పినటువంటి విషయాలు ఉపకరించాయి. తర్వాత నన్ను బాగా గైడ్ చేసింది పురాణపండ రంగనాథ్ గారు. ఆయన ఒక జర్నలిస్టిక్ టచ్ ఉన్నటువంటి పరిశోధకుడు. ఆయన ఉషశ్రీగారి తమ్ముడు. ఎన్నో పుస్తకాలను నేను చదివేలా చేశారాయన. నేను ఇంటర్మీడియట్‌లో ఉండగానే ముద్దుకృష్ణ నుంచి ఆధునిక తెలుగుసాహిత్యం వరకు 1976-77 నాటికే చదివాను. అందుకు నా ఈ మిత్రుల సాంగత్యం ఎంతో దోహదం చేసింది.
తరువాత నన్ను చరిత్రవైపు నడిపించిన వారు ఏటుకూరి బలరామమూర్తి గారు. ఆయన నన్ను అమితంగా ప్రోత్సహించారు. ఇంకా తుమ్మల వెంకట్రామయ్య గారు, కంభంపాటి సత్యనారాయణగారితో సాన్నిహిత్యం ఏర్పడడం కూడా నాకు ఉపయోగపడింది.
ఎల్. ఎ. వాడల్ అనే పరిశోధకుడు వ్రాసిన ‘ది మేకర్స్ ఆఫ్ సివిలైజేషన్’ అనే పుస్తకం చదివి, దాని గురించి బలరామమూర్తిగారితో చర్చించి, ‘సప్తసింధు’ అనే నవల రాశాను. ఇందులో ఋగ్వేదం నేపథ్యంతో నాకు దొరికిన ఆధారాలతో సగరుడి చరిత్రని చిత్రించాను. రాహుల్ సాంస్కృత్యాయన్ గారి ‘దివోదాసు’ ఋగ్వేదం నేపథ్యంతో రాసినదే అయినా, స్వతంత్ర నవల కాదు. ఋగ్వేదంపై తెలుగులో వచ్చిన తొలి స్వతంత్ర నవల నాదేనని చరిత్ర రచనా చక్రవర్తి ముదిగొండ శివప్రసాద్ గారు పేర్కొన్నారు. పౌరాణిక పాత్రలకు చారిత్రక ఆధారాలు వెతికిన తొలి నవలగా నా నవల గురించి ఆయన ప్రస్తావించారు. అదొక మంచి ప్రశంస. ఇటువంటి వాటిని ఐతిహాసిక నవలలు అంటే బాగుంటుందని ఆయన ఒక పేరు కూడా సూచించారు.
ఇది చరిత్ర నవలలకు భిన్నమైనదా?
అవును. భిన్నమైనదే. చెప్తున్నది చరిత్రే, కాని పౌరాణిక పాత్రల చరిత్ర. పౌరాణిక పాత్రలకు చరిత్ర ఆధారాలు వెతికిన నవలలు నాకు తెలిసి తెలుగులో తక్కువే. 90లలో ఇది పుస్తకంగా వచ్చింది.
నా చుట్టూ ఉన్న నేపథ్యమంతా చరిత్ర గురించే ఉండడంతో నా ఆలోచనలన్నీ కూడా భాషవైపు, సంస్కృతి వైపు, చరిత్ర వైపు నడిచాయి. నాకు 30 ఏళ్ళు వచ్చేసరికి వీటన్నిటిపై నాకు చక్కని అవగాహన కలిగిందని చెప్పగలను.
పూర్ణచంద్ గారూ, 30 ఏళ్ళ వయస్సులోనే రాయడమే నవల రాశారు, అదీ చాలా కఠినమైన నవల. ఈ నవల రాయడానికి మీరు ఎలా ప్రణాళికలు వేసుకున్నారు? నవలని ఎలా రాశారు? పాత్రలను ఎలా సృష్టించారు?
నిజానికి ‘సప్తసింధు’ నవల నాది ఏడవదో, ఎనిమిదవదో పుస్తకం. 1980 నుంచే నా పుస్తకాలు రావడం మొదలయ్యాయి. ఇది 1990లో వచ్చింది. ఈ పదేళ్ళ కాలంలో ఐదారు పుస్తకాలు వచ్చాయి.
అన్నీ నవలేలానా?
కాదు. నా దృష్టంతా మొదటి నుంచి వ్యాసం మీదే. మెడికల్ బుక్స్ ఒక మూడు నాలుగు వచ్చాయి. అప్పట్లో 1982లో సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చింది. ఆ గ్రహణం ప్రజలలో చాలా అపోహలు కలిగించింది. ఈ గ్రహణం తర్వాత భూగోళం ఉండదన్న భయం కలిగి ఆస్తులు అమ్మేసుకున్న వాళ్ళు ఉన్నారు. స్కైలాబ్ ప్రచారం ఒకటీ, సూర్యగ్రహణం ప్రచారం ఒకటీ ఆ రోజుల్లో ప్రజలని నమ్మేలా చేశాయి. ‘రేపటి గ్రహణం – ప్రపంచ భవిష్యత్తు’ పేరుతో నేనొక పుస్తకం ప్రింట్ చేశాను. గ్రహణం లోపు కొన్నవారికి రూపాయికే ఇస్తానని చెప్పాను. 80లలోనే నేను ‘అమలిన శృంగారం’ అనే పుస్తకం రాశాను. ఇవన్నీ నేను స్టూడెంట్‌గా ఉన్నప్పుడు… అంటే మెడిసిన్ నాల్గో సంవత్సరం చదువుతున్నప్పుడు రాశాను. అలాగే ‘తల్లివైద్యం’ అనే మెడికల్ బుక్ రాశాను. ‘షుగర్ వ్యాధి సులభ నివారణ’, ‘బిపి వ్యాధి సులభ నివారణ’ వంటి పుస్తకాలు రాశాను.
సప్తసింధు నవల రాయడానికి నేను ప్రణాళిక వేసుకోవడానికి… ఒక మంచి చారిత్రక నవలగా దాన్ని తీర్చిదిద్దడానికి నాకు తోడ్పడిన ముఖ్యమైన వ్యక్తి లత. కళాప్రపూర్ణ తెన్నేటి హేమలత. వాళ్ళింట్లో సభ్యుడిగా పెరిగను. చాలా చిన్నవయసులోనే గొప్ప గొప్పవాళ్ళతో పరిచయాలుండడం, వాళ్ళు నన్ను అభిమానించడం నా అదృష్టం. ఇంట్లో మనిషిగా తిరిగినటువంటి వ్యక్తుల్లో ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు, జానకీబాల గారు ఉన్నారు. వారి పిల్లలతో బాటు నేనూ పెరిగాను. నాకంటే వాళ్ళు చాలా చిన్నపిల్లలు, కానీ నేను వాళ్ళింట్లో ఓ మనిషిగా ఉండేవాడిని. అలాగే లత వాళ్ళింట్లో ఉండేవాడిని.
సప్తసింధుకి పాఠకాదరణ ఎలా ఉంది?
అబ్బో! గొప్ప పేరు తెచ్చిపెట్టిందా నవల నాకు. బాలాంత్రపు రజనీకాంతరావుగారు నన్ను ‘సప్తసింధు పూర్ణచందు’ అని పిలిచేవారు. ఆయనకి ఆ నవల అంటే అంత అభిమానం. నాకు చక్కని గుర్తింపునిచ్చిందా నవల.
సప్తసింధు తర్వాత ఏం రాశారు?
ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పాలి. ఇది 1990లో నేను ‘సుమేరియన్స్ వర్ ఆర్యన్స్’ అన్న థీరీ ఆధారంగా ఇప్పుడు నేను చెప్పిన సగరుడి కథ రాశాను. ఈ ‘సుమేరియన్స్ వర్ ఆర్యన్స్’ అన్న అంశం మీద నా పరిశోధన కొనసాగుతూనే ఉంది. 2000 సవంత్సరంలో జరిగిన పరిశోధనలలో, సుమేరియా బాబిలోనియా పరిసర ప్రదేశాలలో జరిపిన తవ్వకాలలో పై పొరలలో ఆర్యుల అవశేషాలు దొరికాయి, భూమిలో ఇంకాస్త లోపలికి వెడితే సుమేరియాలో ఆర్యుల కంటే ముందు ద్రావిడులు ఉన్నారు, వాళ్ళ నాగరికత కూడా ఉందని బయటపడింది. సో ఎర్లీ సుమేరియన్స్ వర్ ద్రవిడియన్స్ అనే కొత్త థీరీ వచ్చింది. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇప్పుడు నేను చెప్పేటువంటి అంశాలను మన చరిత్రకారులు విస్మరించిన లేదా చదవని అంశాలు. తాజా పరిశోధన అంటారు కదా, ఇవేవీ పాఠ్యపుస్తకాలలో లేవు. ఏ యూనివర్శిటీ కూడా తమ పాఠ్యపుస్తకాలలో పొందుపరచలేదు. పాఠ్యపుస్తకాలలో లేదు కాబట్టి ఇప్పుడున్న చరిత్రకారులలో చాలామందికి దీని గురించి తెలియదనే చెప్పవచ్చు. వాళ్ళు ఏదైనా ఇంట్రస్టుగా బయట జరుగుతున్న పరిశోధానాంశాల గురించి తెలుసుకుని చదివితే తప్ప, చరిత్రలో అయితే ఇవి లేవు. ‘సుమేరియన్స్ వర్ ఆర్యన్స్’ అన్న అంశంపై సాధికారికంగా పరిశోధన చేసి ఉన్నాను కాబట్టి, ఆ నాగరికత అడుగున్న ఉన్న ద్రవిడియన్ నాగరికత అవశేషాల గురించి నేను చాలా తేలికగా అర్థం చేసుకోగలిగాను. ఈజిప్టు దగ్గర నుండి మహాపరివ్యాపనం జరిగింది.. గ్రేట్ ఇవల్యూషన్ అనేది ఈజిప్టు నుండే ప్రారంభమైందనేది అందరికీ తెలిసిన చరిత్రే. అందరూ అంగీకరించే విషయమే. సో, ఈజిప్టు నుంచి ప్రారంభమైనటువంటి ఈ భాషా పరివ్యాపనంలో ఒక మజిలీ సుమేరియా. సుమేరియన్ కల్చర్. మొట్టమొదట ఆర్యులు అక్కడికి రాక పూర్వమే ద్రావిడులు అక్కడికి వచ్చారు, అక్కడి నుండి హిందూమహాసముద్రం గుండా బంగాళాఖాతంలోంచి కృష్ణా గోదావరి ముఖద్వారాల ద్వారా అంటే దివిసీమ లేదా రాజమండ్రి పరిసర ప్రాంతాలలోకి తొలి ద్రావిడ మానవులు అడుగుపెట్టారు. సముద్రంలోంచి నది ద్వారా నేల మీదకు వస్తారు. కృష్ణా గోదావరి ముఖద్వారాల ద్వారా తొలి ద్రావిడ మానవులు తెలుగు నేల మీదకి అడుగుపెట్టారన్న దానికి నేను చాలా సాక్ష్యాలు సేకరించాను. ఎన్ని సాక్ష్యాలు సేకరించనంటే ఎవరూ చేయనంత కృషి నేను చేశాను!
ఉదాహరణ?
మనం పచ్చడి అంటాం. ఏ భాషావేత్త పచ్చడి శబ్దానికి మూలం చెప్పలేదు. pac అనే పదానికి to destroy, to break down అని అర్థాలిచ్చారు. పచ్ అనగా ధ్వంసం చేయడం లేదా పగలగొట్టడం. అక్కడ్నించి వచ్చింది పచ్చడి. పచ్ శబ్దానికి ఇంకో అర్థం కూడా ఉంది, నూరడం. మరో చిన్న ఉదాహరణ isq అంటే a sand అని అర్థమిచ్చారు. అంటే ఇసుక. ఇలాగ నేను చాలా పదాలు ఏరుకొచ్చా. ఏరుకొచ్చి మన భాషా పదాలకి మూలాలు ఆఫ్రో-ఆసియాటిక్ ఫామిలీ ఆఫ్ లాంగ్వేజెస్‌లో ఉన్నాయి, ఎందుకున్నాయి, ఏమిటీ అనేది నేను వెతకడం మొదలుపెట్టాను. ఫ్రాంక్లిన్ సి సౌత్‌వర్త్ అనే పరిశోధకుడు మహారాష్ట్ర లోని నాగపూర్ కేంద్రంగా పనిచేస్తున్నాడు. మరాఠీ అగ్రికల్చర్ ఒకాబులరీ మీద ఆయన పరిశోధన. హిందూమహాసముద్రం గుండా బంగాళాఖాతంలోంచి కృష్ణా గోదావరి ముఖద్వారాల ద్వారా తొలి ద్రావిడ మానవులు తెలుగు నేల మీదకి అడుగుపెట్టారని ఆయనే తొలిసారిగా ప్రతిపాదించాడు. ఆయన మ్యాప్ గీసి కృష్ణా గోదావరి ముఖద్వారాల రౌండ్ సర్కిల్ చుట్టి, బాణం గుర్తు వేసి ఇదిగో ఇక్కడే మొట్టమొదటి తొలి ద్రావిడ మానవుడు అడుగుపెట్టాడు అని రాశాడు. ఆయనేమీ ద్రవిడియన్ కాదు, తమిళుడు కాదు, ఇంకోడూ కాదు. ఇట్లాంటివి మన భాషావేత్తలు అందుకోలేదు. నా వరమనండీ, అదృష్టమనండీ, కృషి అనండి ఇలాంటివన్నీ నా కళ్ళలో పడ్డాయి. ఇలా చాలామంది పరిశోధకుల నుంచి విషయాలు సేకరించి నేను ‘నైలు నుండి కృష్ణ దాకా’ పేరుతో పుస్తకం రాశాను. మొదట ‘నడుస్తున్న చరిత్ర’ పత్రికలో వ్యాసాలుగా రాసాను, తర్వాత ఆ వ్యాసాలన్నింటిని పుస్తకంగా తీసుకొచ్చాము. ఆ పుస్తకాన్ని ద్రవిడ విశ్వవిద్యాలయం వాళ్ళు ప్రచురించారు.
నేను ‘తెలుగే ప్రాచీనం’ అనే పుస్తకం రాశాను. అప్పట్లో అధికార భాషా సంఘం చైర్మన్ ఎబికె ప్రసాద్ గారు అడిగి నా చేత వ్రాయించారు, అధికార భాషా సంఘం తరఫున ప్రచురించారు. దాన్ని హిందీ అకాడమీ పక్షాన అప్పటి హిందీ అకాడమీ అధ్యక్షులుగా ఉన్న మిత్రులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు దానిని హిందీలోకి అనువదింపజేశారు. నా మిత్రుడు వెన్నా వల్లభరావు ‘తెలుగు హీ ప్రాచీన్ హై’ పేరుతో హిందీలోకి అనువదించారు. తెలుగు భాషకి ప్రాచీన హోదా సాధించేందుకు వేసిన సాధన కమిటీ ఈ హిందీ అనువాదాన్ని ఢిల్లీ తీసుకువెళ్ళి అక్కడి పెద్దలకి నా పుస్తకాన్ని అందజేయడం వల్ల మన తెలుగు భాషకి కూడా క్లాసిక్ హోదా ఇవ్వడానికి మార్గం సుగమం అయ్యింది. ఆ విధంగా నా జీవితానికొస సంతృత్తి లభించింది. నా ఈ కృషి అంతా భాషోద్యమంలో ఒక భాగం.
ఈ రోజుకి కూడా నేను ఆఫ్రో-ఆసియాటిక్ ఫామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ నుంచి రోజూ ఒక పదాన్ని పరిచయం చేస్తున్నాను. ప్రతీ వ్యాసంలోనూ ఏదో ఒక రూపేణ ఆ పదాల ప్రోటో ఆఫ్రో-ఆసియాటిక్ రూట్స్ నుంచి ఎలా వచ్చాయో చెబుతునే ఉన్నాను. ఉదాహరణకి vad అంటే to burn, to cook అని అర్థం. దీన్నుంచే వడ, ఆవడ, వడియం వంటి పదాలు వచ్చాయి. వడ శబ్దం మనం తమిళ భాషలోది అనుకుంటాం, కాదండీ. తమిళ లెక్సికాన్‌లోగాని, తమిళ నిఘంటువులలో గాని వడ శబ్దం లేదు. చక్కగా తెలుగు నుంచి వెళ్ళిన మాట. మనవాళ్ళేమంటారు, వటువు అనే సంస్కృత మాటలోంచి వడ పుట్టింది అంటారు. ప్రతీది సంస్కృతంలో వెతకడమనేది మనకున్న చిన్న మానసిక బలహీనత వల్ల మన పదాలు ఏవీ కూడా మనవి కాకుండా పోయాయి. మనవేవీ లేవు అన్న అభిప్రాయాన్ని మన జనరేషన్‌లో కలిగించడంలో మన పండితులు కృతకృత్యులయ్యారు. ఇందులో నూరు శాతం విజయం సాధించారు. FBJ Kuiper అనే ఇంటర్నేషనల్ లింగ్విస్ట్ ఋగ్వేదంలో ఉన్న పదాలలో ఇండో-ఆర్యన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్‌కి చెందని వేరే భాషవి 367 లేదా 368 పదాలున్నాయి అని అన్నాడు. ఈ పదాలేవి కూడా ఇండో-ఆర్యన్ ఫామిలీ ఆఫ్ లాంగ్వేజెస్‌కి చెందినవి కావు అని అన్నాడు. ఇవి అయితే ద్రవిడియన్ పదాలు కాకుంటే ముండా వర్డ్స్ అని ప్రకటించాడు.
ముండా వర్డ్స్ అంటే?
ముండా అనేది మన ద్రావిడ భాషలానే ముండా భాష. బీహార్, ఆ పరిసర ప్రాంతాలలో మాట్లాడతారు. వాళ్ళ ప్రభావం మనపై చాలా ఉంది. మనం ‘ముండనం’ అంటామా, ఆ పదం వాళ్ళ నుంచి స్వీకరించినదే. ఆ జాతివారితో మనకి చాలా సాన్నిహిత్యం ఉండేది. వరి శబ్దం ఆ భాష నుండి వచ్చిందేనని చెబుతారు. ద్రావిడ భాష, ముండా భాష, ఋగ్వేద ఆర్య భాషల సంలీనమే భారతీయ భాషలకి మూలమని చెప్పవచ్చు.
ముఖ్యంగా ఆయన చెప్పిన 367 పదాలలో మయూర, మత్స్య, మీన, పుత్ర, గజ – ఈ పదాలేవి కూడా సంస్కృత పదాలు కావు, ఇవి సంస్కృతంలోకి వెళ్ళిన ద్రావిడ భాషా పదాలు కాని లేదా ముండా భాష పదాలు కాని అయి ఉంటాయి అని FBJ Kuiper ప్రకటించాడు. Kuiper’s List పేరుతో ఇది ఇంటర్నెట్‍లో లభిస్తుంది. అందులోని చాలా పదాలు సంస్కృత పదాలు కావా అని ఆశ్చర్యపోతాం. 1920లోనే కోరాడ రామకృష్ణయ్య పంతులు గారు పుత్ర, మత్స్య, తాళ – ఈ మూడు పదాలు తెలుగు మాటలే, తెలుగు నుంచే సంస్కృతంలోకి వెళ్ళాయి అని రాశారు. మహానుభావులు ఎప్పుడో చెప్పారు, కానీ మనమే వాటిని పట్టించుకోలేదు. ఇప్పటికీ పట్టించుకోవడం లేదు. ఇదే మనకి అపకారం చేస్తోంది.
మన భాషా మూలాలను ఎన్నో వేల సంవత్సరాలకి తీసుకువెళ్ళి కృష్ణా గోదావరి ముఖద్వారాలలోంచి ప్రవేశించిన ద్రావిడ మానవులే ఈ తెలుగు నేల మీద నుంచి ఇండస్ వేలీ సివిలైజేషన్ దాకా విస్తరించారు. సింధు నాగరికత నిర్మాణంలో ద్రావిడులు కూడా పాల్గొన్నారనేది ఇప్పుడు తాజా పరిశోధనాంశం. అంటే తెలుగు నేల మీద నుంచి విస్తరించిన జాతి సింధు నాగరికత వరకు వెళ్ళిందని అర్థం. ద్రవిడియన్స్ నిర్మాణ రంగ నిపుణులు. భారతదేశంలో గొప్ప గొప్ప నిర్మాణాలన్నింటిలోనూ తెలుగువారి పాత్ర ఉంది.
కృష్ణా జిల్లాకే పరిమితమై గనుక చూస్తే ఇక్కడ ద్రావిడులతో పాటు నాగులున్నారు, యక్షులున్నారు, గరుడులున్నారు. బలరామమూర్తి గారు చెప్పినదాని ప్రకారం ఆంధ్రులు ఇక్కడికొచ్చి వీళ్ళతో కలిసారు. కౌండిన్య సుచేంద్రుడు అనే వాడి పుత్రుడు ఆంధ్రుడు, ఆంధ్ర విష్ణువు అనేటువంటి వ్యక్తి ఇక్కడి నిశుంభనాగుడు అనే రాజుని ఓడించి తన ఆంధ్ర సామ్రాజ్యాన్ని ఇక్కడ వ్యవస్థాపించాడు అని మన పురాణాలలో ఉంది. ఇదే చరిత్ర కింద మనకి చెప్తున్నారు. అది వాస్తవం అయినా కాకపోయినా దాని సారాంశం ఏమిటి? ఆంధ్రుడు అనే వాడు బయటి నుంచి వచ్చి… ఉత్తరాది నుంఛి వచ్చి ఇక్కడ కలిసారు. ఇక్కడున్న రేసెస్‌ని వాళ్ళు ఓడించారు, ఇంతకుముందు చెప్పుకున్నట్టు సంఘర్షణల తర్వాత ఈ జాతులన్నిటి మధ్యా సంలీనాలు జరిగినాయి. ఈ సంలీనాలలో భాషలు కలిసిపోయినాయి, సంస్కృతులు కలిసిపోయాయి. కలిసి, జాతిపరంగా మనం ఆంధ్రులమూ, భాషపరంగా తెలుగువారం అయ్యాము. అందుకే తెలుగు భాషలో రెండు అంతకన్నా ఎక్కువ అర్థాలిచ్చే పదాలు చాలా ఉన్నాయి. ఇలా ఇంకో కోణం నుంచి తెలుగు వారి చరిత్రను చూసుకుంటూ వెళితే, మనం ఎంత చరిత్రను మిస్ అవుతున్నామో తెలుస్తుంది. మనకి గర్వాకారణమైన ఎన్నో విషయాలను మనం ఎందుకు మిస్ అయిపోతున్నాం? మన తరాలకి చెప్పడంలో మనం ఎందుకు ఫెయిలవుతున్నాం? మీరడగచ్చు, ఏవండీ మరి వీటన్నింటికి ఆధారాలేవిటి? అని. దీనికి చరిత్రకారులిచ్చే సమాధానం ఏమిటంటే – in the absence of archeological evidence, పురావస్తు ఆధారాలు లభ్యం కాని చోట, భాష అనేది ఒకటుంది కదా, భాష కంటిన్యూ అయ్యిందిగా, కాబట్టి భాషా పదాల చరిత్రని కనక మనం లాగగలిగితే, భాష ఆధారంగా, మనం చరిత్రని నిర్మించగలిగితే, అది చరిత్ర అవుతుంది. దాన్ని లింగ్విస్టిక్ ఆర్కియాలజీ అంటారు.
(సశేషం)