Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంభాషణం – కవయిత్రి, రచయిత్రి, బాలసాహితీవేత్త శ్రీమతి ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి అంతరంగ ఆవిష్కరణ

[సంచిక కోసం కవయిత్రి, రచయిత్రి, బాలసాహితీవేత్త శ్రీమతి ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి గారితో సంచిక టీమ్ జరిపిన ఇంటర్వ్యూ ఇది.]

సాహిత్యశ్రీ శ్రీమతి ఆకెళ్ల వెంకటసుబ్బలక్ష్మి సాహితీ పరిచయం:

ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి గారు ప్రసిద్ధ కవయిత్రి, రచయిత్రి, బాలసాహితీవేత్త. బిఎ బిఎడ్ చేసిన వీరు కేంద్ర ప్రభుత్వ సంస్థ E.P.F.O.నుంచి   ఆఫీసర్‌గా పదవీ విరమణ చేశారు. మలపాక మహాలక్ష్మి, మలపాక వెంకట నృసింహరాఘవేంద్రరావు గార్లు వీరి తల్లిదండ్రులు. వీరి శ్రీవారు శ్రీ ఆకెళ్ల వెంకట సుబ్బరావు (రిటైర్డ్ ఆడిట్ ఆఫీసర్). వీరి స్వస్థలం ఆంధ్ర ప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా లోని నరసపురం. ప్రస్తుత స్థిరనివాసం హైదరాబాదు, తెలంగాణా రాష్ట్రం. తన సాహితీ ప్రస్థానానికి ముఖ్యకారకులు చిన్నతనంలో తండ్రిగారనీ, ప్రస్తుతం భర్త శ్రీ ఆకెళ్ళ వెంకట సుబ్బారావుగారని రచయిత్రి పేర్కొన్నారు. ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి గారి గురించి, వారి రచనల గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం.

~

సంచిక టీమ్: నమస్కారం ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి గారూ. సంచికతో ముఖాముఖికి స్వాగతం.

ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి: నమస్కారం. ధన్యవాదాలు.

~

ప్రశ్న: సంచిక అంతర్జాల వార/మాసపత్రికతో పరిచయం ఎప్పుడు, ఎలా జరిగింది?

జ: సుమారుగా మొదలైనప్పటి నుంచి. ఈ పత్రిక ప్రారంభించబోయే ముందు, ఒక మీటింగులో శ్రీ కస్తూరి మురళీ కృష్ణగారు – ‘నాకు ఒక మ్యాగజైన్ పెట్టాలని కోరికగా ఉంది’ అని చెప్పారు. పత్రిక పెట్టిన తరువాత కూడా పెట్టానని తెలియచేయటం, అందరం పత్రిక చూస్తూ ఉండటం జరుగుతోంది.

ప్రశ్న: మీ బాల్యం, కుటుంబం, విద్యాభ్యాసం, ఉద్యోగం గురించి చెప్పండి.

జ: మా స్వస్థలం నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా. మా నాన్నగారు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇన్‍కమ్ టాక్స్‌లో ఇన్‌స్పెక్టరుగా పని చేస్తూ ఉండటం వల్ల తరచుగా బదిలీల వల్ల, నా బాల్యం, విద్యాభ్యాసం అనేక చోట్ల జరిగాయి. ఏలూరు, విజయవాడ, నరసాపురం, హైదరాబాదు ఇలా అనేక చోట్ల ఉండటం జరిగింది. అయితే ఎక్కవ కాలం ఉన్నది, ప్రస్తుతం 54 సంవత్సరాలుగా హైదరాబాదులోనే స్థిర నివాసం. డిగ్రీ విశాఖపట్నం, B.Ed. హైదరాబాదులో చేశాను. తరువాత Employee Provident Fund Organization కేంద్ర ప్రభుత్వ సంస్థలో L.D.C. గా చేరి ఆఫీసరుగా రిటైరు కావటం జరిగింది. దీనికి ముందు R.T.C. లో ఒక పది నెలలు పని చేయటం జరిగింది. కుటుంబం – ఒక అన్న, ఒక అక్క, నేను. అమ్మ గృహిణి. ఆర్థడాక్స్ ఉమ్మడి కుటుంబం. ఆడపిల్లగా మొదట చదువుకున్నది, ఉద్యోగం చేసినది మా కుటుంబంలో నేనే ప్రథమం.

ప్రశ్న: సాహిత్యం పట్ల అభిరుచి మీకు ఏ వయసులో కలిగింది? పుస్తకాలు చదివేందుకు ప్రేరణ ఎవరు?

జ: సాహిత్యం అంటే ఇంట్లో అందరికీ ముఖ్యంగా నాన్న, అమ్మలకి ఇష్టం కావటం వల్ల, ఇంట్లో అనేక పుస్తకాలు ఉంటూ ఉండటం వల్ల చిన్నతనం నుంచే సాహిత్యాభిలాష కలిగింది. చిన్నతనంలో నేను చూసిన, చదివిన మొదటి పుస్తకం ‘చందమామ’. అందువల్ల చిన్నపిల్లల కథలంటే మక్కువ ఎక్కువగా ఏర్పడింది. అయినప్పటికీ, బాల సాహిత్యంతో పాటు ప్రౌఢ కథలు, కవిత్వం, నాటకం, అనువాదం లాంటి అన్ని ప్రక్రియలు చేపట్టటం, ఎంతో కొంత ప్రావీణ్యం సంపాదించటం జరిగింది.

ప్రశ్న: పాఠశాల/కళాశాల రోజుల్లో ఎక్కువగా ఏ పుస్తకాలు, ఏ రచయితలని చదివారు?

జ: పాఠశాల, కళాశాలలప్పుడు, ఎక్కువగా యద్ధనపూడి సులోచనారాణి, కోడూరి కౌసల్యాదేవి, కొమ్మూరి సాంబశిరావు (డిటెక్టివ్ సాహిత్యం కూడా ఇష్టం) వసుంధర మొదలగు వారి పుస్తకాలు, బాలసాహిత్యం, చదవటం జరిగేది.

ప్రశ్న: మీ కుటుంబంలో ఎవరైనా సాహితీవేత్తలు/రచయితలు ఉన్నారా?

జ: మా కుటుంబంలో ఎవరూ లేరు, కానీ మామగారు ఆకెళ్ల సీతారామంగారూ హిందీ సంస్కృతాంధ్ర పండితులు, కవి రచయిత (కాని మామగారి పోలిక రాదుగా).

ప్రశ్న: ఓ పాఠకురాలి నుంచి రచయిత్రిగా మారిన క్రమం గురించి చెప్తారా? మీ తొలి సాహితీ ప్రక్రియ ఏది?

జ: రాయాలనే తపన చిన్నప్పటి నుంచి ఉండేది. నా తొలి సాహితీ ప్రక్రియ బాల సాహిత్యమే. ‘సుందరయ్య తీర్ధయాత్ర’ అనే కథ ‘బొమ్మరిల్లు’లో 1976లో వచ్చింది. ‘పాపం సంధ్య’ ప్రౌఢ కథ విజయ మాసపత్రికలో 1983లో వచ్చింది. రెండూ శ్రీ విజయబాపినీడు గారి పత్రికలే. తరువాత అనేక బాలల, పెద్దల పుస్తకాలతో, రేడియోలో, టి.వి.లో, అంతర్జాల పత్రికల్లో అనేక పక్రియలలో రచనలు ప్రచురించబడ్డాయి.

ప్రశ్న: చదువు పూర్తి చేసుకుని, ఉద్యోగం సంపాదించి కుటుంబ బాధ్యతలలో లీనమయ్యాకా, చదవడం తగ్గిందా? ఆస్తకులు మారాయా?

జ: కొంచెం రాయటం, చదవటం తగ్గటం జరిగిన మాట నిజమే – ఇంటా, ఆఫీసులో బాధ్యతల వల్ల. కానీ చాలా కాదు.

ప్రశ్న: కవిత, కథ, బాలసాహిత్యం, అనువాదం – ఈ ప్రక్రియలలో మీకు ఏది ఇష్టం? ఎందుకు?

జ: అన్నీ ఇష్టమే అయినా; కథ, కవిత, అనువాదం, బాలసాహిత్యంలో అనేక రచనలు చేస్తున్నా బాలసాహిత్యం అంటే ప్రత్యేక మక్కువ. కారణం తెలియదు కానీ ‘చందమామ’ వేసిన ముద్ర యొక్క ప్రభావం కావచ్చు.

ప్రశ్న: మీ దృష్టిలో కవితకి సంబంధించి లయ, వస్తువు, భావ వ్యక్తీకరణలో ఏది ముఖ్యం? ఎందువలన?

జ: నా ఉద్దేశంలో భావవ్యక్తీకరణం ముఖ్యం. ఎందుకంటే ఎంత గొప్ప వస్తువు తీసుకున్నా సరిగ్గా వ్యక్తీకరించకపోతే, ఎదుటివారికి మన భావం అర్థం కాకపోతే మన శ్రమ వృథాయేగా అనిపిస్తుంది.

ప్రశ్న: కథ వ్రాసేటప్పుడు మీరు వస్తువు/శిల్పం/శైలి – దేనికి ప్రాధాన్యతనిస్తారు?

జ: కథకు సంబంధించి, నేనైతే వస్తువుకు ప్రాధాన్యం ఇస్తాను. కొత్త సబ్జెక్టు తీసుకుంటాను సాధారణంగా.

ప్రశ్న: మీరు ఎన్నో చక్కని కథలు వ్రాశారు. బహుమతులు పొందారు. ఐతే, మీ పేరు చెప్పగానే చాలా మందికి మీ బాలసాహిత్యమే గుర్తొస్తుంది. ఈ ప్రత్యేక గుర్తింపు పట్ల మీ అభిప్రాయం?

జ: ఆనందంగానే అనిపిస్తుంది. ఎవరికీ అన్ని విషయాలలోనూ గుర్తింపు ఆసక్తి ఉండదు కదా. ఏదో ఒక విషయంలో ప్రత్యేకత, ఆసక్తి ఉంటాయి.

ప్రశ్న: కవిత్వం, కథలు వ్రాయడం తగ్గించి, బాలసాహిత్యంపైనే ప్రత్యేకంగా దృష్టి సారించడం ఎప్పటి నుంచి ప్రారంభించారు?

జ: తగ్గించటం ఏమీ కాదు. ఎప్పుడు, ఏది రాయాలి అనినిపిస్తే అది రాస్తాను. ఒక్కోసారి ఒక వస్తువు (subject) తీసుకుంటే దాని మీద మూడు రకాలు రాసేస్తాను. ఉదా – వృద్ధాప్యం గురించి రాసినప్పడు ‘రిటైర్‍మెంట్’ అనే కవిత రాశాను. ‘శత్రువు వాటా’ అనే బాలల కథ రాశాను. ‘మనిషికి శత్రువు’ అని అనే పెద్దల కథ రాశాను. మూడు అందరికీ నచ్చాయి.

ప్రశ్న: మీరు రచించిన ‘అసలు లోపం’, ‘విలువైనవి’ అనే పిల్లల కథలు మహారాష్ట్రలో 9వ, 7వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలుగా చేర్చడం గురించి మీ అభిప్రాయమేమిటి? ఇదెలా సాధ్యమైంది? ఆ కథల గురించి చెప్తారా?

జ: వారు నా బాలల పుస్తకాలు చదివి, ఆ కథలు బాగున్నాయని నన్ను సంప్రదించారు. ఇది చాలా ఆనందకరమైన విషయం కదా – నా కథలు పిల్లలకు పాఠ్యాంశాలు కావటం.

పాఠ్యాంశాలు:

విలువైనవి (7వ తరగతికి తీసుకున్నది): ఒక తల్లి తన కూతురు స్నేహితురాలి పుట్టినరోజుకు ఇవ్వమని పుస్తకాలు ‘బాలలవి’ ఇస్తుంది. కూతురు ఇష్టపడదు. అందరు ఖరీదైన వెండి లాంటివి, బొమ్మలు ఇస్తారని, ఇవి ఇస్తే నవ్వుతారని అంటుంది. కానీ తల్లి అవే ఇవ్వమని లేకుంటే పార్టీకి వెళ్లద్దని అంటుంది. అప్పుడు కూతురు పార్టీ మానటం ఇష్టం లేక, తప్పనిసరిగా అవి తీసికుని వెడుతుంది. కానీ అక్కడ అందరినీ రంగు రంగుల బొమ్మలతో ఉన్న ఆ కథల పుస్తకాలు చాలా ఆకర్షిస్తాయి. అందరూ మెచ్చుకుంటారు. కూతురు ఆనందంగా ఇంటికొచ్చి తల్లికి చెబుతుంది.

అసలు లోపం (9వ తరగతికి తీసుకున్నది): ఈ కథలో రంగయ్య, రాజమ్మలకు అవయవలోపం ఉన్న ఒక కొడుకు రాజు (దివ్యాంగుడు), అవయవాలు చక్కగా ఉన్న మరో కొడుకు రాము ఉంటారు. వారు రాజు గురించి దిగులు పడుతుంటారు. ఒకసారి మేనమామ వచ్చినప్పుడు గమనించగా రాజు అన్ని పనుల చక్కబెడుతుండగా, ఏ లోపమూ లేని రాము సోమరిలా పడుకుని ఉంటాడు. అప్పుడు మేనమామ, తన అక్క, బావలు చింతించవలసినది రామూ గురించే కానీ రాజు గురించి కాదని చెప్పుతాడు. అసలు లోపం ఉన్నది రామూకేనని చెప్పగా వారికి ఏమి చేయాలో అర్థమవుతుంది.

ప్రశ్న: మీ ముద్రిత రచనల గురించి వివరించండి. ఏ పుస్తకం మీకు బాగా పేరు తెచ్చిందని మీరు భావిస్తారు?

జ: ఇప్పటి వరకు నావి సుమారుగా మొత్తం 25 బాలల, కథా, కవితా, వయోజన విద్యా, అనువాద పుస్తగాలు ప్రచరించబడ్డాయి. నాకు నా మొదటి పుస్తకం ‘బాల మందారం’ చక్కని పేరు తెచ్చంది. అనేక కాపీలు అమ్ముడుపోయాయి. పలుముద్రలు పొందింది.

ప్రస్తుతం ‘మా బాల కథలు’ మంచి పేరు తెస్తోంది. N.R.I లను కూడా ఆకర్షించి కొనుగోలు చేయబడి, మన బడి, బాలమిత్ర కార్యక్రమాల (సిలికాన్ ఆంధ్ర) బాలలకు వినిపించబడుతున్నాయి, ఆ పుస్తకంలోని కథలు (story telling). ఇండియాలో కూడా బాగా అమ్ముడు పోయి, మంచి గుర్తింపు తెస్తున్నవి. ఈ పుస్తకంలోని మొత్తం కథలు సంచిక.కామ్ లోనే ప్రచురించబడి, ప్రచురణ కాలంలోనే మంచి గుర్తింపు వచ్చింది.

ప్రశ్న: వయోజన విద్యకి సంబంధించి మీరు రెండు పుస్తకాలు వ్రాశారు. వీటి గురించి చెప్పండి? ఏదైనా ప్రభుత్వ/స్వచ్ఛంద సంస్థల కోసం రాశారా? ఈ అవకాశం ఎలా వచ్చింది?

జ: ఒక స్వచ్ఛంద సంస్థ కోరిక పై రాయటం జరిగింది.

ప్రశ్న: వర్ధమాన రచయిత రచయిత్రులను చదువుతున్నారా? వారికి మీరేం సూచనలు చేస్తారు? తెలుగు భాషని కాపాడుకోడానికి ఏమేం చేయాలని మీరు భావిస్తున్నారు?

జ: చదువుతున్నాను. భాషను, సంస్కృతిని, బాల సాహిత్యాన్ని కాపాడుకునే రచనలు చేయాలని, అందరు నవ రచయితలు, కృషి చేస్తే బాగుంటుంది అని సూచన, కాదు కోరిక.

తెలుగు భాషను కాపాడుకోవటానికి రచయితల కృషి మాత్రమే కాక ప్రభుత్వం  సహాయం కూడ అవసరం. కనీసం ఇంటి వరకు, మన పిల్లలైనా తెలుగు మాట్లాడటం, రాయటం చేసేలా చూడాలి అని చెబుతున్నాను.

ప్రశ్న: మీరు బాల గోకులం, ఆకెళ్ళ అసోసియేషన్ అనే సంస్థల వ్యవస్థాపకులు. ఈ సంస్థల తరఫున మీరు చేసే కార్యక్రమాల గురించి తెలియజేస్తారా?

జ: బాలగోకులం, ఆకెళ్ల అసోషియేషన్ సంస్థల ద్వారా ప్రౌఢ, బాలకథా రచయితలను, బాలలను ఆకెళ్ల సాహితీ పురస్కారం, బాలనేస్తం, బాల ప్రియ, బాల చాతుర్య అవార్డులతో సత్కరించటం, పిల్లలకి కథల పోటీలు పెట్టి చదువు, సాహిత్యంలో ప్రోత్సహించటం జరుగుతోంది.

ప్రశ్న: సాహితీపరంగా మీకు లభించిన పురస్కారాలు, బహుమతుల గురించి వివరంగా చెప్పండి.

జ: ముఖ్యమైనవి: 1. తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం 2. మాతృవందన పురస్కారం ప్రముఖ సాహితీ సంస్థల నుంచి. 3. భారత భాషా భూషణ్ 4. సాహిత్య శ్రీ.

బాల సాహిత్య విదుషీమణి, తెలంగాణా సారస్వత పరిషత్ వారి బాల సాహిత్య విశిష్ట సేవా కృషి పురస్కారం, డా. పోతుకూచి రచయిత్రి మొల్ల ఇంకా ఊటుకూరి, బోయి హైమవతి, డొక్కా సీతమ్మ, గిడుగు రామ్మూర్తి, మంచిపల్లి సత్యవతి, మాచిరాజు, రెడ్డి రాఘవయ్య మొదలగు వారి వారసుల/సంస్థల పురస్కారాలు లేదా అవార్డులు పొందాను.

ఇంకా లేడీ లెజెండ్, లిటరరీ వారియర్, కళాసాగర్, బాల సాహితీరత్న, బాల సాహిత్య శిరోమణి, బాల సాహితీ రసజ్ఞ మొదలైన బిరుదులు (32) లభించాయి.

ప్రశ్న: రచయిత్రిగా మీ సాహిత్య సృజనను మీ కార్యాలయ ప్రయోజనాలకు, ముఖ్యంగా చట్టాలపై కార్మికులకు అవగాహన కల్పించడానికి ఏ విధంగా ఉపయోగించారు?

జ: నా రచనా ప్రక్రియని ఆఫీసు కోసం కూడా ఉపయోగించటం జరిగింది.

Act & Scheme Promotion Work లో భాగంగా P.F. చట్టం పై అవగాహన కలిపించటానికి నాటకం, కథలు, కవితలు ఆఫీసు క్లబ్ తరుపున, స్వంతంగాను, ఇతరులతో కలిసి రాయటం, కొన్నింటిలో పాల్గొనటం జరిగింది. హోటల్ పి.ఎఫ్ (నాటకం) ఇతరులతో కలిసి, వటవృక్షం కథ (స్వంతం) చుట్ట లాంటి చట్టం (స్వంతం) కవిత, భవిష్యనిధి బంగారు ఖని (స్వంతం) కవిత మొదలైనవి. ఇవి దూరదర్శన్ లోను, రేడియో కార్మికుల కార్యక్రమంలోను హైదరాబాదు, వరంగల్ కేంద్రాలలో ప్రసారం కాబడ్డాయి.

ప్రశ్న: సాహిత్యానికి సంబంధించి మీ భవిష్యత్తు కార్యక్రమాలేమిటి? కొత్త పుస్తకాలేవైనా సిద్ధమవుతున్నాయా?

జ: ఒక బాలల పుస్తకం, ఒక ప్రౌఢ కథల పుస్తకం, ఒక కవితా సంపుటి ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి.

బాల సాహిత్యానికి సాహిత్యంలో ఇతర ప్రముఖ ప్రక్రియలతో సమానమైన స్థానం, ప్రాముఖ్యం లభించాలి. అందుకు అవసరమైన కృషి చేయాలని నా ఉద్దేశం, కోరిక. అందుకు ఇతరులను కూడా ప్రోత్సహిస్తున్నాను.

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి గారూ.

ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి: ధన్యవాదాలు. నాకీ అవకాశం ఇచ్చిన సంచిక.కామ్ యాజమాన్యానికి, టీమ్‌కి నా కృతజ్ఞతలు.

♦

Exit mobile version