[‘సంచిక’ కోసం సారస్వత కళానిథి, ఆచార్య వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారితో సంచిక టీమ్ జరిపిన ఇంటర్వ్యూ ఇది.]
ఆచార్య వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారు తెలుగు, సంస్కృత భాషలలో అధ్యాపకురాలు. ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. భాషా, సాంస్కృతిక, సామాజిక సేవలకు పలు పురస్కారాలు అందుకున్నారు. వారి గురించి, వారి రచనల గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం.
~
ప్రశ్న 1. నమస్కారం ఆచార్య వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారూ. ‘సంచిక’తో ముఖాముఖికి స్వాగతం.
ప్రశ్న 2. ‘సంచిక’ అంతర్జాల వార/మాసపత్రికతో పరిచయం ఎప్పుడు, ఎలా జరిగింది?
జ: 2019 నుండి ‘సంచిక’తో నాకు పరిచయం ఉన్నది. ప్రముఖ కథా, నవలా రచయిత్రి శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి గారి సాహిత్య సమాలోచన సదస్సుతో కస్తూరి మురళీకృష్ణ గారితో పరిచయం ఏర్పడింది. ఆ సందర్భంలో ‘సంచిక’ ప్రస్తావన వచ్చింది. అప్పటినుండి ‘సంచిక’లో వ్యాసాలు, విషయాలు చూస్తున్నాను. అనంతర కాలంలో నా వ్యాసాలు, కథలు ప్రచురితం అవుతున్నాయి.
ప్రశ్న 3. మీ బాల్యం, కుటుంబం, విద్యాభ్యాసం, ఉద్యోగం గురించి చెప్పండి.
జ: గుంటూరు జిల్లా అమృతలూరు మా తండ్రిగారి స్వస్థలం. తాతగారు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నందుకుగాను పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని ఒక గ్రామంలో ప్రభుత్వం వారు కొంత వ్యవసాయ భూమిని కానుకగా ఇచ్చారు. మా తండ్రి అక్కడ వ్యవసాయం చేసేవారు. నా విద్యాభ్యాసం ఏలూరులో కస్తూరిబా బాలికోన్నత పాఠశాలలోనూ, అనంతరం శ్రీ చింతలపాటి బాపిరాజు ఓరియంటల్ కళాశాలలోను సాగింది.
ఓరియంటల్ బి.ఎ. పూర్తి చేసి, వాల్తేరు ఆంధ్రవిశ్వ విద్యాలయంలో ఎం.ఏ. తెలుగు; పిహెచ్.డి. పూర్తిచేశాను. బి.ఏ. లో విశ్వవిద్యాలయ స్థాయిలో రెండో ర్యాంకు, ఎం.ఏ. విశ్వవిద్యాలయం ప్రథమ రాంకు సంపాదించుకున్నాను. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్రాతపరీక్ష, మౌఖిక పరీక్షలో అర్హత సాధించి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకురాలిగా నియామకం పొందాను. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు (3rd Zone) జిల్లాల్లో లెక్చరర్‌గా, రీడర్‌గా, ప్రొఫెసర్‌గా, ప్రిన్సిపాల్‌గా 3 దశాబ్దాల పాటు పనిచేసి ఉద్యోగ విరమణ చేశాను. ఎం.ఏ. సంస్కృతం కూడా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత పొంది సంస్కృతశాఖ అధ్యాపకురాలిగా కూడా విధులు నిర్వర్తించాను.
తెలుగు, సంస్కృత అధ్యాపకురాలిగా విద్యార్థులకు పాఠ్యాంశాలే కాక అవకాశం ఉన్న సందర్భాలలో వారి వ్యక్తిత్వవికాసానికి తగిన అంశాలు బోధించగలిగాననే సంతృప్తి నాకు కలిగింది.
గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాలలో NCC ఆఫీసర్‌గా కొంతకాలం, NSS ప్రొగ్రామ్ ఆఫీసర్‌గా కొంత కాలం బాధ్యతలు చేపట్టి విద్యార్థినులలోని ప్రతిభకు మెరుగులు దిద్దే అనేక కార్యక్రమాలు నిర్వర్తించినాను.
ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కళాశాల గ్రేడ్ని నిర్ణయించే UGC వారి NAAC (National Assessment and Accreditation Council) విధానంలో కళాశాల ప్రిన్సిపాల్‌గా నేను విధులు నిర్వర్తించిన 2 కళాశాలలకు మంచి గుర్తింపు తెచ్చే విధంగా కృషి చేశాను. కళాశాలలకు ప్రభుత్వం నుండి, UGC నుండి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయించి కళాశాలల అభివృద్ధికి కృషిచేసి నా వృత్తిపరంగా నేను సాధించిన విజయాలుగా నేను భావిస్తున్నాను.
ప్రశ్న 4. సాహిత్యం పట్ల అభిరుచి మీకు ఏ వయసులో కలిగింది? పుస్తకాలు చదివేందుకు ప్రేరణ ఎవరు?
జ: ఓరియంటల్ బి.ఎ. పూర్తిగా తెలుగు, సంస్కృతభాషా, సాహిత్యాలకు సంబంధించినదే. అప్పటి నుండి సాహిత్యంతో పరిచయం, అభిరుచి ఏర్పడినాయి. మా అధ్యాపకులు కళాశాల స్థాయిలో అనేక సాహిత్య గ్రంథాల గురించి మాట్లాడించేవారు. పద్య పఠనంలో పోటీ నిర్వ హించేవారు. సంస్కృతభాషలో ప్రసంగాలు చేయించేవారు. మా గురువుగారు శ్రీ చిఱ్ఱావూరి శివరామకృష్ణశర్మ గారి నుండి నేత్రావధానం నేర్చుకున్నాను. పెద్దలు, పండితులు చేసే అవధానాలలో ప్రేక్షకురాలిగా, పృఛ్ఛకురాలిగా పాల్గొంటూ ఉండేదాన్ని. అప్పటి నుండి సాహిత్యాధ్యయనం ప్రారంభం అయింది.
ప్రశ్న 5. పాఠశాల/కళాశాల రోజుల్లో ఎక్కువగా ఏ పుస్తకాలు, ఏ రచయితలని చదివారు?
జ: కళాశాలరోజుల్లో ఎక్కువగా కొ.కు. నవలలు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి కథలు, ప్రాచీన పద్యసాహిత్యం ఎక్కువగా చదివాను.
ప్రశ్న 6. మీ కుటుంబంలో ఎవరైనా సాహితీవేత్తలు/రచయితలు ఉన్నారా?
జ: ఎవ్వరూ లేరు.
ప్రశ్న 7. ఓ పాఠకురాలి నుంచి రచయిత్రిగా మారిన క్రమం గురించి చెప్తారా? మీ తొలి సాహితీ ప్రక్రియ ఏది?
జ: ఎం.ఏ పూర్తి చేసి పిహెచ్.డి. పరిశోధన చేస్తున్న రోజుల్లో పత్రికలకు వ్యాసాలు వ్రాయటం ప్రారంభించాను. నా పరిశోధనాంశం పైనా, ఇంకా కొన్ని గ్రంథ పరిచయాలు మొదలైనవి ఆనాడు ప్రాచుర్యంలో ఉన్న నవభారతి, స్రవంతి, సమాలోచన వంటి సాహిత్యపత్రికలలో ప్రచురింపబడినాయి.
ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి పుస్తక సమీక్షలు కొన్ని ప్రసారం అయినాయి. అలా నా తొలి సాహితీ ప్రక్రియ విమర్శ వ్యాసం. ఆ తరువాత కవిసమ్మేళనాలలో పాల్గొంటూ కవిత్వరచన ప్రారంభించాను.
2001 లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఉత్తమ అధ్యాపక పురస్కారం
ప్రశ్న 8. చదువు పూర్తి చేసుకుని, ఉద్యోగం సంపాదించి కుటుంబ బాధ్యతలలో లీనమయ్యాకా, చదవడం తగ్గిందా? ఆస్తకులు మారాయా?
జ: మీరన్నట్లు ఉద్యోగ బాధ్యతలతో పఠనాభ్యాసం కొంత తగ్గిందని చెప్పవచ్చు. APPSC ద్వారా లెక్చరర్ ఉద్యోగం వచ్చేనాటికి నేను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో Post – Doctoral Research చేస్తున్నాను. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో డిగ్రీ కళాశాలలో నా మొట్టమొదటి నియామకం జరిగింది. అది చాలా మారుమూల ప్రదేశం అప్పటికి. అక్కడ సాహిత్యపఠనం బాగా తగ్గిపోయింది. అక్కడి నుండి బదిలీ అయి ప్రకాశం జిల్లా చీరాల ప్రభుత్వ మహిళా కళాశాలకు వచ్చిన తరువాత తిరిగి ప్రారంభించాను. పఠనాసక్తి మారలేదు. అవకాశం ఉన్నంత మేరకు కొనసాగించాను. తెలుగు సాహిత్యం బోధనాశం కావటం నాకు మేలు చేసింది. పాఠ్యాంశాల బోధన క్రమంలో ఆయా కవులకు సంబంధించిన రచనలు చదివే సదవకాశం కలిగింది.
గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాలలో పని చేసిన కాలంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం కళాశాల అధ్యాపకులకు పరిశోధన పర్యవేక్షణ అవకాశం కల్పించింది. 2006 నుండి తెలుగు ఎం.ఫిల్, పిహెచ్.డి. పరిశోధకులకు పర్యవేక్షకురాలిగా సేవలందించాను. వివిధ అంశాలను పరిశోధకులకు కేటాయించటం లోను, పర్యవేక్షణ సాగించటంలోనూ పఠనాభ్యాసం ద్విగుణీకృతం అయింది. ఎక్కువగా వచన కవిత్వం, గజల్, నానీ, కథా, నవలా సాహిత్యాలు అధ్యయనం చేశాను.
2001లో ఆచార్య సి. నారాయణ రెడ్డి గారిచే ప్రశంస
ప్రశ్న 9. పిహెచ్‌డిలో మీ పరిశోధనాంశమేది? మీ మార్గదర్శకులు ఎవరు? మీ థీసిస్ ప్రత్యేకత ఏమిటి? పుస్తకంగా ముద్రించారా?
జ: ‘ప్రబంధయుగము – అష్టాదశ వర్ణనలు’ నా పరిశోధనాంశం. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆచార్య లకంసాని చక్రధరరావుగారి పర్యవేక్షణలో పూర్తి చేశాను. మనుచరిత్ర మొదలైన ప్రబంధాలు అష్టాదశ వర్ణనా ప్రధానంగా రచింపబడినవి కదా. వాటి నేపథ్యం, ప్రబంధాలతో వర్ణనల ఔచిత్యం, ఆయా కవుల కల్పనా చాతుర్యం మొదలైన అంశాలు చర్చించబడినాయి. నా సిద్ధాంత గ్రంథం ముద్రింపబడలేదు.
ప్రశ్న 10. కథ గానీ, కవిత గానీ, వ్యాసం రాయాలనుకున్నప్పుడు ఇతివృత్తం ఎలా ఎంచుకుంటారు?
జ: కవుల జయంతుల, వర్ధంతుల నిర్వహణ సందర్భాలలోను, సాహిత్యసదస్సులలో (Seminars) పత్ర సమర్పణ కావించిన సందర్భాలలోను ఆయా అంశాలకు సంబంధించిన పరిశోధనాత్మక వ్యాసాలకు ఇతివృత్తం నిర్ణయింపబడుతుంది. సందర్భానుగుణమైన కవి సమ్మేళనాలకు కవిత్వవస్తువు స్వీకరింపబడుతుంది. ఏదైనా ఒక సామాజిక ఘటనకు మనస్సు స్పందించినప్పుడు కథావస్తువు స్ఫురిస్తుంది.
విశాఖపట్నం ప్రసన్న భారతి ఉత్తమ పద్య విమర్శ పురస్కారం
ప్రశ్న 11. మీకు బాగా ఇష్టమైన సాహితీప్రక్రియ ఏది? ఎందువల్ల?
జ: నాకు ఇష్టమైన సాహిత్య ప్రక్రియ విమర్శ వ్యాసం. సాహిత్యం సమున్నత వ్యక్తిత్వ వికసనానికి స్ఫూర్తిని కలిగిస్తుంది. నేటి యువత నేర్చుకోవలసిన అనేకాంశాలు, సాహిత్య గ్రంథాలతో నిక్షిప్తమై ఉంటాయి. సాహిత్యం సార్వజనీనమైన, సార్వకాలికమైన సత్య, ధర్మ ప్రతిపాదకం. వాటిని వెలికితీసి సమాజానికి అందించటం, సాంస్కృతిక విలువలను నేటి తరానికి అన్వయించి చూపటం వలన కొంతైనా మేలు జరుగుతుందనే భావనతో చాలా వ్యాసాలు వ్రాశాను. వ్రాస్తున్నాను. ఉపన్యాసాలు చెప్తున్నాను.
ప్రశ్న 12. మీ ముద్రిత రచనల గురించి వివరించండి. ముఖ్యంగా ‘అభిశప్త’ కథాసంపుటి ప్రచురణ నేపథ్యం చెప్పండి.
జ: ఆచార్య లకంసాని చక్రధరరావుగారి సంపాదకత్వంతో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ‘తెలుగు వ్యుత్పత్తి కోశ’ నిర్మాణంలో సహసంపాదకత్వం వహించాను. ఆంధ్ర విశ్వకళా పరిషత్తు ముద్రణలో 8 సంపుటాలుగా అది వెలువడింది. ఇది నా తొలి కూర్పు.
ఆకాశవాణి విశాఖపట్నం, విజయవాడ కేంద్రాల నుండి ప్రసారమైన సాహిత్య వ్యాసాలు ‘చిగురుపొదలు’ పేరుతో 2001లో ముద్రింపబడినాయి. ‘అక్షరవృక్షం’ కవితాసంపుటి 2002లో వెలువడింది.
UGC వారు మంజూరు చేసిన మైనర్ రీసెర్చి ప్రాజెక్టుల కోసం 3 రచనలు చేశాను. 1. ‘భగవద్గీత – వ్యక్తిత్వవికాసం’. ఇది మూడు ముద్రణలు పొందింది. 2. ‘ఆధునికాంధ్ర కవిత్వంతో వ్యక్తిత్వవికాసం’, 3. ‘మహాభారతంలో మేనేజ్మెంట్ రీతులు’ అనే రెండు రీసెర్జి ప్రాజెక్టులు అముద్రితాలు. ‘భగవద్గీత- వ్యక్తిత్వవికాసం’ గ్రంథం కన్నడంలోనికి అనువదింపబడింది. కులశేఖరాళ్వారుల సంస్కృత స్తోత్ర కావ్యం ‘ముకుందమాల’ కు మరంద వ్యాఖ్య రచించి 2014లో వెలువరించాను.
గుంటూరు బృందావన్ గార్డెన్స్ కంచి కామ కోటి పీఠ శ్రీవేంకటేశ్వర దేవస్థానం ప్రాంగణంలో అన్నమయ్య కళా వేదిక నుండి పలు సాహిత్య, ఆధాత్మిక, సామాజిక కార్యక్రమాలు, భువన విజయం వంటి సాహిత్య రూపకాలలోను పాల్గొన్ని అనుభవంతో సామాజిక సందేశం ప్రధానంగా కొన్ని సాహిత్య రూపకాలు రచనకు నేపథ్యం ఏర్పడింది.
‘ప్రకృతి విలాసం’ పేరుతో 2017లో రూపక సంపుటి వెలువడింది. గుంటూరు బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయనిర్మాణ చరిత్ర ‘గుంటూరు తిరుపతి’ పేరుతో వచనకావ్యంగా రచింపబడింది. ఇది మూడు పర్యాయాలు పరివర్ధిత ముద్రణలుగా వెలువడింది.
‘ఎక్కడికీ పయనం?’ వచన కవితా సంపుటి 2019లో ముద్రించాను.
ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణగారు రచించిన 1) సుగుణాఢ్య శతకం 2) మహాదేవి మత్తేభ తారావళి 3) దివాకరవృత్త తారావళి 4) పావక వృత్త తారావళి 5) సుజలవర్త తారావళి 6) వసుంధరావృత్త తారావళి 7) అంతరిక్ష వృత్త తారావళి 8) సమీరవృత్త తారావళి – పద్యకావ్యాలకు మిత్రవ్యాఖ్య పేరుతో విపులమైన వ్యాఖ్యలు వెలువరించాను.
అనంతరం సమీక్షా సౌరభాలు 2025 లో వెలుగుచూసింది. గత సంవత్సరాల ఆంధ్ర జ్యోతి, విశాలాంధ్ర, మిసిమి వంటి పత్రికలలో శ్రీ వెలువడిన పద్యకావ్య, వచన కవిత్వ, కథ, నవల, నాటక, పరిశోధక దోస, గేయకావ్య, నిఘంటువుల సమీక్షా వ్యాసాలు ఈ గ్రంథం. దీనిలో మన ‘సంచిక’ అంతర్జాల పత్రికలో వెలువడిన వ్యాసాలు సైతం చోటు చేసుకోవటం ఆనందదాయకం.
2025లోనే ‘కథల కొలువు’ను వెలువరించాను. ఆంధ్రజ్యోతి గుంటూరు జిల్లా సంచికలో ప్రతి సోమవారం ‘అమరావతీయం’ శీర్షికతో ‘కథాపరిచయం’ వ్రాశాను. గుంటూరు జిల్లాలో తొలి తరం కథకుల నుండి ప్రారంభించి ఒక్కోక్కరి కథలను పరిచయంచేస్తూ సాగిన శీర్షిక అది. దాదాపు 96 మంది కథకుల కథల విశ్లేషణను ‘కథల కొలువు’లో పొందుపరిచాను.
ఇక మీరు ప్రత్యేకంగా ప్రస్తావించిన ‘అభిశప్త’ కథాసంపుటి. సమాజంలో తల్లిదండ్రుల తప్పిదాల వలన కాని, పిల్లల అమాయకత్వం వలన కాని వారు చేయని తప్పులకు శిక్షగా దైన్యం అనుభవిస్తూ అనాథాశ్రమాలలో బ్రతుకు వెళ్ళదీస్తున్న వారు శాపగ్రస్తులుగా భావింపబడతారు. `అభిశప్త’ అంటే విధి చేత శపింపబడినవారు అని అర్థం. అలాంటి దయనీయమైన పరిస్థితులలో ఉన్న బాల, బాలికల జీవన సత్యాలను కథా వస్తువులుగా స్వీకరించి రచించిన కథలు ‘అభిశప్త’ కథాసంపుటి. సమాజంలో కనిపించని కోణాలను వెలికి తీయాలన్న ఉద్దేశం ఆ కథల రచనకు నేపథ్యం. అలాంటి విధి వంచితులైన పిల్లలను సమాజం ఆదరించాలని నా రచనాలక్ష్యం.
2019లో కవితా సంపుటి పుస్తకావిష్కరణ
ప్రశ్న 13. కథ వ్రాసేటప్పుడు మీరు వస్తువు/శిల్పం/శైలి – దేనికి ప్రాధాన్యతనిస్తారు?
జ: కథకు సంక్షిప్తత ప్రాణం. కథావస్తువును బట్టి శిల్పం, శైలి ప్రాధాన్యం ఆధారపడి ఉంటుంది. నా అభిప్రాయంలో వస్తువు, శిల్పం, శైలి మూడు ప్రధానమే.
ప్రశ్న 14. కవిత్వానికి లయ/వస్తువు/భావ వ్యక్తీకరణలలో ఏది ముఖ్యం అనుకుంటున్నారు? మీరు దేనికి ప్రధాన్యతనిస్తారు?
జ: కవిత్వానికి, ప్రధానంగా వచన కవితకు భావవ్యక్తీకరణ, శిల్పం రెండూ రెండు ప్రధాన భూమికను వహిస్తాయి. వస్తువు ఏదైనా శిల్ప సమన్వితంగాను, భావవ్యక్తీకరణతో విలక్షణతను ప్రదర్శించినప్పుడు అది ఉత్తమ కవితగా పరిగణింపబడుతుంది.
2017 అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవ పురస్కారం
ప్రశ్న 15. ఇటీవల మీరు పలు సాహితీ రూపకాలను సృజించారు. దీని వెనుక ఉన్న ఆలోచన ఏమిటి? పూర్తిగా మహిళలతోనే రూపకం నిర్వహించాలన్న తలంపు ఎలా కలిగింది?
జ: ‘భువన విజయం, వైకుంఠవిజయం, శతకసౌరభాలు, భువనేశ్వరీ వైభవం’ వంటి అనేక సాహిత్య, ఆధ్యాత్మిక రూపకాలలో పాత్రలు పోషించాను. ఈ క్రమంతోనే సామాజిక సందేశమూ, సాంస్కృతిక మనం వినోదాలు అందిస్తూ క్రొత్త రూపకాలకు రూపకల్పన చేయాలని ఆలోచన కలిగింది. సాధారణంగా సాహిత్య రూపకాలతో పండితులు, కవులు పాల్గొని రసవత్తరంగా నిర్వహిస్తున్నారు. కేవలం మహిళలు పాత్రలుగా పాల్గొన గలిగిన రూపకాలను నిర్మిస్తే ఎలా ఉంటుందో అనే తలంపు రూపక రచనకు దారితీసింది.
తెలుగుభాషకు విశిష్టలక్షణమైన అవధాన ప్రక్రియలో మగువలు రాణిస్తున్నారు, అదేవిధంగా రూపక ప్రక్రియలో కూదా మహిళల పాత్ర సాహిత్యరంగంలో రాణించాలని నా కోరిక. ఆ ప్రేరణ ఫలించింది. ఇప్పటికి 10 రూపకాలను రూపొందించి అనేక వేదికలపై ప్రదర్శనలు కూడా ఇవ్వగలిగాము.
ప్రశ్న 16. మీరు యుట్యూబ్ ఛానెల్స్‌లో ఎక్కువగా మీ ప్రసంగాల వీడియోలు పెడుతున్నారు. ఈ మాధ్యమం ద్వారా మీరు ఆశించిన ప్రయోజనం కలుగుతోందా? సాంకేతికతని అందిపుచ్చుకోడంలో ఏవైనా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారా?
జ: అవునండీ! ఇటీవల యూట్యూబ్ ఛానల్స్ లోనే సాహిత్య కార్యక్రమాలు విరివిగా సాగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రసంగాలు, సాహిత్యరూపకాలు అందించగలుగుతున్నాము. హ్యూస్టన్ తెలుగు సంఘం, డల్లాస్ సాహిత్యవేదిక, ఇటువంటివి బాగా ప్రోత్సాహం ఇస్తున్నాయి. సేవ సాహిత్య సంస్థ, వాజ్మయి, My channel వీటిలో పలు కార్యక్రమాలలో పాల్గొన్నాను. సాంకేతికంగా అవసరం అయినంతమేరకు పరిజ్ఞానం సంపాదించుకొని ముందుకు వెళ్తున్నాను. అప్పుడప్పుడు సాంకేతిక ఆటంకాలు ఏర్పడటం సహజమే కదా. ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాలు కూడా వారి కార్యక్రమాలను యూట్యూబ్ అనుసంధానం చేయటంవలన నా కార్యక్రమాలు తరచుగా యూట్యూబ్ మాధ్యమంలో కనిపిస్తున్నాయి.
గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాల NCC Officer గా బాలికలతో రైఫిల్ డ్రిల్ – naac peer team కి gaurd of honour 2004
ప్రశ్న 17. వర్ధమాన రచయిత రచయిత్రులను చదువుతున్నారా? వారికి మీరేం సూచనలు చేస్తారు? తెలుగు భాషని కాపాడుకోడానికి ఏమేం చేయాలని మీరు భావిస్తున్నారు?
జ: వర్ధమాన రచయితల, రచయిత్రుల రచనలను చదువుతున్నాను. ఒక రచయిత, రచయితగా సుస్థిర స్థానం పొందాలంటే అధ్యయనం ప్రధానం. చాలా పుటలు చదివితేనే మనకు ఏమి వ్రాయాలో ఒక ఆలోచన వస్తుంది.
తెలుగుభాషను కాపాడుకోవటానికి తల్లిదండ్రులు, పాఠశాలలు, ప్రభుత్వం, భాషావేత్తల సమష్టి ప్రయత్నం అవసరం. కుటుంబంలో పిల్లలతో మాటలాడటం మొదలుకొని తెలుగుభాషను మనం పరిరక్షించుకోవలసి ఉంటుంది. ప్రభుత్వం తెలుగు మాధ్యమం ప్రాధాన్యాన్ని గుర్తించి దానికి అనుగుణంగా చర్యలు చేపట్టటం అవసరం. మేము సాహిత్యరూపకాలు ప్రదర్శించే జుట్టు సభ్యులము ‘తెలుగుసిరులు’ అనే పేరుతో కళాశాలల్లో పాఠశాలల్లో కొన్ని ప్రత్యేక కార్యక్రమాల ద్వారా మా వంతు ప్రోత్సాహం అందించే ప్రయత్నం చేస్తున్నాము.
ప్రశ్న 18. మీరు బాలల సంరక్షణ కమిటీలో సభ్యురాలని విన్నాము. మీరు చేస్తున్న సామాజిక సేవ గురించి తెలియజేస్తారా?
జ: కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉద్యోగ విరమణ చేసిన తరువాత బాలల సంరక్షణ సమితి (Child Welfare Committee) లో ఉద్యోగాల ప్రకటన చూశాను. అది ప్రభుత్వం 3 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చి నియామక విధానం. దానికి దరఖాస్తు చేసి ఇంటర్వ్యూకి వెళ్ళాను. నన్ను సభ్యురాలిగా (Member) నియమించారు. గుంటూరు జిల్లా స్థాయిలో నా సేవలు అందించాను. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ విధానంలో నిర్వహింపబడుతున్న Child Care Institutes (CCI) పర్యవేక్షించటం, సంస్థలలో ప్రవేశం కోరిన వారి దరఖాస్తులు పరిశీలించి వారికి ఆశ్రయం ఉత్తర్వులు ఇవ్వటం, అనాథ శిశువుల దత్తత కార్యక్రమాలు దీనిలో విధులు. ఆ విధులలో బాల బాలికలు ఎదుర్కొంటున్న దయానీయమైన పరిస్థితులను చూసినప్పుడు హృదయం ద్రవించిపోయేది. నేను పనిచేసిన 3 సంవత్సరాల కాలంలోనూ సాధ్యమైనంత మేరకు బాల బాలికలకు ఏమాత్రమైనా మేలు జరిగే ఉత్తర్వులు జారీచేయటానికి ప్రయత్నించాను. నా వలన మేలు జరిగిన పిల్లలు ఎక్కడైనా ఎదురైతే నన్ను దీవించటం చూసినప్పుడు నాకెంతో ఆనందం కలుగుతుంది.
ప్రశ్న 19. సాహితీపరంగా ఏవైనా గౌరవాలను పొందారా? మీకు లభించిన అవార్డులు, బహుమతుల వివరంగా చెప్పండి.
జ:
- ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి A. తెలుగులో స్వర్ణపతకం – 1980
- ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి – సాహిత్యరంగంలో ప్రతిభా పురస్కారం-2016
- సురవరం ప్రతాప రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం – కీర్తి పురస్కారం (2023వ సంవత్సనికి) ఉత్తమ రచయిత్రిగా – 2025
- ఉత్తమ అధ్యాపక పురస్కారం – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం- 2001
- గుంటూరు జిల్లా తాళపత్ర పరిశోధనలో ప్రతిభా పురస్కారం – 2006
- ఉత్తమ సంస్కృత అధ్యాపక పురస్కారం – ప్రభుత్వంచే –
- ఆచార్య దివాకర్ల వేంకటావధాని సాహిత్య పురస్కారం – 2012
- రాయప్రోలు సుబ్బారావు సాహిత్య పురస్కారం -2013
- ఎమెస్కో ఉగాది సాహిత్యరంగ పురస్కారం – 2015
- ‘ప్రసన్నభారతి’ సాహిత్య సంస్థ విశాఖపట్నం – ఉత్తమ పద్యకావ్యవిమర్శ పురస్కారం – 2017
- కవయిత్రి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ సాహిత్య పురస్కారం – గ్రంథాలయ వారోత్సవాలు – తెనాలి 2019
- కళాప్రపూర్ణ చర్ల గణపతిశాస్త్రి స్మారక సాహిత్య పురస్కారం – 2022
- పావులూరి ట్రస్ట్ – ఉత్తమ సాహితీవేత్త పురస్కారం తెనాలి – 2023
- పద్మశ్రీ అయ్యంకి వెంకటరమణయ్య – వెలగా వెంకటప్పయ్య సాహిత్య పురస్కారం – గుంటూరు – 2024
- ఉగాది పురస్కారం – కళావిపంచి – హైదరాబాదు – 28-3-2025
- రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం – 30-3-2025
- ఉత్తమ సభానిర్వహణ పురస్కారం – ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా విభాగం – గుంటూరు –2017
- ‘సారస్వత కళానిధి’ బిరుద ప్రదానం -సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా విభాగం – గుంటూరు.
- కాళిదాస పురస్కారం – ‘అక్షర’ సంస్థ, హిందూ కళాశాల, గుంటూరు-2022
- ఉత్తమ సాహితీవేత్త పురస్కారం – రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్, గుంటూరు- 2023
- రాష్ట్ర ప్రభుత్వంచే కవితా దినోత్సవ పురస్కారం – 2017
- రాష్ట్ర ప్రభుత్వ పౌర గ్రంథాలయశాఖ ఉగాది పురస్కారం – 19-3-2025
పదవుల నిర్వహణ:
- తిరుమల తిరుపతి దేవస్థానం – ఆస్థాన పండిత పరిషత్తు సభ్యురాలు – 2017-2020 వరకు
- తిరుమల తిరుపతి దేవస్థానం – ‘సప్తగిరి’ మాస పత్రిక – సంపాదక వర్గ సభ్యత్వం, 2022-2025
- టిటిడి ధర్మ ప్రచార పరిషత్తు ద్వారా గుంటూరు జిల్లాలో ఆధ్యాత్మిక సంస్కృతికి కృషి
ప్రశ్న 20. సాహిత్యం విషయంలో మీ భవిష్యత్తు కార్యక్రమాలేమిటి? కొత్త పుస్తకాలేవైనా సిద్ధమవుతున్నాయా?
జ: నేను వ్రాసిన విమర్శ వ్యాసాలు, వివిధ పత్రికలలో ప్రచురింపబడినవి అన్నిటిని ఒక సంపుటిగా వెలువరించాలనే ఆలోచన ఉన్నది. సాహిత్యాన్ని, ముఖ్యంగా తెలుగు భాషలోని సహజ సౌందర్యాన్ని, యువతకు తెలియచేస్తూ, వారిలో భాషా, సాహిత్యాల పట్ల, సంస్కృతి పట్ల ఆసక్తిని కలిగించాలనేది నా లక్ష్యం. వారిలో ఉత్తమ వ్యక్తిత్వవికాసం పెంపొందించే లక్ష్యంతో కృషి సాగించాలని కోరిక. టిటిడి ‘ధర్మ ప్రచార పరిషత్తు’ తరపున పాఠశాలల్లో సాంస్కృతిక విలువలను పెంపొందించే ప్రయత్నం చేయటం లక్ష్యం.
~
సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు డా. వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారూ.
డా. వెలువోలు నాగరాజ్యలక్ష్మి: ధన్యవాదాలు. ‘సంచిక’ అంతర్జాల పత్రిక ద్వారా ఒక్కసారి నా ఉద్యోగ, సాహిత్య ప్రస్థానాన్ని పునరావలోకన కావించుకొనే అవకాశం కలిగింది. నా రచనలను మీ పత్రిక ప్రచురిస్తూ నాకు తగిన ప్రోత్సాహం కలిగిస్తూన్నందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ‘సంచిక’ పత్రిక రచయితలను ప్రోత్సహిస్తూ ఇతోధికంగా సాహిత్యరంగంలో సేవల నందించాలని, పత్రికా రంగంలో ప్రథమ శ్రేణిలో రాణించాలని మనఃపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను. శుభం భూయాత్.

