[సంచిక కోసం ‘విశ్వర్షి’ ‘అక్షరయోగి’ డా. వాసిలి వసంతకుమార్ గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ ఇది.]
విశ్వర్షి వాసిలి సంయమన అక్షర ప్రస్ధానం:
~
* వాసిలి గారూ నమస్కారం. సంచిక అంతర్జాల మాసపత్రిక పక్షాన మీకు స్వాగతం.
వాసిలి: నమస్కారం డా. ప్రసాద్ గారూ. ఈ రోజు సంచిక తరఫున నా ప్రస్థానాన్ని పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. నా అక్షరాలను, నా ఆత్మను మీదైన రీతిన పలికిస్తారని ఆశిస్తున్నాను.
~
1: విపులాచ పృథ్వీ.. అన్నట్టుగా మీ రచనలు కూడా విపులమైనవి. ఒక విధంగా మీది బహుముఖీన రచనా వ్యాసంగం. దాదాపు అరవై పైగా ఉన్న మీ పుస్తకాలు మనిషిని అనేక కోణాలలో ఆవిష్కరించాయనటం అక్షర సత్యం. రచనాపరమైన ఇంతటి విషయ వైవిధ్యత, శైలీ వైచిత్రి తెలుగు సాహిత్యంపై ఎంతో మక్కువ ఉంటే తప్ప సాధ్యం కాదు. అసలు ఈ దృక్కోణంలో మీ నేపథ్యం ఏమిటి? విపులంగానే మీ నుండి వివరణను ఆశిస్తున్నాను.
జ: ప్రసాద్ గారూ, ఏవిధంగా చూసినా మనిషి అష్టదిక్కుల మధ్యనే కాదు, పధ్నాలుగు లోకాలలోను సంచరించగల జీవి. ఈ సంచారం సాహిత్యకంగాను, మానసికంగాను, తాత్వికంగాను, యోగికంగాను సాధ్యం. ఈ నాలుగు విధాలుగానూ సంఘర్షణ తప్పదు. ఈ సంఘర్షణను అక్షరం ఆలింగనం చేసుకోవాలి. ఆ ఆలింగనంలో నా అస్తిత్వం నిలదొక్కుకోవాలన్నదే నా తపన. ఆ నా సంతకానికి యాభై ఏళ్ల జీవన సంఘర్షణ ముడిసరుకు కావలసి వచ్చింది. ఆంధ్ర ఆంగ్ల సాహిత్యాల అధ్యయనం నా తెలుగు అక్షరానికి నగిషీలు దిద్దింది. ఎంతలా మెరిసినా ఆ మెరుపులో నా బాణీ, నా వాణీ, నా తత్వం సంతకం పెట్టనవసరం లేకుండా ఒదిగిపోవాలన్నది నా తపన. అదే రచనాపరంగా పాతికేళ్ల సంయమనాన్ని నేర్పింది. యాభైయేళ్ల సాధనగా పరిక్రమించింది. ఫలితమే సాహిత్య ప్రస్థానంలో నేటి నా సంతకం.
2: ఆసక్తిగా ఉంది మీ ప్రస్థానం. తెలుగంటే మీ ఇష్టానికి అసలు కారణాలు..?
జ: చిన్నప్పటి నుండీ తెలుగంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే స్కూల్‌లో తెలుగు టీచర్స్‌తో బాగా క్లోజ్‌గా ఉండేవాడిని. కాలేజీలో కూడా తెలుగు లెక్చరర్లతో క్లోజ్‌నెస్ ఉండేది. ఇక, మద్రాస్ వర్శిటీ పీజీలో అయితే లెక్చరర్లతో, ప్రొఫెసర్లతో స్నేహమే. వారి ఇళ్లలో కుటుంబ సభ్యుడిలా ఉండేవాడిని. ఉస్మానియాలో పిహెచ్.డి. చేస్తున్నప్పుడు కూడా ప్రొఫెసర్లందరితో మిత్రత్వం ఉండేది. ఈ ఇంటిమసీ కారణంగా వారితో ఇంటరాక్షన్‌కి, తెలుగు సాహిత్యాన్ని తరచి చూడటానికి అనేక మార్గాలు తెరుచుకున్నాయి. ముఖ్యంగా ఎం.ఏ. తెలుగు చేస్తున్నప్పుడు ప్రతీక్షణాన్ని తెలుగు కోసమే వినియోగించుకున్నాను. రెండో రోజు పీజీ క్లాసులో లెక్చరర్ తెలుగులో రెండు పేజీల వ్యాసం రాయమంటే 76 తప్పులతో వ్యాస రచన చేసినవాడిని.. నాలుగు నెలల అక్షర సాధనతో మొదటి సెమిస్టర్‌లో అవుట్ స్టాండింగ్ మార్కులు సంపాదించుకోగలిగాను. గ్రాంథికంలోనూ, సరళ గ్రాంథికంలోనూ వ్యాస రచనపై మంచి పట్టు సాధించగలిగాను. ఎం.ఏ. అయిన తర్వాత దాదాపుగా దిన పత్రికలకు విరివిగా సాహిత్య వ్యాసాలు రాస్తుండేవాడిని. ప్రతీ పక్షం ఆకాశవాణికి ఒక ప్రసంగమో, కవితనో రాసేవాడిని. ఈ ప్రతీవార రచనా వ్యాసంగం దాదాపు మూడేళ్ల పాటు సాగింది.
ఈ ప్రస్థానంలో ఒక అసంతృప్తి, ఒక ఆర్తి చోటు చేసుకుంది. ఈ వ్యాసాలేవీ నన్ను పట్టి ఇచ్చేవి కాదనిపించింది. ఇందులో నా శైలి, నా తత్వం, నా పదం, నా శబ్దం, నా వాక్యం లేదని నిర్ణయించుకున్నాను. ఇటువంటి రచనలు చేయటం వల్ల ప్రయోజనం లేదని నిర్ణయించుకుని కలం సన్యాసం చేసాను. ఈ పెన్ డౌన్ పాతికేళ్లపాటు సాగింది. వివిధ ప్రక్రియా రచనలను చదవటం, రచనా మెళకువలను అధ్యయనం చేయటం, విమర్శనా దృష్టితో చూడటం, ప్రతి ప్రక్రియలోనూ తమ అస్తిత్వాన్ని నిలదొక్కుకున్న రచయితలను, కవులను మరింత లోతుగా అధ్యయనం చేయటంతో సొంత గొంతుక అంటే ఏమిటో తెలిసివచ్చింది. 2004లో నేను అమెరికా నుండి తిరిగివచ్చిన తర్వాత ‘ఆంధ్రజ్యోతి’ దిన పత్రికకి వారం వారం ఒక కాలమ్ రాసేందుకు సంపాదకులు కె. శ్రీనివాస్ గారి ద్వారా అవకాశం వచ్చింది. అప్పటి నుండి ప్రారంభమైన నా ప్రస్థానం – ఆంధ్రజ్యోతిలో నా రచనావ్యాసంగం కాలమిస్ట్‌గా వారం వారం అయిదేళ్లపాటు నిర్విఘ్నంగా సాగింది. ఆ తర్వాత సాక్షి, ఆపైన ఏడెనిమిదేళ్లు ఆంధ్రభూమి, ఆ తర్వాత ఆంధ్రప్రభ.. ఇలా సాగుతూ వ్యావహారిక భాషలో నాదైన ముద్రతో వ్యాసాలు రాయటం, వాటికి విశేష పాఠక ఆదరణ లభించటం, ఇప్పటికి 60 పైగా పుస్తకాల రచయితగా నిలబెట్టటమే కాక నా సాహిత్యం విశ్వవిద్యాలయాలలో అంతర్జాతీయ సదస్సులు నిర్వహించేంతలా ఎదిగింది.
3: ఇదంతా మీ రెండు దశాబ్దాల సాహిత్య ప్రస్థానం. ఒక విధంగా రచయితగా ఎదిగిన తర్వాతి ప్రస్థానం. అసలు రచయితగా పురుడుపోసుకున్న ప్రాథమిక నేపథ్యాన్ని తెలుసుకోవాలని ఉంది. మీ తొలినాటి రచనలు, వాటి గురించి కొంత చెప్పగలరా? ఆ రచనా వ్యాసంగం తర్వాతనే కదా మీకు సొంత గొంతుక కావాలనే తపన ప్రారంభమైంది..?
జ: ఎక్సాట్లీ, చెప్పానుగా.. చిన్ననాటి నుండీ తెలుగంటే ఇష్టం. తెలుగు మాస్టార్లన్నా, తెలుగు వాచకాలన్నా ఇష్టం. తెలుగు పద్యాలన్నా, తెలుగు కథలన్నా, తెలుగు నాటకాలన్నా ఇష్టం. ఎనిమిదో తరగతిలో ఉండగా ఒక చిన్న నాటికను ప్రదర్శిస్తున్నట్టు ఒక పాంఫ్లెట్ వేసి మద్రాస్ ఆకాశవాణి వారికి పంపిస్తే అప్పటి బాలల ప్రోగ్రాంలో ఆ ప్రదర్శనను గురించి ప్రకటించారు. అది ఆరంభ శూరత్వం. ఆ తర్వాత పియుసిలో ఉండగా వ్యాస రచనల పోటీలో పాల్గొని రెండవ బహుమతి పొందాను. బహుమతిగా ‘భూగ్రహం’ అనే పుస్తకం ఇచ్చారు. ఇప్పటికీ అది నా దగ్గిర ఉన్న అమూల్య పుస్తకాలలో ఒకటి. బి.ఏ.లో ఉండగా కవిత్వానికి, కథకు, వ్యాస రచనకు ప్రథమ ద్వితీయ బహుమతులు పొందాను. డిగ్రీలో ఉండగానే కళాశాల వార్షిక సంచికలో నేను రాసిన ఒక కవిత ‘ఉటోపియా’, ‘అనుమానం’ అనే కథా ప్రచురితమైనాయి. అచ్చులో చూసుకున్న నా మొదటి కవిత, కథా ఇవే.
నిజానికి ఈ రెండూ అనుకరణలే. ఒక విధంగా కాపీలే. బహుశా ఇటువంటి కాపీ బ్రతుకు చాలామందికి ఉంటుందనుకుంటాను. అయితే, ఈ రెంటికే నా కాపీ రచయిత పరిమితమయ్యాడు. ఈనాటికీ ఈ తొలినాటి కాపీ రచయిత నన్ను తలవంచుకునేలా చేస్తుంటాడు. ఈ గిల్టీ కాన్షస్‌నెస్ వల్లనే కాబోలు నాలోని భవిష్య రచయిత పాతికేళ్లు కలం పట్టకుండా మిన్నకుండాల్సి వచ్చింది.
4: మీ రచనలు ముందుగా ఏ పత్రికలలో ప్రచురింపబడ్డాయి? అప్పటి మీ అనుభూతి ఎలాటిది?
జ: నా రచనలు ముందుగా ప్రచురింపబడ్డవి నా పత్రికలోనే. నా సంపాదకత్వంలో కొందరు మిత్రులతో కలిసి ‘చిత్ర ప్రగతి’ అనే సినిమా పక్ష పత్రికను నా డిగ్రీ అయిన వెంటనే ప్రారంభించాం. ఎడిటర్.. అందులోనూ సినిమా ఫీల్డ్‌లో తిరగటం. ఎన్టీఆర్, కృష్ణ వంటి పెద్ద పెద్ద నటులతో మాటామంతీ. ముళ్లపూడి, బాపు వంటి వారితో చిరు సాహచర్యం. అప్పట్లో బలిపీఠం, ముత్యాలముగ్గు వంటి చిత్రాలకు నేను చేసిన సమీక్షలు ముళ్లపూడి వెంకటరమణ గారికి బాగా నచ్చి అడగకుండానే మా పత్రికకు ఒక సినిమా ప్రకటన ఇచ్చారు. 1975 లో 500 రూపాయల ప్రకటన అది. దానిని నా చిత్ర సమీక్షకు వచ్చిన అవార్డుగా నేను ఇప్పటికీ పరిగణిస్తాను. అప్పుడే భానుమతీ రామకృష్ణ గారిని తమిళ ప్రభుత్వం ‘కళైమామణి’ బిరుదుతో సన్మానించింది. ఆ సన్మాన సభకు నేను వెళ్లి ఆమె ప్రసంగాన్ని తనకు తాను ఒక కథలా చెప్పినట్టుగా రాసాను. అన్ని పత్రికలు ఆమె అలా అన్నారు, ఇలా అన్నారు అంటూ రిపోర్ట్ చేస్తే నేను ఒక్కడినే నూతన పంథాలో పర్సనల్‌గా ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుందో అలా రాసాను. అది ఆమెకు బాగా నచ్చి, మెచ్చుకున్నారు. పత్రికా రచయితగా, సంపాదకునిగా అటు ముళ్లపూడివారి ప్రశంస, ఇటు భానుమతి గారి మెచ్చుకోలు ఆరు నెలల్లో నాకు లభించిన తొలి అవార్డుల క్రింద లెక్క.
ఆ తర్వాత నేను ఎం.ఏ.లో ఉండగా ‘మహిళ’ అనే మాస పత్రికకు కొన్ని ఇంటర్వ్యూలు, పుస్తక సమీక్షలు, సినిమా రివ్యూలు చేసాను. చేసిన ఇంటర్వ్యూలు మహిళా సంబంధమైనవి కాబట్టి వారి దృష్టితో ప్రశ్నించాల్సి వచ్చేది. ఒకవిధంగా వారి మనసులలోకి పరకాయ ప్రవేశం చేయటం లాంటిది వారిని చదవటం, రాయటం. ఈ నేపథ్యంలోనే బహుశా నాలో ఒక మనోవిశ్లేషకుడు పురుడు పోసుకుని ఉంటాడనుకుంటాను. ఇక ఎం.ఏ. తెలుగు చేస్తుండగా బాగా కవితలు రాస్తుండేవాడిని. అలా తొలుతగా నా కవిత మద్రాస్ ఆకాశవాణి ద్వారా ప్రసారమైంది. ఈ కవితను రికార్డు చేసే ముందు వాయిస్ టెస్ట్ అంటూ ప్రారంభించి మొత్తం కవితను రికార్డ్ చేసి ఇక విడిగా మరో రికార్డింగ్ అవసరం లేదు అంటూ నా వాయిస్‌కి ఒక కితాబు ఇచ్చారు. ఇది మైక్ ముందు నా బేస్ వాయిస్‌కి లభించిన తొలి అవార్డు.
ఎం.ఏ. తెలుగు చేస్తుండగానే కవిత్వాన్ని డామినేట్ చేసింది విమర్శ, పరిశోధన. ఈ రెంటికీ జత కలిసింది తులనాత్మక అధ్యయనం. ఈ మూడింటి కలయిక వల్ల నాకు వ్యాస రచనపై మక్కువ పెరిగింది. కొత్త పదం కనపడినా, వినిపించినా ఆ పదాన్ని మరునాడు ఏదో సందర్భంలో ప్రయోగించటం కానీ, రాసే వ్యాసాలలో చొప్పించటం కానీ చేసేవాడిని. నిజానికి, ఈ వ్యాసంగం ప్రయత్న పూర్వకంగా జరిగేది కాదు. నా సహాధ్యాయులు దీన్ని గమనించి చెప్తుండేవారు. మొత్తానికి ఇలా నా వ్యాసరచనకు తులనాత్మకత, పరిశోధనాత్మకత, విమర్శనాత్మకత అనేవి అంతర్విభూతులయ్యాయి. బహుశా ఇక్కడినుండే వ్యాస శీర్షికలలోనూ, వాక్య రచనలలోనూ, పద ప్రయోగాలలోనూ, కొత్త పదాలను సృజించుకోవటంలోనూ, కవితాత్మకతను, కథనాత్మకతను వ్యాసాలకు జోడించటంలోనూ నాదైన ముద్ర సాధ్యమైందనుకుంటాను. ఇవే పదిహేనేళ్లకు పైగా నన్ను పత్రికల కాలమిస్ట్‌గా నిలబెట్టాయి.
5: మీ చదువు సంధ్యల విషయంలోనూ, మీ సాహిత్య ప్రస్థానంలోనూ మీ నాన్నగారి ప్రభావం బాగా ఉందంటుంటారు. ఇది నిజమేనా? అసలు, మీ సాహిత్య జీవన ప్రస్థానంలో మీ కుటుంబం ఎటువంటి పాత్ర పోషించిందంటారు?
జ: మీ ప్రశ్నకు సమాధానం ఇచ్చేముందు, ముందుగా మనం కుటుంబం అంటే నిర్వచించుకోవాలి. నా ఉద్దేశంలో పెళ్లికాక ముందు, పెళ్ళైన తర్వాత అంటూ కుటుంబాన్ని చూడాలి. పెళ్లికాక ముందు తల్లితండ్రులు, సోదర సోదరీలే కుటుంబం. పెళ్లయి భార్యా పిల్లలతో అంతకు పూర్వం వరకున్న కుటుంబం ఒక విధంగా ఎక్స్టెండెడ్ ఫామిలీ అవుతుంది. భార్యాపిల్లల్ని ఎక్స్టెండెడ్ ఫామిలీ అని నేను అనుకోను.. వీరి తోడిదే ప్రైమ్ ఫామిలీ, అమ్మానాన్నల తోడిది ఎక్స్టెండెడ్ ఫామిలీ. ఈ స్పష్టతతోనే మీ ప్రశ్నకు సమాధానమిస్తాను.
నేను విశ్వగర్భం నుండి తల్లిగర్భాన్ని చేరటంలో ప్రధాన వాహిక నాన్న. కాబట్టి నా దైహిక ప్రస్థానంలో అమ్మానాన్నలే తొలి ప్రభావాలకు కారకులు. ఇక ప్రాపంచిక ప్రస్థానంలో అనేకులు, అనేకాలు ప్రాభవ హేతువులు. వృత్తి జీవనం, వైవాహిక జీవనం ప్రారంభమయ్యేవరకు అమ్మానాన్నలు, సోదరసోదరీలే సకలం, సర్వం. వారితో కలిసి చరించిన పాతికేళ్లు నన్ను తమ పొత్తిళ్లలో ఉంచుకుంటూనే ప్రపంచంలోకి విసిరేసినట్టు. స్వేచ్ఛగా ఎగురుతున్నట్టు కనిపించే గాలిపటం నేను కావొచ్చు కానీ సూత్రధారులు అమ్మానాన్నలయిన శ్రీమతి యామినీదేవి, శ్రీ శార్వరిలే. ఇక్కడ కనిపించే నా స్వేచ్ఛకు కొన్ని హద్దులు ఉంటాయి. ఈ హద్దులు చాలావరకు చెరిగిపోయి నేనుగా తొంభై శాతమైనా నిలదొక్కుగోగలిగేది పెళ్లయిన తర్వాత ఏర్పడ్డ కుటుంబ వ్యవస్థలోనే. ఈ వ్యవస్థలో ప్రాపంచిక ఆటుపోట్లు సంఘర్షణకు దారితీసినా ఇల్లాలు శ్రీమతి మణికుమారి సహచర్యం సంయనాన్ని నేర్పింది. ఇద్దరు పిల్లలు ప్రత్యూష, ప్రహాసలు నా బాధ్యతా వర్తనానికి వనరులు. ఈ చెప్పిన నాలుగు విషయాలు నా కుటుంబం నాపై ఎంతటి ప్రభావం చూపించి ఉంటుందో, నా ప్రస్థానానికి ఎలా పట్టుకొమ్మ అయివుంటుందో మీరే అంచనా వేయవచ్చు. నా అక్షరం అక్షయంగా ప్రస్థానిస్తుండటానికి నా ఈ కుటుంబమే మూలాధారం.
నాన్నగారు ముప్పై వేల పుటలతో నూటయాభై పైగా రచనలు చేసిన సాహితీవేత్త, పత్రికాసంపాదకులు. నేను కళ్లు తెరిచినప్పటి నుండి నాన్నగారితో సాగిన నా అరవై ఏళ్ల జీవితంలో వారిని ఎప్పుడూ తెల్లటి వస్త్రాలలో ఒక చేత్తో కలం, ఇంకొక చేత్తో సిగరెట్టుతో చూసిన కాలమే సుదీర్ఘం. వారి సిగరెట్టును ఒకటి రెండేళ్లు అందుకోగలిగాను, కలం వారసత్వాన్ని వందకు రెండు వందల శాతం అందుకున్నానని సగర్వంగా చెప్పగలను. వారు ‘ఆంధ్రప్రభ’కు ముప్పైఏళ్లకు పైగా తమ పాత్రికేయ వృత్తిని అంకితం చేస్తే నేను ‘ఉషోదయం’ అనే దినపత్రికకు నాలుగేళ్లు సహాయ సంపాదకునిగా బాధ్యతలు వహించి, స్వయానా చిత్రప్రగతి, యోగమార్గం, తెలుగు పరిశోధన, ఆవలితీరం పత్రికలకు దాదాపు రెండు దశాబ్దాలకు పైగా సంపాదకునిగా బాధ్యతలు నిర్వహించాను. చిత్రప్రగతి ప్రారంభించేనాటికి నా వయస్సు 21. అంత పిన్న వయస్సులోనే ఒక పత్రికకు సారథిని చేయటంలో నాన్నగారి ప్రోత్సాహం, వారి గైడెన్స్ ఎంతలా ఉండివుంటుందో నేను చెప్పేకంటే మీరే లెక్కకట్టుకోండి. అలా నాన్నగారి గైడెన్స్, ప్రోత్సాహం, నేను దేనికి శ్రీకారం చుట్టినా కాదనకుండా ప్రోత్సహించటం, అన్నివిధాలా వెన్నుదన్నుగా ఉండటం నా సాహిత్య ప్రస్థానానికి, యోగిక ప్రస్థానానికి, జీవన ప్రస్థానానికి కొండంత అండ. అమ్మ యామినీదేవి అయితే నా ప్రతి వ్యాసాన్ని చదివి అప్రీషియేట్ చేసేది. శ్రీమతి మణికుమారి నా రచనలు చదివేది ఎప్పుడో ఒకప్పుడు అయినా నా అక్షర యాత్ర నిరాటంకంగా సాగటం నన్ను దైనందిన గృహ విషయాలలో భాగస్వామిని చేయక తానే అన్ని బాధ్యతలు తీసుకునేది. ఒక రచయితకు దీనికి మించి కావలసిన సహకారం మరేముంటుంది. పిల్లలు ప్రత్యూష, ప్రహాసలకు నా రచనలంటే చాలా ఇష్టం. ఇక నేనంటే చెప్పలేనంత.
6: తెలుగు సాహిత్యంలో మీరు పరిశోధన చేసి పిహెచ్.డి. పట్టా పొందారు. తెలుగు పరిశోధన లాంటి పత్రికకు సంపాదకత్వం వహించారు. రీసెర్చ్ మెథడాలజీ పరంగా మీరు ప్రామాణిక రచనలు చేశారని విన్నాను. అయినా వృత్తిపరంగా మీరు విద్యారంగాన్ని ప్రక్కన పెట్టేసారు. దీనికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా.. వివరంగా చెప్పండి.?
జ: అసలు తెలుగు ఎం.ఎం. ఇష్టంతో చేసానే కానీ ఆ డిగ్రీతో ఉద్యోగం చేద్దామని మాత్రం కాదు. మద్రాస్ విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తవటంతోనే హైదరాబాద్ చైతన్య కళాశాలలో పార్ట్ టైం తెలుగు లెక్చరర్‌గా అవకాశం వచ్చింది. ఏడాది తర్వాత ఆ పోస్ట్‌ను పెర్మనెంట్ చేసే ప్రాసెస్‌లో అప్పటి శాఖాధ్యక్షుల వారి కులాహంకారంతో నేను వారి చైతన్యానికి అక్కరకు రాలేకపోయాను. అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్.డి. చేసినా ఉద్యోగ నియామకాల సమయంలో అభ్యర్థులందరిలో తొలి వరసలో ఉన్నప్పటికీ ప్రాంతీయత పేరుతో ఆర్ట్స్ కాలేజీ మెట్లెక్కనీయలేదు. మొత్తానికి కులం, వర్గం, ప్రాంతం అన్న సంకుచిత తత్వాలు మన సామాజిక వ్యవస్థను ఇంకా జలగలలా పట్టి పీడిస్తుండటంతో అధ్యాపక వృత్తి నన్ను వరించలేదు.
నిజానికి, నాకు ఏనాడూ ఆ మోజు లేదు.. అదే అని కాదు ఉద్యోగం అన్న దానిపై మోజు లేదు. స్వతంత్రంగా బ్రతకటం, నాదైన రీతిన బ్రతకటం నాకు ఇష్టం. ఈ ఇష్టపూర్వక ప్రస్థానంలో ఎదురీత, పెనుగులాట నాజీవితాన్ని అనేక మలుపులలో కుదిపేసింది. ఆ జీవన సంఘర్షణను నా ప్రస్థానంలో ఒక మైలురాయిగానే పరిగణిస్తాను. ఈ రోజు నా అక్షర సంతకానికి ఆ అస్తిత్వ సంఘర్షణే పునాది. నా ప్రస్థానంలో భాగస్వామి అయిన ప్రతి ఇటుక ఆ అస్తిత్వ సంఘర్షణ నుండి రాటుదేలినదే. అందుకే నా ప్రస్థానంలో నేను అంతస్తులను లెక్కించను కానీ అంతస్తులుగా మారిన ఇటుకల అంతస్తత్వాన్ని తుది శ్వాస దాకా, నా అక్షరం పరిక్రమిస్తున్నంత వరకు మరువను కాక మరువను. కాబట్టి, ఎదుగుదలలో ఎదురు దెబ్బలూ తప్పవు, ఎదురీతా తప్పదు. ఎదురీదగలిగితే ఏదీ ఆటంకం కాదు, ఏదీ అసాధ్యం కాదు. అయితే ఒక్కటి మాత్రం వాస్తవం, ఏ రంగంలోనైనా సరే సంతకం సాధ్యం కావాలంటే లక్ష్యాన్ని లెక్కిస్తూ ఎదురీతకు వెరవకూడదు.
7: వాసిలి వసంతకుమార్ ‘విశ్వర్షి’గా ఎప్పుడు మారారు? ఈ మార్పుకు నేపథ్యం ఏమైనా ఉందా?
జ: అంతా పేరులోనే ఉంది అంటారు కదా.. వసంతకుమార్ అని సాహితీ మిత్రులు అంటుంటే ఆచార్య సి. నారాయణరెడ్డి గారు ‘వాసిలి వసంతకుమార్’ అని అనమనేవారట. వారెందుకు అలా సజెస్ట్ చేశారో కానీ అప్పటినుండి వాసిలి వసంతకుమార్ పేరు పత్రికలకు ఎక్కటం, అకడమిక్ ఫీల్డ్‌లో అందరికీ చేరువ కావటం జరిగింది. ‘ఉషోదయమ్’ పత్రిక సంపాదకత్వం బాధ్యతలు నిర్వర్తిస్తున్న కాలంలో డా. వాసిలి పేరు పాఠకులకు చేరువ అయ్యింది. రెండు దశాబ్దాల క్రితం ఆంధ్రజ్యోతిలో నా వ్యాసంగం కాలమిస్ట్‌గా ప్రారంభం కావటంతో డా. వాసిలి పేరు పత్రికా ప్రపంచానికి, పత్రికా పాఠకులకు నోటెడ్ నేమ్ అయింది.
2016లో నా షష్టిపూర్తికి యోగమిత్రులు, సాహితీమూర్తులు సన్నాహాలు చేస్తుండగా నాగరాజు అని మా యోగమిత్రులొకరు ఒక వ్యాసం రాశారు. అందులో నా యోగ సాహిత్యంలోని విషయాలను ఆధారంగా చేసుకుని వివిధ రీతుల తపస్వీ, యోగర్షీ.. ఇలా అనేక సంబోధనలతో ఒక వ్యాసం రాశారు. అలా షష్టిపూర్తి సంచిక కోసం వచ్చిన వ్యాసాలలో ద్రావిడ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు, ఆచార్య మసన చెన్నప్ప, ములుమూడి ప్రభాకరరావు వంటి ఆత్మీయులు ‘విశ్వర్షి’ అనటంతో విశ్వర్షి నామౌచిత్యాన్ని గుర్తించిన కొందరు ‘విశ్వర్షి’ బిరుదుతో నా షష్టిపూర్తి సంబరాలలో సన్మానించటం జరిగింది.
పదమూడేళ్ల ప్రాయంనుండి నేను మాస్టర్ సి.వి.వి. యోగతత్వాన్ని జీర్ణం చేసుకుని, నిత్యసాధనలో ఉండటం వల్ల ఆరు పదుల తర్వాత ప్రాపంచికతకు చెందిన ప్రతిదానికీ క్రమేపీ దూరం కావాలన్న దృక్కోణంలో వ్యాప్తమైన ‘విశ్వర్షి’లో వాసిలిని పొదువుకుని ‘విశ్వర్షి వాసిలి’గా ప్రస్థానిస్తున్నాను. ఇంకా కొంత ప్రాపంచికత నన్ను ఆవరించి ఉండటం వల్ల కాబోలు ‘విశ్వర్షి’గా సంపూర్ణ ప్రస్థాన దిశలో కొంత సశేషంగానే ఉన్నాననిపిస్తోంది.
8: ఇక నుండి నేనూ మిమ్మల్ని విశ్వర్షి అనే అంటాను. ఇంతకీ మీ అరవై పై చిలుకు పుస్తకాలతో ఒక సాహితీవేత్తగా, ఒక మనో విశ్లేషకుడిగా, ఒక వ్యక్తిత్వవికాస మార్గదర్శిగా, ఒక ఆధ్యాత్మికవేత్తగా, ఒక యోగికతత్వజ్ఞుడిగా, ఒక విమర్శకుడిగా, ఒక పరిశోధకుడిగా, చేయి తిరిగిన పత్రికా రచయితగా, కవిగా.. ఇలా బహుముఖీన ప్రతిభాసంపన్నుడిగా ముందువరసలో ఉంటారు. ఇంతటి వైవిధ్యతతో కూడుకున్న ఆలోచనాధార ఎలా సాధ్యమైందంటారు?
జ: నా ఈ జన్మను విశ్వంలో జరిగిన ఒక సంయోగ క్రియగా పరిగణిస్తాను. నా జన్మ పరంగా జరిగిన ఈ విశ్వక్రియ అమ్మానాన్నల నుండి పాంచభౌతిక వాహికగా ఒక విశిష్ట బాధ్యతను నిర్వహించాల్సిన ఉంది. నా దృష్టిలో – హ్యూమన్ ఎవల్యూషన్ పరంగా – విశ్వగర్భం నుండి మాతృగర్భం ద్వారా సంక్రమించిన జీన్స్ నా ఈ ప్రస్థానానికి భూమిక అవుతుంటాయి.
విశ్వగర్భం నుండి అందుకున్న జీన్స్ లోనివి నాలోని బహుముఖ ఆవిష్కరణలు. కాబట్టే నా జీవన పురోగతిలో సాహిత్య ప్రస్ధానం, యోగిక ప్రస్ధానం సమ ప్రాధాన్యతతో సాగుతున్నాయి. ఒకవిధంగా నా సాహిత్య ప్రస్థానంలో యోగికప్రస్థానం ఒదిగిపోయింది.. యోగికప్రస్థానంలో సాహిత్యప్రస్థానం అంతర్నిహితమైపోయింది. ఈ రెండు ప్రస్థానాలు మమేకమైపోయి ‘విశ్వర్షి తాత్వికత’ మాత్రమే మార్గదర్శక మవుతోందేమో అనిపిస్తోంది. వర్తమాన, భవిష్య తరాలకు ఈ విశ్వర్షి తత్వమే జీవనబాట కావాలన్నది నా అక్షరం ఆశిస్తున్న ప్రయోజనం.
ఇక వైవిధ్యతతో కూడుకున్న ఆలోచనాధారకు అనేకానేక కారణాలు. మీరు సంధించే ప్రశ్నలకు సమాధానాలిచ్చే సందర్భంలో వాటిని వివరిస్తాను.
9: మీ పుస్తకాలు చదువుతుంటే మీ జీవన దృక్పథాలే మీ పుస్తకాలు అనిపిస్తాయి. మీలో ఇంతటి సాంద్రత ఎలా సాధ్యమైంది?
జ: ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలంటే నా విద్యార్థి దశలోకి వెళ్లాలి. బహుశా నా పుస్తకాలకు బలమైన పునాదులు అలా తెలిసీ తెలియని వయసు అనిపించే ఆ పదహారేళ్లలోనివే.
ఆరో తరగతిలో ఉండగా రెండు చేతుల్ని రూమ్ పార్టిషన్‌గా ఉన్న అడ్డుగోడకు చేర్చి కూర్చుండటాన్ని క్లాస్ టీచర్ ఎద్దేవా చేస్తూ ‘మనిషి కోతిని చూసారా.. అటు చూడండి’ అంటూ నన్ను చూపినప్పుడు నా మనసుకు అయిన గాయం నాకు మానెరిజమ్స్ నేర్పి నన్ను నిలబెట్టింది. వ్యక్తిని సమున్నత స్థానంలో నిలబెట్టే మార్గంలో బిహేవియర్‌పై కొన్ని వ్యాసాలు రాయటానికి కావలసిన అధ్యయనాన్ని నేర్పింది ఈ ఎద్దేవానే.
ఎనిమిదో తరగతిలో ఉండగా క్లాస్‌మేట్ నా మాటను పెడ అర్థంలో టీచర్‌కి చెప్పినప్పుడు ఆ టీచర్ వీపుపై వేసిన దెబ్బ కేవలం నోటిమాటనే అయినప్పటికీ అది మనస్సును ఎంత గాయపరుస్తుందో అర్థమై అప్పటినుండి నా మాటను కట్టడి చేసుకుంటూ నొప్పింపక.. నే నొవ్వక అనే తత్వాన్ని జీవనబాటలో పరచుకున్నాను. పదుగురిలో ఉన్నప్పుడే కాదు.. మనకు మనంగా నిలదొక్కుకోవాలన్నా మన మాట చాలా పవర్ఫుల్ వెపన్ అంటూ కమ్యూనికేషన్ పర రచనలు చేయటానికి ఈ గాయమే నేపథ్యం.
నేను డిగ్రీ చేస్తున్నప్పుడు సంపాదకుడిగా మా నాన్నగారు ఒకరి రచనలో కొన్ని మార్పులు చేసినప్పుడు – ఆ మార్పులు రచయితగా తన భావాల్ని సరిగా ఆవిష్కరించలేదని బాధ పడ్డప్పుడు – అక్షరానికున్న సాధికారతను తెలియజేసింది. అప్పటినుండి ఒకరి అక్షరధారపై మనం విరుచుకుపడకూడదని నిర్ణయించుకున్నాను. సంపాదకుడిగా ఈ విషయంలో అక్షర దోషాల సవరణకు పరిమితమయ్యానే తప్ప రచయితల భావ ప్రకటనలో జోక్యం చేసుకునేవాడిని కాను.
పీజీ తెలుగు చేస్తుండగా మొదటి రోజే ఒక ఆచార్యుడు డిగ్రీలో మార్కులని బట్టి ఎంఏలో విద్యార్థులకు రాబోయే ర్యాంకులను ప్రకటించినప్పుడు – లోనుండి రగులుకొచ్చిన పౌరుషంతో కాంపిటీషన్ పురివిప్పినప్పుడు – గెలవటానికి కావలసింది అనితరసాధ్య వేగమే తప్ప అసూయ కాదు అని తెలిసివచ్చింది. మౌనంగా ఎదగాలన్న కాంక్ష పురుడుపోసుకున్న క్షణాలవి. బహుశా నాటి ఆ వీక్షణం వల్లనే కాబోలు నేనొక్కడినే గెలవటం కాదు పదిమందినీ గెలిపించటమే నిజమైన గెలుపు అన్న వ్యక్తిత్వం నాలో నిలదొక్కుకుంది. నా వ్యక్తి వికాస రచనల్లో ఆ బీజాలే మార్గదర్శక గ్రంథాలుగా ఆవిష్కృతాలయ్యాయి.
ఇలా నేను వ్యక్తి వికాస మార్గదర్శక రచనలు చేయటానికి నా జీవితంలో జరిగిన సంఘటనలే విషయ సాంద్రతలు, వ్యక్తులే సూత్రధారులు, ఆ గెలుపులే సక్సెస్ సూత్రాలు. ఈ పుస్తకాలన్నీ నా చుట్టూ ఉన్న సమాజంనుండి పుట్టుకొచ్చినవి, నన్ను చూసి ఇన్స్పైర్ అయినవారే నాయకులు అయినవి.
10: వాసిలిగారూ, జనం సాధారణం అనుకునేవాటిని మీరు చాలా సీరియస్‌గా తీసుకుంటారనిపిస్తోంది. మీ మథనమే మీ అక్షరబలం అనిపిస్తోంది. కరెక్టేనంటారా?!
జ: అబ్జర్వేషన్ – అధ్యయనం – ఆలోచన – అనుశీలన – మథనం.. ఈ అయిదింటిని ఒక రచన వెలువడటానికి నేపథ్యాలుగా చెప్పుకుంటాం. అయితే మన రచనను మనమే సమీక్షించుకోగలగటం, విమర్శనా దృక్పథంతో వివేచించుకోగలగటం, సమకాలీన రచనలతో తులనాత్మకంగా బేరీజువేసుకోగలగటం వల్లనే రచనకు ప్రామాణికత సిద్దిస్తుందన్నది నా ప్రగాఢ నమ్మకం. నమ్మకం అనే కాదు అక్షరసత్యం. నా అక్షరం సత్యప్రకాశకం కావాలన్నా, నా రచన ప్రామాణికం కావాలన్నా నాలో సీరియస్‌నెస్ అంతర్గర్భితమై ఉండాలి. యస్, విషయపరంగా సీరియస్‌గా ఉంటే తప్ప అక్షర సముదాయానికి అధికారిక స్వరం సిద్ధించదు.
11: వ్యక్తిత్వ వికాసంపై తెలుగులో కొన్ని వందల పుస్తకాలు, ఇంగ్లీషులో వేల గ్రంథాలు ఉన్నాయి. మీరు ఈ రకమైన రచనలు చేసేనాటికే సుప్రసిద్ధ రచయితల వ్యక్తిత్వ వికాస గ్రంథాలు మార్కెట్లో విరివిగా అమ్ముడుపోతున్నాయి. అయినా మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్ పై దృష్టి పెట్టటానికి కారణం? వారిలా మీ పుస్తకాలు అమ్ముడుపోతాయని, బాగా డబ్బు సంపాదించవచ్చని రాసారా? అసలు మీ పుస్తకాలకి, వారి గ్రంథాలకు ఉన్న వ్యత్యాసం ఏమిటి? వ్యక్తిత్వ వికాస రచయితగా మిమ్మల్ని మీరు ఎలా నిర్వచించుకుంటారు?
జ: అవును, నేను వ్యక్తి వికాస తరహా రచనలు ప్రారంభించింది 2005లో. ఆ దశాబ్దం, ఆ పై దశాబ్దం వ్యక్తిత్వ వికాస రచయితలకు స్వర్ణ యుగం. నేను పుస్తకాలుగా ఏ వ్యక్తిత్వ వికాస గ్రంథమూ రాయలేదు. నా రచనలన్నీ వ్యక్తిత్వానికి అంటే పర్సనాలిటీకి పరిమితమైనవి కావు. నా లక్ష్యం వ్యక్తిమత్వం. అంటే నోబుల్ క్యారెక్టర్.
‘ఆంధ్రజ్యోతి’ కాలమిస్టుగా నా ఈ ప్రస్ధానం ప్రారంభమైంది. మొదట్లో రాసిన అయిదారు వ్యాసాలను పాఠకులు విశేషంగా ఆదరించారు. రాస్తున్న తీరు సంపాదకులకు నచ్చింది. నచ్చటానికి కారణం భారతీయత ప్రతి అక్షరంలోను ధ్వనించిందన్నది పత్రికా సంపాదకుల, పాఠకుల ఉవాచ. ఇలా విన్నింగ్ మెథడ్స్ పైనా, సక్సెస్ సూత్రాల పైనా, స్ట్రెస్ మానేజిమెంట్ పైనా, మ్యారేజ్ రిలేషన్షిప్స్ పైనా రెండేళ్లపాటు ప్రతీ వారం ఆంధ్రజ్యోతికి రాసాను. ప్రతీ వ్యాసమూ అవుట్‌స్టాండింగ్ ఆర్టికల్ అనిపించింది. ఇలా నా దృక్పథాలకు అక్షర రూపమిచ్చి, పదుగురి నడవడికకు మార్గదర్శిని అవుతూ, పాఠకులకు చేరువ అయ్యానే తప్ప డబ్బు సంపాదనకు నాటి నుండి నేటి దాకా నేను ఏ రచనా చెయ్యలేదు.. చెయ్యను కూడా. నేను కోరుకునేది వ్యక్తిమత్వం విలసిల్లే తరాలను.
అసలు నా రచనలలో నన్ను నేను గెలవటం ప్రధాన విషయం అయివుంటుంది. అందుకోసం నా ఎదురీత నేర్పిన అనుభవాలు విన్నింగ్ మెథడ్స్‌గా రూపించాయి, సక్సెస్ అయిన సహచరుల విధానాలే సక్సెస్ సూత్రాలుగా అక్షరబద్ధమయ్యాయి. ఈ సందర్భంలో నా వ్యక్తి వికాస పుస్తకాల నేపథ్యాలను కొంత ప్రస్తావించుకుందాం.
‘ది విన్నర్ : గెలవాలి! గెలిపించాలి!!’, ‘సిగ్గుపడితే సక్సెస్ రాదు’, ‘టైం ఫర్ సక్సెస్’ వంటి వ్యక్తిత్వ వికాస రచనలు చేయటానికి కారణం – పడుతూ లేస్తూ నేను చేసిన పోరాటం – ఎదురీత, పదుగురు గెలవటానికి నా నాలుగు మాటలు దోహదపడాలన్న ఆరాటం, చెప్పే మాటలు మరో భాషా సాహిత్యానికి అనుకరణ కాక సొంత గొంతుకతో ఇక్కడి నేపథ్యంతో యువతకు చేరాలన్న తపన.
మనలోని ప్రతి ఒక్కరం అసామాన్యంగా అంతెత్తున ఉండాలనుకుంటాం. చేరాలనుకుంటున్న ఆ పైమెట్టు మన స్వభావం నుండి, మన తత్వం నుండి పుట్టుకొచ్చిందయితే ఫర్లేదు. అలాకాక అసూయతో వేగిపోతూ, వేగిరపడితే చతికిలపడటమే అవుతుంది. పర్ఫెక్ట్ కావటానికి బదులు స్ట్రెస్ అవుతాం. ఈ నేపథ్యంలో ‘ఒత్తిడి ఇక లేనట్లే!’ అనుకునే స్థితిని సిద్ధింపచేసుకోవాలి. ఇందుకోసం రాసిన పుస్తకమే పాతిక వ్యాసాల సంకలనం ‘ది పర్ఫెక్ట్ : ఒత్తిడి ఇక లేనట్లే!’. ఇందులోని ప్రతి వాక్యం స్ట్రెస్ రిలీవరే.
వైవాహిక ప్రస్థానమూ మనలోని ప్రతి ఒక్కరి వ్యక్తిమత్వానికి ఒక మెచ్చుతునకనే. భార్యాభర్తల బంధంలో స్పేస్ కున్న విలువ చాలా ముఖ్యమైంది. ఒకరి స్పేస్‌ను మరొకరు గుర్తించటం, గౌరవించుకోవటం ప్రధానం. ఈ విషయ సంపన్నతతో నేను రాసిన కాలమ్ పెళ్లి గురించి. ఇలా రాసిన పాతిక వ్యాసాలు ‘పెళ్లి మైనస్ పెటాకులు’ పుస్తకంగా పలు జంటలకు కనువిప్పు కలిగించింది. రచనాపరంగా ఈ వ్యాసరచనలు ఒక ఎక్స్‌పరిమెంట్. కథనాత్మకంగా ప్రారంభించి విషయ ప్రధానంగా, సమస్యా పరిష్కారంతో ముగించటం ఇందులో నాకు నచ్చిన రీతి.
ఇక మనం వ్యక్తిమత్వ సంపన్నులం కావాలంటే మనం మనసును గెలవాలి. ఎమోషనల్ లైఫ్‌లో సంయమనం సాధ్యం కావాలి. అందుకే ‘ఆంధ్రభూమి’ దిన పత్రికకు ఈ రెండు జీవన గమనాలపై కాలమ్స్ రాసాను. ఆ వ్యాస సంపుటులే ‘మనసును గెలవాలి!’, ‘లైఫ్ ఈజ్ ఎమోషనల్ : అయినా గెలవాల్సిందే!’ పుస్తకాలు. ఈ పుస్తకాలలోని వ్యక్తులు నాకు పరిచయస్తులే, సంఘటనలు సందర్భాలు నా ఎరుకలోనివే. అంటే, నేల విడిచి చేసిన సాము కాదు ఈ రచనలు అని చెప్పటమే నా ఉద్దేశం. సాంద్రత గల వ్యాసాలు మన చుట్టూ ఉన్న జీవితాల నుండే పుట్టుకొస్తాయి అనటానికి నా ప్రతీ రచనా అక్షర సాక్ష్యమే.
అన్నీ మనకు తెలుసు అనుకోవటం మానవ నైజం. అయితే తెలీనిదే అమితం అనుకోదు మన మనస్సు. మన వ్యక్తిత్వమూ దాన్ని అంగీకరించదు. దీంతో మనలో ఒక మిడిసిపాటుతనం అంతర్గత వ్యవహార సరళి అయిపోతుంది. ఫలితంగా అనర్థాలు జరిగిపోతుంటాయి. అపార్థాలు తలెత్తుతుంటాయి. జీవితంలో అనవసరతల పాలు ఎక్కువవుతుంది. ఇటువంటి తెలీని రహస్యాలు ఎన్నో ఎన్నెన్నో. ఈ వివేచనతో రాసిన వ్యాసాల సంకలనమే ‘మనకే తెలీని మన రహస్యాలు’ పుస్తకం.
ఇక, నా ‘మానవ తత్వ దర్శనాలు’ తొలి మానవుడి నుండీ నేటి నాగరిక మానవుడి వరకు జరిగిన పరిణామాన్ని హేతువులతో, కథనాత్మకంగా చెప్పటం ఈ వ్యాసాల ప్రత్యేకత. మానవ ప్రస్థానంలో భౌతిక పరిణామానికి అధిభౌతిక పరిణామం తోడయితే భవిష్య మానవ పరిణామం ఎలా కొత్త పుంతలు తొక్కుతుందన్న దర్శనాన్ని ఈ పుస్తకం కలగచేస్తుంది. నాకు నచ్చిన సరికొత్త పరిణామ దర్శన రచన ఇది.
12: మీ స్నాతకోత్తర విద్య తెలుగు భాషా సాహిత్యాలది. మీ డాక్టరేట్ తెలుగు నవల పైన. అయినా అక్షర ప్రస్థానంలో మీ సాహిత్య ప్రస్థానాన్ని వ్యక్తి వికాసిక, మానసిక, తాత్విక, యోగిక రచనలు డామినేట్ చేసాయని అంటుంటారు. నిజమేనంటారా.. అసలు మీరు మంచి విమర్శకులగానో, పరిశోధకులగానో రాణిస్తారనుకునేవారు. అటువంటిది ఇంతటి మార్పా?!
జ: నిజమేనండీ, మొదట్లో సాహిత్య పరమైన వ్యాసంగమే మిక్కుటంగా ఉండేది. సాహిత్య వ్యాసాలూ బాగా రాసేవాడిని. సాహితీమూర్తులపైనా, వారి సాహిత్యంపైనా 22 ఏళ్ళ ప్రాయంలోనే ప్రతీవారం పత్రికలకు రాస్తుండేవాడిని. అభ్యుదయ, విప్లవ, దిగంబర సాహిత్యాల పైన, ఆ కవుల పైన చాలా వ్యాసాలే రాసాను. అలాగే భావకవులపైనా, జానపదుల పైనా కొంత రచనావ్యాసంగం సాగింది. పుస్తక సమీక్షలు, ముఖాముఖీలు సరేసరి. తులనాత్మక, పరిశోధనాత్మక వ్యాసాలు గణనీయంగానే రాసాను. పీహెచ్.డి. చేస్తుండగానే పరిశోధనా పద్ధతులపైనా, సిద్ధాంతగ్రంథ రచనా సంవిధానంపైనా విశేష కృషి చేసాను. ఒక పుస్తకం సిద్ధం చేసాను కానీ అప్పట్లో ఒక మిత్రురాలు తీసుకుని, అర్థాంతరంగా మరణించటంతో ఆ స్క్రిప్ట్ నాకు తిరిగి చేరలేదు. అలాగే నవలపైనా నేను చేసిన సమాచార సేకరణ కూడా పుస్తకరూపంలోకి వచ్చి ఆమె వల్ల నాకు దూరమైంది. ఇలాగే, నేను చేసిన తెలుగు సాహిత్య చరిత్ర నాలుగు భాగాలు కూడా ఒక సాహిత్య విద్యార్థికి ఇచ్చి పోగొట్టుకున్నాను.
ఈ నేపథ్యంలో వ్యాసరచన వల్ల వ్యాస రచయితగా నా స్థానం ప్రశ్నార్ధకమనిపించింది. ముఖ్యంగా, ఆ వ్యాసాలలో నా టోన్, నా ఫిలాసఫీ వ్యక్తం కాదన్న నిర్ణయానికి వచ్చాను. రచనా వైవిధ్యతకు, విషయ వైవిధ్యతకు, కొత్తకోణ ఆవిష్కరణలకు, పద ప్రయోగాలకు, వాక్య విన్యాసాలకు అవకాశం ఉండకపోవటమే కాక నాదైన ముద్ర సాధ్యం కాదనిపించి రచనా వ్యాసంగానికి పాతికేళ్లు కామా పెట్టాను. ఆ తర్వాత నా యాభైలలో ఆంధ్రజ్యోతి సంపాదకులు కె. శ్రీనివాస్ గారిచ్చిన అవకాశంతో నా సాహిత్య ప్రస్థానం మలుపు తిరిగి బహుముఖీనమైంది. ఆంధ్రభూమి సంపాదకులు ఎం.వి. శాస్త్రి గారిచ్చిన ప్రోత్సాహంతో నా మనోవైజ్ఞానిక, మనోవిశ్లేషణాత్మక, తాత్విక రచనా వ్యాసంగం పాఠకాదరణ పొందటమే కాక, రచయితగా నా అక్షర ప్రస్థానం కొత్తపుంతలు తొక్కి సాహిత్యంలో నాదైన సంతకానికి శ్రీకరమైంది.
13: సాహిత్య ప్రక్రియల్లో మీరు వ్యాసానికి, కవిత్వానికి ఇచ్చిన ప్రాధాన్యం కథ, నవలకు ఇచ్చినట్లు కనపడదు. దీనికి ప్రత్యేక కారణాలంటూ ఉన్నాయా?
జ: ఈ రోజు నా చిరునామా వ్యాస రచయితగానే కావొచ్చు కానీ, ఆ వ్యాసరచనలోనూ నాదైన ముద్రకు కారణం కథ, నవల వంటి సమకాలీన సాహిత్య ప్రక్రియలపై లోతైన అధ్యయనం, అంతో ఇంతో అభ్యసనం వుండటం వల్లనే సాధ్యమైంది. ఇప్పటివరకు నా వ్యాసాలు వెయ్యికి పైగానే ఉంటాయి. ప్రతీ వ్యాస శీర్షికా వినూత్నంగా, వైవిధ్యంగా ఉంటుంది. శీర్షిక అర్థవంతంగా ఉంటుంది. శీర్షికలో ఒక తూగు, లయ ఉంటుంది. అసలు, నా వరకు నా ప్రతి వ్యాస శీర్షికా ఒక కవితావాక్యమే.
ఇక, వ్యాస ప్రారంభాలు కూడా రొటీన్‌గా కాకుండా కొత్తగా ఉండాలనుకుంటాను. కథన ధోరణిలోనూ, కవితాత్మకంగాను, సంభాషణాత్మకంగానూ, వర్ణనాత్మకంగాను, విషయపరంగాను, తాత్వికపరంగాను, మనోవిశ్లేషణాత్మకంగాను.. ఇలా అనేకవిధాలా నా వ్యాసాలు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా, వ్యాస విషయమూ, వ్యాసాన్ని నడిపే వ్యక్తులూ, వారి మనస్తత్వాలూ, తత్వాలూ, వర్తనలూ అన్నీ నాకు తెలిసన వ్యవస్థనుండి పుట్టుకొచ్చినవే. అన్నిటికీ పునాదులు నా అధ్యయనాలు, నా అనుశీలనలు, నావైన విశ్లేషణలు. కాలమిస్ట్‌గా పదిహేనేళ్లకు పైగా నా ప్రస్థానం ఇంతటి వైవిధ్యతకు మూలమైంది.
వ్యాసం తర్వాత నా కలం పరుగులు తీసింది కవిత్వం వైపే. కవిత్వంవైపు కూడా నేను నిలదొక్కుకోలేకపోయేవాడినేమో. ఆత్మీయ మిత్రులు గంగిశెట్టి లక్ష్మీనారాయణగారు నేను తాత్విక నేపథ్యంతో ఆంధ్రభూమిలో రాస్తున్న వ్యాసాలను చూసి, ఆ వ్యాసాలను నావైన కవితా పంక్తులతో ప్రారంభిస్తుండటాన్ని చూసి నా తత్వాన్ని పూర్తిగా కవితాత్మకంగానే వ్యక్తీకరిస్తే ఒక నూతన ప్రక్రియకు ఆద్యుడవు అవుతావు అని పట్టుబట్టడంతో నా ‘నేను’ తొలి యోగిక కావ్యంగా తెలుగు సాహిత్యంలో స్థానం సంపాదించుకోగలిగింది. ఇలా కవిగా తొలిగా పడ్డ అడుగులు ‘జీవన సంహిత’ కవితాత్మికల సంపుటికి, వర్తమాన వర్తన కవితా సంకలనంగా ‘ఏడో ఋతువు’ ఆవిష్కరణకు దారితీసాయి.
కథలు ఓ పదో, పదిహేనో తృప్తిగా రాసుకున్నానే తప్ప కథకుడిగా నిలదొక్కుకోవాలన్న తపనతో కాదు. ‘నవల’ను పరిశోధనకే పరిమితం చేసుకున్నాను కానీ, లోతైన పాత్రల అధ్యయనంతో మనో విశ్లేషణ, వ్యక్తి తత్వ అక్షరీకరణ నా వ్యాసాలలో సాధ్యమైంది.
14: వృత్తిపరంగా మీరు ‘యోగా’న్ని ప్రధాన అంశంగా స్వీకరించినట్టు అర్థమవుతోంది. సాహిత్యాన్ని మీ వృత్తితో ఎలా సమన్వయం చేయగలుగుతున్నారు? వివరంగా చెప్పండి.
జ: ప్రసాద్ గారూ, ప్రాపంచికుల దృష్టిలో వృత్తి అంటే మన నిపుణతను సంపాదనకోసం వినియోగించటం. బహుశా, ఈ అర్థాన్ని దృష్టిలో ఉంచుకునే మీరీ ప్రశ్నను వేసారనుకుంటున్నాను. ఈ సందర్భంలో నన్నెరిగిన ప్రతి ఒక్కరికి నా గురించి ఒక స్పష్టతను ఇవ్వాలనుకుంటున్నాను. నా ఈ అరవైయెనిమిదేళ్ల జీవనయానంలో ఏనాడూ డబ్బు వెంట పడలేదు. ధన సంపాదన జీవిక అనుకోలేదు. నాది ప్రవృత్తి జీవనమే తప్ప వృత్తి జీవనం కాదు. అంటే మనసుకు నచ్చినట్టు జీవితాన్ని మలచుకున్నానే తప్ప జీవిక కోసం మనసును తిప్పుకోలేదు. ఈనాటివరకు మనసును తప్పించి లేదా పక్కనపెట్టి ఏ పనీ చేయలేదు. దీనివల్ల ప్రాపంచికంగా చాలా కోల్పాయాననుకుంటారు. నిజానికి నేను నిల్వవేసుకున్న మానసిక సంపద ఉత్కృష్టమైంది. నా ఈ జీవన కంఫర్టబిలిటీకి కొలమానం పదవులూ కాదు, పెద్ద పెద్ద భవనాలూ కాదు.. అలాగే అధికార తాపత్రయమూ లేదు, ఏదో పొందలేకపోయానన్న వేదనా లేదు. దేనికీ పొంగిపోయింది లేదు, కృంగిపోయింది లేదు. ఇక, రచనా వ్యాసంగాన్ని కానీ, యోగాన్ని కానీ నేనేనాడూ డబ్బుసంపాదనకు వినియోగించుకోలేదు. కాబట్టి ఆ రెండూ నాకు ప్రవృత్తులు, స్పష్టతను సంతృప్తిని ఇచ్చిన మార్గాలు.
తెలుగు భాషా సాహిత్యాలపై మక్కువతో అధ్యయన, అభ్యసనాలతో కలం పట్టి అక్షరంపై పట్టు సాధించగలిగాను. నాలో ఉండే తిరగబడే తత్వం, ప్రశ్నించే తత్వం అందరూ సేవించే ఆధ్యాత్మిక మార్గంలో కాక, సాధనతో పరిణమించగల యోగమార్గం వైపు మళ్లింది. మాస్టర్ సి.వి.వి. యోగమార్గమైన భృక్త రహిత తారక రాజయోగ మార్గంలో యాభయయిదేళ్ల నిరంతర సాధకుడిని చేయటమేకాక, గురువు స్థానానికి అర్హుడ్ని చేసింది. సాహిత్య ప్రస్థానంలో కానీ, యోగ ప్రస్థానంలో కానీ నేను ఈనాటివరకు ఏ ఒక్క రూపాయి ఆశించింది లేదు. అందుకే సాహిత్యకంగాను, యోగికంగాను నేను కంఫర్ట్ జోన్‌లో ఉండగలుగుతున్నాను.
సృష్టిలోకి వచ్చిన ప్రతి ఆవిష్కరణకు, దర్శనకు దాని తత్వం అంటూ ఒకటుంటుంది. ఆ తత్వం అర్థమయితే ఏ రెండిటనైనా ఇట్టే సమన్వయం సాధించవచ్చు. అందుకే నా విషయంలో సాహిత్యం, యోగం రెండుగా కాక ఒకటిగానే భాసించాయి.
15: మీ యోగిక, తాత్విక రచనల గురించి కాస్త చెప్పరా?
జ: నా ప్రతి పదమూ నా తత్వాన్ని ప్రతిఫలించేదే. ఎదగాలనుకునే ప్రతిఒక్కరిని ప్రభావితం చేసేదే. నిజం చెప్పాలంటే, నా రచనలు కొన్ని నన్నూ ప్రభావితం చేసాయి. వాటిల్లో కొన్ని నా జీవన గమనాన్ని మార్చినవీ ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.
నేను యోగమార్గంలోకి వచ్చింది పదమూడేళ్ల ప్రాయంలో. మా చిన్న చెల్లెలు రెండేళ్ల ప్రాయంలో మేడపై నుండి పడి అకాలమరణం చెందటంతో మా అమ్మానాన్న గారలు బాగా కృంగిపోయి కొంత విరక్తిలోకి జారుకుంటున్న సమయాన మద్రాసులోని డా. గాలి బాలసుందరరావు గారి ద్వారా మాస్టర్ సి.వి.వి. యోగమార్గం వారికి జీవశక్తిని, ప్రాణశక్తిని అందించింది. అలా అమ్మానాన్నలతోపాటు నేనూ మాస్టర్ యోగసాధనకు ఉపక్రమించాను. ఇది కాకతాళీయంగా జరిగిందే అయినా మా కుటుంబం యోగకుటుంబం అయింది, మా జీవితాలు యోగజీవితాలు అయ్యాయి. ముఖ్యంగా, నా విషయంలో యోగం వినా మరొకటి లేదు. ఉచ్చ్వాసమైనా నిశ్వాసమైనా మాస్టర్ యోగమే. రాసినా, చేసినా యోగతత్వాన్ని అల్లుకునే. యోగం పేరుతో ఈనాటివరకు నేను రూపాయయినా తీసుకున్నది లేదు. ఇక, మీరే నిర్ణయించండి నాకు యోగం వృత్తినా, ప్రవృత్తినా, జీవితమా అన్నది.
అసలు, మా మాస్టర్ యోగమార్గం ధ్యానమార్గం, జ్ఞానమార్గం, సాధనామార్గం. సంపాదన మీద యావ లేదు కాబట్టి నా సాహిత్య ప్రస్థానం, ధ్యానయోగ ప్రస్థానం డబ్బు చుట్టూ పరిభ్రమించటం లేదు, కీర్తి కాముకత చుట్టూ భ్రమించటం లేదు, సేవా దృక్పథంతోనే, మానవ హితాన్ని, విశ్వహితాన్ని కాంక్షించే జరుగుతోంది.
అందుకే, ప్రాపంచికతలో ఊపిరి తీసుకుంటూనే మన సాధనా జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో – నా సాధనా ప్రయాణాన్ని ఆలంబనగా చేసుకుని – ‘77 సాధనా రహస్యాలు’, ‘యోగలయ’ పుస్తకాలను రాసాను. 77 సాధనా రహస్యాలు పుస్తకం ఇప్పటికి ఏడెనిమిది ముద్రణలు పొంది యోగ ధ్యాన సాధకుల వ్యక్తిత్వాన్ని వ్యక్తిమత్వంగా ప్రకాశింపచేయటంలో ప్రధానపాత్ర వహిస్తోంది. ఇక, ‘56 ఆత్మ దర్శనాలు’ పుస్తకం అయిదు ముద్రణలు పొంది ఆత్మయానానికి కొత్తవాకిళ్లను తెరుస్తోంది.
మాస్టర్ సి.వి.వి. యోగపరంగా అనుభవపూర్వక అనుశీలన, అవగాహన ‘ప్రజ్ఞాన రహస్యాలు’ పుస్తకమైంది. ఈ పుస్తకం భృక్త రహిత తారకరాజ యోగమార్గ అనుయాయులకు కొత్త దృక్పథాలను ఆవిష్కరించింది. ‘మానవ తత్వ దర్శనాలు’ పుస్తకం కొన్ని యుగాలుగా మానవ పరిణామం జరిగిన తీరును కాలగతిన కథనాత్మకంగా అక్షరబద్ధం చేస్తూ భవిష్య మానవ పరిణామం యోగచైతన్యంతో ఎంతలా కొత్తపుంతలు తొక్కుతుందో విశదీకరిస్తూ చేసిన యోగసాహిత్యమైంది.
16: మీరు యోగపరంగా మీ నాన్నగారైన శార్వరిగారి జీవితచరిత్రను రాసినట్టున్నారు..
జ: అవునండీ, ‘మాస్టర్ శార్వరి : మిషన్ అండ్ విజన్’ పేరిట రాసాను. తండ్రిగా, గురువుగా, యోగమూర్తిగా, సాహిత్యస్రష్టగా, పాత్రికేయునిగా వారిని అతి సన్నిహితంగా చూస్తూ – ఈ అయిదు ముఖాలలోనూ వారిని నేను ఎలా అర్థం చేసుకున్నది – అక్షరబద్ధం చేసాను. జీవితచరిత్రల రచనలో ఈ పుస్తకరచన ఒక వినూత్న ప్రయోగం. థియొసాఫికల్ సొసైటీ వ్యవస్థాపకురాలు బ్లవట్స్కీ తాత్విక సరళిపై నేను రాసిన ‘అతీంద్రియ రహస్యాలు : బ్లవట్స్కీ’ పుస్తకం బ్లవట్స్కీపై వచ్చిన తెలుగు పుస్తకాలలో తొలి తాంబూలాన్ని అందుకుంది అని చెప్పవచ్చు. ఇప్పటికి ఏడు ముద్రణలు పొందింది. ఈ రెండు పుస్తకాల రచనలోనూ తత్వమూ, సాహిత్యమూ కలనేత అయి నా కలంబలంగా నిలదొక్కున్నాయి.
17: ఈ సందర్భంలో మీ ‘గీతా రహస్యాలు’ గురించి నాలుగు మాటలు చెప్పండి?
జ: అసలు, ‘గీతా రహస్యాలు’ వంటి పుస్తకాన్ని నేను రాస్తాను అని నేను ఏనాడు అనుకోలేదు. అయితే, నాన్నగారు తమ ‘కృష్ణావతారం’ పుస్తకాన్ని నా పదహారేళ్ల ప్రాయంలో ‘యోగేశ్వర కృష్ణ’ మకుటంతో వేద్దామనుకున్నారు. అయితే అది అప్పట్లో ‘కృష్ణావతారం’ గానే ప్రచురితమైంది. కారణం తెలీదు కానీ, యోగేశ్వర కృష్ణగా ప్రచురింపబడక పోవటంతో ఏదో అన్యాయం జరిగిపోయిందన్న వ్యాకులత నాలో ఉండిపోయింది. ఆ అసంతృప్తి వల్లనే కాబోలు నా ‘కొత్తకోణంలో గీతా రహస్యాలు’ వంద పైచిలుకు వ్యాసాలతో, ఆంధ్రభూమిలో ఏడాదిన్నరపాటు కాలమ్‌గా ప్రచురింపబడటమే కాక ‘జీవనగీత’, ‘ఆత్మగీత’, ‘నాయకగీత’, ‘యోగికగీత’గా వెయ్యి పుటలతో నాలుగు భాగాలయి గీతాసాహిత్యంలో సరికొత్త ఆవిష్కరణల ప్రబంధమైంది. ఈ సందర్భంలో నేను సంపాదకత్వం వహించిన ‘యోగదర్శిని’ త్రైమాసిక ఒక పుష్కరకాలంపైగా వెలుగు చూసి యోగసాధకులకు ఎంతో మార్గదర్శకమైందని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పగలను.
18: మీ సాహిత్య, యోగిక ప్రస్థానాల ప్రశస్తిని తక్కువగా అంచనా వేయలేం. ఈ రెంటినీ డామినేట్ చేస్తూ మీ ‘నేను’’ కావ్య ప్రస్థానం జరిగింది. అసలు, ఈ కావ్య రచనే మీ ప్రస్థానంలో ఒక మైలురాయి. పైగా ఇది తొలి యోగికకావ్యంగా ప్రఖ్యాతమైంది. ఈ కావ్య రచనను గురించి చెప్పండి.
జ: నా ‘నేను’ కావ్యరచన ఎయిత్ వండర్. కట్టడ నిర్మాణం జరుగుతుంది తప్ప అది వరల్డ్ వండర్ అవుతుందని ఎవరూ నిర్మించలేరు. అంటే వండర్ కావటం ఓనర్ చేతిలో ఉండదు. అలాగే, నా ‘నేను’ కావ్య రచన కూడా ఎటువంటి ప్రణాళికతో సాగింది కాదు. అంతేకాదు, అది కవితాత్మకంగా ప్రారంభమైన ప్రయాణమూ కాదు. ఆంధ్రభూమిలో వస్తున్న నా తాత్విక వ్యాసాలను చూసి, ఆ వ్యాసాల ఎత్తుగడ కవితాత్మకంగా ఉండటంతో కవిత్వ రూపంలోనే ఆ విషయం సంపన్నతను అక్షరబద్ధం చేయమన్న ఆత్మీయులు గంగిశెట్టి లక్ష్మీనారాయణగారి ఆశంసనే ‘నేను’ కావ్య ప్రస్థానానికి తొలిఅంకం. ‘సిరికోన’ వాక్స్థలీ సంచికలో వారం వారం తొలుతగా ప్రచురితం కావటం, కొంత తడవు తర్వాత ఆంధ్రభూమి దినపత్రికలో అది కాలమ్‌గా ప్రచురితం కావటం మలిఅంకం. దాదాపుగా ప్రతివారం రాసిన ‘నేను’ కవిత ఒక దీర్ఘ కవితనే. వీటిని ప్రచురణ నిమిత్తం సమీక్షించుకుంటున్నప్పుడు ఒక క్రమగతిలో సంపుటీకరించటంతో ‘నేను’కు కావ్య సొబగు దక్కింది. 64 దీర్ఘ కవితలు సప్త పథాలలో ఒదిగిపోవటంతో ‘నేను’ కావ్య యశస్సు పెరిగింది. కావ్యేతివృత్తం యోగప్రధానమైంది కావటంతో యోగికకావ్యమైంది. తెలుగు సాహిత్యంలో ఇటువంటి సమగ్ర యోగిక కావ్యం ఇంతవరకూ రాకపోవటంతో తెలుగు సాహిత్య ప్రపంచం నా ఈ ‘నేను’ కావ్యాన్ని తొలి యోగిక కావ్యంగా పట్టం కట్టింది. ఇలా ‘నేను’తో కవితాప్రస్థానం ప్రారంభించిన నేను ‘జీవన సంహిత’ పేరుతో కవితాత్మికల సంకలనాన్ని, ‘ఏడో ఋతువు’ పేరుతో వర్తమాన వర్తన కవితల సంపుటిని తీసుకురాగలిగాను. మద్రాస్ విశ్వవిద్యాలయం, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, మధురై కామరాజ్ విశ్వవిద్యాలయం నా సాహిత్యం పైనా, ఈ కావ్యం పైనా రెండు రోజుల అంతర్జాతీయ సదస్సులు నిర్వహించటంతో నా సాహిత్య యోగిక ప్రస్థానాలకు సముచిత గౌరవమే దక్కుతోందన్న సంతృప్తి చోటుచేసుకుంటోంది. ఇలా పత్రికలూ తమ ముఖాముఖీలతో నాకు అక్షర సత్కారం చేస్తున్నాయి.
19: వాసిలి గారూ, పత్రికలలో మీరు వ్యక్తివికాస కాలమ్స్ మాత్రమే కాక మనోవిశ్లేషణాత్మక కాలమ్స్, స్ట్రెస్ మేనేజ్మెంట్ కాలమ్స్తో పాటు యోగిక తాత్విక ఆధ్యాత్మిక కాలమ్స్ కూడా అనేకాలు రాశారు కదా. వాటి గురించి కొంత వివరిస్తారా..
జ: అవునండీ.. నేను రాసిన పర్సనాలిటీ, మానేజిమెంట్, రిలేషన్షిప్స్ కాలమ్స్ పది పుస్తకాలుగా అనేక ముద్రణలు పొందాయి. అలాగే ఆంధ్రజ్యోతికి 56 వారాలపాటు రాసిన ‘చింతన’ కాలమ్, ‘56 ఆత్మ దర్శనాలు’ పుస్తకమై ఇప్పటికి 7 ముద్రణలు పొందింది. పాతిక వారాలకు పైగా రాసిన మహాత్ముల సాధనకు సంబంధించిన కాలమ్ ‘77 సాధనా రహస్యాలు’ పుస్తకంగా నేటికీ 5 ముద్రణలు పొందింది.. ఆంధ్రభూమికి వంద వారాలకు పైగా ‘వాసిలి వాకిలి’ పేరిట రాసిన కాలమ్ ‘కొత్తకోణంలో గీతారహస్యాలు’గా పరిశోధనాత్మక తాత్విక వ్యాస కదంబంగా ‘జీవన గీత’ ‘ఆత్మ గీత’ ‘నాయక గీత’ ‘యోగిక గీత’ లుగా నాలుగు భాగాలయింది. ఆంధ్రప్రభకు రాసిన ‘మూడో కన్ను’ కాలమ్ ‘మృత్యు కర్మ జన్మ రహస్యాలు’గా ముద్రణలో ఉంది. ఈ ఏడాది ‘ఆధ్యాత్మిక ప్రసంగ లహరి’, ‘సాహిత్య ప్రసంగ కౌముది’, ‘స్వీట్ సిక్స్టీన్’, ‘స్వీట్ సిక్స్టీ’, ‘లోనారసి’, ‘దృక్సూచి’, ‘ఖగోళ రహస్యాలు’ ముద్రణారూపంలో వెలుగుచూడాల్సిన పుస్తకాలు.
జ: నా ‘77 సాధనా రహస్యాలు’ కన్నడంలో ‘77 సాధనా రహస్యగలు’గా రెండు ముద్రణలు పొందింది. ‘మనకే తెలీని మన రహస్యాలు’ కన్నడంలో ‘నమగె తెలియద నమ్మ రహస్యగలు’ అయింది. ‘నేను’ యోగిక కావ్యం ‘నాను’ కన్నడ యోగిక కావ్యమైంది. ‘77 సాధనా రహస్యాలు’ ఆంగ్లంలో ‘77 స్పిరిట్యుయల్ సీక్రెట్స్’గా అనువదింపబడింది. ‘నేను’ హిందీలో ‘మై’ యోగిక కావ్యంగా సరళ సంస్కృతంలోను అనువాదం జరుగుతోంది.
21: వాసిలిగారూ, మిమ్మల్ని సాహిత్యపరంగానే కాక మనోవైజ్ఞానికంగాను డాక్టర్ గానే పరిగణించాలి. ‘నేను’ వంటి అత్యద్భుత దీర్ఘకావ్యాన్ని రాసిన మీరు, ‘ఒత్తిడి ఇక లేనట్లే’ అంటూ స్ట్రెస్ మానేజ్మెంటు పై రాసిన మీరు, ‘లైఫ్ ఈజ్ ఎమోషనల్ : అయినా గెలవాల్సిందే’, ‘మనసును గెలవాలి’ వంటి సైకలాజికల్ బుక్స్ రాసిన మీరు దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రచయితలు, రచయిత్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కాస్త వివరంగా చెప్తారా?
జ: యస్, డా. ప్రసాద్ గారూ, మీరన్న దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని మేము మాస్టర్ యోగపరంగా ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ, మెర్రి లైఫ్ అనీ అంటాం. ఇటువంటి దీర్ఘకాలిక ఆరోగ్యకర జీవితం సంప్రాప్తం కావాలంటే మన రచయితలకైనా, రచయిత్రులకైనా సంయమన దైనందిన జీవన శైలి సాధ్యం కావాలి. నిత్య వ్యవహారాలలో బ్యాలెన్సింగ్ సాధ్యం కావాలి. ఒకవిధంగా ఉదయ సాయంసంధ్యలలో ధ్యాన మగ్నం కాగలిగితే ప్రశాంత జీవన శైలి ఒంటబడుతుంది. రాయటానికి వేగిరపడకూడదు. ఈ వేగిరపాటు వల్ల ‘ఒత్తిడి’ పెరుగుతుంది. ‘ఎమోషన్స్’ని కంట్రోల్ చేసుకోవటం సాధ్యపడదు. గంటలు గంటలు కుర్చీకే అతుక్కుపోయి రచనా వ్యాసంగం సాగించక, టైం డిసిప్లిన్‌తో రచయితగా వర్ధిల్లటం ఆరోగ్యకర వర్తనానికి దారితీస్తుంది. అయినా, సృజననే వృత్తిగాను ప్రవృత్తిగాను పరిణమిస్తున్న రచయితలకు, రచయిత్రులకు తమను తాము సృజించుకోవటం తెలియదంటారా.
~
* చాలా విస్తృతంగా మిమ్మల్ని ఆవిష్కరింపచేసే అవకాశం ఇచ్చారు. ‘సంచిక’ వార, మాస పత్రికల తరఫున మీకు కృతజ్ఞతలు. ఇంత సాహిత్య వ్యవసాయాన్ని సాగించిన మీలో ఏమాత్రం అహంకారం లేదు..
జ: ధ్యానమగ్నమైతే ప్రతీదీ నేనే.. నేనే ప్రతీదీ. ఈ కనువిప్పుతో కన్నెర్ర చేసే వర్తనానికి దూరం కాగలం. ఒక్క చిరునవ్వు చాలు పదిమందీ నిన్ను అంగీకరించటానికి. ప్యూరిటీ అండ్ ట్రాన్స్పరెన్సీలు చాలు నిన్ను నీవు గెలవటానికి. శుభం భూయాత్.
వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.