[శ్రీ పెమ్మరాజు విజయరామచంద్ర రచించిన ‘ఇంటింటి పొయ్యి..’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో నిర్వాహకుల ప్రత్యేక బహుమతి గెల్చుకున్న కథ.]
రోజూ కాఫీ తాగితేగాని స్నానానికి కదలని కాశీపతి పొద్దుటే లేచి కాలకృత్యాలు పూర్తి చేసుకుని ముస్తాబై పరుగులు పెడుతున్నాడేమిటి, అనుమానంగా చూసింది ఇంటావిడ కామేశ్వరమ్మ. ఉండబట్టలేక అడిగేసింది.
“ఏమండీ! దంతధావనం చేసిన వెంటనే కాఫీ పడకపోతే ఊరు-వాడ ఏకం చేసే మీరూ, కాఫీ మాటే మరచిపోయారేమిటీ?” లోటాతో కాఫీ ఇస్తూ అడిగింది భార్య కామేశ్వరమ్మ. కాఫీ అంటే కాశీపతికి ప్రాణం. అందుకే అందరూ ‘కాశీపతి’ని, ‘కాఫీపతి’ అని పిలుస్తారు.
“ఈ రోజు విశేషం మర్చిపోయావా?” ఎప్పుడు కాఫీని ఆస్వాదిస్తూ తాగే కాశీపతి కంగారుగా తాగుతూ అడిగాడు. తెలియదన్నట్లు ముఖం పెట్టింది కామేశ్వరమ్మ .
“ఈ రోజు చలపతిగాడు అమెరికా నుంచి వస్తున్నాడోయ్. వాడ్ని చూసి ఐదు నెలల పదహారు రోజుల పదకొండు గంటల నలభై రెండు నిమిషాల.. అయింది.” అన్నాడు వాచీ చూసుకుంటూ.
“పాపం సెకన్లని, ఘడియలని వదిలేసారేం. అవేం పాపం చేశాయి. అయినా అన్నయ్య రావలసింది వచ్చే నెలలోగా. అనుకున్న టైoకి పదిహేనురోజుల ముందే వచ్చేస్తున్నాడేమిటి?”
“వీడ్ని ట్రంప్ కూడా తట్టుకోలేక ముందే వెనక్కి పంపిస్తున్నాడేమో? వీడ్ని నేను తప్ప మరెవరూ తట్టుకోలేరు. అందుకే మహాతల్లి శారదమ్మ ముందే వెళ్ళిపోయింది.” పైకి సరదాగా మాట్లాడినా లోపల నుంచి వచ్చే బాధని కాశీపతి దాచలేకపోయాడు.
“వదినకి అన్నయ్యగారు చేసిన సేవ చిన్నదా? మీకు మాత్రం తెలియదా? డబ్బుని మంచినీళ్ళలా ఖర్చు పెట్టారు. కానీ ఉపయోగం లేకపోయింది. ఎవరి బతుకైనా నూకలున్నంత వరకే. అదంతా పై వాడి మాయ. అన్నయ్య అనుభవించిన బాధ మీకూ తెలియనిదా?”
“తెలియకేమీ, అన్నీ తెలుసు. ఐదేళ్ళ పిల్లాడ్ని చేతిలో పెట్టి హంసలా ఎగిరిపోయింది. తర్వాత ఎన్నో సంబంధాలు వచ్చాయి. మళ్ళీ పెళ్లి ఊసు తేవద్దన్నాడు. పిల్లాడ్ని గుండెల్లో పెట్టుకుని మురిపెంగా పెంచాడు. అమెరికా పంపాడు. పెళ్లి చేశాడు. ఇన్నాళ్ళకి కొడుకు దగ్గరికి వెళ్ళాడు. తిరిగి వస్తున్నాడు. ఎంత సుఖం, ఆనందం అనుభవించాడో. ఆ ఆనందమేమిటో వాడి మాటల్లోనే వినాలి” అని చెమ్మగిల్లిన కళ్ళని తువ్వాలుతో తుడుచుకున్నాడు.
కాశీపతి, చలపతి మంచి స్నేహితులు. సమవయస్కులు. కలసి చదువుకున్నారు. టీచర్లుగా కలసి పని చేసారు. చలపతి, కాశీపతి కంటే ముప్పైరోజులు ముందు పుట్టాడు కాబట్టి పదవీవిరమణ కూడా నెల ముందే జరిగింది. ఇద్దరికీ అన్నింటిలోను పోలికలున్నాయి. ఇద్దరికీ మగసంతానమే. రవి చలపతి కొడుకు. సంజీవి కాశీపతి కొడుకు. వీళ్ళు ఇద్దరు కూడా తండ్రుల్లాగే స్నేహితులు. కలసి చదువుకున్నారు. రవి అమెరికా వెళ్ళి చదువుకుని మంచి ఉద్యోగం దొరికితే అక్కడే స్థిరపడిపోయాడు. సంజీవి వచ్చిన విదేశీ అవకాశాలు వదులుకుని ఇక్కడే ఇల్లు కట్టుకుని సెటిల్ అయ్యాడు.
“అలా డీలా పడినట్లు వెళ్ళకండి. కళ్ళు తుడుచుకుని వెళ్ళండి. అన్నయ్యని భోజనానికి తీసుకుని రండి.”
“నేను వద్దాన్నా వాడు వస్తాడులే. అవకాయికి, వంకాయకి ముఖం వాచి ఉంటాడు. ఆడక్కుండానే సిగ్గులేకుండా వచ్చేస్తాడు.” అన్నాడు చొక్కా వేసుకుంటూ .
“అలా వెర్రివాగుడు వాగితే అసలు రారు. అసలే అన్నయ్యకి మొహమాటం జాస్తి”.
“రానంటే గౌరవనీయులు మీ అన్నగారి గెడ్డం పట్టుకుని బతిమాలి తీసుకొస్తాలే” అని చెప్పులేసుకుని బయలుదేరాడు కాశీపతి.
***
చలపతి ఇంటి తలుపు తీసే ఉంది. సోఫాలో కూర్చున్నాడు. వచ్చిన కాశీపతిని చూసి ఎదురొచ్చి గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. ఇద్దరి కళ్ళలోంచి అసంకల్పితంగా ఆనందభాష్పాలు వచ్చాయి.
“ఏంట్రా, అమెరికా నుంచి దొరలా వస్తావనుకుంటే ఇలా ముఖం వేలాడేసుకుని పిట్టలదొరలా ఉన్నావేంటీ”
“జస్ట్ జెట్‌లాగ్. ఇరవై నాలుగు గంటలు ఇలాగే ఉంటుందిలే.”
“అవునూ ఇంతకీ రవి, కోడలు ఎలా ఉన్నారు. మనవడితో బాగా ఆడుకున్నావా?”
“అంతా బాగానే ఉన్నారు.”
“కాఫీ తాగావా?”
“ఒరేయ్ ఇక్కడ సాధించలేని ఘనత అక్కడ సాధించానురా. కాఫీ మానేశాను.”
“ఏమిటి, నువ్వే, కాఫీయే, మానేయడమే. కాఫీ మారథాన్లో నాతో పాటు కాఫీ కప్పుకి పోటీపడే నువ్వు మానేసావంటే నమ్మశక్యంగా లేదురా ”
“పరిస్థితులు మనిషిని ఏ రకంగా నైనా మారుస్తాయిరా’.
ఆ మాటకు చలపతి మొహంలో మారిన రంగులు కాశీపతి కనుసన్నలలోంచి తప్పించుకుపోలేదు.
“సరేలే, బట్టలు వేసుకో. ఇంటికి వెళ్తూ కబుర్లు చెప్పుకుందాం.”
“కబుర్లేముంటాయి.”
“అన్నీ సముద్రాలు దాటి వెళ్ళావు. ప్రపంచంలో ప్రతివాడు చూడాలని కలలు కనే దేశానికి వెళ్ళావు. పెద్దపెద్ద భవనాలతో సంపన్న దేశం చూసి వచ్చావు. విశేషాలు లేకపోవడమేమిటి? పదిరోజులు పక్కనున్న శ్రీలంక వెళ్ళిన సాల్మన్ రాజు రెండు, మూడు నెలలు అవే కబుర్లు చెప్పాడు. మా శ్రీలంకలో ఈ రకం కాదు, ఆ రకం కాదు అంటూ అక్కడే పుట్టిన్నట్లు బుర్ర తిన్నాడు. అలాంటిది అమెరికా విశేషాలు లేవంటే ఎవడు నమ్ముతాడురా. అలా కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుందాం.” అయ్యర్ హోటల్ వైపు అడుగులు వేశారు ఇద్దరు.
“ఏరా, అయ్యర్ సాంబార్ ఇడ్లీ తింటావా” కాశీపతి అడిగాడు. చలపతి వద్దన్నట్లు తల ఊపాడు.
“బాబూ! మంచి స్ట్రాంగ్ కాఫీలు రెండు. చక్కెర తక్కువ.” టేబుల్ దగ్గరకొచ్చిన కుర్రాడికి ఆర్డర్ చెప్పాడు కాశీపతి. ఐదునిమిషాలకి వేడి వేడి కాఫీ, కప్పులో పెట్టిన ఇత్తడి గ్లాస్ తో వచ్చింది. ఇద్దరు కాఫీని తిరగబోసుకుని తాగారు. సుమారు ఆరు నెలల తర్వాత మంచి కాఫీ తాగుతున్న ఆనందం, అనుభూతి చలపతి ముఖంలో స్పష్టంగా గమనించాడు.
“ఇంతగా ఇష్టపడే కాఫీని వదిలేసి ఎలా ఉండగలిగావురా?”
“ఒరేయ్ కాశీపతీ, పరిస్థితులు మనిషిని సర్ధుబాటు బాట వైపు నడిపిస్తాయని చెప్పానా. మీ చెల్లి వెళ్లిపోయినప్పటి నుంచి ‘సర్ధుబాటు’ నా శరీరంలో భాగమై పోయిందిరా” లోతైన భావాన్ని తేలికైన మాటలతో చెప్పే ప్రయత్నం చేశాడు చలపతి.
“ఒరేయ్, ఇన్నాళ్ళు ఏలా కాలక్షేపం చేశావు? ఏం చూసావూ? గబగబా చెప్పరా. నీలో ఉన్న టీచర్ ప్రతిభతో నేను చిన్న పిల్లాడనుకుని నువ్వు కళ్ళతో చూసినవి నా కళ్ళకు కట్టినట్లు చెప్పాలి.”
ఎప్పుడు చూడననుకున్న అండమాన్ జైలు చూశానని వీడికి ఎలా చెప్పను. అదంతా చెప్పి స్నేహితుడిని బాధ పెట్టానా? అడుగు బైట పెట్టడానికి ఆంక్షలున్నాయని ఎలా చెప్పాలి. నేను అక్కడికి వెళ్ళింది తండ్రిగానైనా ఖైదీగా బతికానని ఎలా చెప్పుగలను. చలపతి మనసులో సంఘర్షణ.
“ఏమిట్రా, ఎన్నో విశేషాలు, వింతలు చెపుతావనుకుంటే నీలో నువ్వే ఆలోచించుకుంటున్నావు. అక్కడ గడిపిన క్షణాలు తలుచుకుంటే మాట రావటం లేదా? లేదా జెట్‌లాగ్‌లో చెప్పలేకపోతున్నావా?”
“జెట్‌లాగ్ కాదురా. అక్కడికి వెళ్ళి అనుభవించింది జీవితం కాదురా.. శిక్ష.” చలపతి మాటకు కాశీపతి ఆశ్చర్యపోయాడు.
“పోనీలే నయాగరా చూడకపోయినా, నీ మనవరాలితోనైనా హాయిగా ఆడుకున్నావా?” మాట మార్చే ప్రయత్నం చేశాడు.
“మనవరాలిని ఎత్తుకునే అదృష్టం కూడా నాకు రాలేదు రా. నేను దగ్గరకు వెళ్లగానే ఎవరో తీసుకుపోతారు. నేను పరాయివాడిలా నిలబడిపోతాను..” గొంతు బిగుసుకుంది.
“కాశీ, నీ దగ్గర దాపరికం ఎందుకురా, రవితో మొత్తం ఆరునెలల కాలంలో ఆరు రోజులు మాట్లాడి ఉంటానంటే అతిశయోక్తి కాదురా. మనసు అంగీకరించలేని నిజం. ‘డాడ్, ఐ యామ్ బిజీ’ అనేది ఒక్క మాటే ఎక్కువగా విన్నది. ఇక్కడ ఉన్నప్పుడే నయం రా. కనీసం ఫోన్లో నైనా పలకరింపు ఉండేది. సముద్రాలు దాటితే బంధాలు బలపడతాయి అంటారు, అది నిజం కాదు, పెరిగిన దూరం బంధాల్ని భారం చేస్తుంది. అక్కడ సంపాదన ఒక్కటే ఆలోచన.” ఆ విషయం చెపుతుంటే చలపతికి దుఃఖం కట్టలు తెంచుకుని కన్నీరుగా వచ్చింది.
“మరీ వెంటనే బయలుదేరాలేకపోయావా?”
“సంకెళ్ళు తెంచుకుని వచ్చేయాలనిపించింది. రెక్కలు కట్టుకుని వాలిపోవాలనిపించింది. కానీ ఎలా రావాలో తెలియని నిస్సహయత. రవితో ముఖమ్మీద చెప్పలేని అసమర్థత, కొడుకుని ఇబ్బంది పెట్టకూడదవే ఆలోచనలతో నోటికి తాళం వేశాను. దానికి తోడు టికెట్ వాడే తీయాలి. ఇవన్నీ కలసి నా ప్రయాణానికి మోకాలు అడ్డం పెట్టాయి.” ఆ మాటలు చెపుతుంటే చలపతి బాధ మరింత పెరిగింది.
“వచ్చేసావుగా. అక్కడ జరిగినవన్నీ మరచిపో. అదంతా పీడకల అనుకుని వదిలేయ్” ఓదార్పుగా చెప్పాడు కాశీపతి.
“నీకు తప్ప ఇంకెవరికి చెప్పుగలనూ. నీతో చెప్పుకుంటే పోయేది బాధయితే బైటవాడికి చెప్పుకుంటే పోయేది నా పరువే కదరా. ఈ విషయం ఫోన్లో చెప్పచ్చు. కానీ అక్కడ నేను ఇబ్బంది పడుతున్నానని తెలిస్తే ఇక్కడ నువ్వు బాధ పడకుండా ఉండగలవా. నువ్వు బాధ పడడం ఇష్టం లేదురా. నువ్వు అడుగుతుంటే ఉండబట్టలేక, చెప్పేసానురా. నీతో బాధ పంచుకుంటే ప్రయాణబడలికతో పాటు గుండెలో బాధ కూడా ఎగిరిపోయిందిరా. ఇప్పుడు మనసు ప్రశాంతంగా తేలికపడింది. చెప్పనంత సేపు గుండె బరువుతో భరించలేకపోయాను.” ఆ మాటలు చెపుతుంటే ముఖంలో క్షణం క్రితం కనిపించిన బాధ బదులు ఎంతో రిలీఫ్ కనిపించింది.
“నీ మనసులో బాధ దించుకుని నువ్వు ఒడ్డున పడ్డావు. నేను మాత్రం మండిపోతున్నాను. నువ్వు అమెరికాలో ఎదుర్కొన్నది.. నేనిక్కడ ఎదుర్కొంటున్నాను రా..” కాశీపతి మాటకు చలపతి కళ్లలో ఆశ్చర్యం.
“ఇంటింటా వుంది ఇటుకలపొయ్యి, మా ఇంట వుంది మట్టిపొయ్యి అన్నట్లు. అక్కడ అమెరికాలో రవి, ఇక్కడ సంజీవి ఒక్కటేరా. ఇద్దరూ ఇద్దరే. సంజీవి నాతో పాటే అదే ఇంట్లో ఉంటాడు. కానీ మనసు విప్పి ఏదైనా చెప్పుకోవాలంటే కుదరదు. వర్క్ ఫ్రమ్ హోమ్, కంచాలు కూడా పై గదికే వెళ్తాయి. వారానికి ఒకసారి కూడా ‘నాన్నా ఎలా ఉన్నావు?’ అనడు.. నీకు అక్కడ దూరం.. నాకు ఇక్కడ దగ్గర దూరం.” చలపతి నిశ్శబ్దంగా విన్నాడు.
“నాకూ చెప్పలేదేం?”
“మనమెప్పుడైనా వేర్వేరుగా ఆలోచించించామా? ఎక్కడో సముద్రాల అవతల ఆనందంగా ఉన్నవాడికి కష్టాలు చెప్పి కన్నీళ్ళు తెప్పించాలా అని నీలాగే ఆలోచించాను. ఇబ్బంది పెట్టకూడదని అనుకున్నాను. అందుకే నువ్వు ఎప్పుడు వస్తావా అని చెట్టు మీద చకోరపక్షిలా ఎదురుచూస్తున్నాను.”
“మా చెల్లి ఆరోగ్యం బాగానే ఉందిగా?” ఆత్రంగా అడిగాడు.
“శరీరాలకు, ఆరోగ్యాలకు వచ్చిన ఇబ్బందేమి లేదు. మనసుకే మానని గాయాలు. మౌనం మధ్య మాటలు రాని మూగజీవుల్లా బతుకుతున్నాం.”
“మరీ ఇంత అన్యాయంగా ఉన్నాడా సంజీవి. మా చెల్లాయి ఏం చేస్తోంది.”
“వంటమనిషిలా వంటింట్లో వండి వారుస్తోంది. కావలసినవి సమకూర్చడానికి నేను ఉన్నానుగా. మేం ఇద్దరం జీతం లేని కూలీలంరా” కాశీపతి ఆవేదన వ్యక్తం చేశాడు.
“ఒరేయ్ కాశీ.. అవన్నీ వదిలేయ్. ఏ దేశంలో ఉన్నా పరిస్థితి ఒక్కటే రా.. వాళ్ళు ఇద్దరూ ఇద్దరయితే, మనం ఇద్దరిమేగా. బతికున్నంత కాలం నీకు, నేనూ, నాకూ, నువ్వు. మనతో మన స్నేహం. ఇది చాలు రా.” చలపతి మాటకు అంగీకారంగా స్నేహితుడిని ఆలింగనం చేసుకున్నాడు కాశీపతి.
“అక్కడ చెల్లాయి అన్నయ్య కోసం వంట చేసి ఎదురు చూస్తూ ఉంటుంది. త్వరగా కదులు. రానంటే గెడ్డం పట్టుకుని బతిమాలి తీసుకొచ్చానని గొప్పలు చెప్పాలి.” అన్నాడు కాశీపతి.
ఇద్దరి అడుగులు వారి ఆలోచనల్లా ఒకటిగా కదిలాయి.
