[రాయపెద్ది హనుమంతరావు – సంజీవ లక్ష్మి స్మారక కథల పోటీ 2025 లో థ్రిల్లర్ కథల విభాగంలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ ‘ఇరవై నాలుగు గంటలు’. రచన కె.వి. సుమలత.]
సాయంత్రం ఆరు గంటల సమయం..
“ఏవండీ! భాను ఇంకా ఇంటికి రాలేదు”.. కంగారుగా అంది సావిత్రి.
“కంగారెoదుకు? స్పెషల్ క్లాసులు ఉన్నాయేమో! ఫోన్ చేయకపోయావా?” ఫోన్ చేతిలోనికి తీసుకొని డయల్ చేయబోతూ అన్నాడు ప్రసాద్.
“ఫోన్ స్విచ్ ఆఫ్ అనొస్తుంది. డ్రైవర్ కాలేజీలో భాను లేదని చెప్పాడు”..
“వాట్?”.. కుర్చీలో నుండి లేచాడు ప్రసాద్.
“ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే తప్పకుండా ఫోన్ చేస్తుంది. ఎందుకో నాకు భయం వేస్తుందండి”
“ఒకవేళ అనుకోకుండా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందేమో? నీకు చెప్తే వద్దంటావని చెప్పకుండా వెళ్లుంటుంది”..
“అలా ఎప్పుడూ వెళ్లదు” ఖండించింది సావిత్రి.
“భాను ఫ్రెండ్స్ ఫోన్ నంబర్లు నీకు తెలుసుగా, ఒకసారి ఫోన్ చెయ్యి” ..
“అందరికీ ఎప్పుడో ఫోన్ చేసానండి. ఎవరిని అడిగినా చివరి పీరియడ్ వరకూ క్లాసులో ఉందనే చెప్తున్నారు. కాలేజీ వదిలాక అమ్మాయి ఎక్కడకు వెళ్ళిందంటారు?” నుదుటి మీద చెమట తుడుచుకుంటూ అంది సావిత్రి.
భాను చదువుతున్న కాలేజీ ప్రిన్సిపల్ కి ఫోన్ చేసాడు ప్రసాద్.
“ప్రసాద్ గారు! నమస్తే.. చెప్పండి” వినయంగా అన్నారు ప్రిన్సిపల్.
ఆ పట్టణంలోని ప్రముఖుల్లో ఒకరైన ప్రసాద్ గారి అండదండలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఆ కాలేజీలో.
“సర్! మా అమ్మాయి కాలేజీ నుండి ఇంకా ఇంటికి రాలేదు. ఫ్రెండ్స్‌ని అడిగితే లాస్ట్ అవర్ వరకు కాలేజీలోనే ఉందంటున్నారు. ఒకసారి సెక్యూరిటీ గార్డుని అడిగి చెప్తారా?” అంతటి వ్యాపారదిగ్గజం మాటల్లో బేలతనం.
“వన్ మినిట్ సర్” అంటూ ఆయన కాల్ కట్ చేసారు.
రెండు నిముషాల తరువాత ఆయన తిరిగి కాల్ చేసారు. వణుకుతున్న చేతులతో ప్రసాద్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఫోన్ లిఫ్ట్ చేసాడు.
“సర్! భానురేఖ కాలేజీ బయటకు వచ్చాక రోజూ వచ్చే కారు కాకుండా కొత్త కారులో ఎక్కి వెళ్లిపోయిందని సెక్యూరిటీ గార్డు చెప్పాడు”
“కొత్త కారా? భాను కారు ఎక్కిందంటే ఇష్టపూర్వకంగానే వెళ్ళిందని అర్థమవుతుంది. కారులో వచ్చిందెవరు?” ఏదో తెలియని గుబురు ఆ తండ్రిలో ప్రవేశించింది.
“అది సెక్యూరిటీ గార్డు చూడలేదని చెప్పాడు సర్”..
“కాలేజీలో సి సి కెమెరాలు ఉన్నాయి కదా?” అన్నాడు ప్రసాద్.
“ఉన్నాయండి”..
“నేను వస్తున్నాను” ఫోన్ పెట్టేసి బయల్దేరాడు ప్రసాద్.
“నేనూ మీతో వస్తాను” ఏడుపు గొంతుతో అంది సావిత్రి.
ప్రసాద్ సరేనన్నట్లు తలూపి బయటకు దారి తీసాడు. డ్రైవర్ వీళ్ళను చూడగానే కారు డోర్ తీసి పట్టుకున్నాడు. ప్రసాద్ డ్రైవర్‌ను వద్దని చెప్పి, తనే కార్ స్టార్ట్ చేశాడు. దాదాపు అరగంట తరువాత కళాశాల ముందు కారు ఆగింది. కారు దిగగానే ప్రసాద్, సావిత్రి గేటు ముందు నిలబడ్డ సెక్యూరిటీ గార్డు దగ్గరకు వెళ్ళారు. అతడు వీళ్ళను చూసి సెల్యూట్ చేసాడు.
“భాను కారులో వెళ్ళడం నువ్వు చూసావా?” అడిగాడు ప్రసాద్.
“చూసాను సర్.. కారు ఆగగానే అమ్మాయిగారు నవ్వుతూ ఎక్కారు” వినయంగా అన్నాడు సెక్యూరిటీ.
“కారులో వచ్చిందెవరో కొంచెం కూడా కనిపించలేదా? కొంచెం ఆలోచించి చెప్పయ్యా” ఏడుస్తూ అంది సావిత్రి.
“అమ్మగారూ! అప్పుడే కాలేజీ వదిలారు, పిల్లలంతా ఒక్కసారిగా బయటకు వచ్చేసారు. రోజూ భానమ్మ కారు కోసం ఒక పక్కగా నిలబడుతుంది. కానీ ఈరోజు బయటకు రాగానే ఆ కారు వచ్చేసింది. పిల్లలందరూ అడ్డుగా ఉండటంతో నాకేమీ కనిపించలేదు” కొంచెం బెదురుగా అన్నాడు సెక్యూరిటీ.
అంతలో ప్రిన్సిపాల్ అక్కడకు రావడంతో అందరూ కలిసి సిసి కెమెరాలు చూడటానికి గదిలోకి వెళ్ళారు. భానురేఖ కాలేజీ అయ్యాక స్నేహితురాళ్ళతో మాట్లాడుతూ బయటకు వస్తోంది. అప్పుడే ఒక నలుపు రంగు కారు వచ్చి ఆమె ముందు ఆగింది. డ్రైవింగ్ సీటులో కూర్చున్న వ్యక్తి గ్లాస్ కొద్దిగా దించి భానుతో ఏదో మాట్లాడటం, తరువాత గ్లాస్ క్లోజ్ అవడం, భాను డోర్ తీసుకుని కారులో కూర్చోవడం కనిపించింది. కారుకి నంబర్ ప్లేట్ అసలు కనిపించలేదు. ఎన్నిసార్లు రివైండ్ చేసి చూసినా అంతకు మించి క్లూ దొరకలేదు.
“ఇప్పుడేం చేద్దామoడీ?” ఏడుపు స్థాయి పెంచింది సావిత్రి.
“సావిత్రీ! ముందు నువ్వు ఏడుపు ఆపు.. నన్ను కొంచెం ఆలోచించుకోనివ్వు” అన్నాడు ప్రసాద్. వ్యాపారంలో ఎన్నో ఒడుదుడుకులు చూసిన అతని బుర్ర ఆలోచించడం మొదలుపెట్టింది.
“పోలీస్ స్టేషన్‌లో రిపోర్టు ఇద్దాం పదండి” అంది సావిత్రి.
“ఆడపిల్ల విషయం కాబట్టి తొందరపడకండి సర్.. నేను కూడా విషయం బయటపెట్టను. నాకు ఒక డిటెక్టివ్ ఫ్రెండు ఉన్నాడు. వాడి అడ్రస్ ఇస్తాను, ఒకసారి వెళ్లి కలవండి” అన్నాడు ప్రిన్సిపాల్.
“అది కూడా నిజమేనండి.. ఎవరైనా కిడ్నాప్ చేస్తే భాను అరిచేది. కానీ తనకు తానుగా కారు ఎక్కిందoటే అందులో ఉన్నవాళ్ళు తెలిసిన వ్యక్తులే అయుoడాలి. ఒకవేళ ఎవరినైనా ప్రేమించిoదేమో!” అనుమానం వ్యక్తం చేసింది సావిత్రి.
ప్రసాద్ అవునన్నట్లు తలపంకించి “రా వెళ్దాం” అని కారులో కూర్చున్నాడు. సావిత్రి అతడిని అనుసరించింది. తరువాత ప్రిన్సిపాల్ గారు ఇచ్చిన అడ్రసు ప్రకారం డిటెక్టివ్ భరద్వాజ్‌ని కలిసి విషయం మొత్తం చెప్పారు.
“మీకు తెలిసినంత మటుకు భానుకి శత్రువులున్నారా?” అంతా విన్నాక అన్నాడు భరద్వాజ.
“భాను స్నేహశీలి.. ఎవరితోనూ వైరంగా ఉండదు. చిన్నప్పటి నుండీ అందరితోనూ ప్రేమగా ఉంటుంది” అంది సావిత్రి.
“ఆమె ఎవరినైనా ప్రేమించిందా? లేక తనను ఎవరైనా ప్రేమిస్తున్నారని మీకెప్పుడైనా చెప్పిందా?”..
“భాను నాతో చాలా ఫ్రీగా ఉంటుంది. కాలేజీ విషయాలు, స్నేహితుల విషయాలు అన్నీ చెప్తుంది. తన వెంటపడే అబ్బాయిల గురించి చాలాసార్లు చెప్పింది కానీ దాని గురించి భయపడవలసిన అవసరం లేదని కూడా చెప్పింది.” ప్రసాద్ మాటల్లో కూతురు పట్ల నమ్మకం కనిపించింది.
“ఒకవేళ వాళ్ళల్లో ఒకరు ఇప్పుడు తనను కిడ్నాప్ చేసారేమో?” సందేహంగా అన్నాడు భరద్వాజ.
“అలా హాని చేసే వాళ్లుంటే తను తప్పకుండా నాతో చెప్పుండేది”.. అన్నాడు ప్రసాద్.
“మరొకలా అయ్యే అవకాశముంది. తను ఇష్టపడ్డ వ్యక్తి గురించి మీకు చెప్పకుండా దాచుoడవచ్చు!”..
“నువ్వెవరిని ప్రేమించినా నాకు అభ్యంతరం లేదు కాకపోతే అతడు నిన్ను ప్రాణంగా చూసుకుంటాడని నాకు నమ్మకం కలిగితే చాలని నేను చాలా సార్లు చెప్పాను. కాబట్టి అలాంటిదేమైనా ఉంటే నాకు చెప్తుంది.” నొక్కి చెప్పాడు ప్రసాద్.
భరద్వాజ తండ్రి కూతుర్ల మధ్య ఉన్న అవగాహనకు, అనుబంధానికి మనసులో ఎంతో ఆనందించాడు.
“మీరు అలా అడిగితే నాకు ఒకటి గుర్తొస్తుంది. నితిన్ అనే ఒకబ్బాయి చాలా మంచివాడని ఈ మధ్య నాలుగైదుసార్లు మీతో చెప్పడం నేను విన్నాను” అంది సావిత్రి.
“ఆ అబ్బాయి ఆమెతో పాటుగా చదువుకుంటున్నాడా?”.. ఆసక్తిగా అడిగాడు భరద్వాజ.
“అవును భాను క్లాస్మేట్” అన్నాడు ప్రసాద్.
“ఓ కే.. వ్యాపారరంగంలో మీ శత్రువులు ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టడo కోసం ఆమెను తీసుకెళ్లొచ్చు. అలా ఎవరైనా ఉన్నారేమో గుర్తు చేసుకోండి” అన్నాడు భరద్వాజ.
“బిజినెస్‌లో నాకు పోటీదారులు ఎక్కువే ఉన్నారు. కానీ ఇలా నా కూతురిని ఎత్తుకుపోయి నన్ను బాధ పెట్టాలనుకునేవాళ్ళు లేరు”..
“పోనీ మీ బంధువర్గంలో మీ మీద అసూయతో ఇలా చేసే అవకాశం లేదా?” అన్నాడు భరద్వాజ.
“డబ్బున్న అహంకారం మా ఇంట్లో ఎవరికీ లేదు అందుకే మా కుటుంబంతో అందరూ ప్రేమగానే ఉంటారు. ముఖ్యంగా భాను అంటే అందరికీ చాలా ఇష్టం” అన్నాడు ప్రసాద్.
“ఓకే.. ఒకోసారి మనతో స్నేహంగా ఉంటూనే మన వెనుక కొందరు గోతులు తవ్వుతారు. మీ ఇద్దరికీ అలాంటి మిత్రులున్నారా?” ప్రశ్నించాడు భరద్వాజ.
“నాకు అవసరానికి మించిన స్నేహితులు లేరు” అంది సావిత్రి.
“సర్! స్కూల్, కాలేజీ మిత్రులను అమావాస్యకు, పున్నమికి పలకరించడమే కానీ తరచుగా మాట్లాడేంత సమయం నాకు ఉండదు. కానీ నా బిజినెస్ పార్టనర్‌తో మాత్రం స్నేహంగా ఉంటాను” అన్నాడు ప్రసాద్.
“ఆయన గురించి కాస్త చెప్తారా?”..
“పేరు రాఘవ.. భార్య గృహిణి, ఇద్దరు ఆడపిల్లలు. ఒకరు టెన్త్, మరొకరు ఇంటర్ చదువుతున్నారు. చాలా మంచివాడు. అతను మా ఆవిడకు వేలు విడిచిన పెద్దమ్మ కొడుకు కూడా”..
“సో మీరిద్దరూ చెప్పిన వాళ్ళల్లో అనుమానితుడు నితిన్. కేసు నాకు అప్పగించారు కాబట్టి ఇక మీరు నిశ్చింతగా ఇంటికి వెళ్ళిపొండి. ఒకవేళ కిడ్నాపర్ ఫోన్ చేస్తే వెంటనే తెలియజేయండి” భరోసా ఇచ్చాడు భరద్వాజ.
“సర్! మిమ్మల్నే నమ్ముకున్నాo.. నా కూతురిని నాకు అప్పగించే పూచీ మీదే! కానీ దయచేసి విషయం గోప్యంగా ఉంచుతారు కదూ” ఏడుస్తూ అంది సావిత్రి.
“నన్ను నమ్మండి” కుడి అరచేతిని తన గుండెలపై వేసుకుంటూ చెప్పాడు భరద్వాజ.
***
రాత్రి పది గంటల సమయం..
భరద్వాజ అపార్ట్మెంట్ బయట నిలబడి కాలింగ్ బెల్ కొట్టాడు.
“ఎవరూ?” తలుపు తీసాడు నితిన్ తండ్రి.
“ఐయాం డిటెక్టివ్ భరద్వాజ.. నితిన్‌తో మాట్లాడాలని వచ్చాను” అంటూనే చనువుగా లోపలకు వచ్చాడు.
“నమస్తే సర్. ఇంత రాత్రివేళ వాడితో పనేంటి?” భయంగా అన్నాడతడు.
“చెప్తాను, నితిన్‌ని పిలవండి” ..
“నితిన్‌కి నిన్నటి నుండి మూసిన కన్ను తెరవకుండా జ్వరం. ఉదయమే ఆస్పత్రికి తీసుకువెళ్లి పరీక్షలు చేయించాం. ఇప్పుడే జ్వరం జారింది, నిద్రపోతున్నాడు”
భరద్వాజ అతడి వైపుకి అనుమానంగా చూసాడు.
“నేను చెప్పేది నిజమండీ.. నాతో పాటు రండి” గదిలోకి తీసుకెళ్ళాడు.
నితిన్ మంచం మీద నిద్రపోతున్నాడు. అతడి పక్కన వాళ్ళమ్మగారు గాబోలు కూర్చుని నుదుటి మీద తడిగుడ్డ వేస్తుంది. వీళ్ళు రాగానే ఆశ్చర్యంగా చూస్తూ లేచి నిలబడింది. అలికిడికి నితిన్ కూడా లేచాడు.
“మీరు మా అబ్బాయి కోసం ఎందుకు వచ్చారో చెప్పండి సర్?” అన్నాడు నితిన్ తండ్రి.
“మీ అబ్బాయి చదువుకునే కాలేజీలో ఈ రోజు ఒకమ్మాయి కిడ్నాప్ చేయబడింది. మీ అబ్బాయి ఆ అమ్మాయితో చనువుగా ఉంటాడని తెలిసింది. విచారణ కోసం వచ్చాను” కావాలనే కాస్తా గంభీరంగా పలుకుతూ, ఓరకంట వాళ్ళ ముఖ కవళికలను గమనించసాగాడు భరద్వాజ.
“వాట్?.. ఎవరిని ఎవరు కిడ్నాప్ చేసారు?” లేచి కూర్చున్నాడు నితిన్.
“నువ్వు ఇష్టపడే అమ్మాయిని”..
“భానునా?” కీచుగా అరిచింది నితిన్ స్వరం.
“మైగాడ్! ఎలా? తను చాలా మంచి అమ్మాయి. నేనెందుకు కిడ్నాప్ చేస్తాను?” పక్కమీద నుండి నీరసంగా లేచాడు నితిన్.
“సర్! మా అబ్బాయి అలాంటి వాడు కాదు. అయినా వాడికి చాలా జ్వరంగా ఉండటం వల్ల నిన్నటి నుండీ కాలేజీకి వెళ్ళలేదు. కావాలంటే ఈ ప్రిస్క్రిప్షన్ చూడండి” అంది అతడి తల్లి.
భరద్వాజ ప్రిస్క్రిప్షన్ మీదున్న హాస్పిటల్ పేరు, తేదీ గమనించి, తిరిగి ఇచ్చేశాడు.
“సర్! ప్లీజ్.. భాను ఎక్కడుందో వెతకండి” రెండు చేతులు జోడిస్తూ ప్రార్ధించాడు నితిన్.
“టెక్ కేర్ నితిన్! నాకు తెలియకుండా నువ్వు ఎక్కడకు వెళ్ళడానికి వీల్లేదు” హెచ్చరికగా అంటూ లేచాడు భరద్వాజ.
***
సమయం రాత్రి పది గంటల సమయం..
ప్రసాద్ ఫోన్ రింగయింది. కొత్త నంబర్ నుండి కావడంతో కంగారుగా ఫోన్ తీసి “హలో” అన్నాడు.
“మీ అమ్మాయి భాను మా దగ్గరే ఉంది. ఐదు కోట్ల రూపాయలు నాకు ఇస్తే మీ అమ్మాయిని క్షేమంగా పంపిస్తాను. లేకపోతే కోటిముక్కలు చేసి నీకు పంపుతాను. పోలీసులకు సమాచారం అందించినట్లయితే నీ కూతురి ఆచూకీ ఎప్పటికీ తెలియదు. రెండు రోజులలో డబ్బు సిద్ధం చేసుకో. మళ్ళీ ఫోన్ చేస్తాను” అని అగంతకుడు ఫోన్ పెట్టేసాడు.
ఆ మాటలకు ప్రసాద్ భయకంపితుడయ్యాడు. వెంటనే భరద్వాజకు ఫోన్ చేసి చెప్పాడు. అది విన్న సావిత్రి బావురుమంది.
***
అప్పుడే తెల్లవారినట్టు ఆ రాత్రి పదిగంటల వేళ ఆ క్లబ్ బద్దకంగా ఒళ్ళు విరుచుకొని, వస్తున్న అతిథుల కోసం వన్నె చిన్నెలు పోతుంది. జీన్ ప్యాంట్, టీ షర్ట్ వేసుకొని బార్ లోకి అడుగుపెట్టిన ఆ మధ్యవయస్కుడు ఎవరికోసమో, ఎందుకోసమో చుట్టూ వెతుకుతున్నాడు. చూపుల గాలంకు గురి కుదిరి ఒక మూలగా ఒంటరిగా కూర్చుని సిప్ చేస్తున్న ఒక వ్యక్తిపై ఆగింది. ఫోన్ లోని ఫోటోతో సరిపోల్చుకొని, చిరునవ్వుతో అటు నడిచాడు. అతడి ఎదురుగా టేబుల్ మీద అప్పటికే మూడు వంతులు ఖాళీ అయిన దేవార్స్ స్కాచ్ విస్కీ బాటిల్, చికెన్ ఫ్రై ముక్కలున్నాయి. అప్పటికే మోతాదు మించి తాగినట్లు అతడి వాలకం చెప్తోంది. తిన్నగా వచ్చిన టీ షర్ట్ వాలా అతడి ఎదురుగా కుర్చీ లాక్కుని కూర్చున్నాడు.
“ఎవరూ?”.. బలవంతంగా కళ్ళు పైకెత్తి అడిగాడతడు.
“నా పేరు మోహన్”..
“ఐసి, ఇక్కడ కూర్చు..న్నా..రు.. నాతో ఏమైనా పనుందా?” మాట ముద్దగా వస్తోంది.
“చెప్తాను. ముందు ఇది చెప్పండి. మీరు ఇప్పటి వరకు పడుకోకుండా తాగుతున్నారు? రోజూ ఇంతేనా?”.. అడిగాడు
“లేదు.. లేదు.. ఈ రోజు కొంచెం టెన్షన్ ఎక్కువైంది”
“బిజినెస్ టెన్షనా?”..
“కాదు.. కాదు.. అవును అవును అదే” తడబడుతూ అన్నాడతను.
“ఇంతకీ.. కీ.. మీరెవరు?”..
“నేను ముంబాయిలో చాలా పెద్ద వ్యాపారం చేస్తున్నాను. ఇన్‌కమ్ ట్యాక్స్ వాళ్ళను తప్పించుకోవడానికి ఇక్కడ కూడా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నాను. అక్కడా, ఇక్కడా నేనే చూసుకోవడం చాలా కష్టం కాబట్టి నమ్మకమైన పార్టనర్ కోసం వెతుకుతున్నాను” చెప్పడం ఆపి, ఎదుటి వ్యక్తి ముఖం చూడసాగాడు మోహన్.
కాస్త గొంతు తగ్గించి “నేను చేసే చీకటి వ్యాపారానికి చీకట్లోనే వెతికితే బాగుంటుందని, ఈ బార్ లోనికి వచ్చాను. రాగానే ఎందుకో ఒంటరిగా ఉన్న మీరు నన్ను ఆకర్షించారు” చనువుగా టేబిల్ పై ఉన్న ఖాళీ గ్లాస్ లో కొద్దిగా విస్కీ వేసుకొని సిప్ చేస్తూ అన్నాడు మోహన్.
ఎదుటి వ్యక్తి ముఖం వెలిగిపోయింది. చేతిలో ఉన్న గ్లాసులోని మొత్తం ఒకేసారి నోట్లో పోసేసుకున్నాడు.
“మీరు సరైన చోటుకే వ..చ్చారు. ఎవరో ఎందుకు? నేనే మీకు..కూ.. పార్టనర్‌ని. అన్నట్లు నాపేరు రాఘవ, ఈ నగరంలో నేను ప్రముఖ వ్యాపారస్థుడిని” మెల్లగా లేచి షేక్ హ్యాండ్ ఇచ్చాడు.
“మీరు ఆల్రెడీ బిజినెస్లో పెట్టుబడులు పెద్ద ఎత్తున పెట్టే ఉంటారు. మరి ఇప్పుడు నాతో వ్యాపారానికి పెట్టుబడి పెట్టగలరా?” మోహన్ మాటల్లో సందేహానికి భళ్ళున నవ్వాడు రాఘవ.
“ఓ.. పెట్టగలను.. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టినట్లు కొట్టాను. రెండు రోజుల్లో పెద్ద జాక్ పాట్ తగులుతుంది”.. అన్నాడు రాఘవ.
“ఒకవేళ మీకు జాక్ పాట్ తగలకపోతే?”..
“పిచ్చివాడా.. ఆల్రె..డీ చేప పడింది.. దాన్ని అమ్మడ..మే ఆల..స్యం” అన్నాడు రాఘవ.
అప్పటికే రాఘవకి పూర్తి నిషా తలకెక్కింది.
“నేను వెళ్తాను.. మిమ్మల్ని రేపు ఉదయం కలుస్తాను” అన్నాడు మోహన్.
“మీ ఫో..న్.. నం..బ..” అంటూ తన ఫోన్ ఇచ్చాడు రాఘవ.
“ఎందుకు? నేను మీ ఫోన్‌లో నా నంబరు సేవ్ చేయడం కోసమా?” అన్నాడు మోహన్.
రాఘవ అవునన్నట్లు తలూపాడు. మోహన్ ఫోన్ తీసుకుని రెండు నిముషాల తరువాత అతనికి తిరిగిచ్చేసాడు. అప్పటికే రాఘవ కుర్చీలో వెనక్కు సోలిపోయాడు.
“బేరర్! నా డ్రైవర్‌ను పంపుతాను, జాగ్రత్తగా కార్ ఎక్కించు, ఇంట్లో దించేస్తాము” రెండు ఐదువందల నోట్లు ఇస్తూ చెప్పి బయటకు నడిచాడు మోహన్.
***
ఉదయం ఏడు గంటల సమయం..
భరద్వాజ గేటు తీస్తుండగానే ప్రసాద్ ఎదురొచ్చాడు.
“సర్! భాను దొరికిందా?” ఆత్రుతగా అన్నాడు ప్రసాద్.
భరద్వాజ అతడి ముఖం వైపుకి చూసాడు. రాత్రంతా నిద్రలేకపోవడం వల్ల కళ్ళు చింతనిప్పుల లాగా ఉన్నాయి.
“ఒకసారి భాను గది చూడాలని వచ్చాను” అన్నాడు భరద్వాజ.
“సర్! మా భాను దొరికిందా?” లోపలనుండి కళ్ళు తుడుచుకుంటూ వస్తున్న సావిత్రి అడిగింది.
“దాదాపు దొరికినట్లే!” అన్నాడు భరద్వాజ.
“దొరికిందా?” ఇద్దరూ ఒకేసారి అరిచారు.
“అవును.. మరి కొద్ది సేపట్లోనే మీ అమ్మాయిని మీ దగ్గరకు చేరుకుంటుంది”..
ప్రసాద్ ఆనందంగా భరద్వాజ చేతులు పట్టుకుని ఊపేసాడు.
“ఎంత మంచి వార్త చెప్పారు! నేను దేవుడికి దండం పెట్టుకుని ఇప్పుడే వస్తాను” అంటూ లోపలకు వెళ్ళింది సావిత్రి.
“భాను గదిలోకి వెళ్దామా?” ప్రసాద్ వైపు చూస్తూ అన్నాడు భరద్వాజ.
“పదండి..”
భాను గదిలో ఒక మంచం, బీరువా, వాల్ టీవీ, డ్రెస్సింగ్ టేబుల్ ఉన్నాయి. ఎక్కడి వస్తువులు అక్కడే చాలా శుభ్రంగా ఉన్నాయి. గోడ మీద నవ్వుతున్న భాను ఫోటో ఉంది. మరో పక్కన ప్రసాద్, మరో స్త్రీతో కలిసున్న ఫోటో ఉంది.
“ప్రసాద్ గారూ! ఆ ఫోటోలో ఉన్నది మీరే అయితే మీ పక్కనున్నది..?” సందేహంగా అన్నాడు భరద్వాజ.
“నేనే.. ఆవిడ భాను తల్లి సుగుణ. ఆవిడ భానుకి ఎనిమిదేళ్ళ వయసులో జబ్బు చేసి చనిపోయింది. తరువాత సావిత్రిని చేసుకున్నాను” అన్నాడు ప్రసాద్.
“సావిత్రి గారు, భానుల మధ్య బంధం ఎలా ఉంటుంది?” ..
“సావిత్రి స్వంత తల్లిలా భానుని చూసుకుంటుంది. భాను కూడా అంతే ప్రేమగా ఉంటుంది. నిన్నటి నుండి భాను కనిపించడం లేదని దిగులుపెట్టుకుంది” అన్నాడు ప్రసాద్.
“మరోలా అనుకోకండి, మరి మీకు సావిత్రి గారికి పిల్లలూ?..”
“కాస్త ఆలస్యంగా మా బాబు పుట్టాడు. ప్రస్తుతం వాడు ఊటీ బోర్డింగ్ స్కూల్‌లో చదువుకుంటున్నాడు. మా సావిత్రికి తన కొడుకు కంటే కూడా భాను అంటేనే ఎక్కువ ప్రేమ” చిరునవ్వు ప్రసాద్ ముఖంలో.
“ప్రసాద్ గారు! మీ ఆస్తులు ఎవరి పేరు మీద ఉన్నాయి?”
“ఈ ఆస్తంతా సుగుణకి ఆమె పుట్టింటి వారు ఇచ్చిందే. తను పోయేముందు అంతా భాను పేరు మీద రాసింది. నా వ్యాపారం తప్ప అంతా భాను పేరు మీద ఉంటుంది” అన్నాడు ప్రసాద్.
“ఇప్పుడే వస్తానుండoడి” అంటూ బయటకు వెళ్ళి ఫోన్ లో మాట్లాడి, ఐదు నిమిషాల తర్వాత వచ్చాడు భరద్వాజ.
“సర్! మీరు నిజమే చెప్తున్నారా, మా బంగారు తల్లి క్షేమంగా తిరిగి వచ్చేస్తుంది కదా?” కాఫీ కప్పు ఇస్తూ ప్రశ్నించింది సావిత్రి.
“సావిత్రి గారు! కిడ్నాపర్ నుండి మళ్ళీ ఫోన్ వచ్చిందా?”.. కప్పు అందుకుంటూ అడిగాడు భరద్వాజ.
“మళ్ళీ రాలేదు..”
“ఇక రాదు కూడా” నవ్వుతూ అన్నాడు భరద్వాజ.
“అంటే ఆ కిడ్నాపర్ దొరికిపోయాడా? ఇంతకీ కిడ్నాపర్ ఎవరో చెప్పండి సర్!” ఆత్రుతగా అడిగాడు ప్రసాద్.
కాఫీ కప్ కింద పెడుతూ వాళ్ళిద్దరి ముఖాలు చూస్తూ కూల్ గా చెప్పాడు భరద్వాజ.
“మీ ఆవిడ”..
ఒక అర నిమిషంపాటు కాలం ఆగిపోయినట్లు అయ్యింది అక్కడ.
“వాట్?” తుళ్ళిపడ్డాడు ప్రసాద్.
“ఏం మాట్లాడుతున్నారు? నా కూతురిని నేను కిడ్నాప్ చేస్తానా? ఈయన్ని నమ్ముకుంటే ఇలాగే ఉంటుంది. మనం పోలీసు స్టేషన్‌కి వెళ్దాం పదండి” సోఫాలో కూర్చున్న సావిత్రి ముక్కుపుటలు అదురుతుండగా ఒక్కసారిగా లేచి నిలబడి కోపంగా అంది.
“మీ ముచ్చట నేనెందుకు కాదనాలి, పదండి..” వెటకారంగా అన్నాడు భరద్వాజ.
“సార్, నాకు పిచ్చెక్కి పోతుంది. వివరంగా చెప్పండి” అయోమయంలో ఉన్న ప్రసాద్ అడిగాడు.
“ప్రసాద్ గారు! జరిగింది చెప్తాను వినండి. కొడుకు పుట్టే వరకు సావిత్రి గారికి వేరే ఆలోచన లేదు. ఎప్పుడయితే మీ బాబు పెరిగి పెద్దవుతున్నాడో, అప్పుడే భయం ఏర్పడింది. భాను పెళ్లి చేసుకొని వెళ్లిపోతే, ఆస్తిలో తన కొడుక్కి ఏమీ రాదనే ఆందోళన మొదలయిoది. భాను పేరు మీదున్న ఆస్తి కోసమే సావిత్రి ప్రేమ నటించింది. నితిన్‌తో స్నేహం ప్రేమగా మారి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుందేమోనని ఆవిడకు బెంగపట్టుకుంది”.. అన్నాడు భరద్వాజ.
ప్రసాద్ ఊపిరి బిగబట్టి వింటున్నాడు.
“తన మనసులోని బాధoతా స్వంత అన్నలా భావిస్తున్న ఆమెకు దూరపు అన్నయ్య, మీ పార్టనర్ రాఘవతో పంచుకునేవారు. సావిత్రి గారినుండి అప్పుడప్పుడు ధనసహాయం పొందుతున్న రాఘవ ఒక దుర్మార్గపు ఆలోచన చెప్పాడు. అదే భాను కిడ్నాప్ ప్లాన్. విడిచిపెట్టాలంటే ఐదు కోట్లు డిమాండ్ చేసి, ఆ డబ్బు రాఘవ తీసుకోవడానికి, తరువాత భానును విదేశాలకు అమ్మేయడానికి ఒప్పందం వాళ్ళిద్దరి మధ్య కుదిరింది. నేరం నితిన్ మీదకు వెళ్ళిపోతుందని వారి ఆలోచన..” సావిత్రి వైపు చూస్తూ “అంతే కదా మేడం గారు?” నవ్వుతూ అడిగాడు భరద్వాజ.
తల భూమిలోనికి దించి, చీర కొంగు నోట్లో పెట్టుకొని ఉందామె.
“నితిన్‌ని కలిసిన తర్వాత అతను అమాయకుడని, భానును కిడ్నాప్ చేసేకంటే, పెళ్లి చేసుకుంటేనే అతనికి లాభం కనుక, అతను ఈ కిడ్నాప్ చేసి ఉండడని గట్టిగా అనిపించింది. ఇక మీ బిజెనెస్ పార్టనర్ రాఘవ గురించి ఎంక్వయిరీ చేస్తే, వ్యసనపరుడని, పీకల్లోతు అప్పుల్లో కూరుకు పోయాడని తెలిసింది. సో, అతనికే ఈజీ మనీ పై ఆశ ఉంటుంది అనిపించి, మోహన్ అనే మారుపేరుతో అతను రోజూ వెళ్ళే క్లబ్‌కు వెళ్ళాను. అతన్ని కలిశాను. నాకు కావాల్సిన సమాచారం దొరికింది. తప్ప తాగిన అతన్ని నా అసిస్టెంట్ సాయంతో మా ఆఫీస్‌కు తీసుకెళ్ళి, మా పద్దతిలో విచారిస్తే ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి.”
చెప్పడం ఆపి, ప్రసాద్ వైపు చూసాడు భరద్వాజ.
ప్రసాద్ నమ్మలేని నిజాల్ని వింటూ కంపించిపోతున్నాడు. భరద్వాజ టీ పాయ్ మీదున్న వాటిల్ బాటిల్ అతనికి అందించి తిరిగి చెప్పసాగాడు.
“రాఘవ నెంబర్ ప్లేట్ లోని కారులో భాను కాలేజీ దగ్గర ఆగి, ‘ఇటుగా వచ్చాను ఇంటి దగ్గర దింపుతాను రా’ అంటూ ఎక్కించుకున్నాడు. కిడ్నాప్ అయితే చేశాడు గాని, అతడిలో భానుని విదేశాలకు అమ్మేసినా ఎక్కడ తన పేరు చెప్పేస్తుందో అని ఒక భయం కూడా ఉంది. ఐదు కోట్లు అందిన తర్వాత ఆమెను చంపేయ్యాలని పథకం వేసాడు” చివరి మాటలు ఒత్తి పలుకుతూ సావిత్రి వైపుకి చూసాడు భరద్వాజ.
“కిడ్నాపర్ దొరికాడు అనగానే సావిత్రి గారు లోపలకి వెళ్ళి, రాఘవకు ఫోన్ చేశారు. కానీ ఆమెకు తెలియదు రాఘవ మా అతిథ్యంలో ఉన్నాడు అన్న సంగతి. నా అసిస్టెంట్ పక్కనే ఉండి రాఘవతో ఫోన్ మాట్లాడించారు. ఇప్పుడే భానుని దాచిన చోటుకు వెళ్ళి, మావాళ్లు విడిపించి తీసుకువస్తున్నారు” చెప్పడం ముగించి రిలాక్స్ గా కూర్చున్నాడు భరద్వాజ.
సావిత్రి నిల్చున్న చోటునే కుప్పకూలి ఏడవసాగింది.
“ఛీ.. ఇన్నాళ్లు నీతో కలిసి ఉన్నందుకు సిగ్గు పడుతున్నాను” ఆమె వైపుకి చీడ పురుగుని చూసినట్లు చూస్తూ అన్నాడు ప్రసాద్.
అప్పుడే పోలీసులతో వచ్చిన భాను “అమ్మా! నువ్వు అడిగితే యావదాస్తి తమ్ముడు పేరుమీద రాస్తాను కదా. ఇలా చేసావేంటమ్మా?” సావిత్రి భుజాలు పట్టుకొని కన్నీళ్ళతో అంది భాను.
“నన్ను మన్నించు తల్లీ!” భోరున ఏడుస్తూ గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది సావిత్రి.
భరద్వాజ వేగంగా వెళ్ళి, భుజాలతో తలుపులను తొయ్యసాగాడు. రెండు నిమిషాల తీవ్ర ప్రయత్నం తర్వాత తలుపులు తెరుచుకున్నాయి. గుప్పిట నిండా నిద్ర మాత్రలు పట్టుకొని, నోట్లో వేసుకోబోతున్న సావిత్రి కనిపించింది. భాను ఆమె గుప్పిట విప్పి మాత్రలు కింద పడేసింది.
“ప్రసాద్ గారు! పశ్చాత్తాపానికి మించిన పరిహారం మరొకటి లేదు. నా అనుభవం చెప్తోంది ఆమె ఇక ముందు తప్పు చేయదు. పెద్దమనసుతో క్షమించండి” అన్నాడు భరద్వాజ.
“ఈ రాక్షసి క్షమించేంత చిన్న తప్పు చేసిందా?.. కోపంగా అన్నాడు ప్రసాద్.
“డాడీ ప్లీజ్ నా కోసం అమ్మను వదిలేయండి” తండ్రి చేతులు పట్టుకుని బతిమాలుతూ అంది భాను.
“ప్రసాద్ గారు. ఇరవై నాలుగు గంటల్లో మీ అమ్మాయి క్షేమంగా మీకు అప్పగించాను. రాఘవని పోలీసులు తీసుకువెళ్ళారు. ఇక నేను వెళ్తున్నాను. నా ఫీజు తరువాత పంపించండి” అన్నాడు భరద్వాజ.
ప్రసాద్, భాను, కన్నీళ్లతో సావిత్రి వెళ్ళిపోతున్న భరద్వాజ వైపుకి కృతజ్ఞతా పూర్వకంగా చూస్తూ ఉండిపోయారు.
