[శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ‘ఇరుముడి’ సినిమాని విశ్లేషిస్తున్నారు డా. రాయపెద్ది వివేకానంద్.]
🎬 ఇరుముడి — విజయానికి 9 కారణాలు
ఇది “ఇరుముడి” సినిమా చూసేసిన వారి చూపులకి మాత్రమే సుమా.
చూడని వారికి కథ, ట్విస్టులు తెలిసిపోతాయి కనుక.
~
చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ ఈ సినిమా ఇంత విజయాన్ని సాధించటానికి నేను గమనించిన కొన్ని కారణాలు ఇవి.
🙏 మణెమ్మ (మణికంఠ) అయ్యప్ప అవతారమా?
అవుననే చెప్పాలి.
“యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత।
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్॥”
(ఎప్పుడెప్పుడైతే ధర్మానికి క్షీణత కలుగుతుందో, అధర్మం అభివృద్ధి చెందుతుందో, అప్పుడప్పుడే నేను నన్ను నేను సృష్టించుకుంటాను — అవతరిస్తాను.)
“పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్।
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే॥”
(సాధుపురుషులను రక్షించడానికి, దుష్టులను నాశనం చేయడానికి, ధర్మాన్ని స్థాపించడానికి నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తాను.)
అన్న గీతాకారుని మాటలు గుర్తున్నాయా?
చివరి సీన్లో ఇరుముడి ఎత్తుకోవటానికి వచ్చిన మణెమ్మ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకోండి ఒకసారి:
“నేను ఒక పని కోసం నీ కడుపున పుట్టాను, ఆ పని అయిపోగానే వెళ్ళిపోయాను. అయినా నేను ఎక్కడికిపోయానని? నీవు వేసుకునే మాలలో నేనే ఉన్నాను. నీవు కట్టే ఇరుముడిలో నేనే ఉంటాను”
త్రినాథ్ చెప్పిన మాటలు గుర్తున్నాయా?
“పెళ్ళయిన నాలుగేళ్ళకి మాల వేసుకుని, ఇరుముడి ఎత్తుకుని శబరిమల వాసుని దర్శించిన తరువాతనే నాకు పాప పుట్టింది. ఆ మణికంఠుడే నా కడుపున పుట్టాడు అని నేను భావిస్తాను.”
ఈ పై సంఘటనలన్నీ కో రిలేట్ చేసుకుంటే మనకి ఏమర్థమవుతుంది?
దర్శకుడు చాలా తెలివిగా అయ్యప్ప అవతరిస్తాడు దుష్టులని శిక్షించేదానికి అని చూపెట్టాడు ఇక్కడ. తమకి తెలియకుండానే భక్తులు ఈ పాయింట్ దగ్గర కనెక్ట్ అయ్యారు.
“దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకై అయ్యప్ప మణెమ్మగా జన్మించినట్టు చూపారు.”
రవి తేజ కొడవలిని నోట కరుచుకుని, పంచె ఎగగట్టి ఇక ఆటో తీసుకుని బయలుదేరే సీన్‌లో మనకి అయ్యప్ప (మణెమ్మ) త్రినాథ్‌ని తన ఆయుధంగా వాడుకున్నాడని అర్థం అయిపోతుంది.
అయ్యప్ప ఎక్కడా ప్రత్యక్షంగా రంగంలోకి రాలేదు. కానీ పరోక్షంగా ఈ సినిమా అంతటా అయ్యప్ప మహిమే అని మనకి అర్థమైపోతుంది.
ఇంతటి ఇంటెలిజెంట్ స్క్రీన్‌ప్లే ఇటీవల మనం చూడలేదంటే అతిశయోక్తి కాదు.
🎭 1) ప్రేక్షకుడికి రహస్యం తెలిసి ఉండాలి — పాత్రలకు మాత్రం తెలియకూడదు
వాల్మీకి వారి రామాయణ ప్రవచనం చెబుతూ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు తరచు ఒక మాట చెబుతుంటారు — వాల్మీకి రచనా శైలి నుంచి స్క్రీన్‌ప్లే, కథ, కథనం, మాటలు.. ఈ అంశాల గురించి ఎన్నైనా తెలుసుకోవచ్చు అని.
అందులో ఆయన ముఖ్యంగా చెప్పేది ఉత్కంఠని రేకెత్తించే కథనం గురించి చెబుతూ – కథలో కీలక రహస్యాలు, సస్పెన్సు ప్రేక్షకుడికి (పాఠకుడికి) మొదటే తెలియాలి
ఆ ఉత్కంఠ, రహస్యాలు కొన్ని పాత్రలకే తెలియాలి, కొన్ని పాత్రలకి తెలియకూడదు.
అప్పుడు ప్రేక్షకుడు (పాఠకుడు) ఆ కథలో లీనమయిపోతాడు. ఆ కథని స్వంతం చేసుకుంటాడు (ఓన్ చేసుకుంటాడు).
ఈ సినిమా విషయంలో అదే జరిగింది.
చిన్నారి మణెమ్మకి సీలేరు పాఠశాల గురించి, టీచర్ గురించి తెలిసిపోతుంది. ప్రేక్షకుడికి కూడా తెలిసిపోతుంది.
గాయత్రికి తెలుసు. సౌజీకి తెలుసు. మణెమ్మకి తెలుసు. ఎమ్మెల్యేకి తెలుసు. టీచర్‌కి ఎలాగూ తెలుసు.
తెలియనిదల్లా గురుస్వామికి, త్రినాథ్‌కి మాత్రమే.
ప్రేక్షకుడు ఇక్కడి నుండి తపన పడతాడు. సరిగ్గా మణెమ్మలాగానే ప్రేక్షకుడు కూడా తపన పడతాడు.
కొంత మంది కథకులు సస్పెన్సు పేరిట అసలు విషయం చివరి నిమిషం దాకా ప్రేక్షకుడిని సస్పెన్స్‌లో ఉంచి, అసలు విషయం తెలపకుండా చివర్లో గుట్టు విప్పుతారు.
దీనివల్ల కొందరు ప్రేక్షకులకి తాము వెర్రి వెధవలం అయిన భావన కలుగుతుంది. దాంతో సినిమా ఏమీ బాగాలేదు అని ఒక మాటలో అనేస్తారు.
చాలా చౌకబారు డిటెక్టివ్ చిత్రాలలో జరిగే పొరపాటు ఇదే.
ఈ పద్ధతిలో తీసిన కొన్ని సినిమాలు హిట్ అయి ఉండవచ్చు గాక. దాన్ని వాల్మీకి పద్ధతిలో చెబితే అవి మరింత హిట్ అయి ఉండేవి.
ఉదాహరణకి పశలపూడి వంశీ గారి హిట్ చిత్రం “అన్వేషణ” కథనంలో ఈ నిజాయితీ పాటించి ఉంటే ఆ సినిమా ఇంకా హిట్ అయి ఉండేది.
🎬 2) మొదటి సగం ఎందుకు అంత చప్పగా ఉందో రెండో సగంలో అర్థమవుతుంది
ఇరుముడి మొదటి సగం చాలా చప్పగా సాగుతుంది.
ముఖ్యంగా హీరో పాత్ర త్రాగుడుకి మరీ అంత అడిక్ట్ అవటం ఏమిటి అని మనకి అనిపిస్తుంది.
ఆ చిరాకు ప్రేక్షకుడికి కలగాలనే ఆ పాత్రని అలా చిత్రీకరించారని మనకి ఆపై తెలుస్తుంది.
గురు స్వామితో మాట్లాడుతూ –
“మణెమ్మ నాకు దేవుడిచ్చిన బిడ్డ. అందుకే మణెమ్మనే దేవుడిలాగా చూసుకుంటాను. ఆ పిల్ల ఆనందం కోసం నేను చేసే ప్రతి పనిని దేవునికి ప్రత్యక్షంగా చేసుకునే సేవగా భావిస్తాను.”
అంటాడు.
ఆ తరువాత కొన్ని సీన్ల తరువాత మణెమ్మ తండ్రితో అంటుంది:
“తాగటం మానెయ్యి నాన్నా!”
“రేపట్నుంచి మాల ధరిస్తున్నాను కదమ్మా, తాగన్లే”
“నీవు ఎప్పటికి మందు మానేయ్యాలి నాన్నా!”
“అసలు తాగకుంటే కాలు చేయి వణుకుతాయ్ మణెమ్మా!”
“నేను పట్టుకుంటాను నాన్న!”
“బుర్ర పని చేయదు, నిద్ర పట్టదు”
“నేను పడుకోబెడతాను నాన్నా!”
“ఎప్పుడూ ఇలా అడగలేదు కదమ్మా”
ఆ అమ్మాయి అప్పటిదాకా తాగుడు వల్ల తండ్రి ఏదో ఆనందం పొందుతున్నాడనుకుని తల్లికి కూడా తెలియకుండా తండ్రికి సాయం చేసేది. అదే మరి అమాయకత్వంతో కూడిన పసితనమంటే.
“నువ్వు తాగితే సంతోషంగా ఉంటావనుకున్నాను. కానీ నీవు సంతోషంగా లేవు. మానేయ్ నాన్నా”
అంతే.
అది దైవ శాసనం లాగా పాటిస్తాడు మనవాడు.
ఈ సీన్ తర్వాత ఇంటర్వెల్ అని వస్తుంది.
కళ్ళ నిండా నీళ్ళు నిండిన మణెమ్మ మొహం మనకి కనిపిస్తూ ఉండగా తెర బ్లాంక్ అయిపోతుంది.
అదిగో అక్కడి నుంచి హృదయాలు బరువెక్కటం ప్రారంభం అవుతుంది.
ఆ సీన్ వచ్చేదాకా, పల్లెటూరు గొడవలు, సారాదుకాణాలు, అయ్యప్ప మాల తీసీ తీయగానే ఎగబడి త్రాగేసే త్రినాథ్, ఏ విధమైన గొప్పతనం కనపడలేదు సినిమాలో.
ఇలాంటి సన్నివేశాన్ని harbinger అంటారు, నాటకీయంగా రాగల బరువైన దృశ్యాలకి నాందీవాక్యంగా ఈ సీన్ ఉపయోగపడుతుంది.
అప్పటిదాకా –
“ఇంత చెత్త సినిమాకి ఎందుకు ఇంత పేరొచ్చిందా? త్రాగుడుని ఇంత బహిరంగంగా ఎందుకు చూపించారు? ఈ దిక్కుమాలిన సినిమాకి ఎందుకొచ్చామబ్బా?”
అని అనుకున్న మనం ఇక లీనం అయిపోతాము సినిమా ద్వితీయార్థంలో.
👨👩👧 3) హీరో ఎలివేషన్లు లేకుండా హీరోని మనవాడిలా చూపించడం
సాధారణ తెలుగు సినిమాలలో మనం చూసే హీరో ఎలివేషన్లు అవీ లేకుండా హీరోని ఒక సాధారణ లగేజీ ఆటో తోలుకునే, ఓ చిన్న అరటి తోట యజమానిగా చూపడం. ఎక్కడా కూడా హీరో ఖరీదైన దుస్తులు ధరించటం వంటి ఆర్భాటాలు చేయకుండా, మనం నిత్యం చూసే మధ్య తరగతి వ్యక్తిలాగే ఉంటాడు. మనలాగే మాట్లాడతాడు.
ఇతను మన ప్రతినిధి అనే భావన సగటు ప్రేక్షకుడికి వస్తుంది.
కాసేపయ్యాక ఇది సినిమా అని మరచిపోయి, ఏదో పక్క వీధిలో జరుగుతున్న దృశ్యాన్ని చూస్తున్నట్టు ప్రేక్షకుడు లీనమయిపోతాడు.
🙏 4) త్రినాథ్ అయ్యప్ప భక్తుడిగా ఉండటం కూడా కథలో భాగమే
వాస్తవానికి ఈ కథలో హీరో అయ్యప్ప భక్తుడే కానక్కరలేదు. ఏదో ఒక వృత్తి చేసుకునేవాడిలాగా చూపి ఉండవచ్చు.
కానీ మొదట్లో చెప్పుకున్నట్టు అయ్యప్పతో ఈ కథకి ఉన్న బలమైన కనెక్షన్ కారణంగా త్రినాథ్‌లో ఈ భక్తి ప్రవృత్తి పెట్టి తెలివిగా మలిచాడు దర్శకుడు. దక్షిణాదిలో అన్ని రాష్ట్రాల ప్రజలని కలిపే బలమైన భక్తిభావన శబరిమల యాత్ర, అయ్యప్ప మాల. అందువల్ల అది చక్కగా ఇమిడిపోయి ఈ చిత్ర విజయానికి దోహదపడింది.
ఇక అయ్యప్ప సీజన్ ప్రారంభం అవబోతూ ఉంది. అదొకటి కలిసొచ్చిన అంశం.
💡 5) ఒక సూపర్ హిట్ కథ నుంచి మరో సూపర్ హిట్‌కు ప్రేరణ?
ఒక సూపర్ హిట్ చిత్రం తాలూకు కథని తీసుకుని దాన్ని అటు ఇటు మార్చి తెలివిగా స్క్రిప్ట్ వ్రాసుకుంటే విజయం తథ్యం.
ఎవరైనా గమనించారో లేదో..
ముప్పై ఏళ్ళ క్రితం గొప్ప విజయం సాధించిన “మాతృదేవోభవ” చిత్రం నుంచి ఈ చిత్రం కథకి ప్రేరణ లభించి ఉంటుంది అని నేను భావిస్తున్నాను.
త్రాగుడు వల్ల హీరో జీవితం నాశనం అయిపోతుంది.
పిల్లలని అనాథలుగా కాకుండా ఆ తల్లి పడే తపనే ఆ చిత్ర విజయానికి కారణం.
అదే వాతావరణం. త్రాగుడు వ్యసనానికి గురయిన కథానాయకుడు.
అక్కడ తల్లిదండ్రులు చనిపోతే, ఇక్కడ పిల్ల చనిపోతుంది.
కథానాయకుడు త్రాగుడు మానేయడు అక్కడ, ఇక్కడ మానేస్తాడు.
అక్కడ మదర్ సెంటిమెంట్ – ఇక్కడ ఫాదర్ సెంటిమెంట్.
నా వరకి నాకు అలా అనిపించింది. “అరె కనిపెట్టేశారే” అని శివ నిర్వాణ అనుకున్నా నేను ఆశ్చర్యపోను.
సాధారణంగా కథలకి ప్రేరణ అలానే లభిస్తుంది.
🔥 6) మొదట బీభత్సం – ఆ తరువాత ఆహ్లాదం
పరుచూరి వెంకటేశ్వర రావు గారు విజయవంతమైన స్క్రీన్‌ప్లే తాలూకు సీక్రెట్స్ చెబుతూ – అగ్నిపురాణం నుంచి తాను ఎలా ప్రేరణ పొందారో చెప్పారు ఒకసారి.
అదే టెక్నిక్ ఆయన చిరంజీవి గారి “ఖైదీ” కథ వ్రాయటంలో ఫాలో అయ్యానని చెప్పారు.
అదేంటంటే – కథా ప్రారంభంలోనే ఊహకందనంతటి స్థాయిలో భీభత్స రసం ఆవిష్కరింపబడాలట. ఆ తరువాత నెమ్మదిగా చక్కటి దృశ్యాలతో కథని నడిపిస్తూ ఆహ్లాదం కలిగించాలట.
ప్రేక్షకుడు ఇక కట్టిపడేసినట్టు లీనమవుతాడట.
ఎవరైనా టీచరంటే దేవుడిగా భావిస్తారు.
ఈ సినిమాలో ప్రారంభంలోనే టీచరమ్మని అంత క్రూరంగా చూపడం ద్వారా మనకి వెన్నులో చలిపుట్టిస్తారు.
తరువాతి సీన్‌లో ఆమె సస్పెన్షన్ ద్వారా సగటు ప్రేక్షకుడికి ఊరట కలిగిస్తారు.
💔 7) ఇక మాస్టర్ స్ట్రోక్ వంటి ముగింపు
ప్రేక్షకుడు ఊహించనంతటి విషాదం పొంది, ఇక కథ అయిపోయింది అనుకునే తరుణంలో — మరో మణెమ్మ రావటం, ఇరుముడి ఎత్తించుకోవటం తో ప్రేక్షకుడు మాటల్లో చెప్పలేని భావోద్వేగానికి గురవుతాడు.
అది దుఃఖమా కాదు, ఆనందమా కాదు.
అది ఇది అని చెప్పలేని ఓ భావన.
ఆ భావనని వ్యక్తపరచటం ఎలాగో తెలియక సతమతమవుతాడు ప్రేక్షకుడు.
ఆనందంతో కూడిన దుఃఖం.
దుఃఖంతో కూడిన ఆనందం.
అది మాస్టర్ స్ట్రోక్‌గా వర్కవుట్ అయింది.
అయితే ఇది దర్శకుడు అనుకుని తీసి ఉండడు.
అంత దుఃఖంతో ఎందుకు, ఓ చిన్న రిలీఫ్ ఇద్దామని అనుకుని పెట్టిన షాట్ అది అనుకుంటా.
రవి తేజ చెబుతూ ఉంటాడు కదా – ప్రతి ఆడపిల్లలో తన కూతుర్ని చూసుకుంటానని.
అది కూడా వర్కవుట్ అయింది.
మీరు శ్రద్ధగా గమనిస్తే ఈ తరహా మాస్టర్ స్ట్రోక్ ముగింపు మనకి సూపర్ స్టార్ కృష్ణ గారి “అల్లూరి సీతారామరాజు” లో కనిపిస్తుంది.
24 క్రాఫ్ట్స్‌పై మంచి పట్టు ఉన్న సూపర్ స్టార్ కృష్ణగారి మార్క్ అది.
అల్లూరి సీతారామరాజు పాత్ర చనిపోయిన వేదనతో ప్రేక్షకులు బయటికి రాకుండా ఆయన పెట్టిన చివరి సీన్ చూసి తీరాల్సిందే.
8) పాన్ ఇండియా మూవీ అనే భ్రమలో పడకుండా కేవలం తెలుగు ప్రేక్షకులని, దక్షిణాది ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకుని తీయటం వీళ్ళకి గొప్ప వెసులుబాటు ఇచ్చింది నమ్ముకున్న కథని హాయిగా చిత్రీకరించుకోవటానికి.
బిజినెస్ నిపుణులు ఒక మాట చెబుతారు Riches are in Niches అని. అంటే అన్నిరకాల మార్కెట్లని, అన్ని రకాల ఉత్పత్తులని, అన్ని రకాల వినియోగదారులని దృష్టిలో పెట్టుకుని వ్యాపారం చేస్తే ఎందులోను మీకు పూర్తి లాభం రాదు, కేవలం ఒక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని వారి ఒకే అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని నీవు రంగంలో దిగితే నీవు ఊహించనంతటి డబ్బులు కళ్ళ చూడొచ్చు. Don’t cast the wider net, choose a small market, go deeper and deeper
ఈ సూత్రం కూడా ఈ సినిమాకి లాభం చేకూర్చింది. ఇదే సూత్రం మీద ఆధారపడి కాంతారా కూడా విజయం సాధించింది. పాన్ ఇండియా అనే పిచ్చిలో సినిమా తీయాలనిమొదలు పెడితే విభిన్న సంస్కృతులు, వివిధ భాషలు, వైవిధ్యభరితమైన ఆచారాలు ఉన్న మన దేశంలో ఏ ఒక్కరిని తృప్తి పరిచి ఉండలేకపోయేవారు.
9) మార్కెటింగ్ మీద, గ్రాఫిక్స్ మీద అనవసరంగా డబ్బులు తగలేయ్యకుండా శ్రద్ధగా కూర్చుని చక్కటి కథ వ్రాసుకున్నారు. ఖర్చులని నియంత్రణలో పెట్టుకోవడం వల్ల టికెట్స్ రేట్లు పెంచి ప్రేక్షకుల నెత్తిన భారాన్ని మోపే అవసరం రాలేదు.
విజయం కోసం బాగా ఆకలిమీదున్న యువకళాకారులని తీసుకున్నారు. వంద దేవుళ్ళు చిత్రంలో నటించిన శ్వాశికకి ఇది గొప్ప అవకాశం. యువరక్తం యొక్క ఉత్సాహాన్ని, ప్రేరణని చోదక శక్తిగా మలచుకున్నారు.
రవితేజ, సాయికుమార్, అజయ్ ఘోష్ వీరు మాత్రమే మనకి తెలిసిన మొహాలు. వీళ్ళలో రవితేజ ఒక్కడే స్టార్. ఇలా స్టార్ కేస్టింగ్‌లో కూడా వీళ్ళకి ఖర్చు కలిసి వచ్చింది.
లొకేషన్లకి కూడా పెద్దగా ఖర్చు పెట్టలేదు. విదేశాల్లో పాటలు, చిత్రమైన కంప్యూటర్‌గ్రాఫిక్స్ ఎమీ లేవు. వీటన్నిటి వల్ల ఖర్చు కలిసి వచ్చింది.
⚖️ ఈ చిత్రంపై వచ్చిన కొన్ని విమర్శల గురించి
ఇక ఈ చిత్రంగూర్చి వచ్చిన కొన్ని విమర్శల గురించి మాట్లాడుకుందాం.
విమర్శ 👮 “ఈ చిత్రంలో పోలీసులు ఎందుకు లేరు?”
ఒక ప్రశ్న లేవనెత్తుతున్నారు విమర్శకులు.
ఎమ్మెల్యే, టీచర్లు ఇలా ఉన్నారంటే అది రాక్షసరాజ్యం అని అర్థం అయిపోలా?
అలాంటి రాక్షస రాజ్యంలో మామూలు రాజ్యాలలో పని చేసే వ్యవస్థలు చాలవు.
ఆ రాక్షసత్వాన్ని అరికట్టాలంటే దేవుడే దిగిరావాలి అని దర్శకుడు చెప్పదలచాడు కాబోలు.
విమర్శ 📱 “త్రినాథ్ ఫోన్ రిపేర్‌లో ఉంటే మణెమ్మ ఆడియో మెసేజ్ ఎలా పెట్టింది?”
జాగ్రత్తగా గమనిస్తే ఆ పిల్ల వాడిన ఫోన్ గురుస్వామిది.
కాకపోతే అదృష్టవశాత్తు ఆయన ఫోన్‌కి స్క్రీన్ లాక్ లేకపోవటం దైవకృప.
విమర్శ 🙏 “గురుస్వామి పాత్రని అలా చూపి ఉండకూడదు”
ఇది కొంత మేరకి నిజమే.
గురుస్వామిని ఇరికించుకుని వాళ్ళు తమ పని చక్కబెట్టుకుంటారు. అంతవరకి ఓకే.
వాళ్ళు మణెమ్మని అక్కడికి పిలుచుకువచ్చేవరకు గురుస్వామి పాత్రని ఉపయోగించుకుని, తీరా వచ్చాక ఆయన్ని కూడా బంధించో, స్పృహ తప్పేలా కొట్టో చేసి, ఎమ్మెల్యే మనుషులే మణెమ్మని చంపేసినట్టు చూపిస్తే ఆయన పాత్ర ఔన్నత్యం కూడా దెబ్బతినేది కాదు.
ఇది స్క్రిప్ట్ స్థాయిలో సరిచేసుకోగలిగిన చిన్న లోపం.
విమర్శ 🍺 “త్రినాథ్ అంతలా త్రాగటం అవసరమా?”
నా వ్యాసంలో ఈ విమర్శకి సమాధానం దొరుకుతుంది.
విమర్శ ⚠️ “తండ్రికి అన్నీ చెప్పే పిల్ల చనిపోవటం.. భయపడి తనలోనే దాచుకునే అమ్మాయి బ్రతకటం — ఇది తప్పుడు సందేశాలు ఇవ్వటం లేదా?”
ఇది పూర్తిగా తప్పు విమర్శ.
గాయత్రి భయపడి చెప్పకపోవటం వల్ల బ్రతికి పోయింది.
కానీ తన శీలం పోగొట్టుకుంది.
తనకి జరుగుతున్న హానిని మొదటే చెప్పకపోవటం వల్ల తనకి, తన తండ్రికి, మణెమ్మకి కూడా పెద్ద ముప్పు తెచ్చిపెట్టింది.
అలా కాకుండా ఆ అమ్మాయి కూడా మొదటే అన్నీ చెప్పి ఉంటే ఈ అమ్మాయి జీవితం వేరేలా ఉండేది.
స్వస్తి.
🎬 ఇరుముడి — నటీనటులు & సాంకేతిక బృందం
నటీనటులు:
- రవితేజ — త్రినాథ్
- ప్రియా భవానీ శంకర్ — కావేరి
- బేబీ నక్షత్ర — మణెమ్మ
- సాయికుమార్ — గురుస్వామి గోపరాజు
- స్వాసిక విజయన్
- అజయ్ ఘోష్ — ఎర్రాజీ
- రమేష్ ఇందిర
- మీసాల లక్ష్మణ్
- రాజ్‌కుమార్ కసిరెడ్డి
- రమణ భార్గవ్
- కిషోర్ కుమార్ పొలిమేర
- కార్తీక్ అడుసుమల్లి — కొమరం
🎥 సాంకేతిక బృందం
- కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం: శివ నిర్వాణ
- నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
- సహ నిర్మాత: శివ్ చనానా
- బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
- సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్
- ఛాయాగ్రహణం: విష్ణు శర్మ
- ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
డాక్టర్ రాయపెద్ది వివేకానంద్ దేశం గర్వించదగ్గ సాఫ్ట్ స్కిల్స్ శిక్షణా నిపుణుడు. వీరు రాయల్ సాఫ్ట్ స్కిల్స్ క్యాంపస్ అధినేత. వివేకానంద్ గారు రూపుదిద్దిన ‘పేపర్‌లెస్ ఫ్లూయెన్సీ’ అనే మోడ్యూల్ అత్యంత ప్రజాదరణ పొందింది. చాలా పై స్థాయిల్లో ఉన్న అనేకమంది ప్రముఖులు, సెలెబ్రిటీలు వీరి పేపర్ లెస్ ఫ్లూయెన్సీ కోర్స్ ద్వారా విజయ శిఖరాలకి చేరుకున్నారు. ఇప్పటిదాకా యాభై వేలమందిపైగా ప్రొఫెషనల్స్ మరియు సెలెబ్రిటీలు ఈ శిక్షణా తీసుకుని ఉంటారు.
కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ’ని అమలు చేయబోయే ముందు న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మేధావుల సదస్సుకి వీరిని ప్రత్యేకంగా అహ్వానించి వీరి సలహాలు సూచనలు స్వీకరించటం జరిగింది.
డాక్టర్ రాయపెద్ది వివేకానంద్ అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. పేపర్ లెస్ ఫ్లూయెసీ ఇన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలెప్మెంట్, ఇంటర్యూ స్కిల్స్, హెచ్చార్డీ స్కిల్స్ తదితర అనేక శిక్షణా తరగతులు వీరు నిర్వహిస్తూ ఉంటారు. వీరి బోధనలు విని మంత్రముగ్ధులు అవని వారు ఉండరు అనడం అతిశయోక్తి కాదు. తన శిక్షణా కార్యక్రమంలో ‘న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ ఆఫ్ మైండ్’ మరియు ‘పవర్ ఆఫ్ సబ్కాన్షస్ మైండ్’ అనే ప్రభావవంతమైన సూత్రాలతో వీరు తమ బోధనని రక్తి కట్టిస్తారు.
టీనేజీ పిల్లలకి ‘గోల్ సెట్టింగ్’ అనే ప్రత్యేక శిక్షణా కార్యక్రమం చేపట్టి వీరు అనేక మంది పిల్లలని విజయపథంలో నడిపిస్తున్నారు.
వీరి కార్యక్రమాలని యూట్యూబ్‌లో చూడవచ్చు. వీరు స్వతహాగా రచయిత. సినీ విశ్లేషకులు కూడా. వీరు వ్రాసిన ఇంగ్లీష్ పుస్తకం ‘సాఫ్ట్ స్కిల్స్ టు ఏస్ ఇంటర్వ్యూస్’ అమెజాన్‌లో లభ్యం అవుతుంది.
ప్రతి శనివారం సాయంత్రం జూమ్ ప్లాట్‌ఫాం ద్వారా వీరు లైవ్‌లో పేపర్‌లెస్ ఫ్లూయెన్సీ గూర్చి ఉచిత అవగాహనా కార్యక్రమం నిర్వహిస్తారు.

