Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

దగ్గరతనాన్ని అనుభవంలోకి తెచ్చే పాట – ‘ఈజ్ ఇట్ రియల్లీ ఓవర్’

[జిమ్ రీవ్స్ పాడిన ‘ఈజ్ ఇట్ రియల్లీ ఓవర్’ అనే పాటని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]

~

జిమ్ రీవ్స్ గాత్రంలో విషాదం చాలా గొప్పగా పలుకుతుంది. అతనికి తన గాత్రంపై ఉన్నకంట్రోల్ అపారం. గొప్ప గాయకులందరి ప్రత్యేకత అదే కాని జిమ్ గొంతులో ఆ కంట్రోల్‌తో వచ్చేఅందమే వేరు. అందుకే ఆయన పాడిన భక్తి (గాస్పెల్) గీతాలను క్రైస్తవులు కానివారు కూడా విని ఆనందానుభూతికి లోనవుతారు. ఆయన మరణించిన తర్వాత విడుదలయిన ఒక పాట కేవలం ఓ పల్లవి ఓ చరణంతో ఉంటుంది. కాని ఇది కలిగించే అనుభూతి అనిర్వచనీయం. విషాదాన్ని తన గొంతుతో ఆయన పలికిస్తూ ఉంటే వింటున్న శ్రోతల కళ్లు చెమ్మగిల్లుతాయి. ఒకో పదం లోని ఒకో అక్షరాన్ని ఆయన అత్యంత స్పష్టంగా గుండె లోతుల్లోంచి వినిపిస్తూ ఉంటే, ఆ వైబ్రేషన్స్ మనల్ని చేరి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అవి అనుభవించడానికి ఈ పాట వినాలి.

‘Is It Really Over’ 1965లో జిమ్ రీవ్స్ విడుదల చేసిన ఒక సింగిల్. ఇది ఆయన మరణానంతరం విడుదలయి అమెరికా కంట్రీ సింగిల్స్ చార్టులో అగ్రస్థానాన్ని చేరుకుంది. ఈ సింగిల్ మూడు వారాల పాటు అగ్రస్థానంలో కొనసాగడమేకాక చార్టులో మొత్తం పంతొమ్మిది వారాల పాటు నిలిచి ఉంది. రీవ్స్ పాడిన ఇతర పాపులర్ గీతాలలో ఈ పాట నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం. చిన్నపాటే కాని ఇది ఇచ్చే అనుభూతి బావుంటుంది. విషాద గీతమే కాని జిమ్ గానం చేసిన విధానం దీనిలో ప్రత్యేకం.

Is it really over, is this the end of the line?
Don’t tell me I’m losing the love that was mine
If you’re really leaving, take some part of me
So I’ll always remember, how sweet love used to be

(అంతా ముగిసిపోయినట్లేనా? ఇది మన బంధానికి ఆఖరి మజిలీనా? నాదైన ప్రేమను నేను పోగొట్టుకుంటున్నానని చెప్పకు. నిజంగా నన్ను వదిలి నీవు వెళ్లిపోతున్నట్లయితే నీతో నాలో ఒక భాగాన్ని తీసుకుని పో. అప్పుడే నేను ఆ తీయటి స్మృతులకు ఎప్పటికీ దూరం కాకుండా ఉండగలను)

ఒకప్పటి ప్రేమ జంట ఇప్పుడు దూరం అవుతున్న క్షణాలివి. ఇక తమ మధ్య అంతా ముగిసిందని అతనికి అర్థం అవుతూనే ఉంది. ఆమె తనని వదిలి వెళ్లిపోతుందనే వాస్తవాన్ని అంగీకరిస్తున్నాడు. కాని లోపల ఏదో చిన్న ఆశ, నిజంగా మనం దూరం అవుతున్నామా అని ఆమెను అంతా తెలిసి విషాదంగా ప్రశ్నిస్తున్నాడు. ఒకప్పటి తన ప్రేమ, తన హక్కులను తాను పోగొట్టుకుంటున్నానని, ఆమె ఇక పరాయిదవబోతుందని అతనికి అర్థం అవుతూ మనసులో ముల్లులా ఈ గాయం బాధపెడుతూ ఉంది. అతను ఆమెను మర్చిపోవాలని అనుకోవట్లేదు. అందుకే వెళ్ళేటప్పుడు అన్నీ వదిలి వెళ్లలి నాలోని ఓ భాగాన్ని నీతో తీసుకెళ్లిపో అప్పుడే కదా నీవు సదా నా జ్ఞాపకాలలో ఉండిపోతావు. ఆ పోగొట్టుకున్న భాగం వెలితి మనసును తోడేస్తూ ఉంటే ఆమెను మర్చిపోవడం అతనికి అసాధ్యం అందుకే ఆ బాధ తనకు కావలని ఈ బాధనన్నా తనకు తోడిఛి వెళ్ళమని ఆమె ని అతను అభ్యర్ధిస్తున్నాడు.

I wonder who’s stepping into my shoes, who can he be?
I can tell by your eyes our love has died, and it’s over for me

(ఎవరు నా స్థానంలోకి రాబోతునారు? ఎవరై ఉంటారు? నీ కళ్ళలోకి తొంగి చూస్తుంటే మన ప్రేమ మరణించిందనే సంగతి నాకు అర్థం అవుతుంది. నా వరకు అంతా అయిపోయిందనీ నాకు తెలుసు)

తమ మధ్య దూరం పెరిగిందని, ఇది పూడ్చలేని అగాధం అని, తాను అందుకున్న ప్రేమ ఇక గతంగా మారబోతుందనే నిజాన్ని అతను మెల్లిగా అంగీకరిస్తున్నాడు. ఈ చరణం దగ్గర జిమ్ గొంతు గుండెను పిండేస్తుంది. మంద్రంగా వచ్చే కోరస్, అతి విషాదంగా పలికే జిమ్ కంఠం, ఆ గానంలోని ఆ దుఖం ఈ పాటను అమరం చేసాయి. దీని తర్వాత వచ్చే మంద్ర స్థాయి సంగీతం కలగలసి ఈ పాట పలికించే విషాదం ఆ గాయకుని ఒంటరితనాన్ని, దీన స్థితిని పరిచయం చేస్తాయి.

I wonder who’s stepping into my shoes, who can he be?
I can tell by your eyes our love has died, and it’s over for me
Really over for me..

(ఎవరు నా స్థానంలోకి రాబోతునారు? ఎవరై ఉంటారు? నీ కళ్ళలోకి తొంగి చూస్తుంటే మన ప్రేమ మరణించిందనే సంగతి నాకు అర్థం అవుతుంది. నా వరకు అంతా అయిపోయిందనీ నాకు తెలుసు నిజంగా అంతా అయిపోయింది)

పై చరణమే మరోసారి వస్తుంది. ముందటి చరణం విషాదాన్ని మోసుకొస్తే దాన్ని ఇంకా లోతుగా ద్వనింపజేస్తూ అత్యంతా దీనంగా ఇక్కడ జిమ్ స్వరం పలుకుతుంది. పై చరణమే విషాదం అంటే ఇంకా తీవ్రస్తాయి విషాదాన్ని ఇక్కడ శ్రోతలను పరిచయం చేస్తాడు జిమ్. అలా అని అతని గొంతు వణకదు, తొణకదు, పదాలలో స్పష్టత చెడదు. కాని ఆ మనసులోని దుఃఖం మనకు అర్థం అవుతూనే ఉంటుంది.

ఇట్స్ ఓవర్ ఫర్ మీ అన్న వాక్యం దగ్గర జిమ్ పలికించే భావం మళ్లీ మళ్ళీ వినాలనిపిస్తుంది. విషాదం మనుషులను, మనసులను దగ్గర చేస్తుంది. ఆ దగ్గరతనాన్ని అనుభవంలోకి తీసుకొచ్చే గీతం ఇది.

~

ఈ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు/వినవచ్చు:
https://youtu.be/82M5JEGhBPY?si=LH496hITocWHGomb

Exit mobile version