Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఇష్టం ఒడ్డు కనపడక..

లోపలి మనిషిని
జల్లెడ పట్టే
తప్పుల పోలికలెక్కడివో

అంచనావేయలేని
కాలం గారడీ
మనసును ముద్దాయిగా నిలపెడితే

నుదుట చితిరాతలను
చేతిరేఖల్లో తర్జుమా చేసిన
వృద్ధాప్యదశలో

స్పందన నవ్వులపాలై
చల్లపడి పలుచనై
అవమాన గాయమై

రాతి పొరల్లో
ఇంకిన జ్ఞాపకాలను
ఎంత ఈదినా

మునిగిన
చోటెక్కడో తెలియక
ఇష్టం ఒడ్డు కనపడక

ఊపిరి వెలుగులో
మిణుకుమనే మాటలని
తినే చూపులు కొడికడుతున్నా

కళ్ళు మారవు
కల ఆరదు
కథ ఆగదు.

 

Exit mobile version