Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

విశ్వనాథ సృజన భువనాలు – కశ్మీర రాజవంశావళి నవలలు – పరిచయం-10

[విశ్వనాథ సత్యనారాయణగారి కశ్మీర రాజవంశావళి నవలల సమగ్ర పరిచయం అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

సైన్స్ ఫిక్షన్ రచనలో కానీ, హిస్టారికల్ ఫిక్షన్ రచనలో కానీ రాసిన ప్రతి వాక్యానికీ, చేసిన ప్రతిపాదనకూ ‘నిరూపితమైన సత్యం’ అన్నది విధిగా ఆధారంగా ఉండాలన్నది ప్రధాన నియమం. ఈ నియమాన్ని విశ్వనాథ రచించిన ‘యశోవతి’ నవల ఆరంభ వాక్యాలకు అన్వయించి చూడాల్సి ఉంటుంది.

ఆరంభంలోనే ఆయన విదేహ రాజ్యామూ, మిథిలా నగరము అని పరిచయం చేస్తూ, ‘త్రేతాయుగములో పరమ వైరాగ్య వంతులు, వేదాంతవేత్తలు అయిన మహారాజులు పరిపాలించిన నేల’ అని వ్యాఖ్యానించారు. ఆ వెంటనే ‘ఆ రాజులు అనాది నుండి సామ్రాజ్యములు నిర్మించు నూహ లేనివారు. తత్త్వవేత్తలు’ అన్నారు.

‘సామ్రాజ్యాలు నిర్మించే ఊహ లేనివారు, అంటే వారు ఉన్న రాజ్యంతో సంతృప్తి పడేవారు, ఇతర రాజ్యాలపై దాడులు చేసి వాటిని తమ సామ్రాజ్యంలో కలిపేసుకుని మహా సామ్రాజ్యాలు ఏర్పాటు చేయాలన్న ఉద్దేశ్యం లేని వారన్న అర్థం వస్తుంది. అంతే కాదు, ‘ఇతర రాజులు ఆ దేశమును ఆక్రమించుటకు ప్రయత్నమే చేయలేదు.’ అని వెంటనే అన్నారు. మిథిల రాజులు తత్త్వవేత్తలు. వారికి రాజ్యాలు నిర్మించే ఊహ లేదు. కానీ వారి రాజ్యంపై ఎవరూ కన్నేయక పోవటం, దాడి చేయక పోవటం సమంజసంగా అనిపించదు. మిథిల రాజు తత్త్వవేత్త అయితే అవవచ్చు కానీ అందరు రాజులు తత్వవేత్తలు అవ్వాలని లేదుగా? కానీ విశ్వనాథ ఇతర రాజులు ఎవరూ మిథిలను ఆక్రమించాలని ప్రయత్నించలేదని రాశారు. కాస్త తెలిసిన వారికి వెంటనే వాల్మీకి రామాయణంలో బాలకాండలో ‘సంకశ్య’ రాజు సుధన్వుడు మిథిలపై దాడి చేసిన ఉదంతం గుర్తుకు వస్తుంది. అతడితో మిథిల రాజు జనకుడు పోరాడటం గుర్తుకు వస్తుంది. విశ్వనాథ రామాయణ కల్పవృక్షంలో ఈ యుద్ధాన్ని వర్ణించిన పద్యాలు గుర్తుకు వస్తాయి. ఈ సందర్భంగా విశ్వనాథ రచన శైలి గురించి కాస్త చర్చించాల్సి ఉంటుంది.

ప్రధానంగా విశ్వనాథ – పాఠకుడు కాస్త తెలిసినవాడయి ఉండాలని అంటారు. లేకపోతే తెలుకునే జిజ్ఞాస ఉన్నవాడవ్వాలని అంటారు.  రచయిత పాఠకుడి స్థాయికి  దిగి, అరటిపండు వొలిచి నోట్లో పెట్టిన రీతిలో రచన చేయాల్సిన అవసరం లేదన్నది ఆయన అభిప్రాయం. పాఠకుడికి కొంత సంస్కారం, కొంత పాండిత్యం ఉండాలన్నది ఆయన ఉద్దేశ్యం. అలాగని పాఠకుడిని చులకన చేయటం కాదు. ఆయన రాయాలనుకున్నది రాస్తారు. దాన్ని అర్థం చేసుకోవటంలో పాఠకుడు  కాస్త ప్రయత్నాన్ని,  ఆలోచనను, కాస్త అధ్యయనాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. ప్రతీదీ ప్రతిపదార్థ తాత్పర్యాలతో వివరించడు రచయిత. విశ్వనాథ అందించిన ఆధారాన్ని పట్టుకుని పాఠకుడు తవ్వుకుంటూ పోవాలి. శాస్త్రాలు చదవాలి. తనలో తాను మథనపడాలి. అందుకే విశ్వనాథ ఒక వ్యాఖ్య చేస్తే,  దాని పుట్టు పూర్వోత్తరాలు, నేపథ్యాల వివరణ ఇవ్వరు. అది తెలుసుకోవాల్సిన బాధ్యత పాఠకుడిది. ఒక శ్లోకం ఉదహరిస్తారు. దాని అర్థం రాయరు. అది తెలుసుకుని, దాన్ని కథ సందర్భంతో అన్వయించుకోవాల్సింది పాఠకుడి బాధ్యత. పాఠకుడికి అంత శక్తి లేదు. పాఠకుడికి వివరించాల్సిన బాధ్యత విమర్శకుడిది. విమర్శకుడంటే తెలిసీ తెలియకుండా ప్రతిదాన్నీ చీల్చి చెండాడి, అది చెత్త, ఇది పనికిరాదని తీసివేసేస్తూ తన అంత విజ్ఞానవంతుడు లేడని కాలరెగరేసే వాడు కాదు. తనకు నచ్చిన చెత్తను అందమైన అద్భుతమైన ‘చెత్త’ అని పొగడుతూ, నచ్చని రచయిత అందమైన రచనను దూషించి, చులకన చేసే భజనపరుడు, విదూషకుడు, అతితెలివైన మూర్ఖుడు కాదు.

రచయిత రాసిన రచనను కూలంకషంగా అర్థం చేసుకుని, లోతుగా విశ్లేషించి, దాన్ని పాఠకులకు చేరువ చేసేవాడు విమర్శకుడు. రచయితకూ పాఠకుడికీ నడుమ, వారథిలాంటి వాడు విమర్శకుడు. రచయిత రచనను, ఉద్దేశ్యాన్ని,  లక్ష్యాన్ని,  ఔచిత్యాన్ని, రచయిత వాడిన భావనల విశ్లేషణను పాఠకులకు అందించే మధ్యవర్తి విమర్శకుడు. అంతే తప్ప తనను తాను రచయిత కన్నా కొన్ని మెట్ల  పైన ఊహించుకుని, రచయిత రచనపై తీర్పు చెప్పి, శిక్ష వేసే న్యాయమూర్తి కాదు విమర్శకుడు. కసాయి దుకాణంలో మాంసం ముక్కలు కొట్టినట్టు రచనను ముక్కలు ముక్కలు చేసేవాడు కాదు విమర్శకుడు.  హేళన, వెక్కిరింతలు విమర్శ కాదు. అనౌచిత్యాలను ఎత్తి చూపించటం విమర్శకుడి పని. తర్కరహితమైన వాటిని వివరించటం. అంతే తప్ప ఒక బెత్తం పుచ్చుకున్న అధ్యాపకుడో, కత్తి పుచ్చుకున్న సేనాపతో, కసాయి తలారియో కాదు విమర్శకుడు.

అసందర్భమైనా ఒక విషయం స్పష్టంగా చెప్పుకోవాలి. రచయిత సృష్టికర్త. రచయిత రచనను సృష్టించనిదే విమర్శకుడు లేడు. సంపాదకుడు లేడు. ప్రచురణకర్త లేడు. అందుకే రచయితది అత్యున్నత స్థానం.  విమర్శకుడు, సంపాదకుడు, ప్రచురణకర్తలకు అస్తిత్వం రచయిత వల్లనే వస్తుంది. రచయిత రచన లేకపోతే వీరికి ఉనికిలేదు. అంటే, రచయితపై ఆధరపడి బ్రతికే పరాన్నజీవులు (parasites) అన్నమాట వీరంతా. కాబట్టి ఏ రకంగానూ తమని తాము రచయిత కన్నా  ఉన్నతంగా ఊహించుకుని, రచయితకు అలా రాయకూడదు, ఇలా రాయాలి, ఇలాగే రాయాలి అని చేప్పె ‘హక్కు’ వీరికి లేదు. ఇది విశ్వనాథకు తెలుసు.

అందుకే విశ్వనాథ ఎప్పుడూ  విమర్శకుల మెప్పుకు  అనుగుణంగా రచనలు చేయలేదు. అసలు విమర్శకులను లెక్కచేయలేదు.  ఎవరి మెప్పు కోసం తాపత్రయ పడలేదు. ఎవరిపొగడ్తలకోసమో రచనతో  రాజీపడలేదు. ఉత్తమ  సాహిత్య  విలువలతో, రచిస్తూ, ప్రజలకు అసలైన సాహిత్య విలువలను, ఉత్తమ సాహిత్యాన్ని ఉన్నతమైన రీతిలో అందిచాలని తపన పడ్డారు.  విమర్శకుల మెప్పుకన్నా విలువలకే ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే విశ్వనాథ నవలలు మామూలు నవలలాగా చదవటం, చదివేసి, అంతా అర్థమయిపోయిందని అనే వీలు లేదు. అందుకు చక్కని ఉదాహరణ ‘యశోవతి’ నవల ఆరంభ వాక్యాలు.

ప్రాచీన భారదేశంలోని 16 మహాజన పదాలలో విదేహ ఒకటి. ప్రస్తుతం బీహార్ ఉత్తరాన ఉన్న ‘మిథిలాంచల్’, నేపాల్ లోని ‘తూర్పు తెరాయ్’ ప్రాంతాలను కలిపి విదేహ రాజ్యం అనే వారని నిర్ధారించారు. ఈ రాజ్యానికి రాజధాని ‘మిథిల’. ప్రస్తుతం నేపాల్ లోని జనకపూర్‌ను ఒకప్పటి ‘మిథిల’గా భావిస్తున్నారు. విదేహ రాజులను ‘రాజర్షులు’ అంటారు. అంటే వీరు రాజులే కానీ ఋషుల్లా, ఆనందానికి పొంగక, విషాదానికి కృంగక, ఆవేశకావేశాలకు లోనుగాక నిర్మోహంగా, స్థితప్రజ్ఞతతో రాజ్యపాలనను అధికారంగా కాక విద్యుక్తధర్మంలా, నిర్దిష్ట కర్తవ్యంలా నిర్వహించే వారన్న మాట. ‘జనక’ అన్నది ఒక వ్యక్తి పేరు కాదు. విధేహ రాజులందరూ ‘జనకు’లే. అది వారి వంశం బిరుదు.

బృహదారణ్యకోపనిష్తతు, అష్టావక్రగీత, మహాభారతంలోని శాంతిపర్వంలో జనక రాజుల ప్రస్తావన వస్తుంది. రాజభోగాల నడుమ ఉంటూ, తామరాకు మీద నీటి బొట్టులా జీవిస్తూ, ‘విదేహముక్తి’ సిద్ధాంతంగా జీవించేవారు వీరు. ‘విదేహముక్తి’ అంటే శరీరంపై, భోగాలపై మమకారం లేకపోవటం. అందుకే జనకుడి ఆస్థానంలో యాజ్ఞవల్కుడు, గార్గి, మైత్రేయి, అష్టావక్రుడు వంటి బ్రహ్మజ్ఞానులుండేవారు. వేదాంత చర్చలకు మిథిల కేంద్రం.

ప్రాచీన కాలంలో రాజులు దిగ్విజయ యాత్రలు చేసేవారు. అశ్వమేధయాగాలు చేస్తూ సామ్రాజ్యాన్ని విస్తరింప చేసేవారు. చరిత్రలో మిధిల రాజులెవరూ ఇలాంటి దిగ్విజయ యాత్రలు చేసిన ధాఖలాలు లేవు. వారికి ఆ దృష్టి లేనే లేదు. అందుకే విశ్వనాథ ‘పరమ వైరాగ్యవంతులు, వేదాంతవేత్తలు అయిన మహారాజులు పాలించిన నేల’ అన్నారు. మిథిల రాజులు కేవలం ధర్మబద్దంగా పాలించాలన్న ఆలోచన తప్ప మరే ఆలోచన లేనివారు. ‘మిథిలాయాం ప్రదీప్తాయాం న మే దహ్యతి కించన’ అన్నది జనక మహారాజు ప్రసిద్ధ వాక్యం. భౌతిక సుఖసంపదల కన్నా ఆత్మజ్ఞానాన్ని నమ్మిన తత్వవేత్తలు మిథిల రాజులు. అందుకే మిథిలను కాజేయాలని కానీ, మిథిలపై దాడి చేయాలని కానీ రాజులెవరూ ఆలోచించేవారు కాదు. ఆ కాలంలో అలా ఆలోచించటాన్ని అధర్మంగా భావించేవారు.

త్రేతాయుగంలోనే కాదు, ద్వాపర యుగంలో కూడా మిథిలరాజులింతే. ద్వాపరలో  మహాభారత యుద్ధం జరిగింది. కంసుడు, జరాసంధుడు, దుర్యోధనుడు వంటి రాజులు పలు యుద్ధాలు చేశారు. కానీ విదేహ రాజ్యం మాత్రం ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రశాంతంగా కొనసాగింది. భీష్ముడు, వ్యాసుడు కూడా ధర్మసూక్ష్మాల ప్రసక్తి వస్తే జనక వంశస్తులను ఉదహరించటం కనిపిస్తుంది. శుకమహర్షి మిథిల వెళ్లి జనకుడిని గురువుగా ఆశ్రయించి బ్రహ్మజ్ఞానం పొందాడు.

‘మిథిలను ఆక్రమించే ప్రయత్నం ఇతర రాజులు చేయలేదు’ అని విశ్వనాథ వ్యాఖ్యానించటం వెనుక ‘ప్రాచీన భారతీయ యుద్ధనీతి’ కూడా  ఉంది. దాన్ని ‘క్షాత్రధర్మం’ అని కూడా అంటారు. ఈ ధర్మం ప్రకారం ఋషులు, తపస్సులు, నిరాయుధులు, జ్ఞాన సముపార్జనకు, ధర్మానికి అంకితమైన రాజులున్న  రాజ్యాలపై దండెత్తటం మహా పాపం. అది క్షత్రియ మర్యాదకు భంగం. విదేహ రాజులు ఎవరితో శత్రుత్వం వహించకపోవటం, ఆ దేశం జ్ఞానవైరాగ్యాలకు పీఠం కావటంతో, ఆ రాజ్యాన్ని ఆక్రమించాలన్న ఆలోచన చేయటం అధర్మం కాబట్టి, ఎవ్వరూ ఆ వైపు చెడు దృష్టితో కన్నెత్తి చూసేవారు కాదు. ఒకవేళ ఎవరైనా అలాంటి దుస్సాహసం చేస్తే, మిగతా రాజులంతా దాన్ని అధర్మంగా భావించి వ్యతిరేకించేవారు.

రామాయణంలో, బాలకాండ, 71వ సర్గ ప్రకారం సాంకశ్యపుర రాజు సుధన్వుడు మిథిలా నగరంపై దండెత్తాడు. దానికి కారణం, అతడికి సీతాదేవిని వివాహమాడాలని, శివధనస్సును సాధించాలని కోరిక ఉండేది. మిథిలను తన రాజ్యంలో కలిపేసుకోవాలన్న ఆలోచనకాదు.

స చ మే ప్రేషయామాస శైవం ధనురనుత్తమమ్।
సీతా కన్యా చ పద్మాక్షీ మహ్యం వై దీయతామితి॥ (బాలకాండ 71.17)

శ్రేష్టమైన ఆ ధనుస్సును పద్మప్రత్రాక్షి అయిన సీతను నాకు అప్పచెప్పమని వార్తను పంపాడు (సుధన్వుడు).

ఈ సందర్భంలో స్పష్టం చేసుకోవాల్సిందేమిటంటే,  మిథిల రాజు ఎవరి మీద దాడి చేయలేదు. మిథిలను ముట్టడించిన సుధన్వుడికి కూడా మిథిలను ఆక్రమించాలన్న ఆశ లేదు. అతడికి సీత కావాలి, శివధనుస్సు కావాలి. అందుకే విశ్వనాథ ‘ఇతర రాజులు ఆ దేశమును ఆక్రమించుటకు ప్రయత్నమే చేయలేదు’ అన్నారు. తస్యా ప్రదానాద్బ్రహ్మర్షే యుద్ధమాసీన్మయా సహ।
స హతోఽభిముఖో రాజా సుధన్వా తు మయా రణే॥ (బాలకాండ 71.18)

సీతను, శివధనుస్సులను ఇవ్వ నిరాకరించగా అతనికి (సుధన్వుడికి) నాకు (జనకుడు) యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో నేను అతడిని వధించాను.

ఇది చెప్పటంలో గొప్ప చెప్పుకోవటం కానీ, కసి ద్వేషం కానీ కనబడదు. కేవలం జరిగింది, ఒక వార్త చెప్పినంత నిర్మోహంగా చెప్తున్నాడు జనకుడు. జనకుడు సుధన్వుడితో యుద్ధం చేయటంకూడా, కర్తవ్య నిర్వహణకోసం, ధర్మం కోసం తప్ప మరొకదానికోసం కాదని తెలుస్తుంది.  దీన్ని బట్టి మిథిల ఎవరిపై దాడి చేయలేదు,  మిథిల ఆక్రమణ కాంక్షతో ఎవరూ యుద్ధం చేయలేదని స్పష్టం అవుతుంది. ఇది తప్ప, అయిదు – ఆరవ శతాబ్దంలో బౌద్ధుల ప్రభావంతో ప్రాచీన విలువలను త్రోసిరాజని అజాతశత్రు ‘విదేహ’ను తన సామ్రాజ్యంలో భాగం చేసుకునే వరకూ మిథిల అధ్యాత్మిక నిలయంగా, ఆత్మజ్ఞాన కేంద్రంగా నిలచింది. తరువాత మిథిల, మిథిల కాదు.  కానీ, రాజతరంగిణిలో విశ్వనాథ యశోవతి గాథ  రాస్తున్న కాలంలో మిథిల  ఆత్మజ్ఞాన కేంద్రంగానే ఉంది. మిథిల రాజులు రాజ్య విస్తరణకాంక్ష ప్రదర్శించలేదు. మిథిలను ఆక్రమించాలని, తన సామ్రాజ్యంలో భాగం చూసుకోవాని ఏ రాజూ దుష్ట భావనను ప్రదర్శించలేదు.

ఇది చరిత్ర ఆధారిత కాల్పనిక రచన,  హిస్టారికల్ ఫిక్షన్‌ను రచించే పద్థతి. ఎలాంటి వ్యాఖ్య చేసినా, ప్రతిపాదన చేసినా దాని వెనుక నిరూపిత సత్యం ఉండాలి. చరిత్రలో ఆధారం ఉండాలి. అది లేకుండా రాస్తే దాన్ని హిస్టారికల్ ఫిక్షన్ రచనగా పరిగిణించకూడదు. అది కేవలం కాల్పనిక రచనగా మిగిలిపోతుంది. హిస్టారికల్ ఫిక్షన్ మాత్రమే కాదు, ఏ రచనలోనైనా, రాసిన వాక్యానికి సత్యం ఆధారంగా ఉండటం వాంఛనీయం.

ఈ సందర్భంగా మరో విషయం ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. పాశ్చాత్య చరిత్రలో కంచుకాగడా పెట్టి వెతికి, కొన్ని రాయితీలు ఇస్తే. చరిత్ర అంచున,  ‘జనకుడి’తో పోల్చగల ఒక్క  రాజు   ‘మార్కస్ ఆరేలియస్’ (క్రీ.శ.161-180) కనిపిస్తాడు. పాశ్చాత్యుల ప్రకారం ప్లాటో ‘రిపబ్లిక్’ గ్రంథంలో ప్రతిపాదిత ‘ఆదర్శ రాజు’కు సంపూర్ణంగా కాకపోయినా కొంతయినా దగ్గరగా వస్తాడీ మార్కస్ అరేలియస్. ప్లాటో ప్రతిపాదించిన ఆదర్శ రాజు కన్నా ఆదర్శ రాజులు ‘విదేహ రాజులు’. పైగా ‘ప్లాటో’ భావించినట్టు ‘ఆరేలియస్’ భౌతిక ప్రపంచానికి అతీతమైన మంచి స్వరూపాన్ని  (form of the good) గ్రహించిన వాడు కాదు. భౌతిక ప్రపంచానికి పరిమితమైన stoicism అతని తత్వం. కాబట్టి ‘జనకుడు’ లాంటి స్థితప్రజ్ఞత కలిగి, తామరాకు మీద నీటి బొట్టులా ప్రవర్తిస్తూ, అన్ని భోగాలు త్యజించి ఆధ్యాత్మిక జ్ఞానార్జనలో జీవితం గడిపే రాజు పాశ్చాత్యుల ఊహకు అందడు. రామాయణం త్రేతాయుగానికి చెందినది. ద్వాపర యుగంలోనూ విదేహ రాజులు అవే విలువలు పాటిస్తున్నారు. వారి ఊహకు అందదు కాబట్టి పురాణాలు కట్టుకథలు, అతిశయోక్తులు, అభూతల కల్పనలు అని వాటిపట్ల భారతీయుల నమ్మకం సడలించారు.పాలకుడు నమ్మనిదాన్ని, పాలితులు ఆదరించటం ఏ పాలకుడూ సహించడు. అందులో, విదేశీపాలకుడు అస్సలు సహించడు.

పురాణాలలో విదేహ  రాజులే కాదు, కల్హణుడి కశ్మీర రాజతరంగిణిలో రెండవ తరంగంలో ‘సంధిమతి’ అనే రాజు, ఒక్క రోజు కూడా రాజధానిలో అడుగు పెట్టలేదు, రాజభవనంలో నివసించలేదు. సకల భోగాలను త్యజించి, రాజ్యానికి ఆవల ఒక పర్ణశాలను నిర్మించుకుని, ఆ పర్ణశాలలో సన్యాసిలా జీవిస్తూ, ప్రతి రోజు సహస్ర శివలింగార్చన తరువాతనే రాచకార్యాలు ఆరంభించేవాడని, రాజ్యం అతడి పర్ణశాల వద్దకే వచ్చేదనీ, అలా ఎలాంటి యుద్ధం చేయకుండా, ఎలాంటి కోరిక, మోహం, భోగంపై ఆశ లేకుండా 47 ఏళ్లు రాజ్యం చేశాడని కల్హణుడు  ఒక రాజు గురించి రాస్తే, అప్పటికే జనకులను అంగీకరించలేక తల బద్దలు కొట్టుకుంటున్న వారికి తాము  చరిత్రగా అంగీకరించిన రాజతరంగిణిలో  ఇలాంటి జీర్ణం కాని రాజు గురించి ఉంటే, దాన్ని, అభూత కల్పన, నమ్మదగినది కాదు, చరిత్ర కాదు అని కొట్టేయటంలో ఆశ్చర్యం లేదు. అందుకే రాజతరంగిణి చరిత్రే కానీ, మొదటి మూడు తరంగాలు కాదు అన్నారు.  పైగా కల్హణుడి లెక్కల ప్రకారం ఆ రాజు క్రీ.పూ 127 ప్రాంతంలో పాలించాడని తేలితే అది అభూత కల్పనలకే అభూత కల్పన అని కొట్టేయటం స్వాభావికం. ఆ రాజు పేరు సంధిమతి. అతడి కథ ఆధారంగా విశ్వనాథ ‘సంజీవకరణి’ అని కశ్మీర రాజతరంగిణి నవల రాశారు.

(ఇంకా ఉంది)

Exit mobile version