[విశ్వనాథ సత్యనారాయణగారి కశ్మీర రాజవంశావళి నవలల సమగ్ర పరిచయం అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
“Who would believe that the Hindus who carried so many sciences to perfection, knew not the simple art of writing history?” (Col. Todd, Author of Annals and Antiquities of Rajasthan).
‘రాజస్థాన్ చరిత్ర పిత’ గా పరిగణించే కలనల్ టూడ్కు వచ్చిన అనుమానం భారతీయులకు రాకపోవటం విదేశీ పాలనలో ఉండటం వల్ల కలిగిన బానిస భావానికి, విదేశీయుల ప్రభావం వల్ల వారికి చేసే భావదాస్యానికి నిదర్శనం.
“Of course, there is no gainsaying the fact that our ancestors have not bequeathed to us any rich and reliable historical work for any early period.” (The Hindu History by Ashok Kumar Majumdar)
విదేశీ చరిత్ర రచయిత కలనల్ టూడ్ ఏ శాస్త్రమయినా లోతులకు వెళ్ళి, సూక్ష్మంగా పరిశోధించి విశ్లేషించే భారతీయులకు చరిత్ర రచన గురించి తెలియకపోవటం నమ్మలేకపోయాడు. ఇన్ని తెలిసిన వారికి ఇదెందుకు తెలియదు అని ప్రశ్నించాడు.
భారతీయలకు మాత్రం ఇలాంటి సందేహం రాలేదు. మన పూర్వీకులు మన ప్రాచీన చరిత్ర గురించి నమ్మదగిన విషయాలేమీ అందిచలేదని ఘంటాపథంగా చెప్తున్నారు.
క్రీ.శ. 1030 ప్రాంతంలో అల్బెరూనీ, సుల్తాన్ మహమ్మద్‌తో పాటు భారత్ వచ్చాడు. ఆయన భారతదేశ చరిత్ర గురించి ఇక్కడి పండితులతో చర్చించాడు. వారు చెప్పినది అతడికి సంతృప్తి కలిగించలేదు. నమ్మదగినదిగా అనిపించ లేదు. ఆయన భారతదేశం గురించి గ్రహించిన విషయాలను “కితాబ్-అల్-హింద్” (దీన్ని తారీఖ్-అల్-హింద్ అని కూడా అంటారు) అనే పుస్తకంలో పొందుపరిచాడు. ఆ పుస్తకంలో ఆయన “The Hindus do not pay much attention to the historical order of things; they are very careless in relating the chronological succession of their kings, and when they are pressed for information and are at a loss, not knowing what to say, they invariably take to tale-telling.” అన్న అభిప్రాయాన్ని వ్యక్తపరచాడు. విదేశీయులు మనల్ని అనాగరికులు, అవిద్యావంతులు అనుకోవటంలో ఆశ్చర్యం లేదు. కానీ, మనవారే మన గురించి చులకన అభిప్రాయం కలిగి ఉండటం, మనము ఎందుకూ పనికిరామని నమ్మటం అసలు సమస్య.
“Of the so-called histories, legendary tales, there’s no lack in India. The Vansavalis of Orissa, Nepal and Mysore; the Pattavalis of the Jain Pontiffs, the historical romances &c – generally pass for good histories; but close examination of them has proved that they are works more of fancy than of correct facts and figures. The only possible exception to these is the Rajatarangini.” (Ashok Kumar Majumdar)
విదేశీయులు ఒప్పుకున్నారు కాబట్టి రాజతరంగిణి చరిత్ర రచన అయింది. ఇది రాజతరంగిణి ప్రాధాన్యం. భారతదేశంలో వంశావళులకు కొరత లేదు. దానాల శాసనాలున్నాయి. విజయ శాసనాలున్నాయి. జానపద కథలున్నాయి. శిథిలాలున్నాయి. నాణేలున్నాయి. కానీ చరిత్ర రచన విషయంలో పాశ్చత్యులు ఏకగ్రీవంగా చరిత్రగా అంగీకరించింది కల్హణుడు రచించిన కశ్మీర రాజ వంశావళిని, కల్హణ రాజతరంగిణి రచనను. కల్హణ రాజతరంగిణిని కూడా విదేశీయులు సంపూర్ణంగా చరిత్రగా అంగీకరించలేదు. అందుకని మనం కూడా మొత్తం రాజతరంగిణిని చరిత్రగా అంగీకరించం.
“The Sanskrit book which comes nearest to the European notion of a regular history is the Rajatarangini of Kalhana, a metrical chronicle of Kashmir, written in the twelfth century by the son of a minister of the Raja.” (Oxford Student History of India by V. A. Smith)
యూరోపియన్లు చరిత్రగా దేన్ని పరిగణిస్తారో దానికి దగ్గరగా వచ్చిన రచన కల్హణ రాజతరంగిణి. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే, ‘European notion of regular history’. భారతీయుల దృష్టిలో చరిత్ర అంటే ఏమిటో వారికి అవసరం లేదు. అసలు భారతీయుల దృష్టి వారికి అవసరం లేదు. వారు పాలకులు. భారతీయులు పరాజితులు. కాబట్టి యూరోపియన్ల దృష్టికే ప్రాధాన్యం. స్వతంత్రం సాధించిన తరువాత కూడా మనము ఈ యూరోపియన్ల దృష్టిలోనే మన చరిత్రను దర్శించటం కొనసాగిస్తూనే ఉండటంలోనే మన పరాజయం, యూరోపియన్ల విజయం ఉంది.
భారతీయులకు చరిత్ర స్పృహనే లేనప్పుడు ఇక వారి దృష్టిలో చరిత్ర అంటే ఏమిటో అని ఆలోచించాల్సిన అవసరం లేదని అనేవారు కొందరున్నారు. కానీ భారతీయులకే కాదు ప్రపంచంలో ఎవరికయినా చరిత్ర స్పృహ ఉంటుంది. ఆ స్పృహను వారి సంస్కృతి, సంప్రదాయం, ధర్మం, మనస్సు, దృష్టి వంటి విషయాలు ప్రభావితం చేస్తాయి.ఎనభై ఏళ్ళ స్వతంత్రం తరువాత కూడా స్వతంత్రపూర్వం పరిస్థితి కొనసాగటం శోచనీయం.
గమనిస్తే, ఆఫ్రికన్ ప్రాచీన చరిత్ర గురించి కూడా యూరోపియన్ కలోనియల్ చరిత్ర రచయితలు ఇదే మాటన్నారు.
“For centuries, 19th and 20th century Western historians claimed that Africa had ‘no history’ because they defined history strictly through European-style linear, alphabetical texts. They dismissed native oral records as myth or unscientific folklore.” (Perspectives on African Historiography, D.D. Yongo & Albert Teryima Anloho)
ఆఫ్రికన్ దేశాలు స్వతంత్రం సాధించిన తరువాత 20వ శతాబ్దంలో, ఆఫ్రికన్ చరిత్ర రచయితలు అంతర్జాతీయ చరిత్ర రచయితలు, ఆఫ్రికా చరిత్ర రచనలో యూరోపియన్ కలోనియల్ చరిత్రవాదులు దృష్టి తప్పు అని, ఆఫ్రికా చరిత్రను యూరోపియన్ కలోనియల్ చరిత్ర రచయిత దృష్టితో చూడకూడదని, పురావస్తు తవ్వకాలు, స్థానిక కావ్యాలు, జానపద గాథలు, చారిత్రక దస్తావేజులు, మౌఖిక సంప్రదాయ పద్ధతులు, ఆంత్రపాలజీ వంటివాటన్నిటినీ పరిగణలోకి తీసుకుని multi-disciplinary approach ఆఫ్రికా చరిత్ర రచనకు తప్పనిసరి అని తీర్మానించారు. ఆఫ్రికా చరిత్రను ఈ దృక్కోణంలో తిరిగి రచించటం ఆరంభించారు.
“Today, mainstream historians view native African ancient history writing as dynamic, oral-textual and deeply institutionalised. Rather than viewing Africa as a continent without writing, scholars treat oral traditions and indigenous records as rigorous historical sources that require specialised cross-verification first like any ancient European or African archive.” (Perspective on African Historiography).
తమను బానిసలుగా, అనాగరికులుగా భావిస్తూ, తమపై రాజ్యం చేసిన వారు రాసిన తమ చరిత్రను ఆఫ్రికన్లు తిరస్కరించి తమ చరిత్రను తమ ఆధారాలను తమ దృష్టిలో తాము విశ్లేషిస్తూ రచిస్తున్నారు. మనం మాత్రం ఎప్పుడో పర్గేటరీ( క్రైస్తవుల నరకం)కు పంపించాల్సిన “పర్గీటర్” ను ఇప్పటికీ ప్రామాణికంగా భావిస్తున్నాం. ఆయన ఏంచెప్పాడో దాన్నే వల్లె వేస్తున్నాం. కాదన్నవాడిని అభివృద్ధి నిరోధకుడని పక్కకు తోసేస్తున్నాం.
ఇలా తమ చరిత్రను నిర్మిచుకోవటంలో ఆఫ్రికన్లకు ‘గ్రియోట్’ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతోంది. ‘గ్రియోట్’లు ఆఫ్రికా చరిత్రను, సంప్రదాయాలను సంస్కృతిని న్యాయశాస్త్రాలను విజ్ఞానశాస్త్రాలను మౌఖికంగా నేర్చి, ఊరూరా తిరిగి చెప్తూంటారు. ఇంతే కాదు, గ్రియోట్లు ఒక ఊరికి వెళ్తే ఆ ఊళ్లో ఒక్కొక్కరి పూర్వ చరిత్రను వారికి వినిపిస్తారు. ‘రూట్స్’ రచించిన అలెక్స్ హేలీ, ఇలాంటి గ్రియోట్ల ద్వారానే తమ పూర్వీకుడు ‘కుంటా కింటే’ను బానిసగా ఎత్తుకుపోయారని తెలుసుకున్నాడు. స్వతంత్ర ఆఫ్రికా చరిత్ర రచయితలు ‘గ్రియోట్’ల ద్వారా అందుతున్న చరిత్రను ప్రామాణిక చరిత్రగా పరిగణిస్తున్నారు. ప్రపంచ చరిత్ర పరిశోధకులు ఇందుకు ఆమోదం తెలిపారు. మనవారిని మనమే ఒప్పుకోనప్పుడు విదేశీయులు ఆమోదించాలని ఆలోచించటం కుదరదు.
ప్రాచీన భారతంలో వంశావళులను, వంశవృక్షాలను మౌఖికంగా నేర్పడం, ఊరూరా తిరిగి వ్యక్తుల వంశవృక్షాలు చెప్పడం, రాజ్యసభల్లో రాజుల వంశవృక్షాలు చెప్పటం ఒక పవిత్ర కార్యంగా, గొప్ప కళగా భావించేవారు. మన ప్రాచీన గ్రంథాలు సైతం వంశావళులు, వంశ చరిత్రలను తమలో పొదుగుకున్నాయి.
ఒక రచన ‘పురాణం’గా పరిగణనకు గురవ్వాలంటే దానికి ఉండాల్సిన అయిదు లక్షణాలలో మూడు లక్షణాలు వంశ చరిత్రలకు సంబంధించినవే. ప్రతి పురాణంలో వంశం, మన్వంతరం, వంశానుచరితం తప్పనిసరి. వంశంలో ఋషులు, దేవతలు, మూల పురుషుల వివరాలుంటాయి. మన్వంతరంలో మూల పురుషులయిన మానవుల కార్యక్రమ చరిత్ర, కాలగణన ఉంటుంది. వంశానుచరితంలో రాజుల వంశ వృక్షాలుంటాయి.
ఆఫ్రికాలో ‘గ్రియోట్’ల లాగా మన దేశంలో ‘సూతులు’, ‘మాగధులు’ (చారణులు) ఉండేవారు. అప్పటికి ఇంకా ‘వ్రాత’ రాలేదు కాబట్టి, వీరంతా నోటి మాట ద్వారా ప్రచారం చేసేవారు. ‘సూతులు’ దేవుళ్లు, ఋషులు, రాజుల వంశ చరిత్రలను కథల రూపంలో ప్రజలకు ఊరూరూ తిరిగి చెప్పేవారు. రాజుల ఆస్థానంలో ఉండి, పట్టాభిషేకాలు, యజ్ఞాలు ఇతర సంబరాలు జరిగినప్పుడు రాజుల పూర్వీకుల గురించి, వారి పరాక్రమాల గురించి చెప్పేవారు.
ప్రపంచంలోని ఇతర ఏ నాగరికతలో లేని రీతిలో భారతీయులకే ప్రత్యేకమయిన ‘భవిష్య పురాణం’ ఇక్కడ ఉంది. ఇదంతా భవిష్యత్తులో రాబోయే రాజవంశాలు, వారి పాలన కాలం వంటి వివరాలతో ఉంటుంది. ఈ చరిత్ర మొత్తం భవిష్యత్ కాలంలో (future tense) లో ఉంటుంది.
సూతులు, చారణులు కాక ప్రతి ప్రధాన తీర్థయాత్ర స్థలాల్లో తీర్థయాత్రల రికార్డులండేవి. వారణాశి, గయ, హరిద్వార్ వంటి క్షేత్రాలలో పండాలు శతాబ్దాలుగా పెద్ద పెద్ద పుస్తకాలలో వంశావళులు రాస్తారు. వీటిని ‘వహీ’లంటారు. పితృదేవతలకు కర్మలు చేయటానికి ఈ క్షేత్రాలకు వెళ్లినప్పుడు వంశం, గోత్రం, ఊరు, పూర్వీకుల పేర్లు వంటి వివరాలు తెలుసుకుని, వాటిని ఆ పుస్తకంలో రాసి పెట్టుకుంటారు. అలా దాదాపుగా 10-15 తరాల వరకూ పూర్వీకుల వివరాలు వీరి ‘వహీ’లలో లభిస్తాయి.
తెలుగు వారి ‘ఆత్మకథ’గా ప్రసిద్ధి పొందిన సురవరం ప్రతాపరెడ్డి గారి ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ రచనను గాథాసప్తశతి, కావ్యాలు, ప్రబంధాలు, పురాణాలు, జానపద గీతాలు వంటి వాటిని శాసనాలు, నాణేలు, విదేశీయుల రచనల వంటి వాటితో కలపి ప్రామాణికంగా భావించి రచించారు. అంటే ఆధునిక ఆఫ్రికన్ రచయితలు ఎలా ‘గ్రియోట్’లను ప్రామాణికంగా భావించి తమ చరిత్ర రచనను కొనసాగిస్తున్నారో, అలాగే సురవరం ప్రతాపరెడ్డి గారు కావ్యాలు, జానపద గీతాలు వంటి వాటిని ప్రామాణికంగా భావించారన్న మాట.
ఎలాగయితే స్వతంత్రం వచ్చిన తరువాత ఆఫ్రికన్ చరిత్ర రచయితలు ‘European notion of History’ ని తిరస్కరించి తమ దృక్కోణంలో తమ చరిత్రను విశ్లేషించి రాస్తున్నారో, కొందరు ఆత్మగౌరవం కల భారతీయులు స్వతంత్రం రాక ముందునుంచే, బ్రిటిష్ వారి ‘చరిత్ర దృష్టి’ని తిరస్కరించి, భారతీయ దృక్కోణంలో చరిత్రను నిరూపించటం ప్రారంభించారు.
మాములుగా చరిత్ర రచనకు ఉపయోగించే అంశాలే కాకుండా భారతీయ చరిత్ర రచయితలు మన ప్రాచీన గ్రంథాలలో, కావ్యాలలో, శాస్త్రాలలో పొందుపరిచిన ఖగోళ సంబంధిత వివరాల ఆధారంగా కాల గణనను నిర్ణయించారు. ఆ కాలాన్ని ప్రామాణికంగా తీసుకుని భారతీయ చరిత్రను నిరూపించారు. కానీ ఇలా నిరూపించిన చరిత్రను చరిత్రగా ఆమోదించేందుకు పాశ్చాత్యులు ఇష్టపడలేదు. పాశ్చాత్య ప్రభావితులు ఇష్టపడలేదు. స్వతంత్రం తరువాత చరిత్రకారులుగా గుర్తింపు పొందినవారు ఇష్టపడలేదు. వారిని అనుసరిస్తూ వస్తున్నవారు ఇప్పుడూ ఇష్టపడటం లేదు. చివరికి కొత్త తరం వారు కూడా ఇష్టపడటం లేదు.
కానీ సత్యానికి ఎవరి ఇష్టాయిష్టాలతో పని లేదు. అందుకే మనకు అందుబాటులో ఉన్న అన్ని ఆధారాల ద్వారా మన చరిత్రను నిర్మిస్తూనే ఉన్నారు. అలా నిర్మించిన చరిత్ర సామాన్యులలోకి తీసుకు వెళ్ళేందుకు సృజనాత్మక రచయితగా విశ్వనాథ తన బాధ్యతను నిర్వహించే ప్రక్రియలో రాజతరంగిణి నవలలను రచించారు.
రాజతరంగిణిని పాశ్యాత్యులు తమ చరిత్ర దృష్టికి దగ్గరగా ఉన్నదని అంగీకరించారు. కానీ రాజతరంగిణి మొత్తాన్ని చరిత్రగా అంగీకరించలేదు. రాజతరంగిణిలో వారి బుద్ధికి బాహిరమైన విషయాలను వారు చరిత్ర కాదని, అభూతకల్పన అనీ కొట్టిపారేశారు. ఇంతేకాక, రాజతరంగిణిలో కల్హణుడు తేదీలను తప్పుగా ఇచ్చాడని, తాము నిర్ణయించిన తేదీలతో కల్హణుడు ఇచ్చిన తేదీలు సరిపోవటం లేదు కాబట్టి, కల్హణుడి రచన చరిత్రనే అయినా తేదీల పరంగా కల్హణుడు రాసినది పొరపాటు అని తీర్మానించారు. ఈ నిర్ణయం తీసుకోవటంలో వారు భారతీయ దృష్టి కన్నా పాశ్చాత్య దృష్టికే ప్రాధాన్యం ఇచ్చారు. సాహిత్య విమర్శలో ఇప్పటి దృష్టితో అప్పటి రచనలను విమర్శించటం ఎంత కూడని పనో, భారతీయ చరిత్రను యూరోపియన్ దృష్టితో రచించటం కూడా అంతే కాని పని.
ఈ విషయం మన దృక్కోణంలో చరిత్ర రచించిన వారు స్పష్టం చేశారు. పాశ్చాత్యుల దృష్టి భౌతికం. వారికి ఇంద్రియ పరిజ్ఞానమే జ్ఞానం. కానీ భారతీయుల దృష్టిలో ఇంద్రియ జ్ఞానం అసంపూర్ణం. ఇంద్రియాలు దారి తప్పిస్తాయి. మోసం చేస్తాయి. కాబట్టి ఇంద్రియాతీతంగా సాధించిన జ్ఞానం అసలు జ్ఞానం. ఇక్కడే వారి దృష్టికీ, మన దృష్టికీ అన్ని అంశాలలో తేడా వస్తుంది. మనం కూడా మన అంశాలను వారి దృష్టితో చూస్తే మనకూ వారికి కనబడ్డవే కనిపిస్తాయి. వారి లాగే మనమూ ఆలోచిస్తాము.
రాజతరంగిణి మహా భారత యుద్ధం ముందు కాలం నుంచి ఆరంభమవుతుంది. భారతీయ చరిత్ర రచయితలు కలి ఆరంభం నుంచి లెక్కలు కట్టారు. ఎందుకంటే మనకు యుధిష్టర యుగం, కలియుగం, సప్తర్షి యుగం ఉన్నాయి. మన పురాణాలలో తేదీలన్నీ ఈ శకాల ఆధారంగా ఇచ్చినవి. కలి యుగం క్రీపూ 3102 సంవత్సరంలో ఫిబ్రవరీ నెల, 20తేదీన, 2 గంటల 27 నిముషాల 30 సెకన్లకు ఆరంభమయింది. దీనికన్నా ముప్పయి ఆరు సంవత్సరాల ముందు మహాభారత యుద్ధం జరిగింది. కలియుగం ఆరంభమయిన ఇరవై ఆరేళ్ళకు( క్రీపూ 3076) పాండవుల మహాప్రస్థానం మొదలయింది. ఇది సప్తర్షి శకం లేక లౌకిక శకం ఆరంభం. రాజతరంగిణి రచన సమయంలో ఈ లౌకికాబ్దం లెక్కలు అమలులో ఉండేవి. కల్హణుడు ఇచ్చిన తేదీలన్నీ లౌకిక శకం, లేక లౌకికాబ్దం ఆధారంగా ఇచ్చినవి. ఇదీ మనలెక్క. దీనికి ఆధారాలున్నాయి. ఆ ఆధారాల ప్రకారం ఎవరు గణించినా ఇదే ఫలితం వస్తుంది. when an experiment is replicated by scientists of different laboratories at any time and get the same result, then the fact can be considered to have been established అంటుంది విజ్ఞానశాస్త్రం. కానీ, వేదాలు రచించిందే క్రీపూ పదిహేనువందల శతాబ్దమయితే, మహాభారత యుద్ధం అంతకన్నా వేల ఏళ్ళ ముందు జరగటం అసంభవం. కాబట్టి భారతీయులకు చరిత్ర స్పృహలేదు పొమ్మన్నారు. అవునన్నారు మనవాళ్ళు. కాదన్నవాళ్ళు ఛాందసులయ్యారు.
కల్హణుడు లౌకికాబ్దం ఆధారంగా కశ్మీర్ లెక్కలు కట్టి తన రచనలో ప్రదర్శించాడు. యూరోపియన్ చరిత్ర రచయితలు దీన్ని విస్మరించి అలెగ్జాండర్ దండయాత్ర నుంచి లెక్కలు ప్రారంభించారు. అక్కడ కూడా గుప్త చంద్రగుప్తుడిని మౌర్య చంద్రగుప్తుడు చేశారు. దాంతో మన లెక్కలకూ వారి లెక్కలకూ దాదాపుగా 1200 సంవత్సరాల తేడా వచ్చింది. దీంతో రాజతరంగిణిలో చెప్పిన రాజుల కాలాలు యూరోపియన్, చరిత్ర రచయితలు స్థిరీకరించిన రాజుల కాలాలతో సరిపోవటం లేదు. అందుకని కల్హణుడు పొరపాటు పడ్డాడని తీర్మానించి, కల్హణుడు రచించిన రాజతరంగిణి మొత్తం చరిత్ర కాదు, మొదటి కొన్ని తరంగాలన్నీ అభూత కల్పనలు అని ఎలాంటి చర్చ, పరిశోధన లేకుండా తీర్మానించేశారు. భారతీయులకు చరిత్ర గురించి స్పృహ లేదు, కాల గణన రాదు పొమ్మని; వారు నిర్ణయించిందే సరైనది అన్నారు. ఇప్పటికీ మనం అదే నిజమని నమ్ముతున్నాము. భారతీయ దృక్కోణంలోని చరిత్ర రచయితలకూ, పాశ్చాత్య దృక్కోణ చరిత్ర రచయితలకూ నడుమ వివాదానికి కారణం ఇది.
“వారు మన పురాణాదులలో వారికిష్టము వచ్చిన విషయములను తీసుకొనుట, యిష్టము లేనివి పరిహరించుట. తబ్బిబ్బు చేయుట, తారుమారుగా వ్రాయుట, కొందరు క్షత్రియులైన రాజులను హుణులుగా చిత్రించుట, దైవికములైన విషయాలను నిరాకరించుట, మొదలైన యనేకములైన వారి యాధునిక పదార్థ తత్త్వబుద్ధితో చేసిరి” అని మరో రాజతరంగిణి నవల ‘కవలలు’ ముందుమాటలో స్పష్టం చేసి, “ఈ నవలల రచన నవల నవలగా వ్రాయుటయే గానీ దాని యందు, కశ్మీరు రాజుల చరిత్ర, వారి కాలము, పాశ్చాత్యులు నిరూపించిన కాలములోని దోషములు మొదలైనవి నిరూపించుట వుండును. ఈ కాలమున నవల బహుజన ప్రియమైన పఠనము కలది గనుక మన పూర్వ రాజుల చరిత్రలు, సరియైన కాలములు, వీని నుండి జన సామాన్యము కొంత కాకపోయిన కొంతయైనను తెలుసుకొందురన్న వూహతోనే నవలలు గానీ, పురాణవైర గ్రంథమాలలోని నవలలను గాని వ్రాయబడినవి.
అచ్చముగా నిజమైన మన పూర్వ చరిత్ర యెట్టిదో తెలిసికొనలెనను బుద్ది పలుమందికుండదు. నవలల ద్వారా యీ విషయము కొంత బహుపాఠకులకు కలిగించునూహతో, నాయీ ప్రయత్నము” అని మరింత స్పష్టంగా వివరించారు.
ఈ దృక్కోణంలోంచి చూస్తే ఎనిమిది తరంగాలలో, మహాభారత యుద్ధం కన్నా ముందు క్రీ.పూ.3138 నుంచి, క్రీ.శ.1148 వరకు ఉన్న చరిత్రలోని ఈ ఆరు గాథలను మాత్రమే విశ్వనాథ వారు నవలలుగా మలచటం, వాటిల్లో ఆయన పొందుపరచిన అంశాలు, చర్చించిన విషయాల గురించి ఒక అవగాహన వస్తుంది.
(ఇంకా ఉంది)
కస్తూరి మురళీకృష్ణ ప్రసిద్ధ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని అందిస్తున్నారు. కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, హారర్, క్రైమ్ తదితర పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.
కథాసంపుటాలు: 4 x 5, ఆ అరగంట చాలు, భారతీయ ప్రేమ కథామాలిక, ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, జాతక కథలు, థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు, ప్రపంచ ప్రేమ కథామాలిక,
నవలలు: ముస్సోలిని, పునఃసృష్టికి పురిటి నొప్పులు, సౌశీల్య ద్రౌపది, రోషనార, శ్రీకృష్ణదేవరాయలు, అసిధార, అంతర్మథనం, మర్మయోగం, అంతర్యాగం, ఆపరేషన్ బద్ర్, జగమే మారినదీ..,
అనువాద రచనలు: కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, జోనరాజ రాజతరంగిణి, నీలమత పురాణం, నిజాం పాలన చివరి రోజులు,
వ్యాస సంపుటాలు: తీవ్రవాదం, శైశవ గీతి, అక్షరాంజలి, మనం మరువకూడని మహాయుద్ధం 1857, ప్రాచీన విజ్ఞానం, భారతీయ తత్త్వచింతన, భారతీయ వ్యక్తిత్వ వికాసం, రియల్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్-1, మన ప్రధానమంత్రులు, మన తెలుగు ముఖ్యమంత్రులు,
బయోగ్రఫీలు: మైకేల్ జాన్సన్, సంగీత సరస్వతి లతామంగేష్కర్,
సినిమా పుస్తకాలు: పాడుతా తీయగా, కమర్షియల్ క్లాసిక్స్, నవల నుంచి సినిమాకు,
సంపాదకత్వం/సంకలనాలు: తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులం కథ, రైలు కథలు, క్రీడా కథ, దేశభక్తి కథలు, రామకథాసుధ
పురస్కారాలు/బహుమతులు: 1995లో ఆంధ్రప్రభ ‘దీపావళి’ నవలల పోటీలో ‘అంతర్యాగం‘ నవలకు ద్వితీయ బహుమతి. 1999 లో ఆంధ్రభూమి సస్పెన్స్ నవలల పోటీలో ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి. 2017 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం గ్రహీత.
~
కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు కన్నడంలోకి; థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు ఒడియాలోకి, మరాఠీలోకి అనువాదమయ్యాయి. ‘పాడుగా తీయగా’ హిందీలోకి అనువాదమవుతోంది.
