Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జానపదసాహిత్యంలో ఆహారవైద్య విశేషాలు

[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘జానపదసాహిత్యంలో ఆహారవైద్య విశేషాలు’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

ఆచార్యవర్యులు బిరుదురాజు రామరాజు, టేకుమళ్ళ కామేశ్వరరావు, నాయని కృష్ణకుమారి, జి మోహన్, ఆర్.వి.యస్ సుందరం, నేదునూరి గంగాధరం, ఆచార్య భక్తవత్సల రెడ్డి ప్రభృతులు జానపదగీతాల విశ్లేషణ చేసిన ప్రముఖులు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కూడా అనేక జానపద గేయాలను సూచించారు. జానపదగీతాలలో వైద్య ప్రశంసలెన్నో వీళ్ళ సేకరణలో మనం చూడవచ్చు. జానపదులు చేసే వైద్య ప్రయోగాలను కొప్పుల హేమాద్రి, డా. టి.వి.వి సీతారామిరెడ్డి ప్రభృతులు గ్రంథస్థం చేశారు.

‘కాళ్ళా గజ్జీ కంకాళమ్మా’ గీతంలో కాళ్ళకొచ్చే ఎగ్జీమాకి ఫార్ములా ఉందని తి.ప. రామానుజ స్వామిగారిని ఉదహరిస్తూ ఆచార్య బిరుదురాజు రామరాజు గారు కొన్ని ఫార్ములాలను ఉదహరించారు. జానపద సాహిత్యం ఆధారంగా నా సేకరణలో దొరికిన కొన్ని ఆహారవైద్య విశేషాలు కొన్ని మీ ముందుంచుతాను. చిన్న పొడుపు కథ:

వంకరటింకర వ= శొంఠి
వానితమ్ముడు అ= అల్లం
నల్ల గుడ్ల మి = మిరియం
నాలగుకాళ్ళ మే =మేక

జానపద గీతాల్లో పొడుపు కథలు కూడా అందంగా ఆ లయలో ఇమిడిపోయాయి ఇలా!

చమ్మచక్క

కొన్నింటిలో దైనందిన జీవితానికి సంబంధించిన అనేక అంశాలు నర్మగర్బంగా సూచితం కావటం కూడా గమనించవచ్చు. చమ్మచెక్క చేరడేసి మొగ్గ బాలలగేయాన్ని విశ్లేషిద్దాం:

“చమ్మచక్క.. చారడేసి మొగ్గా..
అట్లుపొయ్యంగా.. ఆరగించంగా..! (బాలక్రీడా విశేషం)

చమ్మచక్క ఏమిటీ? చారడేసి మొగ్గేమిటి? ఆ తరువాత అట్లుపోయడం ఏమిటీ? అట్లను పోసేందుకు ముందు ఎంత శ్రమ ఉంటుందో, అమ్మ ఎంత కష్టపడితే వంట తయారౌతుందో పిల్లలకు తెలియచెప్పే పాట ఇది.

గోధుమ పిండిని మర్దించి చిన్న ఉండగా చేసి, బిళ్ళలా నొక్కి రెండు అరచేతుల మధ్య ఉంచి చమరుతూ అంటే తడుతూ ఉంటే అది గుండ్రంగా చక్రంలా సాగుతుంది. చమరి చక్రంలా తట్టింది ‘చమ్మచక్క’. చక్రానికి చక్క అనేది చక్రానికి పిల్లల భాషా రూపం. ఇలా ‘చమ్మచక్క’ కొడితే అది చారెడంత అవుతుంది. దాన్ని పిల్లిమొగ్గలు, నెమలిమొగ్గలు వేయించి గిర్రున తిప్పుతుంటే ఆ చక్రం మరింత పెద్దదిగా సాగుతుంది.‘చారెడేసి మొగ్గ’ అంటే ఇది. నూనెలో వేగించిన పూరీ కన్నా చమ్మచెక్కకొట్టి నిప్పులమీద కాల్చిన రోటీ ఆరోగ్యానికి మంచిదని!

జానపద శైలిలో వంట చేయటం

చిత్తూరు జిల్లా ‘కంగుంది’లో ప్రతి ఏడాదీ మహాభారత సప్తాహాలు జరుగుతాయి. అప్పుడు 7 రోజులూ జానపద మహాభారత నాటకం ప్రదర్శిస్తారు. విరటుడి కొలువుకు ఒక మల్లయోధుడు వచ్చి అందరినీ ఓడించినప్పుడు వంటవాడిగా ఉన్న భీముణ్ణి పిలిపిస్తారు. భీముడికీ ఆ మల్లయోధుడికీ మధ్య జరిగిన సంభాషణ ఇది.

“వంటవాడివి, తింటానికే పనికొస్తావు. అరిసెలు, పిండి వంటలు, అప్పడాలు, మండిగెలు, సండిగెలు, గారెలు, బూరెలు, పేణీలు, వడలు, హోలిగలు, అప్పచ్చులు-వీటిని కుప్పలు కుప్పలుగా పోసుకుని నెయ్యద్ది చప్పరిస్తూ మింగి, దొడ్డకాగులాగా బానకడుపు పెంచుకుని నిండుచూలాలైన బర్రెలాగా బుసకొడ్తూ మల్లయుద్ధాని కొచ్చిన తిండిపోతా!” అని వలలుణ్ణి ఆ జెట్టి యద్దేవా చేస్తాడు.

“అరచేతిన తట్టివేతునా” అన్నాడు వలలుడు.

“రొట్టె చేసినట్టా” అని హేళన చేశాడు జెట్టి.

“మెత్తగా నొత్తి మడచి వేతునా”

“హోలళిగె (బొబ్బట్టు) లాగానా?”

“ఓరీ నిన్ను కాలన్‌ దన్ని నేలన్‌ పొర్ల్ణింతునా?”

“పూర్ణమ కుడుములాగానా?”

“బండతో మెదపిముద్ద జేతునా?”

“గోధుమపిండి లాగానా?”

“నీ కండ్ల రక్తము దింతునా”

“కూటికుండ దించినట్లా?”

“నీ కండ క్రొవ్వు కరిగింతునా?”

“నేతి కడవలా?”

“నీ కాల్లు చేతులు విరతునా?

“వంటకట్టెలా?”

ఇలా ఆ జెట్టి వలలుణ్ణి రెచ్చగొడతాడు. చివరికి వలలుడి చేతిలో వాడు చస్తాడు.

రోటీల్లాంటి వంటకాలు చేయటంలో వ్యాయామం ఎంత ఉంటుందో ఈ జానపద ప్రదర్శన చెప్తుంది. ఆడవాళ్లు ఇంట్లో వంట చేసుకోవటం మాత్రమే కదా అంటారు. ఒక వస్తాదు చేసేంత కసరత్తు వంట చేయటంలో ఉంటుంది.

వాతాపి జీర్ణం

‘జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం-
అర్జునుడు తిన్న అరటి పళ్లు,
భీముడు తిన్న పిండివంటలు,
గణపతి తిన్న ఖజ్జాలు,
అబ్బాయి తాగిన పాలు,
ఆముదం అరిగిపోవాలి..
అడవిపంది లాగా పాకి,
నందిలా నడిచి, గుర్రంలా పరుగెత్తి,
ఏనుగంత సత్తువు ఉండేలా
సాకుమీ ఈ బిడ్డను సంజీవరాయా..’

వాతాపి ఖల్వలుల కథ తెలిసిందే! అగస్త్యుడి కడుపులో వాతాపి జీర్ణమయినట్టే, తన బిడ్డకు పెట్టిన ఉగ్గు కూడా జీర్ణం కావాలని కోరుకుంటూ తల్లి ఈ గేయాన్ని ఆలపిస్తుంది. వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ‘బాలభాష’ గ్రంథంలో ఈ వాతాపిజీర్ణం గేయాన్ని ఉదహరించారు. సంజీవరాయుడంటే హనుమ!

కొర్ర చలిమిడి

“కొయ్యన్న కొఱ్ఱచేను దంచన్న పిండి
పొయ్యన్న నూనె వదిన వెయ్యన్న బెల్లం
చేట తడిగాకన్న చెయ్యంటకన్న
చేతి చలిమిడి చేసి నాకు బంపు వదిన”

ఈ జానపద గీతంలోని ఈ చరణం చేతిచలిమిడి ఎలా చెయ్యాలో చెప్తోంది. కొర్రపిండి, బెల్లం, కొద్దిగా నూనెతో చేటకి తడి కాకుండా చెయ్యంటకుండా ‘చేతిచలిమిడి’ చేసి పంపమని మరిది వదినని కోరతాడీ పాటలో. మృదుత్వం కోసం ఈ పిండిని రోట్లోవేసి దంచేవారు కూడా! ‘ఉలూఖల శేష న్యాయం’ అంటే రోట్లో దంచగా మిగిలిందని సంస్కృత న్యాయం ఒకటుంది. దాన్ని బట్టి తెలుగులో ఒక సామెత కూడా ఏర్పడింది: “చలిమిడి పెడితే తింటానికి మొగమాటపడి ఓ కొత్తల్లుడు రోట్లో తలదూర్చి అందులో మిగిలిన చలిమిడి నాకినట్లు-అని దీని భావం.

వేవిళ్ళపాట

వామనావతార ఘట్టంలో వామనుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒక్కో నెల ఆ తల్లి ఏమి తినాలని కోరిందో వేవిళ్ళను ఈ జానపద గీతం వర్ణిస్తుంది

“ఒక్కో మాసం నెల తన గర్భిణి
ఓనగాయ కోరే.. చెలియా ఓనగాయగోరే
రెండో మాసం నెల తన గర్భిణీ
రేగు పండ్లు గోరే చెలియా రేగు పండ్లు గోరే

ఇలా ఓనగాయ వామన చింతకాయలు, రేగుపండ్లు, ములకపండ్లు, నారికేళము, అరటిపండ్లుఇ, ఆవుపాలు, వెన్నముద్ద, వెలగపండు, దోసపండు వరుసగా 10 నెలలకూ 10 రకాల ఆహారాలను గర్భవతులకు హితమైనవిగా ఈ గీతం సూచిస్తుంది.

బువ్వంబంతి

“సీతారాముల బువ్వము బంతి చూడగ చోద్యమాయె!
రాముల బువ్వము ఏమని పొగడుదు
చూడనెంతో శృంగారము రామచంద్రుల బువ్వము”

“నాయనా! బువ్వపెడతాను రారా” అని తల్లి పిల్లవాణ్ణి బుజ్జగించటంలో కమ్మనైన అన్నం అనేదే ధ్వని! ‘బువ్వకుడుపు’ అంటే అన్నప్రాశన కార్యక్రమం. బువ్వంబంతి అంటే పెళ్ళివారంత వరుసగా కూర్చుని పరిహాసాలాడుకుంటూ సరదాగా చేసే ఖరీదైన విందు. మొదటిరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన విందుని

‘తొలిబువ్వం’ అనీ, మూణ్ణిద్రలయ్యాక జరిపే విందుని ‘హరిబువ్వం’ అనీ అంటారు. తెలుగులో బువ్వ అంటే కడుపు నింపే ఖరీదైన బువ్వ అని! ఏ పెళ్ళి శుభలేఖ మీద “బువ్వ మధ్యాహ్నం 12 గంటల నుండీ” అని వ్రాస్తారో ఆ రోజు తెలుగు భాషకు వెలుగు వచ్చినట్టు!

వలపుచద్ది

“తెలతెల వారఁగానే తెఱవ మొగము చూచి/వలపు చద్ది గట్టుక వచ్చితివి” అంటుందో అన్నమయ్య పదం.

మనది మౌలికంగా వ్యవసాయ సంస్కృతి. రాత్రిపూట ఓ గిన్నెలో అన్నం మునిగే దాకా నీళ్లుపోసి ఉంచి, ఉదయం అందులో చల్ల కలుపుకొని తిని పొలంపనులకు పోయేవాళ్లు రైతులు. దీన్ని‘తరవాణిచద్ది’ అంటారు. ఇది తెలుగువారి ఉదయం ఉపాహారం (breakfast).

దూరప్రయాణాల కోసం ప్రొద్దున్నే బయల్దేరేవారు కాబట్టి, రాత్రే అన్నం వండి ఊరుగాయ పచ్చడి వేసి చద్దిగుడ్డలో మూటగట్టి భుజాన తగిలించుకుని వెళ్లేవాళ్లు. దాన్ని ‘దోవకూడుచద్ది’ అంటారు. చద్ది మూటగట్టడానికి ఉత్తరీయం ఉపయోగిస్తుంది. ఉత్తరీయంలోనే చద్ది తినేసే వారు. పెద్దలమాట చద్దన్నం మూట అన్నారు కదా! గొంగళి కప్పుకుని తిరిగే వాళ్లని బట్టి గొంగట్లో అన్నం తింటూ వెంట్రుక లొచ్చాయని గొణగవద్దనే సామెత వచ్చింది.

‘గ్ధిః’ అంటే పెరుగన్నం. సగ్ధిః అంటే ఉదయాన్నే కలిసి కూర్చుని అందరూ పెరుగన్నం తినటం. ఈ సగ్ధిః అనే సంస్కృతపదం చద్దిగా మారి ఉండవచ్చు. కృష్ణుడి చుట్టూరా, తామరరేకుల్లా గోపబాలురు కూర్చుని, రాతి పలకల్నో, తామరాకుల్నో కంచాలుగా చేసుకుని, అందరూ కలిసి ఒకరిదొకరు పంచుకుంటూ చల్దు లారగించినట్టు పోతనగారు వర్ణించారు. ఇలా సమూహంగా చల్దులారగించారని పోతనగారి వర్ణన. తెలుగులో ‘బంతి కుడుపు’, చాపకూడు, ఇంగ్లీషులో Potluck అంటారు. ఎవరింట్లోంచి వాళ్లు తెచ్చుకున్న అన్నాల్ని అందరికీ పంచుతూ కలిసి తినటం చల్దులారగించటం అని!

వంటకాల గుణాలు తెలిపే పాట

“బూరెలు వండితె బురబురమంటయి
గారెలు వండితె గరగర మంటయి
అరిసెలు వండత్తో ఓ యత్తమ్మా
అరిసెలు వండత్తో.. దింతక దింతక దిగిదిగితై”

గారెలు బురబుర మంటాయిట. అంటే పొంగుతాయి అని. అవి తింటే కడుపు ఉబ్బరం అని అంతరార్థం. గారెలు గరగర అంటాయి అంటే కఠినంగా అరుగుతాయి అని. అందుకని వత్తి నూనంతా పిండేస్తారు కాబట్టి అరిసెలే నయం అని ఈ కొత్త అల్లుడి భావం. అరిసెల్ని నూనెలు వేగించకుండా వత్తి నిప్పులమీదగానీ పెనం మీద గానీ కాల్చి తినే అలవాటు కూడా ఉండెది. వీటిని నిప్పట్లు అంటారు. బహుశా, ఆ కొత్తల్లుడు తేలికగా అరుగుతాయని ఈ కాల్చిన అరిసెలు అడిగి ఉంటాడు.

సరుకులేని అల్లుడు

“అల్లుడొచ్చా డొల్లకాడు
అరిసె లొండా నొల్లకాడు
ఒడ్డూ పొడుగూ ఒల్లకాడు
ఒక్క ముక్క ముట్ట డొల్లకాడు
ఆడేం తిన్నాడా డొల్లకాడు
నేనేం పెట్టా నా వొల్లకాడు!”

దేవులపల్లి కృష్ణశాస్త్రి సేకరించిన ఆడపిల్లల పాటల్లో ఇదొకటి. ఆ వచ్చిన వాడు డొల్లకాడు, అంటే లోపల సరుకులేనివాడని! నొల్లకాడు అంటే నోట్లోవేలేసుకుని చప్పరించేవాడు. అతని కోసం అరిసెలు వండిందట, ‘ఒల్లకాడు’ అంటే సన్నగా పొడవుగా గడబొంగులా ఉంటాడట. అరిసె ఒక్కముక్కకూడా తినలేకపోయాడు. “వాడేం తిన్నాడు వట్టి డొల్లకాడు. నేనేం పెట్టాను నా వల్లకాడు” అంటుందీ పాటలో మరదలు పిల్ల. అరిసెల్ని అతిరసాలని, నిప్పట్లని కూడా పిలుస్తారు. నెయ్యీ, నూనెల్లో వేగించకుండా, పుల్కాల మాదిరిగా నిప్పులపైన కాల్చినవి నిప్పట్లు కావచ్చు.

ఒంటి కాయ పులుసు

“చింతకాయ బొంతకాయ చిగురు భూమిడకాయ
కొల్లేటి వంకాయ కొమ్మ నిమ్మా పండు
ఈరుగురు గుంటలో బాలుగులు మెయ్యగా
ఒకటే కాయగా ఒంటి పువు రాలగా
తాటాకు దప్పళం, కోట వెలుగో!”

అనే జానపద గీతంలో వామనచింతకాయలు, కూర అరటికాయ, లేత నేలములకకాయ, కొల్లేటి వంకాయ, కొమ్మనిమ్మపండు ఇవన్నీ కలిసి కాచిన దప్పళం ఆకాశంలో వెన్నెల్లా ఉందిట. ఒకటే కాయతో వండితే ఒంటిపువ్వు రాలినట్టు అది తాటాకు దప్పళం అవుతుందట. మరి కోటకి (శరీరానికి) వెలుగు మాటేమిటీ? అని అడుగుతోంది ఈ జానపద గీతం!

జానపదుల ఆహారం

మందు దింటున్నానురో-ఓరోరి మగడా..
మందు దింటూన్నాను మగడ-ముందుగ నీ కెరుగజేసి
సందు జేసుక వస్తువేమో-సాగదుర నీ బాన॥
అరగ దంచిన పాతబియ్యం- అర్థసేరు వండుకొని
అరిసిముక్కో గారిముక్కో-అంచుననే యద్దుకొని॥
అర్ధసేరు ఆవునెయ్యి-పావుసేరు పంచదార
నీరు కలవని ఆవుపెరుగు-నిమ్మకాయ వూరగాయ॥
పత్తెమని పరమాన్న మొండితె- పండుగుమ్మడి పులుసు చేసితె
హెచ్చుగా వంకాయ తియ్యని పచ్చిమామిడి ఆవపచ్చడి॥
కమ్మగా వేయించినట్టిది-కందిపప్పు వండుకోని
జిహ్వకు రుచిపుట్టునని-చింతపండు పులుసు వేసి॥
పండీపండని జామిపండ్లు-పండిన దానిమ్మపండ్లు
ఎండీ ఎండని ద్రాక్షరసము-ఖండశర్కర వుండజేసుక॥
కొర్రకూడు వండినాను-కోడిచారు గాచినాను
కాకరోగము చేతనేను-బాధపడుతున్నాను మగడ॥

నేదునూరి గంగాధరంగారు సేకరించిన ఈ గీతంలో ఓ జానపదకాంత తనకు వొంట్లో బాలేదని, మందు తింటున్నానని, ముందుగానే చెప్తున్నానని, సందు చేసుకు వస్తావేమో రావద్దంటూ, పథ్యం కోసం తాను తినే పదార్థాలను వివరిస్తోంది: ఇన్ని వంటకాలు నీకోసమే చేశాను రమ్మన్నది అసలు పిలుపు. ఇంతకీ ఆమెకు వచ్చిన జబ్బు కాకరోగం అంటే విరహజ్వరం. చల్లారాలంటే బిగువైన కౌగిలి, అధరపానం కావాలన్నాడు లోలంబరాజీయం అనే వైద్య గ్రంథంలో లోలంబరాజు.

Exit mobile version