Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జాను అచ్చతెలుగు

[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘జాను అచ్చతెలుగు’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

“బలుపొడతోలు సీరయును బాపసరుల్ గిలుపారు కన్ను వె
న్నెల తల సేదుకుత్తుకయు నిండిన వేలుపుటేరు వల్గుపూ
సల గలఱేని లెంకనని జానుదెనుంగున విన్నవించెదన్
వలపు మదిం దలిర్ప బసవా బసవా వృషాధిపా!” (వృషాధిప శతకం)

ముక్కంటిని బొమ్మ కట్టించిన పాల్కురికి సోమనాథుని ఈ పద్యాన్ని ‘జాను అచ్చుతెనుగు పద్యం’ అనవచ్చు.

పలుపొడతోలు సీరయును: పెద్ద పొడలు కలిగిన పులితోలు బట్టకట్టుకున్నవాడు.

పాపసరుల్: పాములను నగలుగా వేసుకున్నవాడు.

గిలుపారు కన్ను: వెలిగే మూడో కన్ను ఉన్నవాడు.

వెన్నెల తల: వెన్నెలను కురిపించే చంద్రుడిని తన తలపై పెట్టుకున్నవాడు.

సేదు కుత్తుకయు: చేదును (విషాన్ని) మింగడం వల్ల నల్లబడిన కుత్తుక కలవాడు – నీలకంఠుడు.

నిండిన వేలుపుటేరు: నిండుగా ప్రవహించే మిన్నేరు (ఆకాశగంగ)ను తన జడలలో ఇరికించుకున్నవాడు.

వల్గుపూస: చక్కనైన రుద్రాక్షలు వేసుకున్నవాడు

రేడు: దొర, స్వామి, ప్రభువు

లెంక: బంటు, సేవకుడు

అలాంటి ముక్కంటిని తన కోరికలు తీరాలని ఆదటతో దణ్ణమెడుతున్నానని సోమనాథుడు చెబుతున్నాడు.

ఈ పద్యాన్ని మనం మాట్లాడుకునే నుడువుల్లోకి మారిస్తే పెద్దపులితోలు కట్టుకున్నవాడు, పాముల దండ వేసుకున్నవాడు, వెలుగులీనే మూడో కన్ను, చేదు మింగిన కుత్తుక కలిగిన వాడు, వేలుపుటేరుని మిన్ను మీంచి మన్ను మీదకి తేవటానికి తన జడలలో ఇమిడ్చి నేలకొదిలినవాడు, మెడలో చక్కనైన రుద్రాక్షలు వేసుకున్నవాడు అయిన ఆ దొరకు నేను బంటుని, జానుతెనుగున ఆ ముక్కంటికి మొక్కుతాను అంటాడు సోమనాథుడు.

ఆయన తలంపు కేవలం తెలుగులో పద్యం వ్రాయడమే కాదు. తెలుగులో మొక్కితే వేలుపులు ఒప్పుకోరనే తలంపుని తోసిపుచ్చాలన్నది కూడా ఆయన నోము. అందుకనే జానుతెలుగున మొక్కుతానని నొక్కిచెప్పాడు.

“తెలుగు మాటలనంగ వలదు వేదముల కొలది కాజూడుడిల..” అంటూ, వేలుపుని సంస్కృతంలోనే మొక్కితే పని అవుతుందనుకోవద్దని, తెలుగును తక్కువ చేయవద్దని, తెలుగు కూడా వేదాలలాగే వేలుపులకు తెలిసిన నుడువే అని నొక్కిచెప్పాడు.

ఈ తలంపును ఆదిభట్ల నారాయణదాసుగారు అందిపుచ్చుకున్నారు. లలిత అమ్మవారికి గల వెయ్యి పేర్లనూ ఆయన అచ్చతెలుగులోకి తెచ్చారు. తెలుగులో మొక్కినా అమ్మవారు ఒప్పుకుంటారని చాటారు.

“మొలక లేఁతదనము తలిరుల
నవకంబుమొగ్గ సోగదనము
బూవు తావి తేనె తీయఁదనము తెన్గునకే
గాని పరుష సంస్కృతాఖ్య భాషకేది?”

అని, సంస్కృతం లేకపోతే తెలుగుకు దిక్కులేదని అనేవాళ్లకు ఈ మాట గట్టిగా తగిలేలా వ్రాశారు. మొలక, తలిరు, మొగ్గ, పూవు, తావి, తేనె వంటి తెలుగు మాటల్లోనే ఇంత సొంపు ఉన్నప్పుడు, సంస్కృతం లేకపోతే తెలుగుకు ఏమీ లేదంటారేంటని నిలదీసి అడిగారు.

జాను తెలుగున వ్రాయాలనుకున్న సోమనాథుడు మొదట అచ్చతెలుగునే వ్రాయటం మొదలుపెట్టాడు. కానీ, వడివడిగా వ్రాత సాగుతుండటంతో చేతికొచ్చిన సంస్కృతం మాటలు కూడా ఆ ఉరవడిలో చేరిపోయాయి. కొన్ని వందల యేళ్లుగా అలా వ్రాయటానికి, వ్రాసినవి చదవటానికి మనం అలవాటు పడిపోయాం కాబట్టి, అప్పుడప్పుడు ఒకటీ అరా సంస్కృతం మాటలు సాజంగా దొర్లుతాయి. కావాలని సంస్కృతాన్ని గొప్పకొద్దీ వ్రాయటాన్నే తప్పుపట్టేది!

జానుతెనుగు ఎప్పుడు మొదలైంది?

జానుతెనుగు అనే మాటని మొదట వాడినవాడు నన్నె చోడుడని పెద్ద చదువరులు తేల్చారు

నన్నయగారూ, నన్నెచోడుడూ ఇంచుమించు ఒకనాటివాళ్లే. ఒకరు ముందు, ఒకరు వెనుక – అంతే.

అప్పట్లో సాహిత్యం ఎక్కువగా ప్రాకృతం, సంస్కృతాలతో నిండివుండేది. అటువంటి వేళ నన్నయగారు వీలైనన్ని తెలుగు మాటలను చేర్చి ఆంధ్ర మహాభారతాన్ని తెలుగున తెచ్చే పని మొదలుపెట్టారు. అందుకే ఆయన్ని తొలికవి, ఆదికవి అని చెప్పుకుంటాం.

నన్నయ, అప్పటి ఇతర కవులు వాడిన సంస్కృతం – నోరు తిరగనంత చిక్కగా ఉందని, తేలికైన సంస్కృతం మాటలు వేస్తే అది కొంచెగాళ్లకు (సామాన్యులకు) తెలిసేలా సొంపుగా ఉంటుందనీ అనుకుని నన్నె చోడుడు ‘జానుతెనుగు’ అనే తలంపును ముందుకు తెచ్చాడు.

జానుతెనుగు అంటే అచ్చతెలుగు కాదు. తెలుగులోకి చొప్పించే సంస్కృతపు పలుకులు చాలా తేలికగా, తెలుగువారికి అర్థమయ్యేలా ఉండేలా చూడటం దాని తీరుగా కనిపిస్తుంది. నన్నెచోడుడు రాసిన కుమారసంభవంలో కూడా నన్నయకు దీటైనన్ని సంస్కృతపు పలుకులు కొల్లలుగా ఉన్నాయి.

నన్నెచోడుడి కుమారసంభవంలోని ఈ పద్యం ఆయన చెప్పిన జానుతెనుగు తీరును చాటుతుంది:

“సరళముగాఁగ భావములు జానుఁదెనుంగున నింపు పెంపుతోఁ
బిరిగొన, వర్ణనల్‌ ఫణితి పేర్కొన నార్యులు మెచ్చఁ గావ్యముల్‌
విరచన సేయు నట్టి కవివీరులు మున్ గనరొక్కొ లోకమున్‌
దిరముగఁ గీర్తి దేహులుగఁ దీర్పక యున్నె గుణాఢ్యుఁ డొక్కఁడున్‌!” – (కుమారసంభవము, 1–35)

జానుతెనుగు అంటే ఏమిటో చెబుతూనే, దాని తీరూ, దాని నిలుపు (ఆకృతి) ఎలా ఉండాలో ఈ పద్యం చాటుతుంది.

చెప్పేదేదో తేలికగా ఉండాలి; సొంపుగా ఉండాలి. వ్రాసేవారికీ, చదివేవారికీ అది పెంపు ఎసలారేలా ఉండాలి. రంగుల బొమ్మ కట్టించే వ్రాతలు (వర్ణనలు) ఒక పద్ధతిలో సాగాలి. అలా వ్రాస్తేనే పెద్ద చదువరులకు నచ్చుతుంది.. ఇదీ నన్నెచోడుడి తలంపు. కానీ, ఇవి చెప్పడానికి కూడా ఆయన పన్నెండు సంస్కృతం మాటలు వాడాడు. అయితే అవన్నీ తేలికగా అర్థమయ్యే మాటలే.

దీన్ని బట్టి తేలికైన సంస్కృతం కలిసిన సొంపైన తెలుగు – జానుతెనుగు అని చెప్పవచ్చు. పేర్లు, పొగడ్తల మాటలు తప్ప తక్కిన సంస్కృతం మాటలన్నీ వదిలి అచ్చంగా తెలుగులో వ్రాయటం అచ్చతెలుగు.

మన వెనకటి అచ్చతెలుగు వ్రాయితలు వ్రాసిన అచ్చతెలుగు కబ్బాలలో తేలికదనం తక్కువ. కొంచెగాళ్లకి (సామాన్యులు) తేలికగా తెలిసేది తక్కువ. మనం తేలిక దనం ఒప్పేలా, సొంపయిన అచ్చతెలుగులో గనక వ్రాయటం మొదలిడితే అది ‘జాను అచ్చతెలుగు’ అవుతుంది. పేర్లు తప్ప సంస్కృతం కలవకుండా, తేలికైన తెలుగు మాటలతోనే సొంపుగా రాయడం జాను అచ్చతెలుగు!

సోమనాథుడే జాను అచ్చతెలుగు తండ్రి.

ఆయన వీలైనన్ని ఎక్కువ తెలుగు మాటలను వాడాలని చూసినవాడాయన. ఆ విధంగా అచ్చతెలుగుకు తొలిగా కాలు చాచి మోపినవాడు పాల్కురికి సోమనాథుడే! నన్నయాదులు రెండుమూడు అచ్చతెలుగు పద్యాలు వ్రాసినప్పటికీ జాను అచ్చతెలుగు (పూర్తి సొంపైన తెలుగు) అనే నోము పెట్టుకుని వ్రాసిన వాడికే “మొదటి వీటిక” (అగ్రతాంబూలం) ఇవ్వాలి.

“ఉరుతర గద్య పద్యోక్తులకంటె
సరసమై బరగిని జానుతెనుగుచర్చింపగా సర్వసామాన్యమగుట
కూర్చెద…” (బసవపురాణం)

పెద్దపెద్ద సంస్కృత సమాసాలకంటే వినడానికి ఇంపుగా, సొంపుగా ఉండే జానుతెనుగు సామాన్యుడి నుంచి పెద్ద చదువరి వరకు అందరికీ తేలికగా బుర్రకెక్కుతుందని సోమనాథుడు తలపోశాడు.

అయితే, ఆయన సంస్కృతాన్ని పూర్తిగా పక్కన పెట్టలేదు.

“ఆరూఢ గద్య పద్యాది ప్రబంధపూరిత సంస్కృత భూయిష్ఠ రచన మానుగా
సర్వసామాన్యంబు గామి జానుతెనుగు విశేషము
ప్రసన్నతకు..”

అని చెబుతూ ‘తెలుగు ప్రసన్నత’ కోసం జానుతెనుగును వాడతానని చెప్పాడు. కానీ, ఇందులో ‘మాను’, ‘జాను’ వంటి ఒకటి రెండు తెలుగు మాటలు తప్ప మిగిలినవన్నీ సంస్కృతం మాటలే. అంటే, ఆయన చెప్పిన జానుతెనుగు కూడా సంస్కృతాన్ని వదిలిన తెలుగు కాదు. కానీ, తెలుగుకు పెద్దపీట వేయాలనే ఆలోచన మాత్రం ఆయనతోనే మొదలయ్యింది. అందుకే మొడటి వీటి ఆయనకే! జానుతెనుగు అంటే?

సూర్యరాయాంధ్ర నిఘంటువు ‘జాను’ అంటే అందము, సౌందర్యము, సొగసు అని చెబుతుంది.

సొగసుగా, సొంపుగా రాయడం జానుతెనుగు. ఆ సొంపు రావడానికి ఏ నుడికి చెందిన మాటనైనా వాడుకోవడంలో జానుతెనుగు వారికి అడ్డులేదు.

కన్నడంవాళ్లు తమ నుడిని ‘జాణ్ణుడి’ అని చెప్పుకున్నారు. దాన్నే నన్నెచోడుడు మార్చి ‘జానుతెనుగు’ అని పెట్టి ఉండవచ్చు. తెలుగు, కన్నడ నుడులు విడిపోయి దేనికదిగా పెరుగుతున్న ఆ పొద్దుల్లో పుట్టిన మాటలే ఈ జాణ్ణుడి, జానుతెనుగు.. కావచ్చు.

ఆచార్య జి. నాగయ్య జానుతెనుగును ఇలా విడమరచి చెప్పారు: “తెలుగులో సహజంగా వాడే సంస్కృత సమాసాలను జనసామాన్యంలో వాడే దేశి పదాలతో అన్వయించి, అన్వయక్లిష్టత లేకుండా మంజులంగా, సరసంగా, ప్రసన్నంగా వాడే తెలుగు జానుతెనుగు” అని!

అంటే, తెలుగులో ఇప్పటిదాకా వాడుతూ వస్తున్న సంస్కృత సమాసాలను తెలుగు మాటలకు అంకించి, తేలికపరచి, లోతైన సొంపైన తీరులో చెప్పడం జానుతెనుగు అని మనం గుర్తించాలి.

కానీ, అచ్చంగా తెలుగు మాటలతోనే తెలుగువారందరికీ తేలికగా తెలిసేలా సొంపుగా రాయాలనే తలంపు జానుతెనుగులో తప్పనిసరి కాదు. అందుకే జానుతెనుగు, అచ్చతెలుగు రెండూ ఒకటి కాకుండా పోయాయి.

ఆ కాలంలో దేశి–మార్గ అనే మాటలు బాగా వాడుకలో ఉండేవి. తెలుగువారివైనవన్నీ ‘దేశి’; సంస్కృతం నుంచి వచ్చినవన్నీ ‘మార్గ’ అని చెప్పేవారు.

ఇక్కడ ‘వహి’ అనే తెలుగు మాటను చక్కగా వాడుకోవచ్చు. ‘వహి’ అంటే విధము, ప్రసిద్ధి.

అందువల్ల ‘అచ్చతెలుగు వహి’ వేరు; ‘జానుతెనుగు వహి’ వేరు.

‘జానువహి’లోని సొంపును తీసుకుని, అచ్చతెలుగు మాటలతో రాస్తే – అది ‘జాను అచ్చతెలుగు’.

తెలుగు మాట తీరులో జాను సొంపు పొదగటం జాను అచ్చతెలుగు.

జానుతెనుగు సొంపును తీసుకుందాం. సంస్కృతపు ఊతాన్ని ఎంత వీలైతే అంత తగ్గించుకుని మనవైన తెలుగు మాటలతో నింపుదాం.. మరుగున పడిన తెలుగు మాటల్ని మళ్లీ వాడకానికి మళ్ళించటానికి మనం ఈ “జాను అచ్చతెలుగు” త్రోవను ఎంచుకుందాం!

Exit mobile version