[డా. జి.వి. పూర్ణచందు గారు రచించిన ‘జానుతెనుగా? అచ్చతెలుగా? ఏది కావాలిప్పుడు?’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]
తెలుగు నుడి కదలికలో ఇప్పటికీ పూర్తిగా వదలని చిక్కుముడులలో పెడగా ఉన్నది ‘జానుతెనుగు’ అనే మాట!
‘జానుతెనుగు’ అని మొదట నన్నెచోడుడే అన్నాడు గానీ, దానిని తన కైతలకు పేరుగా నిలబెట్తినవాడు పాలకురికి సోమనాథుడే! “జానుతెనుగున విన్నవించెదన్..” అని వృషాధిప శతకంలో అన్నాడాయన.
ఇక్కడ చెప్పుకోవటం అనటానికి బదులుగా ఆయన విన్నవించటం (సంస్కృత సకర్మక క్రియాపదం) అని వాడాడు. దీన్ని బట్టి సోమనాథుడికి సొంపుగా చెప్పాలనే యావ ఒక్కటే ఉన్నదని, అచ్చతెనుగున చెప్పాలనే పట్తుదల ఆయన పెట్టుకోలేదని తేలిపోయింది.
జాను అంటే ఒప్పైనది, ఒమ్మికైనది అని! మందికి తేలికగా, సొంపుగా, చెవికింపుగా ఉండేలా వ్రాయాలన్నదే సోమన్న తలపు. అలావ్రాయటాన్ని జానుతెలుగని ఆయన చెప్పుకున్నాడు.
‘అచ్చ’ అంటే, మైలలేనిది, తెల్లనిది, పరాయిదేదీ కలగలుపు లేనిది, దట్టమైనది, దిట్టమైనది…అని! వీటిలో ఏదీ జానుతెనుగుకు సరిపోదు. సోమనతో మొదలుకొని, ఇప్పటి ముందడుగు కోరే నుడినేర్పరులు(అభ్యుదయవాదులు) దాకా అందరూ సంస్కృతం నుండి వచ్చి చేరిన తెలివితక్కువ తనాన్ని, కదలని తనాన్ని (ఛాందసవాదం) మాత్రమే కాదన్నారు గానీ, సంస్కృత నుడుల వాడకంతో పెద్దగా పేచీ పెట్టుకోలేదు
సోమన గారి బసవపురాణం, పండితారాధ్య చరిత్రలను చదెఇవితే, సంస్కృతం నుడులు, సరినుడులు (తత్సమాలు), నుడిముడులు (పదబంధాలు, సమాసాలు) విరివిగా కనిపిస్తాయి. అంతకు వెనుకనాటి కవులకన్నా తేలికగా చెప్పగలగటం అనే చిన్న కదలిక ఒక్కటే వారి జానుతెనుగులో మనకు కనిపిస్తుంది. ఆయనే ఇలా అంటాడు:
“ఉరుతర గద్యపద్యోక్తులకంటె
సరసమ్మై పరగిన జానుతెనుగు
చర్చింపగా సర్వసామాన్యమగుట..”
ఈ మూడు పాదాలలోనూ ‘పరగు’ ఒక్కటే తెలుగు మాట. తాను వ్రాయనున్న తీరుని చెప్పుకునే సమయంలో కూడా సోమనగారు సంస్కృతం చేదోడునే తీసుకున్నాడు. అచ్చంగా తెలుగున చెప్పాలనే యావతో ఆయన జానుతెనుగున వ్రాయలేదు. యన పట్తుదల అచ్చతెలుగు కానే కాదు. సమ్స్కృతంతో కలసిన సొంపైన తెలుగు అని తెలుస్తోంది.
“అరూఢ గద్యపద్యాది ప్రబంధ
పూరిత సంస్కృత భూయిష్ఠ రచన
మానుగా సర్వసామాన్యంబుగామి
జానుదెనుగు విశేషము..”
అంటూ, కరకు సంస్కృతం మాటలతో నింపేసి తమ చదువరి తనాన్ని చాటుకునే తీరున కాకుండా, జానుతెనుగున వ్రాస్తానని చెప్పుకున్న దాంట్లోనూ, తెలుగు మాటల్ని వాడటాన్ని మరిచాడు. అప్పటికి అచ్చతెలుగనే పట్టింపు లేకపోవటం వలన జానుతెనుగు ఇలా తెలుగు సంస్కృతాల జమిలిగా సాగిందని మనం ఒప్పుకోవాలి!
ముందుమాటల్లో త్రన వ్రాతతీరులను సోమన విడమరికగానే చెప్పుకున్నాడు. జానుతెనుగు అంటే ‘సంస్కృత పదాలు ఏవీ లేని వ్రాత’ అని కాదని, మంది అందరికీ తెలికగా తెలిసే చవికలిగిన (సరసమైన) తెలుగున వ్రాయాలన్నదే ఆయన తలంపని దీన్నిబట్ట తెల్లమౌతోంది.
తొలుత, సోమనాథుడు అచ్చతెలుగునే వ్రాయాలని మొదలుపెట్టాడనీ, అది ఆయనకు కొరుకుడు పడలేదని కొందరు తొందరపాటుగా అన్నారుగానీ, అది సరికాదు. సోమన తాను అచ్చతెనుగుననే వ్రాస్తానని ఎక్కడా చెప్పుకోలేదు. అప్పటికలాంటి కదలిక ఏదీ లేదు. ఎక్కువ తెలుగున వ్రాయాలన్నదే ఆయన తలపు.
ఇప్పుడు మనమేదో అచ్చతెనుగున వ్రాయాలనుకుంటున్నామని వెయ్యేళ్ళక్రితం ఆ పెద్దాయన అలా వ్రాయ లేదనటం కూడా సరికాదు!
సోమనాథుడు వ్రాసిన తెలుగులోని సంస్కృత పదాలను తేలికగానే అర్థం చేసుకోగలిగిన వారే ఆనాటి ఏలుకోటి (ప్రజలు). అప్పటిదాకా సంస్కృత, ప్రాకృతాలదే ఏలుబడిగా ఉండేది. ఇప్పటి పేదలకు చాలా ఆంగ్ల నుడులు తేలికగానే తెలిసినట్టే అప్పటి వారికీ సంస్కృత నుడులు తెలుసు. ఆ మేరకు సోమన వ్రాసినది ఆనాటి వాడకంలోని నుడుల్నే! వాడకనుడులలోని సంస్కృతం పలుకులు మంది అందరికీ తెలిసిన మాటలే నని ఒప్పుకోవాలి! అలా వ్రాయటాన్ని జానుతెనుగు అని గట్టిగా అనుకుంటే ఇప్పటి మనం అచ్చతెనుగును ఎందుకు కోరుకుంటున్నామో విడమరచి చెప్పుకోవటానికి వీలౌతుంది.
పెద్దలు చిలుకూరి నారాయణరావు, గంటి జోగి సోమయాజి, తిరుమల రామచంద్ర వీరంతా కృత్రిమ అంటే వండి వార్చిన సంస్కృత నుడుల బరువును తగ్గించిన ఒక పూనికగా జాను తెనుగును పిలిచారు. జాను తెనుగు తేల సంస్కృత నుడులు కలిసిన తెలుగు కాగా, అచ్చ తెలుగు అనేది ఏ విధమైన కలబోతలూ లేని తెలుగు అని మనం అనుకోవాలి!
పాలకురికి సోమనాథుడి అప్పటికి ‘అచ్చతెలుగు’ అనే తలపు ఇంకా పుట్టలేదు. నుడితీరును తేలికపరచా లన్నంత వరకే ఆనాటి పెద్దలు ఒట్టుపెట్టుకున్నారు. ఆయనకు శివుడి మొక్కుని మందిలోకి చేర్చటాన్నే గామిడి (ముఖ్యం) గా పెట్టుకున్నాడు. అందుకోసరం అందరికీ తేలికగా తెలిసేలా ద్విపదని ఎంచుకున్నాడు. తెలుగు మాట కుదరనప్పుడు సంస్కృతం నుడులను వాడాడు. తన వ్రాత అంతా వాడుకనుడిగా ఉండాలని కోరుకున్నాడు. అందువల్ల ఆయన చెప్పిన ‘జానుతెనుగు’ నుడికదలిక (భాషోద్యమం) పరమైనది కాదు, శివ భక్తికి చెందినది. దానిని అంతవరకే తీసుకోవాలి.
అచ్చతెలుగు కదలిక అచ్చమైన తెలుగు నుడులనే వాడుతుంది. సంస్కృతంతో పాటుగా ఏ పరాయి నుడితోనూ కలబోత లేకుండా సాగుతుంది. సరినుడుల (తత్సమ పదాలు) వాడకాన్ని వీలైనంత మేర తగ్గిస్తుంది. నుడికాపుదల (భాషాపరిరక్షణ) కోసం ఒట్టుపెట్టుకుంటుంది.
జానుతెనుగు అలా కాదు, తేలికైన సంస్కృత నుడుల్ని ఒప్పుకుంటుంది. మంది అందరికీ తెలిసిన సరినుడులను (తత్సమ పదాలు) కూడా పుచ్చుకుంటుంది. నుడికాపుదలకన్నా, చెప్పదలచినదానినే (విషయప్రాధాన్యం) కూకటిగా పెట్టుకుని చాటి చెప్తుంది! జానుతెనుగు కవుల కూకటి ఆనాడు శివుడే గానీ తెలుగు కాదు!
ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, సరినుడులకు (తత్సమాలు) మనలో వెనకబడినవారు కూడా చాలావరకూ అలవాటుపడి ఉన్నారు. మనకు తెలియకుండానే నూటికి 60-80 నుడుల వరకూ సంస్కృతాన్నే వాడుతున్నాము. ఈ వాడకం నానాటికీ పెచ్చుమీరటాన మనవైన తెలుగు మాటలు వెనకబడిపోయాయి. కొన్నైతే పూర్తిగా కనుమరుగయ్యాయి.
నుడికాపుదల అంటే తెలుగు మరగుల్ని వెదకి తెచ్చి వాడకంలో పెట్టటం మొదట జరగాలి. అంతేగానీ కేవలం ఆంగ్లాన్ని ఏవగించుకోవటం ఒక్కటే నుడిమొక్కు అనుకుంటే చాలదు. మనం ఈ వ్రాస్తున్నదంతా సంస్కృతానికి చెడు కోసం అని కాదు. మనకా తలపే లేదు. మనం కోరేది తెలుగు వాడు తెలుగులోనే మాటలాడాలి, వ్రాయాలి, చదవాలి అంతే!
డా. జి. వి. పూర్ణచందు విజయవాడ వాస్తవ్యులు, ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు, వివిధ సాహిత్య ప్రక్రియలలో సృజనాత్మక, సామాజిక, వైఙ్ఞానిక రచనలు చేసిన సాహితీవేత్త. 130 పుస్తకాలు వివిధ ప్రచురణ సంస్థల ద్వారా ప్రచురితం అయ్యాయి. 50 అంతర్జాతీయ, జాతీయ సదస్సులలో కీలక ప్రసంగం, సభాధ్యక్షత లేదా, పత్రసమర్పణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న ‘హంస’ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, సద్గురు శివానంద మూర్తి వికారి నామ సంవత్సర శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం, మద్రాస్ విశ్వవిద్యాలయం ఆర్కాటు ప్రసాదరావు ధర్మనిథి పురస్కారం ఇంకా 50కి పైగా సంస్థల పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు 4 పర్యాయాలు ప్రధానకార్యదర్శిగా వ్యవహరించారు.
