[డా. చెంగల్వ రామలక్ష్మి గారు రచించిన ‘జగమంత కుటుంబం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
పొద్దున్నే ఐదింటికి ఫోన్ మోగిందంటే భయం. ఎందుకంటే ఆ టైమ్‌లో రాణికి ఫోన్ ఎవరూ చేయరు. వంటింట్లో అష్టావధానం, శతావధానం చేస్తూ ఉంటుంది అప్పుడు. ఒక పక్క వంట, ఇంకో పక్క బట్టల మిషన్, మరోపక్క పెద్ద మోతతో మిక్సీ తిరుగుతూ ఉంటుంది. పొద్దున్న రాణి హడావిడి చూస్తే వాళ్ళమ్మ రాజేశ్వరికి విమల గారి ‘వంటిల్లు’ కవిత గుర్తుకువస్తుంది. పిల్లలు లేవట్లేదని రాణి అరుపులు, కేకలు. భర్త సాయం లేదని విసుర్లు అన్నీ కళ్ళ ముందు దృశ్యాలై కదులుతున్నా, రాజేశ్వరి రాణికి ఫోన్ చేసింది.
రాణి కూడా ఎంతో ముఖ్యం అయితేనే అమ్మ చేస్తుంది అనుకుంటూ ఫోన్ తీసి “అమ్మా, ఏమిటి విషయం?” అంది.
“జానకత్తయ్య పోయిందిటే, ఇప్పుడే రాజు చెప్పాడు. గంట అవుతోందిట ప్రాణం పోయి. నాన్నా, నేను బయలుదేరుతున్నాం. మరి, నీ సంగతి!” అంది రాజేశ్వరి.
రాణి ఒక్క క్షణం చేష్టలుడిగిపోయినట్లయి, వెనక నిల్చున్న భర్త వెళ్ళమన్నట్లన్న చేసైగతో వెంటనే తేరుకుని, “నేనూ వస్తానమ్మా. మీరు ఇటు వచ్చేయండి. ఈ లోపల నేను తయారవుతాను” అని చెప్పింది.
రాణి భర్త రమేష్ “పిల్లల సంగతి నేను చూసుకుంటాను గాని నువ్వు తయారవు. ఇంకేం ఆలోచించకు. విషయాలన్నీ వెళ్తూ దారిలో మాట్లాడచ్చులే” అన్నాడు.
రాణి స్నానం చేసి, చీర కట్టుకుని బ్యాగులో ఒక చీర పెట్టుకుని కూర్చుంది. అమ్మ వాళ్ళు వచ్చేలోపల వంటింట్లో ఏదైనా పని చేయాలన్నా చేయబుద్ధి కావట్లేదు. రమేష్‌కి అన్ని పనులు వచ్చు. చేస్తాడు కూడా. రోజూ తనతో పాటు లేవడని రాణి తిడుతూ ఉంటుంది.
ఏమైంది జానకత్తయ్యకి? ఎలా పోయింది? వంట్లో బాగుండలేదని కూడా తెలియదే? రాణి అనుకుంటుండగానే రాజేశ్వరి, భర్త కార్లో వచ్చేసారు. రాణిని ఎక్కించుకుని బయలుదేరారు. రమేష్ పిల్లలని తీసుకుని నెమ్మదిగా వస్తానని చెప్పాడు.
కార్లో కూర్చున్నాక రాణి అడిగింది, “ఏమైందమ్మా, అత్తయ్యకి? ఎలా పోయింది?”
“తెల్లవారుజామున నాలుగింటికి లేచి ముఖం కడుక్కుని, మంచినీళ్లు తాగుతుంటే గ్లాసు బళ్ళున కింద పడిన శబ్దమై, రాజు భార్య వెళ్లి చూసిందిట. గుండె పట్టుకుని కుప్పకూలిపోయిందిట. వెంటనే రాజు డాక్టర్‌ని తీసుకొచ్చాడుట. అప్పటికే ప్రాణం పోయిందిట. అదృష్టవంతురాలు. మంచం మీద పడకుండా పోయింది” అంది రాజేశ్వరి.
జానకి అత్తయ్య, రాణి వాళ్ళకి రక్త సంబంధం కాదు. ఆవిడకి ఎవరూ లేరు. పిల్లలు లేరు. భర్త వున్నప్పుడు ఆయన గుడివాడలో ఒక స్కూల్లో గుమస్తాగా చేసేవారు. రాజేశ్వరి వాళ్ళు కూడా అప్పుడు గుడివాడ లోనే వుండేవాళ్ళు. రావుగారు బ్యాంకులో ఉద్యోగం చేసేవారు. వీళ్ళ పక్క వాటాలోనే జానకి వాళ్ళు ఉండేవారు. చాలా కొద్దిసమయం లోనే రెండు కుటుంబాలకి స్నేహం కలిసిపోయింది. రాజేశ్వరి వాళ్ళది పెద్దలు ఆమోదించని ప్రేమ వివాహం. అటు ఇటు తల్లిదండ్రులు వీళ్ళ ఇంటికి వచ్చేవారు కాదు. జానకి స్నేహంతో వీళ్ళు ఆ లోటును మర్చిపోయారు.
రావుగారు జానకిని సొంత తోబుట్టువు గానే భావించారు. రాజేశ్వరి గర్భిణిగా వున్నప్పుడు జానకి తొమ్మిది నెలలు తల్లిలా చూసుకుంది. సపర్యలన్నీ చేసింది. రాజేశ్వరికి పురుడు కూడా పోసింది. రాణి వాళ్ళిద్దరి ఇంటి ముద్దు బిడ్డగా పెరిగింది. రాణికి ఎనిమిదేళ్లప్పుడు రావుగారు ఉద్యోగానికి విజయవాడ రావలసి వచ్చింది. వాళ్ళు జానకివాళ్ళని వదలలేక చాలా బాధతో వచ్చేసారు.
ఈ ఊరు మార్పు వాళ్ళ స్నేహ బంధానికి ఆటంకం కాలేదు. కాగా మరింత పెరిగింది. అపుడపుడు వాళ్ళ రెండు కుటుంబాలు కలుస్తుండేవి. పండగలని గుడివాడలోనో, విజయవాడ లోనో కలిసి జరుపుకునేవారు. జానకి భర్త విశ్వం కూడా చాలా కలుపుగోలు మనిషి. రాణి ఇంటరు చదువుతుండగా విశ్వం రోడ్డు ప్రమాదంలో లారీ కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
జానకి దుఖానికి అంతు లేదు. వాళ్ళకి పిల్లలు లేరు. ఎవరి పిల్లలనైనా సొంతపిల్లల్లా ప్రేమించే మనసుంది. రావుగారు తమతో విజయవాడ వచ్చేయమని ఒంటరిగా ఉండద్దని ఎంతో బతిమాలారు. జానకి అలవాటయిన ఊరు వదలలేనని, భర్త జ్ఞాపకాలతో ఇక్కడే ఉంటానని, అయినా దూరంగా ఉంటేనే బంధాలు దృఢంగా వుంటాయని చెప్పి సున్నితంగా తిరస్కరించింది. అప్పటినుంచి జానకి అదే ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. పక్కన వాటాలో వాళ్ళు మారుతున్నారు కాని జానకి అక్కడే స్థిరంగా ఉండిపోయింది. ఇంటివాళ్ళు ఎక్కడో దూరంగా ఉంటారు.
జానకి భర్త విశ్వం పనిచేసింది ప్రైవేట్ స్కూలే. భర్త మరణానంతరం డబ్బు వచ్చే సదుపాయం ఏమీ లేదు. అతను స్కూల్లో తన విధులు మాత్రమే కాదు అక్కడ ఏ పని కావాలన్నా చేసేవాడు. సాయంత్రాలు స్కూల్లో పిల్లలను చదివించేవాడు. పిల్లలని స్కూల్ బస్సు జాగ్రత్త గా ఎక్కించేవాడు. దించేవాడు. టీచర్లకి పేపర్లు దిద్దటంలో సాయం చేసేవాడు. అతనికి పని అంటే ఇష్టం. అతనంటే స్కూలందరికీ ఇష్టం. అందుకే వాళ్ళు జానకి ఆ ఇంట్లో ఉన్నంతకాలం అద్దె తామే కట్టి, ఆమె జీవికకు నెల నెలా ఐదు వేలు ఇస్తామన్నారు.
జానకమ్మ అంతే! ఇరుగు పొరుగు అందరితో స్నేహంగా ఉండేది. ఎవరింట్లో ఏ అవసరం వచ్చినా ముందుండేది. అందరికీ తలలో నాలుకలా ఉండేది. ఆమెకు ఒంటరినన్న భావనే లేదు. బంధువులు వస్తూ ఉండేవారు. ప్రతిఫలం ఆశించని సాయం జానకమ్మది.
జానకమ్మ మరణ వార్తను చేరవేసిన రాజు, జానకమ్మ పక్క వాటాలో అంటే ఇదివరకు రాజేశ్వరి వాళ్ళు ఉండే వాటాలో ఉంటున్నాడు. వాళ్లకు ఇద్దరూ చిన్న పిల్లలు. నాలుగేళ్లు, అరేళ్ళ వాళ్ళు. భార్య భర్త ఉద్యోగాలకి వెళుతుంటే జానకమ్మే వాళ్ళని తయారు చేసి స్కూలుకి, తీసుకెళ్లి తీసుకువస్తూ ఉండేది. వాళ్ళ బాగోగులు చూస్తూ ఉండేది. ఒక్కరోజు కూడా పిల్లలకోసం సెలవు పెట్టకుండా ఉద్యోగాలు వాళ్ళు చేస్తున్నారంటే జానకమ్మ చలవే! వేసవికాలం వచ్చిందంటే జానకమ్మకు తెలిసిన వాళ్లంతా ఆమె తోనే ఆవకాయ, మాగాయలు వేయించుకునే వారు. ఇదంతా శ్రమ అని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. అందరూ నా వాళ్లే అనుకునేది.
రాణి పెళ్ళికి జానకమ్మ మొత్తం కార్యభారమంతా తన భుజాలపై వేసుకుని జరిపించింది.
వచ్చిన చుట్టాలందరికీ జానకమ్మ ఎవరో ఆమెతో ఆ కుటుంబానికున్న అనుబంధం ఏమిటో తెలుసు.
రాణికి విజయవాడ సంబంధమే కుదిరిందని తెలిసి జానకమ్మ పొంగిపోయింది. కాపురం పెట్టాక నాలుగు రోజులు వాళ్ళింట్లో ఉండి రాణి కిష్టమైనవన్నీ చేసి పెట్టి వెళ్ళింది. ఇప్పుడు రాణి పిల్లలు కూడా నానమ్మ అంటూ ఆమె దగ్గరకు వెళ్లి వస్తుంటారు. ఇంత ప్రేమ, ఇంత అభిమానం ఇందరిపై సమంగా ఒక మనిషికి ఉండటం ఎలా సాధ్యం? జానకమ్మ ఏమీ చదువుకోలేదు. రాణినే సంతకం పెట్టటం నేర్పించింది. తన ఆత్మగౌరవం పదిలంగా కాపాడుకుంటూ అందరికీ కావలసిన వ్యక్తిగా జీవించగలగటం జానకత్తయ్యకే సాధ్యం! జానకితో గడిపిన రోజులు, ఆమె ప్రేమ తలచుకుంటూ రాణి వెక్కి వెక్కి ఏడుస్తోంది.
రాజేశ్వరి కళ్ల నీళ్లు పెట్టుకుంటూ రాణిని సముదాయిస్తోంది. రావుగారు దుఃఖ సముద్రాన్ని గుండెల్లో దాచుకుని మౌనంగా రోదిస్తున్నారు. ఇంతటి విషాద భారాన్ని మోసుకుంటూ కారు జానకమ్మ ఇంటిముందు ఆగింది. ఇంటిముందంతా జనం జనం! తెలిసిన వాళ్ళు, చుట్టాలు, ఇరుగుపొరుగు, స్కూలు వాళ్ళు.
రమేష్ పిల్లలని తీసుకుని పన్నెండవుతుండగా వచ్చాడు. వాళ్ళు జానకమ్మ దేహం పై పడి నానమ్మా అంటూ గట్టిగా ఏడుస్తున్నారు.
నిజంగా జగమంత కుటుంబం జానకమ్మది. డబ్బు లేకపోతేనేం! చదువు లేకపోతేనేం! ఇంతమంది ఆత్మీయుల ప్రేమ సంపద ఉంది ఆవిడకు అంటోంది వచ్చినవాళ్లలో ఒకామె.
“కుటుంబంలో, సమాజంలో మానవ, స్నేహ సంబంధ పరిమళాలను ఎలా వ్యాపింపజేయాలో జానకమ్మను చూసి మనం నేర్చుకోవాలి” అన్నాడు ఒకాయన. బహుశా ఆయన కవి ఏమో!
జానకమ్మ మృత దేహాన్ని పూల మాలలతో కప్పి వూరేగించారు. ‘నా చెల్లెలికి అంత్య క్రియలు నేనే చేస్తాన’ని రావుగారు ముందుకు వచ్చారు. తర్వాత కార్యక్రమాలు అందరూ కలిసి ఘనంగా చేసారు.
రాజేశ్వరికి ‘ప్రేమ నిచ్చిన ప్రేమ వచ్చును’ అనే గురజాడ కవితా పంక్తి గుర్తుకు వచ్చింది జానకమ్మ కోసం వచ్చిన జన సందోహాన్ని చూస్తుంటే!
