[శ్రీ పోలయ్య కూకట్లపల్లి రచించిన ‘జలప్రళయం – విలయతాండవం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
మంచుకొండల ఒడిలో
మల్లెలా నవ్విన నేపాల్ –
కొద్ది క్షణంల్లోనే
కన్నీటి కడలిగా మారిందే..!
జలపాతాల
జలజల గానాలు –
సెలయేరుల గలగలలు –
జలప్రళయ రోదనలై వినిపించాయే
సహాయంకై అభాగ్యుల
ఆర్తనాదాలుగా మారాయే!
పచ్చని కొండల గుండెల్లో –
కొండచరియలు కత్తులై దూసుకొచ్చాయే
ప్రాణాలను పోషించే పంచభూతాలే –
ప్రాణాలను ఫణంగాపెట్టే పాశాలయ్యాయే
అభివృద్ధి పేర అడవులను నరికితే –
ప్రకృతి గుండెలో గాయం మిగిలిందే
ఆ గాయం కన్నీరై కరిగి కరిగి –
బురద వరదగా మారి ఊళ్లకు ఊళ్లను మృత్యువులా మింగేసిందే
కళ్ళముందే కాలసర్పంలా కాటేసిందే
జనాలను జలసమాధి చేసిందే..
ఇళ్లున్న చోట వరద బురద
బతుకులున్న చోట నిశ్శబ్దమే మిగిలిందే
నిన్న పర్యాటకుల స్వర్గమైన నేల –
నేడు కన్నీటి సముద్రంలో శ్మశానమైందే!
ఎటు చూసినా కొట్టుకుపోయిన
రోడ్లు వాహనాలు వంతెనలే
కూలిపోయిన ఇళ్ల శిధిలాలే..
బురదలో కూరుకుపోయిన శవాలగుట్టలే.
ఔను ఓ మనిషీ
పంచభూతాలను ప్రేమిస్తే
ప్రకృతిని ఆరాధిస్తే..
ప్రకృతి మనల్ని కాపాడుతుంది..
కానీ ప్రకృతిని జయించానని
అంతరిక్షాన్ని అన్వేషించానని
విశ్వానికి నేనే చక్రవర్తినని
మకుటంలేని మహారాజునను
ప్రగల్పాలు పలకకు.. తెలుసుకో
ప్రకృతి పగబడితే
నరుని బ్రతుకు నరకమని..
జలప్రళయ విలయతాండవమేనని..
విధ్వంసం వినాశనం విషాదమేనని..
శ్రీ పోలయ్య కూకట్లపల్లి హైదరాబాద్ వాస్తవ్యులు. ‘కవి రత్న’, ‘సాహిత్య ధీర’, ‘సహస్ర కవి భూషణ్’ బిరుదాంకితులు.
