[రుబీనా పర్వీన్ గారి ‘జమిలి పోగు’ కథాసంపుటిపై సమీక్ష.]
రచయిత్రి రుబీనా పర్వీన్ రచించిన 12 కథల సంపుటి ‘జమిలి పోగు’. ఈ సంపుటి లోని పన్నెండు కథలూ స్త్రీల గురించిన కథలు. సమాజంలో నిత్య జీవితంలో స్త్రీలు ఎదురుకునే సమస్యలను ప్రదర్శిస్తూ వాటికి రచయిత్రి తాను నమ్మిన పరిష్కారాలను కథల్లో సూచించారు. “నా కథలు మొత్తం స్త్రీల ఆర్ధిక స్వతంత్రం వైపు, వారు ఆంక్షలు దాటి బయటపడి తెలివిగా ఎలా బతకాలో ఆ మార్గాలవైపు రాసాను” అని రచయిత్రి ముందుమాటలో రాశారు. ఇందులోని కథలనీ రచయిత్రి మాటలు సత్యమని నిరూపిస్తాయి.
‘ఖులా’ కథ అనుక్షణం తనని అనుమానిస్తూ, చివరికి మరో స్త్రీవైపు ఆకర్షితుడై, ఇద్దరితో కలసి జీవించాలనుకుంటున్న భర్తకు ‘ఖులా’ (ముస్లిమ్ మహిళలు కోరే విడాకులు) చెప్పటంతో ముగుస్తుంది. ‘అబ్బాజాన్’ కథ కూతురి ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో ఎదగటంలో తండ్రి పాత్రను ప్రదర్శిస్తుంది. పీఎంఎస్ కథ బహిష్టుకు ముందు మహిళలో ఉత్పన్నమయ్యే శారీరక, మానసిక ఇబ్బందులను ప్రదర్శిస్తుంది. ‘వడగండ్లవాన’ కథ, సమాజంలో ప్రతిష్ఠితమైవున్న అపోహలు పసిపిల్లల మనస్సులపై చూపే దుష్ప్రభావాన్ని చూపుతుంది. ‘బుర్ఖా’ కథలో ఒక మహిళ తనపై, బుర్ఖా వేసుకోమనే ఒత్తిడికి లొంగకపోవటం ప్రదర్శిస్తుంది. తీవ్రవాదిగా అరెస్టయిన వ్యక్తి కుటుంబం అనుభవించే సామాజిక వివక్షతను ప్రదర్శిస్తుంది ‘మక్సూదా’ కథ. భర్తను కాదని తనను ప్రోత్సహించే వ్యక్తి సహాయంతో తనకంటూ గుర్తింపు సాధించినా, అసూయవల్ల తనను తక్కువ చేస్తున్న ఆ వ్యక్తినీ కాదని తన స్త్రీత్వాన్ని ఆత్మగౌరవాన్ని నిలుపుకున్న మహిళ కథ ‘వన్ పర్సన్ కంపెనీ’. భార్యను పోగొట్టుకుని ఒంటరిగా వున్న తండ్రికి పిన్నితో పెళ్ళి చేయటం ‘తోడు’ కథ. ఆడపిల్ల పుట్టటం అదృష్టమనీ, ఆడపిల్ల పుడితే శోకించాల్సిన అవసరంలేదని చెప్పే కథ ‘శోకప్రకటన’. మానసిక సమస్యతో తనని నానా ఇబ్బందులు పెడుతున్నాడని విడాకులిచ్చినా, అతనిపై ఉన్న అభిమానంతో అతడికి సపర్యలు చేసే మహిళ కథ ‘స్కిజోఫ్రెనియా’. విలాసాలకు లొంగి తన వ్యక్తిత్వాన్ని కోల్పోయిన మహిళ రాజీ పడవద్దని మరో యువతికి సలహా ఇచ్చే కథ ‘రంగులకల’. పిల్లలను తననుంచి దూరం చేయలని ప్రయత్నించిన భర్తను తన్ని మరీ పిల్లలను కాపాడుకున్న మహిళ కథ ‘దేవ్లీ’.
సంపుటిలోని పన్నెండు కథలివి టూకీగా. ప్రతి కథలో మహిళ ఎదుర్కునే సమస్య దానికి రచయిత్రికి సరయినదని తోచిన పరిష్కారం వుంటుంది. ‘ఏ స్థాయిలో మహిళకు ఆ స్థాయి సమస్యలుంటా’ యని ముందుమాటలో రచయిత్రి అన్న మాటలను ఈ కథలు నిరూపిస్తాయి. అట్టడుగు వర్గాలనుంచి ఉన్నత వర్గాలవరకూ మహిళల సమస్యలను, కష్టాలను చూపుతాయీ కథలు. గమనిస్తే, ‘ఖులా’ కథ మిగతా కథలకన్నా భిన్నం అనిపిస్తుంది. ఇతర కథల్లో లేని స్వచ్ఛత, అమాయకత్వం ఈ కథలో కనిపిస్తాయి. రచయిత్రి ప్రత్యేకంగా నిలుస్తుంది. మిగతా కథల్లో రచయిత్రి ఒకే రకమయిన కథలు రాసే గుంపులో ఒకరయిన భావన కలుగుతుంది.
కథా పరంగా చూస్తే, ఇందులో కొత్తగా అనిపించే కథలు, అద్భుతం అనిపించే కథలు ఏమీలేవు. కానీ, ప్రతి కథనూ సూటిగా చెప్పి, వదలకుండా చదివించే రచయిత్రి నేర్పు కనిపిస్తుంది. అయితే, కథలన్నీ ఊహకందేవే. మొదట కాస్త చదవగానే కథ దేనిగురించో, ముగింపు ఏమిటో సులభంగా తెలిసిపోతుంది. అయినా సరే కథను వదలకుండా చదువుతాము. ఈ కథలన్నీ చదివిన తరువాత రచయిత్రిలో చక్కని కథలు రాయగల ప్రజ్ఞ వుందన్న నమ్మకం కలుగుతుంది. కానీ, కథాంశాన్ని ఎన్నుకోవటము, ఎన్నుకున్న కథాంశాన్ని మరపురాని రీతిలో, పాఠకుడు ఊహించని మలుపులు తిప్పుతూ, ఊహకందని ముగింపు ఇవ్వటంపై రచయిత్రి దృష్టి పెడితే చక్కని కథలు సృజించగలదు రచయిత్రి అనిపిస్తుంది. అనుభవాలను కథలుగా మలచేప్పుడు, ఉన్నది ఉన్నట్టు, చూసింది చూసినట్టు రాస్తే, అవి వార్తలుగానో, రిపోర్టింగ్ గానో అనిపించే ప్రమాదం వుంటుంది. అనుభవించినదానికీ, చూసినదానికీ, కల్పనను జోడించి, నాటకీయంగా, ఉత్కంఠ భరితంగా సృజిస్తే అది కథ అవుతుంది. లేకపోతే, వార్తను కథగా చలామణి చేస్తున్నటనిపించే ప్రమాదం వుంది.
ఈ కథలన్నీ వరుసగా చదువుతూంటే, ఇవన్నీ ఫీల్ గుడ్ కథలు అనిపిస్తాయి. కథల్లోని సమస్యలు గాలికి ఎగిరే దూదిపింజల్లా ఎగిరిపోతాయి. సులభంగా పరిష్కారమయిపోతాయి. ‘ఖులా’ కథలో అనుమానపు మొగుడు మరో అమ్మాయి వెంట పడతాడు. ‘వడగళ్ళ వాన’ కథలో తల్లి మరో మగాడితో సన్నిహితంగా వున్నట్టూహించుకుని వారిద్దరి మధ్యా ఏదో వుందని కూతురు నమ్ముతుంది. ‘వన్ పర్సన్ కంపెనీ’లో ముందు ఒకడిని ప్రేమిస్తుంది. పెళ్ళయిన తరువాత అతడిని అసహ్యించుకుని మరోకడికి చేరువవుతుంది. కానీ, కొన్నాళ్ళకు అతడూ తనని డామినేట్ చేస్తున్నాడని, చులకన చేస్తున్నాడని ఒంటరిగా తన మార్గంలో ప్రయాణిస్తుంది. ‘స్కిజోఫ్రెనియా’లో భర్త మానసిక రోగి అవటంతో అన్ని రకాలుగా హింసిస్తాడు. ‘దేవ్లీ’ కథలో భర్తపోయిన దేవ్లీని మాయచేసి పిల్లలను దూరం చేయాలని చూస్తాడు. ఇలా ఈ కథల్లో ‘అబ్బాజాన్’ కథలో తప్ప మంచి మగాడు కనబడడు. మంచిగా సుఖంగా వున్న సంసారం కనబడదు. ఇతర ఫెమినిస్ట్ రచయితల రచనల్లోలా పురుష ద్వేషం ఈ కథల్లో కనబడదు. అక్రమ సంబంధాలే గొప్పవి అన్న వక్రపుటాలోచనలు ఈ కథలు ప్రదర్శించవు. కానీ, మంచి మగవాళ్ళే లేకపోవటమనే ఇతర ఫెమినిస్ట్ కథలలో కనబడే లోపం ఈ కథల్లోనూ కనిపిస్తుంది. కథలలో పాత్రల వ్యక్తిత్వాలను తీర్చిదిద్దటం, సన్నివేశ సృష్టీకరణ, కథను లాజికల్‌గా నడపటం వంటి విషయాల్లో ఈ కథలు నిరాశనే కలిగిస్తాయి. కొన్ని కథలు కథలుగా కన్నా సంఘటనలుగానే అనిపిస్తాయి. మరికొన్ని కథలలో కథను ఆసక్తికరంగా మలచటం కన్నా, ఒక వార్తను చెప్పినట్టు చెప్పటం కనిపిస్తుంది. పాత్రల అంతరంగాలను చేరువ చేసి, వారి సంఘర్షణలు, సందిగ్ధాలను పాఠకులు మమేకం చెందేట్టు చేసే ప్రయత్నం కనబడదు. దాంతో కథలన్నీ సీదాసాదాగా సాగిపోతాయి. ఉదాహరణకు ‘వన్ పర్సన్ కంపెనీ’ కథతో సహా పలు కథల్లో డ్రమాటిక్‌గా రచించే అవకాశం వున్నా, దాన్ని రచయిత్రి ఉపయోగించుకోలేదు. అంటే, కథ చెప్పటం తెలిసింది కానీ, కథను అభివృద్ధి చేయటం అలవడాల్సి వుందన్నమాట. ఈ విషయంపై దృష్టి పెడితే చక్కని కథకురాలిగా ఎదిగే వీలుంది.
‘కథనం, పాత్రల వ్యక్తిత్వ చిత్రణ, సన్నివేశ సృష్టీకరణ, లాజికల్‌గా కథను అభివృద్ధి చేయటంపై దృష్టి పెడితే భవిష్యత్తులో చక్కని రచయిత్రిగా ఎదిగే సత్తా వున్న రచయిత్రి రుబీనా పర్వీన్ అన్న నమ్మకాన్ని ఈ కథల సంపుటి కలిగిస్తుంది.
పుస్తకం ముఖచిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సివుంటుంది. పుస్తకంలోని ఫీల్ గుడ్ కథలు చదివే మూడ్‌ని స్థిరపరుస్తూ, అత్యంత ఆహ్లాదకరంగా, అందంగా, అత్యద్భుతంగా వుంది ముఖచిత్రం. కవర్ డిజైన్ చేసిన మహీ అభినందనీయుడు.
***
జమిలి పోగు (కథలు)
రచన: రుబీనా పర్వీన్
ప్రచురణ: సైరా ప్రచురణలు
పేజీలు: 126
వెల: ₹ 145
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
ఆన్‍లైన్‍లో
https://www.amazon.in/Jamili-Pogu-Kathalu-Rubina-Parveen/dp/B0DF6G2T66
~
రుబీనా పర్వీన్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-rubina-parveen/