Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జంతువుల పొడుపు కథలు-3

[బాలబాలికల కోసం జంతువుల పొడుపు కథలు అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్. ఇది 3వ భాగం.]

ప్రశ్నలు:

21.
కూస్తే అలారం
కోస్తే ఆహారం
‘కొక్కొరకో’ అంటూ
ఇళ్ళ చుట్టూ విహారం

22.
ఎగురుతాయి, రెక్కలుంటాయి!
కానీ పక్షులు కావు
ఆహారపదార్థాలు, కుళ్ళిన చెత్త
ఏదైనా సరే వాలిపోతాయి
చెప్పండి, మరి ఏమిటవీ?

23.
మనిషి నెత్తినెక్కి తిరుగుతుంది
తలంతా కొరుక్కుతింటుంది
పచ్చిరక్తం తాగుతుంది
గోళ్ళ మధ్య ఇరుక్కొని
చిటుక్కుమని చస్తుంది

24.
తీపి ఎక్కడున్నా పసిగట్టి
దండుతో దండయాత్ర చేస్తుంది
దాని బంగారు పుట్టలో
వేలెడితే కుడుతుంది

25.
పేరుకు పిట్టేగానీ
చెట్లను చెక్కుతుంది
కొయ్యపని వారి వృత్తిని
ఇంటి పేరు చేసుకుంది

26.
ఇంటిపై పెంకులున్నట్లు
ఒంటిపై పెంకుండేది ఏది?
నీటిలో నివసిస్తూ
ఇసుకలో గుడ్లు పెట్టేది ఎవరు?

27.
పేరులో కృష్ణుడుంటాడు
రూపంలో జింకలా ఉంటుంది
మన ఆంధ్ర రాష్ట్ర జంతువు
కనిపెట్టారా పిల్లలూ!

28.
నేను మనుషుల మీద పడితే
శాస్త్రాలు చూసుకుంటారు
తినే పదార్థాల్లో పడితే
యమపురి చేరుకుంటారు
నేనెవరో చెప్పండి పిల్లలూ!

29.
ఇంటికి కాపలా కాస్తాను
విశ్వాసానికి మారు పేరును
తోక ఊపుకుంటూ తిరుగుతాను
దొంగలొస్తే మొరుగుతాను
మరి నేనెవరినో చెప్తారా?

30.
ఎండాకాలమైనా, చలికాలమైనా
ఉలెన్ స్వెట్టర్ వేసుకునే ఉంటుంది
వంచిన తల ఎత్తకుండా నడుస్తుంది
అన్నింటిదీ ఒకేమాట, ఒకే బాట

జవాబులు:
21. కోడి 22. ఈగ 23.పేను 24. చీమ 25. వడ్రంగి పిట్ట 26. తాబేలు 27. కృష్ణజింక 28. బల్లి 29. కుక్క 30. గొర్రె

Exit mobile version