[వాణిశ్రీ నైనాల గారు రచించిన ‘జారుడుబల్ల’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]
విస్ఫురిత విహారంలో
విజయమొందిన విక్రమమై
విస్ఫోటనాలతో ప్రస్ఫుటమై
వింతమార్పులతో
రూపుకడతాను..
నిద్రో మెలకువో తెలియని ముద్రలో
మాంసపు ముద్దలో..
ధ్యానం పరిసమాప్తమవగానే
కాటుక కలుగులోనించి
వెలుతురుకోనకు
తలక్రిందులై తరలివస్తాను..
ఏడ్పునవ్వుల నాదస్వరాలతో
కోరిందల్లా రాబడతూ
అభ్యసనంలో జిజ్ఞాసువునై
అంతో ఇంతో మోపుకడుతూనే
ఓ ఉనికీ లేని లోకానికై
ఊహల పగ్గాలు పేని
సర్వంసహా చక్రవర్తినినై
ఒంటరిగా ఏలుకుంటాను..
తుంటరినై జంటకట్టి
జాతిపెంపుకు ఊతమవుతూనే
జీవనశిఖరంపై
నా పతాకను గట్టిగా పాతేస్తాను..
కిరీటం కదలకుండా
తలక్రిందికి జూరుతుంటే
ఎక్కివచ్చింది జారుడుబల్లని
తెలిసిన క్షణం నుండీ
ఆలపించిన రాగాలే
ఒక్కొక్కటిగా ఆదమరుస్తాను
పంచభూతాలకూ
నన్ను పంచిపెడుతూ
వీలునామా వ్రాసి
విహాయసంలో అంటించి
ఊర్ధ్వనిమ్న కోణాలు కొలుస్తుంటాను
శూన్యాలలో వ్యూహాలను
నాకు నేనే రచిస్తుంటాను..
ఏ బాధా లేకుండా
ఎలా నిష్క్రమించాలో
నాతో నేనే వచిస్తుంటాను..
