Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జీవన విలువలని చాటే జానపద నవల ‘జయకేతనం’

[శ్రీమతి సంధ్యా యల్లాప్రగడ గారి ‘జయకేతనం’ అనే జానపద నవలని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

జానపద కథలంటే మనకి గుర్తొచ్చేది చిన్నప్పుడు చందమామలోనో, బాలమిత్రలోనో, లేదా ఇతర పిల్లల పుస్తకాల్లోనో మనం చదువుకున్న చక్కటి రాజుల, రాజ్యాల, ప్రజల కథలు! ఊహాలోకాలలో విహరింపజేసి మంచిచెడులపై అవగాహన కల్పించిన కథలు. పిల్లలలో సృజనాత్మకతకి బాటలు వేసినవి జానపద కథలే!

~

అసలు జానపద కథలు పాఠకుల్ని ఎందుకు విశేషంగా ఆకట్టుకుంటాయా అని ఆలోచిస్తే -వాటి కాలాతీత ఇతివృత్తాలు, సార్వజనీనమైన ఆకర్షణ ప్రధాన కారణాలని స్ఫురిస్తుంది. ఈ కథలు తరచుగా – ప్రేమ, స్నేహం, ద్రోహం, దురాశ, చెడుపై మంచి విజయం వంటి ఇతృవృత్తాలతో సార్వజనీన మానవ అనుభవాల చుట్టూ తిరుగుతాయి. ఈ ఇతివృత్తాలు ఓ కాలానికో, లేదా ఓ భౌగోళిక ప్రదేశానికో పరిమితం కాకుండా అన్ని కాలాల, అన్ని ప్రాంతాల పాఠకులతో అనుసంధానమవుతునే ఉంటాయి.

మన జానపద కథలు మన దేశపు వైవిధ్యమైన సంస్కృతికి ప్రతీకలు. జానపద కథలు మంచి చెడుల మధ్య పోరాటాన్ని వర్ణిస్తాయి, పాత్రలు ఎదుర్కోవాల్సిన నైతిక సందిగ్ధతలను ప్రస్ఫుటం చేస్తాయి.

జానపద కథలు కష్టాలను ఎదుర్కోవడంలో ధైర్యం ప్రాముఖ్యతను నొక్కి చెబుతాయి. పాత్రలు తరచుగా తమ భయాలను/కష్టాలను ఎదుర్కోవడానికి అవసరమైన అన్వేషణకో లేదా ప్రయాణాలకు బయలుదేరుతాయి.

జానపద కథలు గుర్తింపు, పరివర్తనలకి చెందిన ఇతివృత్తాలతో సాగుతాయి, పాత్రలు వాటి అనుభవాల ద్వారా ఎలా ఎదుగుతాయో, మారతాయో వివరిస్తాయి.

కథ రాజధానిలో జరుగుతూంటే, కోటలు, భవనాలు, రహదారులు, ఉద్యానవనాలు, మంత్రులు, పరిపాలన.. వంటి అంశాలను పరిశీలిస్తే ‘మేనేజ్‍మెంట్’ సూత్రాలు గోచరిస్తాయి.

కథ ఏ అడవిలోనో జరుగుతుంటే, ప్రకృతి వర్ణన, జంతువులు పక్షుల సంచారం, అవి మనుషులతో మాట్లాడడం.. వంటి అంశాలను గమనిస్తే, ప్రకృతిలోని సమస్త జీవకోటి ఒకరినొకరు గౌరవించుకుంటూ మనుగడ సాగించాలన్న నిజం అవగతమవుతుంది.

కథ రాజగురువు ఆశ్రమంలోకి ప్రవేశించినప్పుడు – అనూచానంగా వస్తున్న భారతీయ ఆధ్యాత్మిక విలువలు, ధర్మాన్ని కాపాడితే, అది మనల్ని రక్షిస్తుందన్న విశ్వాసం – రాజగురువుల పాత్ర ద్వారా వ్యక్తమవుతాయి. మానవ ప్రయత్నానికి దైవబలం కూడా అవసరమని తెలుపుతుంది. దీన్నే ఆధునిక పరిభాషలో synergism అనీ, divine grace working with human effort అని అంటున్నారు.

రాజు, మంత్రి మారు వేషాలలో పల్లెల గుండా ప్రయాణిస్తున్నప్పుడు సామాన్యుల కష్టాలు, నగరాలకి దూరంగా ఉన్న గ్రామాలలోని పాలనా వ్యవస్థలు, జీవన విధానాలు, సమస్యలు, వాటి పరిష్కారాలు కనబడతాయి. పెద్దగా చదువుకోకపోయినా, జీవితానుభవం మెండుగా గల వృద్ధులు తారసపడి ‘లైఫ్ లెసన్స్’ బోధిస్తారు.

ఇలా జానపద కథలకి విశేష ప్రయోజనాలున్నాయి.

~

శ్రీమతి సంధ్యా యల్లాప్రగడ గారి ‘జయకేతనం’ అనే ఈ జానపద నవల – చదువుతూ, మైమరచిపోయి, కథలో లీనమైపోయి, ఆపకుండా ఏకబిగిన చదివిసేసిన పుస్తకం. ఎంత కాలమైంది ఇలాంటి చక్కని జానపద నవల చదివి అని నాకు అనిపించింది.

ఈ మధ్యకాలంలో జానపద కథల ఆధారంగా నిర్మించిన సినిమాలు, వెబ్ సీరిస్‌లు ఎన్నో వస్తున్నా, అవేవీ మనకు – మనం చిన్నప్పుడు చదువుకున్న జానపద కథల్లాంటి అనుభూతిని కల్గించవు. ఎందుకంటే అవి గ్రాఫిక్స్ ఆధారితం అని మనకి తెలుసు. కానీ అప్పటి ఆ నవలలు, ఇప్పటి ఈ జయకేతనం సంగతి వేరు – చదువుతున్నప్పుడు – మనం ఓ అద్భుతమైన కాల్పనిక ప్రపంచంలో మానసిక విహారం చేస్తాం. అవంతీ రాజ్యంలో తిరుగాడుతాం, మలయధ్వజుడు, అతని మంత్రి సుమంతుడు, రాజ్యానికి రాబోయే ఆపద, మహిమ గల కేతకీమణిని సాధించడం, భౌతిక శరీరాన్ని విడిచినా, రాజ్యానికి రక్షగా నిలిచే రాజగురువు విద్యారణ్యులు, వారి ఆశ్రమం, వారి మార్గదర్శనం.. మణి కోసం మలయధ్వజుడు చేసిన సాహసాలు, కలుపుకున్న స్నేహాలు, సందర్శించిన ఆలయాలు, లభ్యమైన దైవానుగ్రహం, వీరత్వంతో శత్రువులపై జయం.. చివరకు అనుకున్నది సాధించి రాజ్యానికి మళ్ళడం! – క్లుప్తంగా ఇదీ కథ!

రచయిత్రి కథనశైలి అత్యంత రమణీయంగా ఉండి, పాఠకులని అక్షరాల వెంట స్వారీ చేయిస్తుంది.

మనకి తెలిసిన కథే అయినా.. రచయిత్రి కథని నడిపిన తీరు ఆకర్షణీయంగా ఉండి, హాయిగా చదివిస్తుంది. ముఖ్యంగా పాత్రోచిత భాషని ఉపయోగించడం రచయిత్రి అనుభవాన్ని తెలుపుతుంది. పాత్రల ఉద్వేగాలను  అత్యంత సహజంగా వర్ణించారు. భయము, ధైర్యం, విచారం సంతోషం, పట్టుదల, సంశయం.. ఉద్వేగం ఏదైనా సరే, అందుకు తగిన వర్ణన, తగిన భాష కనబడతాయి. ఉదాహరణకు 22వ పేజీలో రాణీ కుముదినీదేవి మానసిక అవస్థని వివరిస్తున్నప్పుడు; 59-60వ పేజీలలో మాంత్రికుడు మరిడయ్యని తుదముట్టించినప్పుడు ప్రత్యక్షమైన దేవతకి మలయధ్వజుడు వేసిన ప్రశ్న, అందుకామె చెప్పిన జవాబు – రచయిత్రి చేసిన వర్ణన ఆమె పాత్రల స్వరూప స్వభావాలను ఎంతగా అధ్యయనం చేసి, పాత్రలకి ప్రాణప్రతిష్ఠ చేశారో తెలుపుతుంది.

నవల చివరలో కొందరు రచయితలు, రచయిత్రులు, పాఠకుల అభిప్రాయాలను అందించారు. నవల సారాంశాన్ని వివరించాయవి.

“భువనేశ్వరీదేవి అమ్మవారిని వర్ణిస్తున్నప్పుడు మణిద్వీప వర్ణన గుర్తొచ్చింది” అన్న పద్మజ ముడుంబై గారి మాటలు అతిశయోక్తులు కావు. 79వ పేజీలోని వర్ణన పాఠకులను ఒక రకమైన ట్రాన్స్‌లోకి తీసుకువెడుతుంది.

“మంచి భాష, కథను నడిపించగల నేర్పు ఉంటే, ఏ ఇతివృత్తం అయినా పాఠకులను అలరిస్తుంది. ఈ నవలా అలరిస్తుంది” అన్న అత్తలూరి విజయలక్ష్మి గారి మాటలు అక్షరసత్యాలు.

~

లోపలి పేజీల్లో నవల శీర్షిక ‘జయకేతకం’ అని ఉంది. నవల చివరలో అభిప్రాయాలు వ్రాసిన వారిలో కొందరు ‘జయకేతకం’ అనీ, కొందరు ‘జయకేతనం’ అనీ ప్రస్తావించారు. కానీ పుస్తకం కవర్ పేజీలో ‘జయకేతనం’ అని ఉంది.

***

జయకేతనం (జానపద నవల)
రచన: సంధ్యా యల్లాప్రగడ
ప్రచురణ: అచ్చంగా తెలుగు ప్రచురణలు
పేజీలు: 94
వెల: ₹ 150/-
ప్రతులకు:
అచ్చంగా తెలుగు ప్రచురణలు,
హైదరాబాద్.
ఫోన్:  8558899478 (వాట్సప్ మాత్రమే)

Exit mobile version