[శ్రీ మన్నె ఏలియా రచించిన ‘జీవగంజి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
ఆమె పిలుపులో ఏ మహత్యముందో కానీ “పలారముల్లో పలారం. ఎముడాల రాయేసుని పలారం” అని కేకేస్తే వాడకట్టు పిల్లలు తోకచుక్కల్లా ఆకాశం నుంచి వెలుగులు జిమ్ముతూ నేలచేరినట్లు ఆమె వద్ద మెరిసే కళ్ళతో ప్రత్యక్షమవుతారు.
ఎముడాల రాయేసుడు ఎక్కడున్నాడో కానీ కొమురవ్వ రూపంలో పక్కనే ఉన్నట్లు అనిపించేది. రుచికరమైన పలారానికి బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు మురుసుకుంట ఆమె చుట్టూ చుట్టుకునే వాళ్ళం.
సోమవారం ఎప్పుడొస్తదా అని ఎదిరిచూసే వాళ్ళం. పలారం అనగానే నోట్లో లాలాజలం ఊరేది. మనసు ఉప్పొంగేది. ఆ రోజు మా సంబురం సంతోషంతో గంతులేసేది. సాకలి కొమురవ్వ ఇంటి చుట్టుపక్కలనే ఆడుకునే వాళ్ళం.
తలస్నానం చేసి,వెంట్రుకలు విరబోసుకొని, నుదుటికి అడ్డం విబూతి బొట్టు పెట్టుకొని, చేతిలో రాగి పళ్ళెం పట్టుకొని పలారం అని పిలుస్తుంటే, అక్షయపాత్రతో మారువేషంలో ప్రత్యక్షమైన సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరిలా కనబడేది.ఆ పలారమే మాకు మాధుకర భిక్షాన్నంలా అనిపించేది. పలారం అడిగినా కొద్ది పంచుతూ ఉండేది.
“దూరం దూరం” అంటూ చీర చెంగులు ఒకచేత దగ్గరికి అదిమి పట్టుకొని “ముట్టుకోకుర్రి.. నన్ను ముట్టుకోకుండ్రి. పొరగండ్లారా! దూరం దూరం జరగుండ్రె” అని ఎడమ చేతితో సైగ చేస్తూ మీది నుంచి ఫలహారం చేస్తుండేది.
మా చూపులన్నీ ఆమె చేతిలోని పళ్ళెం వైపు, ప్రసాదం వైపే.చూసినా కొద్దీ నోట్లే నీళ్లూరుతుండేవి. అడిగినా కొద్ది లేదనుకుంటా అందినాకొద్ది ఇస్తుండేది.
పలారం కోసం మేము పోటీ పడేవాళ్ళం. నాకు ముందంటే నాకు ముందు పెట్టుమనీ, పొట్టి పొట్టి చేతులు చాపుతూ నిక్కి నిక్కి మీగాల్ల మీద ఆమె చుట్టూ తిరిగే వాళ్ళం.
దేవునికి కొట్టిన కొబ్బరి ముక్కలు, బెల్లం, పప్పు పుట్నాలు కొంచెం కొంచెం పెట్టేది. మంది ఎందరున్నా ప్రసాదం మాత్రం అంతే. ఒక్కసారి పెట్టగానే నోట్లేసుకొని మా తమ్మునికి, మా అక్కకు అని అడిగి మేమే తినేవాళ్ళం. కొమురవ్వ పలారం పెట్టనంటే – “మరి నిన్ను ముట్టుకుంటం” అని బెదిరిచ్చేవాళ్ళం. అలా అనగానే ఉన్న కాడికి పెట్టేది.
అంగడికి వెళ్లోచ్చినా, ఎటైన బయటకు వెళ్ళొచ్చినా ఇంట్లోకి వెళ్ళక పోయేది. నేరుగా చేదబావి కాడికి వెళ్ళి, నీళ్ళు తొడుకోని తల మీది నుండి చల్లుకుని బట్టలు విప్పేసి, వేరే బట్టలు కట్టుకొని పునీతం అయ్యానని అనుకోని ఇంట్లోకి వెళ్ళేది.
కొమురవ్వ బయటకు వెళ్ళి వస్తుందంటే బిడ్డనో, మనవరాలో ఆమె గుడ్డలు పట్టుకొని సిద్ధంగా వుండేవాళ్ళు.
సాకలి కొమురవ్వ అంటే వూర్లే తెలియని వాళ్ళు లేరు. శివునికి పరమభక్తురాలు. రోజుకో దేవుని పేరిట ఉపవాసం వుంటుంది. ఉపవాసం వల్లనో శరీర తత్వమో గాని బక్క పలచని మనిషి, ఒత్తైన రింగుల జుట్టు. ముక్కుకు ధగధగా మెరిసే పుడుక. చెవులకు వ్రేలాడే బంగారు పోగులు. చేతికి గల గలలాడే గాజులు. దండలకు వెండి కడియాలు.
తండ్రి కుల పెద్ద. ఊరు పటేన్లతో సోపతి. దొరతోని ఎక్కువగా తిరిగేవాడు. అట్లనో ఇట్లనో కష్టపడి ఐదు ఎకురాల పొలం సంపాదించిండు. పంటలు కూడా బాగానే పండుతాయి. సంవత్సరానికి తిండికి పోను మిగిలినవి అమ్ముకునేంత పంట పండుతుండేది. బట్టకు పొట్టకు కొదువలేదు.
కులంలో పంచాయితీ, పెళ్లికి, చావుకు తానే ముందుండే వాడు. ఆయన ఒక విషయంలో తప్ప ఎప్పుడు బాధ పడేవాడు కాదు.
పిల్లలు లేని లోటు కొట్టొచ్చినట్టు కనబడేది. చాలా సంవత్సరాలు మొక్కని దేవుడు లేడు. తొక్కని గుడి మెట్టు లేదు. ఉపవాసాలు, దీక్షలు, వ్రతాలు చేయంగా చేయంగా శివయ్య కరుణించిండు.
కడుపులో నలుసు పడింది కొమురవ్వ రూపంలో. కొమురవ్వ పుట్టుక, పెంపకం అంతా భక్తితోనే గడిచింది. దైవభక్తి వాళ్ళ అమ్మ నుండే అలవడింది. ఆసాములకు బట్టలు ఉతికిన అన్నం అడుక్కొచ్చుకునేవారు కాదు. వండుకొని తింటూ నిష్ఠగా జీవించేవారు.
కొమురవ్వ మొగడు గొడ్డు కష్టం చేస్తడు. కూలీనాలీ, వ్యవసాయం పని.. అదీ ఇదీ అనేది లేదు. ఏ పని చెప్పినా కాదనడు. వడిగల గుర్రానికి తిరుగుడు కాల్ల రోగం అన్నట్టు, అన్నీ బాగానే వున్న సాయంత్రం మాత్రం కడుపునిండా తాగక పోతే వుండలేడు. తాగితే మనిషిని పలుకరించ వశం కాదు. తెల్లవారితే ఆయనంత మంచోడు దొరుకడు.
కొమురవ్వ వూరోల్ల బట్టలు మల్లె పూలలగా తెల్లగా వుతుకుతది. రోజు చాకిరేవుకు పోవడం తప్పేది కాదు.
వీళ్ళకు కూడా ఆలస్యంగానే ఒక బిడ్డ పుట్టింది. పదేండ్లప్పుడు విధి కన్నెర్ర చేసింది. తాగి తాగి కొమురవ్వ భర్త కాలేయం పాడైంది. కొమురవ్వ భర్తను బ్రతికించుకోవడానికి అప్పు సప్పు చేసింది. బంగారం కుదువ బెట్టింది. పొలం కౌలుకిచ్చింది. ఎన్ని దావాఖాండ్లు తిరిగిన ఫలితం లేదు. దాదాపు ఎనిమిది తొమ్మిది నెలలు యాతన పడి ఒకరోజు కాలంసేసిండు.
కొమురవ్వకు మొగ దిక్కు లేకుండా అయ్యింది. కాలంతో పోటీ పడుతుంది. ఒక్కగానొక్క బిడ్డ పెరిగి పెద్దది అయ్యింది. పెళ్లీడు కొచ్చింది.
కొమురవ్వ చిన్నాన్న కొడుకు కొడుకునే అల్లుడిగా చేసుకోవాలనుకుంది. అట్లా చేసుకోవడం ఆచారం కాదన్నారు ఇరుగుపొరుగు. ఆడబిడ్డ కొడుక్కు తమ్ముని బిడ్డను చేసుకోవడం ఆనవాయితీ. ఇలాంటి పద్ధతి ఎక్కడ లేదని విమర్శించిండ్రు.
చిన్నప్పటి నుండి మొండిదే. ఎందరు వద్దన్నా తమ్ముడు, మరదల్ని ఒప్పించింది. తన ఆస్తి పరాయోడు తినుడెందుకని ఇల్లరికం తెచ్చుకుంది.
అల్లుడు బుద్దిమంతుడు. అన్నీ తానై ఇంటి పని బయట పని చూసుకుంటుండు.
తల్లి బిడ్డలు ఊరోళ్ళ బట్టలు ఉతికితే, అల్లుడు వ్యవసాయం చేస్తున్నడు. కొడుకులాగానే అన్ని పనులు మీదేసుకొని చేస్తున్నడు. కొడుకులు లేనందుకు అల్లుడే కొడుకయ్యిండు.
ఏ కాలమైన తన వంతు ఇండ్లు ఉతకక తప్పదు. కొమురవ్వ జీవితం అంత చాకరేవులోనే గడచిపోయింది. కులవృత్తిని నమ్ముకుంది. ఎండా వాన చలి అన్నీ రేవులోనే.
చాకలి వాళ్ళందరూ ఊరుకు మైలు దూరంగా వుండే వాగుకు వెళ్తారు. రేవులో పెద్దపెద్ద కాగుల్లో బట్టలు వుడక బెట్టి వుతుకుతారు.
రెండు మూడు రోజులనుండి ఆకాశంలో సూర్యుడు కనబడడం లేదు. భయం భయంగానే చాకరేవుకు వెళ్తున్నారు. వస్తున్నారు.
ఒకనాడు ఆకాశం నిండా నల్లని మబ్బులు కమ్ముకున్నాయి. ఎప్పుడు వర్షం పడుతుందా అన్నట్టు వుంది. చల్లని గాలులు వీస్తున్నాయి. ఈ రోజు తప్పక వర్షం పడొచ్చు అనుకుంటూనే బట్టలు వుతుకుతున్నారు. ఎవరి జాగ్రత్తలో వాళ్ళు వున్నారు. వాతావరణాన్ని గమనిస్తూనే వాళ్ళ పని చేసుకుపోతున్నారు.
దూరంగా అడివిలో ఎక్కడో వర్షం పడ్డట్టుంది. అకస్మాత్తుగా వాగు ఉధృతరూపం దాల్చింది. మురికి నీళ్ళ వరద వస్తుంది. విరిగిన చెట్లకొమ్మలు, రాలిన ఆకులూ, వేర్లూడిన చెట్లు కొట్టుకొస్తున్నాయి. వరద నీళ్ళు వాగులోని రాళ్ళను తాకి బలబల చప్పుడు చేస్తున్నాయి. అందరు గజ్జు మన్నారు. చూస్తుండగానే వరద వాళ్ళకు కొద్ది దూరంగా రానే వచ్చింది. ఒక్కసారిగా చాకలి వాళ్ళందరూ భయంతో కేకలేసుకుంటూ ఒడ్డు ఎక్కుతున్నారు.
పాపం కీళ్ల నొప్పుల కొమురవ్వ కాలు జారీ వాగులో పడిపోయింది. కాపాడమనీ అందరూ కేకలేస్తున్నారు. ఎవరు సాహసం చేయడం లేదు. ఎవరికి దైర్యం చాలడం లేదు. నీటి ప్రవాహం ఎక్కువగా వుంది. వాగులో కొద్దిదూరం కొట్టుకొని పోయింది. నీళ్ళల్లో మునుగుతూ తేలుతుంది. ఒడ్డు మీద భిగ్గరగా కేకలు వేస్తూనే వున్నారు. వరదలో కొట్టుకొచ్చిన ఎండిన మొద్దును గట్టిగా పట్టుకొని నీటిలో కొట్టుకుపోతుంది. “కాపాడండి, కాపాడండి” అంటూ కేకేలేస్తుంది. గుండ్లకు ఒరుసుకుంటూ పోతూంటే నీళ్లల్లో దెబ్బలు బలంగా తాకుతున్నాయి. ఎవ్వరిని పిలిచినా ఎవరూ కాపాడుతలేరు. బతికినా చచ్చినా శివుని కొరకే తన మాట తనకే గుర్తొచ్చింది. “కాపాడు శివ్వా..! కాపాడ్రా శివ్వా..” అని అరుస్తుంది.
వాగు ఒడ్డుకు మాదిగ శివ్వడు మోదుగు ఆకులు కోస్తున్నాడు. అరుపులు విన్నడు. కొట్టుకు పోతున్న కొమురవ్వను చూసిండు.
వాగులోకి దూకి కొట్టుకు పోతున్న కొమురవ్వ తలవెంట్రుకలు దొరికుచ్చుకున్నాడు. ప్రాణాలకు తెగించి వరదలోని చాకచక్యంగా అంత దూరాన కొమురవ్వను ఒడ్డుకు చేర్చిండు.
అప్పటికే నీళ్ళు మింగింది కొమురవ్వ. కడుపు వుబ్బింది. ఎల్లెలుక పడుకోబెట్టి కడుపు మీద రెండు చేతులతో బలంగా నొక్కిండు. బల్కు బల్కుమని రెండుమూడు సార్లు కడుపులున్న నీళ్ళు కక్కింది. అందరూ కొమురవ్వ! కొమురవ్వ! అంటూ గట్టిగ పిలుస్తున్నరు.
వులుకూ పలుకు లేదు. అందరూ ఆశలు వదులుకున్నరు. కొమురవ్వ బిడ్డ లక్ష్మి పెద్దగా ఏడుస్తుంది. “ఏమన్నా చేసి మా అవ్వను నువ్వే బతికియ్యు” మనీ రెండు చేతులెత్తి వేడుకుంది మాదిగ శివ్వన్ని.
శివ్వడు మాత్రం తన ఆఖరి ప్రయత్నం చేస్తున్నడు. నోట్లే నోరు పెట్టి గట్టిగా ఊపిరి ఊదుతున్నడు. అందరూ చుట్టూ చేరి చూస్తున్నరు. ఎవరి నోటి వెంట మాట లేదు.
కొద్ది సేపటికి సన్నగా మూలిగింది కొమురవ్వ. అందరి ప్రాణాలు లేచివచ్చినట్టయ్యింది. బలహీనంగా కండ్లు తెరచింది. ఏదో లోకంలో వున్నట్టు చుట్టూ చూసింది.
“అవ్వా! ఇప్పుడు ఎట్లా వుందే?” అని బిడ్డ అడిగింది.
“నీ పానం కాపాడిన దేవుడు” అని శివ్వన్ని చూపించింది.
కొమురవ్వ ఒక్కసారి కండ్లు మూసి తెర్చింది. లేచి కూర్చుని రెండు చేతులు ఎత్తి శివ్వనికి దండం పెట్టింది. ‘శివ్వడు మాదిగోడు కదా!’ అని మనసులో అనుకుంది.
‘నా భక్తి సర్వనాశనమైంద’ని బాధపడ్డది. ముట్టరానోడు ముట్టిండా? పట్టరానోడు పట్టిండా? నాకు ఈ బతుకు వద్దు. ఈ ఎంగిలి బతుకు అసలే వద్దనీ మనాది సురువైంది.
ఊర్లె వున్నా గుడికిపోయింది. తన భక్తి కలుషితమైందనీ బాధ వెళ్ళగక్కింది. వివిధ విరుపులు, పూజలు, ఆచారాలు చెప్పారు. పదకొండు రోజులు, ఇరువై ఒకటో రోజు మండల దినం ఉపవాసం ఉండాలని ప్రత్యేక పూజలు చేయాలని కొంతమంది చెప్పారు. అవన్నీ చేసినా ఆమెకు మనశ్శాంతి లేదు. నువ్వు ఎన్ని చేసినా కలుషితమైనదానివి మలినమైన దానివి అని మనసు పదేపదే హెచ్చరిస్తుంది.
చావే శరణ్యం అనుకుంది. కొమురవ్వ స్థిమితంగా ఉండలేకపోవడం వల్ల బిడ్డకు, అల్లునికి కూడా మనశ్శాంతి కరువైంది. ‘నా ప్రాణం పోతే శివయ్య దగ్గరికి పోదు కదా!’ అని పదేపదే గుర్తుజేసుకుంటు కలవరిస్తుంది.
ఇదేం కర్మం అని ఊర్లె జంగమయ్య దగ్గరికి తీసుకెళ్లారు. జంగమయ్య మాట అంటే కొమురవ్వకు గురి.
ఉపదేశం ప్రారంభించాడు. “ఒకనాడు శంకరాచార్యులు వెళ్లే దారిలో చండాలుడు ఎదురైతే ‘జరుగు జరుగు’ అని గుడ్లు తెరిచి కోపంగా శిష్యులు చూశారు. చండాలడన్నాడు కదా ‘స్వామీ! నన్ను పక్కకు జరుగుమంటున్నావా? నాలోని శివున్ని పక్కకు జరుగుమంటున్నావా? చెప్పు. చెప్పుస్వామి?’ అని ప్రశ్నించాడు.
శంకరాచార్యుల స్వామికి అతని ప్రశ్నతో అతనిలో శివుడు కనబడ్డాడు. వెంటనే అతని పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. మనము అంతకంటే గొప్ప వారమా తల్లీ!
మరొకటి చెప్తున్నాను విను కొమురవ్వా! సచ్చినోన్ని కాలబెట్టుటోడు తలారోడు. తలారి లేని ఊళ్ళే మాలోడు లేదా మాదిగోడు చేస్తాడు.
మనిషి తల పండు కాటిలో కాలాక ఆ తలకాయను కాలిందా లేదా అని కట్టితో పొడుస్తాడు. కాలితే కట్టే కపాలంలో ఇరుక్కుపోతుంది. అప్పుడు ఆ కట్టె రావాలంటే వాని ఎడమ కాలుతో కాలిన కపాలంను తొక్కి కట్టెను గుంజుతాడు. అప్పుడు గాని మనకు సర్గం దొరకదు” అని బోధచేసిండు.
కొమురవ్వ మనసు తేలిక పడ్డది. శివ తత్వము బోధపడింది. ఈ మాటలు విన్న తర్వాత కొమురవ్వ శివ్వనిలో శివున్ని చూసింది.
తన ప్రాణం కాపాడిన దేవుడిలాగా భావిస్తుంది శివ్వడిని. రాజ రాజేస్వరుడే శివ్వని రూపంలో వచ్చిండని అనుకుంది.
ఏదో విధంగానైనా తన రుణం తీర్చుకోవాలనుకుంటుంది. ఏ పండుగోచ్చిన పబ్బమొచ్చిన వాణ్ని మర్చిపోకుండా ఏదో రూపంలో తన కృతజ్ఞతను క్రియల రూపంలో వ్యక్తపరుస్తూనే వుంది.
ప్రతి దసరా పండుగకు శివ్వని కుటుంబానికి కొత్త బట్టలు పెడుతుంది. పలహారులిస్తుంది.
ఇంట్లో అందరు శివ్వయ్యని గౌరవపూర్వకంగా చూస్తున్నారు.
రోజులు దినాలు సంవత్సరాలు గడచిపోతున్నాయి. కాలం గడిచింది.
కొమురవ్వ వృద్ధాప్యంతో నెలలుగా మంచం పట్టింది. తిండి తినడం కష్టంగా వుంది. మంచంలో ఎముకల గూడులాగా వుంది. రోజు రోజుకు ఆరోగ్యం క్షీణిస్తుంది. మాటలు కూడా మాట్లాడలెనంత బలహీన పడింది.
చుట్టాలు దగ్గరి వాళ్ళు వచ్చి చూసి పోతున్నారు. రేపో మాపో అన్నట్టుగ వుంది పరిస్థితి.
ఒకనాడు లేచేసరికి గుడ్లు తేలేసింది. ఎంత పిలచినా పలకడం లేదు. ఇక కొన్ని గంటలే అనుకుంటున్నారు. దగ్గరి చుట్టాలకు కబురు పంపించినారు.
మంచం చుట్టూ ఆడవాళ్లు కూర్చొని ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటున్నారు. రాగి చెంబులో తులసి ఆకూ నీళ్ళు చెంచాతో ఒక్కొక్కరు తాగిస్తున్నారు.
మూడు రోజులు గడచింది. ఎంతకు ప్రాణం పోవడం లేదు. ఊపిరి మాత్రమే వుంది.
“ఎవరి మీదనో పాణం కొట్టుకుంటుంది. వాళ్ళు వచ్చేంత వరకు ప్రాణం పోదు. వాళ్ళను పిలవండి” చుట్టూ చేరిన బంధువులు అంటున్నారు.
రావాల్సిన వాళ్ళు, కావాల్సిన వాళ్ళు అందరు మూడు రోజుల నుండి మంచం చుట్టే వున్నారు. అందరు విచారంగా ఎక్కడివాళ్ళు అక్కడే కూర్చొని ఎప్పుడు పోతుందా అని ఎదురు చూస్తున్నారు.
ఒక్కొక్కరు పేరు చెప్తూ తులసి నీళ్ళు తాగిస్తున్నారు. సగం బయటకే కారి పోతున్నాయి.
కుల పెద్ద కొమురవ్వ బిడ్డను బయటకు పిల్చిండు.
“ఇంకా అవ్వ పానం ఎవ్వరిమీదనో కొట్టుకుంటుంది. అంత కావాల్సిన వాళ్ళు ఎవరన్న వున్నారేమో గుర్తు చేసుకోండి” అన్నడు.
లక్ష్మి, ఆమె భర్త ఒకరి మొకం ఒకరు చూసుకున్నారు.పక్కకు వెళ్లి చర్చించుకున్నరు.
అక్కడ చేరిన వాళ్ళు కల్పించుకొని “ఏ ఊర్లె వున్నారో జల్ది పిలిపియ్యనిది పానం పోదు” అంటున్నారు.
“మనిషిని పంపించినం” అని మంచం కోడుకు అనుకోని కూర్చుంది బిడ్డ లక్ష్మి.
కొద్ది సేపటి తర్వాత.. మాదిగ శివ్వయ్య వచ్చి వాకిట్ల నిల్చున్నాడు.
పానం పోకముందే దప్పులోల్లు వచ్చినట్టున్నరనుకుంటున్నారు అందరు.
లక్ష్మి వాణ్ని రమ్మని సైగ చేసి పిలిచింది.ఇక్కడికి వాడేందుకే అంటున్నారు కొందరు.
వాకిట్లో నిల్చున్న శివ్వయ్య దగ్గరికి లక్ష్మి పోయి లోపలికి తీసుకొని వచ్చింది. అందరు గబగబా లేచి చీర చెంగులు దగ్గరికి పట్టుకొని దూరంగా నిల్చున్నారు.
శివ్వయ్య మంచం దగ్గర నిల్చున్నడు. రాగిచెంబు వాడి చేతికి ఇచ్చింది లక్ష్మి.
అందరు గుసగుసలు పెట్టుకుంటున్నారు. “ఇదెక్కడి చుట్టరికం మాదిగోడి తోని జీవగంజి తాగిస్తుంది” అని చెవులు కొరుక్కుంటున్నారు.
“అవ్వా! శివ్వన్న అచ్చిండు. ఒకసారి కండ్లు తెరచి చూడు” అని చెవిలో గట్టిగ అంది లక్ష్మి.
బలవంతంగా కండ్లు తెరచింది కొమురవ్వ.
చెంచాతోని మెల్లగా తులసి నీళ్ళు నోట్లో పోసిండు. వెంటనే కండ్లు మూతలు పడ్డాయి.
అందరి ఊపిరి ఒకేసారి ఆగిపొయిందన్నట్టు కట్టే సరసుకు పోయారు చుట్టాలు.
కొమురవ్వ తల ఒక పక్కకు వాల్చేసింది.
“మమ్మల్ని విడచి పెట్టి పోతున్నవానే అవ్వా!” కొమురవ్వ మీద పడి బోరునా ఏడుస్తున్నది బిడ్డ.
సొంత తల్లి చనిపోయినట్టుంది శివ్వనికి. శివయ్య కండ్లల్ల నీరు కారి పోతున్నది. అందరు ముక్కులకు కొంగులు అడ్డంగా పెట్టుకొని శివన్ని, కొమురవ్వను ఏడుస్తూ చూస్తున్నారు. చూస్తూ ఏడుస్తున్నారు. “శివ్వడు అంటే నీకు ఎంత పాణమే అవ్వో” అంటూ..
మన్నె ఏలియా మంచిర్యాల జిల్లా, దండేపల్లిలో 1971 ఆగస్ట్ 10న జన్మించారు. తొలి కథ 2013లో బతుకమ్మలో ప్రచురితం.
వీరి కథలు 40కి పైగా వివిధ పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
ఆకాశవాణి హైదరాబాద్, అదిలాబాద్ కేంద్రాల ద్వారా వీరి కథలు ప్రసారమయ్యాయాయి.
మర్రి చెట్టు కథా సంపుటి 2017లో వెలువరించారు.
చిరునామా: MIG 134, న్యూ హౌసింగ్ బోర్డు కాలనీ, అదిలాబాద్ 504001.