[శిరీష పద్మ యర్రంశెట్టి గారు రచించిన ‘జీవన గణితం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
వేకువ వెలుగు
నిశ్శబ్దాన్ని చెదరగొట్టి
భూమి ముఖంపై
చల్లని స్పర్శ వదిలింది..
పచ్చిక అంచుల్లో
మెరుస్తున్న చుక్కలు
ప్రకృతి వేసుకున్న
వెండి లెక్కలు!
లోపల కలిగిన
సన్నని వణుకు
చలి ప్రభావం కాదు
బతుకు గణితం!
రాత్రి ఒడిలో
కొన్ని కలలు పెరుగుతాయి
కొన్ని ఇళ్లలో
నిద్రకే లెక్క ఉండదు!
హేమంత చీకట్లు
నిడివి పెంచుతుంటే
లోపలి వేడి
మనిషినే కరిగిస్తుంది.
ఋతువులు మారుతాయి
సంవత్సరాలు తిరుగుతాయి
కానీ..
పేదవాడి ఖాతాలో
ఎప్పుడూ మైనస్ నే!
వెండి మంచులో
సౌఖ్యం నడుస్తుంటే
ఫుట్‌పాత్ అంచున
బాల్యం..
చలికి అప్పగింత!
ఉదయం ఒక ప్రయత్నం
సాయంత్రం ఒక నష్టం
జీవితం మొత్తంగా
లాభం కాని లెక్క!
చెట్టు నీడలో
నిశ్శబ్ద జీవితం
పుస్తకాలు లేవు
కానీ..
అనుభవమే సూత్రం!
ఒకవైపు ఆకలి
మరోవైపు చలి
ఇల్లు కాదు
సమీకరణం!
చివరికి..
ఎన్ని లెక్కలు వేసినా
మనిషి విలువ
సున్నాకే చేరితే
ఈ గణితం ఎందుకు?
