Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జీవన జ్యోతి

[ఎం.ఆర్.వి. సత్యనారాయణ మూర్తి గారు రచించిన ‘జీవన జ్యోతి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

పొద్దుటి నుండీ తిరగడం వలన తలనొప్పి వచ్చింది సంధ్యకి. రెండు పీరియడ్లు అయ్యాయి. మూడో పీరియడ్ ఖాళీ. కాలేజీ కాంటీన్‌కి వచ్చింది, కాస్త టీ తాగితే రిలీఫ్‌గా ఉంటుందని. కాంటీన్‌లో సరోజ కనిపించి అడిగింది, “మీ నాన్నకి ఎలా వుంది?” అని.

“జ్వరం తగ్గింది. ఇంకా నీరసం తగ్గలేదు” అంది సంధ్య. సరోజ టీ తాగి, వెళ్ళిపోయింది. టీ కప్ తెచ్చుకుని కాంటీన్ బయట వరండాలోని కుర్చీలో కూర్చుని టీ తాగుతోంది సంధ్య.

అకస్మాత్తుగా “వంకాయలు.. బీరకాయలు.. బెండకాయలు” అంటూ నలుగురు కుర్రాళ్ళు నడుచుకుంటూ కాంటీన్ లోకి వచ్చారు. సంధ్య వాళ్ళకేసి చూసింది రోషంగా. చక్రవర్తి వంకరగా నవ్వుతూ ఆమె ముందు నుంచి వెళ్ళాడు.

“ఏరా మావా, కూరగాయలు ఎప్పటినుండి అమ్ముతున్నావు?” అడిగాడు శేషగిరి వ్యంగ్యంగా చక్రవర్తి కేసి తిరిగి.

“ఖాళీగా కూర్చుంటే, మనకి గొడ్డుకి తేడా ఏముంటుంది? అందుకే స్వయం ఉపాధి సేత్తన్నానన్న మాట” అన్నాడు చక్రవర్తి, రావుగోపాలరావుని అనుకరిస్తూ. అందరూ అతని మాటలకి ఘోల్లున నవ్వారు.

టీ గ్లాసు అక్కడే పెట్టి విసా విసా నడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది సంధ్య. వెనకనుండి వాళ్ళ నవ్వులు, “వంకాయలు.. బీరకాయలు” అంటూ అరవడం వినిపిస్తూనే ఉన్నాయి ఆమెకి. లేడీస్ వెయిటింగ్ రూమ్ లోకి వెళ్ళింది సంధ్య. ఆమె వెనకే వచ్చిన వనజ “చూడు సంధ్యా. నేను అంతా చూసాను. వాళ్ళు బలిసిన కుక్కలు. తండ్రులు సంపాదిస్తూ ఉంటే, కష్టం తెలియక విర్రవీగుతున్నారు. వాళ్ళ మాటలు పట్టించుకోకు. ఇంక రెండు నెలలలో మన ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోతాయి. వాటిమీద దృష్టి పెట్టు. తర్వాత వాళ్ళు ఎవరో, మనం ఎవరో..”అని అనునయించింది.

“మా నాన్న వారం రోజుల నుండి జ్వరం వచ్చి లేవడం లేదు. ఇంట్లో ఉన్న కూరగాయలు పాడైపోతాయని నేను, సైకిల్ మీద తిరిగి వాటిని అమ్మాను. నేను ఏమి తప్పు చేసానని వాళ్ళు హేళన చేస్తున్నారు?” అంది సంధ్య కళ్ళ నిండా నీళ్ళు నింపుకుని.

“మన పేదరికం వారికి వినోద వస్తువు అయ్యింది. అంతే. మనసు నిబ్బరపరచుకో. చదువు మన ప్రథమ లక్ష్యం. అప్పుడు మనం ఎవరినీ లెక్కచేయవలసిన అవసరం ఉండదు” అంది సరోజ. కాసేపటికి బెల్లు మోగింది. కళ్ళు తుడుచుకుని మళ్ళీ క్లాస్ కు  వెళ్ళింది సంధ్య, స్నేహితులతో కలిసి.

కాలేజీ అయ్యాకా ఇంటికి వెళ్ళింది సంధ్య. తండ్రి ఇంటి బయట కూర్చుని తల్లితో మాట్లాడుతున్నాడు.

ఆమెలోని విచారం మాయం అయ్యింది. తండ్రిని పలకరించి లోపలకు వెళ్ళింది. రెండు రోజులు గడిచాకా రమణయ్య కూరలు తీసుకుని పక్క ఊరు సంతకు వెళ్ళాడు. సంతలో అమ్మగా మిగిలిన కూరలు సంచీలో వేసుకుని ఇంటికి తెచ్చాడు. వారంలో అయిదు రోజులు పక్క గ్రామాలలో జరిగే సంతలలో దుకాణం వేసి, కూరలు అమ్ముతూ ఉంటాడు రమణయ్య. సంతలో మిగిలిన కూరలు పక్క వీధిలో వాళ్లకు అమ్ముతూ ఉంటుంది, రమణయ్య భార్య కాంతమ్మ. రమణయ్యకి జ్వరం వచ్చినప్పుడు, కాంతమ్మ అతన్ని కనిపెట్టుకుని ఉంది. అప్పుడు సంధ్య కూరలు అమ్మడం, ఆమె క్లాస్మేట్లు మగపిల్లలు చూడటం, కాలేజీలో ఆమెని హేళన చేయడం జరిగింది. కాంతమ్మకి ఎడమచేయి పోలియో వచ్చి చచ్చుపడిపోయింది. ఎక్కువ శ్రమపడలేదు. అందుకే ఇద్దరి ఇళ్ళల్లోనే పాచిపని చేసి కుటుంబానికి సాయపడుతోంది.

వారం గడిచాకా, ఒకరోజు సంధ్య క్లాస్‌కి వెళ్లేసరికి, బోర్డు మీద సుద్దముక్కతో ఒక అమ్మాయి బొమ్మ వేసి ఉంది. ‘వంకాయలు.. బీరకాయలు.. బెండకాయలు’ అన్న మాటలు కూడా రాసారు బోర్డు మీద. తనని బాగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్న ‘గ్యాంగ్’ పనే అని గ్రహించింది సంధ్య. తన ధైర్యమే తనకి కవచం అని గ్రహించింది.

“బొమ్మ బాగా వేసారు. వేసిన వాళ్ళ పేరు కూడా రాస్తే నేను వారిని అభిననందించే దానిని కదా” అంది నవ్వుతూ సంధ్య. ఫైనల్ పరీక్షలు వారం రోజుల ముందు, రమణయ్య సంత నుంచి ఇంటికి వస్తూ ఉండగా, అతని సైకిల్‌ని, లారీ గుద్దేయడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ కష్ట సమయంలో సంధ్యకి, ఆమె స్నేహితులు అండగా నిలిచారు. ఆమెకి ధైర్యం చెప్పి పరీక్షలు రాయించారు. భర్త చనిపోవడంతో బెంగ పెట్టుకుని, కాంతమ్మ మంచం పట్టింది. తండ్రి స్నేహితుడు గురవయ్య సాయంతో కూరగాయలు తీసుకుని పక్క పల్లెల్లో అమ్మి కుటుంబాన్ని నెట్టుకొచ్చింది సంధ్య.

ఒకరోజు సంధ్యకి హై స్కూల్‌లో తెలుగు చెప్పిన సుబ్రహ్మణ్యం మాస్టారు శివపురం వచ్చి సంధ్య పరిస్థితి చూసి చాలా బాధపడ్డారు. “చూడు సంధ్యా, నేను హైదరాబాద్‌లో మా అబ్బాయి దగ్గర ఉంటున్నాను. వాడు పెద్ద కాలేజీ నడుపుతున్నాడు. నీకు ఏదో ఒక దారి చూపిస్తాడు. నీ చదువు ఆగకుండా చూస్తాడు” అని చెప్పి, ఆమెని కాంతమ్మనీ హైదరాబాద్ తీసుకువెళ్ళారు. అది తన జీవితంలో గొప్ప మార్పు తీసుకువస్తుందని సంధ్య ఆనాడు అనుకోలేదు.

***

హాలులోకి వచ్చిన అనూరాధ, తండ్రి ఆ స్త్రీమూర్తి పటానికి చేతులు జోడించి నమస్కరించి నెమ్మదిగా వచ్చి సోఫాలో కూర్చోవడం గమనించింది. వెళ్లి తండ్రి పక్కనే కూర్చుంది.

“నాన్నా, ఈరోజు నా పుట్టినరోజు కదా. నేను ఏమి అడిగినా ఇస్తానన్నారు కదా. ఆ ఫోటోలో ఉన్న ఆవిడ గురించి నిజం చెప్పండి. అది చాలు” అంది అనూరాధ. అతను దీర్ఘంగా నిట్టూర్చి, ఆ ఫొటోకేసి మరలా చూసి చెప్పడం ప్రారంబించాడు.

“నేను డిగ్రీ పూర్తీ చేయగానే మీ అమ్మతో నాకు పెళ్లి జరిగింది. మా నాన్నతోపాటు కాంట్రాక్టులు చేయడం మొదలుపెట్టాను. ఏడాది గడిచాకా నువ్వు పుట్టావు. నా బిజినెస్ కూడా పెరిగింది. నువ్వు ఆరవ తరగతిలో ఉండగా మా నాన్న చనిపోయారు. తమ్ముడు ఆస్తి పంచుకుని సిటీకి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి సంవత్సరమే ఎం.ఎల్.ఏ. గారి సిఫారసుతో రెండు కోట్ల విలువైన పెద్ద కాంట్రాక్టు వచ్చింది. రెండు గ్రామాల మధ్య పెద్ద రోడ్ వేయాలి. పని మొదలు పెట్టిన పదిహేను రోజులకు, టౌన్‌లో ఉన్న ఇంజనీర్ గారిని కలిసి వస్తున్నాము, నేనూ గుమస్తా. స్కూటర్ మీద నేను వెనక కూర్చున్నాను. గుమాస్తా డ్రైవ్ చేస్తున్నాడు.

అకస్మాత్తుగా బ్రేకులు ఫెయిల్ అయిన లారీ మమ్మల్ని గుద్దేసి వెళ్ళిపోయింది. చీకటిలో పొదలలో పడిపోయాము ఇద్దరం. చాలా సేపటికి ఎవరో చూసి మమ్మల్ని హాస్పిటల్‌లో చేర్చారు. తలకి బలమైన గాయం అవడం వలన కొన్ని గంటలలో గుమాస్తా చనిపోయాడు. నా కుడికాలు నుజ్జు నుజ్జు అయిపోయింది. తప్పని పరిస్థితులలో మోకాలు వరకూ కాలు తీసేశారు.

పదిహేను రోజులు నేను హాస్పిటల్‌లో ఉన్నాను. మరో పదిహేను రోజులు ఇంటి దగ్గరే ఉన్నాను. నా పార్టనర్ మిత్రుడు రోడ్ కాంట్రాక్టు చూస్తున్నాడు. నేను అప్పుడప్పుడు సైట్ దగ్గరకు వెళ్లి పని ఎంత వరకూ జరిగిందో చూసేవాడిని. బ్యాంకు పనులు, మెటీరియల్ కొనడం, పనివాళ్ళ జీతాలు అన్నీ నా పార్టనర్ చూసేవాడు. నేను సంతకాలు చేసేవాడిని. రోడ్ నిర్మాణం పూర్తీ అయ్యింది. కానీ నాకు రావాల్సిన డబ్బు నా పార్టనర్ నాకు ఇవ్వలేదు. నన్ను మోసం చేసాడు నా పార్టనర్. నేను కాంట్రాక్టు వదులుకుంటున్నట్టు, కేవలం మేనేజర్‌గా ఉండటానికి అంగీకరించినట్టు, ఒక పత్రాన్ని సృష్టించాడు. అతని మీది నమ్మకంతో నేను ఏ పత్రాన్ని సరిగా చూడకుండా సంతకాలు చేసేవాడిని. అదే నా కొంప ముంచింది” ఒక్క నిముషం ఆగాడు అతను. అనూరాధ తండ్రికి వాటర్ బాటిల్ తీసి ఇచ్చింది. కొద్దిగా నీళ్ళు తాగి మరలా చెప్పసాగాడు.

“అంతకంటే మరో ఘోరం కూడా నా పార్టనర్ చేసాడు. నా వైద్య ఖర్చుల నిమిత్తం అతని దగ్గర పది లక్షలు తీసుకున్నట్టు మరో పత్రం కూడా సృష్టించాడు. దానితో ఉన్న ఇల్లు కూడా అమ్మివేయాల్సి వచ్చింది.

అవిటితనంతో సిగ్గుపడి, బయటకు వెళ్ళడం తగ్గించాను. పూర్తిగా అతని మీదే ఆధారపడ్డాను. నాశనం అయిపోయాను. ఇంక అక్కడ ఉండలేక, ఈ జిల్లాకి వచ్చాను. నా పరిస్థితి చూసి జాలిపడి, నా పూర్వ మిత్రుడు ఒకడు తన దగ్గర గుమాస్తాగా వేసుకున్నాడు. అతనూ కాంట్రాక్టరే. రెండు సంవత్సరాలు గడిచాయి.

ఒక హై స్కూల్‌కి కొత్త బిల్దింగ్ కట్టాము. దాని ప్రారంభోత్సవానికి జిల్లా కలెక్టర్ జ్యోతి మేడం వచ్చారు. మీటింగ్ అయ్యాకా, కాంట్రాక్టర్‌నీ, నన్నూ ఆమె అభినందించారు. ఒక వారం గడిచాకా కలెక్టర్ గారి నుండి నాకు పిలుపు వచ్చింది. నన్ను ఎంతో ఆదరంగా చూసి, నా పరిస్థితి చూసి జాలి పడి, పక్క మండలం లోని మరో స్కూల్ బిల్డింగ్ కాంట్రాక్ట్ నాకు ఇప్పించారు. రెండు మూడు సంవత్సరాలకి నేను ఆర్థికంగా స్థిరపడ్డాను. నిన్ను కాలేజీలో చేర్పించాను. మన కుటుంబం ఇలా ఉండటానికి కారణం జ్యోతి మేడం. అందుకే ఆవిడకి నేను రోజూ దణ్ణం పెట్టుకుంటాను” అన్నాడు అతను ఆవేదనగా.

“నాన్నా. నేను ఒకసారి ఆవిడని చూడాలి. ఆవిడ ఎక్కడ ఉంటున్నారు?” ఆత్రుతగా అడిగింది అనూరాధ. “ఇప్పుడు ఆవిడ ఢిల్లీలో విద్య మంత్రి గారి దగ్గర పనిచేస్తున్నారు” అన్నాడు అతను.

అనూరాధ నిరాశగా చూసింది తండ్రి కేసి.

“అమ్మా. జ్యోతి మేడం చాలా గొప్పది. డిగ్రీ చదివేటప్పుడు నేను, ఆమె పేదరికాన్ని హేళన చేస్తూ ఎంతో ఇబ్బంది పెట్టాను, అవమానపరిచాను. కానీ ఈ జిల్లాకి కలెక్టర్‌గా వచ్చి, నన్ను చూసినప్పుడు, అవేం పట్టించుకోకుండా, మానవత్వంతో నన్ను క్షమించి, నా జీవితంలో వెలుగు నింపింది. ఆవిడ పూర్తి పేరు సంధ్యాజ్యోతి. అంధకారంతో నిండిన నా జీవితానికి వెలుగు నిచ్చిన, జీవనజ్యోతి ఆమె” అన్నాడు అతను కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ. అనూరాధ తండ్రి భుజం మీద చేయి వేసి అనునయించింది.

అప్పుడే, “చక్రవర్తీ.. చక్రవర్తీ..” అంటూ లోపలకు వచ్చాడు బాల్య మిత్రుడు రవికిరణ్.

“రా.. రవీ.. రా.. ఎలా వున్నావు?” అడిగాడు చక్రవర్తి ఆదరంగా.

“వచ్చే ఆదివారం మా అమ్మాయి పెళ్లి. నువ్వు రావాలి” అని శుభలేఖ చక్రవర్తికి ఇచ్చాడు రవికిరణ్.

“తప్పకుండా వస్తాను” అన్నాడు చక్రవర్తి ఆనందంగా మిత్రుడిని చూస్తూ. మిత్రుడిని చూడగానే వెలిగిపోయిన తండ్రి మొహం చూసి సంతోషించింది అనూరాధ.

Exit mobile version