Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జీవన లయ

[శిరీష పద్మ యర్రంశెట్టి గారు రచించిన ‘జీవన లయ’ పాఠకులకి అందిస్తున్నాము.]

చీకటి ఆకాశం మధుర గీతాల పూలదండ,
మదిలో మెదిలే కథలన్నీ మమకార గంధం.
ఉషోదయ చినుకులు కిరణాల రూపమై,
నేలపై సుధల వర్షం కురిపించే సుందరం..!

పండుగంటే మనసులో మేళవించే సందడి,
ఆనంద తంతులో అల్లుకున్న సవ్వడి.
చిరునవ్వులు చిందించే వెలుగుల దీపాలు,
కళ్లలో వికసించే కాంతి రేఖల జ్యోతి..!

మనసుపై వెలుగుల ముద్దు వేసిన వేకువ,
చిమ్మ చీకటికి నూతన ఆశల కిరణం.
తీపి చేదు కలయికలో జీవన సారం,
బ్రతుకుపంటకు గిట్టుబాటు ఇచ్చే లయ..!

తొలకరి చినుకుల స్పర్శలో మాధుర్యం,
తొలి మాటల్లో మమకారపు రసగంధం.
తేలికైన మనసులో తేలే దృశ్యమై,
మంచు బిందువై మెరుస్తూ ప్రకాశం..!

మౌనపు హృదయంలో మునిగే ఆనందం,
రెండు మనసుల తపనలో తారకామయం.
లోకమంతా విరజిమ్మే ప్రకృతి నాట్యం,
సృష్టి సమకూర్చిన రత్నహారమై మెరుస్తుంది..!

కాలం నేర్పే విశ్వగ్రంథ సారాంశం,
ఋతువుల తపనలో భూమి పరిమళం.
త్రికాలాల వరమై జీవం పండించి,
ప్రాణులల్లా కలసి పరవశించి నర్తిస్తుంది..!

Exit mobile version