Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఓ జిజ్ఞాసు జీవితమూ, అంతరంగమూ – ‘జీవనరాగాలు-1’

[శ్రీ తుర్లపాటి నాగభూషణ రావు గారి ‘జీవన రాగాలు-1’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

తెలియనిది తెలుసుకోవాలన్న కుతూహలమే మానవ ప్రగతికి పునాది. జిజ్ఞాస కలిగిన వ్యక్తుల జీవితానుభవాలు ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. అటువంటి జిజ్ఞాసువులలో ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ శ్రీ తుర్లపాటి నాగభూషణ రావు ఒకరు. తన అనుభవాలను అక్షరబద్ధం చేసి సంచిక వెబ్ పత్రికలో ‘తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర’ పేరుతో వారం వారం పాఠకులతో పంచుకుంటున్నారు. ఈ ఫీచర్ పాఠకాదరణ పొందడంతో, తొలి 20 ఎపిసోడ్స్‌తో, ‘జీవనరాగాలు-1’ పేరిట తన స్వీయచరిత్రని పుస్తకరూపంలో తెచ్చారు.

తుర్లపాటి గారి ఈ స్వీయచరిత్ర చదువుతుంటే, ఆయన పక్కనే కూర్చుని, ఆయన చెప్పే కబుర్లు వింటునట్లుంటుంది. ఓ వ్యక్తిత్త్వ వికాస గ్రంథం చదువుతున్నట్లు అనిపిస్తుంది, అమాయకమైన బాల్యం, చక్కని బాల్య మిత్రులు, వ్యవసాయంతోనూ, పశువులతోనూ అనుబంధం, ముఖ్యంగా గ్రామాలు, చిన్న ఊర్ల లోని నాటి ప్రజల జీవన విధానం, కుటుంబ విలువలు, చదువులు, కొత్త లక్ష్యాలు, ఉద్యోగాలు, వృత్తి ధర్మం, నిబద్ధత, నిష్కాపట్యం, సామాజిక బాధ్యత.. ఇలా ఎన్నో అంశాలు ఈ పుస్తకంలో పాఠకుడిని అక్షరాల వెంట పరుగులు తీయిస్తాయి.

ఈ మొదటి భాగంలో 20 అధ్యాయాలకు శీర్షికలు పెట్టడంలో రచయిత సృజనాత్మకత వెల్లడవుతుంది. తను పుట్టినప్పుడు ఎలుకంతే ఉన్నానని నానమ్మ చెప్పిన విషయాన్ని గుర్తుంచుకుని, మొదటి అధ్యాయానికి ‘ఎలుక పుట్టింది’ అని పేరు పెట్టారు. అడవిరావులపాడు అనే కుగ్రామంలో 1957లో జనవరి 26న పుట్టారు. వారి తల్లిగారికి పురుడుపోసిన మంత్రసాని ‘ఎఱ్ఱది’ ఎలుక పుట్టిందని చెప్పిందట. నానమ్మ అన్నపూర్ణమ్మ వెళ్ళి చూస్తే, నిజంగానే ఎలుకపిల్లలా అనిపించాడట ఆ శిశువు. అప్పటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి పదేళ్ళయింది. అయినా ఆ రోజుల్లో చీకటి పడిందంటే భయం రాజ్యమేలుతుండేదట. చిమ్మచీకట్లో ఆ ఊర్లోని ఓ పాతిక కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తుండేవని చెప్తారు రచయిత. చిన్నప్పటి నుంచి ఏదో ఒక అనారోగ్యం వేధించేదనీ, తనని కాపాడటం తల్లికి ఓ పెద్ద సవాలైందని అంటారు.

తర్వాతి అధ్యాయం ‘కలలు కనే కళ్ళున్నాయి’లో నందిగామలో బిఎస్‌సి చేసి, ఎం.ఎస్.సి. చదవడం కోసం బొంబాయి వెళ్ళడం, మొదటిసారిగా అయినవారికి దూరంగా ఉండాల్సి రావడంతో, కొంత భయం కల్గించినా, సీనియర్లు, సహాధ్యాయులు అందించిన ప్రోత్సాహంతో పి.జి. పూర్తి చేసిన విధానాన్ని చెప్తారు. ఈ అధ్యాయంలో – కాలంతో పాటు వ్యవస్థలో వచ్చిన కొన్ని మార్పులను ప్రస్తావించారు రచయిత. మనీ ఆర్డర్ వంటివి ఒకప్పుడు ఉండేవని చెబితే మా మనవళ్ళు నమ్మక పోవచ్చనని వ్యాఖ్యానించారు. ఆ కాలంలో పోస్టాఫీసు అందించిన సేవల్లో కొన్ని నేడు కనుమరుగయ్యాయని చెబుతూ. టెలిగ్రాం మనీయార్డర్ కంటే వేగంగా డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయ్యే అవకాశం నేడు ఉందని అన్నారు.

ఆత్మీయతను పంచే బంధువులు ఇంటికొచ్చి, తమతో కొన్ని రోజులు గడిపి, తర్వాత వాళ్ళ ఊరెళ్ళిపోతుంటే, ఆ బాధ ఎలా ఉంటుందో ‘ఆనందం ఆవిరి’ అనే అధ్యాయంలో హృద్యంగా వర్ణించారు. ఐదారు దశాబ్దాల క్రిందట కుటుంబంలోని పెద్దలు/పిన్నల ఆప్యాయతలు, అభిమానాలు ఎలా ఉండేవో ఈ అధ్యాయం ద్వారా తెలుస్తుంది. అప్పట్లో బొంబాయి నుంచి ఆంధ్ర ప్రాంతాలకు వచ్చే తెలుగువారు ఎక్కువగా విటి (విక్టోరియా టెర్మినస్) స్టేషన్ నుంచే బయలుదేరేవారని చెబుతూ, అప్పటి వీడ్కోలు విలాపాలు ఎలా ఉండేవో తెలిపారు. “ఓదార్పు మాటలు, ఉత్సాహం కలిగించే కబుర్లు, కళ్లతోనే పలకరింపులు వెరసి మొత్తం సమాజపు సప్తవర్ణ చిత్రం అక్కడ సాక్షాత్కరించేది” అని వ్యాఖ్యానించడంలో సమాజాన్ని పరిశీలించే గుణం, పరిశీలించినదాన్ని మనసులో నింపుకుని, అక్షరాలలో ఒలికించడంలోని రచయిత ప్రజ్ఞ ప్రస్ఫుటమవుతుంది. విక్టోరియా టెర్మినస్ స్టేషన్ సొగసుని, చరిత్రని వివరిస్తారు.

కొత్త పుస్తకం – కమ్మటి వాసన’ అధ్యాయంలో చిన్నతనంలో ప్రతీ ఏడాది కొత్త పుస్తకాలు కొనుక్కునే అదృష్టం తనకి దక్కిందని చెప్తారు. “ఇంట్లో నాపైన అక్కా, అన్న ఉన్నప్పటికీ మా ఇంట్లో కొత్త పాఠ్య పుస్తకాలనే కొని తెచ్చే అలవాటు ఒకటుంది. కానీ, చాలా మంది ఇళ్లలో ‘పెద్దోడి పుస్తకాలున్నాయి కదా, చిన్నోడికి మళ్ళీ కొనడం ఎందుకు దండుగ’ అంటూ పాత పుస్తకాలు మొహాన పడేస్తుంటారు. అంతేనా, అన్నలో అక్కలో వాడేసిన బొమ్మలు, కలర్ పెన్సిళ్లు, చివరకు వాడిన లంచ్ బాక్స్ కూడా చిన్నోడి ‘సంపద’ అవుతాయి. పాతబడిన పుస్తకాలు, అందులో నుంచి వచ్చే అదో రకం చెమట, మురికి వాసనలు పీలుస్తూ చదువుకుంటూ సర్దుకుపోయే పిల్లలను చూసినప్పుడల్లా నాకు బోలెడు జాలేస్తుండేది. ఈ పరిస్థితి మా ఇంట లేనందుకు కాస్తంత గర్వంగానూ ఉండేది.” అన్నారు. కొత్త పుస్తకం ఇచ్చే ఉత్సాహం పిల్లల్లో చదువుపట్ల ఆసక్తి పెంచుతుంటుందనీ, పిల్లల్లో ఊహాశక్తి పెరుగుతుంటుందని తమ తండ్రిగారు ఎవరితోనో అనడం గుర్తుందని అంటూ, ఆయన పిల్లల మనసెరిగిన తండ్రి అని అంటారు. కొత్త పుస్తకాలకి కొన్న ఒకటి రెండు రోజులకే అట్టలు వేసేయడం తనకి నచ్చేది కాదని అంటారు. చిన్న చిన్న ఆనందాలు జీవితంలో ఎంతో విలువైనవనీ, ఇవే మనతో పాటు చివరిదాకా నిలిచే నిజమైన సంపదలని అభిప్రాయపడ్డారు. పుస్తకాలతో తన ఊహాశక్తి ఎలా పెరిగిందో తెలిపారు. తాను చదివిన పుస్తకాలు, అవి తనపై ఏ ప్రభావం చూపాయో ఈ అధ్యాయంలో తెలిపారు.

బక్క కోపం’ అధ్యాయంలో బాల్యంలో చిన్ననాటి స్నేహితులతో ఆడుకున్న రైలాటని తలచుకుంటారు. ఇంజను గాడు, గార్డు గాడు, బాసిజం అంటూ రైలాటని వర్ణిస్తుంటే, చిన్నప్పుడు మనం ఆడిన ‘కూ చుక్ చుక్’ ఆటలు గుర్తు రాక మానవు. కుంపటి మీద బామ్మ చేసే దోసకాయ పచ్చడి రుచి ఎంత అద్భుతంగా ఉంటుందో చెబుతున్నప్పుడు మనకీ తినాలనిపిస్తుంది. శ్రీశ్రీ కవితలు, భగవద్గీత శ్లోకం, అన్నమయ్య కీర్తన తనపై వేసిన ముద్రని ఈ అధ్యాయంలో గుర్తు చేసుకున్నారు రచయిత.

సైకిల్ తొక్కడం నేర్చుకోవడం పిల్లలకి ఓ మధురానుభూతి. ఆ అనుభూతిని ‘అడ్డతొక్కుడు’ అధ్యాయంలో వివరిస్తారు రచయిత. సందర్భానుసారం మంగళగిరిలోని పానకాల నరసింహస్వామి ఆలయం విశిష్టతని తెలియజేస్తారు. పానకాల స్వామి గుడికి పైన కొండ శిఖరంమీద గండాల స్వామి గుడి ఉందనీ, ఈ కొండ పడుకున్న ఏనుగు ఆకారంలో ఉండటం విశేషమని చెబుతారు. బిఎస్‌సి తెలుగు మీడియంలో చదవడం, అనంతరం పి.జి. బొంబాయిలో చదవవడం వల్ల తనలో కలిగిన భయాలు, సంశయాలు, సందేహాలను వివరిస్తారు. భగవద్గీత లోని శ్లోకం, సి. నారాయణ రెడ్ది గారి పాట తనలో కల్గించిన ప్రేరణని తెలుపుతారు. “జీవితం మనం చెప్పినట్లో మనం ఆశించినట్లో సాగదు. దాని ప్రయాణ మ్యాప్‌ని భగవంతుడు ఎప్పుడో నిర్దేశించాడు. మనం పడుతున్న కష్టాలే రేపటి సుఖ జీవనానికీ సోపానాలు అవుతాయని మనకు తెలియకపోవచ్చు. కష్టాల్లోనే సుఖాలు వెతుక్కునే మనస్తత్వం అలవాటు చేసుకోవాలని బొంబాయిలో ఉన్నప్పుడే నిర్ణయించుకున్నాను. మరో విషయం కూడా అర్థమైంది. పెద్దపెద్ద టార్గెట్స్ పెట్టుకుని ప్రయాణం సాగిస్తే కనీసం చిన్నచిన్న విజయాలైనా మనం అందుకోగలుగుతాము” – ఎవరికైనా వర్తించే పాఠం కదూ!

జీవితంలో భయం ఎలా ఉంటుందో ‘భయం నీడలో..’ అనే అధ్యాయంలో చెప్తారు. భయం, వయస్సుతో సంబంధం లేని ఫీలింగ్ అనీ, మన మనసు వీక్‌గా ఉంటే మన నీడే మనల్ని భయపెడుతుంటుందంటారు. పల్లెల్లో వినబడే దెయ్యం కథలను ప్రస్తావిస్తారు. ఆకాశంలో కనబడిన వింత ఆకారాలను వర్ణిస్తూ, అవి తమనెలా భయపెట్టాయో చెప్తారు. అయితే ‘ఇవన్నీ నమ్మవద్దురా. ఉత్తిత్తి కబుర్లే సుమీ’ అని తమ బామ్మగారు మాత్రం ధైర్యం చెప్పేవారని అంటారు. సందర్భానుసారంగా, తెలుగు ప్రజలని భీతావహులని చేసిన ఓ పుకారు గురించి, గోడల మీద ‘ఓ స్త్రీ రేపు రా’ అని వ్రాయడం గురించి గుర్తు చేస్తారు.

ఈత నేర్చుకునే క్రమంలో, నీటిలో మునిగిపోతుంటే, తనని కాపాడి ఒడ్డుకు చేర్చిన మిత్రుడి గురించి ‘ప్రాణ రక్షకుడు’ అనే అధ్యాయంలో చెప్తారు. ఆ మిత్రుడే తదుపరి కాలంలో పలుమార్లు ఆదుకున్న వైనాన్ని చెప్తారు. మున్నేరు చెలమల గురించి, అలనాటి వరదల గురించి చెప్తారు. వరదల కారణంగా పెళ్ళిళ్ళకి ఎలా ఆటంకాలెదురయ్యారో చెప్తారు. అప్పటి పెళ్ళికి సన్నద్ధాలు ఎలా ఉండేవి చదువుతుంటే అబ్బురంగా అనిపిస్తుంది. తాటాకు పందిళ్ళు, పెట్రోమాక్సు లైట్లు, మామిడి తోరణాలు.. మరో లోకానికి తీసుకువెళ్తారు రచయిత. అడవిరావులపాడులో తమ ఇంటి ముందు ఆవరణలో రెండు పాతరలు ఉండేవనీ, వాటిలో జొన్నలు, కందులు వంటివి నిలవ చేసుకునేవారమని వివరిస్తారు. పాతర నిర్మాణం ఎలా ఉంటుందో తెలియజేస్తారు.

ఈ పడవకెంత దిగులో..’ అనే అధ్యాయంలో తమ జీవితాన్ని మలుపుతిప్పిన ఘటనల గురించి, తన కెరీర్ నిర్మాణంలో వేసిన అతి ముఖ్యమైన అడుగుల గురించి వివరిస్తారు. మత్స్యకారుల జీవన స్థితిగతులు దుర్భరంగా మారడం వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ కనుక్కోవడం కోసం మత్స్యకారుల గ్రామానికి వెళ్ళిన రచయితకి అక్కడ ఎదురైన అనుభవాలు ఓ వ్యాసం వ్రాసేలా చేస్తాయి. ఆ వ్యాసాన్ని ఫోటోలతో సహా ఈనాడు దినపత్రికకు పంపితే, వారు ప్రచురించడం రచయితకు కెరీర్ విషయంలో మార్గదర్శనం చేశాయి. జర్నలిజం పట్ల ఆసక్తి పెరిగడంతో, ప్రాజెక్ట్ వర్క్ మధ్యలోనే ఆపేసి ఈనాడు సంస్థలో చేరారు. అక్కడి నుంచి జర్నలిస్ట్‌గా వారి ప్రయాణం ఆంధ్రప్రభకు చేరింది.

గోరింట పూసింది’ అధ్యాయంలో అక్కాతమ్ముళ్ల అనురాగం వర్ణించారు. నాన్నగారు గురించి, బెజవాడ కనకదుర్గమ్మ గుడి గురించి చెప్తారు. నాన్న ప్రేమ గురించి చెబుతూ, “ఈ నాన్నలంతే, బయటపడరుగానీ లోపల బోలెడు ప్రేమ దాచేసుకుంటారు. అదేదో బ్యాంక్‍లో డబ్బుల్లా పైకి తీయరు. ఏమిటో!” అంటారు. అప్పటి తరంలో నాన్నలంతే మరి!

బెల్ట్ మాష్టార్’ అనే అధ్యాయంలో చిన్నప్పుడు తమని విపరీతంగా భయపట్టిన లెక్కల మాస్టారుని గుర్తుచేసుకుంటారు. చిన్నప్పుడు లెక్కలు ఎంత గందరగోళంగా అనిపించేవో చెబుతూ, “ఏమిటో ఒక రైలు వస్తుంటుందట. ఆ రైలు పొడవు, వేగం ఇస్తారు. రైలు పట్టాల పక్కన ఓ సిగ్నల్ స్తంభం ఉంటుంది. ఈ రైలేమో ఆ స్తంబం దాటి వెళ్ళిపోతుంది. అయితే ఎంత సేపట్లో స్తంభం దాటి వెళుతుందన్నది లెక్క. నాకేమో అంతా గందరగోళంగా అనిపించేది. అలాగే మరో లెక్కలో ఒక మేకను పచ్చిక మైదానంలో యజమాని గుంజకు కట్టేస్తారు. ఆ మేక ఎంత మేరకు గడ్డి తింటుందో చెప్పమనేవారు. ఇలాంటి లెక్కలను జీవితంలో ఎప్పుడూ మరిచిపోను” అని వ్యాఖ్యానించారు. బెల్ట్ మాష్టారు కారణంగా – గట్టిగా కృషి చేస్తే ఎంతటి కఠినమైన పని అయినా సులువు అవుతుందన్న సత్యం తెలిసి వచ్చిందనీ, కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలన్న నిబ్బరం అలవడిందని అంటారు.

చూడు చూడు సినిమా’ అనే అధ్యాయంలో బాల్యం తను చూసిన ‘లవకుశ’ గురించి చెప్తారు. సినిమా హాలు దగ్గర పిల్లలకి టికెట్లు తీశారో లేదో చెక్ చేసే గేట్ కీపర్లు, వాళ్ళని బురిడీ కొట్టించడానికి ప్రయత్నించే తల్లులు ప్రయత్నాలను వివరిస్తారు. తను చూసిన సినిమాలలో తనకి నచ్చిన కొన్ని సినిమాలను ప్రస్తావించారీ అధ్యాయంలో.

సాహసం సేయకురా డింబకా’ అనే అధ్యాయంలో చిన్నతనంలో చేయకూడని సాహసాల గురించి చెప్తారు. తెలిసీ తెలియని వయసులో చేసే కొన్ని పనుల వల్ల ఎంతటి ప్రమాదాలుంటాయో వివరించారు. సందర్బానుసారంగా మంగళగిరి లోని నృసింహ స్వామి వారి ఆలయపు గాలిగోపురం విశిష్టతని వెల్లడించారు. చిన్నతనంలోనే తమకు దూరమైన పెద్దక్క తనని ఎలా కాపాడిందో చెప్తారు.

అనుకోకుండా ఓ కుక్క తమకి ఎలా మచ్చిక అయిందో, తమ కుటుంబానికి రక్షగా ఎలా నిలిచిందో ‘డింగరీ’ అనే అధ్యాయంలో చెప్తారు. ప్రేమ, ఆప్యాయత ఎక్కడ ఉంటే మూగజీవాలు అక్కడే ఉంటాయని మోగ్లీ, తువ్వాయి, ఆవుల ఉదాహరణల ద్వారా తనకి అర్థమయిందని అంటారు. జీవన యాత్రలో తమతమ పాత్రలు పోషించిన మూగజీవాలను గుర్తుచేసుకున్నారు.

జై ఆంధ్రా బ్యాచ్’ అధ్యాయంలో జై ఆంధ్రా ఉద్యమం గురించి, అందులో విద్యార్థుల పాత్ర గురించి వివరించారు. ఈ అధ్యాయంలోనే అమ్మ అనారోగ్యం గురించి, ఆవిడతో చేసిన రైలు ప్రయాణాల గురించి వివరిస్తారు.

చిన్నప్పుడు రేడియో అంటే తనకి ఎంత ఆసక్తో ‘పలికింది ఆకాశవాణి’ అనే అధ్యాయంలో చెప్పారు. బాల్యం లోని ఆసక్తిని, అభిరుచిగా మార్చుకుని, ఆపై కొన్నాళ్ళు వృత్తిగా మలచుకుని ఆకాశవాణిలో వార్తలు చదివిన వైనాన్ని పాఠకులకు వివరించారు. సంకల్పం బలంగా ఉంటే భగవంతుడు సత్సంకల్పాన్ని తప్పకుండా నెరవేరుస్తాడని తన కెరీర్‍లో పలుమార్పు నిరూపణ అయిందని అంటారు. మిత్రుడు విష్ణు గ్రామఫోన్ తయారు చేయడం, సొంతంగా ఓ రేడియో స్టేషన్ నడపడం వంటివి ఆసక్తికరంగా సాగుతాయి.

ఏరువాక సాగారో’ అనే అధ్యాయంలో వ్యవసాయం గురించి, సేద్యంతో ముడిపడ్డ ఆచారాల గురించి వివరించారు. సందర్భానుసారంగా ‘రోజులు మారాయి’ (1955) సినిమాలోని పాటని గుర్తు చేసుకుంటారు. వ్యవసాయంలో కాలక్రమంలో వచ్చిన మార్పులను చెబుతూ, తమ ఊర్లోని వారు మాత్రం పెద్దగా మారలేదని అంటారు. “దాచుకునే వారు కొందరు. దాపరికం లేనివారు మరి కొందరు. హెచ్చులు పోయే ఖర్చులు చేసేవారు కొందరు. దానధర్మాలు చేసేవారు ఇంకొందరు. ఇలా అనేక రకాల కుటుంబాలు ఒక్క మా పల్లెలోనే కనబడేవి” అంటారు.

తొలి వేషం’ అనే అధ్యాయంలో నటన పట్ల ఆసక్తి ఎలా కలిగిందో చెప్పి, నాటకాల్లో తను వేసిన పాత్రల గురించి వివరించారు. కాలేజీని ఓ నాటక ప్రయోగశాలగా మార్చుకున్న వైనం, లెక్చరర్‌కీ ఓ పాత్ర ఇవ్వడం వంటివి ఆసక్తికరంగా సాగుతాయి. ఆంధ్రప్రభలో ఉద్యోగిగా ఉన్నప్పుడు పలు సందర్భాలలో చేసిన ఏకపాత్రాభినయాలు, గెల్చుకున్న బహుమతుల గురించి ఈ అధ్యాయంలో చెప్తారు.

జీవితంలో ఎవరికైనా రెండు రోజులు మాయమైతే ఎలా ఉంటుంది? అదేం ప్రశ్న అనుకుంటున్నారా? రోజులు మాయమవడేమిటని కనుబొమలు ముడి వేస్తున్నారా? అయితే, ‘ఎలుక మళ్ళీ పుట్టింది’ అధ్యాయం చదవండి. అర్థమవుతుంది. రచయితకి గుండెకి రక్తం సరఫరా చేసే నాళాల్లో బ్లాక్స్ ఏర్పడి, ఆపరేషన్ తప్పనిసరి అయింది. “కళ్లు మూతలు పడటం.. కళ్లు తెరుచుకోవడం. మధ్యలో 48 గంటలు గడిచిపోవడం. ఇంత సుదీర్ఘ నిద్ర ఇంతకు మునుపు నాకు తెలియదు” అంటారు. “ప్రతి వ్యక్తి జీవితంలో మంచిచెడులు ఉంటాయి. చెడును ప్రక్కన బెట్టి మంచి విషయాలు తలుచుకుంటూ వాటిని పంచుకుంటూ ఉంటే మానసిక ఆనందం మనసొంతం అవుతుందని అర్థమైంది. నెగెటివ్ ఆలోచనలకు స్వస్తి చెప్పాలి, పాజిటీవ్ థింకింగ్ పెంచుకోవాలి” అని రచయిత చెప్పిన మాటలు అక్షర సత్యాలు.

చివరగా ‘రేపటి ఉదయం’ అనే అధ్యాయంలో, ఈ పుస్తకం తరువాయి భాగంలో రాబోయే అంశాలను రేఖామాత్రంగా ప్రస్తావించారు. సమాజ హితం, వ్యక్తిత్వ వికాసం, మారుతున్న పరిస్థితులు వంటివి అంతర్లీనంగా ఉంటాయని తెలిపారు.

~

“ఈ స్వీయచరిత్రలో ఉన్నవి రెండు: 1. నిజం 2. నిజాయితీ. లేనివి కూడా రెండే: 1. అహంభావం 2. అబద్ధం” అన్న శ్రీ కస్తల విజయబాబు గారి అభిప్రాయంతో పాఠకులు తప్పక ఏకీభవిస్తారు.

ఈ పుస్తకం 1960, 70, 80ల దశకాల్లోని సమాజానికి అద్దం పట్టిన రచన. ఆనాటి సమాజం, వ్యక్తులు, సంఘర్షణలు, బ్రతుకుపోరు, జీవన శైలులు.. ఒకటేమిటి? ఎన్నెన్నో ఆసక్తికరమైన విషయాలు! గత కొన్ని దశబ్దాల కాలం వెనక్కి తీసుకువెళ్ళి నోస్టాల్జిక్ ఫీలింగ్ కలిగిస్తుందీ పుస్తకం! మన నాన్నదో, బాబాయిదో కథ మనం చదువుతునట్టు అనిపిస్తుంది. మమేకమయ్యేలా చేస్తుంది.

***

జీవనరాగాలు-1 (స్వీయచరిత్ర)
రచన: తుర్లపాటి నాగభూషణ రావు
పేజీలు: 272
వెల: 295/-
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్
రచయిత: 9885292208

 

 

 

 

 

 

~

శ్రీ తుర్లపాటి నాగభూషణ రావు గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mr-turlapati-nagabhushana-rao/

Exit mobile version