Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జీవన రమణీయం-109

టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం.

చ్చం గాంధీగారిలా గుండూ, చేతికర్రా పుచ్చుకుని, పంచె పైకి కట్టి ఆంజనేయులు గారనే తాతగారొచ్చి, పెద్దమ్మా వాళ్ళ వరండా మీద కూర్చుని, “శ్రీదేవమ్మా… ఏం చేస్తున్నావ్?” అని కేక వెయ్యగానే, పెద్దమ్మ “వస్తున్నా” అంటూ కాఫీ గ్లాసు కంచుది, పావు శేరు వుండేది, పట్టుకొచ్చి ఇచ్చేది.

సావిత్రి పెద్దమ్మా, శ్రీదేవి పెద్దమ్మా, మా అమ్మ సత్యవతీ దేవి

కృష్ణమూర్తి గారనే ఇంకో తాతగారి దగ్గర లాంతరు పెట్టుకుని చదువుకుని, బి.ఎ. పాసయింది. అందరూ సాయంత్రాలయ్యే సరికీ, ముగ్గు పెట్టి లాంతర్లు తోముకోవడమే. కరెంట్ వుండేది కాదు!

ఆ చీకట్లో చదువుకున్న పెద్దమ్మ, ఐదురుగు పిల్లలతో, ధర్మసత్రవులా వచ్చే పోయే జనాలతో, ఆ ఇంట్లో, పనంతా అయ్యాక, కృష్ణమూర్తి గారి దగ్గర ప్రైవేటు చదువుకుని, పాసయి చీకట్లో చదువుకునా వెలుగునిచ్చే విద్యుత్ సౌధాలో వుద్యోగం సంపాదించుకుంది. ఇంక జానకక్కా వాళ్ళింట్లో అయితే అందరూ చదువుల సరస్వతులే. పెద్దక్క పద్మా, తర్వాత జానకక్కా, నానీ, ఉమా, బాబూ… శారదమ్మా గారూ, శ్రీరాంమూర్తి గార్ల సంతానం. ఏమీ వసతులు లేని ఇళ్ళు. ఎప్పుడు చదివేవారో, ఎలా చదివేవారో కానీ అంతా యూనివర్సిటీ చదువులే. ఫస్ట్ మార్కులే.

జానకి అక్క, మా పెద్దక్క లక్ష్మీ, రెండో అక్క శాంతిలకి ‘జిగిరీ’ దోస్త్! ఆఖరు అమ్మాయి ఉమ మా రెండో పెద్దమ్మ ఆఖరి కూతురు రమాకి క్లోజ్ ఫ్రెండ్. ఇద్దరూ క్లాస్‌మేట్స్. వాళ్ళ వాకిట్లో ఎడ తెగక పారే మురికి కాలవ దగ్గర నిలబడి ఇద్దరూ కాళ్ళు లాగేస్తున్నా, ఒకరింట్లోకి ఒకరి వెళ్ళి కూర్చోకుండా, అలాగే నిలబడి కబుర్లు చెప్పుకునేవారు, గంటల తరబడీనూ! నేను చాలా చిన్నపిల్లనని నన్ను ఆ కబుర్లలో పాలుపంచుకోనిచ్చేవాళ్ళు కారు.

పాటలు పాడే లక్ష్మి అక్క, పక్కన శాంతి అక్క, రచయిత్రి

ఇంక మా పెద్ద  పెద్దమ్మ పిల్లలు లక్ష్మీ, వాణీ, ఉమా, రెండో పెద్దమ్మ రెండో కుతురు శాంతీ అయితే పాత హిందీ, తెలుగు అన్ని పాటలూ అద్భుతంగా లతా మంగేష్కర్, సుశీలలా పాడేస్తూ వుండేవారు. జానకక్క ఇంటికొచ్చిన చుట్టాలు “ఎవరా పాటలు పాడే అమ్మాయి? అచ్చు సుశీలలా పాడ్తోంది తీగలా!” అని లక్ష్మి అక్కనీ, శాంతక్కనీ అడిగి పాడించుకునేవారు. మా అమ్మా, పెద్దమ్మలు సరేసరి, అపర కోకిలలు! ప్రతి రోజూ కచేరీలా వుండేది ఇంట్లో,కానీ మా చిన్న పెద్దనాన్న స్టేషన్ నుండొస్తే, అంతా ‘గప్‌చుప్’, నోళ్ళు మూసేసేవారు!

ఇంక శారదమ్మగారు, అంటే జానకక్క తల్లి చేత్తో ఏం వండినా అమృతం లాగే వుండేది. ఆవిడ చింతకాయ పచ్చడిలో పోపు పెడ్తే తోటంతా ఘుమఘుమలాడిపోయేది! మా పెద్దమ్మలా వుద్యోగాలు చేసే ఆడవాళ్ళు ఎవరూ లేరు… అంతా ఆక్షేపణగా చూసేవారు. ‘ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళు, మొగుళ్ళు చెప్పిన మాట వినరు’ అని నమ్మే కాలం అది! పాపం పెద్దమ్మ చాలా మాటలు పడేది. అందరూ రైల్వే ఎంప్లాయీస్, గుమాస్తాలూ, ఆర్థికంగా కటకటలాడే కుటుంబాలే పాపం! ఒకరింటికొకరు చెంగు చాటున గ్లాసు దాచుకుని “వదినా… ఓ గ్లాసు పంచదార ఇస్తావా? రేషన్ తేగానే ఇచ్చేస్తాను” అనో, “ఓ కప్పు కాఫీ పొడి ఇస్తావా?” అనో, రెండో వారం నుండే అడిగే పరిస్థితి!

ఇవన్నీ మా పెద్దమ్మ గారి కాంపౌండ్‌లో విశేషాలుగా, నాకెట్లా తెలుసూ? అనుకుంటున్నారా? మరి అమ్మమ్మ ఆ దొడ్లోనే రెండు గదులు తీసుకుని మా అమ్మని ఆంధ్రా మెట్రిక్ కట్టించి, అన్నయ్యనీ, నన్నూ, ఆవిడ ముసలి తల్లినీ పెట్టుకుని వుండేది. మా నాన్నగారికి అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్‌లో వుద్యోగం కదా, ఎప్పుడూ కోదాడా, మిరియాలగుడా, నల్గొండా అంటూ వూళ్ళలోనే ఆయన వుద్యోగం. మ పెద్దమ్మ బావి నుండి నీళ్ళు తోడుకుని, ఇంటెడు పని చేసుకుని, లీల లా అద్భుతంగా తిరిగే గొంతుతో పాటలు పాడ్తూ జడ వేసుకుని, అందరికీ లంచ్ బాక్స్‌లు కట్టి, తను కట్టుకుని, పరిగెత్తి పరిగెత్తి బస్ అందుకుని, సోమాజిగుడాలో వున్న విద్యుత్ సౌధా ఆఫీస్‌కి వెళ్ళేది. ఆ బస్‌మేటే రమణీ సన్యాల్ అనే ఆవిడ, దూరదర్శన్‌లో పనిజేసేది. మొదట ఆకాశవాణిలో అనుకుంట. మా పెద్దమ్మకి హేమలతగారని ఒక క్రైస్తవ స్నేహితురాలు వున్నారు. ఎంత మంచి స్నేహమో వాళ్ళది. ఇప్పటికీ ఇద్దరికీ చాలా దోస్తీ, మా పెద్దమ్మకి ఇప్పుడు 83 ఏళ్ళు!

జానకక్క తల్లి పోయి చాలా కాలం అయినా, తండ్రి రెండేళ్ళ క్రితం దాకా వున్నారు. ఆయనకి సహస్ర చంద్ర దర్శనం కూడా ఘనంగా చేయించారు పిల్లలు.  అక్క… అమెరికా వస్తుంటే వాళ్ళ నాన్నగారు…, తను సింగపూర్ దాకా ఎదురొచ్చి తీసుకెళ్ళేదిట. వాళ్ళ అక్క పద్మ పోయింది. ఆ పిల్లల్నీ తను బాగా చూసుకుంటుంది. తమ్ముడి పిల్లల్నీ బాగా చూసుకుంటుంది. ఇటీవలే నానీ అని మేం పిలుచుకునే తమ్ముడూ పోయారు. ఆ మరదలు అరుణ గురించి కూడా అక్క చాలా ప్రేమగా చెప్తుంది. తనకి వూరగాయలన్నీ అరుణే పెట్టి పంపిస్తుందని చెప్తుంది.

ఆ చిన్ననాటి సీతయ్య తోట సంఘటనలూ, అప్పటి మనుషులూ అన్నీ తవ్వుకుని మేం కబుర్ల లోంచి ఇవతల పడ్డాకా, కిరణ్‌ప్రభ గారి ఇంటికొచ్చాం. వచ్చే ముందు జానకక్కా వాళ్ళనీ కాంతి గారు భోజనానికి పిలిచారు. జానకక్క నాకు ప్రతీసారీ చాలా మంచి మంచి చీరలు పెట్టింది.

ఈ ట్రిప్‌లో నేను మళ్ళీ ఫీనిక్స్ వెళ్ళాను. పోయినసారి మావయ్య, అత్తయ్య, వాళ్ళ అబ్బాయి దగ్గరున్నారని వెళ్ళాను. ఈసారి మా ఆఖరి బాబాయి కొడుకు హరీష్ వున్నాడని వెళ్ళాను. నేను ఫ్లయిట్ దిగి ఫలానా నెంబర్ గేట్ దగ్గర వున్నాను అంటే, హరీష్ వచ్చి రిసీవ్ చేసుకున్నాడు. వాడి భార్య సింధు మళ్ళీ మా మేనత్త కమలత్తయ్య మనవరాలే, అంటే బావ కూతురు నాకు. చాలా బాగా చూసింది. అప్పటికి నక్షత్ర అని ఓ పాప వాళ్ళకి.  బార్చ్ అనే అమెరికన్ లేడీ, సింధుకి కడుపుతోటుండగా పరిచయం అయి, ఒక తల్లిలాగా సింధుని చూసుకుని, పాపని కుడా అమ్మమ్మ లాగే చూసుకునేది.  ఆవిడకి రెండో భర్తకీ, మొదటి భర్తకీ కలిగిన సంతానం, మనవలూ చాలా మందే! మనిషికి డెబ్బై వస్తున్నా చెదరని అందంతో చాలా బలంగా వుండేది. సింధుకి డ్రైవింగ్ నేర్పింది. నేనున్నానని చూడ్డానికి వచ్చింది. “నెక్స్ట్ వీక్ వరలక్ష్మీ వ్రతం చేసుకుని బార్చ్‌కి  వాయినం ఇద్దాం” అని నేను జోక్ చేసాను.

కుసుమ్ అనే హిమాచల్ ప్రదేశ్ ఆవిడ కూడా హరీష్, సింధూలకి ఫ్రెండ్. నన్ను చూడడానికొచ్చి ఆవిడ కథంతా చెప్పుకుంటే నేను కౌముదిలో రాసాను. భర్త పోయి, చేతిలో రూపాయి లేని పరిస్థితిలో అక్కడా, ఇక్కడా షాప్‌లలో ‘మారవానా, డ్రింక్స్’ లాంటివి అమ్మే వుద్యోగం కూడా చేసి, ఎవరో దయ తలచి కారు షెడ్డులో వుండనిస్తే కొడుకుని పెంచి, చదివించి, అతన్ని మంచి వుద్యోగస్థుడిని చేసింది. ఆ కొడుక్కి పెళ్ళి చేస్తే ఆ అమ్మాయి గ్రీన్ కార్డ్ వచ్చే దాక వుండి,  ఆ తర్వాత “దీని కోసమే నీతో వున్నాను… ఇక వుండను” అని వేరే అతనితో వెళ్ళిపోయిందిట. మనిషికో చరిత్ర కదా!

మా హరీష్‌తో ఇండియన్ బజార్‌కి వెళ్ళి తోరాలూ, కొబ్బరికాయా, ఆకులూ, అరటిపండ్లూ అన్నీ తెచ్చుకొని యూట్యూబ్‌లో రికార్డ్ పెట్టి వరలక్ష్మీ వ్రతం చేయించాను సింధు చేత. ఆ పై వారం ‘సెడోనా’ వెళ్ళాం.

(సశేషం)

Exit mobile version