Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జీవన రమణీయం-112

టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం.

ద్దిరాజు సోదరులని తెలంగాణ వేగుచుక్కలుగా వ్యవహరిస్తారు. ఆ పుస్తకం చదివి కిరణ్ ప్రభ గారు ఓ టాక్ షో చేసారు. ఎక్కడో తెలంగాణలో ఓ మారుమూల పల్లెటూరు ఇనగుర్తిలో పుట్టి, కనీసం స్కూల్ కెళ్ళి ప్రాథమిక విద్య కూడా అభ్యసించకుండా, వారు ఎంతటి విజ్ఞాన గ్రంథాలని రాసారో, ఏమేం చేశారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

శారీరక శాస్త్రం చదివారు, ఔషధాలు కనిపెట్టారు, రుద్రమదేవి అనే నాటకం రాస్తే, అది ఓ చోట పాఠ్యాంశంగా బడిలో పెట్టారు. ముద్రణా యంత్రం తయ్యారు చేసారు ఆ మారుమూల. పత్రికలు నడిపారు, ఫొటోగ్రఫీ నేర్చుకున్నారు. వ్యవసాయం చేసారు. అసలు జనానికి ఏమేమి అవసరమో అవన్నీ స్వయంగా నేర్చుకుని, మానవుడు తలచుకుంటే అసాధ్యం లేదని నిరూపించారు!

‘మానవుడే మహనీయుడూ శక్తియుతుడు యుక్తిపరుడు… మానవుడే మాననీయుడూ’ అని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, ఈ సోదరుల శక్తిని గురించి వింటే.

ఒద్దిరాజు చందర్ కుటుంబంతో

ఇవన్నీ నాకు తర్వాత తెలిసాయి. ఆ చందర్ ఒద్దిరాజు ఈ ‘తెలంగాణ వేగుచుక్కలు’ పుస్తకాన్ని కిరణ్ ప్రభ గారికిస్తే, ఈయన అద్భుతంగా నాలుగు భాగాలుగా ఆ టాక్ షో నిర్వహించారు.

చందర్ పిలవకుండా వచ్చిన అతిథినైన నన్ను చూసి చాలా ఆనందపడి, భార్యకి పరిచయం చేసారు. వారి చిరంజీవిని ఎత్తుకుని, వుయ్యాల్లో వుంచాను. అది ఓ రెస్టారెంట్‌లో జరిగింది. మంచి భోజనం చేసి విజయా అసూరి స్థాపించిన రేడియో స్టేషన్‌లో ‘విరిజల్లు’ కార్యక్రమంలో మాట్లాడడానికి నేను చందర్ దంపతుల దగ్గర శలవు తీసుకుని కిరణ్ ప్రభ దంపతులతో వెళ్ళిపోయాను.

విజయ రమణి అనే పొడవాటి అమ్మాయి, పొడవాటి వాల్జడతో, అందంగా నాకు మొదటిసారి మా బావ పెళ్ళిలో 86లో అనుకుంటా, కనబడింది! మా శారదత్తయ్య అంటే మా నాన్నకి కజిన్ అయినా, మా స్వంత వదినకి తల్లి కూడా. ఆవిడ రెండో కొడుకు డల్లాస్‌లో ఇప్పుడున్న నాగేశ్వరరావు, సత్యని పెళ్ళి చేసుకుంటున్నప్పుడు, సత్య క్లోజ్ ఫ్రెండ్‍గా ఈ అమ్మాయి ఏక్టివ్‍గా వుండటం నేను అప్పుడు చూసాను. ఆ తర్వాత పద్మావతీ కళాశాలలో కల్చరల్ ఏక్టివిటీస్‌లో చాలా ఏక్టివ్ అనీ, వీరేంద్రనాథ్ గారికి కూడా బాగా తెలుసుననీ సత్య చెప్పింది. అప్పుడు పరిచయం అయిన ఆ విజయ రమణి నాకు హైదరాబాదులో తెలుసు. ఆ తరువాత మా బావ ఫ్రెండ్ చారీనే పెళ్ళి చేసుకుని, విజయా అసూరిగా యూ.ఎస్. వచ్చేసింది. తర్వాత మా సత్యా, బావా కూడా వచ్చేసారు.

విజయ అసూరి భర్త అక్కగారూ, బావగారు మాకు తెలుసు. బావగారు విజయ్ అమ్మతో ఆర్.టి.సి.లో పనిచేసారు. వాళ్ళ అక్క శ్రీలేఖ గారు, వాళ్ళ అమ్మాయిలు హైదరాబాద్ సిస్టర్స్ పేరుతో చక్కగా పాటలు పాడే శిల్ప, దీపికలు. వాళ్ళని సినిమాలో పాడించాలని నేను మా కిరణ్ మామ అనే అమ్మ ఇంకో కలీగ్ రికమెండ్ చేస్తే చాలా ప్రయత్నించా. మంచి గాత్రం వాళ్ళది.

ఇక్కడ విజయ ‘బాటా’ అని బే-ఏరియా తెలుగు ఆసోసియేషన్ పెట్టి చాలా ఫేమస్ అయిందనీ, తానాలో కూడా చాలా ఏక్టివ్ అనీ, ఇక్కడికీ వచ్చాకే తెలిసింది. ఇప్పుడు నన్ను గుర్తు పడుతుందో లేదో అనుకున్నాను! కానీ ఆమె నన్ను గుర్తు పట్టి ప్రేమగా పలకరించింది. ఆ విజయ గుర్తున్న నాకు ఈ విజయని గుర్తుపట్టడం కష్టమే అయింది. జుట్టు షార్ట్‌గా కట్ చేసి, ఫ్రాక్‌లో అమెరికన్ అమ్మాయిలా వుందిప్పుడు!

ఆనంద్ కూచిభొట్ల… శాంతిగారితో…

కిరణ్ ప్రభ గారు నన్ను ఇంటర్వ్యూ చేసారు. ఆయన ప్రతిభా పాటవాలు తెలిసినవే కదా! నేనేమో ఎన్ని గంటలైనా మాట్లాడి గిన్నిస్ బుక్‍లోకి ఎక్కడాని సిద్ధంగా వుంటాను! కస్తూరి మురళీకృష్ణ గారు ‘సుజన స్వరం’ కోసం నన్ను ఇంటర్వ్యూ చెయ్యడానికొచ్చి గంట అనుకున్నది మూడు గంటలు నిర్విరామంగా ఇంటర్వ్యూ చేసి “మీరు తలచుకుంటే 24 గంటలు రికార్డుగా మాట్లాడగలరు” అన్నారు. బహుశా ఈ మాట్లాడే అలవాటు మా అమ్మ దగ్గర నుండి వచ్చి వుంటుంది! మా నాన్నగారు కొలతగా మాట్లాడేవారు. ఇతరుల మాటలని ఆనందించేవారే గాని పెద్దగా మాట్లాడేవారు కాదు! నాకేమో చిన్నప్పటి నుండీ కాస్త కల్చరల్ ఏక్టివిటీస్, ఫ్రెండ్స్ అన్నీ ఎక్కువేమో, బాగా మాట్లాడడం అలవాటు! ఈ విజయా, మా సత్యలతో ‘వనితాలయ్’ అనే వర్కింగ్ విమెన్స్ హాస్టల్‌లో బోయిగూడాలో ఎబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి మిసెస్ దుర్గ గారు కూడా వుండేవారు. వీళ్ళు అంతా ఫ్రెండ్స్.

ఈ ఇంటర్వ్యూ అయ్యాక నేనూ, కిరణ్ ప్రభ గారూ, కాంతి గారూ ఆనంద్ కూచిభొట్ల గారి ఇంటికి వెళ్ళాము. ఈయన గురించీ, సుజన రంజని గురించీ, ఈయన నిర్వహించే మా బడి, ఇండియాలో లక్ష గళార్చనలూ, అమెరికాలో రికార్డు స్థాయి నృత్య ప్రదర్శనలూ అన్నీ విన్నాను. చూడడం ఇది మూడవసారి!

ఓ సారి రచన శాయి గారి అమ్మాయి పెళ్ళిలో, నేను ఆకెళ్ళ గారితో కలిసి పంచెకట్టులో తీర్చిదిద్దిన తెలుగుతనంలా కారు దిగిన ఈయన్ని చూసాను. ‘ఆనంద్ కూచిభొట్ల, అమెరికా నుండి వచ్చార’ని ఆకెళ్ళ గారు పరిచయం చేస్తే ఆశ్చర్యపోయాను. రెండవసారి నేను మొదటిసారి అమెరికా వచ్చినప్పుడు, ఫ్రిమాంట్‍లో జరిగిన వంగూరి ఆరవ అంతర్జాతీయ తెలుగు సదస్సులో ఈయన్నీ, వారి శ్రీమతి శాంతి గారినీ చూసాను. వీరికి ఓ అమ్మాయీ, ఓ అబ్బాయీ.

ఆనంద్ గారిల్లు… శాంతిగారు ద్రాక్షతీగ…

వీరి ఇంటి గురించి తప్పకుండా రాయాల్సిన అంశమే! మనకి అమెరికాలో ‘బందరు’ కనిపిస్తుంది. వీరి బ్యాక్‍యార్డ్‌లో ద్రాక్షతీగా, మల్లెపందిరీ, ఆరెంజెస్, ఆప్రికాట్స్, దానిమ్మలూ, వంటగదిలో రోలూ, రోకలీ, తిరగలీ… ఒకటేమిటి అచ్చు తెలుగు పల్లెటూరి వాతావరణం. ఇంక శాంతిగారు మాతో ఆగకుండా కబుర్లు చెప్తునే 80 మిరపకాయ బజ్జీలు చేసారు! నేను జన్మలో మరిచిపోలేను, అంత చలాగ్గా, వాము మసలా కూరి ప్రొఫెషనల్‍లాగా మిర్చీ బజ్జీ చెయ్యడం! ఆనంద్ గారికి ఎలా ఇష్టమో ఆవిడ అలాగే వంట చేస్తారట. “ఇప్పటికీ కందిపప్పు వేయించే వండుతాను” అంటే మా అమ్మమ్మ గారు జ్ఞాపకం వచ్చారు. ఆవిడ బ్రతికుండగా పచ్చి పప్పు కుక్కర్‌లో పెట్టి వండడం తెలీదు మాకు!

శాంతి గారూ… బజ్జీలు…

ఇంట్లో తెలుగు వాతావరణం, తెలుగు భోజనం, ఆయన తెలుగు భాష కోసం పడ్తున్న శ్రమా, ఏటా పదకొండు వందలమంది స్టూడెంట్లకి, వాలంటరీగా మన ఇంజనీర్లూ, డాక్టర్లూ సైతం ‘మా బడి’ ద్వారా తెలుగు నేర్పించడం, అన్నీ విని నేను ఆనందపడ్డాను. అప్పటికింకా సిలికానాంధ్ర యూనివర్సిటీ స్థాపించలేదు. ఆ తర్వాత ఆయన ‘మిల్పిటాస్’లో అమెరికా, కాలిఫోర్నియాలో నడిబొడ్డున మన తెలుగు విశ్వవిద్యాలయం ‘సిలికానాంధ్ర’ యూనివర్సిటీ స్థాపించడం మన తెలుగువారికి ఎంతైనా గర్వకారణం. మూడేళ్ళ క్రితం ఓ రోజు ఆనంద్ గారు ఫోన్ చేసి, “నేను కూచిపూడి గ్రామాన్ని దత్తత తీసుకున్నాను. ఇక్కడ ‘సంజీవినీ’ అనే వెయ్యి పడకల ఆస్పత్రి నిర్మిస్తున్నాం. రోడ్డు వెయ్యడానికి ‘ఒక మీటరుకి ఐదువేలు’ చందా ఇవ్వగలరా” అని అడగ్గానే, నేను “తప్పకుండా” అని, వెంటనే పంపాను. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలలో వుడుతా సాయం చెయ్యడం నాకెంతో ఆనందాన్నిచ్చింది!

(సశేషం)

Exit mobile version