Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జీవన రమణీయం-120

టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం.

మా తెలుగు సినీ రచయితల సంఘానికి పరుచూరి గోపాలకృష్ణగారు ప్రెసిడెంట్. ఆకెళ్ళ సూర్యనారాయణ గారు జనరల్ సెక్రెటరీ. చాలా ఏళ్ళుగా పోటీ లేకుండా ఈ రెండు స్థానాలూ వారివే. నేను రెండు టర్మ్‌లు రచయిత సంఘానికి వైస్-ప్రెసిడెంట్‌గా చేసాను. తర్వాత చాలా ఏళ్ళు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్‌గా వున్నాను. తర్వాత మా ఇల్లు దూరంగా వుండడం వల్ల, ప్రత్యేకించి మీటింగ్‌ల కోసం శ్రీనగర్ కాలనీ సమీపంలో వున్న శాలివాహన నగర్‌లో వున్న రచయితల కార్యాలయానికి తరచూ వెళ్ళలేక, ఎలక్షన్స్ జరిగే రోజు వెళ్ళడం మానుకున్నాను. కానీ పరుచూరి గోపాలకృష్ణ గారు ఫోన్ ద్వారా అక్కడ వున్న సభ్యులతో నాకు ఓట్ వేయించి, రెండు తడవలు కల్చరల్ ఛైర్‌పర్సన్‌గా నియమించారు.

నేను కల్చరల్ ఛైర్‌ చూస్తూండగా, ఉద్ధండులైన మా రచయితలు జొన్నవిత్తులగారూ, అందెశ్రీ గారూ, భువనచంద్రగారుల చేత ఉగాది కవి సమ్మేళనాలు అవీ చేయించి, నేను స్వయంగా ఉగాది పచ్చడి చేసుకెళ్ళి అందరికీ పెట్టి, గొప్పగా జరుపుకున్నాం. కొన్ని పుస్తకావిష్కరణలు కూడా చేయించాం. సిరివెన్నెల గారు నన్ను ‘చెల్లాయ్’ అని పిలుస్తూ, మా ఆయన్ని ‘బావగారూ’ అని సంబోధిస్తూ ప్రత్యేక అనుబంధాన్ని చూపిస్తారు. పరుచూరి గోపాలకృష్ణ గారూ, పరుచూరి వెంకటేశ్వరరావు గార్లు మెదట నుండీ నా మీద ఆపేక్ష చూపిస్తూ… “అమ్మాయ్ నువ్వుండాలి కమిటీలలో…” అంటూ నన్ను రఘుబాబు నాటక పరిషత్తులకి కూడా జడ్జిగా నియమించేవారు! అలా నాలుగు సంవత్సరాలు నాటకాలకి జడ్జిగా వుండడం మధురానుభూతి!

చిన్నప్పటి నుండీ మ కుటుంబానికి లలితకళలతో, నాటకాలతో అనుబంధం వుండేది. అమ్మ వీరేంద్రనాథ్ గారు రాసిన ‘రఘుపతి రాఘవ రాజారాం’, ఇంకా ‘కనక పుష్యరాగం’ నాటకాలకి నేపథ్య గానం చేసేది. ఒకసారి ఆర్.టి.సి. విమెన్స్ కల్చరల్ కమిటీ వారి చేత ప్రదర్శింపబడ్డ నాటికలో బామ్మగారి పాత్ర వేసి అందరి చేతా ప్రశంసలు అందుకుంది. అలాగే నాటక నటులు సుబ్బరాయ శర్మా, నిట్టల శ్రీరాం మూర్తీ, మల్లాది మహాదేవ శాస్త్రీ, వలయం లక్ష్మీపతీ, నవీన లక్ష్మీ, విద్యాసాగర్ గార్లతో బాగా పరిచయం వుండేది. ‘మావయ్య’లని పిలుస్తూ ఆ రిహార్సల్స్ సైతం రోజూ చూడడానికి వెళ్ళేదాన్ని. నేను ఇంటర్మీడియట్‌లో వున్నప్పుడు రాంచంద్రరావు గారు అనే ఆయన “అమ్మాయ్, నువ్వు నాటకాలలోకి వస్తివా, మరో పూనమ్ థిల్లాన్‌ని తెలుగు తెరకి పరిచయం చేసినవాడ్ని అవుతాను!” అని చాలా సార్లు బతిమాలారు. అమ్మ స్టేజ్ నాటికలకి ఒప్పుకోలేదు! రేడియో స్టేషన్‌కి వెళ్ళీ హీరోయిన్‌గా రేడియో డ్రామాలు వేసాను. నా గొంతు చాలా బావుందని అంతా మెచ్చుకున్నారు. కాలేజీలో అయితే స్టేజ్ మనదే, నాటకాలు రాయడం, వేయడం, డైరక్షన్ చేయడం కూడా చేసేదాన్ని. నేను రచయిత సంఘంలో మొదటిసారి పూసల వెంకటేశ్వరరావు గారిని కలిసినప్పుడు, చిన్నతనంలో చూసిన ఆయన రాసిన నాటకం ‘ప్రజాసేవయే మన కర్తవ్యం’ జ్ఞాపకం చేసుకుని, “నేను సత్యవతి గారి అమ్మాయిని” అనగానే, ఆయన చాలా ఆనందపడ్డారు. అప్పటి నుండీ ఆయన వున్నంత కాలం, నేను కనిపించగానే, “అమ్మగారు ఎలా వున్నారమ్మా?” అని అడుగుతూనే వుండేవారు.

మా గురువుగారు పరుచూరి గోపాలకృష్ణ గారు నన్ను విమెన్స్ ప్రొటెక్షన్ సెల్‌కి ఛైర్‌పర్సన్‌‌గా, తెలుగు సినీ రచయితల సంఘం ట్రస్ట్‌కి ట్రస్టీ మెంబర్‌గా అన్నింటిలోనూ నియమిస్తూనే వచ్చారు. విమెన్స్ ప్రొటెక్షన్ సెల్ ఛైర్‌పర్సన్‌‌ని నేనూ, మెంబర్స్ రచయిత్రి అనురాధా ఉమర్జీ, బి. ఉమాగోపాల్ గారూ. ఈ ఉమాగోపాల్ గారు ప్రముఖ డైరక్టర్ బి. గోపాల్ గారి సతీమణి. బి. గోపాల్ గారు అంటే ‘ఇంద్ర’, ‘సమరసింహారెడ్డి’ జ్ఞాపకం వస్తాయి. ఫాక్షన్ సినిమాలు. కానీ ఆయనకు నేను కనిపిస్తే “మంచి ప్రేమ కథ తియ్యాలనుంది, చెప్పమ్మా” అని అడుగుతారు. ఉమగారు ఎల్.ఎల్.బి. చేశారు. లాయర్ కూడా. పైగా మా రచయిల సంఘం మెంబర్. అనూరాధా ఉమర్జీ నాకు సోదరితో సమానం. 4 భాషలలో రాయగలదు. ‘గగనం’, ‘ఏ మాయ చేసావో’, ‘మరో చరిత్ర’ (వరుణ్ సందేశ్ నటించినది) – వీటికి పని చేసింది. కావడం మరాఠీ అమ్మాయి అయినా, మద్రాసులో పీ.జీ. చేసి తెలుగు సినిమాలకి పనిచేస్తుంది. డబ్బింగ్ సినిమాలకి పని చేస్తుంది. నేనంటే చాలా గౌరవం.

“రచయితల సంఘం ఏర్పడి పాతిక సంవత్సరాలు నిండుతోంది, సిల్వర్ జుబ్లీ సెలెబ్రేషన్స్ చెయ్యాలి” అని  నన్ను పిలిచి, “కల్చరల్ కమిటీలో నీతో పాటు డైమండ్ రత్నబాబూ, ఎస్.వి.రామారావుగారూ, ఉమర్జీ అనూరాధ, నటరాజ్, వెనిగళ్ళ రాంబాబు మెంబర్స్‌గా వుంటారు” అని ప్రెసిడెంట్ అయిన పరుచూరి గోపాలకృష్ణగారు చెప్పారు. ఆ సమయంలో నేను చాలా బిజీగా వున్నాను. అమెరికా నుండి అబ్బాయి వస్తున్నాడు. అయినా కూడా నేను స్వయంగా పని చెయ్యకపోయినా, పని చేయించడంలో దిట్టని. కాలేజీ రోజుల నుండీ లీడర్‌షిప్ క్వాలిటీస్ ఎక్కువ. అందుకే నిబ్బరంగా ఒప్పుకున్నాను.

అది చిన్న ఫంక్షన్ కాదు! అతి ప్రతిష్ఠాత్మకమైన రచయితల సంఘం రజతోత్సవం. చందాల కేశవదాసు గారి నుండీ, ఇప్పటి రచయితల వరకూ అందరిదీ ఆ పండుగ. రకరాకల వర్గీకరణలతో, అవార్డులతో, ఎవరూ చిన్నబోకుండా, అందరూ సంతోషం చెందేలా సత్కరించిన ఘనత మా గోపాలకృష్ణ గారిదే. సింగితం శ్రీనివాసరావు గారికీ, కె. విశ్వనాథ్ గారికీ, రావి కొండల రావు గారికీ, భువనచంద్ర గారికీ, పి.సి.రెడ్డి గారికీ, ఆదివిష్ణు గారికీ, కోదండరామిరెడ్డి గారికీ, గొల్లపూడి మారుతీరావుగారికీ జీవన సాఫల్య పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయించబడింది. అందులో ఆరోగ్య కారణాల వల్ల సగం మంది రాలేకపోయారు. సింగితం శ్రీనివాసరావు గారు ఫ్లయిట్ టికెట్ కొన్నాకా, జ్వరం వచ్చి మానేసారు. చిరంజీవి గారూ, మోహన్‌బాబు గారూ, మొత్తం రచయితలూ, ప్రముఖులైన ప్రొడ్యూసర్లూ, రాఘవేంద్రరావు గారూ, సత్యానంద్ గారూ మొదలైన ప్రముఖులతో రంగరంగ వైభవంగా సిల్వర్ జుబ్లీ సెలెబ్రేషన్స్ ఫిల్మ్ నగర్ క్లబ్‌లో జరుపుకున్నాం.

 

నేనూ, అనూరాధా, రత్నబాబు, నటరాజ్, పరుచూరి గోపాలకృష్ణ గారూ, పరుచూరి విజయలక్ష్మి గారూ అందరం ఓ స్కిట్ కూడా వేసి అందరినీ నవ్వించాం.

ఆ స్కిట్ డైమండ్ రత్నబాబు రాసాడు. ప్రస్తుత రచయిత పరిస్థితి; సినిమాకి మూలస్తంభం అయిన కథ, మాటలు రాసినా కూడా ఆడియో ఫంక్షన్‌లో స్టేజ్‌ మీదకి పిలుస్తారు అన్న గ్యారంటీ కూడా లేదు. ఈ స్కిట్‌లో పరుచూరి గోపాలకృష్ణగారు రచయిత వేషం వేసారు. ఎప్పుడు ఆ కథ గురించి, సినిమా గురించి, దీని సక్సెస్‌కి కారణం అని మాట్లాడుకున్నా, అది తననే అనుకుని లేస్తూ ఉండడం; భార్య కూడా అవునండీ మిమ్మల్నే అనడం – తీరా డైరక్టర్ పేరో, మ్యూజిక్ డైరక్టర్ పేరో, ఫైట్ మాస్టర్ పేరు.,. అలా చెప్తూ ఉండడం; మొత్తానికి రచయితని చివరిదాకా పిలవకపోవడం – అప్పుడు భార్య “ఎందుకండీ మనం ఈ ఆడియో ఫంక్షన్‌కి రావడం?” అనడం; ఆయన “లేదు, నేను రెండు మాటలు మాట్లాడే వెళ్తాను” అని స్టేజ్‌ మీదకు వచ్చి “అసలు కథ అనేదాన్ని మీరు మర్చిపోతున్నారు. మొదట్లో కథా రచయితలకి ఎంత ప్రాముఖ్యత ఉండేది? సినిమాకి అది ప్రాణం. అటువంటి రచయితని మీరు అవమానపరిస్తే మీ భవితవ్యం ఏమవుతుందో ఆలోచించుకోండి” అని చెప్పడంతో ఆ స్కిట్ ముగుస్తుంది. హాస్యంగా ప్రారంభమై, ఒక సీరియస్ మెసే‌జ్‌తో అది ముగిసింది.

అందరూ నన్ను ఓ పెద్దక్కలా చూసి నేను చెప్పిన మాట వినడం ఓ వంతు వయితే, ‘ఆడపిల్లకి ఇంత బాధ్యత ఇవ్వడం సరి అయిన పనేనా?’ అనుకోకుండా పరుచూరి గోపాలకృష్ణగారూ, ఆకెళ్ళ గారూ నాకు ఆ బాధ్యతలు అప్పగించడం ఇంకో గొప్ప విషయం. షడ్రసోపేతమైన భోజనాలు పెట్టాం. ముందు రోజు రాత్రి నిద్రపోకుండా, అనూరాధా నేనూ క్లబ్ లోనే రూమ్స్ తీసుకుని వుండి ఏర్పాట్లు చేయించాం. భువనచంద్ర గారు ముందు రోజే చైన్నై నుండి వచ్చారు. ఆ మర్నాడు రాత్రి కూడా మేం క్లబ్ లోనే వుండి అలసట తీర్చుకున్నాం, ఆల్రెడీ సింగితం గారు, పి.సి.రెడ్డి గారు వస్తారని రూమ్స్ బుక్ చేసేసాం కాబట్టి. నా జీవితంలో ఎంతో ఆనందంగా, కాలేజీ స్టూడెంట్స్‌లా గడిపిన రోజులవి! చిరంజీవి గారితో సహా అంతా నన్ను తెగ మెచ్చుకున్నారు, నా నిర్వహణకి.

భువనచంద్రగారు సిల్వర్ జుబ్లీ ఫంక్షన్ అంతా అయిపోయాక తన మధురమైన గళంతో బోలెడు పాటలు పాడి వినిపించి, తత్వం, సారం బోధిస్తుంటే – నేనూ, రత్నబాబు, అనూరాధా, ఆమె భర్తా, రత్నబాబు అసిస్టెంట్లు – తన్మయులయి ఆ రాత్రి ఎంత సేపో అలా వింటూ వుండిపోయాం. అలాంటి క్వాలిటీ టైమ్స్ జీవితంలో కొన్నిసార్లే వస్తాయి.

ఇంక భువనచంద్ర గారితో నా అనుబంధ పర్వం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మా అమ్మ ఆయన్ని పెద్దకొడుకు అంటుంది. ఆయనా అలాగే అమ్మని ప్రేమిస్తారు.

(సశేషం)

Exit mobile version