Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జీవన రమణీయం-52

టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం.

కానీ కొన్ని నాటకీయ పరిణామాల వల్ల ఆ సినిమా ‘మధుమాసం’గా సినీమొగల్ డా. డి. రామానాయుడు గారు తీసారు. వంద రోజులు ఆడి, ఉత్తమ కథా రచయిత్రిగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ అవార్డు ‘నంది’ పురస్కారం ఇప్పించింది ఆ సినిమా. అది ఎలా జరిగిందో తర్వాత చెప్తాను.

మళ్ళీ ఈటీవీ కొస్తే ఇక్కడ ‘పద్మవ్యూహం’ జోరుగా సాగుతుండగా, ప్రభాకర్ అనే బుల్లితెర నటుడు, ఈటీవీలో సుమన్ గారికి ఇష్టపాత్రుడై, నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదిగాడు. ఎదురులేకుండా ఎదిగాడు.

ఆ సమయంలో నన్ను డైలాగ్స్, స్క్రీన్‌ ప్లే రాయమని, అనిల్ కుమార్‌ని డైరక్ట్ చెయ్యమని ‘చెలి’ అనే పది ఎపిసోడ్‌ల మినీ సీరియల్ గూడా తీసాడు – నవీన్, అతని భార్య మాధురీ సేన్, రాజీవ్, అతని భార్య సుమని పెట్టి. ఏకవీర లాంటి కథ. ఈ నవీన్ మా ‘పద్మవ్యూహం’లో కూడా అస్మితతో హీరోగా ఏక్ట్ చేసాడు. అనుకోకుండా ఓ ఏడేళ్ళ తరువాత నాకు అమెరికాలో అట్లాంటాలో కనిపించాడు! తర్వాత సాఫ్ట్‌వేర్ ఎంప్లాయిగా అక్కడే సెటిల్ అయ్యాడు. కొంతమంది అనవసరమైన వాళ్ళ గురించి కూడా కొన్నిసార్లు రాయాల్సి వస్తుంది. ప్రభాకర్ నటన నచ్చి, మా అమ్మ అతనికి ఫోన్స్ కూడా చేస్తుండేది. అతని భార్య కూడా అభిమానంగా మాట్లాడ్తుండేది. కాలక్రమాన ఏమైందంటే, నెమ్మదిగా… అన్ని పవర్స్ అతని చేతికి వచ్చేయడంతో సుమన్ గారు ‘పద్మవ్యూహం’ కథ కూడా వినడం మానేసారు. ఇతని చేతికి పగ్గాలొచ్చాయి.

ఆ సమయంలోనే ఇంద్రనీల్ అనే నటుడు, హీరోకి తమ్ముడిగా చిన్న పాత్రలో నటిస్తుంటే, నేను అతని పాత్ర పెంచి, సుమిత్ర పంపన చిన్న కొడుకుగా, దీప్తి అనే జోడీని పెట్టి, బాగా పెంచాను.

ప్రభాకర్ మొదట్లో నన్ను బాగానే గౌరవించేవాడు. తరువాత కొంతమంది ఆర్టిస్టులని తీసెయ్యమనీ, కథ మార్చమనీ ఏవో చెప్తూ వుండడం, ఆ ఇన్‌వాల్వ్‌మెంటూ, సూచనల వల్ల నేనూ, డైరక్టరు గారూ ఇద్దరం అసంతృప్తులం అవడం మొదలయింది. సిట్టింగ్ అంటూ నన్ను పిలిచి మధ్యాహ్నం మూడింటికి, సాయంత్రం ఆరింటికి రావడం, బాగా బిజీగా వున్నానని వెయిట్ చేయించడం, అన్నీ చేసాడు! సుమన్ గారూ, కె.వీ.ఎస్.ఎస్.ఆర్.కె. ప్రసాద్ గారూ నాతో ఎప్పుడూ అలా చెయ్యలేదు!

సుమన్ గారు కూడా ఇతని మాటలు ఎక్కువగా వినేవారు పాపం! గిరిధర్ గారు… నాకు ఇంటికొచ్చి ఈటీవీలో ‘అనూహ్య’ సీరియల్ ఇచ్చిన డైరక్టర్ గారి మీద… ప్రభాకర్‌కి ఎందుకో కోపం వచ్చి, ఆయనకి సీరియల్ కాన్సిల్ చేయించాడు! సుమన్ గారు ఆ డైరక్టర్ గారి గురించి అడిగితే నేను మంచిగానే మాట్లాడాను, కానీ, ఆయనకి ఎవరో నేను ఆయన గురించి బ్యాడ్‌గా చెప్పానని చెప్పడంతో, ఆ అపార్థంతో ఆయన నాతో మాట్లాడడం మానేసారు. ఆయన నాకు అప్పుడూ ఇప్పుడూ గురుతుల్యుడే… నేను ఏం బ్యాడ్ మాట్లాడలేదు. కానీ ఆయన ఈటీవీకి దూరం అయ్యారు… ఆ తర్వాత రాస్తున్న సీరియల్ తీసేసి వేరెవరికో ఇప్పించి ‘వెయ్యో ఎపిసోడ్’ చెయ్యబోతుండగా సుమన్ గారికేవో చెప్పి నన్నూ తీయించెయ్యడంతో, కొన్నాళ్ళకి అనిల్ కుమార్ గారూ, మీర్ గారూ, ఇలా సీనియర్ డైరక్టర్స్, టెక్నీషియన్స్ అందరూ ఒక్కొక్కరుగా ఈటీవీ నుంచి బయటకొచ్చేయాల్సింది! సుమన్ గారు అప్పుడు ఎందుకో ఆలోచించకుండా అతనేం చెప్తే అది విన్నారు!

ఈటీవీ వదిలేసి వచ్చినందుకు, కన్నతల్లిని వదిలిపెట్టి వచ్చినట్లు నేనెంతో బాధపడినా, ఎవరి డామినేషన్ నా మీద లేనందున స్వేచ్ఛావాయువులు పీల్చాను.

పరుచూరి రఘుబాబు నాటక పరిషద్ పోటీలు ప్రతీ ఏడూ ఏప్రిల్ 27 నుండీ ప్రారంభమై మే 1న ముగిసేవి. వాటికి జడ్జిగా నన్ను కూడా పరుచూరి వెంకటేశ్వరరావు గారూ, పరుచూరి గోపాలకృష్ణ గారూ నియమించడంతో నేను ఎంతో ఆనందాన్ని పొందాను. ముఖ్యంగా మా నాన్నగారు ఎంతో సంతోషించారు. ఆయనకి నాటకాలంటే ఇష్టం!

అలా ఐదు సంవత్సరాలు అనేక ప్రముఖులతో కలిసి పరిషద్ పోటీలకి జడ్జిగా వ్యవహరించాను. అప్పట్లోనే ‘మనసంతా నువ్వే’, ‘శ్రీరామ్’, ‘నేనున్నాను’ తీసిన వి.ఎన్.ఆదిత్య కూడా ఒక జడ్జిగా నాకు పరిచయం అయి, బాగా దగ్గరయి స్వంత తమ్ముడిలా మారిపోయాడు. ఎన్‌కౌంటర్ శంకర్ కూడా ఒక సంవత్సరం నాతో కలిసి జడ్జిగా చేసాడు. ఎన్నో మంచి మంచి నాటకాలు చూడడం, పరుచూరి వారి మర్యాదలు పొందడం, ఆఖరి రోజున స్టేజ్ మీద కూర్చుని రామానాయుడు గారూ, దాసరి గారూ మొదలైన ప్రముఖుల చేతుల మీదుగా సన్మానాలూ, జ్ఞాపికలూ అందుకోవడం లాంటివి అన్నీ నేను చాలా త్వరితంగానే అనుభవించాను.

అప్పటి సాన్నిహిత్యం వల్లే వి.ఎన్.ఆదిత్య చేసే తరువాతి సినిమాకి నన్ను స్క్రీన్ ప్లేకి పెట్టుకున్నాడు. నాగార్జున హీరో, శివప్రసాద్ రెడ్డి గారు నిర్మాత. అంతకన్నా ఏం కావాలి?

ఈటీవీలో జరిగిన అవమానం మరిచిపోయి, ఆనందంగా వర్క్ చేసుకునేదాన్ని. ఆదిత్య తల్లిదండ్రులు ఉమగారూ, సత్యప్రసాద్ గార్లు నన్ను కూతురిలా అభిమానించారు. ఆదిత్య భార్య శ్రీదేవి కూడా ప్రేమగా వుండేది. వారంలో కనీసం మూడు, నాలుగు రోజులు ఇంటి భోజనం చేద్దాం అని లంచ్‌లో ఇంటికి తీసుకెళ్ళేవాడు. ఇక్కడ వాళ్ళ నాన్నగారు సత్యప్రసాద్ గారి గురించి కొంత చెప్పాలి. ఆయన ప్రతి రోజూ ఇంటికి ఎవరో ఒక కవీ లేదా రచయితని భోజనానికి తీసుకెళ్ళేవారు. ఆ రోజుల్లో నేను ఆయన మీద వేసిన జోక్ ఏమిటంటే “మీ నాన్నగారు ఎవరైనా పెన్ కొంటుంటే, వాళ్ళ అభిమానిగా మారి ఇంటికి తీసుకొస్తారు భోజనానికి, ఓ వేళ పెన్ కొన్నవాళ్ళు రచయితలౌతారేమోననీ!” అన్నాను. ఈ జోక్ ఆయనకీ తెలిసి నవ్వేసి వూరుకున్నారు పాపం! ఆయన స్వయంగా మంచి ఛందోబద్ధమైన కవిత్వం రాసే కవీ, రచయితా. ఆదిత్య తనని ఉపయోగించుకోవడం లేదని బాధపడేవారు. ఆదిత్యకి ఇద్దరు అన్నయ్యలు సతీష్, సుధాకర్. ఇద్దరు వదినల్లో మొదటి వదిన పద్మ కాలక్రమంలో ఆర్టిస్టుగా మారింది. వాళ్ళ అక్కయ్య మీనాకుమారి టీవీలో చాలా ఫేమస్ అప్పటికే. ఆ మీనాకుమారి ఆడపడుచు విజయశ్రీ, మా కెమెరా వుమన్ ‘అనూహ్య’ సీరియల్‌కి.

ఆదిత్యా వాళ్ళ నాన్నగారు సత్యప్రసాద్ గారూ, మా బాబాయి సాయి భాస్కర్ శని, ఆదివారాల్లో రేస్ కోర్సులో టికెట్లు అమ్మేవారు. వీళ్ళు చేసే ఉద్యోగాలు కాకుండా, ఇలా శని ఆదివారాల్లో విశ్రాంతి తీసుకోకుండా రేస్ కోర్సులో టికెట్లు అమ్మి కుటుంబం కోసం కష్టపడేవారు. వాళ్ళు ఏ రోజూ లోపలికి వెళ్ళి రేసులు చూసింది లేదు, కేవలం అదనంగా వచ్చే డబ్బులు కుటుంబానికి ఉపయోగపడతాయని మాత్రమే టికెట్లు అమ్మేవారు. అలా మా బాబాయికి సత్యప్రసాద్ గారు దగ్గరి స్నేహితులు.

వాళ్ళ కుటుంబంతో ఇంకో కనెక్షన్ ఏంటంటే నాకు, నేను ‘రేపల్లెలో రాధ’ నవల ఆంధ్రప్రభలో రాసేటప్పుడు ఈ వి.ఎన్. సతీష్ ప్రభకి సబ్ ఎడిటర్‌గా పని చేసేవారు. ఎడిటర్ రాఘవరావు వల్లూరితో కలిసి, యండమూరి వీరేంద్రనాథ్ గారి ఆఫీస్ కొచ్చి, నవలకి కూడా సినిమాలా సిట్టింగ్స్ చేసిన అనుభవం అతనిది. అప్పట్లోనే తమ్ముడితో “ఈ నవల నువ్వే సినిమా తీయాలిరా” అనేవారుట! కానీ నాకిదేం తెలియదు. ఆ నవల శరత్ గారు కొని చదవడం, పి.బి. ఆర్ట్స్ బ్యానర్ మీద బాలకృష్ణా, ఎమ్.ఆర్.వి. ప్రసాద్ గార్ల నిర్మాణంలో సినిమాగా రావడం వలన ఆదిత్య నిరాశ పడ్దాటట. తర్వాత తెలిసింది. ఇంక అతని భార్య శ్రీదేవి, మా తాతగారిని మెంటల్ పేషంటని అసైలమ్‌లో పెడ్తే అక్కడే ‘ఎస్సేస్ ఆన్ హ్యుమన్ లైఫ్’ అన్న గ్రంథం రాసి, జైలర్ మీద పరువు నష్టం దావా వేసి, గెలిచి, ఆ నష్ట పరిహారం 1,200/- రూపాయలతో అయ్యంకి వెంకట రమణయ్య గారి ప్రెస్‌లో విజయవాడలో పుస్తకం పబ్లిష్ చేయించారు కదా! ఆ అయ్యంకి వెంకట రమణయ్య గారికి వరుసకి మనుమరాలు. అప్పట్లో ఆదిత్యా శ్రీదేవిలకి ఇంకా పిల్లలు లేరు. ఈ విధంగా నేను ‘బాస్’ సినిమాకి వర్క్ చేస్తున్నాను.

అప్పట్లోనే దురదృష్టవశాత్తు, మా కజిన్ ఉమక్క భర్త వెంకటాచలం పోయారు. ఆఫీస్‌లో వున్న నాకు తెలిసి, హుటాహుటిన ఆఫీస్ కార్లోనే వెళ్ళాను.

తానొకటి తలచినంత దైవమొకటి తలుస్తాడని, నా విషయంలో చాలాసార్లు నిజమైంది! అలాగే ఒక ద్వారం మూసేయబడితే, ఇంకొక ద్వారం మన కోసం దేవుడు తెరుస్తాడని కూడా నాకు ఎన్నోసార్లు నిరూపితమైంది!

(సశేషం)

Exit mobile version