Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జీవన రమణీయం-65

టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం.

చిరంజీవి సినిమాల్లోకొచ్చిన కొత్తల్లో, నేను అతన్ని దగ్గర నుండి చూడాలని తపించిపోతున్న రోజుల్లో ‘ప్రేమ తరంగాలు’ ఫంక్షన్‌కి మోక్షగుండం విశ్వేశ్వరయ్య హాల్‌కి ఆ తారగణం అంతా వస్తోందని, విజయోత్సవ సభకి, వంశీ ఆర్ట్స్ థియేటర్స్‌లో ఏక్టివ్‌ మెంబర్స్‌గా వుండే మా బాబాయ్‌లు చెప్తే, నేనూ మా ఫ్రెండ్ పద్మశ్రీ వెళ్ళాం. నేను ఇంటర్మీడియట్, అది టెన్త్ క్లాస్. అసలు చిరంజీవి నన్ను చూడగానే, “అరే… అలా వెనకాల నిలబడ్డావేంటి? మనకి చాలా ఏళ్ళుగా పరిచయంగా… ముందుకి రా…” అని చెయ్యి పట్టి, ముందుకి లాగి ఆటోగ్రాఫ్ ఇస్తున్నట్లు ఆ ముందు రోజు రాత్రి చాలా కలలు కన్నాం. అసలు అవి వూహలు! కలలు కావు! పద్మశ్రీతో “ఇలా అనుకున్నాను” అని చెప్తే, “అరే నేనూ అదే అనుకున్నానే” అంది. అలాంటి వయసులో, సినిమా స్టార్స్ అంటే అస్సలు అవగాహన లేని టైమ్‌లో నేను ఆ ఫంక్షన్‌కి వెళ్ళాను. మా బలరాం బాబాయ్, రాధ పిన్నీ, వాళ్ళకి క్లోజ్ ప్రెండ్ శోభ అనే మేకప్ వుమన్ మమ్మల్ని రిసీవ్ చేసుకుని, కాస్త ముందు సీట్లోనే కూర్చోపెట్టారు. ఆ శోభకే మేకప్ వుమన్ కార్డ్ ఇవ్వడానికి గొడవై, కోర్టు కేసు అయింది. కాసేపటికే కృష్ణంరాజూ, సుజాతా, జయప్రదా అంతా వచ్చారు… చిరంజీవి కోసం మా కళ్ళు ఆత్రుతగా వెతుకుతున్నాయి. ఫుల్ బ్లాక్ సూట్‌లో ఆయన రాగానే నా గుండె ఒక్క క్షణం ఆగి కొట్టుకుంది… ఈ ఫీలింగ్స్ మా పద్మశ్రీకి తప్ప నేనేవరికీ చెప్పలేదు ఇంతవరకూ… అలా చూస్తూ వుండిపోయాను!

నేను ఎంతో శ్రద్ధగా కట్టి పెట్టుకున్న మల్లెపూల మాలా, జడగంటల జడా, పసుపుకి ఆకుపచ్చ బోర్డర్ వున్న పట్టు పరికిణీ, ఆకుపచ్చ ఓణీ… అన్నీ చిరంజీవి చూసి మెచ్చుకోవడం కోసమే అని నా భావన! మా పద్మశ్రీ ఏదైనా మాట్లాడినా కూడా చాలా చిరాకుగా వుంది ఆ సమయంలో… అది నాకు కాంపిటీటర్… అది బావుండేది.. కాని పొట్టి! నా పొడుగు చూసి అసూయపడేది… నేను దాని పొడవాటి జడ చూసి అసూయపడేదాన్ని. ఇప్పుడు జుట్టు కట్ చేసుకుని ర్యాలీలో వుంటోంది. నాలాగే మా కాలనీ అబ్బాయినే లవ్ మేరేజ్ చేసుకుంది, కానీ చిన్న తేడా… అది ఇంటర్-కేస్ట్ చేసుకుంది!

కొత్తగా కొనుక్కున్న ఆటోగ్రాఫ్ పుస్తకంతో నేను మొదటి వరస వైపు వెళ్ళబోయా… ఎవరో బలంగా వెనక్కి తోసేసారు! నాకు చాలా ఇన్‌సల్ట్ అయింది. చిరంజీవి చూసాడు. “ఆమెని రానీయండి..” అనలా… అసలు పట్టించుకోలేదు… ఆ నిర్లక్ష్యానికి నా కళ్ళ నీళ్ళు తిరిగాయి. ఇవన్నీ తలచుకుంటుంటే ఇప్పుడు నవ్వొస్తోంది! సిగ్గేస్తోంది!… నా పిల్లలు చదివితే ఏం అనుకుంటారో? నాకప్పుడు జస్ట్ సిక్స్‌టీన్!

మా బాబాయ్‌లకు తెలుసు నా చిరంజీవి ప్రేమ! స్టేజ్ మీద వున్నవాడల్లా చిన్న బాబాయ్ నన్ను చెయ్యి పట్టి, జనాన్ని తప్పిస్తూ చిరంజీవి దగ్గరకి తీసుకెళ్ళాడు! అందుకాయన ‘వంశీ’ వాలంటీర్స్ బేడ్జ్ పనికొచ్చింది. చిరంజీవి నా చేతిలోంచి ఆటోగ్రాఫ్ బుక్ తీసుకున్నాడు… నా కళ్ళలోకి చూసాడు… నా గుండెల్లో శతకోటి వీణలు మోగాయి అనాలా? గురువుగారు వీరేంద్రనాథ్ భాషలో శతకోటి శతఘ్నులు పేలాయి అనాలా? నాకు తెలీలేదు కానీ… ఆ మొత్తం ఫన్ ఆయన తర్వాత అన్న ఒక్క మాటతో పోయింది, “పాపా ఏం చదువుతున్నావ్? బాగా చదువుకో” అని తన పేరు రాసి, నా చేతికి నవ్వుతూ ఇచ్చేసారు! పొడుగ్గా ఫీలయిన నన్నే ఇలా అంటే, ఇంక నా భుజం కిందకున్న మా పద్మశ్రీనేం కేర్ చేస్తారు? మా ఆశలన్నీ మటాష్ అయ్యాయి. ఆ రోజు మాట్లాడడానికి సుజాత చాలా సిగ్గు పడడం, ఆమె భర్త జయకుమార్ ఆమెని ప్రోత్సాహిస్తూ మాట్లాడమనడం నాకెంతో నచ్చాయి. ఆవిడ గట్టిగా జడ వేసుకుని, వైట్ పట్టు చీరలో భర్త పక్కన హుందాగా నడుస్తూ వచ్చారు! ‘విభూది’ నుదుటి మీద తగ్గిస్తే బావుండేదని నేనూ, కాదు అని మా పద్మశ్రీ వాదించుకుంటూ బస్సెక్కి ఇంటికొచ్చేసాం! ఆ ఆటోగ్రాఫ్ మాత్రం నేను ఇంటికొచ్చిన అందరికీ, నేను ఒలింపిక్స్‌లో గెలుచుకున్న కప్‌లా చూపించేదాన్ని! మా అమ్మమ్మగారు మాత్రం “అతనేమైనా అక్కినేని నాగేశ్వర్రావా? అతనైతే గొప్పగా చూపించుకోవాలి” అంది. బహుశా ఆవిడ వయసులో ఆ ‘బాలరాజు’తో ఏమైనా డ్రీమ్స్ వుండేవేమో… ఆయన వాళ్ళ తరం డ్రీమ్ బోయ్! ఈ సంగతి నేను నాగేశ్వర్రావుగారితో చెప్పి నవ్వుకున్నాను…

తరువాత చిరంజీవి గారికి కథ చెప్పడానికి ఇంటికెళ్ళినప్పుడు నేను ఆయనకి ఈ ఘట్టం చెప్తే “ఔనా పాపా” అని వెక్కిరించారు. నాకు కాఫీ ఇస్తూ “చూశారా… మీ ప్రతిభ వల్ల ఈ రోజు అదే చిరంజీవి చేత నుండి కాఫీ అందుకుంటున్నారు. అందుకే ప్రతిభని నమ్ముకోవాలి… అదే ఆశించిన గమ్యం చేరుస్తుంది. మీరు చాలా మంచి నెరేటర్… కావాలంటే రాసి సర్టిఫికెట్ కట్టి ఇస్తాను….” అన్నారు కూడా! ఆ రోజు తెలీదు ఈ రోజు వస్తుందని… పద్మశ్రీ నేనూ చివరికి ఎవరిళ్ళకి వాళ్ళం వెళ్ళి హోం వర్క్‌లు చేసుకునే ముందు “అసలు కలవకపోతే బావుండేదే” అనుకున్నాం!

ఆ తరువాత ‘ఎవరే అతగాడు’ ప్రారంభోత్సవంలో నా పిల్లలతో కలిసి చిరంజీవి గారితో ఫొటో తీయించుకున్నాను. అప్పటికి ఆ క్రేజ్ లేదు. ఇంటర్‌మీడియెట్ ఫస్ట్ ఇయర్‌లో ఆయన పెళ్ళి సురేఖతో జరిగిన రోజు ఏడ్చానని అల్లు అరవింద్ గారికి చెప్పినందుకు, ఇప్పటికీ ఏడిపిస్తారు నన్ను! నాకూ చాలా ఫన్నీగా వుంటాయి ఆ జ్ఞాపకాలు… బట్ అప్పుడు తెలీనితనంతో ఎంత బాధపెట్టాయీ? ఇప్పుడు ఎవరైనా టీనేజ్ పిల్లలు ఈ ఇన్‌ఫాక్చుయేషన్స్‌తో నా దగ్గరకి వస్తే బాగా కౌన్సిలింగ్ చెయ్యగలుగుతున్నాను!

ఈ విషయాలన్నీ వీరేంద్రనాథ్ గారికి కూడా తెలుసు… ఆయనకి చెప్పినప్పుడు 1993లో “అయితే కలుస్తారా? ఫోన్ చెయ్యమంటారా?” అన్నారు. నేను “వద్దు… ఆ క్రేజ్ ఇప్పుడు లేదు… నాకే అది తలచుకుంటే చాలా సిల్లీగా వుంటుంది” అని చెప్పాను. ఆ తర్వాత మా సీతామాలక్ష్మి షూటింగ్ రోజుల్లో నాగబాబుగారితో నా ‘ప్రేమ తరంగాలు’ ఇన్సిడెంట్ చెప్పాను… “యూ బిలీవ్ మీ ఆర్ నాట్… అన్నయ్య కోసం వచ్చే గర్ల్స్‌కి నచ్చచెప్పి ఆ రోజుల్లో ఇంటికి పంపించడం నాకు తలకి మించిన పనిగా వుండేది! ఆ తరువాత మా తమ్ముడి కోసం..” అంటూ ఆయన సరదాగా కొన్ని ఇన్సిడెంట్లు చెప్పారు! నాకు తెలిసి మగవాళ్ళలోనే ఆడవాళ్ళకి చాలా మటుకు మంచి స్నేహితులు దొరుకుతారు. మనం చెప్పిన విషయాలు, మనం కనుమరుగవగానే ఇతరులకు షేర్ చెయ్యాలనే తపన వాళ్ళకి తక్కువ వుంటుంది! నాకు చాలా మంచి స్నేహితులు దొరికారు… నేను చాలా చాలా అదృష్టవంతురాలిని!

ఇంక మధుమాసానికొస్తే… ఫిబ్రవరి 9న 2007లో సినిమా రిలీజ్ అయింది!

(సశేషం)

Exit mobile version