[డా. కె. రజనీ ప్రియ గారు రచించిన ‘జీవన సాఫల్యం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
తెలియని దారి అని ఎప్పుడూ సంకోచపు సంకెళ్లు
తెలిసిన బాట అయినా తెగింపు లేని నడకలు
ఎంతో ఇష్టమని తెలిసినా ముందుకు
అడుగు పడనివ్వను అని మది తీర్మానం చేసింది
ఎన్ని ఋతువులు మారినా గడప
దాటకుండా పక్కనే భయం మాటు వేసింది
ఎప్పుడో తరలిపోయాయి నీతో పాటు
వలస మొదలు పెట్టిన పక్షులు
చలనం లేక బెదురు బెదురుగా
ఎవరో వస్తారు అనే ఎదురు చూపులతోనే
గడిపెయ్యి దిగులును దిండుగా చేసుకుని
ఎవరికో కుట్టిన చొక్కా కొలతలు
నీకు పట్టలేదు అనే స్పృహే లేక అదే రోజూ వేసుకో
ఎదుగు బొదుగు లేని జీతం ఉండొచ్చేమో
కానీ జీవితం ఉండకూడదుగా
కాలం ఇచ్చే పరీక్ష పత్రంలో
సమాధానం రాసే కలంగా ఎప్పుడు అవుతావు
నీకు లేని వైకల్యాన్ని
నీకు చూపగలిగేలా ఉంటే బావుండుగా మనసు దీపం
వైఫల్యం ఎదురైనా
అనుభవం మారుస్తుందిగా వేడుకగా జీవితపు చిత్రం
ఎప్పుడు తెలుస్తుంది నీకు
ఈ క్షణమే నీదని.. రేపు నీ చేతిలో లేదని
ఎవరు నేర్పగలరు నీకు
చర్య లేనిదే ప్రతి చర్య జరగదని
బతుకు కాన్వాస్‌లో అసంపూర్ణ గీతల్లోనే
పరిపూర్ణత్వాన్ని వెతుక్కోవాలని..
దానికైనా ప్రావీణ్యపు కోటలు బద్దలు కొట్టాలని..
లక్ష్యాల లెక్కల్లో ముందు అంకెల్లోనే ఉండాలని
చత్వారపు అద్దాల్ని తీసి
కనిపించే అవకాశాల్ని కలిపితే
చుక్కానిగా చూపదా మనసుకు తోవ
పట్టుదలతో ప్రయత్నం చేస్తే
మినుకుమని వెలిగే ఆశల దీపం
ముందు చిన్నబోదా
కాంతులీనే కాగడా
చుక్క చుక్క దోసిలి పడితేనే కదా
మునగగలవు ఆనందపు సిరిలో
నిశ్చయంగా అడుగు ముందుకు వేస్తేనేగా
నిలబడగలవు జీవితపు బరిలో
