[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘జీవన యానంలో ఆత్మజ్ఞానం’ అనే రచనని అందిస్తున్నాము.]
మనం ప్రయాణించే వాహనంలో ఏ చిన్న భాగం సరిగ్గా పనిచేయకపోయినా ప్రయాణం సాగదు. అలాగే, ఈ జీవన యానంలో మనం గమ్యాన్ని సురక్షితంగా చేరుకోవాలంటే, మన దేహమనే రథాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
ఈ దేహమనే వాహనానికి మన మనస్సే స్టీరింగ్. ధర్మార్ధ కామ మోక్షాలనేవి నాలుగు చక్రాలు (టైర్లు). భక్తి, విశ్వాసాలే ఆ చక్రాల్లో నిండి ఉండే ప్రాణవాయువు. మనం తీసుకునే ఆహారపానీయాలే ఈ రథానికి ఇంధనం. భగవంతుడు మనకు ఈ దేహాన్ని ఒక సాధనంగా ప్రసాదించాడు. అయితే, ఈ ప్రయాణం ఎక్కడ మొదలైంది? ఎక్కడికి సాగాలి? మన అసలు గమ్యం ఏమిటి? అనే విషయాలను మనం శ్రద్ధగా విశ్లేషించుకోవాలి. ఆత్మతత్వాన్ని తెలుసుకోనంత కాలం, మనిషి కేవలం పశుపక్షాదుల వలె ఆహార, నిద్రా, భయ, మైథునాలకే పరిమితమై గమ్యం తెలియని దారిలో తిరుగుతూ ఉంటాడు.
ఒక కొరియర్ కవరుపై చేరవలసిన చిరునామా లేకపోతే అది ఎక్కడికీ చేరదు. మన జీవితం కూడా అంతే! మన అంతిమ లక్ష్యం పరమాత్మ సన్నిధి. ఆ లక్ష్యం పట్ల స్పష్టత ఉన్నప్పుడే మనం వేసే ప్రతి అడుగు సార్థకమవుతుంది. లక్ష్యం లేని జీవితం జనన మరణ చక్రంలో పడి కొట్టుమిట్టాడుతుంది. అందుకే రమణ మహర్షి “నీవెవరో తెలుసుకో” అని ప్రబోధించారు. కేవలం భౌతిక సుఖాల కోసమే జీవిస్తే మానవ జన్మ వ్యర్థం అవుతుంది.
ఈ విషయాన్ని మన శాస్త్రాలు కొన్ని విసేషమైన శ్లోకాల రూపంలో స్పష్టం చేసాయి.
తొలుత ఆత్మ రథ రూపకం (కఠోపనిషత్తు)ఈ కింది విధంగా చెప్పింది.
ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవ తు
బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ
ఈ దేహాన్ని ఒక రథంగా భావిస్తే, అందులో ప్రయాణించే ఆత్మయే యజమాని. బుద్ధి అనేదే సారథి (డ్రైవర్), మనస్సు అనేది గుర్రాలను నియంత్రించే కళ్ళెం (స్టీరింగ్). ఇంద్రియాలే గుర్రాలు. ఈ విషయాన్ని గ్రహించి బుద్ధిని, మనస్సును అదుపులో ఉంచుకున్నవాడే గమ్యాన్ని చేరుకుంటాడు అని ఈ శ్లోకం అర్ధం.
ఇక మోక్ష మార్గం (భజగోవిందం)ఈ కింది విధంగా ప్రబోధిస్తోంది.
పునరపి జననం పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనమ్
ఇహ సంసారే బహుదుస్తారే, కృపయాపారే పాహి మురారే
మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ మరణించడం, మరల తల్లి గర్భంలో శయనించడం.. ఈ జనన మరణ చక్రం అనంతమైనది. దాటడానికి వీలుకాని ఈ సంసార సాగరం నుండి నన్ను రక్షించు స్వామీ! అని వేడుకుంటూ, ఆత్మజ్ఞానం వైపు అడుగులు వేయడమే మానవ జీవిత పరమార్థం.
పురుషసూక్తం చంద్రమో మనసో జాత: చక్షో సూర్యో అజాయత అని అంటోంది. అంటే మన మనస్సే చంద్రుడు, నేత్రాలే సూర్యుడు, మన హృదయమే ఆకాసం, బాహ్య ప్రపంచంలో కల్షల మైళ్ళ దూరంలో అంతరిక్షానికి ప్రయాణం చేస్తున్న మానవుడు తన హృదయాంతరాళంలోకి కొన్ని సెంటీ మీటర్లు ప్రయాణం చెసినా తానెవరో, ఎక్కడి నుండి వచ్చాడో, ఎక్కడికి వెళ్ళాలో అతి సులభంగా అర్థమవుతుంది. దురదృష్టవశాత్తు ఈ తత్వాన్ని తెలుసుకోకుండా ఈ సృష్టిలో వున్న సమస్తమైన విషయాలను అర్థం చేసుకొనూ ప్రయత్నం చేస్తున్నారు.
ఆత్మజ్ఞానం అంటే కేవలం బాహ్య రూపమైన ఈ భౌతిక శరీరం మాత్రమే కాకుండా, మనలో వెలుగుతున్న మూల చైతన్యమే మనం అని గుర్తించడం. ఇది ఆధ్యాత్మిక ప్రయాణంలో తొలిమెట్టు అయితే, సకల చరాచర సృష్టి రహస్యాలను, అనంత కోటి లోకాల విజ్ఞానాన్ని సమగ్రంగా అవగతం చేసుకోవడమే తుదిమెట్టు అయిన బ్రహ్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అనే పునాది లేకుండా బ్రహ్మజ్ఞానాన్ని సాధించడం అసాధ్యం.
మరింత సరళంగా చెప్పాలంటే, తనను తాను తెలుసుకోవడం ఆత్మజ్ఞానం అయితే, తనతో పాటు ఈ సృష్టి మొత్తాన్ని అర్థం చేసుకోవడం బ్రహ్మజ్ఞానం. అందుకే వేదం మన ఆత్మ విచారణను ఆత్మజ్ఞ్ఞానంతో ఆరంభించి బ్రహ్మజ్ఞానంతో ముగించమని చెబుతోంది.
