Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

బ్రతుకుపాటని శ్రుతి తప్పనీయద్దనే కథల సంపుటి ‘జీవనగానం’

[డా. మజ్జి భారతి గారి ‘జీవనగానం’ అనే కథాసంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

డా. మజ్జి భారతి వృత్తిరీత్యా వైద్యులు, వైద్య విద్య బోధనా రంగంలో ప్రొఫెసర్. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. కథలు, కవితలు యాత్రా రచనలు, వ్యాసాలు వ్రాస్తారు. ‘జీవనగానం’ వారి మూడవ కథాసంపుటి. ఈ పుస్తకంలో 25 కథలున్నాయి. 12వ కథ పేరునే పుస్తకానికి శీర్షికగా ఉంచారు.

“మానవ సంబంధాలు, వాటి మధ్య వైరుధ్యము, వైవిధ్యము, మధ్య తరగతి మనుషులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలు, స్త్రీలకు మాత్రమే ప్రత్యేకమైన, వారు మాత్రమే ఎదుర్కొంటున్న సమస్యల్ని చిత్రించడమే కాక డాక్టరు కావడం వల్ల వాటి పరిష్కార మార్గాల్ని చెప్పడం విశేషం. భారతిగారు ఈ కథల్లో చర్చించిన అంశాలు ఆమె ఒక డాక్టరుగా, సైకియాట్రిస్టుగా, అనుభజ్ఞురాలూ, ఆలోచనాపరురాలైన తల్లిగా కూడా మనకు కనిపిస్తుంది.” అని వ్యాఖ్యానించారు శ్రీ గంటేడ గౌరునాయుడు తమ ముందుమాటలో.

“మనిషి చేపలా ఈదగలడు. పక్షిలా ఎగరగలడు. కాని మనిషిలా జీవించలేడు అన్నాడో మహానుభావుడు. అంటే మానవత్వంలేని మనుషులు మనమధ్య తిరుగుతున్నారని అర్థం. మనుషులంతా మానవులు కారు. మానవత్వం ఉట్టిపడేవారే మహాత్ములౌతారు. కథేకదా ఏమైనా రాసేద్దాం అనుకున్న రచయితలు భారతి గారి కథలు చదివి కథలు రాయడం ప్రారంభించాల్సిందే. మన జీవితాన్ని వివిధకోణాల్లో సృజించే ఆమె కలానికి సృజనాత్మకత తెలుసు. అధునాతన జీవితంలో విలువలు తగ్గిపోతూ మనిషి కొట్టుకుపోకుండా అడ్డుకట్ట వేస్తాయి ఆమె విలువైన పాత్రలు. కథ చివరిలో అమృతం చిలుకుతాయి.” అన్నారు డా. గుజ్జు చెన్నారెడ్డి గారు తమ ముందుమాటలో.

~

కొత్తగా పెళ్ళయి ఉమ్మడి కుటుంబపు అత్తారింటికి వెళ్ళిన సుహాసిని, కొద్ది నెలలకే వేరు కాపురం పెట్టించడమే కాకుండా, అత్తగార్ని కూడా తమతో తీసుకెళ్ళిపోతుంది. ఒక చిన్న చర్యతో, భర్త, అత్తగారి అపోహలను తొలగిస్తుంది. దాంతో ఆమె చేసిన పనుల వెనుక అంతరార్థం అర్థమవుతుంది ‘అమ్మ ఎంతో మీరూ అంతే’ కథలో. శీర్షికే కథాసారాన్ని ఊహించేలా చేసినా, కథను నడిపిన తీరు, సంభాషణలు చివరిదాకా చదివిస్తాయి.

జీవితాన్ని ఎదుటివారి కోసం కాకుండా, తమ కోసం జీవించేవారితో బంధం కలుపుకోడం బాగుంటుందని అనుకుంటాడో యువకుడు. తన పెళ్ళి విషయంలో, తన కుటుంబ సభ్యులని, వాళ్ళ ద్వంద్వ వైఖరులని జాగ్రత్తగా గమనిస్తాడు. ఏ సంబంధాన్ని అంగీకరించకుండా చేస్తున్న వారి ధోరణి అతనికి అర్థం కాదు. చివరికి వాళ్ళు చూసొచ్చిన ఓ సంబంధం వారి అమ్మాయిని చూడ్డానికి తాను వెళ్ళి ఆమెతో మాట్లాడాక, ఆమెను పెళ్ళి చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది అన్న నిర్ణయానికి వస్తాడు. కానీ ఆడపెళ్ళివారెంతకీ తమ నిర్ణయం చెప్పరు. అతని ఎదురుచూపులు కొనసాగుతాయి. ఈ సంబంధం కూడా చేజారిపోయినట్టే అని నిరాశపడుతున్న సమయంలో అమెరికా నుంచి వస్తున్న ఓ మిత్రుని స్వాగతించడం కోసం ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళిన అతనికి అదే విమానంలో వచ్చిన ఆమె తారసపడుతుంది. అతన్ని చూసి ఆమె అన్న ఒక్క మాటతో.. అతను ఆమె వెనుక నడుస్తాడు ‘ఎదురుచూపు’ కథలో.

ఓ ఊరి మోతుబరి, సంపద మాయలో పడతాడు. ఊరికి చివర ఉన్న భూములలో, అక్కడున్న ఓ కొండ కింద ఖనిజమేదో ఉందని తెలుస్తుంది. అమాయకులైన ప్రజలని నమ్మించి, ఆ భూములను అమ్మించేసి, కొండని కొట్టించేసి, స్థానిక మంత్రికి రాజకీయంగా సాయం చేసి, ప్రతిఫలం పొందాలనుకుంటాడు. కానీ కొందరు ఆ దురాలోచనలోని మర్మాన్ని పసిగట్టి భూములను లాక్కోవద్దని, కొండని మైనింగ్‌కి అప్పగించద్దని ఉద్యమం చేస్తారు. మంత్రి ఒత్తిడితో ప్రజలని ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. అయితే, ఓ రాత్రి అతనికో కల వస్తుంది. ఉదయం లేచాకా ఆ కలని గుర్తు చేసుకుంటాడు. తన తండ్రి చెప్పిన మాటలు గుర్తొస్తాయి. అతనిలోని వివేకం మేల్కొంటుంది. స్వార్థం నశిస్తుంది. తనని వాడుకోవాలని చూసిన మంత్రికి లౌక్యంతో కూడిన సలహా ఇచ్చి ఆ  సమస్య నుంచి బయటపడతాడు. తెలివైనవాడు స్వార్థం కోసం కాకుండా, తోటివారి కోసం ఆలోచిస్తే, అతని బుర్ర ఎంత అద్భుతంగా పనిచేస్తుందో ‘కల’ కథ చెబుతుంది.

‘గురుతర బాధ్యత’ కథలోని సైన్స్ టీచర్ రమణి ఎదుర్కున్న సమస్య సున్నితమైనది. కో-ఎడ్యుకేషన్ స్కూల్లో, యుక్త వయసు పిల్లలకి పునరుత్పత్తి పాఠం చెప్పడం ఇబ్బంది కల్గించే అంశమని చాలామంది టీచర్లు భావిస్తారు. అందుకు కొందరు విద్యార్థుల ప్రవర్తన కూడా కారణమే. కథా ప్రారంభంలో రమణి టీచర్ అనే మాటలు నేటి పరిస్థితికి అద్దం పడతాయి. అయితే తనకి తన మాస్టారు గారు నేర్పిన పద్ధతిలో పాఠాలు చెప్పే స్రవంతి టీచర్.. ఆ క్లాసు పిల్లలకి ఓ కథ చెప్పి, పిల్లల ఆలోచనని మారుస్తుంది. ఈ మధ్య కాలంలో అమెజాన్ ప్రైమ్‌లో వచ్చిన ‘ఆదర్శ్ బాల్ విద్యాలయ్’ అనే సీరిస్‌లోని సైన్స్ టీచర్‍ కూడా ఇదే సమస్యని ఎదుర్కుంటుంది. మొదట్లో ఇబ్బంది పడినా, తరువాత ఓ భిన్నమైన ఆలోచనతో, ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఆ పాఠాన్ని బోధిస్తుంది. ఓటిటి సీరిస్ కాబట్టి “హర్ మహీనే హోతా హై ఓవులేషన్ కర్‌తీ హై ప్రతీక్షా ఫర్ ఇన్‌సెమినేషన్..” అంటూ పాట రూపంలో చూపించారు.. నిజ జీవితంలో పాటలా కాకపోయినా, ఆ పాటలో చూపించిన విధానంతో బోధించవచ్చు.

‘మార్పు రావాలి’ కథ శీర్షిక సూచించినట్టుగానే సాగుతుంది. చిన్న కుటుంబం.. తల్లి అన్ని పనులు చేసుకుపోతుంటే బాధ్యత పట్టని పిల్లలు, మగవాడిననే అహం నిండిన భర్త, పాతకాలం భావజాలం వదిలించుకోలేని అత్తగారు.. వీళ్ళందరితో విసిగిపోయిన ఇందుమతి ఓ రోజు భర్తని, పిల్లలిద్దర్ని పిలిచి తన నిర్ణయం చెప్పేస్తుంది. తొలుత విస్తుపోయినా, కొడుకు కూతురు తల్లి నిర్ణయం వెనుక ఉన్న బాధని అర్థం చేసుకుంటారు. తల్లిని సమర్థిస్తారు. అహం తగ్గని మోహన్, తన చిన్ననాటి నేస్తం, కొలీగ్ అయిన శ్రావణి ఇంటికి సలహా కోసం వెళ్తాడు. శ్రావణి చెప్పిన మాటలు అతన్ని మార్పు దిశగా నడిపిస్తాయి.

‘ఫంక్సను’ కథ ఆలోచింపజేస్తుంది. బాలికల జీవితంలో ప్రకృతి సహజంగా జరిగే ప్రక్రియను వేడుక చేసుకోవడం ఆనవాయితీ. అయితే లేనిపోని భేషజాలకు పోయి, అట్టహాసంగా ఫంక్షన్ నిర్వహించి అప్పుల పాలై, నగుబాటుకి లోనవాల్సిన అవసరం లేదని ఈ కథ సూచిస్తుంది.

సుజనదీ, వనజదీ ఒకే తరహా జీవితాలు. అయినా వనజ ఆనందంగా ఉంటుంది, సుజన ఉండలేకపోతుంది. వనజ మాటల ద్వారా ప్రవర్తన ద్వారా కొన్ని విషయాలు నేర్చుకుంటుంది సుజన. “ఇంకొకరి చేతలు మన జీవితాలను ప్రభావితం చేయకూడదు” అన్న వాస్తవాన్ని గ్రహిస్తుంది. “వాళ్ళేదో అన్నారని, వీళ్ళేదో అన్నారని ఆ బరువంతా నా నెత్తిన పెట్టుకుని ఆనందాన్ని పాడు చేసుకోలేను” అన్న వనజ ఆలోచనా విధానం సరైనదేననిపిస్తుంది ‘బరువు’ కథలో.

ఇంటి సహాయకులకు కనీస గౌరవం ఇవ్వకుండా, అడ్డమైన చాకిరీ చేయించుకుంటూ హీనంగా చూసే కామాక్షమ్మ – గంగిని తిట్టి పని మాన్పించేస్తుంది. ఆరు నెలల పాటు వేర్వేరు వ్యక్తులతో పని చేయించుకుని, వాళ్ళని అని, వాళ్ళతో మాటలు పడ్డాకా గాని, ఆమెలో అంతర్మథనం జరగదు. క్రితం సారి అమెరికా వెళ్ళినప్పుడు – అక్కడి పనివాళ్ళ గురించి కూతురు చెప్పిన మాటలు గుర్తొచ్చి కనువిప్పు కలిగి, తాను హేళన చేసిన గంగిని క్షమించమని అడుగుదామని వాళ్ళింటికి వెడుతుంది ‘డిగ్నిటీ ఆఫ్ లేబర్’ కథలో.

మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్న కృష్ణ.. తన గురించి అసలు విషయాలేవీ తల్లికి తెలియనివ్వడు. ఇతని సంగతులేవీ తెలియని ఆ అమాయకపు తల్లి అందరి దగ్గర తన కొడుకు గురించి గొప్పలు చెప్పుకుంటుంది. తల్లిని భ్రమల్లోనే ఉంచేసి పబ్బం గడుపుకుంటున్న కొడుక్కి, అతని జూనియర్ శైలజ బుద్ధి చెప్తుంది ‘నమ్మకం’ కథలో. ఆమె చెప్పిన మాటలు అతనిలో మథనానికి దారి తీసి మార్పు వైపు అడుగులు వేసేలా చేస్తాయి.

ఓ ఉపాధ్యాయుడి గొప్పదనం ఎప్పుడు తెలుస్తుంది? ఆయన దగ్గర చదువుకుని ప్రయోజకులై, సంస్కారవంతులైన ఆయన విద్యార్థులను చూసినప్పుడు కదా! అసలైన గురువు ఎన్నడూ విద్యార్థుల మధ్య వారి ప్రతిభ వల్ల, వారి ఆర్థిక స్థితిగతుల వల్ల భేదం చూపక, ఒకేలా బోధిస్తాడు. అందరూ తన పిల్లలే అనుకుంటాడు. అలాంటి గురువు ‘రెండు కళ్ళు’ కథలోని మాస్టారు. ఆయనకి లివర్ క్యాన్సర్ వస్తే, ఆయన దగ్గర చదువుకుని చిన్నా చితక ఉద్యోగాలు చేసుకుంటున్న విద్యార్థులంతా తమకు వీలైనంత కాంట్రిబ్యూట్ చేసి ఆపరేషన్ చేయిద్దామనుకుంటారు. రాజా అనే అతను ఇందుకు పూనుకుని తగిన ఏర్పాట్లు చేస్తాడు. కానీ ఆపరేషన్‌కి అయ్యే ఖర్చంతా, ఓ అజ్ఞాత వ్యక్తి స్పాన్సర్ చేశాడని చెప్పి, వైద్యం చేస్తారు డాక్టర్.  మాస్టారు గారు కోలుకున్నాక, విద్యార్థులంతా కలసి, ఆయన ఇంట్లోనే చిన్న వేడుక చేస్తారు. ఆ సమయంలోనే ఆ అజ్ఞాత దాత ఎవరో రాజాకి చెప్తారు మాస్టారు. హృద్యంగా సాగిపోతుందీ కథ.

‘జీవనగానం’ చిన్న కథ, అయినా అత్యంత ప్రభావవంతమైనది. తాగుబోతైన తన మొగుడు నారాయణ చేత ఆ అలవాటు మాన్పించడానికి ప్రయత్నించే లచ్చుమమ్మ, మరో మార్గం ఎంచుకుంటుంది. అట్నుంచి నరుక్కురావడం అనే టెక్నిక్ ఉపయోగించి, సారాకొట్టు వాళ్ళ మీద, అప్పులిచ్చి తాగిచ్చే వాళ్ళ, నారాయణ ఇలా పాడైపోతున్నా పట్టించుకోని బంధువుల మీద మాటల దండయాత్ర చేస్తుంది. ఆ తిట్ల ప్రవాహాన్ని భరించలేని సమీప భవనంలో తన మిత్రుడు అశోక్‌తో పాటు ఉంటున్న కథకుడు (నెరేటర్), లచ్చుమమ్మకి నచ్చని సలహా ఇస్తాడు. ఆమె ఇతన్ని కూడా తిడుతుంది. అశోక్‌ని చూసి, నిన్ను క్షమిస్తున్నాను అంటుంది. అశోక్ ద్వారా ఆమె తిట్ల వెనుక అంతరార్థాన్ని, ఆమె లాజిక్‌ని అర్థం చేసుకున్న నెరేటర్, నారాయణతో తాగుడు మాన్పించడానికి ఏయే మార్గాలున్నాయో వెతకడం ప్రారంభిస్తాడు.

పిల్లలకి జంక్‌ఫుడ్ అలవాటు చేసి, బాల్యంలోనే ఊబకాయానికి కారణమవుతున్న తల్లిదండ్రుల పద్ధతులను ‘లావు ఒక్కింతయు కాదు’ కథ ఎండగడుతుంది. బాల్యం నుంచే జాగ్రత్త పడితే, యవ్వనంలో స్థూలకాయం రాకుండా చూసుకోవచ్చని, ఒబేసిటీ వల్ల పాతికేళ్ళ లోపే వస్తున్న గుండె జబ్బులకు, ఇతర ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని సూచిస్తుంది కథ.

తన వృత్తిని కూడా ఒక ఉపాసన లానే భావించే గైనకాలజిస్ట్ డా. హరిత. ఎన్నాళ్ళ నుంచో చేసుకోకుండా ఉండిపోయిన ఒక నోముని ఆమె చేత చేయించాలని భర్త నానమ్మ అరుంధతమ్మ పట్టుబట్టి, హారిక చేత సెలవు పెట్టించి, ఇరువైపులా బంధువర్గాలను పిలిపించి, వ్రత పూజని ఘనంగా మొదలుపెడుతుంది. హారిక హ్యాండిల్ చేసున్న ఓ గర్భవతి కేసులో ఆమెకు ముందస్తుగానే నొప్పులు వస్తున్నాయని,  హారికని ఆసుపత్రికి రమ్మని ఆమె భర్త వచ్చి బ్రతిమాలుతుంటే, అరుంధతమ్మ అతన్ని తిట్టిపోసి, పంపించేస్తుంది. కాసేపటికి అతను మళ్ళీ వచ్చి హారికని పంపమని బ్రతిమాలుకుంటుంటాడు. హారిక లేచి, పూజ చేస్తున్న ఆ బట్టలతోనే ఆసుపత్రికి వెళ్ళిపోతుంది. వైద్యం చేసి ఇంటికి వచ్చి, అరుంధతమ్మ ఏవేవో అంటున్నా బదులుచెప్పక, నేరుగా బాత్‌రూమ్‌కి వెళ్ళి స్నానం చేసొచ్చి, అప్పుడామెకు సమాధానం చెబుతుంది ‘గజేంద్రమోక్షం’ కథలో. ఆలోచింపజేస్తుందీ కథ.

పుకార్లు ఎలా పుడతాయో, తమ మధ్య లేని వాళ్ళ గురించి హేళనగా మాట్లాడుకుంటుంటే కొందరికి ఎంత ఆనందంగా ఉంటుందో ‘గాసిప్’ కథ చెబుతుంది. తమ కాలనీలో చాలా ఇళ్ళల్లో పని చేసే రంగికి అందరి ఇళ్ళ విషయాలు తెలుస్తాయి, కానీ తను అడిగితే చెప్పదని నీలిమకి కోపం. కానీ తన అత్తగారు అడిగిన విషయాలకి మాత్రం ఎంతో సంతోషంగా సమాధానాలు చెబుతుంది రంగి. ఆ తేడా ఏమిటో కాస్త ఆలస్యంగా అర్థం చేసుకుంటుంది నీలిమ.

శృతి అమ్మాయికి మంచి స్నేహితుడిగా ఉన్న తాను, తనని ప్రేమించినా, ఆమెకి మంచి భర్తని కాలేనని గ్రహించిన వెంకీ అనే యువకుడు.. శృతికి నచ్చజెప్పి, ఆ అమ్మాయిని ఇష్టపడుతున్న మరో యువకుడితో ఆ అమ్మాయి వివాహం జరిగేలా చేస్తాడు ‘కనిపించని తెర’ కథలో. ఉమ్మడి మిత్రులంతా శృతి వెంకీని మోసం చేసిందనుకుంటారు. నిజం తెలుసుకున్న వెంకీ మిత్రుడు (నెరేటర్) కథ చివర్లో చేసిన ఓ పని వల్ల, అందరి అపోహలు తొలగుతాయి.

‘ఇచ్చుటలో ఉన్న హాయి’ ని తెల్సుకున్న వర్ధనమ్మ, ఇక ఆ మార్గంలోనే నడుస్తుంది. జీవితంలో ఎన్నో విభిన్నమైన దారులు ఉంటాయి. ఏ దారిలో వెళ్లాలో ఎంచుకోవడానికి ఎంతో ఆలోచన, వివేకం అవసరం. ఈ వివేకాన్ని చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తే, పెద్దయ్యాకా, ఆస్తుల వెంట కాక, మంచితనం వెంట నడుస్తారు పిల్లలు.

తనది ప్రేమే అని తల్లిదండ్రుల వాదించిన కూతురికి తన అక్క గురించి ఓ కథ చెప్పి – తనది ఆకర్షణే ప్రేమ కాదు – కూతురు తనంతట తాను తెల్సుకునేలా చేస్తుంది ఓ తల్లి ‘ఆకర్షణ వలలో..’ కథలో. పిల్లలతో మంచి కమ్యూనికేషన్ ఉండడం ఎంత అవసరమో ఈ కథ చెబుతుంది.

ఎప్పుడో కట్టిన బీమా పాలసీ గడువు పూర్తయి డబ్బు అందుతుంది ధ్రువకి. ఎవరూ కుటుంబ సభ్యులు, మిత్రులు ఊహించని నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయం నుంచి వెనక్కి లాగాలని ఎంతమంది ప్రయత్నించిన, వెనక హేళన చేసినా మనసు మార్చుకోడు. మొదట కాదన్నా, తర్వాత అతని నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించి, అతనికి బాసటగా నిలుస్తుంది ‘మొదటి అడుగు’ కథలో.

దగ్గర వాళ్ళ వల్ల ఎదురయ్యే కొన్ని సమస్యలను ఎవ్వరికీ చెప్పుకోలేం. అవి పెరిగి మరింత పెద్దవవుతుంటే, ఇతర ఆత్మీయుల వద్ద మనసు విప్పి చెప్పుకోవాల్సిందే తప్పదు! అప్పుడే సమస్యకో పరిష్కారం లభిస్తుంది! ధైర్యం కలుగుతుంది. బంధాన్ని, తెంచుకోకుండా నిలబెట్టుకోగలుగుతారు. అదే చెబుతుంది ‘వ్యక్తిత్వం’ కథ.

పిల్లల అభిప్రాయాలు తెలుసుకోకుండా, తల్లిదండ్రులు తమ ఉద్దేశాలను వాళ్ళ మీద రుద్దితే, కాదనలేక, భరించినా, కొన్నాళ్ళకి తనకిష్టమైనవి చేయలేక, వాళ్ళు ఆశించినట్టు ఉండలేక ఎంతో క్రుంగిపోతారు పిల్లలు. ఆ డిప్రెషన్‌లో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకుంటారు. ‘క్రమశిక్షణ’, ‘తప్పెవరిది’ కథలు ఈ నిజాన్నే ప్రకటిస్తాయి. పిల్లల భవిష్యత్తుని నిర్ణయించే ముందు వారేమనుకుంటున్నారో తెలుసుకోవడం తల్లిదండ్రుల కనీస ధర్మం.

ఒకప్పటి వానప్రస్థం విధానాలను ఇప్పుడూ పాటిస్తే, కొడుకూ కోడళ్ళతో ఇబ్బందులుండవని ‘వానప్రస్థం’ కథలో సుశీల అంటుంది. కొడుకు ఇల్లు కోడలిదే గాని, తనది కాదని అంటుంది స్నేహితురాలు సత్యతో. పాతకాలంలో అడవుల్లోకి వెళ్ళకపోయినా, ఒకే ఇంట్లో ఉంటూ వాళ్ళ జీవితాల్లోకి చొరబడకుండా ఉంటే, అదే అందరికీ ప్రశాంతతని అందిస్తుందని చెబుతుంది.

భర్తని వేరు కాపురం పెట్టించి, అత్తగారిని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవాలనుకున్న తన చెల్లెలు ఆలోచన గ్రహించిన అన్నయ్య, ఓ నాటకమాడి ఆమె తన తప్పు తానే తెలుసుకునేలా చేస్తాడు ‘తనవరకూ వస్తే గాని’ కథలో. కొడుకు వేసిన చురక వల్ల, తనదీ తప్పుందని తల్లి గ్రహిస్తుంది.

~

ఈ కథలన్నీ మార్పుని ఆశించేవే. మనం ఎలా మారితే మనతో పాటు తోటివారి బతుకులు బాగుంటాయో సూచించే కథలు. మన ప్రవర్తనలో, మాటల్లో, చేతల్లో, కుటుంబ సభ్యులతో నడుచుకునే పద్ధతుల్లో, మనకన్నా క్రిందవారితో మసలుకునే రీతిలో, పెద్దలని గౌరవించే తీరులో, పిల్లల్ని ఆదరించే వైఖరిలో, ఇరుగుపొరుగు వారితోనూ, సహోద్యోగులతోను మనం వ్యవహరించే విధానంలోనూ అవసరమైన మార్పులు చేసుకుంటే బ్రతుకుపాట, శ్రుతి తప్పదని, మధురిమలతో సాగిపోతుందని ఈ జీవనగానం పుస్తకం సూచిస్తుంది.

బ్రతుకు ఒక పాట అయితే.. దాన్ని ఎలా పాడాలనేది (ఎలా జీవించాలనేది) పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది! బ్రతుకుపాటను సంతోషంగా పాడుకుంటూ, ఇతరుల జీవితాల్లో కూడా సంగీతాన్ని నింపడమే నిజమైన జీవితం! అదే ఈ జీవనగానం పుస్తకం సారాంశం!!

***

జీవనగానం (కథలు)
రచన: డా. మజ్జి భారతి
ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ
పేజీలు: 180
వెల: ₹ 150/-
ప్రతులకు:
విశాలంధ్ర పబ్లిషింగ్ హౌస్,
చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్. రోడ్,
చుట్టుగుంట,
విజయవాడ 520004
ఫోన్: 0866-24303302
~
విశాలాంధ్ర వారి ఇతర శాఖలు

~
డా. మజ్జి భారతి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-dr-majji-bharathi/

Exit mobile version