[రాయపెద్ది హనుమంతరావు – సంజీవ లక్ష్మి స్మారక కథల పోటీ 2025 లో సైన్స్ ఫిక్షన్ విభాగంలో బహుమతి పొందిన కథ ‘జీవనౌక’. రచన డా. చిత్తర్వు మధు.]
సంధ్యాకాశం ఎర్రగా ఉంది. నేల కూడా కనుచూపు మేర ఎర్రగా రాళ్లు గుట్టలతో నిండి ఉంది.
గాజు అద్దాలలో నుంచి చూస్తే దిగంతాలలో పడమటివేపు కుంగే ఎర్రటి సూర్యబింబం భూమిని గుర్తుకు తెస్తుంది. కానీ అది భూమి కాదు. అది భూమిలో నేల కాదు. భూమి లోని ఆకాశం కాదు.
అది ఒలింపస్ గోపుర నగరం. కుజ గ్రహంలో కాషాయ రంగులో ఉన్న నేల మీద మైళ్ళ కొద్దీ వ్యాపించిన ఏకాంతంలో తెల్లటి మణుల్లా ప్రకాశించే గోపురాల లాంటి కాలనీల మధ్య ఇది కూడా ఒక కాలనీ. సుమారు 50,000 మంది నివసించే 20 చదరపు మీటర్ల ఉన్న మానవ కాలనీ నగరం.
2147 సంవత్సరం సాధారణ శకంలో కుజ గ్రహం మీద చిన్నచిన్న మానవ పరిశోధనా కేంద్రాలు అవుట్‌పోస్టులు క్రమంగా అంతరించి టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. దానితో బ్రహ్మాండమైన గోపురాలు పారదర్శకంగా ఉన్న ఉక్కులాంటి అల్లికలతో గాజు అద్దాలతో ఉన్న కాలనీ నగరాలు వృద్ధి చెందాయి. వాటిలో ఒలింపస్ నివాస నగరం అన్నిటికంటే పెద్దది. దాని జియోడెసిక్ డోమ్ 50 వేలమందిని కుజ గ్రహపు క్రూరమైన ఆక్సిజన్ లేని వాతావరణం, తుఫానులు, రేడియో ధార్మికశక్తి నుంచి రక్షించటానికి నిర్మించబడింది. జియోడెసిక్ డోమ్ అంటే వృత్తాకారంలో ఉన్న ఒక పెద్ద గోపురంలాంటి నిర్మాణం. దాని కప్పు పై త్రిభుజాకారంలో న్యానో కార్బన్ ట్యూబులతో చేసిన గ్రిడ్లు, గాజు లాంటి పలకలు పారదర్శకమైన ఉక్కు (Transpara steel)తో చేసిన అల్లికలతో దృఢంగా నిర్మించబడింది. 20వ శతాబ్దంలోనే ఈ డోమ్ని బక్ మినిస్టర్ ఫుల్లర్ అనే ఇంజనీరు కనిపెట్టి నిర్మించాడు. పెద్ద నివేశన స్థలాన్ని తక్కువ సామగ్రితో రూపొందించే సాంకేతికత ఇది. వృత్తాకారంలో నిర్మించబడిన ఈ గోపురానికి గాజులా కనపడినా చాలా దృఢంగా ఉండే పారదర్శక ఉక్కు అల్లికలు గట్టిదనాన్ని ఇస్తాయి. కానీ లోపలనుండే వారికి ఆకాశం చుట్టూ దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి.
అంగారక గ్రహంపై వాతావరణం లేదు. తరచూ దుమ్ము తుఫానులు రాళ్ల వర్షం ఉల్కాపాతం కురుస్తూ ఉంటుంది. ఒకసారి నెలల తరబడి ధూళి తుపానులు వస్తుంటాయి. వాతావరణంలో ఆక్సిజన్ ఉండదు. ఉష్ణోగ్రత 120 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి -20 డిగ్రీల సెంటీగ్రేడ్దాకా మారుతూ ఉంటుంది. నీరు దొరకదు. అయితే భూమి లాగానే ఒక రోజు 23 గంటలు ఉంటుంది. కొత్త సంవత్సరం అంటే సూర్యుడి చుట్టూ అంగారకగ్రహం తిరిగే కాలం రెండు భూమి సంవత్సరాలకి సరిపోతుంది. అంటే 600 పైన రోజులు ఉంటుంది. అంగారక ఆకర్షణ శక్తి భూమి కంటే 38% తక్కువ ఉంటుంది. అందువల్ల మానవశరీరాలు వస్తువుల బరువు తక్కువ ఉంటాయి. వాతావరణం ఉండటం వల్ల ధ్వని తరంగాలు వ్యాపించవు.
ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేసుకోటానికి ఒలింపస్ గోపుర కాలనీ నిర్మించారు. ఐదు కిలోమీటర్ల పొడుగు ఐదు కిలోమీటర్ల వెడల్పూ అంటే సుమారు 25 చదరపు కిలోమీటర్ల స్థలంలో నగరం వృత్తాకారంలో నిర్మించారు. కాలనీ లోపలికి కుజ గ్రహపు ఉత్తర ధ్రువం నుంచి మంచు కరిగించి తెచ్చిన నీళ్లు సరఫరా చేస్తారు. ఆ నీటిలోంచి ఎలెక్ట్రోలిసిస్ ద్వారా ఆక్సిజన్ తయారు చేసి సరఫరా చేస్తున్నారు. కుజ గ్రహపు తక్కువ ఒత్తిడి అంటే మూడు బార్లు తట్టుకోవటానికి గోపురం లోపల 1000 బార్ల ఒత్తిడిని ఏర్పరిచారు. హైడ్రోపోనిక్ పద్ధతిలో మొక్కలు పెంచి కాలనీవాసులకు సరిపడా కూరలు, దుంపలు ఉత్పత్తి చేస్తున్నారు. ‘హైడ్రోపోనిక్’ అంటే ఖనిజాలు ఉన్న నీటిని చల్లి మొక్కల్ని పెంచడం, వ్యవసాయం చేయడం. కుజుడి నేలలోని మట్టిని రెగోలిత్ అంటారు. దీనిలో ఉన్న ఖనిజాలు విషపూరితమైనవి. వ్యవసాయానికి పనికి రావు. అందుకని అవసరమైన ఖనిజాలు నీటితో కలిపి చల్లి మొక్కలు పెంచి వ్యవసాయం చేసి ఆకుకూరలు, ధాన్యాలు పండిస్తారు. ఇంకా ప్రయోగశాలలో కృత్రిమ మాంసాహారం, ప్రొటీన్లు తయారు చేసే విధానం కూడా వుంది. కాలనీ మధ్య నివాస స్థలాలు బంకర్ల రూపంలో ఉన్నాయి. ‘బయో టాయిలెట్స్’ ఉన్నాయి. మానవ వ్యర్థ పదార్థాల నుంచి రీసైకిల్ చేసి మొక్కలకు ఎరువులుగా వాడతారు. నీటిని కూడా రీసైకిల్ పద్ధతి ద్వారానే మళ్లీ మళ్లీ ఉత్పత్తి చేస్తుంటారు. కాలనీ నివాసాల చుట్టూ లాబోరేటరీలు ఉన్నాయి. గాజు అద్దాల గోడ అంచున ఆకుపచ్చని హైడ్రోపోనిక్ ఉద్యానవనాలున్నాయి. అవి గాజు కప్పులోని ఆకాశపు నీలి నక్షత్రాల కింద ఎర్రని అంగారకుడి ఉపరితలం మీద ఆకుపచ్చని ఒయాసిస్‌లా కనిపిస్తుంటాయి. బయట ఉన్న దృశ్యాలు అద్దపు గోడలోంచి చూస్తూ ఉండొచ్చు. బయటికి వెళ్లాలంటే మాత్రం ప్రత్యేక ఒత్తిడి, ఆక్సిజన్ ఉన్న సూట్లు ఆక్సిజన్ సిలిండర్లు ధరించాలి. గ్రహపు నేల మీద ప్రయాణించటానికి రోవర్ వాహనాలు అవసరం. ఒలింపస్ గోపురం చుట్టూ నడిచే దారి ఉంది. అక్కడ కొన్ని నేలలో మట్టిని తీసి పరిశోధించే పెరిమీటర్ కేంద్రాలు ఉన్నాయి.
ఏరీస్ అనే కృత్రిమ మేధ ఒక అందమైన యువతి రూపంలో కాలనీనంతా పర్యవేక్షిస్తూ సూచనలు ఇస్తూ ఉంటుంది. ఆ సూచనలు అంతర్భాగంలోని స్పీకర్ల ద్వారా వినబడుతూ ఉంటాయి. పైకప్పులో వాతావరణం వల్ల చిల్లులు ఏర్పడి మరమ్మతుకు అవసరం అయినప్పుడు చిన్న డ్రోన్స్‌తో కార్బన్ నానో ట్యూబులని గాజు అద్దాలలోని రంధ్రాలని పారదర్శక సిమెంట్౬తో పూడ్చి రిపేర్లు చేస్తూ ఉంటుంది ఏరీస్. అది అనుక్షణం వాతావరణాన్ని గమనిస్తూ కాలనీవాసులకు హెచ్చరికలు, సందేశాలు ఇస్తూ ఉంటుంది.
ప్రొఫెసర్ ఇంద్రకుమార్ ఒలింపస్ గోపురం మధ్యలో ఉన్న పర్యవేక్షణ కేంద్రాలలో నిలబడి మోనిటర్ తెరల్ని పరీక్షిస్తున్నాడు. కుజ సంధ్యాసమయంలో ఆకాశం ఎర్రగా నీలి రంగులు కలిసి ఉండి ఫోబోస్ అనే కుజ గ్రహపు చిన్న చంద్రుడు పడమట క్రమంగా క్రుంగిపోవడం కనిపిస్తోంది. ఉన్నట్టుండి ఏరిస్ గొంతు ఇంటర్‌కామ్ స్పీకర్లలో ప్రతిధ్వనించింది. అన్ని స్పీకర్లలో నుంచి అలారం ధ్వని ఏదో జంతువు అరిచినట్లుగా మోగసాగింది. ఏరీస్ కృత్రిమ మేధ స్త్రీ స్వరంతో రూపంతో అన్ని మానిటర్లలో కనిపించింది.
“హెచ్చరిక! హెచ్చరిక! కేటగిరీ ఐదు తుపాను 200 కిలోమీటర్ల వేగంతో మన ఒలింపస్ కాలనీని తాకబోతోంది!” అని ఆమె చెబుతూండగానే, శాటిలైట్ కెమెరా దృశ్యాలు కనపడసాగాయి. ఎర్రటి ధూళి తుఫాను రాళ్లతో గిరగిరా తిరుగుతూ అతి వేగంగా వస్తోంది. దాంట్లో మెరుస్తున్న మెరుపులు వెండి నీలం రంగులతో థళ థళా ప్రతిక్షణం వెలుగుతూ ఆరుతూ ఉన్నాయి.
“అందరూ కాలనీ లోపలి బంకర్ల లోకి వెళ్ళి మిమ్మల్ని మీరు రక్షించుకోండి! బంకర్లలో పడకల అడుగున దూరి వేచివుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ‘హెల్లాస్ బేసిన్’ నుంచి వచ్చే తుఫాను మన గోపురాన్ని తాకి గాజు పలకల ప్యానల్స్‌ని ధ్వంసం చేసే శక్తి కలిగి ఉంది. లోపలి ఒత్తిడి తీవ్రంగా పడిపోబోతోంది. ఆక్సిజన్ ఉత్పత్తి వ్యవస్థ తుపాను ప్రభావం వల్ల దెబ్బ తిని, ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. విద్యుత్ ఉత్పత్తి అస్తవ్యస్తమై పవర్ సిస్టమ్‌లన్నీ నిర్మూలించబడవచ్చు. నేను డ్రోన్స్ సహాయంతో గోపురం కప్పు పైన విధ్వంసం అయ్యే కార్బన్ నానో ట్యూబ్స్‌ని, గాజు పలకలలో రంధ్రాలని పూడ్చడానికీ, ట్రాన్స్ పరా స్టీల్ మరమ్మతులుకీ ఏర్పాటు చేస్తాను. ఎమర్జెన్సీ! ఎమర్జెన్సీ! లోపలికి పొండి! భయపడకండి!” – ఈ రకంగా ఏరీస్ హెచ్చరికలు చేస్తోంది.
40 ఏళ్ల చంద్రకుమార్ ఆరడుగుల పొడుగు, దృఢమైన కండలు తిరిగిన శరీరం, కొనదేలిన ముక్కు, తీక్షణంగా చూసే కళ్లతో గ్రీకు శిల్పంలా ఉంటాడు. అతను కుజ గ్రహంలో పదేళ్లకు పైగా పని చేస్తున్నాడు. అతను గ్రహాంతర జీవులని పరిశోధించి జీవం ఉందా లేదా అని అన్వేషించే ఒక పరిశోధకుడు. జీనో బయాలజిస్ట్ (Xenobiologist) అంటారు. కుజుడి నేలలోని ‘రిగోలిథ్’నూ, గ్రహం చుట్టుపక్కల ఉన్న ‘ఆస్టిరాయిడ్ బెల్ట్’ లోని గ్రహ శకలాలలోనూ, ఇతర గ్రహాల్లోనూ ఏవైనా జీవరాశులు ఉన్నాయేమో అని పరిశోధిస్తూ ఉంటాడు. అతని లాబ్ నిండా వివిధ రకాల మట్టి నమూనాలు గాజు సీసాలలో, ఇంకా ఎన్నో పరిశోధనా మైక్రోస్కోపులూ, ఇతర రసాయనాలూ, చెల్లాచెదురుగా పడి ఉంటాయి. అతని పరిశోధన కేంద్రం గోపురం బయట వున్న నడక దారి (Perimeter) పక్కనే విడిగా నిర్మించారు.
“హలో! ఇంద్రా! గుడ్ ఈవినింగ్!” అంటూ డాక్టర్ లీనా లాబోరేటరీ లోపలికి వచ్చింది. డాక్టర్ లీనా కూడా 40 ఏళ్ల వయసులో, చక్కటి ముఖం కవళికలతో, పొట్టిగా కత్తిరించిన ఎర్రటి జుట్టుతో, అందంగా ఎప్పుడూ చిరునవ్వు నవ్వే కళ్లతో, అంకితభావంతో పనిచేసే వాతావరణ పరిశోధకురాలు. గ్రహాంతర వాతావరణం, గ్రహాంతర వాయువులు, గ్రహంలోని నేలలోని మట్టి రాళ్ళ యొక్క స్వభావం, తుఫానులు.. ఇలాంటి విషయాల మీద ఆమె పరిశోధిస్తుంది. వారిద్దరూ చాలా కాలం నుంచి స్నేహితులు. సహజీవనం చేస్తున్నారు కూడా అని చెప్పొచ్చు. వారు పక్క పక్కనే వున్న బంకర్ల లోనే నివసిస్తున్నారు. పది సంవత్సరాల పరిశోధన తర్వాత వారిద్దరూ ఈ మధ్య ఎర్రటి కుజ సాయంకాలాలలో సింథటిక్ కాఫీ తాగుతూ మాట్లాడుకునేది ఒకటే అంశం.దాని మీదే ఇద్దరికీ వాదన జరుగుతూ ఉంటుంది.
“అసలు ఈ సౌరకుటుంబంలో ఏ రకంగానైనా జీవరాశి లేనే లేదు. అసలు ఈ సమీప విశ్వంలోనే జీవి లేదు, అని నిర్ధారణకు వచ్చేయాలి. పదేళ్ల పరిశోధనలో ఒక్క రుజువు కూడా దొరకలేదు.” అనేది లీనా. ఎలాంటి ఉపద్రవంలో కూడా చిరునవ్వు నవే కళ్లు లీనావి. “అలా అనుకోకు! లీనా! మనం తెలివైన జీవుల కోసం వెతికితే దొరకవు. ఎప్పుడో ఒక రోజు అవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. నమ్ము!” ఇంద్ర అనేవాడు.
ఈ సాయంత్రం ఈ ఐదో నంబర్ తీవ్రత ఉన్న తుపాన్ ఇంకా భీకరంగా ఒలింపస్ గోపురాన్ని తాకుతోంది. కృత్రిమ మేధ ఏరిస్ అందమైన యువతి ఆకారంలో కాలనీ అంతా తిరుగుతూ రక్షణ కార్యక్రమాలు పర్యవేక్షిస్తోంది. కేటగిరి ఏడు లోకి తుఫాన్ వేగం పెరిగింది. మరో గంటలో తాకబోతోంది.
“ఏం పర్వాలేదు! నేను డోమ్‌ను పరిరక్షిస్తాను. మీరు తగిన ఆహారం, నీళ్లు, ప్రెషర్ సూట్లు తీసుకుని బంకర్ లోకి వేగంగా వెళ్లిపొండి.” అని సందేశాలు ఇస్తూ తిరుగుతోంది. మరి, అది కృత్రిమ మేధ. దాని పని అది చేస్తుంది. మానవ రక్షణ కోసం ఆశావహంగా ప్రోగ్రామ్ చేయబడింది. అందుకే అలాగే అందరికీ ధైర్యం చెబుతోంది. దానికి తెలిసినది అంతే. కానీ బయట పరిస్థితి భయంకరంగా ప్రతి క్షణానికి అతి తీవ్రంగా మారుతోంది. చీకట్లు కమ్మి రాళ్ల వర్షం కురుస్తోంది. ఒలింపస్ గోపురంపైన, లోపల అంధకార బంధురమైంది. విద్యుచ్ఛక్తి పోయింది. పెద్ద పెద్ద ఉరుముల చప్పుడు క్రమంగా దగ్గరగా వినపడుతోంది. కుజుడి వాతావరణంలో ఎక్కువ గా శూన్యం కాబట్టి అంత తక్కువ ధ్వని. అదే భూమి వాతావరణం అయితే ఆ ధ్వనులకు చెవులు పేలిపోయి ఉండేవి. మరో అరగంటలో తుఫాను ఒలింపస్ గోపుర కాలనీని అతివేగంగా ఢీకొట్టింది. ఒలింపస్ గోపురం యొక్క ట్రాన్స్పరా స్టీల్ (పారదర్శక వుక్కు), కార్బన్ నానో ట్యూబులతో చేసిన పారదర్శక గాజు ఫలకాలు బద్దలయిపోతున్నాయి. డోమ్ లోపల కరెంట్ పోయింది. ఆక్సిజన్ ప్లాంట్ల నుంచి ఆక్సిజన్ సరఫరా అతి తక్కువగా రాసాగింది. అంతా చీకటి. హహాకారాలు. డోమ్ సగం విరిగి పడిపోయింది. ఆ సమయంలో ఇంద్ర కుమార్, లీనా ఒలింపస్ బయట ఉన్న ప్రయోగశాలలో ఉన్నారు. హెల్లాస్ క్రేటర్ అనే పెద్ద గోతిలో నుంచి తీసిన మట్టి నమూనాలలో కొన్ని అల్ట్రా వయొలెట్ తరంగాలు కాంతిని ఇస్తున్నాయి. అందువల్ల దానిలో జీవరాశులకి ఆథారాలు ఉన్నాయేమోనని అనుమానం వచ్చి దాన్ని లోహపు నాళికలలో భద్రపరిచి తీసుకువద్దామని ఇద్దరూ అనుకున్నారు. ఇంతలో ఈ తుఫాన్.
“ఈ శాంపిల్ చాలా ముఖ్యం.ఇది దుమ్ము తుఫానులో కొట్టుకుపోతే ఎలా?” అన్నాడు ఇంద్ర. రెండు వందల కిలోమీటర్ల వేగంతో ఎర్రటి దుమ్ము తుఫాను జియోడిసిక్ గోపురాన్ని తాకుతోంది. దానిలో చిల్లులు ఏర్పడి కాలనీ లోపలి ఒత్తిడి తగ్గిపోతోంది. అంతా చీకటి. ఆ శూన్యంలో హోరుమని ధ్వని లేకుండానే వేగంగా గాలి వాళ్ళని కుదిపేస్తూ వీస్తోంది. రాళ్ల వర్షం కురుస్తోంది. రెండువందల కిలోమీటర్ల వేగంతో సుడిగుండాలతో వీచే అంగారక తుఫాన్ గాలి వల్ల మానవ ఒలింపస్ కాలనీ అంతా ధ్వంసం అయిపోతోంది.
“ఇప్పుడు ఈ మట్టి శాంపిల్ అవసరమా? పద! లోపల బంకర్లలో తలదాచుకుందాం.” లీనా అన్నది.
“కాదు. ఏమైనా సరే ఇది లోపల ‘ఆక్జిలరీ స్పెషల్ స్టోర్ రూమ్’లో దాయాల్సిందే. దీంట్లో జీవరాశి దొరకొచ్చు.” అన్నాడు ఇంద్ర.
లీనా గత్యంతరం లేక, సరే అంది.
ఇద్దరూ గోపురం చుట్టూ ఉన్న నడకదారిలో ప్రత్యేకమైన ఎక్సోసూట్లు, ‘హెడ్స్ ఆప్ డిస్ప్లే’ (HUD) వున్న హెల్మెట్లు, వైజర్లు ఆక్సిజన్ సిలిండర్లు ధరించి స్టోరేజ్ యూనిట్ వైపు నడవసాగారు. ఒక్కొక్కటే అడుగు భారంగా వేస్తూ నడుస్తున్నారు. రాళ్ళ వర్షానికి ఎక్సోసూట్లు చిల్లులు పడి, ఆక్సిజన్ ప్రమాణం తగ్గిపోతోంది. వారి సూట్ లలో వాతావరణ ఒత్తిడి కూడా తగ్గిపోతోంది. వారి HUD (Heads up Display) అంటే తలమీద వున్న గాజు హెల్మెట్ లో కనిపించే సమాచారంలో ‘తక్కువ ఆక్సిజన్ 28% మాత్రమే, వాతావరణ ఒత్తిడి తగ్గిపోతోంది.. అపాయం..’ అనే హెచ్చరికలు కనిపించసాగాయి. ఆక్సిజన్ లేమి వల్ల ఇద్దరికీ క్రమంగా సృహ తప్పడం మొదలైంది.
“సారీ! నిన్ను అనవసరంగా ఈ తుఫానులోకి తీసుకొచ్చాను” అన్నాడు ఇంద్ర. జవాబిచ్చేలోపలే లీనా కళ్ల ముందరి ఒలింపస్ గోపురం కూలిపోయింది. లోపల ఉన్న 50,000 మంది ఏమవుతున్నారో తెలియదు. వారు ఇద్దరికీ ఆక్సిజన్ లేక స్పృహ తప్పిన పరిస్థితి వచ్చేస్తోంది. మానవ కాలనీ భయంకరమైన కుజ తుఫాన్‌కి ధ్వంసమవుతున్న వేళ. కృత్రిమ మేధ ఏరీస్ “ప్రమాదం! ప్రమాదం! కేటగిరీ ఎనిమిదికి తుఫాన్ ఎక్కువ అయింది. అందరూ బంకర్లలో దాక్కొండి” అని క్రమక్రమంగా క్షీణించిన యాంత్రిక స్వరంతో అరుస్తున్న సమయంలో..
ఎర్రటి రాళ్లు, మట్టి ఉరుములు మెరుపుల సుడిగుండాల్లో నుంచి ఒకానొక మహా ఆకారం ఆకాశం నుంచి కిందికి దిగసాగింది. అది చాలా కిలోమీటర్ల పొడుగు ఉండి విశాలమైన దీర్ఘ వృత్తాకారంలో నల్లటి రంగులో ఉంది. అది ఒక పెద్ద నల్లటి తిమింగలంలా ఉంది. దాని శరీరం లోహంతో చేయబడినట్లు లేదు. ఏదో చర్మంతో చేసినట్లు తెల్లటి పొలుసులతో ఉండి మెరిసే ఊదారంగు, ఎరుపు కాంతులతో ఒక జీవి లాగా ఉంది. దాని నుంచి పొగా, ఇంజన్ ధ్వనీ ఏమీ రావడం లేదు.
అది తుపానును లెక్క చేయకుండా ఒలింపస్ గోపురానికి వంద మీటర్ల దూరంలో కుజుడి నేల మీద శబ్దం లేకుండా మెల్లగా దిగింది.
కొన ఊపిరితో ఉన్న వారిద్దరికీ దానిలో నుంచి ఒక ద్వారం తెరుచుకుని వెలుతురులా కనిపించింది. ఆ ద్వారం లోంచి ఒక ర్యాంపు అంటే లోపలికి నడిచి వెళ్లగలిగే వేదిక బయటికి రావడం కనిపించింది. ద్వారం లోపలంతా వెండి రంగుతో వెలుగుతోంది. అంగారక ఉపరితలం మీద ఆగిన ఆ మహా ఆకారం లోని బయట భాగంలో చిన్న చిన్న దీపాలు వెలిగి ఆరుతున్నాయి. చిన్న చిన్న కిటికీల వంటి ఊదారంగు ఎరుపు రంగులతో అంతరిక్ష నౌకలాగానే వెలుగుతోంది. వారిద్దరూ బలహీనంగా పాకుకుంటూ వెళ్లి ఆ ర్యాంపు మీదుగా దానిలోకి ప్రవేశించారు. లోపలికి వెళ్లగానే దాని అంతర్భాగంలో ఒకసారి వాతావరణం సాధారణ స్థితిలోకి రావడం గమనించారు. మానవుల శరీరానికి అవసరమైన వాతావరణం ఏర్పడింది. అంతర్భాగంలో ఎవరూ లేరు. జీవరాశులు ఏమీ లేవు. ఏకాంతం, కానీ గోడమీద అల్మరాలు, ఆహార పదార్థాలు, మందులు అన్నీ పేరులతో సహా లేబెల్ చేసి సర్దబడి ఉన్నాయి. ఒక చోట కొన్ని తెల్లటి దుప్పట్లు కప్పిన హాస్పిటల్ పడకలు కనిపించాయి. వాటి మీద వారిద్దరూ విశ్రమించి గానే వారిని ఏదో అదృశ్య హస్తాలు నిమిరి చూసినట్లు, పరీక్షించి మందులు ఇచ్చినట్లు బలం తిరిగి వచ్చినట్లు అనిపించింది. ఏవో కనిపించని చేతులు వారి ఛాతీలకి ఎలక్ట్రోడులు అమర్ వాళ్ళ ఆక్సిజన్ ప్రమాణం ఊపిరి వేగం, నాడి వేగం ఈసీజీ అన్నీ చూపిస్తున్నాయి. నిద్ర వచ్చేసింది.
***
ఎన్నో గంటలకు మెలకువ వచ్చింది లీనాకి, ఇంద్రకుమార్కీ. వారి వెనుక కిటికీలోంచి ఒలింపస్ గోపురం బీటలు వారుతూ గాలికి కదిలిపోతూ కొద్ది కొద్దిగా కూలిపోవడం కనిపిస్తోంది. దాని లోపలి ఫ్యూజన్ టెక్నాలజీ ద్వారా వచ్చే శక్తి, దాని లోపలి ఆకుపచ్చని నీటిలో పెరిగే ఉద్యానవనాలూ, మధ్యభాగంలోని బంకర్లలో దాగి ప్రాణాలు రక్షించుకున్న కాలనీవాసులూ, అందరూ ఏమయిపోతున్నారో తెలియదు. మానవశక్తి మీద కుజగ్రహశక్తి నిర్ధాక్షిణ్యంగా దాడి చేస్తోంది. క్రమంగా ఆ డోమ్ దీపాలు క్షీణించి అంతర్ధానమయ్యాయి.
కానీ వారిద్దరూ అకస్మాత్తుగా వచ్చిన ఈ నౌక అంతర్భాగంలో సురక్షితంగా ఉన్నారు.
“ఇది నౌక కాదు. దీని అంతర్భాగం పొరలు పొరలుగా స్పైరల్ ఆకారంలో ఉంది. ఇది నేను అధ్యయనం చేసిన నాటీలియస్ అని మొలస్కా జాతికి చెందిన నత్తలాంటి సముద్ర జంతువు లాగా ఉంది. దీని చర్మంలో మెరిసే జీవనాడులు ఉన్నాయి. వాటిలో శక్తి ప్రవహిస్తోంది. ఇది జీవశక్తి. మనకి అర్ధం కాని గ్రహాంతర జీవశక్తి. ఇది ఏమీ మాటలు, సందేశాలు ఇవ్వకుండానే మన శరీరాల అవసరాల గుర్తించి తగిన సహాయం చేస్తోంది.” అన్నాడు ఇంద్రకుమార్. తన పరిశోధనా జ్ఞానం ఇప్పుడు ఉపయోగించింది.
వాళ్ళు తడిమి చూస్తే నౌక అంతర్భాగం స్పందిస్తూ ఏదో మహా సముద్ర జంతువు నాటిలీయస్ చర్మము లాగానే ఉంది. కోలుకున్నాక వారిద్దరూ నిలబడి, ఏమిటి ఇది, అని మనస్సులో సందేహ పడగానే వాళ్ళ ఆలోచనలు తెలిసినట్లు నౌక అంతర్భాగంలో ఏదో మంత్రం వేసినట్లు తెల్లటి పొగ లాంటి వలయాలు ఏర్పడ్డాయి. అవి హోలోగ్రాములు. వాటిలో అనేక దృశ్యాలు కనిపించసాగాయి. ఈ మహా విశ్వపు ఆవిర్భావం, బిగ్ బ్యాంగ్ జరగడం నక్షత్రాల పుట్టుక, గెలాక్సీలు, నెబ్యులాలు, డార్క్ మేటర్ పాలపుంతలు ఏర్పడి అనేక గ్రహాలు నక్షత్రాలు కనిపించసాగాయి. చివరికి సౌరకుటుంబం ప్రారంభమై అంతమైపోయిన నాగరికతా దృశ్యాలు వేగంగా కదులుతూ కనిపించాయి.
“ఇది మనకు తెలియని ఒక జీవశక్తితో నడిచే ఒక మహానౌక. ఒక యంత్రం కాదు. ఒక జీవం. మనకు తెలియని ఊహించలేని ఒక జీవనౌక. అనంత సమయాలనుంచి అంతరిక్షంలో తిరుగుతూ తన కాస్మిక్ మెదడుతో అందరిని అన్ని జీవరాశులనీ గమనిస్తూ తిరిగే ఒక అంతరిక్ష రక్షక నౌకలాంటి జీవం ఏమో!” అన్నాడు ఇంద్ర.
“అవును. ఇది మన ఫ్యూజన్ టెక్నాలజీతో సృష్టించే శక్తీ, మంచు కరిగించి ఆక్సిజన్ తయారు చేయడం, నీటిలో పెరిగే మొక్కలు, అంతరిక్ష గ్రహాంతర ప్రయాణాల సామర్థ్యం, మన పరిశోధనలు వీటి అన్నింటినీ మించిన ఒక మహా జీవశక్తిని కలిగిన నౌక.
అవును నేను సముద్ర జీవి నాటిలియస్లో ఇలాంటి స్పైరల్ ఆకారాలు చూశాను. మనకి ఎప్పటికీ అంతుబట్టని అంతరిక్ష జీవ రహస్యం. మన ఇద్దరిని కాపాడగలిగిన జీవనౌక అనుకోవాలి” అన్నది లీనా.
ఆ నౌక అంతర్భాగంలో వారు అలా ఆలోచిస్తుండగానే ఆకాశమృగం లాంటి ఆ ఆకారం ఆ నిర్దాక్షిణ్యమైన భయంకరమైన తుపానుని అవలీలగా చీల్చుకుని అనంత విశ్వంలోకి ఎగిరి వారిని అంతరిక్షం లోకి తీసుకుపోయింది. ఆ గమనం వారికి తెలిసిన అంతరిక్షయానాల ఇంజన్లతో కాక సున్నితంగా ఒక జీవి ఆకాశంలోకి అవలీలగా ఎగిరిపోయినట్లుగా ఉంది.
“ఇది ఒక అనంత కాలం నుంచి జీవిస్తున్న ‘స్పేస్ వాచర్’ ఏమో. అంతరిక్ష నిరీక్షకుడు అని పేరు పెడదాం..”
“ఏమో మనకి తెలిసింది చాలా తక్కువ. ఏదీ తెలియదు అనిపిస్తోంది!”
***
కొన్ని అంగారక దినాలు గడిచిపోయిన తర్వాత..
ఒలింపస్ మానవ గోపుర కాలనీని ఢీ కొట్టిన తుపాను తగ్గిపోయింది. ఒలింపస్ మధ్య భాగంలో తలదాచుకున్న ఏభై వేల మందిలో కాలనీ బయట భాగంలో చిక్కుకు పోయిన ఒక 800 మంది తప్ప మిగిలిన వారందరూ ప్రాణాలతో బయటపడ్డారు. దీనికి కూడా ఆ మహానౌక తన విచిత్రం అయిన సమాచారం ద్వారా వివిధ రకాల విధానాలతో చేసిన సహాయం కారణం కావచ్చునేమో తెలియదు. అది కృత్రిమ మేధస్సుకి సమాచారాన్ని ఇచ్చివుండవచ్చు. ఏరిస్ కృత్రిమ మేధ అమ్మాయి, ఇతర అత్యవసర టీమ్‌లూ అందరూ కలిసి మళ్లీ విధ్వంసమైన కాలనీని మరమ్మతులు చేసి నిర్మించుకుంటున్నారు. కుజుడి నేలమీద రోవర్లు, ఆకాశంలో మానవ రహిత వాహనాలు అంటే డ్రోన్లు మళ్ళి జియోడెసిక్ గోపురాన్ని పునర్నిర్మాణం చేస్తున్నాయి. ఎక్కడో దూరంగా తమని సురక్షితంగా దించిన స్థలం నుంచి తిరిగి మెల్లిగా నడుచుకుంటూ తమ రిపేర్ చేయబడిన ఎక్సోసూట్లలో భారంగా అడుగులు వేసుకుంటూ లీనా, ఇంద్రకుమార్ అప్పుడే అక్కడికి చేరుకున్నారు.
“స్వాగతం! ప్రొఫెసర్ ఇంద్రా! ప్రొఫెసర్ లీనా! మీరు బతికి తిరిగి రావడం ఎంతో సంతోషంగా ఉంది.” ఏరీస్ అమ్మాయి చిలుక పలుకులు వారికి స్వాగతం పలికాయి.
“ఒక అద్భుతం చూశాం. మరో అద్భుతం చూస్తున్నాం. అదే ఈ కాలనీ పునర్నిర్మాణం.” అన్నది లీనా.
“అంతేకాదు. ఎంతో తెలుసు, అనుకున్న మనకి తెలియని అనేక అద్భుత శక్తులు, జీవాలు, ఇంకా విచిత్రమైన జీవులు ఈ విశాల విశ్వంలో ఉన్నాయి అని తెలుసుకున్నాం. అవి మనని ఎప్పుడూ పరిశీలిస్తూ, అవసరం అయితే రక్షిస్తూ కూడా ఉంటాయి, అని తెలిసింది. గ్రహాంతర జీవులు అంటే మనకి అపాయం చేసేవే కాదు. సాయం చేసేవి కూడా.. నా పరిశోధన ఇంకా కొనసాగించాలి” అన్నాడు ఇంద్ర తన లోని గ్రహాంతర జీవ పరిశోధకుడికి ఉన్న ఆసక్తితో.
“యంత్రాలు ఇంజన్లు లేకుండా జీవశక్తితోనే విశ్వమంతా తిరిగే ఈ ప్రాణి ఏమిటో.. నేను కూడా పరిశోధిస్తాను” అంది జీవ పరిశోధనా శాస్త్రవేత్త లీనా.
“మనకి తెలియని విషయం కోసం మానవ విజ్ఞాన శాస్త్రపు అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది. ఇది అనంతం. ముందు మీరు లోపల బంకర్లలో ఆహారం తీసుకొని నీరు తాగి విశ్రాంతి తీసుకోండి మాస్టర్స్!” అంది ఏరీస్ అమ్మాయి యాంత్రిక స్వరంతో.
(సమాప్తం)
తెలుగులో సైన్స్ ఫిక్షన్ రచనలు ఒక ఉద్యమంలా చేస్తున్న రచయిత మధు చిత్తర్వు. వృత్తి రీత్యా డాక్టర్ అయిన వీరు మెడికల్ థ్రిల్లర్లు రాయడం స్వాభావికం. “ఐ.సి.సి.యూ”, “బై బై పోలోనియా”, “ది ఎపిడమిక్”, “కుజుడి కోసం”, “నీలీ – ఆకుపచ్చ” వంటి నవలలు రచించారు.
