Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జీవన్నాటకం

‘కొత్తకాలనీ.. కొత్తకాలనీ’ అని ఒకటే అరుస్తున్నడు, షేర్ ఆటోలో నలుగురు ఆడోళ్ళను, ముగ్గురు మొగోళ్ళను కుక్కిన ఆటోడ్రైవర్. నిత్యం అతనికి ఇది తప్పనిసరి ఆట.

షేర్ ఆటోలో కూర్చున్న గౌరిలక్ష్మీకి గుబులు గుబులుగుంది, తన అబద్ధం ఎప్పుడు బయట పడుద్దోనని. ఆమెదొక అత్యవసరమైన ఆట.

“ఇంకెక్కడ ఎక్కుతరన్నా ఇప్పటికే ఏడుగురం ఉన్నం, నీతో ఎనిమిది మందిమయినం” అన్నది బొడ్లె నించి సంచి తీసి ఆకువక్క నోట్లేసుకుంట నరసమ్మ.

“అక్కా ఎవలాపతి వాల్లది, పొద్దుగాల్నే ఆటో దొరకకపోతే ఇబ్బంది పడ్తరు కదక్కా.. అందరం చేసుకుంటెనే బతుకుతం. చిన్న చిన్న గుడిసెలల్ల తల్లేడుగురం బతుకుతలేమా కాసేపు సర్దుకుంటే.. నాకు రెండు కొత్తలు. మీకందరికి పనులు. అందరి సౌలత్ చూసుకోవాలె కదక్కా.. కొత్తకాలనీ.. కొత్తకాలనీ..” మళ్ళీ కేకలేసిండు. ఒక బురఖా మనిషి వచ్చింది.. “అన్నా ఏడెక్కాలె..” అన్నది.

ఆటో డ్రైవర్ వెనక్కి తిరిగి “చిన్నాయిన నా పక్కన కూసోరాయె..” అన్నడు, ఆటోల కూసున్న పెద్ద మనిషిని పిలుస్తూ..

“నా కాలుకు దెబ్బ తగిలింది కొడకా.. వయిసోనివి నువ్వు పో పిలగా” అని పక్కనున్న యువకుణ్ణి ముందుకు తోలిండు. బురఖా మనిషి ఆటోలో సర్దుకుంది. ఆటో స్టార్టయింది..

“రోజురోజుకు మస్త్ షానిగయితున్నవే గౌరీ.. పనులు మంచిగ దొరుకుతున్నయా” నరసమ్మ ఆకు నవులకుంట అన్నది.

ఇటువంటివన్నీ అలవాటే అన్నట్టు చిన్నగా నవ్వి, సమాధానం చెప్పకుండ రోడ్డు పక్కన పరుగులు పెడుతున్న ఇండ్లను చూస్తున్నది గౌరి. ఆటోలో ఎవరో కిసుక్కు మన్నరు.

గౌరీ వాళ్ళుండేది ఖమ్మంల వికలాంగుల కాలనీ.. ‘తెలుగుదేశం’ ప్రభుత్వం ఇచ్చిన డెబ్బైఐదు గజాల భూముల్ల గుడిసెలేసుకొని ఉంటున్నరు కొందరు వికలాంగులు. కొంతమంది పక్కా ఇండ్లు కూడా కట్టుకున్నరు. ఖాళీ స్థలంలో గుడిసెలేసుకొని నెలకు ఐదొందలు అద్దె కడుతున్నరు గౌరి అసుంటోళ్ళు. గౌరి తల్లితో కలిసి ఉంటున్నది. అక్కడి నుండి మమతా హాస్పటల్ దగ్గర ‘కొత్తకాలనీ’ ఐదారు కిలో మీటర్లుంటది.. ఆ గుడిసెల్ల ఉండే ఆటో వాళ్ళు పొద్దున్నే ఐదు గంటలకే బయలుదేరుతరు. పది రూపాయిలిస్తే కొత్తకాలనీలో దింపి రైల్వే స్టేషన్ వైపు పోతరు.

గౌరీ రోజూ నాలిగింటికే లేచి స్నానం చేసి, శుభ్రంగ తయారై బొట్టు బిళ్ళ పెట్టుకొని, దానికింద కుంకుమ బొట్టు, దాని మీద విభూది పెట్టు కుంటది, కొంచం గంధం చెత్తో తడుపుకొని గదమ కింద రెండు వైపుల రాసుకుంటది. ఏదో ఒక పువ్వు తప్పకుండా జడలో పెట్టుకుంటది. పసుపు తెలుపు కలిసిన వంటి ఛాయలో ప్రత్యేకంగా కనపడుతదామె.

కొత్తకాలనీలో ఒక భవంతిలో పాచి పనితో పాటు వంట పనులు కూడా చేస్తుంది గౌరి. ఆ తర్వాత మరో రెండు ఇళ్ళలో గిన్నెలు తోమి, బట్టలుతుకుద్ది. ఆటో దిగిన గౌరి పది రూపాయల నోటును జాకెట్లయ నుండి తీసి ఆటో డ్రైవర్ కిచ్చి ముందుకు నడిసింది. అయ్యో తెల్లగ తెల్లారింది, ఇంటామె ఆలస్యమయింది అంటదేమోనని వేగంగా పరుగెత్తినట్టు నడిచింది.

గేటుకున్న తాళం తీసి లోపలికి పోయింది. గౌరి వచ్చినప్పుడు లేస్తే నిద్ర చెడతదని, గేటు తాళం చెయ్యొకటి గౌరికిచ్చింది ఇంటామె. వాకిలి ఊడ్చి, నీళ్ళు చల్లి, ముగ్గుపెట్టేసరికి, ఇంటి యజమానురాలు లేచింది ఆరోజు.

“రా.. రా.. గౌరీ ఇవ్వాళ స్కూల్‌లో ఇన్సిపెక్షన్ ఉంది. తొందరగా వెళ్ళాలి” అంటు బాత్రూమ్‌లో దూరింది. గౌరి వంటిట్లోకి వెళ్ళి సింక్‌లో ఉన్న గిన్నెలన్నీ బయట వేసుకొని, ఇల్లంతా ఊడ్చి శుభ్రంగా తడిబట్ట పెట్టి తుడిచింది.

ఇంటావిడ పేరు సర్వమంగళ. తడితల తుడుచుకుంటూ వచ్చి వంటింట్లో దూరింది. ఈ లోపు గిన్నెలన్నీ శుభ్రంగా తోమి స్టీల్ స్టాండ్‌లో సర్దుకొని లోపలికి పట్టు కొచ్చింది. “రైసుకుక్కర్ లో బియ్యం పోసి కడుగు గౌరీ.. స్టౌ మీద ఇడ్లీ కుక్కర్ చూడు.. ఆ కొబ్బరి ముక్కలు చట్నీ చేయాలి.. పాలకూర కట్ చేసి, పప్పు కుక్కర్లో పెట్టు. మిరపకాయలు తక్కువ వెయ్యి. కారం ఎక్కువ ఉంటే తినలేము” అంటూ గుక్క దిప్పుకోకుండా పనులు చెప్పి, పూజ గదిలో దూరింది.

గౌరి ఆమె చెప్పిన పనులన్నీ చెకాచెకా చెయ్యడం మొదలుపెట్టింది. ముందు బియ్యం కడిగి రైస్ కుక్కర్ ప్లగ్ పెట్టింది. ఆ తరువాత పాలకూర, పచ్చి మిరప కాయలు, టమాటాలు ఫ్రిజ్‌లో నుండి తీసి నీళ్ళలో వేసింది. పప్పుకడిగి కుక్కర్లో వేసి స్టౌ మీద పెట్టి అందులో చిటికెడు పసుపేసి, పాలకూర, టమాట, మిర్చి చకాచకా కట్ చేసి పప్పుకుక్కర్లో ఉంచి మూత పెట్టి విజిల్ పెట్టింది. ఇంక కొబ్బరి చట్నీ పని మిగిలింది. కొబ్బరి ముక్కలు తరుగుతుంటే.. పూజ గదిలో గంట మోగింది.. ‘ఈరోజు తొందరగానే ముగించినట్టున్నరు పూజ’ అనుకొని ఇడ్లీ కుక్కర్ దింపింది. పూజగది నుండి బయటకు వచ్చి, తులసికోట దగ్గర దీపం పెట్టి, వంటింట్లోకి వచ్చింది సర్వ మంగళ. కొబ్బరి చట్నీ మిక్సీ వేసి, ఇంగువతో పోపు పెట్టింది గౌరి.

“ఆఁ ఎంత వరకు వచ్చింది గౌరీ.. అప్పుడే ఎనిమిదయింది. కొంచెం లంచ్ బాక్సులు సర్దు గౌరీ..” అంటూ.. హడావిడి పడుతూ.. స్నానం చేసి వచ్చిన భర్తకు ఇడ్లీ ప్లేటు అందించి, తనొకటి తీసుకుంది.. “ఈరోజు స్కూల్లో ఇన్స్‌పెక్షన్ ఉందండీ. నాకేమో టెన్షన్‌గా ఉంది. రివ్యూ మీటింగ్ అయ్యేసరికి లేట్ అవుద్ది. మీరు కొంచం తొందరగా రండి” అన్నది.

అతను విన్నాడో లేదో తెలియదు ఫోన్ చూసుకుంటూ ఇడ్లీ తింటున్నాడు. అతని తీరు చూసి తలకొట్టుకుంటూ, తన టిఫిన్ ప్లేట్ అందుకొని బెడ్రూమ్‌లో దూరించి. చీర చుట్టుకుంటూ ఇడ్లీ ముగించి బయిటకు వస్తూ “గౌరీ.. ఈ చీర కుచ్చిళ్ళు సరి చెయ్యి” అంటూ పిలిచింది. గౌరి ఆమె చెప్పినట్టు చేసి, బాక్స్ అందించింది.

“బట్టలుతికేసి వెళ్ళు గౌరీ. తెల్లవాటికి బ్లూ వెయ్యి” అంటూ చెప్పులు వేసుకుంటుండగా.. హాల్లో ఉన్న లాండ్ ఫోన్ మోగింది.

వెనక్కి వచ్చి ఫోన్ అందుకొని “నమస్కారం మావయ్యగారు.. అలాగేనండి.. సరేనండి.. రేపాండి.. ఔనండి.. తప్పకుండా. సరే అండి ఉంటానండి”

అని ఫోన్ పెట్టేసి వచ్చి హాల్లో సోఫాలో కూలబడింది.

భర్త ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గరే ఉన్నాడు.

“గౌరీ..” అని గాబరాగా పిలిచింది..

“ఏంటమ్మాయిగారూ..” అంటూ వచ్చింది గౌరి.

“రేపటి నుండి రెండుపూటలా రావాలి గుర్తు పెట్టుకో” అని, సోఫాలో నుండి లేచి భర్త దగ్గరకు వచ్చి, అతని చేతిలో ఫోన్ లాక్కుంది. అప్పటికి కానీ ఆ జీవుడు తలెత్తలేదు.

“రేపు మీ అమ్మానాన్న వస్తున్నారు, స్టేషన్‌కు వెళ్ళి తీసుకురావాలి గుర్తుపెట్టుకోండి.. నే వెళ్తున్నా..” అంటూ బయటకు పరిగెత్తిందామె.

సర్వమంగళ ఖమ్మం దగ్గర్లో ఉన్న ముదిగొండ ఉన్నత పాఠశాలలో టీచర్. ఆమె భర్త ఆనంద్ మున్సిపల్ ఆఫీసులో గుమస్తా. వారికి ఒక కొడుకు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు. బ్రాహ్మణ సంప్రదాయం కుటుంబం. గౌరి వాళ్ళింట్లో పని చేయబట్టి యాణ్ణర్థం అయింది.

గౌరి కూడా ఆమె మాటలు విన్నది. బట్టలు ఉతకడం కానిచ్చి గేటుకు తాళం వేసుకొని వెళ్ళిపోయింది. దారిలో ఇంకో ఇల్లు ఉంటే పని చేసుకొని, ఇంటికి చేరే సరికి రెండయింది.

గౌరి పదవతరగతి వరకు చదువుకున్నది. ఆకర్షణీయంగా ఉంటది, తెలివైనది కూడా..

గతంలో సర్వమంగళ తల్లి వచ్చినప్పుడే గౌరీని చాలా ఇబ్బంది పెట్టింది. ఇంట్లోకి రావద్దనేది, కడిగిన గిన్నెల మీద పసుపునీళ్ళు చల్లుకునేది. తనే ఇల్లు తుడుచుకునేది, అంటూ మడీ అనుకుంటూ.. చాలా హడావిడి చేసింది. మిగిలిన బంధువులు ఎవరు వచ్చినా మీదే వూరు..? ఏ కులం..? అనే ప్రశ్నలే ఎక్కువ అడిగేవారు. చాలా వరకు సమాధానం చెప్పకుండా దాటేసేది.

తప్పనప్పుడు “బ్రాహ్మలమే అమ్మా.. బతికి చెడ్డవాళ్ళం. కాకపోతే భద్రాచలం దగ్గర చర్లలో ఉండేవాళ్ళం అందుకని అక్కడి అడవిలుండే కోయోళ్ళ యాస అలవాటయింది” అని చెప్పుకొచ్చేది.

ఈసారి వాళ్ళ అత్తగారొస్తున్నరు మళ్ళీ ఏం జరుగుతదోనని బెంగ పట్టుకుంది. విచారంగా కూర్చున్న బిడ్డను, ఏమయిందని అడిగింది తల్లి. సమాధానం చెప్పకుండా బయిటికి నడిచింది గౌరి.

అంతా చికాకుగా, భయంగా, అశాంతిగా ఉంది మనసంతా.. అన్నం తినాలని అనిపించలేదు, ఎవరితో మాట్లాడాలని పించలేదామెకు. మళ్ళా లోపలికొచ్చి చాప పరుచుకొని ముడుచుకొని పండుకుంది.

ఆ రాత్రి అలానే దిగులుగా గడిచింది.

***

తెల్లవారి మాములుగానే మొదలయింది. ఆటోలో రోజూలానే పనికి బయలు దేరింది.

ఆటో దిగి నడుచుకుంటూ తాను పనిచేసే భవంతి వైపు చూసింది. మసక చీకటిలో చేతులుచాచి రారా అని పిలుస్తున్న ఊడలమర్రిలా భయపెడతూ కనపడింది.

***

ఇంట్లో లైటు వెలుగుతున్నట్టు కిటికీల నుండి తెలుస్తోంది. కానీ గేటు తియ్యిలేదు.

గౌరి వచ్చి గేటు తాళం తీసుకొని పని మొదలు పెట్టింది. నీళ్ళ శబ్దానికి, మనిషి అలికిడికి సర్వమంగళ తలుపు తీసింది. గౌరి తన పని తను చేసుకు పోతుంది మౌనంగా.. సర్వమంగళ ఒక పని తర్వాత ఒకటి చెప్తూనే ఉంది. ఇల్లంతా దులిపిచ్చింది. సజ్జమీద ఉన్న పాత ఇత్తడి సామాన్లన్నీ చింతపండు పెట్టి తోమిచ్చింది. పని పూర్తయ్యేటప్పటికి పదకొండయ్యింది.

గౌరి బయిలుదేరే ముందు “సాయంత్రం ఐదింటికల్లా రావాలి గౌరీ.. మా అత్తగారు వస్తున్నారని చెప్పాను కదా! అందుకే ఈ రోజు స్కూల్‌కు వెళ్ళలేదు. ఆవిడున్నన్ని రోజులు రెండు పూటలూ రావాలి! ఆవిడ విసుక్కున్నా కోపగించుకోవద్దు” చాలా జాగ్రత్తలు చెప్పింది.

గౌరి నిర్వికారంగా చూస్తూ “అలాగే అమ్మగారూ.. జాగ్రత్తగా ఉంటాను. కానీ రోజుకు రెండుసార్లు ఎన్ని రోజులు రావాలి” భయపడుతూనే అన్నది.

గౌరి సాధారణంగా “అమ్మాయిగారూ” అని పిలుస్తది సర్వమంగళను. కానీ భయపడ్డప్పుడు “అమ్మగారు” అంటది.

“గౌరీ.. మా అత్తగారు నెల రోజులు ఉంటారు. ఎంతో ఒకంత ఇస్తానులే” అన్నది, ఏదో దయతలచినట్లు.

“మరి నాకు కొంచెం కష్టమైతదమ్మా.. మా ఇల్లు దూరం. ఆటోలు పొద్దున్న సాయంత్రం మాత్రమే దొరుకుతయి. ఇక్కడ నుంచి మా కాలనీకి మధ్యాహ్నం రెండుసార్లు నడవాల్సి వస్తదమ్మా. డబ్బులు పెట్టినా ఆటోలు దొరకవు నాకు ఆసమయంలో” అన్నది గౌరీ.

“ఈ నెల రోజుల కోసం కొత్త వాళ్ళను పెట్టుకోలేము కదా..” సీరియస్‌గా అన్నది సర్వమంగళ.

“సాయంత్రం వరకు ఎవరినన్నా చూడండమ్మా..” బతిమిలాడింది గౌరి.

“చూద్దాంలే..” అన్నది, కానీ “మధ్యాహ్నం పొయ్యొచ్చుడెందుకు ఇక్కడే ఉండు అనలేదు” సర్వమంగళ. అంటే బాగుండు అని ఎదురు చూసింది గౌరి.

ఆశించిన సమాధానం రాలేదు కానీ.. “మా అత్తగారు అసాధ్యురాలు. ఆవలిస్తే పేగులు లెక్క పెట్టుద్ది జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడాలి” హెచ్చరికలు చేసింది.

“సరెనమ్మా.. అట్లనే ఉంటా.. నేను వెళ్తున్నా..” అని దారి పట్టింది.

తన బండారం బయట పడుద్దేమోనన్న భయం, ముద్ద దిగట్లేదు. రెప్ప వాలట్లేదు..

“అంతల్నే. ఆఁ ఏమయితది, ఈ ఇల్లు కాకపోతే మరొక ఇల్లు దొరుకుద్ది” అనుకుంది.

అమ్మో.. సత్తెం గడప దాటక ముందే, అబద్ధం ఐదూర్లు తిరిగొస్తది. నిజానికంటే అబద్ధాలనే నమ్ముతది లోకం. ఒకటికి వంద చేర్చి పరువుతీస్తరు అని భయపడింది.

మిగిలిన ఇళ్ళల్లో పని చేసుకొని ఇల్లు చేరింది దిగులుగా..

తల్లి ఏదో అడుగుతుంటే సమాధానం చెప్పకుండా “అన్నం తిన్నవా..” అని అడిగింది. అన్ని గిన్నెలు మూతలు తీసి చూసింది. తల్లి కూడా అన్నం తినలేదు. వండిందంత అట్లనే ఉన్నది. ఇద్దరికి రెండు కంచాలల్ల అన్నం పెట్టుకొచ్చి, తల్లికొకటిచ్చి, తనొకటి తీసుకుని కూర్చున్నది.

గౌరి తల్లి మౌనంగా లేచి కంచం అందుకుంది. గౌరి గబగబ రెండు ముద్దలు తిని సాపేసుకొని ఒరుగుతూ.. “ఈరోజు నుండి నెలరోజులు రెండు పూటలు పోవాలి. ఒకేళ కన్నంటుకుంటే నాలుగింటికి లేపమ్మా..” అని పండుకున్నది.

నిద్రపట్టలే.. అటు బొర్లి, ఇటు బొర్లి లేసింది. ఇల్లు వాకిలూడ్చి, ఎంగిలి గిన్నెలు కడిగి, రాత్రికి బియ్యం పెట్టింది. నాలిగింటికి ముఖం కడుక్కొని, జడేసుకొని, బొట్టు బిళ్ళ, కుంకుమ, విభూది నుదుటిన పెట్టుకొని, చూపుడేలుతో కుంకుమ పాపిట్ల రాసుకుంది. బిడ్డ తయారయితంటే చూసి “కొత్తిల్లు ఒప్పుకున్నవా బిడ్డా..” అని అడిగింది.

“కాదు పాతదే ఆ బాపానోళ్ళింటికే, సందేళ కూడ పోవాలె. ఇంటామె అత్తొస్తుందట. నెలరోజులుంటదట రెండుసార్లు పనికి రమ్మన్నది..” సమాధానమిచ్చింది.. తల్లి నిట్టూర్చింది.

నల్లపూసలేసుకుంటంటే అడిగింది బిడ్డను “గీ అబద్దం కూడ చెప్పినవా..?” అని.

“కొత్త అబద్దమేంది?”.

“పెండ్లయిందని చెప్పినవా? నల్లపూసల దండేసుకుంటన్నవ్?”.

“నాకు పెండ్లయిందా..? అయిన మన కులంల నల్ల పూసలేస్తరా? కొత్త పంచాయితీ మొదలు పెట్టకమ్మా… కూటి కొరకు కోటి ఇద్దెలు” అనుకుంట చెప్పు లేసుకొని బయిటపడ్డది.

ఒక కిలోమీటర్ దూరం నడిచి మెయిన్ రోడ్డు చేరింది. కాసేపు ఆటో కోసం ఎదురు చూసింది, ఆటో రానట్టుంది నడుద్దాం అనుకుంటుండగా వచ్చిన ఆటో ఎక్కింది. మమతా మెడికల్ కాలేజీ దగ్గర దిగి, మళ్ళొక కిలోమీటర్ లోపలికి నడిచి కొత్తకాలనీ చేరుకుంది. గేటు దగ్గరకి వినిపిస్తున్నాయి మాటలు. గేటు తీసుకొని పక్కనుంచి లోపలికి పొయ్యి “అమ్మగారూ..” అని పిలిచింది.

కిచెన్ పక్కనున్న తలుపు తీసింది సర్వమంగళ. సింక్ లో గిన్నెలు తీసి ప్లాస్టిక్ టబ్లోవేసి, గుమ్మం దగ్గరకు వచ్చి గౌరి ముందల పెట్టింది. గిన్నెలు తోమి శుభ్రంగా కడిగి తిరిగి గుమ్మం దగ్గర పెట్టి, అరుగులు గచ్చు వాకిలి ఊడ్చి, కడిగి ముగ్గు పెట్టి, చెట్లకు నీళ్ళు పెట్టింది.

“ఇంకేమన్నా పనుందా, వెళ్ళమంటారా..” అన్నది.

“ఆఁ ఆఁ అత్తయ్యగారి బట్టలున్నాయి ఉతికేసి వెళ్ళు” అన్నది.

బకెట్లో ఉన్న బట్టలుతికి ఆరేసి, ఇంటిదారి పట్టింది.

***

రెండు రోజులు ప్రశాంతంగా తన పని తను చేసుకుని ఇంటికొచ్చింది గౌరి.

ఆ రెండు రోజులు శని, ఆది వారాలు సెలవుండటంతో ఇంట్లోనే ఉన్నది ఇంటామె.

మూడోరోజు సర్వమంగళ స్కూల్‌కు బయలు దేరింది.

~

గౌరి పని పూర్తి కాలేదు. టిఫిన్ చేసినవి, లంచ్ బాక్సులు కట్టిన తర్వాత హాట్ బాక్సుల్లోకి సర్ది, గిన్నెలు రెండోసారి వేసింది. వాటిని కడిగి, బట్టలుతకాలి.

యజమానురాలు వెళుతూ “గౌరీ గేటు జాగ్రత్తగా తాళం వేసి వెళ్ళు” అని చెప్పింది.

సర్వమంగళ అత్తమామ హాలులో సోఫాలో కూర్చుని పేపర్ చదువుతున్నారు. గౌరి గిన్నెలు కడగి స్టీల్ స్టాండ్లో సర్ది గుమ్మంలో పెట్టి, బట్టలు ఉతకడానికి నీళ్ళు పట్టుకుంటుంది.

 “ఓ పచ్చ చీరమ్మాయ్” అని వినపడితే వెనక్కి తిరిగింది గౌరి. తన ఒంటి మీద పచ్చ చీరను చూసుకున్నదొకసారి..

 “ఆ పంపు కట్టేసి ఇటురా” అన్నది సర్వమంగళ అత్తగారు గాయత్రి దేవి,. ‘చచ్చానురా భగవాన్ ఏం జరుగుతుందో..’ అని మనసులో అనుకుంటూ.. “ఏంటమ్మగారూ..” అంటూ వచ్చింది గౌరి.

“అమ్మ గారూ.. అని పిలవక్కరలేదు కానీ.. పెద్దమ్మా అని పిలువు చాలు. ఆఁ నీ పేరంటన్నావు” అంది గంభీరంగా.. “గౌరీలక్ష్మీ అండీ” అన్నది.

“నీ పేరు బాగుంది నీ లాగే.. నీ భాష కూడా బాగుంది. గౌరీ ఇట్రా.. ఈ గిన్నెల స్టాండు వంటింట్లోకి తెచ్చి, గిన్నెలన్నీ సర్దెయ్యి. బట్టలుతికిన నీళ్ళు వాటి మీద పడతాయి కదా..” అన్నది.

“లోపలికి రమ్మంటారా అమ్మా..”.

“రాకుండా ఎట్లా పెడ్తావమ్మా.. మాజిక్ చేస్తావా..?” అన్నది నవ్వుతూ..

 గౌరి కూడా నవ్వుతూ లోపలకి పట్టుకొచ్చి గిన్నెలన్నీ సర్దేసి, వెళ్ళి బట్టలుతికింది.

“వాషింగ్ మిషన్ ఉంది కదా.. నీతో ఉతికిస్తుంది ఎందుకూ..?” గాయత్రమ్మ ఆరా తీసింది.

‘చచ్చిందిరా గొర్రె.. ఏమి చెప్పాలె? ఏం చెప్తే ఏమి గోలో’ అనుకొని. “ఏమోనమ్మా నాకు తెలియదు” అన్నది గౌరి వినయంగా.

“హ.. హ..హ..” అని గట్టిగా నవ్వి, “ఈ మధ్య జీతం పెంచమన్నావా?” అడిగింది.

“ఔనమ్మా.. సంవత్సరం అయిపోయింది కదమ్మా.. జీతం పెంచండమ్మా.. అన్నాను” అంది.

“ఎంత పెంచింది?”

“ఐదొందలమ్మా..”.

“పెంచినంక బట్టలు ఉతకమన్నదా..?”.

“ఔనమ్మా.. మీకెట్లా తెలిసిందమ్మా” అన్నది. గౌరికి బెరుకు తగ్గింది.

“మా మంగళ తెలివి నాకు తెలుసు కదా..” అంటూ మళ్ళీ గట్టిగా నవ్వింది పెద్దావిడ. గౌరి పని ఆపి మాట్లాడటం గమనించి

“సరేలే.. పని చేస్తూ మాట్లాడు. నీ సమయం వృథా కాకుండా..” గాయత్రమ్మ సూచనతో మళ్ళీ బట్టలకు బ్రష్ వెయ్యడం మొదలు పెట్టింది గౌరి.

“గౌరీ.. ఏ ఊరు మీది..? నీ భాష కూడా తేడా ఉన్నది..” అన్నది పెద్దావిడ.

“భద్రాచలం దగ్గర ‘చెర్ల’ మొత్తం అడివే ఉంటదమ్మా అటువైపు” అన్నది గౌరి కొంచం భయం తగ్గి.

“ఆహాం.. మీ నాన్న ఏం పని చేసేవాడు?”.

“గుళ్ళో పూజ..” రెడీ చేసి పెట్టుకున్న సమాధానం.

“పూజారా..? ఏమిటోరు..?”

“బ్రాహ్మలం..” మళ్ళీ భయం జొరపడ్డది.. “ఔనా.. మేము కూడా బ్రాహ్మలమే.. చెప్పిందా మా సర్వమంగళ..?”

“లేదమ్మ గారూ..”

“అదిగో మళ్ళీ అమ్మగారూ… అంటున్నావు.. ‘పెద్దమ్మ’ అనమన్నా కదా”.

సరే అన్నట్టు తలూపింది గౌరి..

“మీ గోత్రమేమిటో..”.

“భరద్వాజ గోత్రమండి..” తడుముకోకుండా చెప్పింది గౌరి.

ఇంతలో “గాయత్రీ నీ ఫోన్ కూస్తోంది” పిలిచాడు పెద్దాయన. పక్షుల అరుపులను రింగ్ టోన్ పెట్టుకుందావిడ.

“ఆఁ వస్తున్నా.. ఎవరో చూడొచ్చు కదా..” అంటూ ఫోన్ తీసింది.

గౌరి పనిలో పడింది.. వామ్మో పెద్దావిడ సామాన్యురాలు కాదు.. అనుకొని.. గట్టిగా గాలి పీల్చుకున్నది, గండం తప్పినట్టు.

ఫోను మాట్లాడుతూ మళ్ళీ వచ్చి డైనింగ్ టేబుల్ కుర్చీ మీద కూర్చుందామె. గౌరికి పెద్దామె మాటలు వినపడుతూనే ఉన్నాయి.

“ఊరుకో లక్ష్మీ.. పదే పదే యాడీ.. యాడీ అని ఏడ్వకు. నీకే ఏభై ఏళ్ళొచ్చినయి. మీ అమ్మ ఇంకా నీతో ఉంటదా..” అంటూ లంబాడీ భాష తెలుగు కలిపి మాట్లాడుతున్నది.

గౌరికి మళ్ళీ భయం మొదలయ్యింది.. వామ్మో నిజంగనే ఫోన్లో మాట్లాడుతుందా.. తన మీద అనుమానం వచ్చిందా అర్థం కాలేదు..

కంగారుగా బట్టలుతకడం పూర్తి చేసి, గాయత్రమ్మ ఫోన్ మాట్లాడుతుండగా “వెళ్ళొస్తా.. అమ్మ గారు” అని చెప్పి బయలుదేరింది..

దేవుడా ఈమె సామాన్యురాలు కాదు. కానీ ఇంటామె తల్లికి ఉన్న పట్టింపులు లేవు, కొంత సంతోషమే అనుకుంది.

మిగిలిన ఇళ్ళలో పని చేసుకొని తొందరగా ఇల్లు చేరింది. బిడ్డ ముఖంలో నిన్నటి దిగులు కనపడక పోతే గౌరి తల్లికి కూడా సంబరమనిపించింది.

గౌరి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి, చీర విప్పి నైటీ వేసుకొని, తల్లికి తనకు అన్నం పెట్టుకొని వచ్చి కూర్చున్నది.

అన్నం తింటూ బిడ్డను గమనించింది తల్లి. కానీ ఏ ప్రశ్నలు వెయ్యిలేదు. చెప్పదలుచుకుంటే తనే చెప్తుందిలే అనుకుంది.

అన్నం తిని గిన్నెలు కడిగేసి, చాప పరుచుకొని నడుం వాల్చింది.

“అమ్మా నిద్రపడితే లేపు నాల్గింటికే పోవాలె” అన్నది గౌరి.

 “సరే.. నేను లేపుతా పండుకో..” అన్నది గౌరి తల్లి.

గౌరి ప్రశాంతంగా పండుకొని నిద్రపోయింది. తల్లికి కారణం అర్థం కాలేదు. తల్లి లేపకముందే లేచి మళ్ళీ చీర కట్టుకొని రోజుట్లానే బొట్లు కుంకుమ విభూతితో పెట్టుకొని పనికి బయలుదేరింది.

షరామామూలే. మెయిన్ రోడ్డు వరకు నడిచి ఆటో ఎక్కింది. వెళ్ళేసరికి ఐదయింది. గేటు తీసుకొని లోపలికి పోయి, వాకిలూడ్చి, అరుగులు కడిగి మొక్కలకు నీళ్ళు పెట్టేటప్పటికి అర్థగంట పట్టింది.

గాయత్రమ్మ బయటకొచ్చి “ఓ భరద్వాజ గోత్రం అమ్మాయి. ఇట్రా..” అన్నది. గౌరి పలకలేదు. అసలు పిలుస్తున్నది తననే అని ఆమెకు అర్థంకాలేదు..

“భరద్వాజ సంతతి గౌరీలక్ష్మీ.. ఇటు రావమ్మా..” అన్నది.

ఆమె ఎటకారంగా పిలిచేది తననే అని గౌరికి అర్థమయింది. తన నాటకం బయట పడుద్దేమోనని భయపడుతూనే..

 “వస్తున్నా అమ్మగారూ..” అంటూ వచ్చింది.

“అమ్మగారు.. అనవద్దు అన్నానా…?” అన్నది తర్జనిగా.

“సరే పెద్దమ్మా.. ఏంటో చెప్పండి” అన్నది గౌరి.

“చేతులు కడుక్కుని, నాలుగు కప్పులు మంచి అల్లం టీ పెట్టు” అన్నది.

 గౌరి తెల్ల మొఖం పెట్టి చూస్తూ నిలబడ్డది..

“కదులూ.. టీ పెట్టడం రాదా నీకు?”..

“వస్తదమ్మా..” అని లోపలికొచ్చి,

ప్రిజ్ తెరచి పాలగిన్నె తీసి, పనికుపక్రమించింది. అల్లంవేసి చిక్కగా టీ పెట్టి, పొంగి పోకుండా స్టౌ దగ్గరే నిలబడి, పెద్దావిడను గమనించింది.

డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చొని ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతుంది.

“ఒరే బాలూ.. మీ అమ్మను నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలె.. డర్ లాగొచ్చె.. కాదు. మార్ వాత్ సామ్ళో..” అంటున్నది.

గౌరికి ఆశ్చర్యం, సంతోషం ఆకాశాన్నంటాయి. పెద్దామె ఈ రోజు కూడా తెలుగు, లంబాడీ, ఇంగ్లీషు భాషలు కలిపి ఎవరికో కాసేపు ధైర్యం చెప్పి ఫోన్ పెట్టెసింది.

“టీ ఇవ్వవే గాయత్రీ.. ఆలస్యంగా తాగుతే నిద్ర పట్టదు.. నీ కౌన్సిలింగ్ తర్వాత చేద్దువు కానీ..” కేకేశాడు పెద్దాయన.

“వస్తున్నా.. వస్తున్నా.. జోరు తగ్గించండి” అంటూ.. వంటింటి వైపు చూసి,

“ఏమయిందమ్మా గౌరమ్మా..” అని కేకేసింది..

“అయ్యిందమ్మా.. అయి పోయింది నాలుగు కప్పుల్లో పొయ్యమంటారా..” అన్నది గౌరి.

“ఏదీ.. మీ మంగళమ్మ ఇంకా రాలేదుగా.. తనకు ప్లాస్కులో పోసి, మన ముగ్గురికీ కప్పుల్లో పొయ్యి” అన్నది.

గౌరి వాళ్ళిద్దరికి కప్పుల్లో పోసి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. గాయిత్రమ్మ ఒక కప్పు తీసుకొని, ఈ కప్పు ఆ సోఫాలో ఉన్న పెద్దసారుకిచ్చిరా” అన్నది.

“నీ కప్పేది. నీకు వద్దా టీ..” అన్నది మళ్ళీ.

ఆశ్చర్యంగా గౌరి పెద్దాయనకు టీ అందించి వచ్చి, “తాగుతానమ్మా.. నా కప్పు బయటుంది తెచ్చుకుంటా..” అంటూ బయట కప్పు తెచ్చుకుంది.

“ఓ.. రెండు గ్లాసుల వ్యవహారమా. నీవు కూడా బ్రాహ్మణ పిల్లవని మా మంగళకు తెలవదా? నీకు అవమానంగా లేదా?” అన్నది గాయత్రమ్మ నవ్వుతూ.

ఆవిడ నవ్వుతూ మాట్లాడినా గౌరికి డైనమేట్లు పేలుతున్నయి గుండెల్లో.

‘తన మాటలు నమ్మి ఇంట్లోకి రమ్మంటుందా.. లేదా ఎవరైనా ఆమెకు ఒకటేనా.. తన ముందు లంబాడి భాష మాట్లాడుతుంది. కావలనే మాట్లాడుతుందా.. తన సంగతి పసిగట్టిందా’ గౌరికి అర్థంకాలేదు.

“గౌరీ.. ఏంటి ఆలోచిస్తున్నావు. మా మంగళ ఆరింటికి వస్తానన్నది. ఎప్పటిలాగే, గిన్నెలు బయట పెట్టి వెళ్ళు. నేను నిన్ను లోపలకి రానిచ్చానని తెలవనవసరం లేదు. అట్లాగే నేను ఫోన్లో లంబాడి భాష మాట్లాడేది నువ్వేమి వినలేదు..” అర్థమయిందా అన్నది గాయత్రమ్మ. ఈ ట్విస్టుతో షాకయింది గౌరి. సరే అన్నట్టు తలూపింది. ఆమె చెప్పినట్టు గిన్నెలు తోమి బయిట పెట్టి, “వెళ్ళొస్తానమ్మా..” అంటూ, గేటుకు తాళం వేసి ఇంటి దారి పట్టింది.

అంతా అయోమయంగా ఉంది. తల్లితో చెప్పాలా వద్దా తెలవట్లేదు. మౌనంగా ఇంటికి చేరి, తనపని తాను చేసుకుంటోంది.

***

వారం రోజులు గడిచినయి యథావిధిగా..

గౌరికి బెరుకు పోయింది గాయిత్రమ్మ దగ్గర. ఆమెతో చనువుగా మాట్లాడుతోంది.

ఆ కబుర్లలో తెలిసిందేమిటంటే- గాయత్రమ్మ టీచర్‌గా పని చేసి కర్నూలులో రిటైరయ్యింది. ఆమె భర్త బ్యాంకు మేనేజర్‌గా రిటైరయ్యాడు. ఆయనకు గుండె నొప్పి వస్తే స్టంట్ వేశారు కర్నూలులో.. కొన్నాళ్ళు తన దగ్గరకు రండని కొడుకు పిలిస్తే వచ్చారు. సర్వమంగళ తల్లికున్నట్టు, ఈమెకు చాదస్తాలు లేవు. పైగా అందరినీ సమానంగా చూసే గొప్పగుణం గాయత్రమ్మది.

పుట్టుకతో ఎవరూ గొప్ప, తక్కువ ఉండరని నమ్మినది. ఆమెకు తన దగ్గర చదువుకున్న పిల్లలతో మంచి సంబంధాలున్నాయి. వారి కష్టసుఖాలు ఈమెతో చెప్పుకుంటారు. రిటైర్ అయినంక కూడా వారికి సాయం చేస్తుంటది. వాళ్ళలో సుగాలీల పిల్లలు కూడా ఉన్నారు.

గాయిత్రమ్మ అప్పుడప్పుడు గౌరిని భరద్వాజ గోత్రం అమ్మాయని పిలుస్తుంటే గమ్మత్తుగా ఉండేది.

దాదాపు రెండు సంవత్సరాల నుండి చేస్తున్నా సర్వమంగళ దగ్గర లేని చనువు గాయత్రమ్మ దగ్గర ఏర్పడింది. గౌరి భయిపడ్డట్టు ఏమి జరగకుండా.. ఆమె నాటకం రక్తి కడుతూ ఇరవై రోజులు గడిచిపోయినాయి.

~

ఆరోజు ఆదివారం అందరూ ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళ మాటలను బట్టి ఇంకో పదిరోజుల్లో గాయత్రమ్మ దంపతులు వాళ్ళ ఊరు వెళ్ళి పోతారు. ఆ రోజు బస్సు టికెట్లు బుక్ చేసుకున్నారు.

“ఇంకొన్నాళ్ళు ఉండవచ్చు కదా.. అత్తయ్యగారూ.. ఇంకో పదిహేను రోజుల్లో మా అమ్మా వాళ్ళు కూడా వస్తారు. మీరంతా కలిసి ఉంటే నాకెంత బాగుంటుందో” అంటుంది కోడలు.

 అత్తగారు నవ్వి “ఊరుకో మంగళా ఇంకెన్నాళ్ళుంటాము. మీ మామయ్య గారిని డాక్టర్ చెకప్‌కు తీసుకెళ్ళాలి కదా?” అన్నది.

వాళ్ళ మాటలు వింటుంటే గౌరికి వింతగా అనిపించింది. సర్వమంగళ మాటల్లో అబద్ధం కంటే తను చెప్పే అబద్ధం చాలా చిన్నదనిపించింది. ఆమెకు అత్తగారుండటం ఇష్టం లేదు. ఆ విషయం గాయత్రికి కూడా తెలుసు.

సాయంత్రం పనికి వచ్చినప్పుడు గాయత్రమ్మతో కాసేపు కూర్చొని కష్టం సుఖం చెప్పుకునేది గౌరి. వాళ్ళు ఎల్లిపోతారంటే గౌరికి బాధగా ఉన్నది. అసలు నిజం గాయత్రమ్మకు చెప్పాలనుకున్నది. చెప్పటమెట్లా అన్నదే ఛాలెంజ్.

***

ఒక రోజు సాయంత్రం పని అయిపోయిన తర్వాత గాయత్రమ్మ దగ్గర కూర్చొని సన్నజాజులు అల్లుతోంది. ఆమె మొగ్గలను అటురెండు ఇటురెండు పెట్టి అందిస్తున్నది.

“అమ్మా.. పెద్దమ్మా.. మీకొక నిజం చెప్పాలండీ.. మీకొక అబద్దం చెప్పిన. మీకే కాదు మీ కోడలిగారికి కూడా అబద్దం చెప్పిన. నాకు సిగ్గనిపిస్తోంది” అన్నది గౌరి అపరాధ భావంతో.

“ఓహో.. నువ్వు అబద్ధాలకోరువన్న మాట. బ్రాహ్మలు అబద్ధాలు చెప్పవచ్చునా.. అందునా భరద్వాజ గోత్రస్తులు చెప్పవచ్చునా” అన్నది గాయత్రమ్మ నవ్వుతూ..

“ఔనామ్మా.. నాకు తెలవదు. మీరు క్షమిస్తానంటే నిజం చెప్తానమ్మా. మీరు నన్ను క్షమించాలి” అని పూలదండ పక్కకు పెట్టి గాయత్రమ్మ కాళ్ళు పట్టుకుంది.

“అయ్యయ్యో.. పిచ్చి పిల్లలా వున్నావు. ఇదేం పని?” అని గౌరి చేతులు పట్టుకుని కాళ్ళు వెనక్కి జరుపుకుంది. “ఎవరూ సరదాకి అబద్ధాలు చెప్పరు. నేరగాళ్ళు. మోసగాళ్ళు తప్ప. నువ్వంత బాధ పడనవసరం లేదు. ఇంతకీ ఏమిటదీ..?” అన్నది పెద్దావిడ.

“ఏం లేదమ్మా మేం బ్రామ్మలం కాదమ్మా..”

 “ఓ అదా.. అది నాకు తెలిసిందే..” అన్నది గట్టిగా నవ్వుతూ..

“తెలుసా, ఎట్లా తెలుసమ్మా..” ఆశ్చర్యంగా అన్నది గౌరి.

“తర్వాత చెప్తాను కానీ.. ఇంతేనా ఇంకేమైనా ఉన్నదా?” గాయత్రమ్మ నవ్వుతూ..

“ఇంకా.. మేము లంబాడీలమమ్మా..” అన్నది తలొంచుకొని.

“అది కూడా తెలుసు.. ఇంకా” అంటూ కళ్ళెగరేసంది పెద్దావిడ ఛాలెంజ్ చేస్తున్నట్టు.

“ఇంకేమి లేదమ్మా. ఈ రెండే అబద్దాలు.. మీకెట్లా తెలుసు మేము లంబాడీలమనీ.. చెప్పండమ్మా..” బతిమిలాడింది.

“చెప్తాను.. నేను ఫోనులో మీ భాష మాట్లాడి నప్పుడల్లా.. నీ కళ్ళు వెలిగిపోయేవి.. నా మాటలు జాగ్రత్తగా వినడం గమనించాను. కొంత సందేహం ఉన్నా, తేల్చుకుందామని ఎదురు చూస్తుండగా.. నేనొచ్చినంక వారం రోజులకు తడి నేల మీద జారిపడ్డావు గుర్తుందా? ఏమన్నావు ఆరోజు?”.

“పడ్డది గుర్తుంది కానీ ఏమన్నానో గుర్తులేదమ్మా..”

“పడంగానే ‘యాడియే’ అన్నావు.. ఆపదలో అందరూ ‘అమ్మా’ అంటారు.. దెబ్బతగలగానే నువ్వు ‘యాడియే’ అన్నావు. నీకు ఆ ధ్యాస లేదు కానీ, నేను గమనించాను. బ్రాహ్మలింట్లో పనికోసం అబద్ధం చెప్పి ఉంటావు, అనుకున్నా.”

“మాది గార్ల దగ్గర అంజనాపురం తండా.. మా అమ్మానాన్న కూలిపని చేసుకుంట, నన్ను మా తమ్ముణ్ణి చదివిచ్చిన్రు. నేనుతొమ్మదో తరగతిలో ఉండగా, మా ఊరిదొర పొలం కాపలాకు రాత్రిపూట పోయిండు మా నాన్న. రాత్రి చీకట్లో పాము కరిసి సచ్చిపోయిండు” అని కళ్ళ నీళ్లు పెట్టుకుంది.

“అయ్యో పాపం” అన్నది గాయత్రమ్మ.

“దొర పైసా ఇయ్యలేదు. పాము కరిస్తే నేనేం చెయ్యాలన్నడు. కావాలంటే మా తమ్ముడిని తన దగ్గర జీతముండ మన్నడు. మా అమ్మను ఉంచుకుంట అన్నడు”..

“ఓరి పాపాత్ముడా..” గాయత్రమ్మ.

“మా తమ్ముడికి కోపమొచ్చి దొర మీద తిరగబడ్డడు. రెండ్రోజుల తర్వాత దొర మనుషులు, మా తమ్మున్ని బాగా కొట్టి, ఇంటి ముందట పడేసి పోయిన్రు” అని కళ్ళు తుడుచుకుంది.

“అయ్యో.. బిడ్డా” జాలిపడ్డది పెద్దావిడ.

“మా ఇద్దరికి వయసులో ఒక సంవత్సరమే తేడా, ఒకటే క్లాసు చదివేది ఇద్దరం. గద్దర్ పాటలంటే ఇష్టం వాడికి, శ్రీశ్రీ కవిత్వం చదువుతుండె. దొర మనుషులు కొట్టిపడేసినంక నెలరోజులు నవిసిండు. బాగయినంక బడికి రాలే. ‘నేను అన్నల్ల కలుస్తాన్నా’ అని ఉత్తరం రాసి ఇంట్ల నుండి ఎల్లిపోయిండు. మా అమ్మ కూలికి పోయినా సరిపోట్లేదని సారబట్టి పెట్టేది.. గుడుంబకు మా ఊళ్ళె బాగ గిరాకి ఉండేది. డబ్బులు బాగనే వచ్చేయి. నేను పదో తరగతి పూర్తి చేసి, ఇంట్లనే ఉంటన్నా. అప్పుడప్పుడు అమ్మతోటి కూలికి పోయేది. నా మీద దొర కన్ను పడ్డది. ఇద్దరు ముగ్గురితో కబురు పెట్టిండు, నేను ఒప్పుకుంటే రెండెకరాల పొలం నా పేరున రాస్తానని. మా అమ్మ వాళ్ళను తిట్టి పంపింది” అని గట్టిగా నిట్టూర్చింది.

“ఓరి నీ కామపు కళ్ళు కాకులు పొడవా.. మీ అమ్మ మంచి పని చేసింది. దొర ఊరుకున్నడా..” గాయత్రమ్మకు ఆత్రుత పెరిగింది.

“మా అమ్మను దెబ్బతియ్యటానికి ఆప్కారోళ్ళను మా ఇంటికి పంపిండు. మా అమ్మను, ఇంకొందరిని పట్టుక పోయిన్రు వాళ్ళు. మా అమ్మను బాగా కొట్టిన్రు. అంజనాపురం తండ నుండి గార్లకు పోయే దారెమ్మటి నడుచుకుంట పోతంటే, మిగిలిన వాళ్ళని వదిలి పెట్టిన్రట. దొర చెప్పినట్టు ఇంటే నిన్ను కూడా వదిలి పెడ్తమన్నరట మా అమ్మతో.. ఇదంతా దొర పన్నాగమని అర్థం చేసుకున్నది. ఆప్కారోళ్ళ ఎనకెనక నడుచుకుంట మా అమ్మ అద్దాలచోళీ ఇప్పి తిరగలేసుకొని, తల మీద ముసుగు తీసి కింద పడేసి, జుట్టీరపోసుకుని నెత్తిమీద మట్టి పోసుకున్నదట, పోలీసుల మీద పోసిందట, తన నోట్ల పోసుకున్నదట. పిచ్చిలేసినట్టు అరుసుకుంట, పిచ్చి చేస్టలు చేసిందట” గాలి పీల్చుకోడానికి ఆగింది గౌరి.

“ఓహో.. మీ అమ్మ తెలివైందే..” గాయత్రమ్మ మెప్పుగా అన్నది.

“వాళ్ళు కొట్టిన దెబ్బలకు నిజంగనే పిచ్చిదయిందేమోనని ఇంకా కొట్టిన్రట. సోయిదప్పిన అమ్మను చచ్చిందనుకొని, రోడ్డు పక్కన పడేసి పోయిన్రట. చీకటి పడేటప్పుడు మా ఊరు స్కూల్ల పంతులు సుందర్రావు సార్ సైకిల్ మీద తిరిగి తండలల్ల సూదులు, మందులు ఇచ్చేటోడు. ఆయన చూసి సూదేసి. దెబ్బలకు మందేసి, సోయెచ్చెదాక ఉండి, లేసినంక మంచినీళ్లు తాపిచ్చి, సైకిల్ మీద కూసోపెట్టుకొని తీసుకొచ్చి, ఇంటి కాడ దింపిండు”.

“పోనీలే ప్రాణం కాపాడిండు, బుద్ధిమంతుడు” అన్నది గాయత్రమ్మ.

“అంతే కాదమ్మా.. నెలరోజులు డబ్బులు తీసుకోకుండనే ఇంటికి వచ్చి వైద్యం చేసిండు. అప్పుడే మీ కోడలు పేపర్ల యాడ్ ఇచ్చిందట. ‘హ్మణ కుంటుంబానికి బ్రాహ్మణ మనిషి ఇంట్ల పనికి కావాలి’ అని అది చూసి మాకు చెప్పిండు. ఆ ఊర్ల ఉంటె దొర ఇంకేం అఘాయిత్యం చేస్తడోనని, ఇక్కడ ఖమ్మంల వికలాంగుల కాలనీల గుడిసెలు అద్దెకుంటయని చెప్పి తోలి పోయిండు. ఆ సారు చేసిన మేలు జన్మల మర్వను. ఆయనిచ్చిన బహుమతే ఈ బతుకు. ఇక్కడ మా అమ్మ గుడిసెల నించి బయటికి రాదు. నన్ను అందరూ.. బాపనోళ్ళలాగ మాట్లాడుతవు అనేది. మా తెలుగు టీచర్, మా భాషలో – యాసలో మాట్లాడనిచ్చేది కాదు. పుస్తకాలల్ల ఉన్నట్టు మాట్లాడటం నేర్పింది. అది నాకు ఉపయోగపడింది. మా అమ్మ భద్రి – భద్రమ్మ, నేను ‘గోరి’ గౌరీలక్ష్మి అని పేరు మార్చుకొన్నం. మీ కోడలిచ్చిన పేపర్ యాడ్ పట్టుకొని వచ్చిన, పనిల చేరిన. భయంభయంగా బతుకుతున్న..” అని కన్నీళ్ళు పెట్టుకున్నది మళ్ళీ.

గౌరి కథ విని గాయిత్రమ్మ కూడా కళ్ళనీళ్ళు పెట్టుకున్నది.

“నాకు నా కోడలు సంగతి తెలుసు. నేను రాక ముందు నిన్ను ఇంట్లోకి రానిచ్చేదని కూడా తెలుసు. ఆమె వాళ్ళమ్మ ఆచారాలకు భయపడి, ఆ యాడ్ ఇచ్చిందనుకుంటా.. నువ్వేమి భయపడకు. నువ్వనుకున్నట్టు నిన్ను పనిలోనించి తీసేసినా.. నువ్వు చదువు కొనసాగించాలనుకున్నా, నాకు చెప్పు. నేను ఏర్పాటు చేస్తా..” అని ధైర్యం చెప్పి, తన ఫోన్ నంబర్, కర్నూలు అడ్రెస్ రాసిచ్చింది. కొంత డబ్బు చేతుల పెట్టింది.

గాయత్రమ్మ ఇచ్చిన ధైర్యం గౌరి జీవితానికి అమూల్యమైన బహుమానమైంది. ఆమె సలహాతో ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీలో జాయిన్ అయింది గౌరి. ఇళ్ళల్లో పనిచేస్తూనే చదువు కొనసాగిస్తున్నది.

మన చదువు మనకే కాదు నలుగురి జీవితాలను నిలబెట్టాలె. కష్టాలు వచ్చినప్పుడు సరిగా ఆలోచించి బతకడానికి దిశానిర్దేశం చెయ్యాలి.

Exit mobile version